irlachengi kathalu

ఎర్రజీమలు

Download PDF ePub MOBI

‘అమా పెద్దయివోరికి బాదమాకులు గావాలంట మా. బాయి కాడికి బొయినప్పుడు మర్సిపోకుండా కోసుకోని రామా’ అని రేత్రి పొండుకొనే ముందు గ్యాపకమొస్తే మా యమ్మకు జెప్పినాను.

మా ఇస్కూల్లో సర్కారు గుగ్గిళ్లుడికించి పిలకాయిల్కి బెడ్తారు గదా! వాటికోసమే మేము ఇస్కూలికి నిలవకుండా బొయ్యేది. అయి పెట్టించుకొనేదానికి ఇండ్లకాన్నించి అందురూ పిల్లేట్లెత్తుకోని బోతాము.

ఒంటి కిడ్సినప్పుడు ఇండ్లకు పరిగెత్తుకోనిబోయి పిల్లేట్లు, గలాసులు దెచ్చుకుంటాము. సర్కారు గుగ్గిళ్లు పెట్టి, పాలపొడితో కాంచిన పాలుబోస్తారు పిలకాయిలకి.

మాయమ్మ సేసే అలసందల గుగ్గిళ్లు మాదిరుండవు మా ఇస్కూల్లో సేసేవి. అయినా మాయమ్మ శివరాత్రికో, ఏకాసి పండక్కో సేస్తాది గుగ్గిళ్లు. ఇస్కూల్లో గుగ్గిళ్లు నేనింటికి దెచ్చినప్పుడు మా నాయిన గూడా సిన్నబిడ్డ మాదిరిగా సెయి జాపతాడు. మాయవ్వయితే వక్కాకు రోట్లో దంచుకొని తింటాది. అందుకని సిన్నయివోరు గుగ్గిళ్లు పంచేటప్పుడు ‘ఇంకొన్నియిసా’ అని అడిగినాను. ఆయన ‘ఇంగ లేదు పో’ అని కసిరినాడు. పాలపొడి డబ్బాలు, గుగ్గిళ్ళగింజలు అయివోర్లింటికెత్తుకోని పోతారు గదా! అందుకే మాకు రొన్నే పెడతారు.

ఇస్కూల్లో పాలు పోసినప్పుడు గలాసు కింద పడిపోకుండా గుగ్గిళ్లు ఎడంసేత్తో, గలాసు కుడిసేత్తో పట్టుకోని ఇండ్లకు దెచ్చుకున్న్యాము నేను, పుల్లూరోళ్ల నీల, ఎగవింటి సాయిత్రి, రాగి రెడ్డోళ్ల యశోద. మమ్మల్ని సూసి రొండో తరగతి సదివే నడుపబ్బ పెదనాయినోళ్ల కాంత, ఈశినేరోళ్ల మున్లచ్మి కూడా తెచ్చుకున్న్యారు.

మాయమ్మ గుగ్గిళ్లు రొండు నోట్లో ఏసుకోని ‘సరింగా వుడకలేద’ని మా యవ్వతో అనింది.

మాయవ్వ పాలగలాసు ముక్కుదెగ్గిర బెట్టుకోని మూంచూసి ‘పిల్లిమూతి వాసనొస్తావుంది. పిలకాయిలు పాపం దీన్నెట్ల తాగేది’ అని ‘తలుపెనక కట్రావులో బెల్లముండాది త్యాపో’ అనింది. బెల్లం కట్రావు (ఒక రకం గిన్నె) దెచ్చి మాయవ్వ సేతికిచ్చినాను. దాంట్లో వుండే సగం బెల్లం ముద్దదీసి నేలమింద బెట్టి కొడివిలి కొనతో పొడిచి రెండు పెల్లలు పాలగలాసులో ఏసి ‘ఇంగో గలాసు త్యాపో’ అనింది. గలాసు తేంగానే పాలలో ఏసిన బెల్లం కరగడానికని పాలను రొండు గలాసుల్లో తిరగ్గొడతా వుంది. దాన్ని సూసి మాయమ్మ ‘పాలు మాత్రం సిక్కంగానే వుండాయి’ అనింది.

మా యమ్మకు ఏం మంత్రం దెలస్తాదో గాని కొన్నిట్ని సూడంగానే అదెట్లా వుండాదో సెప్పేస్తాది.

పాలు మొత్తం వాడికే గావాలని మా పెద్దబ్బోడు యేడ్సినాడు. వాడింగా ఇస్కూల్లో సేరలేదులే.

‘నీ కియ్యను బోరా. ఇది నా పాలు’ అని వాన్నిబట్టి తోసినానా, వాడుబొయి గుడ్సింటి తలుపుమింద దబీమని పన్న్యాడు.

నా సేతిలో పాలగలాసులోని పాలు కొన్ని వొలికి పొయినాయి. అవి మా పెద్దబ్బోడి సెడ్డీమింద బన్న్యాయి. వాడు ‘వూఁ వూఁ’ అని యాడస్తావుంటే ‘దేబ్రాసి మొగమా పాలకోసం ఈంగి పొయ్యుండారా? అయినా తగిలేది తప్పేది తెలిసేల్లేదా?’ అని నా ఈప్మింద ఇమానం మోత మోయించింది. అంతే ఇంగనాకు పాలు తాగాలనిపించలా. మూతి ముడ్సుకోని తలుపెనక గోడ కానుకోని కూసున్న్యాను. మా పెద్దబ్బోడింకా రాగం దీస్తా వుండాడు. వాన్ని సంకనేసుకోని గుగ్గిళ్లుండే పిలేటు సేతిలో పట్టుకోని ‘అక్కకిచ్చేదిల్యా. అన్నీ నీకే’ అంటా ముదిగారంగా గుడ్సింటి ముందరుండే సింతసెట్టుకాడ బండమింద వాన్ని కూసోబెట్టింది. ‘తింటావుండు నేను సంగటి కెలికి ముద్దలు సేసొస్తా’ అని మాయమ్మ గుడ్సింట్లోకొచ్చింది.

అన్నం మెతుకు బట్టిసూసి పిండిపోసి ఎనక్కి తిరిగినప్పుడు మా యమ్మ నన్ను సూసింది.

‘కోపతాపాలకేం తక్కవ ల్యా’ అని గలాసు తెచ్చి నా ముందుబెట్టి ‘అబ్బోడు రాకముందే పాలు తాగేయిపో! లే’ అని నా మానాన నన్ను వుండనియ్య కుండా ఆన్నించి సెయ్యిబట్టి లేపింది.

పాలగలాసు సేతిలేకి దీస్కోని సూస్తే దాంట్లో ఈగ సచ్చిపడుండాది.

‘దీంట్లో ఈగ పడుండాది. ఎట్ల తాగేది’ అన్న్యాను ఏడుపు మొగంతో’.

‘ఎత్తేసి తాగు. ఏంగాదు గాని’ అని కసిరింది.

‘నా కొద్దుపో’ అన్న్యాను వుక్రోసంగా.

‘పెడాత్రం బిడ్లు. ఈ ఎత్తు బారాలతో యేంగలేక సావొచ్చేటట్లుండాది’ అంటా ఏలుబెట్టి ఈగని ఇసిరికొట్టి మా యమ్మ నోట్లో బోసుకొనేసింది. ‘పో… పోయి అబ్బోని దెగ్గిర గుగ్గిళ్లు రొండు దీసుకోపో. మళ్లా అయిపోయినాక నన్ను ఉపద్రపెట్టొద్దు’ అనింది.

నేను గుగ్గిళ్లెత్తుకుంటా వుంటే మాయబ్బోడు నన్నేమనల్యా. పైగా వాడిసేతిలో వుండేవి కూడా నా సేతిలో బెట్టినాడు.

మర్సనాడు ఇస్కూల్లో వొంటికని బెల్లుగొట్టంగానే పిలేటు, గలాసు తెచ్చుకుందామని ఇంటికి బొయినాను. యాడెతికినా పిలేటు కన్పించలేదు. అది మేము తిరప్తికి ఇల్లుదీర్తం బొయినప్పుడు మాయమ్మ మూడణాలిచ్చి తెచ్చింది. నిన్న సింతసెట్టుకింద గుగ్గిళ్లు దిన్న్యాక అన్నే ఇడ్సిపెట్టి వచ్చుంటామని మాయమ్మకు యాడలేని రోదనై పోయింది.

‘ఆడాడ పిలకాయిలు సూసిరమ్మంటే కాల్చొస్తారు. ఈ దెయ్యం పిలకాయిలుండారే. ఇంట్లో వుండే దాన్నెత్తుకోని బొయి ఈదిలో యేసేసొస్తారు. బంగారట్లా పిలేటు. తిరప్తినుంచి గుర్తుగా వుంటాదని కోరికోరి దెచ్చుకుంట్ని. దొరికిందే సాలని యానా సవితి అణుచుకొనిందో. పొయినాక ఎవుర్నడిగి ఏం లాభం’ అని యాకారతా ‘ఆడ బాదమాకుల దోర్నముంటాది. పెద్దగా సూసి ఒగిటి తుంచుకోని పో’ అని కసిరింది.

పచ్చనాకులు కోసకొచ్చినప్పుడు దోర్నంగుట్టి తలుపెనక గూటానికి తగిలించి పెట్నారు. అవి నల్లంగా అయిపోతాయని ముందే నీడలోనే బెట్న్యారు. దాంట్లో నుంచి ఒక పెద్ద బాదమాకును పెరుక్కోని గలాసెత్తుకుంటావుంటే నా సేతిలోని బాదమాకును పెరుక్కోని రాగిసట్లో వుండే నీళ్లలో ముంచెత్తి దొప్ప మాదిరి ముడిసి ఈనిగి పుల్లతో ఒక కుట్టు ఏసిచ్చింది మాయమ్మ.

గుగ్గిళ్లు ఏపించుకుంటా వుండానా! మా సిన్నయివోరు నాసేతిలో నుంచి ఆ బొప్పను దీసుకోని తిప్పించి మల్లించి సూసి ‘బలే బాగుందే. ఏమాకిది. ఇంత పెద్దగా వుండాది’ అని అడిగినాడు. బాదమాకు అని నేను సెప్తావుండంగానే పెద్దయివోరు ‘విూకా సెట్టుందా’ అని అడిగినాడు. ‘మా బాయికాడుండాది సా’ అని సెప్పినాను.

తయామాస రొండు దినాలుందనంగా మా పెద్దయివోరు నా దెగ్గిరికొచ్చి ‘రేపు విూ సెట్లో నుంచి బాదమాకులు కొన్ని కోపించుకోని త్యా’ అన్న్యాడు.

ఇంటికొస్తానే మళ్లీ మర్సిపోతానేమో అనే బయంతో మా యమ్మకు సెప్పినాను. కానీ మర్సనాడు మా యమ్మ బాయికాన్నించి ఆకులు కోసుకోకుండానే వొచ్చింది.

‘ఏమ్మా. మా పెద్దయ్యోరికి బాదమాకులు కోసుకోని రమ్మంట్నే తేలేదా’ అని అడిగినాను.

‘సినపాపా, ఆ సెట్లో బాదమాకులు కోయడానికి బెమ్మదేముడివల్ల గూడా కాదు. దాన్నిండా బాపనకుక్కలు. కొమ్మ బట్టుకుంటే సీమలు జలజలారాలి వొళ్లంతా పెరక్కతింటాయి. మీ అయివోరికి గావాలంటే ఎండాకులుండాయి. ఎత్తుకోని పొయ్యి ఇయ్యి’ అనింది.

మర్సట్నాడు ఎండాకుల్నెత్తకపోయి మా అయివోరి ముందు బెట్నాను.

‘తళిగిలెయ్యడానికని పచ్చాకులు దెమ్మంటే ఇవి దెచ్చినావా’ అన్న్యాడు.

‘దాన్నిండా బాపనకుక్కలు సా’ అంటి. ‘అట్లనకూడదమ్మా! ఎర్రసీమలనాల’ అన్న్యాడు అయివోరు.

ఆ ఇసయాన్ని ఇంటికొచ్చినాక మాయమ్మతో సెప్తావుంటే మా నాయన, మాయవ్వ, మాయమ్మ పడీపడీ నవ్వినారు. ‘బాపనయివోరి దెగ్గిర బాపనకుక్కలంటే ఆయన కెట్లుంటాది’ అని మళ్లీ మళ్లీ నవ్వతానే వుండాడు మానాయన.

*

Download PDF ePub MOBI

for regular updates, like Kinige Patrika facebook page.

Posted in 2014, ఇర్లచెంగి కథలు, సీరియల్, సెప్టెంబర్ and tagged , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.