cover

కతల గంప

Download PDF ePub MOBI

‘‘అబయా, రుప్పిణవ్వవాళ్ల ఊరు ఎంత బాగుంటాదో తెలుసా! ఒకపక్క ఏరూ ఇంకొకపక్క పేద్ద చెరువూ ఊరికి నట్టనడాన అల్లిపూల మడుగూ వెలిదిపైరు సాళ్ల మాదిరిగా బారులు తీరిన ఇళ్లూ చింతమాకులమీద గూళ్లు కట్టుకోనుండే ఎర్రగాళ్ల కొంగలూ… అబ్బ ఆవూరిని చూడాలంటే పెట్టి పుట్టుండాల’’ రెండుచెంపల కిందా రెండుచేతుల్నీ పెట్టుకొని, గుండ్రోటి కళ్లను గిరగిర తిప్పతా నాతో అనింది మా సీతక్క.

సీతక్క నాకంటే నాలుగయిదేళ్లన్నా పెద్దదిగా ఉంటాది. మా పెద్దమ్మ కూతురు. రుప్పిణవ్వ, సీతక్కకి సొంత అమ్మమ్మ. నాకేమో పెద్దమ్మమ్మ. మొన్న పెద్దపండగ సెలవలకి రుప్పిణవ్వోళ్ల ఊరికి పొయ్యేసి వచ్చింది. పొయొచ్చిన కాడనించీ ఆ ఊరి కతల్నే చెప్పి చెప్పిచ్చుకొంటా ఉండాది.

నేను గబగబా మా ఇంటితట్టుకు పరుగు తీసినాను. సంద ముక్కర్రను వేస్తా ఉండాది అమ్మ. నేను అమ్మ వెనకాల నిలబడి అమ్మ కొంగును గుంజినాను.

‘‘ఏవిఁరా ఏం కావాల?’’ అడిగింది అమ్మ వెనక్కి తిరిగి నన్ను చూస్తా.

‘‘అమా అమా, నేను కూడా రుప్పిణవ్వోళ్ల ఊరికి పోతాను మా’’ అన్నాను మాటల్ని ఈడస్తా.

‘‘ఆఁ, ఇంకేం పంగ లేదేవిఁరా నీకు, ఆవూరు అడివిచెట్టల్లో ఉండాది. బస్సులూ బండ్లూ పొయ్యే ఊరు కాదది. నచ్చురాళ్లల్లో గులకనేలల్లో చిట్టడివిలో అయిదారు మైళ్లు నడిసిపోవాల. ఆ దోవల్లో నువ్వు నడవలేవు. నడాన అరమైలు యెలుపుతో ఉండే కాళంగేటిని దాటాల. ఆ ఇసకలో కాళ్లు తగలకపోతాయి. అయినా రేపు ఎండాకాలం సెలవలప్పుటి కత కదా. ఇప్పుడే దేనికి అనుకొనేది. పదపద, పాలు తాగుదువు కానీ’’ అంటా ఇంట్లో దూరింది అమ్మ.

అప్పటికి నోరెత్తకపోయినా, ఆ రెండుమూడు నెలలూ గోజారి గోజారి అమ్మను ఒప్పించి, ఎండతరి సెలవల్లో రుప్పిణవ్వవాళ్ల ఊరికి బయలుదేరినాను నేను. రుప్పిణవ్వ కొడుకైన రమణమామ వచ్చి తొడకొని పొయినాడు నన్ను. అమ్మ చెప్పింది ఉత్తది కాదు. ఆ దోవన నడక అంటే పెనుపాటే. మొత్తానికి కోడికూతతో పాటు మొదలయిన మా పయనం అంబళ్లపొద్దుకు తుంగమడుగుకు చేరి నిలిచింది. అదే మా రుప్పిణవ్వవాళ్ల ఊరు.

‘‘రా బంగారా రా’’ అంటా నాకు ఎదురొచ్చి, నా బుగ్గల్ని పుణికి ముద్దుపెట్టుకొని, ఇంట్లోకి తొడకొని పొయింది రుప్పిణవ్వ. నా కాళ్లూ చేతులూ కడిగి, తుండుగుడ్డతో తుడిచి, గోగునారతో అల్లిన నులకమంచం మీద కూచోబెట్టి, చిక్కటి చల్లతో కలిపిన అంబలిని నిలువుచెంబుడు తెచ్చి తాగించింది నాకు.

రుప్పిణవ్వ అందంగా ఉంటాది. నాకుండే పద్నాలుగుమంది అమ్మమ్మల్లో రుప్పిణవ్వ ముక్కంత సొగసయిన ముక్కు ఇంకెవరికీ లేదంట, మా అమ్మ అంటా ఉంటాది ఈ మాటను. అవును, బలే ముక్కులే రుప్పిణవ్వది. తూరవానలో తడిసిన తుమ్మిపూవు మాదిరిగా, రేపటెండకు కమిలిన నూగుమొగ్గ మాదిరిగా ఉంటాది. ముక్కుకు కుడిపక్కన ముడతలు పడిన బుగ్గమీద మినపగింజంత నల్లని మచ్చ, మినమినలాడతా ఉంటాది.

రుప్పిణవ్వ మాదిరిగా అంతే అందమయిన ఊరు తుంగమడుగు. ముచ్చటగా మూడు తెరువుల పల్లె, పల్లెకు అల్లంత దవ్వులో పోగుపోసినట్టు ముప్పయ్యో నలబయ్యో మాదిగిళ్లు. ఆ ఇళ్లనూ పల్లెనూ కలిపే దోవ ఒక మడుగును ఆనుకొని పోతుంటాది. మడుగునిండా అల్లుకొని అరలి ఉంటాయి అల్లిపూలు. మడుగు ఓరన మోర ఎత్తి నిలిచిన ఆపటెద్దు మాదిరిగా నిలిచి ఉంటాదొక మోదగ గుబురు. ఆ గుబురులోని ఆకులను గిల్లుకొని వచ్చి, వాటితో ఒక అంటను కుట్టి, ఆ అంటలో దేవుడికి తళిగ పెట్టేది రుప్పిణవ్వ.

పొద్దనపూట, చంకనొక కడవనూ చేతనొక చెరవనూ పెట్టుకొని మడుగుతట్టుకు అడుగులేసేది అవ్వ. అవ్వ అడుగుల్ని తొక్కతా నేనూ పోయేవాడిని. మడుగునీళ్లను కడవలో చెరవలో నింపుకొని, నడుములోతు నీళ్లలోకి పొయి ఒక అల్లిపువ్వును కాడతోపాటు పెరుక్కోని వచ్చి, ఆ పువ్వును మాలగా చేసి నా మెడలో వేసేది రుప్పిణవ్వ. చల్లటి అల్లికాడ నాకు చక్కిలిగిలి పెట్టేది. ఆ గిలిగింతకి మెలికలు తిరగతుండే నన్ను చూసి కిలకిలనవ్వేది రుప్పిణవ్వ.

నేను తుంగుమడుగుకి పొయిన నాలుగోనాడో అయిదోనాడో వినపడిందా అరుపు. అంతకుముందు ఎప్పుడూ వినలేదు అట్టాంటి కూతను నేను. అప్పుడు అవ్వ చుట్టింట్లో చుట్టకుదురుమీద పప్పుచట్టిని పెట్టి ముద్దకవ్వంతో పులగూరను ఎణపతా ఉండాది. మామ కయ్యల్లోకి పొయుండాడు. నేనొక్కడినే పందిట్లో కూచుని, పందిటి తాటాకుల నడుమ కుసువుపోసలతో గూడును పెట్టుకొంటా ఉండే పిచికల్ని చూస్తా ఉండాను.

‘‘కతలమ్మో కతలూ… అరపడి వడ్లకు ఒక కత, పడి తైదులకు ఒక కత… కతలమ్మో కతలూ…’’ అనే అమ్మకపు కూత వినపడింది తెరువులోనుంచి. ఆ ఊరికి పొయినాక ఆ నాలుగయిదు నాళ్లలో నాకు అమ్మకం కూతలు వినపడలేదా అంటే వినపడినాయి, కానీ అయ్యి వేరే. ‘‘అద్దాలే పిన్నీసులే దువ్వెన్లే ఈరుపెన్లే తిలకంబుడ్లే కాటికబరిణ్లే’’ అనే కూతను విన్నాను, ‘‘ఆలువరి గెడ్డలు, గెణుసుగెడ్డలు, గెడ్లమ్మో గెడ్డలు’’ అనే కూతను విన్నాను. అయితే అవేమీ వింత ఉరువులూ వినని కూతలూ కావు. ఇదే కొత్తగా ఉండాది.

నేను పరిగెత్తి తెరువులోకి పొయినాను. మా రుప్పిణవ్వ ఈడులోనే ఉండే ఒక అవ్వ పెద్దగంపను తలమీద మోస్తా ‘‘కతలమ్మో కతలూ..’’ అని అరస్తా వస్తుండాది. నేను గబగబ ఆ అవ్వకు ఎదురుపొయినాను. నన్ను చూసి నిలిచి ‘‘అబయా, కతలు కావాల్నా, మంచి మంచి కతలుండాయి. ఆరవళ్లి సూరవళ్లి కత, నల్లతంగకత, కాంతరాజు కత, కాత్తవరాయుని కత, కమ్మపణితి కత, ఈడిగసత్తెమ్మ కత, కాటమరాజు కత, మదురవీరుడి కత, మాంచాలమ్మ కత, రేణిగుంట రామిరెడ్డి కత… ఇంకా చానా చానా కతలుండాయి. అరపడి వడ్లకు ఒక కత, పడి తైదులకు ఒక కత. కావాలంటే అవ్వనడిగి వడ్లో తైదులో తేపో కొడుకా’’ అనింది ఆ అవ్వ.

ఆ కతల పేర్లకే నా చెవులు ఊరిపొయినాయి. తెరువు నుంచి బిరబిర పరుగుతీసినాయి అవ్వదగ్గరకు నా కాళ్లు. ‘‘అవా అవా కతలంట వా. ఒకవ్వ కతల్ని అమ్మతా ఉండాదివా. నాకొక కత కావాలవా. తీసీవా’’ అని రుప్పిణవ్వని బొక్కలాడినాను.

‘‘అబయా గుట్టుగుండు. ఆ మాదిగ సినమ్మికి ఇంకేం పనిలేదు. కతలు కతలని తిరగతా ఉంటాది. ఈపొద్దు రేతిరి నేను నీకు బావురుబిల్లి కతను చెప్తాలే’’అని పులగూరని తిరగబోస్తా నా ఆబని అణిచేసింది అవ్వ. చేసేది లేక మెల్లింగా కాళ్లీడుచుకొంటా తెరువులోకి వచ్చినాను. తెరువు కొసన మలుపు తిరగతా కనిపించింది కతలవ్వ. ‘‘కతలమ్మో కతలూ…’’ అనే కూత తెరువుగాలిని కోసుకొంటా వచ్చి, నా చెవల్లోకి దూరి, నా కళ్లల్లోనించి నీళ్లయి కారిపొయింది.

రుప్పిణవ్వ మాట తప్పలేదు. ఆ రెయ్యి కూడు తిన్నాక, కుండా చట్టీ ఎగకట్టి పెట్టేసి వచ్చి, పందిటికి బయట ఉండే పగడమల్లి మాను పక్కన మంచాన్ని వాల్చింది. నా పక్కన పండుకొని బావురుబిల్లి కతను ఎత్తుకొనింది. మింట జానుబిల్లి చొళవచుక్కని మింగడానికి పోతా ఉంటే, ఇంట మా మంచకాడికి బావురుబిల్లి కతయి వచ్చింది.

‘ఒక రాజుకేడుగురు పెళ్లాలూ/ కడుగోటమ్మా మాయమ్మా/ కందీచెట్టుకింద కన్నాది/ కందాకేసి కప్పెట్టే/బావురుబిల్లీ నను సాకే/ బాలా బిచ్చెం పెట్టమ్మా’ అనే పాటను పాడతా కతను చెప్తా ఉండాది అవ్వ. కతను చెప్పే వయినాన్ని ఎరగనట్టు ఉండాది రుప్పిణవ్వ. ఊరికే ఊఁ కొడతా ఉండాను కానీ, నా చెవల్లో వేసుకోవడం లేదు నేను. ఊఁ కొట్టి ఊఁ కొట్టి ఎప్పుడో ఏ పొద్దులోనో కనుకొరికినాను.

ఆరెయ్యి కతలవ్వ నా కలలోకొచ్చి కలవరపెట్టినట్టు ఉండాది. నేను కతలు కతలని కలవరించినానంట ఆ రెయ్యంతా. పొద్దన ఇదే మాటను నాతో అని ‘‘అబయా, ఆ సినమ్మి మాటల్ని నమ్మబాక. ఆయమ్మి చెప్పేవన్నీ కవికట్టు కతలు. ఏమీ బాగుండవు. నువ్వు రేపు మీవూరికి పోవాల కదా. ఈపొద్దు సద్దనిప్పట్లు కాల్చిపెడతా, తినేసి ఆడుకో నాయినా. మీవూరికి పొయినాక మీయవ్వ నీకు మంచి మంచి కతలు చెప్తాదిలే. కతలు రాని ఈ అవ్వ మీద అలగబాక బంగారా’’ అనింది పెరుగుకూటిని తినిపిస్తా రుప్పిణవ్వ. సరేనన్నట్టుగా తలూపినాను కానీ, నా చెవులు తెరువుపక్కకే తిరిగుండాయి.

‘‘కతలమ్మో కతలూ…’’ ఆ పిలుపు వినబడిరది. అయితే మేముండే తూరుపు తెరువులోనుంచి కాదు. మా తెరువుకు పక్కనుండే నడితెరువులో నుంచి వినిపించింది. చుట్టింటితట్టు చూసినాను. సంగటికి ఎసురుపెడతా ఉండాది అవ్వ. కొంచెంసేపు అట్నే కూచున్నాను. మళ్లా వినిపించింది కతలవ్వ కూత, ఈసారి ఇంకొంచెం ఎడం నుంచి. అంటే అవ్వ పడమట పక్కనుండే కడా తెరువుకు పొయినట్టు ఉండాది. ఉడికిన సంగటిబానను దించి, కుదురుమీద పెట్టి తెడ్డుతో కెలకతా ఉండాది అవ్వ. ఇదే అదును అనుకొని, ఉదుటుగా లేసి పడమటింట్లోకి పొయి, అలవమీదకు ఎక్కి, అలవలోని వడ్లను చడ్డీజేబుల్లోకి నింపుకొని, కడా తెరువు తట్టుకు పరుగులు పెట్టినాను.

b copy (1)వడ్లతో ఉబ్బుకొన్న జేబుల్ని, గింజలు రాలకుండా రెండుచేతలతో అదిమి పట్టుకొని అడుగుల్ని కొలస్తా సాగింది నా పరుగు. నేను పొయేతరికి కడతెరువులో కూడా లేదు కతలవ్వ. పడమరతెరువు కడవరకూ పొయి చూసినాను, కతలవ్వ జాడ లేదు. నా కళ్లు నీళ్లతో నిండిపొయినాయి. ‘‘కతలమ్మో కతలూ…’’ అల్లిపూల మడుగు దగ్గర్నుంచి వినిపించింది. మడుగుతట్టుకు పరిగెత్తి పొయినాను. మోదగగుబురు దగ్గర మడుగు కట్టనెక్కి చూసినాను. మాదిపల్లెతట్టు నడిచి పోతా ఉండాది. ‘‘అవా… ఓ కతలవ్వా…’’ ఎలుగెత్తినాను. ఎదురుగాలి నా ఎలుగును నా తట్టుకే తోసుకొని వచ్చింది. కట్టదిగి అవ్వను పిలస్తా పరిగెత్తినాను.

మాదిగపల్లెకు పదిబారల ఇవతల జువ్విమాను కింద కూచోని కనబడింది కతలవ్వ. గసపోసుకొంటా పొయి అవ్వకు ఎదురుగా నిలబడినాను. తలెత్తి నన్ను చూసింది ఆయవ్వ.

‘‘అయ్యో అబయా, పుబ్బవానకు నానిన పుట్టకొక్కు మాదిరిగా అట్ట నిలవనా తడిసిపొయినావేంది, ఇట్టొచ్చి కూసో అబయా’’ అనింది నాతో కతలవ్వ.

‘‘అవా, ఇయిగో వడ్లు తెచ్చినాను, తీసుకోని కత చెప్పు’’ అంటా రెండు చేతుల్నీ రెండు జేబుల్లోకి పోనిచ్చి, బయటకు తీసినాను. కతలవ్వను పట్టుకోవాలనే ఆబలో గింజలు రాలిపోతుండేది చూసుకోలేదు నేను. నా పిడికిలితో రెండు పిడికిళ్ల వడ్లు కూడా లేవు. బిక్కమొకం పెట్టినాను.

నల్లబారిన నా మూతిని చూసి నొచ్చుకొనింది కతలవ్వ. ‘‘నాయినా ఆ రెండు పిడికిళ్ల గింజల్నే నా గంపలోకి యిదిలించు. ఆ గింజలు చాల్లే నాకు. నీకు కత చెప్తానులే కూసో. నీది ఈవూరు కాదే. రుప్పిణమ్మోళ్ల ఇంట్లో ఉండినావే, ఆయమ్మకు ఏమవుతావు నువ్వు’’ అనింది ఆరాలు తీస్తా అవ్వ.

‘‘రుప్పిణవ్వ నాకు అమ్మమ్మ అవతాది’’ చెప్పినాను.

‘‘ఓహో, లలితమ్మ కొడుకువా నువ్వు?’’ తిరిగి అడిగింది.

‘‘కాదు లలిత పెదమ్మ నాకు పెదమ్మ’’ అన్నాను.

‘‘అట్టయితే రుప్పిణమ్మ చెల్లెలి మనవడివి కదా. సరేరా, ఇట్ట నా దగ్గిరికొచ్చి కూసో. నేను చెప్పాల్సిన కతే, నువ్వు యినాల్సిన కతే ఒకటుండాది, ఒక బర్రిగొడ్డు కత అది. చెప్తాను యిను’’ అంటా కతను అందుకొనింది కతలవ్వ.

‘‘అనగా అనగా అనగా ఈ తుంగమడుగు మాదిరిదే ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో నారపరెడ్డి అని ఒక కాపాయన ఉండేవాడు. పదికుంటల మిట్టచేనుతో మట్టసమయిన కాపరం నారపరెడ్డిది.

ఆ కాపురపు బండిని కాడెద్దులయి లాగిలాగి కడతేరి పొయినారు నారపరెడ్డి అమ్మాఅబ్బలు. అన్నెనక ఆబండికి కట్టడానికి మాదిగపల్లె పెద్దోడి దగ్గరుండే బర్రిపడ్డను ఒకదాన్ని తోలుకొచ్చుకొన్నాడు నారపరెడ్డి. బలే అణకవయిన పడ్డ అది. కాపరపు బండికాడిని మెడలమీద యేసుకొని ఒంటిగానే పెనుపాటు పడింది అది. మాదిగపల్లెలో నేర్చిన పని ఒడుపునంతా చూపించి ఆ బండిని లాగతా ఉణ్ణింది.

ఆ రెడ్డి దగ్గిర ఒక మోడికోలు ఉండేది. తెల్లారి సుక్కపొద్దుకే లేసి మోడికోలును ఎత్తుకొని మోడి చేసేవాడు. అంతే ఆ బర్రి రెండుచేతుల పడ్డ అయిపొయేది. ఆ రెండు చేతలతో ఎన్నలేనంత పనిని చేసేది. వాకిట్లో కసువులు ఊడిచి కళ్లాపి చల్లి ముక్కర్రను పోసేది. గొడ్లకొట్టాలు జవిరీ గొర్రెలదొడ్లు వారీ దిబ్బలో పోసేది. కయ్యల్లోకి పొయి చెనగచెట్లను తవ్వతానో కంబుదంట్లను కడతానో గోగునారను తీస్తానో పొగులు పొద్దుగూకులూ ఒళ్లు యించుకొనేది.

ఆ పడ్డకి పాటలంటే బో మక్కువ. పాటలేనిదే పని జరగదు దాని చేతుల్లో. రెడ్డి మోడికోలును ఊపగానే దాని గొంతులోనించి ఊళలు పుట్టుకొని వచ్చేయి. పాటను పాడతా తొళికతో చెనగచేలోకి దిగిందంటే నుడుగుకొక మునం కలుపును తవ్వి పోసేది.

‘నోమీ నోమన్లాలో సందామామా సందామామా

నోరైనా యిప్పనోడు సందామామా సందామామా

సందకాడ వొచ్చినాడు సందమామా సల్లంగా వొచ్చినాడు సందమామ

గోడదూకి వొచ్చినాడు సందమామా దొడ్లోకి దూరినాడు సందమామ

బర్రియెనక నక్కినాడు సందమామా గాట్లోన పడినాడు సందమామ

నోమీ నోమన్లాలో సందామామా సందామామా

నోరైనా యిప్పనోడు సందామామా సందామామా

పొద్దుబోయి వొచ్చినాడు సందమామా పొట్టుకోక తెచ్చినాడు సందమామ

వాటంగా యిప్పినాడు సందమామా నా ఒంటికే సుట్టినాడు సందమామ

సూసి మురిసేలోగా సందమామా కోకనిప్పి పైనబడె సందమామ…’

సందమామ పాటను ఎత్తుకొనిందంటే సందపొద్దు మునిగేది కూడా ఎరగదు అది. పనంతా ముగించుకొని గప్పరగప్పర చీకట్లు ముసురుకొనే పొద్దులో ఇంటికి చేరేది ఆ పడ్డ. ఆ చీకట్లో నారపరెడ్డి మోడికోలును తిప్పతానే అది మళ్లా నాలుగుకాళ్ల పడ్డ అయిపొయేది. రెడ్డి పెట్టిన కుడితినీళ్లను తాగి, మంచుకు నానిన కసువుపోసల్ని నమలతా గాటిపక్కనే పణుకొనేది. అప్పుడప్పుడూ రెయ్యిపూట మిన్నులో దొంగల మంచం దిగినాక, గబ్బుచీకట్లో మోడికోలును ఎత్తుకొని పడ్డకాడకి వచ్చేవాడు రెడ్డి. ఆ పడ్డ బిత్తరబిత్తరగా లేసి బుసలు వదిలేది. రెడ్డి మోడికోలును ఊపి పడ్డను రోలుగా మార్చేసి, ఆ రోట్లో ముంతడు వడ్లను దంచుకొని ఆకలి తీర్చుకొని పొయ్యేవాడు. అప్పడది కొక్కిరతెగులు తగిలిన కోడి మాదిరిగా అల్లాడి పొయ్యేది.

ఎంత పాటుపడినా అది బర్రిగొడ్డు కదా. అడుసులో పొల్లాడే అగుడుగొడ్డు కదా. వన్నెచిన్నెలు ఎరగని నల్లగొడ్డు కదా. వాటం వయినం తెలియని మొరటుగొడ్డు కదా. అది ఇంట్లోకి పోగూడదు కదా. అందుకనే నాలుగునాళ్లు తాలి మావిళ్లపాడు కాపుతెరువులోని ఒక ఆవుతరుపును పట్టుకొచ్చినాడు రెడ్డి.

‘పోనీలే నాతోపాటు కాడిని మోసేదానికి తోడొచ్చింది’ అనుకొనింది బర్రిగొడ్డు. వచ్చిన ఆవు తెల్లపసనుది. మెరిసే పట్టుగుడ్డలాంటి మేనుగలది. మానుమల్లి మొగ్గలాంటి నిడుపయిన ముక్కుగలది. ముక్కుపక్కనే మినమిన మెరిసే మినపగింజంత మచ్చగలది. బర్రిపడ్డ మాదిర బోడిది కాదు అది. కూసయిన కొమ్ములు రెండు దాని నెత్తిన మొలిచి జానడు జానడు పొడుగున ఎదిగుండాయి. బోడి తలకాయతో ఉండేదానికి అదేమి మాదిగపల్లె గొడ్డు కాదుకదా, కాపుటూరి తరుపు.

తనమాదిర పెంటిపుటకే కదా, తోడుమాడయి ఉంటాదిలే అనుకొనింది బర్రిగొడ్డు. కానీ ఆవు అట్ట అనుకోలేదు. కడపను దాటి బయటకు తొంగిచూసేది కాదు అది. తనేమో తన వంటపనేమో అంతే. రెడ్డి మోడికోలుతో ఆవు తరుపును కూడా మార్చేవాడు. అప్పుడు ఆ తరుపు రెండుకాళ్ల మీద నిలబడి ఇంటెడు పనీ చేసేది. అయితే బర్రిగొడ్డు మాదిరిగా బండచాకిరి కాదు ఆవుది.

ఆవు తెల్లంగా తళతళలాడతా ఉండేది. బర్రి నల్లంగా మాసిపొయి ఉండేది. పసుపుకుంకుమలతో కళకళలాడతుండేది ఆవు. అడుసూ బురదలతో అగుడుపట్టి ఉండేది బర్రి. ఆవుకు తియ్యటి కడుగునీళ్లు, బర్రికి పులిసి గబ్బుకొడతుండే కుడితి నీళ్లు. పచ్చికసువూ గానుగపిండీ జొన్నదంటూ ఆవుకు తిండి. ఎండుకసువూ చెనగకగ్గూ కంబుసొప్పా బర్రికి మేత. పండగపూట పలారాలు దక్కేవి ఆవుకు. పండగపక్కనాడు పాసినకూడు బర్రి కడుపులోకి దూరేది. ఆవు వచ్చినాక బర్రికి కలిగిన మేలు ఒక్కటే ఒక్కటి. ఇదివరకు రెండునాళ్లకు ఒకతూరి రెయ్యిపూట తగిలే నరకం, ఇప్పుడు పదినాళ్లకు ఎప్పుడో ఒకతూరి అయింది. ఆ చిరపర నరకం ఇప్పుడు ఆవు పాలయింది.

నాళ్లు గడిసినాయి, నెలలు గడిసినాయి. నారపరెడ్డి దాటిన బర్రిపడ్డకు కట్టు నిలిసింది. ఆవుకు కూడా చూలు కట్టింది. నిండు చూడుతోనే దొడ్డిపనినీ చేనుపనినీ ముగించుకొని వచ్చేది బర్రిగొడ్డు. చిట్టెడు బియ్యం ఉడకేసేదానికే ఆపసోపలు పడేది ఆవు.

బర్రీ ఆవూ రెండూ రెండునాళ్ల వేరిమితో తల్లులయినాయి. చెరొక పెయ్యదూడను కని అమ్మలయినాయి. అన్నెనక కూడా ఆ ఇంట్లో ఆవుపని ఆవుదే, బర్రి పని బర్రిదే. పూండ్లు గడిసినాయి అనడానికి ఒక్కపూండు అయినా బతికే మనుము ఎక్కడుండాది! పూండ్ల కత మనకెందుకులే, ఏండ్లు గడిసినాయి. ఇరు ఏడుల పద్నాలుగేండ్లు గడిసినాయి. ఈ పద్నాలుగు ఏండ్లలో ఆవుకి ఇంకొక కుర్రదూడ పుట్టింది. మోడికోలుతో మోడి చేసిచేసి కనపడిన గొడ్డునల్లా దాటిదాటి కడాకు నారపరెడ్డి మోడికోలు వట్టిపొయింది. గుట్టుగా కాపుదనం చేసుకొంటా ఉండాడు.

ఆవుదూడా బర్రిదూడా రెండూ ఈడుకొచ్చినాయి. ఆవుదూడ నీడపట్టున్నే ఉండి ఇంకంత తెల్లంగా పాలిపోతా ఉండాది, బర్రిదూడ అమ్మతోపాటు చేనుపనికి పోతా ఎండకు నల్లబారిపోతా ఉండాది. ఎంతయినా నలుపు నాణ్ణెం తెలుపుకు ఎట్టొస్తాదిలే.

ఆ ఊరికి మైలు దూరాన సుగ్గుపల్లి అని ఇంకొక ఊరు ఉండాది. నారపరెడ్డి మోడికోలు వట్టిపొయినాక సుగ్గుపల్లి సూరపరెడ్డి మోడికోలు చెలరేగిపోతా ఉండాది. ఒకనాడు చెనగచేలో చెరొకపక్క కూసుని కసువును తవ్వతా ఉండాయి బర్రీ దూడా రెండూ. ఎప్పటినించి కన్నేసి ఉండాడో, దూడ దగ్గరకు వచ్చి దాని తోకను లాగి, మోడికోలును తిప్పబొయినాడు సూరపరెడ్డి. బిత్తరతో అమ్మా అని అరిసింది దూడ. ఆ అరుపును విని పరిగెత్తి వచ్చి సూరపరెడ్డిని కుమ్మి అవతలకు నెట్టింది బర్రి. కిందపడిన సూరపురెడ్డి లేసి దుమ్ముదులుపుకొని బర్రిని కొరకొరమని చూస్తా, మోడికోలును బిగించి పట్టుకొని యెల్లినాడు.

ఆ రెయ్యి నారపరెడ్డి ఒంటిగా తొర్రుపట్టులోకి పొయినాడు. దూడను లేపి బయట కట్టేసి వచ్చినాడు. బర్రిగొడ్డు కాడకి వచ్చి ‘ఏందే సుగ్గుపల్లి సూరపరెడ్డి మీదనే తలను యిసిరినావంటనే ఏంది’ అని అడిగినాడు.

‘ఆ నాబట్ట నా దూడను పట్టబొయినాడు రెడ్డా. పసిబిడ్డకు తొడుసు జరగతుంటే చూస్తా ఉండలేక కుమ్మినాను రెడ్డా’ అనింది బర్రి.

‘పసిబిడ్డ ఏందే, ఆ ఈడులోనే నిన్ను దాటింది నేను. మరిచిపొయినావా?’ అన్నాడు బెడుసుగా. ఆ మాటలకి ఒళ్లు మండింది బర్రిగొడ్డుకి. ‘దీని మాదిరిగానే నీకు ఇంకొక ఆవుదూడ ఉండాది కదా ఇంట్లో. దాన్ని తొడకొనిపొయి దాటించకూడదా. ఏమి బర్రి పుటక అంటే అంత సులకనా’ అనింది కనలుగా.

ఆ మాటకు నారపరెడ్డి రేగిపొయినాడు ‘లంజా నీకూ ఆవుకూ పోలికేందే. ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకొంటా ఉండావు. ఇంకొంచేపటికి సూరపరెడ్డి మోడికోలుతో వచ్చి దాన్ని దాటబోతా ఉండాడు, ఏంచేస్తావో చూస్తాను’ అంటా సవకకర్రతో బర్రిగొడ్డును బాది బాది వదిలినాడు. అదే పొద్దుకు బయటనించి బర్రిదూడ అరుపు బేలగా వినిపించింది.

ఆ అరుపును విని తట్టుకోలేక పొయింది బర్రిగొడ్డు. కట్టుతాడును తెంపుకొని నారపరెడ్డిని కుమ్మి ఎత్తి కుదేసింది. బుసలుకొడతా వస్తుండే బర్రిగొడ్డును చూసి సూరపరెడ్డి పారిపొయినాడు. బర్రిదూడని కట్టుముట్టనించి తప్పించి, మాదిగపల్లె తట్టుకు తొడకొని పరిగెత్తిపొయింది.

మాదిగపల్లెలో తన దూడని మెచ్చిన పోతు ఒకటి ఉండేది. ఆ పోతుని లేపి దూడని తొడకొని ఎడంగా ఎక్కడకన్నా పొమ్మని చెప్పింది. కూలోనాలో చేసుకొని కలోగంజో తాగి బతకండి పోండి అనేసింది.

‘అమా నువ్వు కూడా మాతో రామా’ అనింది బర్రిగొడ్డుతో దూడ.

‘అమ్మీ, నేను ఈ ఊర్ని వదిలి కదలను. ఈ ఊరి మగోళ్ల మోడికోళ్ల కతలను కడతేర్చందే నాకు కునుకు పట్టదు. నా బతుకంతా వీళ్ల బతుకుల్ని ఎండకడతా ఈడనే ఉంటాను. వీళ్ల తొడుసులను కతకట్టి చెప్తా వీళ్ల కళ్ల ఎదురుగానే ఉంటాను. మీరు పొయిరండి. ఇంక ఎప్పుడూ మీ తోకల్ని కూడా ఈ తట్టుకు ఊనద్దు’ అని పంపించేసింది దూడనీ పోతునీ కలిగలిపి ఆ బర్రిగొడ్డు. అన్నెనక అది ఆ ఊర్లోనే నిలిసిపొయి, కడావరకూ ఊరోళ్లను తూరుపార పడతానే ఉండిపొయింది. ఇదేనబయా బర్రిగొడ్డు కత’’ అంటా కతను నిలిపింది కతలవ్వ.

కత ముగిసేటప్పటికి పొద్దు పడమటికి దిగతా ఉండాది. కూటికి కూడా రాకుండా నేనెట్టపొయినానా అని నన్ను వెతుక్కొంటా వెతుక్కొంటా జువ్విమాను దగ్గరికి వచ్చింది రుప్పిణవ్వ. నన్నూ కతలవ్వనీ మార్చి మార్చి చూసింది.

‘‘సినమ్మీ, పసిబిడ్డని కూటికి కూడా పంపకుండా కతలు చెప్తా ఉండావా’’ అనింది వెక్కసంగా కతలవ్వతో రుప్పిణవ్వ. ఆ మాటల్ని పట్టించుకోనట్టు ఒక ఈసండపు చూపుని అవ్వ మీదకి విసిరి, కతలగంపని సరుదుకొని లేసి మాదిగపల్లెతట్టుకు అడుగులేసింది కతలవ్వ. నేను రుప్పిణవ్వ వెనకాల్నే ఇంటికి వచ్చినాను.

ఆపొద్దంతా మూతి ముడుచుకొనే ఉణ్ణింది రుప్పిణవ్వ. నేను కూడా దిగులుపడి ఏమీ మాట్లాడలేదు అవ్వతో. పొద్దు మునిగి, ఊరి గమిట్లోని చింతచెట్లమీది కొంగరెక్కల్ని కూడా చీకట్లు మింగేసినాక, నాకు నాలుగు ముద్దలు కలిపి చేతిలో పెట్టి, మంచం వాల్చి నన్ను పణుకోబెట్టి, నాపక్కన పణుకొని నోరిప్పింది రుప్పిణవ్వ.

‘‘అబయా, సినమ్మి బర్రిగొడ్డు కతను చెప్పిందా?’’ అడిగింది. ‘‘ఊఁ’’ అన్నాను.

‘‘ఆ కత నాక్కూడా తెలుసు. అయితే ఆ కతలో సినమ్మికి తెలవనిది ఒకటి నాకు తెలుసు. దానిని చెప్తాను వింటావా?’’ అనింది.

‘‘చెప్పువా వింటాను’’ అన్నాను.

‘‘అబయా, బర్రిగొడ్డుకు ఆవుగొడ్డంటే కనలు, కంటు. కానీ ఆ బర్రిగొడ్డుకు తెలవదు – దాని ఒళ్లు మట్టుకే నొచ్చేది, ఆవుది ఉల్లం నొచ్చతా ఉండాదని దానికి తెలవదు. బర్రిగొడ్డుకు ఉండే విచ్చలు ఆవుగొడ్డుకు ఏది? నీడపట్టున కూచుని నాలుగుతీరుల కూళ్లు కుడిచేది తెలుసుకానీ, నచ్చని బతుకును తెంపుకొని పోయే తెగవ ఆవుగొడ్డుకు లేదు. బర్రిగొడ్డు తప్పించుకొని పొయినాక, నారపరెడ్డి ఆ కనలునంతా ఆవుగొడ్డు మీద చూపించినాడు. తనమాదిర మోడికోలు కలిగిన సూరపరెడ్డికే ఆవుదూడనిచ్చి కట్టిపెట్టినాడు. అట్టాంటోడు వద్దు వద్దని ఆవుగొడ్డు ఏడిచి మొత్తుకొన్నా వినలేదు. ఆ పొద్దుటినించీ నారపరెడ్డి బతికినన్నాళ్లూ ఆవుగొడ్డుని వేపుకొని తిన్నాడు. బర్రిగొడ్డు మీద కనికరం కూడా చూపించలేని బెదురు బతుకు ఆ ఆవుది. నారపరెడ్డి సచ్చినాక ఎన్నోతూర్లు బర్రిగొడ్డును పలకరించాలనీ చేరతీయాలనీ చూసింది ఆవుగొడ్డు. బర్రిగొడ్డు దాని కంటును వదల్లేదు. అది మటుకు ఏంచేస్తాదిలే, దాని బతుకులో అట్టాంటి నడుతులు నడిసిపొయినాయి. బర్రిగొడ్డయినా ఆవుగొడ్డయినా ఆడబతుకే అట్టాంటిది అబయా. పణుకో, పొద్దన్నే లేసి ఊరికి పోవాల నువ్వు’’ అంటా కతను నిలిపింది రుప్పిణవ్వ.

మన్నాడు మద్దినేళకు పేటకు చేరుకొన్నాను నేను. మా అమ్మమ్మ వచ్చుండాది ఇంటికి. ఆరెయ్యి మా అమ్మమ్మకు బర్రిగొడ్డు కతనూ ఆవుగొడ్డు కతనూ కలిపి చెప్పి ‘‘అవా అవా ఆ బర్రిగొడ్డూ ఆవుగొడ్డూ ఇంకా ఉండాయావా’’ అని అడిగినాను.

మాయవ్వ గట్టిగా ఊపిరిని వదిలి ‘‘ఏమో ఎరగం అబయా. అయితే నాకు తెలిసింది ఒకటుండాది. మీ రుప్పిణవ్వ మొగుడిపేరు నారపరెడ్డి’’ అనింది.

*

 – స.వెం. రమేశ్

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, సెప్టెంబర్ and tagged , , , .

11 Comments

  1. మీ కథలు చదవడం అంటే ఒక అపురూపమైన అనుభవం. మీ భాషలోని ప్రతి అక్షరం మట్టి పరిమళాలతో గుబాళిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎర్రమన్ను పరిమళం. అది గంధపు తైలం వంటిది. దాన్ని ఒకసారి చేతికి రాసుకుంటే మళ్ళీ స్నానం చేసేంత వరకూ మన చుట్టూ తేజోవలయంలా విరాజిల్లుతూనే ఉంటుంది. అదేవిధంగా మనసుని చుట్టుముట్టిన ఈ కథ నన్ను పంథొమ్మిది వందల ఎనభైల్లోకి లాక్కుపోయింది.ఆ బాగేపల్లి, ఆ కోలారు, ఆ బంగారు లోగిళ్ళు అన్నీ మళ్ళీ ఒక్కసారిగా నా కళ్ళముందు రూపుకట్టాయి. తెలుగు కథల్లో వాతావరణాన్ని వర్ణించాలంటే ఎవరైనా మీ తరువాతే. అందుకు ఈ కథ మరో నిండైన అక్షర సాక్ష్యం. తెలుగు జీవితాల తేటతేనెల సాక్షాత్కారం.
    జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి.

  2. అబ్బ రమేష్ న్నా ఇంత మాండలికం ఎవ్వురు రాయలేరున్నా ..ఎన్నెన్ని పదాలు ఉండాయి అందులో …నాకు అందులో కొన్ని పదాలే తెలుసు.. తొడుసు ..సవక కర్ర ఇలాంటి పదాలు చాల నేను విన నోటియి ఉండాయి ఈ కథను మల్లి మల్లి చదివితే గాని నా మునాస తీరదు ..bathula prasad

  3. “ఎంత పాటుపడినా అది బర్రిగొడ్డు కదా. అడుసులో పొల్లాడే అగుడుగొడ్డు కదా. వన్నెచిన్నెలు ఎరగని నల్లగొడ్డు కదా. వాటం వయినం తెలియని మొరటుగొడ్డు కదా. అది ఇంట్లోకి పోగూడదు కదా “

    కతలవ్వకి కన్నీళ్లతో మొక్కుతున్నా.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.