naipaul

రచన కళ – వి.ఎస్. నయీపాల్

Download PDF    ePub  MOBI

భారతీయునిగా మనకు చెందుతూనే మనకు చెందని రచయిత సర్ వి.ఎస్. నయీపాల్. ఈ చెందుతూనే చెందకపోవడమనేది మన వైపు నుంచి ఆయనకే కాదు, ఆయన వైపు నుంచి మనకు (భారతదేశానికి) కూడా వర్తిస్తుంది. నయీపాల్ కుటుంబం ఆయన తాతల కాలం లోనే బ్రిటిష్ పాలిత భారతదేశాన్ని వదిలి ట్రినిడాడ్ ద్వీపానికి వెట్టి కూలీలుగా వలస వెళ్లింది. నయీపాల్ 1932లో పుట్టారు. 17 ఏళ్ళ వయస్సులో ప్రభుత్వ స్కాలర్‌షిప్ మీద ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకోవడానికి లండన్ వెళ్ళారు. ఇక తర్వాత అక్కడే రచయితగా స్థిరపడ్డారు. ట్రినిడాడ్‌లో పుట్టిన భారతీయునిగా, ఇంగ్లాండులో స్థిరపడిన ట్రినిడాడ్ దేశస్తునిగా నయీపాల్ వలస నేపథ్యం ఆయన మానసిక ప్రపంచాన్ని జీవితమంతా శాసిస్తూనే ఉంది. ఆయన రచనల్లో సింహభాగం ఆ నేపథ్యం నుంచి పుట్టినవే. వాటిలో “హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్” అనే నవల చాలా ప్రసిద్ధికెక్కింది. పదిహేను నవలలూ, అంతకుమించిన సంఖ్యలో నాన్-ఫిక్షన్ పుస్తకాలూ రాశారు. 2001లో నోబెల్ సాహిత్య బహుమతి తీసుకున్నారు. చూట్టానికి నెమ్మదస్తునిలా కనిపించినా, వ్యక్తిగత జీవితంలో వివాదాస్పదునిగా పేరుపడ్డారు. ఆ మధ్య వెలువడిన ఒక బయోగ్రఫీలో తన గురించి తనే వెల్లడించుకున్న కొన్ని నిజాల్ని చివరకు అంతా ఆయన మీదకే ఎక్కుపెట్టారు. లౌక్యం లేని ముక్కుసూటి ధోరణిలో ఈ మధ్య స్త్రీ రచయితలపై చేసిన విమర్శలు (వాళ్ళ రచనలు మగ రచయితల రచనలతో పోలిస్తే చాలా పేలవంగా ఉంటాయన్న మాటలు) చాలా తీవ్రమైన ప్రతిస్పందనలకు కారణమయ్యాయి.
ఆయన 1994లో ‘పారిస్ రివ్యూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంత భాగం ఇది:
పదిహేడేళ్ళ వయస్సులో స్వదేశం ట్రినిడాడ్‌ను వదిలి, లండన్ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో అడుగుపెట్టారు. చిన్నదైన ప్రపంచం నుంచి ఒక్కసారిగా విశాలమైన ప్రపంచంలోకి వచ్చిపడ్డారు. కానీ మీకు తెలిసిన ప్రపంచంలో ముఖ్యాంశమైన వలసవాదమే, విశాలమైన పాశ్చాత్య ప్రపంచాన్ని కూడా కదిలిస్తున్న అంశమని తెలిసినపుడు మీకు ఎలా అనిపించింది. అది మీ రచనల్ని పై ఎలాంటి ప్రభావం చూపించింది?

నేను చాలా కాలంగా రాస్తున్నాను. మొదట్లో నా రచనల పై ఎవరూ ఆసక్తి చూపించే వారు కాదు, కాబట్టి నన్ను కదిపే సొంత విషయాల గురించే రాసుకునేవాణ్ణి. వాటికీ, సమకాలీన ప్రపంచాన్ని కదిలిస్తున్న అంశాలకీ ఏమన్నా సంబంధం ఉంటే అది యాదృచ్ఛికమే. అప్పటికి నాకా సంగతి తెలీదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నా సాహిత్యంలో రాజకీయ స్పృహ లేదు, అది ఏ వాదానికీ ప్రాతినిధ్యం వహించదు. అలా రాసి ఉంటే ఎప్పుడో 1950ల్లో రాసిన ఆ రచనలకు ఇప్పుడు అన్వయం లభించక చచ్చూరుకునేవి. ముందు ఎవరి పరిస్థితిని వారు లోతుగా చూసుకోగలగాలి — అపుడదే సార్వజనీనమవుతుంది.

పాఠకులు మీ వైపుకు ఆలస్యంగా వస్తున్నారన్నారు: ప్రపంచం ఎట్టకేలకు మిమ్మల్ని అందుకోగలుగుతోందంటారా? ఇది పాఠకులలో వచ్చిన మార్పా? లేక ప్రపంచంలో వచ్చిన మార్పా?

ప్రపంచంలో వచ్చిన మార్పే. నేను రాయటం మొదలుపెట్టినపుడు, ప్రపంచంలో కొన్ని ప్రాంతాలే రాయటానికి అర్హమైనవన్న దురభిప్రాయం చెలామణీలో ఉండేది. నా పుస్తకం “లాస్ ఆఫ్ ఎల్‌డొరాడో” మీకు తెలిసే ఉంటుంది. అందులో స్థానిక వలసదారుల గురించి విస్తారమైన పరిశోధన ఉంటుంది. అది పుస్తకంగా వచ్చినపుడు లండన్ లో ఒక ప్రసిద్ధ న్యూస్ పేపర్‌కి చెందిన సాహితీ సంపాదకుడు నాతో – అందులో నవల రాసేంత పెద్ద విషయమేం ఉందీ, వ్యాసం రాస్తే సరిపోయేది కదా అన్నాడు. అతని మూర్ఖత్వం సంగతి తర్వాత; దీన్ని బట్టి అప్పటి ప్రపంచం ఎలా ఉండేదో, అప్పటికీ ఇప్పటికీ దాన్లో ఎంత మార్పు వచ్చిందో పసిగట్టవచ్చు.

మీరు రాసే సొంతానికి ఓ చోటంటూ లేని వలస భావన గురించి ఇప్పుడు ప్రపంచం మరింత బాగా అర్థం చేసుకోగలుగుతోందంటారా?

ఇపుడు ఎటువైపు చూసినా అదే భావన వ్యాపించి ఉంది కదా. ఏ మాత్రం కలుషితం కాని విశుద్ధ సంస్కృతులనేవి జనం ఊహల్లో తప్ప నిజంగా ఎక్కడా లేవు. నిజానికి అలాంటివి ఎప్పుడూ లేవు. అనాదిగా సంస్కృతులనేవి ఒక దాంట్లో ఒకటి కలుస్తూనే ఉన్నాయి. … గుంపుల రాకడా పోకడా జరుగుతూనే ఉంటుంది; ప్రపంచం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది.

అలాంటి కలబోసిన ప్రపంచాలకు మిమ్మల్ని మీరొక ప్రతినిధిగా చూసుకుంటారా?

అలా అనుకోను. నేను ఏ పుస్తకం రాసేటప్పుడు ఆ పుస్తకం గురించే ఆలోచిస్తాను. మొదట పుస్తకం పూర్తి చేయటం మనకు ముఖ్యం: ఆ అవసరం చల్లారటానికి రాస్తాం, బతుకుతెరువుకి రాస్తాం, పోయాకా మన వెనక ఓ సరైన వృత్తాంతాన్ని మిగల్చిపోవటానికి రాస్తాం, ఏది అరకొరగా మిగిలిపోయిందనుకుంటామో దానికి పరిపూర్ణతనివ్వడం కోసం రాస్తాం. నేను ఎవరికీ ప్రాతినిధ్యం వహించటం లేదు. నా ప్రాతినిధ్యాన్ని ఎవరైనా కోరుకుంటారని కూడా అనుకోను.

మీరు 1950లో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకోవటానికి ట్రినిడాడ్ వదిలి బయల్దేరారు – సముద్రాన్ని దాటి గొప్ప ఆకాంక్షల సాకారానికై అపరిచిత నేల మీద అడుగుపెట్టారు. దేని కోసం మీ వెతుకులాట?

నేను బాగా పేరు సంపాదించాలనుకున్నాను. రచయిత కావాలనుకున్నాను – రచయితగా పేరు సంపాదించాలనుకున్నాను. ఈ ఆశలోని వెర్రితనం ఏమిటంటే, అప్పటికింకా ఏం రాయాలనుకుంటున్నానో కూడా నాకు తెలియదు. రాయాల్సిన ఇతివృత్తం కన్నా చాలా ముందే రాయాలన్న ఆశ పుట్టేసింది. సినిమా దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఒకసారి నాతో చెప్పాడు, ఆరేళ్ళ వయసొచ్చేసరికే తాను సినిమా దర్శకుడు కావాలనుకున్నాడట. నేను అంత ఆరిందాను కాదు గానీ – పదేళ్ళ వయసొచ్చేసరికి రచయిత కావాలనుకున్నాను.

వలసవాద ప్రభుత్వం  ఇచ్చిన స్కాలర్‌షిప్ మీద ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్ళే అవకాశం లభించింది. దాని ప్రకారం నేను ఏ వృత్తయినా ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే డాక్టరో ఇంజనీరో కావచ్చు, కానీ నేను ఇంగ్లీషు ఎంచుకున్నాను. అది ఇంగ్లీషనో, ఆక్స్‌ఫర్డ్ అనో కాదు, అది ట్రినిడాడ్‌కి చాలా దూరంగా ఉందన్న ఒక్క కారణం సరిపోయింది నాకు. అక్కడ ఉండే మూణ్ణాలుగేళ్ళలోనూ నా గురించి నాకు ఎంతో తెలిసిపోతుందనుకున్నాను. నా ఇతివృత్తమేదో నాకు దొరికేసి, నేను ఉన్నట్టుండి ఒక రచయితనైపోతానూ అనుకున్నాను. ఏదో ఒక వృత్తి విద్యని ఎంచుకోవడం మానేసి, ఈ ఎందుకూ కొరగాని ఇంగ్లీషుని ఎంచుకున్నాను. దానికి ఏ విలువా లేదు.

కానీ నాక్కావాల్సింది ట్రినిడాడ్ నుంచి బయటపడటం. అక్కడి వలస జీవితపు నేలబారుతనమూ, కరుకైన నైతిక కొలమానాలతో మనుషుల్ని అంచనాకట్టే కుటుంబ కలహాలూ (ఇది నా భారతీయ హిందూ కుటుంబ నేపథ్యానికి సంబంధించింది) వీటితో చాలా విసిగిపోయి ఉన్నాను. అటు వలస జీవితంలోనూ, ఇటు హిందూ జీవితంలోనూ నాకు ఎలాంటి ఔదార్యమూ కనపడలేదు. మనుషుల్ని ఎలా ఉన్న వాళ్ళని అలా స్వీకరించగలిగేదీ, వాళ్ళని వాళ్ళుగా మెచ్చుకోగలిగేదీ అయిన మరో విశాలమైన ప్రపంచపు ఊహ నన్ను ఊరించేది.

అంటే కుటుంబ నేపథ్యంతో నిమిత్తం లేకుండానా?

అవును. మనిషి అనునిత్యం నైతిక తీర్పుల బరువు మోయనక్కర్లేని ప్రపంచాన్ని కోరుకున్నాను. అలాంటి చోటున జనం మనల్ని మనలాగానే చూస్తారు, వింటారు. ఇంగ్లాండులో నిజంగానే అలా జరిగింది – అక్కడ మనుషుల్ని స్వీకరించే పద్ధతిలో మరింత ఔదార్యం ఉంది, ఇప్పటికీ ఉంది.

ఆక్స్‌ఫర్డ్ లో అనుభవం ఆనందకరమేనా?

నిజం చెప్పాలంటే ఆక్స్‌ఫర్డ్ ని అసహ్యించుకున్నాను. నాకు ఆ డిగ్రీలన్నా, ఆ యూనివర్శిటీ వాతావరణమన్నా వెగటు. అప్పట్లో దాని కోసం అవసరమైన దాని కన్నా ఎక్కువగా సన్నద్ధమయ్యాను. నా తోటి విద్యార్థులందరికన్నా నేను ఎన్నో రెట్లు తెలివైనవాణ్ణి. ఇదేం గొప్పలు పోవడం కాదు, మీకూ తెలుసు – దీన్ని కాలమే ఋజువు చేసింది. ఒకరకంగా, నేను బయటి ప్రపంచం కోసం మరీ ఎక్కువగా సన్నద్ధమయ్యాను; ఆక్స్‌ఫర్డ్‌ వాతావరణంలో ఒకలాంటి ఒంటరితనం, నిరాశా ఉన్నాయి. ఆ బాధ ఎవరూ పడాలని కోరుకోను.

మీరు ట్రినిడాడ్‌లోనే ఉండిపోతే ఏమయ్యుండే వారోనని ఎప్పుడన్నా ఆలోచిస్తారా?

ఆత్మహత్య చేసేసుకునేవాణ్ణి. …

ఆ తొలి జీవితపు గాయాలు ఇప్పటికీ బాధపెడతాయా?

అక్కణ్ణించి బయటపడ గలిగినందుకు నేనెంత అదృష్టవంతుణ్ణో అనుకుంటూ ఉంటాను. ఆ కూపస్థ జీవితం ఎంత భయంకరమైందో తలుచుకుంటూ ఉంటాను. వాటి గురించే పదే పదే ఆలోచించడం ద్వారా చాలా గాయాలు మానిపోయాయి. పూర్తిగా నాశనమవకుండా బయటపడగలగటం నా అదృష్టమే. బయటపడ్డాకా ఇక తర్వాతంతా పనికి అంకితమైన జీవితం, కృషిలో నిమగ్నమైన జీవితం.

రచన మీ జీవితానికి అంత ముఖ్యావసరంగా, ఒక విముక్తి మార్గంగా, ఎందుకయ్యింది?

అది ఒక సాధించాల్సిన లక్ష్యంగా నా ముందు ఉంచబడింది. బహుశా నేను నా తండ్రి అడుగుజాడల్లో నడిచి ఉంటాను; ఆయన కూడా రచయితే – నిజానికి జర్నలిస్టు, కానీ కథలు కూడా రాసేవాడు. ఇది నాకు చాలా ఉపయోగపడింది. నా తండ్రి మా హైందవ సంస్కృతి నేపథ్యాన్ని తన కథల్లో విశ్లేషించాడు. ఆయన దాన్ని చాలా క్రూరమైన నేపథ్యంగా చూశాడు, ఆయన కథలు చదివి నేను ప్రపంచాన్ని ఒక క్రూరమైన స్థలంగా అర్థం చేసుకున్నాను. వయసు పెరిగే కొద్దీ నాకు అర్థమైందేమిటంటే: మనం ఎప్పుడూ బయటే ఒక శత్రువుని ఊహించుకోవటానికి సిద్ధపడిపోకూడదు, ముందు మనలోకి మనం చూసుకోవాలి, మన బలహీనతల్ని చూసుకోవాలి. ఇంకా దాన్నే నమ్ముతాను.

రచన ఒక్కటే పవిత్రమైన వ్యాసంగమని ఒక చోట అన్నారు మీరు…

అవును, నా వరకూ అదొక్కటే పవిత్రమైన వ్యాసంగం. ఎందుకంటే అది సత్యంతో ముడిపడిన వ్యాసంగం కాబట్టి. రాసేటప్పుడు మన అనుభవాలకు దగ్గర జరగాల్సి ఉంటుంది. ఆ అనుభవాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రపంచాన్నే అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. రచన అంటే మరింత లోతైన అవగాహన వైపు నిర్విరామ పరిశ్రమ. అంతకన్నా పవిత్రమైంది ఇంకేముంటుంది.

మీరు రాయటం ఎప్పుడు ప్రారంభించారు?

small1949లో ఒక నవల రాయటం ఆరంభించాను. దాని ఇతివృత్తం ప్రహసనం లాంటిది. ఒక నల్లజాతీయుడు తనకు తాను ఒక ఆఫ్రికన్ రాజు పేరు ఇచ్చుకుంటాడు. ఈ ఊహ ప్రాతిపదికగా నవల అల్లాలనుకున్నాను. కానీ కుర్రతనపు అనుభవలేమి వల్ల ఆ నవల రెండేళ్ల పాటు నత్తనడక నడిచింది. నేను ఇల్లు విడిచి వచ్చే ముందు కొంత రాశాను, తర్వాత ఆక్స్‌ఫర్డ్ లో దొరికిన పెద్ద సెలవు విరామంలో మిగతాది పూర్తి చేశాను. అది పూర్తయినపుడు చాలా సంబరపడ్డాను, ఒక పెద్ద పుస్తకం పూర్తి చేసిన అనుభవం కదా. కానీ అదెప్పుడూ ప్రచురితం కాలేదు.

తర్వాత కొన్నాళ్ళకి ఆక్స్‌ఫర్డ్ నుంచి బయటపడి, జీవితంలో నిలదొక్కుకోవటానికి నానా కష్టాలూ పడుతున్నపుడు, చాలా గంభీరమైన నవల ఒకటి రాయటం మొదలుపెట్టాను. అరువుతెచ్చుకున్నది గాక, నటన గాక, నా సొంత గొంతేమిటో వెతుక్కునే ప్రయత్నమది, నన్ను నేను కనుక్కునే ప్రయాస అది. ఆ నవల తాలూకు గంభీరమైన గొంతు నన్ను దిగులు అగాథాల్లోకి నెట్టేసింది, అలాగా కుంటుతూ కొన్నాళ్ళు సాగింది, చివరకు దాని రాతప్రతి చదవమని ఇస్తే ఒకతను ఇక అక్కడితో వదిలేయమన్నాడు, అప్పటిదాకా రాసింది పరమ చెత్త అన్నాడు; నాకతన్ని చంపేయాలనిపించింది, కానీ అతను చెప్పింది అక్షరాలా నిజమన్న సంగతి నా అంతరంగంలో నాకూ తెలుసు. తర్వాత కొన్ని వారాలు సర్వం కోల్పోయినవాడిలా దిగాలుగా గడిపాను, అప్పటికే ఇంగ్లాండు వచ్చి ఐదేళ్ళు గడిచిపోయింది, సాధించింది ఏమీ లేదు. అప్పట్లో రాయాలన్న కాంక్ష ఒక ప్రాణావసరంలా ఉండేది. రచనే నా బతుకుతెరువని అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాను – నా జీవితాన్ని దానికే అంకితం చేసేశాను. అప్పుడొకటి జరిగింది: అలా దిగుల్లో పడి కొట్టుమిట్టాడుతుండగా, నాకు నా సొంత గొంతు తట్టింది. చివరకు ఆ గొంతే నా రచనకు ఇతివృత్తమైంది; ఈ ప్రేరణ వెనుక రెండు సాహితీ మూలాలున్నాయి. ఒకటి నా తండ్రి రాసిన కథలు, రెండోది 1554లో ప్రచురితమైన మొట్టమొదటి పికారెస్క్ స్పానిష్ నవల ‘లాజరిల్లో టోర్మెస్’. ఇదో చిన్న పుస్తకం, స్పెయిన్ రాజ్యంలో ఒక పేద పిల్లాడి బాల్యానుభవాలు దీని ఇతివృత్తం, ఈ రచనలో వాడిన గొంతు నాకు చాలా నచ్చింది. ఈ రెండు సాహితీ మూలాల్నీ ముడేయగా పుట్టిన కొత్త గొంతు అచ్చంగా నా స్వభావానికి అతుకుతుందనిపించింది: అలా ఈ రెండు వేర్వేరు మూలాల్నించి ఒక శుద్ధమైన, స్వచ్ఛమైన, నా దైన గొంతు ఒకటి ప్రాణం పోసుకుంది.

ఈ నవలేగా తర్వాత ‘మిగుయెల్ స్ట్రీట్’గా బయటకు వచ్చింది. ఈ నవలతో పాటూ, ‘మిస్టిక్ మెస్యూర్’ అనే మరో నవల కూడా మీరు 1955 కు ముందే పూర్తి చేశారు. కానీ మీ మొదటి పుస్తకం పబ్లిష్ కావటానికి 1957 దాకా ఆగాల్సి వచ్చింది కదూ.

నా జీవితం చాలా గడ్డుగా గడిచేది. మనం యుక్త వయసులో ఉన్నపుడు, దిక్కులేని నిరుపేద బతుకు బతుకుతున్నపుడు, మన ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పాలని పరితపిస్తున్నపుడు, రెండేళ్ళ ఎదురుచూడటమంటే చాలా కష్టం. చాలా హింస పడ్డాను. అటువంటి పరిస్థితుల్లో, ‘ద మిస్టిక్ మెస్యూర్’ ఎట్టకేలకు ప్రచురితమైంది, కానీ నేను పని చేసే పత్రికే దాన్ని తూర్పారబట్టింది (అప్పట్లో ‘న్యూ స్టేట్స్‌మన్’కి పని చేసేవాణ్ణి). తర్వాత చాలా పేరు గడించిన ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ ఒకాయన నా నవలను ‘వలస ద్వీపం నుంచి వెలువడిన చిరు వంటకం’గా అభివర్ణించాడు. దాని వెనక ఏ శ్రమా లేనట్టు.

బహుశా మిమ్మల్ని ముందుకు నడిపించింది మీ మీద మీకున్న నమ్మకమే అయ్యుంటుంది.

అవును, నన్ను నేను ఎప్పుడూ సందేహించుకోలేదు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నా నుదుట రాసి ఉన్నది రచనే అన్న భావనలో ఉండేవాణ్ణి.

మీ మొదటి నవల పబ్లిష్ అవుతుండగానే, మీరు మీ ‘ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’ రాయటం మొదలుపెట్టారు కదూ.

అవును. ఒక ఇతివృత్తం కోసం ఆరాటంగా వెతుకుతున్నాను. కానీ నిరాశాజనకమైన పరిస్థితి. ఎంత అపనమ్మకంలో ఉన్నానంటే, ఆ నవలను పెన్సిల్ తో రాయటం మొదలుపెట్టాను. మా నాన్నలాంటి ఒక మనిషి కథ అది, తన జీవితపు చరమాంకంలో తన చుట్టూ పేరుకున్న వస్తు సమూహం వంక చూస్తూ, అవన్నీ అసలు తన జీవితంలోకి ఎప్పుడు ఎలా వచ్చి పడ్డాయా అని ఆలోచిస్తూ ఉంటాడు. మొదట్లో చాన్నాళ్ళ పాటు ఏ ప్రేరణా లేకుండా వట్టి భౌతిక శ్రమ లాగా రాసుకుంటూ పోయాను – అలా ఒక తొమ్మిది నెలలు సాగింది.

రోజూ రాసేవారా?

రోజూ సాగేది కాదు. ఎందుకంటే, మనకి ప్రేరణ లేనపుడు చేసే పనులన్నీ బరువైన గుండెతో చేసుకుంటూ పోతాం. పైగా అప్పట్లో నేను సమీక్షకునిగా నిలదొక్కుకునే ప్రయత్నంలో కూడా ఉన్నాను. ఎవరో నన్ను ‘న్యూ స్టేట్స్‌మన్’ పత్రికకు సిఫారసు చేశారు. ఆ పత్రిక వాళ్ళు అడపాదడపా సమీక్ష చేయమంటూ పుస్తకాలు పంపించేవారు. కానీ నేను ఆ అవకాశాన్ని మరీ అపురూపంగా భావించటం వల్లనో ఏమో, నా సమీక్షలన్నీ విఫలమయ్యేవి. తర్వాత వాళ్లు జమైకా గురించి కొన్ని పుస్తకాలేవో పంపించారు. అదిగో అప్పుడు ఒక మెత్తనైన సులువైన గొంతొకటి నాకు అలవడింది. అప్పట్లో నాకు అది పెద్ద విజయమే – పుస్తకాన్ని పాఠకుని కళ్ళ ముందు ఒక ఖచ్చితమైన వాస్తవంలా నిలపగలిగే చిన్న చిన్న ఆసక్తికరమైన సమీక్షలు రాయటం ఎలాగో నేర్చుకున్నాను. ఈలోగా నెమ్మదిగా నా నవల ఊపందుకోవటం మొదలైంది, తర్వాత ఇక అంతా సాఫీగానే సాగిపోయింది. ప్రతీ నాలుగు వారాల్లోనూ మూడు వారాలు నవలకే కేటాయించసాగాను. నా ముందు రూపుదిద్దుకుంటోన్నది ఒక గొప్ప రచన అని నాకు త్వరలోనే అర్థమైపోయింది. నాకు కలిగిన ఆనందం అంతా యింతా కాదు. యుక్త వయస్సులోనే అంత ఘనమైన రచనపై పని చేస్తానని ఊహించలేదు. ఎందుకంటే, అది మొదలవటం చాలా చిన్నగా మొదలైంది, పైగా ఎంతో సాధన పూర్తయితే తప్ప గొప్ప రచనకు ఉపక్రమించలేం అనుకునేవాణ్ణి. ఎవరైనా నన్ను వీధిలో ఆపి, ‘ఓ మిలియన్ పౌండ్లు నీకు ఇస్తాను, కానీ ఒక షరతు: నువ్వు ఆ నవలను పూర్తి చేయకూడదు,’ అన్నా కూడా అవతలకుపొమ్మనేవాణ్ణి. పుస్తకం పూర్తి చేసి తీరాలన్నదొక్కటే నాకు తెలిసింది.

ఆ పుస్తకానికి ఎలాంటి స్పందన వచ్చింది?

అది ప్రచురితమైన క్షణం నుంచీ మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు ఏమైనా చెప్పొచ్చు, పుస్తకం బయటకు రాగానే జనం రద్దీగా బారులు తీరారూ అనొచ్చు, ఎవరూ బారులు తీరలేదు. పుస్తకాన్ని గమనించి ప్రపంచం చకితమై గభాల్న లేచి నిలబడిందీ అనొచ్చు, ప్రపంచం లేచి నిలబడలేదు. నా అంతకుముందరి పుస్తకాల్లాగే అది నెమ్మదిగా తక్కుతూ తారుతూ కదిలింది, నిలదొక్కుకోవటానికి కొంత సమయం పట్టింది.

*

(Image Courtesy: http://www.flickr.com/photos/30453880@N04/4059495002)

రచన కళ / నయీపాల్ – Download PDF     రచన కళ / నయీపాల్ – Download ePub   రచన కళ / నయీపాల్ – Download MOBI

Posted in 2013, డిసెంబరు, రచన కళ and tagged , , , , , .

2 Comments

  1. రమాసుందరి గారు,

    ఆలస్యంగా మీ కామెంటు చూశాను. “రచన కళ” పేరిట రచయితలు తమ క్రాఫ్ట్ గురించి మాట్లాడిన సందర్భాల్ని అనువదించాలని నా ఉద్దేశం. అందుకనే పారిస్ రివ్యూ ఇంటర్వ్యూలో ఆయన ఆ కోవలో మాట్లాడిన మాటల్ని మాత్రమే ఎంచుకుని అనువదించాను. నయీపాల్ ని సమర్థించాలనేం నాకు లేదు గానీ, రచయితల రాజకీయ అభిప్రాయాలు చాలా సందర్భాల్లో misinformed అయి ఉంటాయి. వాళ్లు రాజకీయ ప్రకటనలు చేయటం కుక్క పని గాడిద చేయటం లాంటిదే. అని నా అభిప్రాయం. ఊండెడ్ సివిలైజేషన్ నా దగ్గర ఉంది గానీ, చదవలేదు. That’s not the side that interests me in Naipaul.

  2. ఈయన రాసిన ఊండెడ్ సివిలైజేషన్ పుస్తకం గురించి ప్రస్తావించక పోవటం యాధృచ్చికమా? బాబ్రీ విధ్వంసం ఒక ‘సృజనాత్మక ఆవేశం’ గా ఈయన వర్ణించడం “లౌక్యం లేని ముక్కుసూటితనమేనా?”

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.