cover

ఒకే ఒక ప్రశ్న

Download PDF ePub MOBI

మూలకథ ప్రముఖ ఆన్‌లైన్ హిందీ త్రైమాసిక పత్రిక “హిందీ చేతన” జూలై-సెప్టెంబర్ 2014 సంచికలో “एक ही सवाल” పేరుతో ప్రచురితమైంది (పుటలు 8-10). హిందీ కథ ప్రచురితమైన పత్రికని  లింక్లో చదవచ్చు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఒళ్ళెరక్కుండా హాయిగా నిద్రపోయాను. ఎంతలా నిద్రపోయానంటే తెల్లారడం కూడా తెలియనంతగా. ఓ అద్భుతమైన ప్రశాంతత మనసుని ఆవరించింది. శరీరమంతా సేదదీరిన అనుభూతి. ముఖం మీద నుంచి దుప్పటి తీసానో లేదో ఒక్కసారిగా విస్మయం. నోరెళ్ళబెట్టి ఉండిపోయాను. చుట్టూ నా బంధుజనమంతా గుమిగూడి ఉన్నారు. కొడుకులు – కోడళ్ళూ, మనవలు – మనవరాళ్ళూ, ఇరుగుపొరుగువాళ్ళూ, ఇంకా కొంతమంది సన్నిహిత మిత్రులు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, వాళ్ళ వదనాలలో దుఃఖం వ్యక్తమవుతోంది. నేనేదో కల కంటున్నానేమోనని అనుకున్నాను. నా ఆత్మీయులంతా నా దగ్గరే ఉన్నట్లు – ఎంత మంచి కలో! కానీ వీళ్ళలో నా ప్రియమైన అర్ధాంగి భాగీ… భాగ్యశ్రీ లేదు. నా మీద ఎందుకంత కోపం తనకి? జీవితంలోంచి ఎటూ వెళ్ళిపోయింది, కనీసం కలలోకైనా రాదెందుకు? ఈ కల చెదరకూడదు. దుప్పటి కప్పేసుకుని మళ్ళీ పడుకుండిపోనా? అప్పుడైనా వస్తుందేమో. ఇలా అనుకుని, నేను దుప్పటి కప్పుకోబోతుంటే… నా ఎదురుగా కూర్చున్న జనాలు గట్టిగా అరవసాగారు. ఇలా ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన ఈ హడావుడితో నాకర్థమైంది – నేను కలగనడం లేదని. పైగా రాత్రి మంచం మీద ఉన్నవాడిని, ఇప్పుడిలా నేలమీద పరిచిన ఓ పాతకంబళి మీదకి ఎలా వచ్చానో అర్థం కాలేదు. “బతికే ఉన్నారు..” అంటూ ఒకే గొంతుతో అరిచారు.

తామనుకుంటున్నట్లు నేను చచ్చిపోలేదని వాళ్ళకి అర్థమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎదురుగా ఉన్న గోడ మీది గడియారం పదకొండు గంటలు చూపిస్తోంది. రోజూ పొద్దున్నే ఐదు గంటలకల్లా లేచే నేను, ఈ రోజు సుఖమైన దీర్ఘనిద్రలో ఉన్నాను. అది శాశ్వతనిద్ర అనుకుని, మావాళ్ళంతా నాకు అంతిమ వీడ్కోలు చెప్పడానికి ఇక్కడ చేరారు. వాళ్ళంతా, వెంటనే, ఒకరితో మరొకరు గుసగుసలాడుకుంటూ బయటకు నడిచారు. ఇరుగుపొరుగు వారు కూడా వెళ్ళిపోయాక, కోడళ్ళు లేచి, తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కొడుకులు బయటకి వెళ్ళిపోయారు. వాళ్ళ ముఖాలు ఇందాకటి కంటే మరీ గంభీరంగా ఉన్నాయి. నాన్న బతికున్నాడన్న ఆనందం వాళ్ళ ముఖాల్లో ఏ మాత్రం కనిపించలేదు. బహుశా నేను బతికి, వాళ్ళ ఆశల మీద నీళ్ళు జల్లానేమో. వాళ్ళు బయటకు వెళ్ళి ఇంకా రావల్సిన బంధువులకు, మిత్రులకు – ఇంక రానవసరం లేదని – ఫోన్లు చేస్తున్నారు.

నన్ను ఇప్పటిదాక ఎవరూ అడగని ప్రశ్న – నా మనవలు – అడిగారు. అందరూ వచ్చి నా ఒళ్ళో దూరారు. “తాతగారూ, మీకేమయింది? మీరు చచ్చిపోయారని… కాదు కాదు… దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారని అందరూ అన్నారు. మీరు దేవుడిని చూసారా? దేవుడు ఎలా ఉంటాడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాని జవాబులు చెప్పాల్సిన అవకాశం నాకు దొరకలేదు. నలుగురూ వాళ్ళల్లో వాళ్ళే సమాధానాలు చెప్పుకున్నారు. “దేవుడెలా ఉంటాడో నీకు తెలియదు” అని ఒకరంటే, “మనం గుడిలో చూసే విగ్రహంలానే ఉంటాడు” అని మరొకరు, “ఓయ్ మొద్దూ, దేవుడు కనబడడు, కాని అన్ని చోట్లా ఉండాడు” అని ఇంకొకరు అంటే – నాలుగోవాడు – “ఏదైనా కనబడడం లేదంటే – అది లేనట్టే. అంటే దీనర్థం దేవుడు లేడని…” అని అన్నాడు.

పిల్లల ఈ వాదులాటలో పాల్గొనే ఉత్సాహమేమీ నాకు లేదు. అందుకని వాళ్ళని బయటకి పంపేసాను. ఇప్పుడు నేను నా గదిలో నేల మీద పరిచిన పాత కంబళి మీద ఒంటరిగా కూర్చుని ఉన్నాను. నేను చనిపోయాననుకుని ఇక్కడ ఇంతమంది చేరారే, కాని బతికి ఉన్న నాకోసం వాళ్ళల్లో ఎవరికీ రెండు నిముషాల సమయం లేదు. మాకు సన్నిహితులైన పొరుగువాళ్ళు ఒకరిద్దరు మళ్ళీ వచ్చారు – బహుశా నన్ను ఏవో అడగటానికేమో. కాని మా ఇంట్లోవాళ్ళ ప్రవర్తన చూసి, లోపలికి రావడానికి వెనుకాడి, వెళ్ళిపోయారు. బహుశా వాళ్ళకి ఏవో పనులుండి ఉంటాయి. ఉరుకులు పరుగులు తీసే నేటి ఆధునిక జీవితంలో ఉన్నట్లుండి ఎవరికైనా సమయం కేటాయించాలంటే కష్టమే.

రిటైరయిన తర్వాత లభించిన ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదవడంతో ఉపయోగించుకున్నాను. నిజానికి ఈ మధ్య నేను చదువుతున్నదంతా – చావు అనుభూతికి లోనయిన వ్యక్తుల గురించే. అటువంటి సంఘటల గురించి చదవడం నాకెంతో ఆసక్తిగా ఉంటోది. ఏవేవో ఊహాల్లో తేలియాడుతున్నాను. వీటి వెనుక నిజానిజాలని తెలుసుకోవాలని మనసు తహతహలాడుతోంది. నాలుగేళ్ళ క్రితం భాగ్యశ్రీ చనిపోయినప్పుడు, శవాన్ని చితి మీద పడుకోపెట్టేవరకూ కూడా, ఆమె లేచి కూర్చుంటుందని ఊహించాను నేను. చచ్చి బతికిన వాళ్ళ వేలల్లో ఒకరుంటారేమో, కాని ఉంటారు. అలాంటి అదృష్టం నా భాగీకి ఉండుంటే ఎంత బాగుందేది? చచ్చి బతికినప్పుడు కలిగే ఆ అనుభూతి ఎలా ఉంటుందో, ఆమె ఏం చూసిందో ఆమెని అడిగి ఉండేవాడిని. అంతే కాదు, ఆమె ఉండుంటే ఈ వృద్ధ్యాప్యం ఇంత విషాదభరితంగా ఉండేది కాదు.

భాగ్యశ్రీ విషయంలో అటువంటిదేమీ జరగలేదు. కానీ నాకేం తెలుసు భగవంతుడు ఆ అదృష్టాన్ని నాకిద్దామనుకుంటున్నాడని? కానీ నేనీ వాతావరణంలో నా దీర్ఘనిద్రలోని రహస్యాన్ని ఛేదించటం అటుంచి, కనీసం జ్ఞాపకం కూడా చేసుకోలేకపోతున్నాను. అరచేతులు రుద్దుకుని కళ్ళ మీద ఉంచుకున్నాను. ధ్యానముద్రలో కూర్చుని ఆ రహస్యం గురించి ఆలోచించసాగాను. అప్పుడు మా పెద్దబ్బాయి మాటలు నా చెవిన పడ్డాయి. “ఇంట్లో ముసలోళ్ళు ఈ రకంగా తమాషాలు చేస్తుంటే ఏమనాలి? పిల్లలతో పోటీ పడుతున్నట్లుగా ఉంది నాన్న వ్యవహారం. పొద్దున్నుంచీ అందరికీ దుర్వార్త చెప్పడానికి ఫోన్లు చేస్తే, ఇప్పుడేమో ఈ వార్త చెప్పడానికి మళ్ళీ అందరికీ చేయాల్సొస్తోంది. కథంతా చెప్పడం, రావద్దని అనడం… కానీ ఎంతమంది బయల్దేరిపోయారో”. వాడి భార్య శృతి కలిపింది. “ఫోన్లు చేస్తే మీకు సరిపోతుంది, మా సంగతి ఆలోచించండి. కబురు తెలియకుండా ఎంత మంది వస్తున్నారో… ఎంతమందికి వంట చేయాలో… రోజంతా చాకిరీ తోనే సరిపోతోంది….”.

okeoka prashna illusనడిపోడు కోపంతో మండిపడ్డాడు. “ఇదేం తమాషానో నాకర్థం కావడం లేదు. పిల్లలు బడికి వెళ్ళలేదు. మనం ఆఫీసులకి వెళ్ళలేకపోయాం. నా సంగతి ఆలోచించండి. ఇవాళ 11 గంటలకి నాకు ఓ ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉంది. అందులో నేను మా కొత్త ప్రాడక్ట్ డెమో ఇవ్వాలి. రెండు గంటల క్రితం ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పాను – మా నాన్న చచ్చిపోయాడని, మీటింగ్ వాయిదా వేయమని! వాళ్ళెలా మానేజ్ చేసారో తెలియదు. నాన్న బతికున్నాడని వాళ్ళకి తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు? డెమో తప్పించుకోడానికి ఇంత దారుణమైన నెపం ఎంచుకున్నానని అనుకోరూ? అసలు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని భయం వేస్తోంది” అంటూ నాకేసి చూసి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వాడి కళ్ళలో నాన్న చనిపోయాడన్న దుఃఖం కన్నా, ఉద్యోగం పోతే ఎలా అన్న భీతే ఎక్కువ కనబడుతోంది. ఇటువంటి పరిస్థితిలో చిక్కుకున్నందుకు నాకూ బాధగానే ఉంది. కాని జరిగిన దాంట్లో నా ప్రమేయం ఏముంది? ఆఁ, ఒక విషయంలో మాత్రం నా తప్పు ఉంది. నా ఈ కొడుక్కి నేను బతికే ఉన్నాన్రా అని చెప్పకపోవడం నా తప్పే! లేకపోతే నా అంతిమ సంస్కారాలు చేసేసి నువ్వు ఆఫీసులో నీ పొజీషన్‌కి ఏమీ ప్రమాదం రాకుండా చూసుకో, ఎలాగైనా నీ ఉద్యోగం కాపాడుకో అని చెప్పలేకపోయాను. ఇక ఆఖరివాడు కాలు కాలిన పిల్లిలా ఇంట్లోకి, బయటకి తిరుగుతున్నాడు. పోన్లే కనీసం వీడికైనా నాన్న అంటే అభిమానం ఉంది అనుకుని సంతోషించాను. వాడు ఈ రోజు కాలేజికి వెళ్ళలేదని, పాఠాలు పోయింటాయని అర్థమైంది.

ఈ గందరగోళంలో ఎవరు మాత్రం ఏం ఆలోచించగలరు? ఓటమిని ఒప్పుకుని కళ్ళు తెరిచేసరికి నా ముందు కొంతమంది బంధువులు దిగ్భ్రమ చెందుతూ నిలుచుని ఉన్నారు. వాళ్ళందరి ఆందోళన, దిగులు సరైనవే. వాళ్ళెవ్వరూ ఇప్పటిదాక, చచ్చినవాడు లేచి కూర్చోడం చూడలేదు. నేను నోరు తెరిచి పలకరించగానే వాళ్ళ సంతోషానికి అంతు లేకుండా పోయింది. వాళ్ళకి కలిగిన అసౌకర్యానికి నేను క్షమాపణలు కోరితే, వాళ్ళేమో నా జీవితంతో పోలిస్తే ఈ అసౌకర్యం పెద్దదేం కాదని అన్నారు. వాళ్ళకి కబురందగానే బయల్దేరి వచ్చారు, వాళ్ళు ఊహించినట్లు ఇక్కడేం జరగనందుకు సంతోషించారు. వాళ్ళందరి మాటలు వింటూ నేను పైకి లేచి ఒక్కొక్కరిని హత్తుకున్నాను. ప్రతీ ఒక్కరీ ఆలింగనపు అనుభూతి విభిన్నంగా ఉంది. కొందరిది గాఢంగా ఉంటే, మరికొందరి కేవలం మర్యాద కోసం అన్నట్లుంది. కొందరు సంతోషంతో కౌగిలించుకుంటే, ఇంకొందరు ఎగతాళిగా హత్తుకున్నారు. ఎన్నో ఏళ్ళుగా నాలో ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసిందీ కలయిక.

అప్పుడే నా కోడళ్ళ ఇబ్బంది నాకు గుర్తొచ్చింది. నిజమే. ఇంతమందికి వండి వడ్డించే భారమంతా పెద్ద కోడలిమీదే పడింది. పాపం వీళ్ళకి రోజూ తమ మొగుళ్ళకీ, పిల్లలకీ వండి పెట్టడమో గగనమైపోతోంది. నేను వెంటనే మా మేనల్లుడిని పిలిచి, వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి, ముందు వచ్చిన వాళ్ళకి టీ ఫలహారాలు ఏర్పాటు చేయమని, ఆ తర్వాత ఏదైనా హోటల్ నుంచి భోజనాలు తెప్పించమని చెప్పాను. ఈ మాటలు వినగానే కొందరు అభ్యంతరం చెప్పారు, అయినా, “మీరంతా భోజనం చేయాలి గదా, ఇప్పుడు బాధతో కాకుండా, సంతోషంతో తిందాం… నాకేమో చావు తప్పింది, మీకేమో ఈ చలికాలంలో చన్నీళ్ళ స్నానం తప్పింది” అని నవ్వుతూనే అన్నాను. అంతే, జనాలందరూ ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు.

నా సోదరీమణులిద్దరూ ముందుకు వచ్చి నా నోరు మూసారు. “పిచ్చి మాటలు మాట్లాడావో జాగ్రత్త. చచ్చేది నీ శత్రువులు. మేము కట్టిన రాఖీ దారాలు గట్టివి. మా ప్రార్థనలను దేవుడు ఆలకించాడు” అన్నారు. పెద్దక్క కొడుకుని పిలిచి, నేనిచ్చిన డబ్బులు తిరిగిచ్చేయమంది. ఖర్చంతా తను పెట్టుకుంటానంది. ఈ మాటలు విని నేను సంతోషం పట్టలేకపోయాను. మళ్ళీ ఇంకొంత డబ్బు తీసి చిన్న మేనల్లుడి చేతిలో ఉంచాను. “తొందరగా వెళ్ళండి. ఇద్దరూ కలిసి వెళ్ళి వచ్చిన వాళ్లందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేయండి” అంటూ బయటకి పంపాను.

లోపలగదిలోంచి కోడళ్ళ మాటలు వినబడుతున్నాయి. చిన్నావిడ పెద్ద కోడలితో వ్యంగ్యంగా అంటోంది. “వింటున్నావా అక్కా, ముసలాయనకి ఈ వయసులో కూడా జీవితం మీద ఎంత ఆశో. ఎప్పుడైనా జేబులోంచి పైసా తీసాడా? ఇవాళ చచ్చి బతికేసరికి పార్టీ చేసుకుంటున్నారు.”

“అవును, ఆయన చచ్చి బతికాడు, మనకి నరకం చూపిస్తున్నాడు. మా అమ్మానాన్నలూ ఉన్నారు, ఒకసారి చస్తే మళ్ళీ లేవలేదు. మళ్ళీ బతకడం అనే మాటే లేదు” అంది పెద్ద కోడలు.

వీళ్ళిద్దరి సంభాషణ ఇంటికొచ్చిన అతిథుల చెవిన పడే ఉంటుంది. నిజానికి వాళ్ళంతా వినాలనే వాళ్ళు అంత గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా బాధ వేసింది. కనీసం జనాలంతా వెళ్ళేవరకూ అయినా ఆగచ్చు కదా. నా మీద నాకు బాధ కలగడం లేదు, వాళ్ళిద్దరి పట్ల బాధ కలుగుతోంది. నా కోడళ్ళ వ్యవహారంపై నేను వేసి ఉంచిన తెరని వాళ్ళీ రోజు తొలగించేసారు. చచ్చి బతికానేమో గానీ, నావాళ్ళ ముందు ఉత్త వెధవనైపోయాను. దీనికి బదులుగా నిజంగా చచ్చిపోయినా, ఆ ఆఖరి కార్యం కాబట్టి కొడుకులు కోడళ్ళు సంతోషంగా చేసేవారేమో.

జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. భోజనాల ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. నేను చచ్చి బతికిన సంగతి మా వాళ్ళకి మరి కొందరికి తెలిసింది. ఇంటికొచ్చి పునర్జీవితుడనైందుకు నాకు అభినందనలు చెప్పారు. నన్ను కలవాలని, శుభాకాంక్షలు చెప్పాలని, అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఆరాటపడ్డారు. సాయంత్రమయ్యే సరికి నా మరో అనుమానం కూడా తీరిపోయింది. నా ఆఖరి కొడుకు పొద్దున్న అంత కంగారుగా ఎందుకు లోపలికి బయటకి తిరిగాడో అర్థమైంది. పొద్దున్నే తనని కలుసుకోడానికి ఎందుకు రాలేకపోయాడో గర్ల్‌ఫ్రెండ్‌కి ఫోన్‌లో గంటలకొద్దీ వివరిస్తున్నాడు వాడు. బహుశా ఆ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడుకోడానికి వాడు చోటు వెతుక్కున్నాడేమో. నేనేమో అదంతా నా మీద ప్రేమ అనుకుని మురిసిపోయాను.

రాత్రి నా గదిలో ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాను. చిన్నప్పుడు అమ్మ చెప్పేది – నేను పుట్టినప్పుడు మా ఉమ్మడి కుటుంబంలో – పెద్ద పండగలా ఉత్సవం జరుపుకున్నారట. వీధి వీధంతా మిఠాయిలు పంచారట తాతగారు. నేను పుట్టిన తర్వాత వచ్చిన భోగి పండగని ఘనంగా చేసుకున్నారట. నా పుట్టు వెంట్రుకలని నాన్న వైష్ణోదేవి ఆలయంలో తీయించారట. నన్ను బడిలో వేసిన రోజున బడి మొత్తానికి మిఠాయి బిళ్ళలు పంచారట. అలాంటిది నేనివాళ పునర్జీవితుడనైతే… నా వారసులే ఎంత బాధ పడుతున్నారు, ఎంత కృంగిపోయారు. వాళ్ళ మాటలింకా నా చెవిన పడుతూనే ఉన్నాయి.

నా దౌర్భాగ్యం చూడండి… పరమూ పోయిందీ, ఇహమూ పోయింది. అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను. చావు అనుభూతి గురించి నేను ఏవైతే చదివానో అవేవీ నా అనుభవంలోకి రాలేదు. అంత దీర్ఘ నిద్రలో నాకు ఏ తేజోపుంజమూ కనిపించలేదు. యమదూత గానీ, చిత్రగుప్తుడు కానీ, స్వర్గం కానీ నరకం కానీ… చివరికి భగవంతుడూ కనిపించలేదు.

మర్నాడు ఉదయం ఎప్పటిలానే ఐదు గంటలకి లేచి యోగాసనాలు వేయడానికి మేడ మీదకి వెళ్ళాను. అక్కడున్న వస్తువులని చూసి నివ్వెరపోయాను. అవన్నీ నా అంతిమ సంస్కారాల కోసం తెప్పించినవి. అంటే పాడె, శవం మీద కప్పే గుడ్డ, మట్టి కుండ, శాలువా.. మొదలైనవన్నీ భద్రంగా ఉంచబడ్డాయక్కడ. వాటిని తిరిగి ఇచ్చేయలేదు, బయట పడేయనూ లేదు… దీనికి ఎవరిని నిందించాలి? నా కుటుంబాన్నా, ఈ కొత్త తరాన్నా, ఈ గాలినా లేక నా అదృష్టాన్నా?

చావు అనుభూతి నాకెందుకిలా ఉంది? ఇంత దుఃఖభరితమూ, ఇంత భయానకమూ అని ముందే తెలుసుంటే ఆ అనుభవాన్ని కోరుకునేవాడినేకాదు. నేనా రోజే కాలుడిలో లీనమైపోయుంటే ఎంత బాగుండేదో, మళ్ళీ నా కళ్ళు తెరుచుకుంటే… నేను నా వారసుల దగ్గర కాకుండా కొత్త రూపంలో ఏ అమ్మానాన్నల ఒళ్ళోనో ఉండి ఉండేవాడినేమో. నన్ను పొందిన ఆనందంలో వాళ్ళు ఉత్సవాలు చేసుకునేవాళ్ళు, జాతకం చెప్పించుకునేవారు, రోజూ నాకు దిష్టి తీసేవారు. నన్ను తిడుతూండేవారు, దీవిస్తూ ఉండేవారు.

మరిప్పుడో… మేడ మీద పడున్న ఈ పాడె తదితర సామాన్లు, మా ఇంట్లో వాళ్ళ చూపులు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాయి… ఎప్పుడు చస్తావని?

*

మూల రచయిత్రి గురించి:

ritaa kashyap

కొత్త ఢిల్లీకి చెందిన రీతా కశ్యప్ ఆలిండియా రేడియోలో 30 ఏళ్ళు పనిచేసి స్వచ్ఛంద పదవీవిరమణ చేసారు. ‘వివశ్’, ‘జోడోం కీ తలాశ్ మే’ ఈవిడ కథా సంపుటాలు. ‘నియతి’ నవల. ‘మేరీ తౌబా’ హాస్యవ్యంగ్య రచనల సంకలనం. దాదాపు రెండు వందల కథలు రాసారు. వీరి కథానికలు, వ్యాసాలు, వ్యంగ్య కథనాలు మరెన్నో వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. బహుమతులు పొందాయి. కలం ద్వారా సమాజానికి కొత్త దిశని, కొత్త ఆలోచనలని అందివ్వాలనేది రీతా గారి లక్ష్యం. రచయిత్రి గురించి మరింత సమాచారం కోసం ఈక్రింది లింక్‌ని అనుసరించండి:

http://in.linkedin.com/pub/rita-kashyap/65/3a1/868

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, సెప్టెంబర్ and tagged , , , , , , , .

12 Comments

  1. “నేను చనిపోయాననుకుని ఇక్కడ ఇంతమంది చేరారే, కాని బతికి ఉన్న నాకోసం వాళ్ళల్లో ఎవరికీ రెండు నిముషాల సమయం లేదు. నా దౌర్భాగ్యం చూడండి… పరమూ పోయిందీ, ఇహమూ పోయింది. అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను.

    నేనా రోజే కాలుడిలో లీనమైపోయుంటే ఎంత బాగుండేదో, మళ్ళీ నా కళ్ళు తెరుచుకుంటే… నేను నా వారసుల దగ్గర కాకుండా కొత్త రూపంలో ఏ అమ్మానాన్నల ఒళ్ళోనో ఉండి ఉండేవాడినేమో. నన్ను పొందిన ఆనందంలో వాళ్ళు ఉత్సవాలు చేసుకునేవాళ్ళు, జాతకం చెప్పించుకునేవారు, రోజూ నాకు దిష్టి తీసేవారు. నన్ను తిడుతూండేవారు, దీవిస్తూ ఉండేవారు “

    గుండె బరువెక్కించిన కధ. ధన్యవాదాలు సోమ శంకర్ గారు.

  2. Pingback: ఒకే ఒక ప్రశ్న

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.