cover

దృశ్యాదృశ్యం

Download PDF ePub MOBI

“ఛీ! ఈ మనిషనేవాడు మారడారా?” విసుగ్గా అన్నాడు అజిత్, తన స్మార్ట్‌ఫోన్‌లో న్యూస్ చదువుతూ.

“ఏమైందిరా?” అడిగాడు విజయ్.

“ఏమైందేంటిరా, పదేళ్ల చిన్నపిల్లాణ్ణి కిడ్నాప్ చేసి చంపేశారు”

“అబ్బా…” కోపంగా నిట్టూర్చాడు విజయ్.

ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు, ఇంక ఈ విషయంపై ఏం మాట్లాడదల్చుకోలేదన్నట్టుగా.

కొద్దిసేపటికి, “సరేరా మరి.. ఇక వెళ్దాం” అన్నాడు అజిత్. సరేనన్నట్టు తలూపాడు విజయ్, కాల్చి పారేసిన సిగరెట్ పీకను కసితీరా కాళ్ల కింద నలిపేస్తూ.

ఇద్దరూ బైక్‌పై వెళ్లిపోయారు.

* * *

ఓ ప్రముఖ దినపత్రిక ఇంటర్‌నెట్ విభాగం. అంతా గోలగా ఉంది. ఎవ్వరూ గట్టిగా అరవట్లేదు కానీ ఎవరో పని కట్టుకొని అరుస్తున్నారేమో అన్నట్టుంది అక్కడ.

కిడ్నాపై హత్య కాబడ్డ బాలుడి వార్త ఆరోజుకి వారికో పెద్ద న్యూస్. ఆ విభాగానికి ఎడిటర్ అయిన రామారావు ఆ వార్త విషయం గురించే ఏవో సలహాలు, సూచనలూ ఇస్తున్నాడు!

“అజయ్, ఆ చనిపోయిన బాబు ఫోటోలు రెడీ చేస్కో. గ్యాలరీ పెడదాం” కొత్తగా చేరిన అజయ్‌కి చెప్పాడు. ‘ఓకే సార్’ అన్నట్టు తలూపాడు అజయ్. రామారావుకున్న స్టేటస్ వల్లనో మరేదో కానీ ఆయన ఎక్కువగా గాంభీర్యంగానే కనిపిస్తూంటాడు. మంచివాడన్న పేరూ ఉంది.

“సార్, ఈ న్యూస్‌కి సంబంధించిన అప్‌డేట్స్ కొన్ని వచ్చాయ్” గొణుగుతూనే చెప్పాడు రమేశ్. అతను ముందునుంచీ కాస్త భయస్తుడు.

“అవేవో నువ్వే చూడమ్మా” అంటూ అతనికే ఆ బాధ్యతని అప్పజెప్పాడా ఎడిటర్.

కొద్దిసేటికంతా ఎవ్వరి పనుల్లో వారు మునిగిపోయారు.

‘టక్‌టక్ టక్’మంటూ వినిపిస్తున్న టైపింగ్ చప్పుడే తప్ప మరే చప్పుడూ వినిపించట్లేదక్కడ.

“హే.. ఆ ఎక్స్ పోర్న్‌స్టార్ తన నెక్స్ట్ సినిమాలో న్యూడ్‌గా చేస్తుందట” అంటూ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ నవ్వుతూ చెప్పాడు సీనియర్ సబ్ ఎడిటర్ భిక్షపతి.

అందరూ పెద్దగా నవ్వుకున్నారు. ఎప్పుడూ గంభీరంగానే కనిపించే రామారావూ ఈసారికి నవ్వుకున్నాడు.

* * *

“అమ్మా, ఇటురా.. తొందరగా!” అరుస్తోంది సౌమ్య తన ఫేస్‌బుక్ బ్రౌజ్ చేస్తూ.

“అబ్బా.. ఏంటే ఒకటే..” విసుగ్గానే వచ్చింది లక్ష్మి.

“ఈ బాబును గుర్తుపట్టావా? పక్కింట్లో ఆంటీ వాళ్లింటికి వచ్చాడు చూడు, సెలవులకి!”

“ఆ.. గుర్తుంది అక్కీగాడు కదూ? వాళ్లమ్మ రాజేశ్వరి. ఏమైందే ఆ బాబుకి?”

“చనిపోయాడంట.. వాళ్ల డ్రైవరే కిడ్నాప్ చేసి చంపేశాడట” నిట్టూరుస్తూ చెప్పింది సౌమ్య.

“అయ్యో! ఎంత ఘోరం.. వాళ్లమ్మ కూడా మంచిదే!”

“అవునమ్మా, పాపం” అంది సౌమ్య.

నిట్టూర్చారిద్దరూ. ఆ తర్వాత లక్ష్మి తన పనిలో తాను పడిపోయింది.

కొద్దిసేపటి క్రితం ఫేస్‌బుక్‌లో పెట్టిన తన ప్రొఫైల్ పిక్‌కి వచ్చిన లైక్స్ చూస్తూ మురిసిపోతోంది సౌమ్య.

* * *

“రేయ్! మన వినయ్ వాళ్ల అన్నకొడుకు చనిపోయాడంటరా. ఇప్పుడే బాడీని ఇంటికి తీసుకొచ్చారంట. మనం వెళ్దాం” అప్పుడే నిద్రనుంచి లేచిన భాస్కర్‌కి ఫోన్లో వినిపిస్తున్న ఆ మాటలు అస్పష్టంగానే వినిపిస్తున్నా, విషయం మాత్రం అర్థమైంది.

“ఆ డ్రైవర్ గాడు అంత పని చేశాడా?” కోపంగా అడిగాడు భాస్కర్.

“అవునురా, మనం అక్కీగాడి కోసం వెతికి వెతికి ఇంటికెళ్లిపోయాం కదా! ఆ తర్వాతే ఫోన్ వచ్చిందంట” బాధగా చెప్పాడు రాజ్.

“సరేరా మరి.. నేను బయలుదేరుతున్నా.. నేరుగా అక్కడికే వెళ్దాం”

కొన్ని సెకన్లపాటు మౌనం. మళ్లీ తనే మాట్లాడుతూ, “అన్నట్టు నిన్న అడగడం మర్చిపోయాను, నీ లవ్ సంగతి ఏమైందిరా? ప్రియా వాళ్ల నాన్న ఏదో గొడవ పెట్టాడన్నావ్!”

“అవునురా.. చిన్న గొడవేలే. అయినా నాక్కాకుండా దాన్ని ఇంకెవడికి కట్టబెడతాడు చెప్పు?” నవ్వుతూ అన్నాడు రాజ్.

“అంతేలే.. హీరోవిగా మరి!”

ఇద్దరూ నవ్వుకున్నారు.

* * *

 “అఖిల్ గాణ్ణి మిస్సవుతాం కదరా?” బాధగా అన్నాడు చింటూ.

drushya“ఇంక వాణ్ణెప్పుడూ చూడలేమంటరా!” అంతే బాధతో సమాధానమిచ్చాడు బన్నూ.

“మమ్మీ పంపించట్లేదు కానీ.. నాకైతే వాణ్ణి చూడాలని ఉందిరా”

“నాకూరా”

ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏడుస్తున్నారు.

“చింటూ, బన్నూ.. ఇక్కడేం చేస్తున్నారు?”

“మమ్మీ పిలుస్తుందిరా బన్నూ! చింటూ నిన్నూ మీ మమ్మీ పిలుస్తోంది” ఎంత వేగంగా చెప్పిందో అంతే వేగంగా అక్కణ్ణించి వెళ్లిపోయింది బన్నూ అక్క.

ఇద్దరూ అపార్టమెంట్ లిఫ్ట్ దగ్గరకు వెళ్లారు. “లిఫ్ట్ పని చేయట్లేదు బాబూ,” అన్న వాచ్‌మెన్ మాటలకు ఒకసారి అతన్నో వెర్రి చూపు చూసి, మెట్లపై నుండి ఎక్కడం మొదలుపెట్టారు.

వాళ్ల ఫ్లాట్ ఒక్కసారిగా చాలా దూరమైనట్టనిపించింది. ఫ్రెండ్ దూరమైనట్టుగానే..

* * *

అఖిల్ ఇల్లు.. ఉదయం పదిగంటల సమయం..

ఎప్పుడూ అల్లరి కబుర్లు చెప్పే అఖిల్ ఇక లేడన్న విషయమే అక్కడున్న వారందర్నీ శోకసంద్రంలోకి నెట్టేసింది. ఇక తమ కలల పంటను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల పరిస్థితైతే వర్ణించలేనిది.

“ఆ నా కొడుకుని వదిలేయ కూడదు. ఉరి తీయాలంతే” కోపంతో ఊగిపోతున్నాడు వాళ్ల బంధువొకతను.

“ఎప్పుడూ వాడిపై అనుమానమే రాలేదు. మన రాజీని అక్క, మహేశ్‌ని బావ అని పిలుస్తూ మన ఇంట్లో వాడిలాగే మెలిగేవాడు. వాడిలా చేస్తాడనుకోలేదు” వాపోయాడా ఇంటి పెద్దాయన.

ఏడ్చీ ఏడ్చీ గొంతెండిపోయి ఉన్న రాజేశ్వరిని ఓదార్చాలని కొందరు చూస్తున్నారు కానీ అదెందుకో సాధ్యమయ్యే పని కాదని ఊరుకున్నారు.

“మీరెలా ఫీలవుతున్నారు?” అన్న విలేఖర్ల ప్రశ్నకు కంగుతిన్నట్టుగా చూస్తున్నాడు మహేశ్ మామ.

పక్కనే కొడుకును పోగొట్టుకొని బాధలో ఉన్న మహేశ్.. కోపంగా అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు.

“చెప్పండి సార్.. ఈ హత్య ఎలా జరిగిందని భావిస్తున్నారు? హంతకుణ్ణి ఎప్పటిలోగా పట్టుకుంటారు?” అక్కడే నిలబడి ఉన్న పోలీస్ ఆఫీసర్‌ను ప్రశ్నలతో ముంచెత్తారు విలేఖర్లు.

పోలీసులేవో చెబుతూనే ఉన్నారు. ఏదో మాట్లాడుతున్నట్టే ఉన్నా, ఏమీ వినబడట్లేదు వాళ్లనే దీనంగా చూస్తున్న మహేశ్ తండ్రికి.

“నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసి మాట్లాడాడా సాయిరాంగాడు. నాకైతే కనీసం అనుమానం కూడా రాలేదు. డబ్బడిగినా ఉన్నదంతా ఇచ్చేవాణ్ణి కదరా!” తలను గోడకు కొట్టుకుంటూ తన బావమరిది ముందు వాపోయాడు మహేశ్.

* * *

“అంకుల్, ఈ చాక్లెట్ నీకోసమే” నవ్వుతూ సాయిరాంకి ఇచ్చాడు అఖిల్.

“థ్యాంక్స్ అక్కీ.. నేనూ నీకో చాక్లెట్ తెచ్చా ఇదిగో..”

“ఓ.. మై డియర్ అంకుల్.. యూ ఆర్ సో క్యూట్” అంటూ అఖిల్ తనతో పంచుకున్న గత సాయంత్రాన్ని గుర్తు చేసుకున్నాడు సాయిరాం.

‘అయ్యో.. ఎంత పని చేశాను. అంత చిన్న పిల్లాణ్ణి చంపేశానా?’

‘ముద్దు ముద్దు మాటలు చెప్పే అక్కీ గాణ్ణి.. నన్నిష్టపడే అక్కీగాణ్ణి.. నా అక్కీగాణ్ణి ఈ చేతులతో చంపేశానా?’ కుమిలిపోయాడు సాయిరాం.

‘అసలు డబ్బు ఆలోచన ఎందుకు రావాలి? కిడ్నాపెందుకు చెయ్యాలి? తర్వాత భయపడి హత్యెందుకు చెయ్యాలి?’

‘వాణ్ణి చంపకుండా ఉండాల్సింది. అసలు చంపాలన్న ఆలోచన ఎందుకు రావాలి?’

ఏడ్చాడు. అరుస్తున్నాడు. గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. తనకు మాత్రమే వినిపిస్తుందా అరుపు.

జేబులోనుంచి వెయ్యి రూపాయల నోటొకటి తీసి, దాన్ని చింపి ముక్కలు చేసి గాల్లో విసిరేశాడు.

‘ఛీ..’ అని గట్టిగా అరిచి చేతిలోని బాటిల్‌ని నేలకేసి కొట్టాడు. కొద్దిసేపంతా నిశ్శబ్దం.

సాయిరాం ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

* * *

“అమ్మా.. నేను నీకంటే ముందే లేచేశా” నవ్వుతూ దగ్గరకొచ్చాడు అఖిల్.

“నువ్వు అన్నింట్లోనూ నాకంటే ముందేరా నాన్నా..” ముద్దాడుతూ అంది రాజేశ్వరి.

“ఏమైందమ్మా?” వేడిగా ఉన్న అమ్మ చేతిని పట్టుకొని అడిగాడు అఖిల్.

“ఏం లేదు నాన్నా.. లైట్‌గా జ్వరమొచ్చిందంతే”

“నేను పెద్దవాణ్ణైతే నీకీ బాధలేం ఉండవ్లేమ్మా! డాక్టర్నవుతా కదా!!”

“నా చిట్టి బంగారం.. సరే పదా స్కూల్‌కి టైం అవుతోంది.. రెడీ అవుదువుగానీ..”

“నేనీ రోజు స్కూల్‌కి వెళ్లనమ్మా..”

“స్కూల్‌కి తప్పకుండా వెళ్లాలమ్మా. అయినా నీకీ రోజు క్విజ్ పోటీ కూడా ఉంది కదా?”

“ఉమ్.. సరేలేమ్మా” అంటూ బుగ్గమూతి పెట్టిన అఖిల్ గుర్తొచ్చి మరింత ఏడుస్తుంది రాజేశ్వరి.

ఆ మాటలని అప్పటికి సరిగ్గా ఐదు రోజులైంది.

కళ్లనుండి కన్నీళ్లలాగే వస్తున్నాయి. ఫోటో ఫ్రేమంతా కన్నీళ్లతో నిండిపోయి మసక బారిపోయింది. ఆ ఫ్రేమ్‌ని తన పైటతో తుడిచింది.

కళ్లింతవి చేస్తూ చూస్తూన్న అఖిల్ ఫోటో అది. ప్రకృతి సంతోషమంతా అతడి నవ్వులో, ప్రశాంతత అతడి కళ్లల్లో నింపుకొని ఆ రోజుకలా మిగిలిపోయాడు.. ఓ జ్ఞాపకంలా.

– వి. మల్లిఖార్జున్

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, కథ, సెప్టెంబర్ and tagged , , , , , .

2 Comments

 1. మల్లికార్జున్:

  కథ బాగా ఫీలయ్యేలా చేసింది. అంతకన్నా కొంత కలవరపాటుకూ గురి చేసింది.

  ఇది కథ కాదు, నిజంగా మన చుట్టూ జరుగుతున్న విషయమే- ఆ సంఘటనతో సంబంధం కొంతమందికి వృత్తి రీత్యా కలిగింది. అది చాలా మామూలు విషయమైపోయింది ఇంకో సంచలన వార్త మరు నిమిషంలో తయారయ్యేసరికి. వార్త ముఖ్యం కంటెంటు కాదు అనే ప్రసార సాధనాల శైలిని బాగా పట్టుకున్నారు.గంభీరంగా ఉండే వాళ్ళందరూ కూడా అది భావ ప్రకటనే తప్ప అసలు నైజం కాదని కథలోనే చెప్పేశారు. ఎవరైతేనేం లే !

  చుట్టపు చూపుగా వచ్చినందుకు ఓ సారి పరిచయం అయినందుకనో కాసేఫు బాధపడి సొంత విషయంలో మునిగిపోయిన సౌమ్య. మనలోనూ ఇలాంటి లక్షణాలు బాగానే ఉన్నాయిగా? లేవంటారా? అందుకే కాస్త భుజాలు తడుముకుంటున్నాను.

  చంపేసిన సాయిరాం గాడు చస్తేనేం, లొంగిపోయి బతికితేనేం. వాడు పశ్చాత్తాప పడే తత్వం చాలా వరకూ తప్పు చేసినవారిలో కనిపించేదే. ఇంకా దగ్గరివాడైతే ఆ మోతాదు ఎక్కువగా ఉంటుంది. వాణ్ణి చంపేసి మంచోణ్ణి చేశారు. నాకైతే వానిపై కోపం మాత్రం ఇంకా పోలే !

  తల్లి దండ్రుల శోకం వర్ణించరానిది. ఆ బాధ పగవానికి కూడా వద్దు. ఏడవని వాడు పాపాత్ముడు ఆ ఆరేడు వాక్యాలు చదివినతర్వాత.

  ” వాళ్ల ఫ్లాట్ ఒక్కసారిగా చాలా దూరమైనట్టనిపించింది. ఫ్రెండ్ దూరమైనట్టుగానే.. “ఈ ఒక్క వాక్యంలో కథలో భావమంతా చిక్కుకుపోయింది. కళ్లింతవి చేస్తూ చూస్తూన్న అఖిల్ ఎప్పటికీ జ్ఞాపకంగా కాక జీవితంలో భాగంగానే ఉండిపోయుంటే ఎంత బావుండేది?

  సాయిరాం గాడు లొంగిపోయి పిల్లవాణ్ణి భద్రంగా అప్పగించేసేలా ఇంకో కథ రాయకూడదూ? ప్లీజ్

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.