cover

ఉదయం

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 14వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన ఇక్కడ చూడండి.)

Download PDF ePub MOBI

వర్షాకాలం…

మాకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం, ఎన్నో ఆదివారాలను కల్పించే కాలం.

మా స్కూల్ ఒక పురాతన కట్టడం, చినుకు పడితే చిత్తడే !

అలాంటిది వర్షాకాలమొస్తే… అంతా వరదే

దాంతో మాకు కృత్రిమ ఆదివారాలు… ఆనందాలు

*  *  *

కాని అలాంటి ఒక అందమైన రోజు నా జీవితాన్నే మార్చేసింది. అది శనివారం, వర్షం కారణంగా మధ్యాహ్నం నుండి శెలవు ప్రకటించారు. నేను ఎంతో ఉల్లాసంతో వానలో తడుస్తూ, సైకిల్ పై ఇంటికి బయలుదేరా.

రోడ్డుపై వున్న చిన్న గుంతను తప్పించబోయి, ప్రక్కనే చేలకు కంచెగా కట్టిన ముళ్లలోకి దూసుకుపోయాను.

ఒల్లంతా ముళ్లు, సైకిల్ టైర్ పంక్చర్, బోరున వాన పట్టించుకొనే నాథుడు లేడు, ఎలాగో కాల్లీడ్చుకొని ఇంటికి చేరాను. అమ్మ ఇచ్చిన టీ తాగి, డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుని, తమ్ముడితో కబుర్లు చెబుతూ నిద్రపోయా

తెల్లవారింది

ఆదివారం… ఆరుయుగాల నిరీక్షణ

టిఫిన్ తిని పక్కింటికి బయలుదేరా

“9 గంటలకు వెళ్లి సీనుగాడి కొట్టు దగ్గర పాచ్చి ఏయించు” నాన్న.

“ఉమ్ డబ్బులు”

“నేనిస్తా గానీ పాచ్చి వేయించుకోకుండా రేపీ వొంకతో స్కూల్ మానావా…”

“వెళ్తాను”

సైకిల్ తీసుకుని శీనుమాయ కొట్టుకి బయలుదేరా.

“ఏరోయ్! క్రికెట్ ఆడదాం రా!” అంటూ ఒకచేతిలో కొబ్బరి మొత్త , రెండవ చేతిలో రబ్బరు బంతి పట్టుకుని నా మిత్రబ్రృందం క్రీడా భూమికి బయలుదేరింది .

ఈ రోజంతా ఖాళీ, ఎప్పుడైనా ‘పాచ్చి’ వేయించుకోవచ్చని, సైకిల్ పక్కన పెట్టి ఆటలో నిమగ్నమైపోయాను.

గంట తర్వాత “అన్నయ్య సైకిల్ షాప్ కెళ్లవా?” తమ్ముడు కంఠంలో కంగారు నాకు అర్థమైంది.

“మరో గంట ఆగి వెల్తా”

“నాన్న కోపంగా ఉన్నారు త్వరగా వెళ్ళు”

‘నాన్న ఎప్పుడు కోపంగాలేరు!? ముఖంలో ప్రశాంతతచూసిన రోజు లేదు, ఎప్పుడూ మా మీద, అమ్మ మీద అరుస్తూ ఉంటారు. అధికారం చెలాయిస్తూ, ఆంక్షలు విధిస్తూ హింసిస్తుంటారు.’ ఒక్కక్షణం మానాన్న గురించి తలచుకుని మళ్లీ ఆటను కొనసాగించాను .

ఐదు నిమిషాలు గడవకముందే తమ్ముడు నాన్న పిలుస్తున్నారు రమ్మన్నాడు.

ఇద్దరం సైకిల్ నడిపించుకుంటూ ఇంటికి బయల్దేరాం.

అరుగు మీద అడుగు పెడుతున్న సమయంలో చూశా మా నాన్నని ఆయన చేతిలో ఉన్న దుడ్డుకర్రనీ.

సిక్స్త్ సెన్స్ లేకపోయినా కామన్ సెన్స్ బాగ పనిచేసింది .

మరుక్షణం నా కాలికి బుద్ధిచెప్పా… నాన్న నన్ను తరుముకుంటూ వస్తున్నారు నా మీద అంత కసి ఏంటో నాకు అర్థం కాలేదు. కరెంట్ పోవడంతో అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఈ సన్నివేశమే దృష్టి మరల్చకుండా చూస్తున్నారు.

నాన్న నన్ను చేరుకుంటారనగా, నేను చూసిన సినిమాలు నాకొక మార్గాన్ని చూపించాయి. వెంటనే స్పృహ తప్పినట్లు నటించి రోడ్డుమీద పడిపోయాను. కాని, మా నాన్నా సినిమాలు చూస్తారన్న చిన్న తర్కం నేను మర్చిపోయాను. వరసగా నాలుగు దెబ్బలు నా వీపును విమానం మోత మోగించాయి. అమ్మ దేవతలా వచ్చి ఈ రాక్షసుడి బారి నుంచి తప్పించింది. ఇద్దరూ కలసి నన్ను ఇంటికి తీసుకువచ్చారు కాదు మోసుకొచ్చారు .

సాయంత్రం:

“ఏం కూర తెమ్మంటావు?” నాన్న

“ఏదోటి తగలెయ్యండి” అమ్మ మాటల్లో నా పట్ల జాలి, ఆయనగారి పట్ల కోపం స్పష్టంగా కనిపిస్తుంది.

నాన్న విసురుగా బజారుకెళ్లిపోయారు…

నాకు పెద్దగా దెబ్బలేమీ తగలలేదు కానీ, ఎందుకో నాన్నని ఇంకా తిట్టించాలనిపించింది. ఎందుకంటే ఆయన ఆ అవకాశం ఎవరికి ఇవ్వడు. తప్పు చెయ్యడు చేస్తే ఊరుకోడు. కానీ ఈ రోజు ఆయన చేసింది…!

ఆ విధంగా ఆలోచన రాగానే నేను మా నాన్నగారి గురించి ఆలోచించడం మొదలుపెట్టా.

ఇప్పటి వరకూ నాకూ తమ్ముడికీ ఏ లోటూ రానీయలేదు, అడిగినవి కాదన్న సందర్భంలేదు. అవసరమైనవన్నీ అడగ కుండానే సమకూర్చుతారు. కొంచెం కోపం ఎక్కువ తప్పితే మరే లోపంలేదు. లోపం? మేం సరిగ్గా ఉంటే ఆయనకు కోపం ఎందుకొస్తుంది. చెప్పిన పని పూర్తి చేయకుండా బానిసతో పోల్చుకోవడం ఏమిటి? చెప్పేది నా మంచికోసమేగా?

ఇప్పట్నుంచీ నాన్న చెప్పిన పనులన్నీ చేసేస్తా. నా కన్నా చిన్నవాడయినా వాడే తెలివైనవాడు, కాబట్టే నాన్నను అర్థం చేసుకొని చేసుకొని మసులుతున్నాడు .

“ఏరా నాన్న కొట్టారని బాధపడుతున్నావా?” అన్న అమ్మ మాటలు నా ఆలోచనలను అక్కడితో ఆపేసాయి .

“.. .. ..”

“నిన్ను కొట్టానన్న బాధతో ఆయన మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు”

“పాపం! భోజననానికి కొంచెం ఆలశ్యమైతే తట్టుకోలేడు, మీ తాతయ్య దగ్గరా ఏడ్చినంత పనిచేశాడు”

“నువ్వు కోప్పడ్డావని మీ పెదనాన్న పంపినట్లు నీకిష్టమైన లడ్దూలు పంపించారు, ఇవిగో ఇవి తిని చదువుకో”

అమ్మ మాటలు పూర్తిచేసి వంట గదిలోకి వెళ్లిపోయింది.

నేను నాన్న కోసం ఎదురుచూస్తున్నా… ప్రేమనిండిన కొత్త హృదయంతో.

*

రచయిత వివరాలు

 My Photo

పితాని వీరవెంకట సత్యనారాయణ

ఇంజనీరింగ్ విద్యార్థి

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,

నూజివీడు, కృష్ణాజిల్లా – 521202

9640796952

satyargukt142@gmail.com

Download PDF ePub MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2014, సెప్టెంబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.