cover

కోటమైసమ్మ

Download PDF ePub MOBI

ఎప్పటి ముచ్చటిది. . .

ఇంట్ల శెప్పకుంట మైలారం అడవులల్ల మల్కబాయికి ఈతకువోయ్ నీల్లు మింగి అమ్మతోని సరాతం ఇరిగె దాక పొర్కపొర్క తన్నుల్తిన్నప్పటికంటే, దూబకుంట రమేశ్గని దుకాన్ల బీడీల్తెచ్చుకొని దర్గల శింతశెట్టెక్కితాగి సోయితప్పిపడి శెయ్యిరగ్గొట్టుకొని కేపాల్ కట్టు కట్టిపిచ్చుకున్నప్పటికంటే, ITI సంగపూర్ రోడ్ సెకండ్‌‍పిచ్‌ల క్రికెట్ ఆడుకుంట ముసల్దాని తల్కాయవలగ్గొట్టి భయానికి వర్గల్ సరస్వతిగుడి కొండమీదతొర్రల దాసుకున్నప్పటికంటే, భవానీశంకర్ టాకీస్ల సెకంషో ట్రిపులెక్స్ సిన్మల శెడ్డి తడుపుకుంటుండంగ టికెట్లు చింపే మల్లమ్మ సూశి నవ్వుకున్నప్పటికంటే శానా పాతదిది.

సద్దుల బత్కమ్మ రేపనంగ పువ్వు తేనీకి హెర్కులస్ సైకిల్లేస్కుని నేను, KK ఫుట్వేర్ సంపత్గాడు, భవానిక్లాత్‌స్టోర్ నారాయనగాడు, చేపలడబ్బ శ్యాంగాడు, బొల్లిబొత్తుల సురేష్‌గాడు, గంగిశెట్టి వెంకటిగాడు కల్సి ఫర్టిలైజర్షాప్ పిచ్చిరెడ్డిగాని ఊరు బయ్యారం పోయినప్పటికే పొద్మీకి నాలుగాయె. ఆడ కట్టకింది కల్లెంలవడి గున్గుపువ్వు తెంపినం. జెర మెట్ట మీదికి వోయి తంగేడుపువ్వు తెంపుతుండంగ గుమ్మడితీగ కానొచ్చింది, సంబురంగ ఐగుడ్క అరుసుకున్నంక జెర్ర అసంతవోతె ఇంక శానరకాల పూలుండె, పట్టుకుచ్చులూ పార్వతిపరమేశ్వర్లపూవ్ శంద్రవంకపూవ్ గడ్డిపువ్వూ ఆరుద్రపువ్వూ అల్లంబెల్లం అన్నీ. మెల్లగ మెల్లగ అన్ని బరికి ముల్లెకట్టుకున్నం. 9 రకాలపూలు వాడాన్నట బత్కమ్మల. గా దినాలల్ల దొరికినైగని ఏడ దేవులాడ్తం మనం ఇయ్యాల్రేపు. బాజార్ల బంతులూ శేమంతులు కొన్కచ్చుకునో గున్గపూవుకు రంగులేస్కునో ఏదో అట్లట్ల బత్కమ్మలాడ్తున్నం, ఇవి గుడ్క పురాగ లేపోతె పిలాస్టిక్ బత్కమ్మలు కొన్కొచ్చి తంబాలంల బూడిదాకులకొ ఆందెపాకులకో అత్కిచ్చి శెర్ల ముంచుతార్రు.

ఇసంత ఇసంత ఆరాయె పువ్వు తెంపుకొని పిచ్చిరెడ్డిగానింట్ల కాల్జేతులు కడిగి శా బొట్టు తాగేపారికి. భేజాల ఏం మెసిలిందో ఏమో బట్టల దుకాన్నారాయనగాడూ చేపల శ్యామ్‌గాడు కల్లు తాగుదామన్నరు. నాలుగడుగులేస్తే అమ్దీపూర్, ఆడ దొరక్కపోతే కొల్గూర్ పోదాం, బిరానవోతే శెట్టు మీంచెల్లే దొర్కుతది‍, పన్లె పని నర్స‌గౌడ్‌ గాన్ని గిట్ల కలిశొద్దాం… అదీ ఇదీ అని బుజ్రకిచ్చి ఎక్కిచ్చేపారికి మా సైకిల్ పయ్యలన్ని గజ్వెల్ ఇడ్శిపెట్టి తాల్లపొంటి మర్రినై. అప్పటికీ చెప్పుల్షాప్ సంపతీ, సురేష్గడూ మొత్తుకుంటనే ఉన్నరు “శీకటైంతంద్రా కల్లేడ దొర్కి పాడైతదిప్పుడు రేప్పొద్దుగాల్లనే వచ్చి తాగిపోతాంతీ” అని. తాగుబోతు కొడుకులింటరా. ఇప్పుడంటే బుడ్లకు బుడ్లు గుద్ది గుడాల్ బుక్కుతంగని అప్పట్ల శిన్నపోరలమైతిమి.

సింగాటం క్రాసింగ్ దాటంగనె ఓ గౌండ్లాయినె దేవునోలె ఎదురొచ్చిండు, రెండు లొట్లు బ్యారం చేస్కుని పక్కపొంటున్న గడ్డివాంల కూకుని మోదుగాకు దొప్పలల్ల మొత్తానికి కల్తాగినం, రేనికంపకున్న మక్కనిపండ్లు తినుకుంట. అప్పటికే రాత్రి ఏడున్నరాయె. సైకిల్ క్యారెల్కు గున్గపువ్వు మోపు, హ్యాండిల్కు తంగేడుపువ్వు సంచీ దాపున వెట్టుకుని ఊరికి మర్లినం. గౌండ్లాయిన మందే కలిపిండో, అగడు వడ్డట్టు దబ్బదబ్బ తాగినందుకో తల్కాయ గీరలేస్కుని తిర్గవట్టింది.. కడుపులేదో ఐతాంది.

“గలీజ్ సాలేగాల్లు వొద్దురా అంటె తాపిచ్చిర్రు, ఇప్పుడు సైకిల్‌ తొక్కుకుంట ఇంటికెట్లవోవాల్నో.. శేతులు వొణుకుతాన్నై సీట్ మీద కూకుంటే, క్యాంచి తొకుతామంటె గ్యారంటి ఇరుస్కపడ్త తుప్పలల్ల, సీటే నయంతీ, అప్పుడప్పుడు దండ మీదెక్కి తొక్కితె ఐపాయె, అమ్మా ఎంత పన్జేస్తిర్రా కొడుకుల్లారా, కల్లుకంట్లె మన్ను, సంపతూ సురేషూ తాగక మంచి పన్జేశిర్రు” అన్కుంట అన్కుంట మెల్లగ ఝట్కలు గొట్టుకుంట తొక్కుతాన్న.

శిమ్మని శీకట్లవడి గజ్వెల్లి పంచపాండవుల శెరువ్ దాంక రాంగనె ఎంకటి గాడు పానమాగనట్టు గట్టిగట్టిగ చెప్పవట్టిండు, “అరేయ్ జాలిగాం రాజుగాడ్లేడు, గదేరా కోడిపిల్లల బిజినెసోడు శెరువ్ పక్కపొంటున్న JCB పొక్కల శ్యాపలు వట్టనీకివోయి పడి సచ్చిపోయిండ్రా. అగో ఎర్రగ గోరీ.. వాని పీన్గె అండ్లనే వెట్టిర్రు. మొన్న రాత్రి ఎవన్కో శెర్ల శెంబట్కవోతే కానొచ్చిండట దయ్యమై..” మన్నూ మశానమని చెప్పవట్టె. “దయ్యమా.. నీ బక్కమొఖపోడా, గీ రాత్రి చెప్పుడౌసరమా ఔల్లంజొడ్కా” అని తిట్టంగనే ముడ్డి సైకిల్ సీట్ మీంచెల్లి దండ మీదికొచ్చిందొక్కప్పారే. ముంగటి పయ్యకేదో కంకర్రాయి అడ్డమొచ్చి చెయిన్ ఊశిపోయి…

శిమ్మన్చీకటి, బొడ్రాయికాడి కోటమైసమ్మగుడి దాకవోతె లైటు ఎల్తురన్న ఉంటది చెయిన్ ఏస్కోనీకి, ఈ కొడుకులెవ్వడు కన్పియ్యలే, మాటల్గూడ ఇనొస్తలేవ్, ఇడ్శిపెట్టి ఊర్లకు పొయ్యిర్రు గుడ్డిగద్దలు, ఏంజేయాలె, భయమైతాంది ఒక్కడ్నే, సైకిల్మీదింత సామానుండె ఉజూల్గ నూక్కపోరాకుంట, కడుపుల ఏదో కదిలింది, నక్కలో కుక్కలో ఇరాం లేకుంట ఒర్రుతనే ఉన్నై గయ్యగయ్యమని…

సైకిల్ నూక్కుంట పోతున్న శీకట్లనే కోటమైసమ్మ గుడికాడికి, జాలిగాం రాజుగాని బొంద మీదెవడో కూకున్నట్టన్పించింది, కడుపులదింత ప్యాంట్ల వడి మొకాల్ల మీదికెల్లి జారుకుంటపోయినట్టైంది, ఐపోయిందియాల నా పని, రాజుగాడ్నన్ను సంపేస్తడు, అప్పట్ల వాన్తాన రెండు కోడిపిల్లలెత్కపోయిన, సంపేస్తడీయాల అన్పిచ్చె. వొస్తాండు.. ఆడే ఎన్కపొంటే వొస్తాండు బీడీ తాక్కుంట, నన్ను పిలుస్తాండు.. (ఓర్వారీ.. ఓ పోడా..)

koTamaisammaఆడే రాజుగాడే.. దొరుక్తే సమ్పేస్తడు.. ఉర్కాలే.. గుడిదాక పోతె సాలు దయ్యాలు రావాడికి.. మోతకోలు సైకిల్ దొబ్బుకుంట వోవుడు నాతోని ఐతలే.. చెయిన్ ఏస్కుని పోదామంటే.. శీకటి పాడుగాను శోకం రావట్టె.. ఉర్కుతున్న.. లబ్బర్ శెప్పు తెగిపోయిందోటి కాల్లకడ్డంపడి, ఆడు పిలుస్తనే ఉన్నడు (ఓ పిలగా ఆగాగు.. ఆగవూ..).. వీని ప్పాడు గానూ పాత బాకోడు ఎంబడివడ్డట్టు గెదుముకొస్తాంటే పెయ్యిల గుడ్లు శెయిలకొచ్చినయ్ అనావాతమ్..

ఇంక నాలుగే అంగలు మైసమ్మ గుడొస్తది.. వొచ్చింది దగ్గరవడ్డదింక.. ఊర్కుతాన్న ఉర్కుతాన్న.. గుడి ముంగటి పెద్ద లైట్‌బుగ్గ దాకొచ్చిన.. అమ్మయ్య ఎవడ్రాడీడికి అన్కుంట ఆరాం ఐన. తలకాయ వల్గుతాంది పాసులకల్లుకు, ముక్కులకెల్లి శీమిడోటి, గడ్డివాముల జెల్లపురుగు వారిందో ఏమో. మోకాల్ల మీద కూకొని లైట్ ఎల్తుర్కు చెయినేస్తున్న. ఈడికెవ్వడు రాడింక అనుకుండంగ.. ఠాప్మని పెద్ద బుగ్గ వల్గి కరెంట్ వాయె. గాశారం గాండ్ మారేతో ఖుదా క్యా కర్తే అన్నట్టు.. ఆ శిమ్మన్చీకట్ల నా దగ్గరికెవలో వొస్తార్రు నోట్ల బీడీ సప్పరిచ్చుకుంట. ఈనింట్ల పీన్గెల్ల రాజుగాడు ఇడ్శి పెట్టెటట్టు లేడు కద్రా అయ్యా అనుకుంట ఏడ్శిన…

(ఓ కొల్యాగ.. ఆగవేముల్లో.. పిలుస్తాంటె ఆగమాగం ఉర్కవడ్తివి..)

నేనెప్పుడు గుడిమెట్ల మీద వడ్డనో, సైకిలి ఎల్ల కల్శిపోయిందో, పువ్వెటు కొట్కపోయిందో, ఇంటికెట్ల వోయిన్నో ఎవలు కొంచవోయిర్రో..

ఒకటే గుర్తుంది ఇప్పటికీ.. వాడు మాట్లాడిన మాటలు..

(పిలగా, జెరంత చౌరస్త దాక ఎక్కిచ్కపోతవా సైకిల్మీద)

* * *

ఓ.. సాల్లకు సాల్లు గడిశె, ఇప్పుడు ఆ సైకిల్లేదు, తెంపుక రానీకి పువ్వుసుత దొరుక్తలే, జనాలది ఎవ్వని సంసారం వానికైంది, ఊరిశెర్ల గూడ అప్పటంత నీల్లులేవ్ బత్కమ్మల్నేశి గౌరమ్మపాట పాడనీకి, ఇంకిన్ని దినాలైనంక పాటగిట్ల మర్శిపొతరంత, క్యాసెట్లల్ల సీడీలల్లనే ఇనవడ్తదప్పుడు, అమ్మమ్మలు అమ్మలకు నేర్పిర్రు, అమ్మలకాంచెల్లి నేర్సుకోనీకి కొడుకులకూ బిడ్డలకు తీరనంత సుతారపు బత్కులాయె మనయి..

అసల్సంగతి చెప్పుడు మర్శిన. నెలకింద ఓ పొద్మీకి మా ఊరిపంచపాండవుల శెరువు సూద్దామని పోయిన వర్షాలకు శెరువు నిండిదంటే. కోటమైసమ్మ గుడెన్క రాజుగాని గోరీకాడ ఎవలో ముసలాయినున్నడు ఓ పిలగాన్నేస్కుని, పాత సైకిల్మీద క్యారెల్కు కోడిపిల్లల బుట్టుంది, సమఝైంది రాజుగాని అయ్య అని. మాట్లాడిద్దామని దగ్గరికి పోయేటప్పటికి ఆయిన్నె మాట్లాడిండు నోట్లె సుట్ట సప్పరిచ్చుకుంట.

(ఔ సారూ, జెరంత మా పొలగాన్ని చౌరస్తదాక ఎక్కిచ్చ్కపోతవా, మన్మడు.. బిడ్డ కొడ్కు, పట్నం పోతాండు)

ఎక్కడ్నో ఇన్నట్టు కొట్టింది గొంతు, మాటలు గూడ..

ఎన్నడు నిండని ఊరిశెరువు ఆయల్లెందుకో మస్తు నిండుంది..

నిండిందా మరి, నా కండ్లకు అట్ల కానొచ్చెనా..

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.

Posted in 2014, మ్యూజింగ్స్, సెప్టెంబర్ and tagged , , , , .

8 Comments

  1. ఎన్నడు నిండని వూరి సెరువు ఆ రోజు మస్తు నిండినట్లు కానొచ్చింది..ఎందుకు?మా కళ్ళు కూడా నిండి అట్ల కానొచ్చింది. కోట మైసమ్మ గుడి, చెరువు అన్ని చుసోచ్చినం. superb.

  2. “ఇప్పుడు ఆ సైకిల్లేదు, తెంపుక రానీకి పువ్వుసుత దొరుక్తలే, జనాలది ఎవ్వని సంసారం వానికైంది, ఊరిశెర్ల గూడ అప్పటంత నీల్లులేవ్“. ఎప్పటిలాగే వంశీధర్ రెడ్డి గారి వాక్యాలు మంత్రముగ్ధుడ్ని చేసాయి.
    .
    చెలములై ఊరుతున్న కళ్లతో శెరువును చూస్తుంటే బత్కమ్మతో పాటు బలిమిన ఊరిశెరువులోగల్సిపోయిన గజయీతరాలు పూర్ణమ్మతల్లి కూడా యాదికొస్తున్నాది జెరంత “చౌరస్త కధ” దాక ఎక్కిచ్కపోతవా సారూ అని ఏ మారాజునైనా అడగాలనుంది..

  3. కథలో మాండలికం గుబాళింపు పఠితను మైమరపింపచేస్తుంది. మన పిల్లల అందమైన బాల్యాన్నే కాదు, మన సంస్కృతినీ పోగొట్టుకుంటున్న తీరుని మేళవించి అల్లిన ఈ కథ వంశీగారి మరో మేల్ మెచ్చుతునక!!

  4. ఇదీ అచ్చమయిన అందమయిన బాల్యమంటే. చదివిన వాళ్ళ జ్ఞాపకాల
    తుట్టెను కదిలించినట్టుంది. ప్రతిసారీ కామెంట్ పెట్టడం ఎందుకని వెనక్కి తగ్గుతా. కాని వంశీధర్ రెడ్డి మాండలీకం నన్ను నిలువెల్లా మత్తులా కమ్మి నాకు తెలియకుండానే నా మనసులోని మాటలు అక్షర మొగ్గలై రాలిపడతాయి. వంశీ రాతల్లో మెదక్ జిల్లా మాండలీకం మరులు గొల్పుతోంది. పరిమళాలీనుతోంది. అభినందనలు వంశీ గారూ!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.