cover

చీకటి రాత్రి వెన్నెల పర్యంకం

Download PDF ePub MOBI

గై డి మొపాసా (Guy de Maupassant) “ఇన్ ద మూన్‌లైట్ ” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. 

చీకటి రాత్రి వెన్నెల పర్యంకం

గై డి మొపాసా

‘భగవంతుని బంటు’గా మారిన మతాచార్యుడ్ని అభివర్ణించటం అత్యంత సమంజసం. బక్కపల్చని పొడవాటి ఆ ప్రీస్ట్‌కి మౌఢ్యం మోతాదు ఒకించుక ఎక్కువేగానీ అంతఃకరణ ఉన్నవ్యక్తి ఆయన. ఆయన విశ్వాసాలన్నీ చాలా దృఢమైనవి, కించిత్తయినా సడలనివి. దేవుడ్ని క్షుణ్ణంగా తానర్థం చేసుకున్నానని భావిస్తాడు. ఆ పైవాడి ఎత్తులు… ఆకాంక్షలు… వాటి తాత్పర్యాలు తనలో గాఢంగా ఇంకిపోయాయని నమ్ముతాడు.

తన లోగిలిలోని ప్రశాంతమైన వనంలో పచార్లు చేస్తున్నప్పుడు తరచూ ఆయన మనసులో తలెత్తుతుంది ఓ ప్రశ్న: ‘దేవుడు ఫలానా దాన్ని ఎందుకు సృష్టించాడు?’ ఆ సందేహం మదిలో మొలకెత్తగానే చప్పున తననుతాను భగవంతుని స్థానంలో ఊహించుకొని సమాధానాన్ని వెతుకుతాడు, మొక్కవోని విశ్వాసంతో. ప్రతిసారి చాలా సంతృప్తికరమైన కారణాన్ని గ్రహిస్తాడు.

‘భగవాన్! నీ లీలలు అర్థం చేసుకోవడం అసాధ్యం’ అని ఆధ్యాత్మిక వినయశీలతని ప్రదర్శించే సగటు ముముక్షువు కాడాయన. ఆయన ఎప్పుడూ ఏమంటాడంటే- ‘నేను భగవంతుని సేవకుడ్ని. ఆయన కార్యాల వెనుక మర్మాన్ని తెలుసుకోవలసిన బాధ్యత ఉంది నామీద. నాకు బోధపడక పోతే, అవి దైవికాలని అనుకోవాల్సిందే.’

ప్రకృతి అణువణువూ ఒక కచ్చితమైన, అపురూపమైన తర్కంతో సృజింపబడిందని ఆయన భావన. కార్యకారణాల మధ్య అత్యద్భుతమైన సమతుల్యత సాధించబడిందనుకుంటాడు. పగటిలోకి మేల్కొన్నప్పుడు పలకరించేందుకు ప్రభాతాలు… పంటలు పక్వానికి రావడానికి రోజులు… ఆ పంటల్ని సతతహరితం చేయడానికి వానలు… జోకొట్టేందుకు సాయంసంధ్యలు… నిద్రపుచ్చేందుకు చీకటి రాత్రులు సృష్టించబడ్డాయి. వ్యవసాయానికి పూర్తి సానుకూలంగానే నాలుగు ఋతువులు ఉన్నాయి. ప్రకృతికి ఎటువంటి ఉద్దేశాలు లేవని, ఋతుచంక్రమణలో వాతావరణ వైపరీత్యాలకు అతీతంగా జీవకోటి ప్రకృతిలో అంతర్భాగమై జీవిస్తుందనే విషయంలో ఆయనకు ఏ సందేహాలూలేవు.

అయితే ఆయన స్త్రీలను ద్వేషిస్తాడు. ఆడవాళ్ల మీద ఆయన అసహ్యం అసంకల్పితం; వారి పట్ల చులకన భావం ఆయనకు సహజాతం. ‘ఓ స్త్రీ! నీతో నాకేంటి సంబంధం?’ అని ఏసుక్రీస్తు అన్న మాటల్ని ఆయన తరచూ వల్లించేవాడు. అంతటితో ఆగకుండా మరికొంత దానికి జోడించేవాడు: ‘తన సృష్టిలోని ఆ అవకతవక గురించి మాత్రం కచ్చితంగా దేవుడు వగచి ఉంటాడని ఇట్టే చెప్పేయవచ్చు.’ ఎవరో కవి మాటల్లో చెప్పాలంటే ఆయన దృష్టిలో ఆడది-

‘అత్యంత మకిలమైన ప్రాణి’. తొలి పురుషుడ్ని వలపు వలల్లోకి లాగి, నాటి ఆ జిత్తుల్నే ఇంకా కొనసాగిస్తున్న వగలాడి స్త్రీ. సుకుమారమైన, ప్రమాదకరమైన వయ్యారపు సంకటమే (ఉన్నమాటే) ఆడది. విషతుల్యమైన ఆమె అందమైన శరీరాన్ని మించి ప్రేమాన్వితమైన ఆమె హృదయమంటేనే ఆయనకు ఎక్కువ ద్వేషం.

తాను చెక్కుచెదరని నిగ్రహం కలవాడ్నని, ఆడవారి మనస్సుల్లో నిరంతరం తొణికిసలాడే ప్రేమతత్వం ఏ మాత్రం దరిచేరనివ్వకుండా పెరిగినవాడ్నని స్పష్టంగా తెలిసినప్పటికీ, స్త్రీల సహజసౌకుమార్యం తన మీద దాడికి తెగబడినట్టు ఆయనకి పదేపదే అన్పించేది. మగవాడ్ని ప్రలోభపెట్టి, వ్యసనపెట్టి అతడ్ని పరీక్షించడానికి మాత్రమే దేవుడు స్త్రీని సృష్టించాడనుకొనేవాడు. పొంచిఉన్న ముప్పుకు అప్రమత్తమైనట్టు, ఆత్మరక్షణకు తాను తీసుకొనే ముందస్తు జాగ్రత్త వంటిది తీసుకోకుండా మగవాడెవ్వడూ మగువను సమీపించకూడదు. ఆదరంగా సాచిన హస్తాలు, అరవిచ్చిన అధరాలతో ఆమె వశీకరణ వలలు పన్ని కూర్చుంటుంది.

దీక్ష పట్టారు కాబట్టి క్రైస్తవ సన్యాసినుల పట్ల మాత్రం ఆయన కొంత మినహాయింపు కనబరుస్తాడు. అయినా వారిపట్ల కూడా కటువుగానే ఉంటాడు. ఎందుకంటే, ఎంత దీక్షాబద్ధ హృదయాలైనా, ఎంత శృంఖలాబద్ధ మానసాలైనా వాటి అట్టడుగున ఆరని సునిసితత్వం ఆయన్ని నిరంతరం తాకుతూనే ఉంటుంది, తను ఎంత నిష్టాగరిష్ఠుడైనా-

ఆయనకొక మేనకోడలు, తన తల్లితో పాటే దగ్గర్లోనే ఉండేది. ఆమె వ్యక్తిత్వాన్ని తన కనుసన్నల్లో తీర్చిదిద్దాలని ఆయన తపించేవాడు. ఆమె అందమైనది, కొంత ఆకతాయి కూడా. ఆయన భక్తి ప్రబోధాలు చేస్తుంటే ఆ పిల్ల పగలబడి నవ్వుతుంది. తన మీద కోప్పడే ఆయన్ని గట్టిగా ముద్దులు పెట్టుకుంటూ తన హృదయానికి హత్తుకునేది. ఆ చిన్నారి పట్టునుంచి వదిలించుకునేవాడు. అటువంటి సందర్భాలో ప్రతి మగవాడిలోనూ నిద్రాణమై ఉండే పితృవాత్సల్యం వంటిదేదో పొంగిపొర్లేది ఆయనలో కూడా. ఆమె చేతుల్లోని లాలనకి అందుకే కరిగి పోయేవాడు.

ఆమెతో వీలైనప్పుడల్లా భగవంతుడి గురించి, తన భగవంతుడి గురించి చెబుతుండేవాడు. పొలాల్లో ఆమెతో పాటు నడుస్తూ ధ్యానం గురించి మాట్లాడేవాడు. అవేమీ ఆమె చెవికెక్కేవి కావు. అయితే, ఒక సద్య జీవనలాలస తొణికిసలాడే కళ్లతో ఆమె అనంతాకాశాన్ని, పచ్చగడ్డిని, లేలేత పూరెమ్మల్ని తేరిపార చూస్తుండేది. అప్పుడప్పుడూ చెంగున ఎగిరి రంగురంగు కీటకాల్ని నాజూకుగా ఒడిసిపట్టేది. వాటిని సుతారంగా పట్టుకొని ‘మామయ్యా చూడు! ఎంత ముచ్చటగా ఉందో. దీన్ని ముద్దాడితే మరెంత బాగుంటుంది!’ అనేది ఆయనతో. అయితే, రంగురంగుల కీటకాల్ని, లేదా మనోహరమైన పువ్వుల్ని ముద్దుపెట్టుకోవాలనే ఆ కాంక్ష ఆయనలో ఆందోళన, చికాకు, ఆగ్రహం కలిగించేవి. ఎందుకంటే స్త్రీల హృదయాలలో నిర్నిరోధ జీవధారలా ఉబికే లాలిత్యం వంటిదే ఆమె మెత్తని ఆశలోనూ కదలాడేది కనుక.

ఆయన ఇంటిని చక్కదిద్దే చర్చి నిర్వాహకుడి భార్య ఓ రోజు ఆయనకొక రహస్యం చెప్పింది, ఆయన మేనకోడలికి ఒక ప్రియుడున్నాడని. అది విని ఆయన ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గడ్డం గీసుకోవడానికి రాసుకుంటున్న సబ్బు నురగ ముఖమంతా చేసుకొని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కాసేపటికి తమాయించుకొని, గొంతు పెకలించుకొన్నాడు:

“మెలెనె! నువ్వు అబద్ధం చెబుతున్నావు.”

గుండెల మీద చేయి వేసుకొని ఒట్టేసినట్టు చెప్పిందామె: “అయ్యా! ప్రభువు సాక్షిగా చెబుతున్నాను. ప్రతిరోజూ రాత్రి మీ చెల్లెలు నిద్రపోయాక, మీ మేనకోడలు అతని దగ్గరకు వెళ్తోంది. రోజూ నదీతీరంలో కలుసుకుంటున్నారు వారిద్దరూ. మీరే స్వయంగా చూడాలంటే రాత్రి పది తర్వాత నడిరాత్రిలోపు వెళ్లండి.”

గడ్డాన్ని తడుముకుంటూ ఆమె మాటలు ఆలకిస్తున్న ఆయన ఒక్కసారిగా ఆ గదిలో పచార్లు చేశాడు. అటువంటి బాధాసందర్భాల్లో అలా అసహనంగా ప్రవర్తించడం ఆయన అలవాటు. కొంత తేరుకొని మళ్లీ గడ్డం గీసుకుంటున్నప్పుడు అన్యమనస్కంగా ఉండటం వల్ల చెంపమీద మూడు చోట్ల తెగింది. పెల్లుబుకుతున్న ఆవేశాన్ని, ఆగ్రహాన్ని బలవంతాన దిగమింగి, ఆయన ఆ పగలంతా మౌనంగా ఉండిపోయాడు. ప్రేమ అనే మహత్తర శక్తికి ఎదురొడ్డే ప్రయత్నంలో తన ఆధ్యాత్మిక బలానికి పితృసంబంధిత నైతికత, ప్రబోధకుడిగా ఆత్మోద్దీపన నెరపవలసిన బాధ్యతలు ఆయనకు తోడయ్యాయి. ఒక పసిదాని చేతిలో తాను మోసపోయినట్టు, ఆమె తననొక ఆటాడించినట్టు భావించాడు. తల్లిదండ్రుల ప్రమేయమూ, వారి సలహాసంప్రదింపులూ లేకుండానే కూతురు తన జతను ఎంపిక చేసుకొన్నప్పుడు, స్వాభిమానం దెబ్బతిని ఆ తల్లిదండ్రులు పడే బాధని పోలిన క్షోభ పడ్డాడాయన కూడా.

రాత్రి భోజనానంతరం ఏదో పుస్తకం మీద మనసు లగ్నం చేసే ప్రయత్నం చేశాడు కాసేపు. క్షణక్షణానికి హెచ్చుతున్న ఆవేశం వల్ల చదువు సాగలేదు. రాత్రి పదిగంటలవడంతోనే బయల్దేరాడు. అనారోగ్యంగా ఉన్నవారిని పరామర్శించడానికి రాత్రిళ్లు వెళ్లాల్సి వచ్చినప్పుడు తీసుకెళ్లే మొద్దు చేతికర్రను అందుకున్నాడు. ఆయన ప్రతి కదలికలో క్రోధం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దృఢమైన ఆయన చేతిలో ఇమిడి, గాలిలో ఏవో అర్దం లేని వృత్తాలు సృష్టిస్తున్న చేతికర్ర కూడా ఆయన ఆగ్రహ ప్రకటనకి ఒకానొక మాధ్యమం అయింది. పళ్లు పటపట నూరుకుంటూ ఒక్కసారిగా ఆ చేతికర్ర పైకెత్తి వరండాలో ఉన్న కుర్చీమీద మోదడంతో అసలే వెనక చీలి ఉన్న కుర్చీ కుదేలయ్యి నేల కూలిపోయింది.

బైటకు రావడానికి తలుపులు బార్లాతెరచి, ఒక్కసారిగా శిలాప్రతిమై నిల్చుండిపోయాడు. ఆయన ఎప్పుడోగాని చూడటం పడని పండువెన్నెల ఆరుబైట విరగకాస్తుంది. ఏ యోగులో, స్వాప్నిక కవులో పొందే రసోద్దీపన వంటి భావం ఆయనలో మెదిలి మనసుని దూదిపింజ చేసింది. తెల్లని కాంతిని పిండారబోస్తున్న ఆ రాత్రి సౌందర్యానికి ఆయన విచలితమయ్యాడు. ఆయన ఇంటిముందున్న తోట కోమలమైన అందంలో ఆసాంతం తడిసి సగం మత్తులో జోగుతుంది. పండ్లచెట్లు నాజూకైన పాదాలతో నిగారించి, అరకొర ఆకుపచ్చని ఆచ్ఛాదనలతో బారులు తీరి, సన్నని బాట మీద నీడలు కల్పిస్తున్నాయి. ఇంటిగోడ ఆసరాగా పైపైకి తీగలు సాగుతోన్న రేరాణి విడుస్తూన్న తీయని నిట్టూర్పులు అరమరికలు లేని ఆ నులివెచ్చని నిశిరాత్రిని మట్టిపరిమళంలా పెనవేస్తున్నాయి.

వ్యసనపరుడు మధువు తాగినట్టుగా ఆయన పరిసరాల్ని తాగుతున్నాడు, దీర్ఘమైన ఉచ్ఛ్వాసనిశ్వాసాలతో. మేనకోడలి విషయం దాదాపు ఏమారి ఆయన బరువుగా, నెమ్మదిగా నడుస్తున్నాడు. తమకంగా కావలించే ఆ మహత్కాంతిలో తడిసి, స్వచ్ఛమైన ఆ నిశి నిసర్గ లావణ్యంలో నిండామునిగిన ఆయనలో ఐహిక ప్రపంచం గురించిన ఆలోచనలు ఆగిపోయాయి. ఏదో స్వప్నసీమలో కాలుమోపాడు. బోదురు కప్పలు శ్రుతి లేని శబ్ధ సంకేతాల్నేవో మూకుమ్మడిగా పంపుతున్నాయి. తెంపరి వెన్నెల సంయోగంలో మత్తిల్లిన గండుకోయిలలు తమ సుస్వరాలతో సంలీనం అయిపోతున్నాయి, కలలకు తప్ప బుద్ధిజనిత జాడ్యాలకు తావులేని లోకాల్ని సృష్టిస్తూ, చుంబన రాగాలతో సరితూగే మంద్ర మధుర రాగాల్ని ఆలపిస్తూ-

ఆయన నడుస్తూనే ఉన్నాడు. ‘ఎందుకు’ అన్న ప్రశ్నకి తనకి పరిపూర్ణమైన సమాధానం తెలుసునన్న బింకం ఆయనలో మెల్లగా జారిపోయింది. చాలా డీలా పడిపోయినట్టు, హఠాత్తుగా అలసిపోయినట్టు అనిపించింది. ఉన్న పళాన ఆగిపోయి, అక్కడే కూర్చుండిపోవాలనే కోర్కె పట్టి పీడించింది. భగవంతుడి సృష్టిలోని అణువణువునీ తలచుకొని మరీ ఆయనను స్తుతించాలనిపించింది. అటువంటి తాదాత్మ్య స్థితిలో ఆ పూజారి నడుస్తూనే ఉన్నాడు. ఆయనకి కొంచెం దిగువన చిన్ననది నెమ్మదిగా ప్రవహిస్తోంది. దాని ఒంపులకు అనుగుణంగా ఇరుపక్కలా మోహరించి ఉన్నాయి గుబురు చెట్లు, కాలానుగుణంగా ఆకులు రాల్చేందుకు సంసిద్ధమై. నది ఒరిసే గట్ల మీద పల్చని కాంతితెరలా పారదర్శకంగా పరచుకుంది గడుసు మంచు. ఆ తెల్లని ఆవిరి మేఘాన్ని దాటుతూ దానికి వెండి మెరుగులద్దుతున్నాయి చంద్రకిరణాలు. ఓపలేని ఉద్వేగం ఒక్కపెట్టున కమ్మి, అది ఆత్మలోతుల్లోకి చొచ్చుకుపోయినట్లనిపించి ఆయన మరోసారి ఆగాడు. ఒక సందేహం, అస్పష్టమైన వ్యాకులతతో సతమతమయ్యాడు. తనకు తాను వేసుకునే ప్రశ్నలు మళ్లీ కొత్తగా పుట్టి ఎదురునిలిచినట్టు తోచింది. దేవుడు ఇదంతా ఎందుకు కల్పించాడు? రాత్రి అనేది ఆదమర్చిన నిద్రకి, గాఢ సుషుప్తికి, విశ్రాంతికి, విస్మృతికి ఉద్దేశించినది మాత్రమే అయితే, పగటికంటే సొగసుగా, ఉదయాస్తమయాలకంటే మనోహరంగా ఎందుకు సృష్టించాడు? సూర్యుడి కంటే ఎక్కువ రసాత్మకమై, గోముగా వాంఛల్ని తట్టిలేపే ఈ నక్షత్రాన్ని ఎందుకు పొదిగాడు ఈ రాత్రి ఆకాశంలో? పట్టుచిక్కక ప్రిదిలిపోయే సౌకుమార్యాన్ని వెలిగిస్తూ, బ్రహ్మకే అంతుపట్టని మార్మికతను తట్టిలేపేందుకే ఉద్దేశించినట్టు తోచే ఆ తోకచుక్క, చాటుమాటున మణిగిన నీడల్ని సైతం కాంతిమయం చేయడానికి ఎందుకు పూనుకుంటుంది? అందరిమల్లేనే విశ్రాంతిగా వాలిపోకుండా పాలపిట్టలు నిత్యం కంఠాల్లో తేనెపాటల్ని ఊరేస్తున్నాయి ఎందుకు? నీరవ నిశీధిలో ఎందుకు పాటల్నలా పారబోస్తున్నాయి? లోకం మీద ఈ ఉలిపిరి మంచుపరదా ఎందుకు పరచుకుంది? ఎందుకు హృదయానికీ పరితాపం, ఆత్మకి ఉద్వేగం, దేహానికి బడలిక?!

రాత్రన్నది కేవలం నిద్రపుచ్చడానికే అయితే, మానవజాతి ఎన్నడూ తలచనైనా లేని ఈ మోహపటాటోపం దేనికోసం? ఇంతటి లోకోత్తర సౌందర్యం ఎవరినుద్దేశించింది? దివి నుంచి భువిపైకి ఈ దృశ్యకవిత్వాన్ని వర్షించేదెవరి కోసం? ఆయనకి ఎంత మాత్రమూ జవాబు దొరకని ప్రశ్నలు.

అప్పుడే మెరిసే మంచులో తలారా తడిసిన కొమ్మల తోరణాల కింద అంతటా పరుచుకున్న పచ్చిక వేదిక మీద పక్కపక్కనే నెమ్మదిగా కదులుతున్న జంటనీడల్ని చూశాడాయన. పొడగరి అయిన ఆ పురుషుడు ప్రేయసి మెడను తన చేత్తో చుట్టి, మధ్య మధ్య ఆమె నుదుటిని చుంబిస్తున్నాడు మృదువుగా. నిర్జీవంగా, నిస్తేజంగా తమని ఇముడ్చుకున్న పరిసరాలకు నవజీవనచైతన్యాన్ని ఆపాదించిందా యువజంట. వారికోసమే ఆవిర్భవించిన దివ్యసీమలా రూపాంతరించిందా పరిసర సోయగం. మౌనరాగాల ఆ మన్మోహన యామినిని కానుకగా పొందిన ఆ జంట- యుగళంగా కాక ఏకమైపోయినట్టు తోచింది. ఆ పూజారి మనసును తొలిచే ప్రశ్నకు భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన జవాబులా, సజీవ సమాధానంలా వారు ఆయనను సమీపించారు. ముంచెత్తిన వివశంలో గుండె చప్పుడు హెచ్చి ఆయనలా నిశ్చలంగా నిల్చుండిపోయాడు. బైబిల్‌లోని రూత్- బోయెజ్‌ల ప్రణయ వృత్తాంతం ఆ క్షణాన స్ఫురించి, ఆ పవిత్ర గ్రంథంలో అభివర్ణించిన దృశ్యాలేవో కళ్ల ముందు కదలాడి, ఈ ప్రేమ కూడా దైవసంకల్పానికి పర్యవసానమే అని నిర్ధారణ అయ్యిందాయనకు. మహద్ర్గంథంలో ముకుళిత సంకీర్తనలు చరణాలు చరణాలుగా ఆయన మనసులో పరవళ్లెత్తుతుంటే, వాంఛా వాత్సల్యాలతో మరులుగొన్న విశ్వజనీన పద్యంలోంచి ఊరే తన్మయ కవిత్వంలో దేహం నిలువెల్లా తడిసిపోయింది. అప్పుడు తనకు తానే చెప్పుకున్నాడు: ‘మనుషుల అనాచ్ఛాదిత ప్రేమలకు తన ఆదర్శఔన్నత్యాలను తొడిగి పరిపూర్ణత్వం చేకూర్చడానికే బహుశా దేవుడు రాత్రిళ్లను సృష్టించి ఉంటాడు!

చెట్టాపట్టాలేసుకుని సమ్మోహనంగా నడిచి వస్తున్న ఆ యువజంట కంట పడకుండా తప్పుకున్నాడాయన. ఆ యువతి ఆయన మేనకోడలే. ఆమె విషయంలో తన చొరబాటు దైవధిక్కారం వంటిది కాదా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. భగవంతుడు ప్రేమకు వ్యతిరేకే అయితే, దాని చుట్టూ దివ్య కాంతితేజమై ఆయన ఎందుకు పరివ్యాప్తిస్తాడు?

ఈ ఎరుక వల్ల కలిగిన విభ్రాంతితో, తలెత్తుకోలేనంత సిగ్గుతో అక్కడ నుంచి వడివడిగా తప్పుకున్నాడు, ప్రవేశానికే అర్హత లేని ఓ పవిత్ర ఆలయ ప్రాంగణంలోకి చొరబడ్డానని బోధపడిన తత్తరపాటుతో-

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, సెప్టెంబర్ and tagged , , , , , , , .

7 Comments

  1. కధ బాగుంది. తర్జుమానే ఇబ్బందిగా వుంది. రచయిత భావాన్ని యధాతథంగా రాయకుండా స్వేచ్చాసరళిలో వుంటే బాగుండేది. ప్రయత్నం మెచ్చుకోదగ్గది.

  2. చదువుతూ ఉంటె మీరు వాడిన బాషా పదాల సుందరత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది .అలాగే వెన్నెల గురుంచిన మీరు వర్ణించిన తీరు అద్భుతం. తెలుగంటే ఇంత అందంగా ఉంటుంది అని చెప్పకనే చెప్పినట్లుంది. మీ అనువాదం. Thanks andi.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.