cover

సెరుగ్గానిక్కాడి పని

Download PDF ePub MOBI

ఎండకాలం లీవులిచ్చేసినారు. ఇస్కూలుకు బోవాలనే బాద లేదు. ఏ సెట్ల కింద జూసినా పిలకాయిలమే. సద్దిదాగడం, వూరిమింద బడి తిరగడం. నేను, కాంత, నీల, ఏమలత మా ఇంటిపక్క నుండే సింతమాను కింద బొమ్మరిల్లు గట్టుకోని ఆట్లాడుకుంటా వుండాము.

యాన్నించొచ్చిందో సిలగుంట్లపల్లి లచ్చుమక్క సింతపుల్ల దీసుకోని మేము గట్టుకున్ని బొమ్మరింటిని కాలితో చిల్లాబల్లా సేసేసి తరుముకొనింది. ఆయమ్మకు దొరక్కుండా మూలకొకరం పరిగెత్తి దూరంగా బొయి దాంకున్న్యాము.

‘గుడ్సేటి పిలకాయిలు, సెట్లకింద జేరి ఒక్కాయ దక్కనిస్తారా. పన్నికాయను పన్న్యట్టే వాళ్ల యదానేసుకుంటా వుంటే ఇంగ మాకేంది దక్కేది. ఉంపడాలకు బుట్ని బిడ్లు. పనీ పాటా ఏమన్నా వుంటే కదా! వీళ్ల నోట్లో దుమ్ము కొట్నాని, వీళ్లను దూము పిలాకొచ్చి వారుకోని బోనాని…’ సాపిస్తా మాకు తప్పిపోయిన సింతకాయల్ని ఏరి వొళ్లో ఏసుకుంటా వుండాది. బాయి కాన్నించి ఇంటెనక యెలబారి వాల్ల సింతమాను పక్కనుంచే ఇంట్లోకి రావల్లమేము. గానిక్కాడికి సంగటెత్తుకోని మాయమ్మ ఇంట్లోనించి బయటి కొచ్చేది జూసి లచ్చుమక్క తిట్లపురాణాన్ని ఆపు జేసింది. అయినా మాయమ్మ అంతకు ముంచునించి ఇంటా వున్న్యట్లుంది.

‘ఎవుర్ని లచ్చుమక్కా తిట్తావుండావు?’ అని అడిగింది. ‘నేనెవుర్ని తిట్తానమ్మా. నన్ను, నా సింతమాన్ను దిట్టుకుంటావుండా. పుట్టిడి బిడ్లి తల్లి మాదిరిగా సెట్టు నిండా కాయిలేగాని ఒక్కాయన్నా మాకు దక్కనిస్తారా పిలకాయిలు’ అని వొంచిన తలెత్తకుండా సింతకాయల్నెత్తుకుంటా మాట్లాడకుండా వుండిపోయింది. నేను కసువామి కింద కూసం పక్క దాంకోని తొంగి తొంగి సూత్తావుండా. మాయమ్మ యాడజూస్తాదో నా ఈపు ఇమానం మోత మోగిస్తాదోనని బయం బయంగా సూస్తావుండా. లచ్చుమక్క నోరు మూసుకొనిందా. ఇంగెవుర్తో ఏమని మాట్లాడ్తాది. మమ్మల్నే సాపిస్తా వుండేదని మాయమ్మకు దెల్సుకదా! మెల్లింగా సంగటి తట్టెత్తుకోని బాయికాడికి పూడ్సింది.

నేను, మాయక్క మాయవ్వోలింట్లోగదా వుండేది. మెల్లింగా మాయవ్వోల్లింటికి జారుకున్నాను. ‘సంగటేలయ్యి ఎంతసేపయింది. యాడని ఎతికేది నేనీ యెండలో. ఊరికాకి మాదిరిగా ఈ ఎండలో బడి తిరక్కుంటే బక్కయివోరు మూడో తరగతి పస్తకాలు దెచ్చిచ్చినాడు గదా! వాట్నెత్తుకోని సల్లంగా ఇంట్లో కూచ్చోని సదుముకుంటే ఎమి? మీయమ్మ రానీ, లీవులయ్యేదాకా మీ ఇంటికే పిల్సుకోని బో దీంతో యాంగను నావల్లగాదని సెప్పేస్తా. మీ యబ్బతోడు నువ్వేడన్నా తిరుక్కుందువు’ అని మాయవ్వ బొప్పగిన్నిలో సిన్న సంగటి ముద్దేసి సింతాకు పులగూర బోసింది. నడవలో మా తాతపక్క కూసోని తినేసి బుద్దిమంతురాలి మాదిరిగా పుస్తకాలు ముందరేసికోని బొమ్మలు సూసుకుంటా కూసున్న్యాను.

మా ఇంటికి బోతే తెల్లారే జాముదాకా ఆట్లాడుకోను కాదు గదా! అందుకే శానా అణకువగా వుండాను. కానీ సందకాడ మాయమ్మొచ్చింది. సెరుగ్గానిక్కాడ గానిగి దోల్ను మనిసి లేదని నన్ను రమ్మనింది. ‘అక్క ఎంత బాగా గానిక్కి సెరుకులు బెట్తాది. నువ్వు గానిగెద్దులెనక నడిస్తే బెల్లమమ్మినాక ఇద్దురికీ సిల్కుపావడాలు కుట్టిస్తాన’నింది.

‘తెల్లారినా కొస్తుంది బో’ అనింది మాయవ్వ. నేను పక్కన లేకపోతే మా యవ్వకు నిద్రరాదు కదా!

సెరుగ్గానిక్కాడ గానిగెద్దులెనకాల నడవడం నాకు శానా తమాసాగా వుండాది. సెరుకుల్దినుకుంటా సుట్టూదిరగడమే. ఎద్దులు దానిపాటు కవి తిరగతాయి. వాటికీ కాలునొప్పి వస్తాది కదా! అప్పుడు నిలబడిపోతాయి. అప్పుడు మాత్రమే ‘హేయ్‌ – ట్రుర్ర్’ అంటే సాలు.

ఒగ పెనుంకి సెరుకు పాలు బట్న్యాక గానిక్కి మానడుపబ్బ పెదనాయినోళ్ల ఎదుల్ని గట్న్యారు. అది బదులు కాడి. వాళ్లు గ్యానిగాడినప్పుడు మేము మా ఎద్దుల్ని కట్టిన్నాము గదా! ఈ సారి వాళ్ల ఎద్దుల్ని మనం దోలే పన్లేదు. వాళ్ల కాంత వొచ్చి తోలింది. అంతసేపు పక్కనేవున్ని వంకలో కానగసెట్టు నీడలో కాంతావాళ్ల మామ కూతురు జమునాతో పిచ్చిగ్గూళ్లు గట్టుకోని ఆడుకున్న్యాను.

కాంతావోళ్ల ఎద్దల్తో ఒక పెనుముకు సెరుకు పాలు బట్టేదయిపోయినాక మళ్లీ మా ఎద్దుల్ని గట్న్యారు. నేను తోలనని మొండికేసినాను. మాయింట్లో పన్జేసే కిలి తోటలో సెరుకులు గొట్టి తెచ్చేదయిపోయిందని మాయక్కను లేపి గానిక్కి సెరుకులు బెట్తావుంది. మాయక్క వూరికే వుంటే నేను ఎద్దులెనక నడవాల్నా? ‘నేనింటికి బోతా నువ్వుదోలు ఎద్దుల్ని’ అన్న్యాను మాయక్కతో

ఇంటికి బోతావా? అమ్మ ఈడికి సంగటి తెస్తాది. నేతిలో బెట్టుకోని తింటాన్నేను అనింది. ‘అయితే నేను కొంచేపు నువ్వు కొంచేపు దోల్తామా కా’ అడిగినాను మా యక్కను. ‘సరే’ అనింది.

మాయమ్మ ఎప్పుడెప్పుడొస్తాదా అని దోవపక్కే సూసుకుంటా వుండా. ఎంతసేపు జూసినా మాయమ్మ అయిపు లేదు. ‘ఎప్పుడుకా అమ్మొచ్చేది నాకాకిలిగా వుండాది’ అని ఏడుప్మొగం పెట్న్యాను.

‘సెరుకులు, బెల్లం, నక్కుళ్లు (ఒక పెనుం బెల్లం కాంచి దోనిలో పోసినాక సెరుకు పాలు బోసినప్పుడు పెనుం వారల్లో వుండే బెల్లం కమ్మరకట్టు మాదిరిగా తయారవుతాది) కనా కసమాలం నిలుకు లేకుండా నమల్తానే వుండావే. నీకు ఆకిల్యాన్నించొచ్చింది. ఇందా నాలుగు సుట్లు తోల్దువ్‌రా’ అని కసిరింది మాయక్క.

‘సంగటి దిన్న్యాకనే సూడు నేను దోలేది. అంతొరకు నువ్వేమన్నా సేసుకో’ అంట్ని.

‘అమ్మొచ్చినాక సెప్తానుండు నీ కత. సీల్చి సీసం బోస్తాది. సిల్కుపావడా గిల్కు పావడా నీకు జాన్తానై’ అని నడ్డి దిప్పతా ఎక్కిరించింది.

సేతిలో వుండే సెరుకుతో మాయక్కను కొట్నుబొయినాను. ‘సూడు నాయినా సినపాప. పనీ సెయ్‌కుండా సేస్తావుండే నన్ను ఉపద్రబెడతావుంది’ అని అర్సింది. బెల్లం ముద్దలు సేస్తావున్ని మా నాయిన ఇనిపించుకున్న్యాడో! లేదో! ఆఁ అనలా వూఁ అనలా. నేనూ ఏమ్మాట్లాడకుండా కానగ కొమ్మెక్కి కూసోని కిందికి పైకి కోతి మాదిరిగా వూంగతా వుండాను.

వొక్క కొరికేంత సేపు గూడా వూంగినానో లేదో! కొమ్మపై నుంచి దబ్‌మని దూకి ‘అకా ఎద్దుల్ని నేను దోల్తాగానీ నువ్వు బొయ్యి వుయ్యాలూంగుపో. శానా బాగుంటాది’ అని బలమంతంగా మాయక్క సేతిలోని జాటీ దీసుకొని ఎద్దులెంట నడవబట్న్యాను.

మాయక్క మంచి సెరుకు జూసి నాలుగు పిచ్చిలించుకోని సెట్టుకొమ్మెక్కి తిందామని నోట్లో బెట్టుకుంటా సెరువుపక్క జూసింది. మాయమ్మ సగం సెరువుదాటి సంగటి గంపతో వొస్తావుండాది. ‘అంటే ఇది మాయమ్మను జూసే పన్లోకి దూరుండాది. గుడ్సేటి ముండకు ఏం తెలివో సూడు. నేనేనా తక్కవ దినుండేది,’ అని గొణగలా కొమ్మమింది నుంచి దూకి ముందే మాయమ్మకు సెబ్దామని పరిగెత్తింది. మాయక్క మాట్లిని మాయమ్మ నవ్విందేగాని నా గురించి పల్లెత్తు మాటనలా.

సంగటి గంప కానక సెట్టుకింద దించిందో లేదో ‘ఇంద నువ్వే దోలుకో’ అని జాటీని మాయక్క పక్కకిసిరి గంప దెగ్గిర జేరినాను.

‘మూడు బానలు నిండేదాకా ఎవురు దోల్తారో వాళ్లకొకిటిస్తాను’ అనింది మాయమ్మ మమ్మల్ని వూరిస్తా.

‘నేనింతసేపు దోల్న్యాను గదామా, అని ఏడుపు మొగం బెట్న్యాను.

‘నిజమే, కట్టమలుపు దిరిగినప్పుడు ఎద్దులెంట అక్కున్నింది. నాలుగడుగులు నడ్సేతలికి నువు కన్పిస్తివి. అంటే నాలుగు సుట్లు గూడా దోల్లేదు నువ్వు. నేను సూళ్లేదనుకుంటే ఎట్లా’ అనింది మాయమ్మ.

‘ముందే బొయ్యి అమ్మతో ఏం సెప్పినావే’ అని మాయక్క మిందికి బొయినానో లేదో! ‘అదేం సెప్పలా నాకళ్లారా నేనే జూసినాను అక్కనేమన్నా అంటే ఈ పూట నీకు సంగటీ ల్యా గింగటీ ల్యా’ అనింది కచ్చిగా మాయమ్మ.

దాంతో నాకు తలదీసేసినట్లయింది. ‘సంగటీ వొద్దు గింగటీ వొద్దు పో’ అని అలిగి ఇంటి మొగం బట్టుకోని పరిగెత్త బట్న్యాను.

సెరుకు పొయికి ఆకేస్తా వున్ని బాలడు పరిగెత్తుకోనొచ్చి నన్ను బట్టుకున్న్యాడు. నేను రానని ఎంత గింజుకున్న్యా ఎత్తి బుజం మిందేసుకోని మాయమ్మ దెగ్గిరకిదెచ్చి కుదేసినాడు. మా నాయనప్పుడే సేతులు కడుక్కోనొచ్చి సంగటికి కూసుంటావుండాడు. మా నాయన ముందర లేసి పరిగెత్తే దైర్నంలేక మూతిమూడు మూరలు బెట్టుకోని కూసున్న్యాను.

మాయమ్మ సంగటి ముద్దలో నుంచి కొంచిం దుంచుకోని సిన్నముద్దజేసి నాకియ్యబోతే నేను వొద్దని మాయమ్మ సేతిని బట్టి పక్కకు దోసేసినాను.

‘పెవడతనం ఎక్కువైపోయింది సినపాపా! నీకు. ఇప్పుడే మయిందని అలిగి సంగటి దినకుండా సతాయిస్తావుండేది. ఇట్రా నా పక్కన కూసో’ అని మాయమ్మతో సంగటి పెట్టీయమన్న్యాడు మా నాయిన.

మా యమ్మ సేతిలో ఇయకుండా ఇడి బాదమాకులో సిన్న సంగటి ముద్దబెట్టి మద్దిలో గుంతజేసి కూరబోసి పర్సిన ఎండు సెరుకాకు మింద బెట్టింది.

నాసేతికియకుండా ఆడబెట్టడం నాకు శానా నామోసీగా వుండాది. కానీ మా నాయినుండాడే నా ఆకులో వుండే సంగటిని ఒక కడి తుంచి కూరలో అద్ది నా నోట్లో బెట్న్యాడు. వొద్దంట్న్యా. మా నాయినకి కోపం వొస్తాది. కోపం వొస్తే తిట్టడం కాదుగదా! కొట్న్యా కొడ్తాడు. అందుకని నోరు దెర్సి బుంగమూతితోనే తినడం మొదులు బెట్న్యాను. ఆ సిన్న సంగటి ముద్ద తిన్న్యాక నేనాడుండలా. కానగ సెట్టుకింద బెట్టిన కొత్త కుండలోని నీళ్లు ముంచుకొని రొండు గలాసులు తాగినాను.

‘అరువు తెరువూ ల్యాకుండా పెంచింది మీయవ్వ నిన్ను. సగం నోటికి కర్సుకోని తాగి ఆ గలాసును మళ్లీ దాంట్లో ముంచితే ఆ నీళ్లను మిగిలినోళ్లు తాగాల్నా వొద్దా’ అని కసిరింది మాయమ్మ.

మాయక్క పక్క సూసినాను. ఎద్దుముడ్డిలో కర్ర బెట్టి ‘శాయ్‌, ట్రుర్ర్‌….’ అని అదిలిస్తానే ఒక పక్క నవ్వతా వుండాది.

అది జూసినాక నాకు పుండుమింద కారం జల్లినట్లయింది. మాయక్క మింద యాడలేని కోపమొచ్చేసింది. పొయ్యి మాయక్క సెయ్యి బట్టుకోని గెట్టిగా కొరికేసినాను.

ముంద బిత్తరపోయి సూసిన మాయక్క ‘అమ్మాఁ’ అని గెట్టింగా యాడస్తా అర్సింది.

‘ఏమైంది పాపా అంత గెట్టింగా అర్సినావు’ అని మాయమ్మ మాయక్క పక్క సూసి మళ్లీ నన్ను సూసింది. నేను రొప్పతా అన్నే నిల్సుకోనుండా. మాయక్క సెయ్యి బట్టుకోని వూదుకుంటావుంది. మాయమ్మకు జరిగింది అర్తమైపోయి పరిగెత్చొచ్చి మాయక్క సెయి బట్టుకోని సూసి ‘అయ్యో గాచ్చారమా దీనికి సూడబోతే పిచ్చిబట్టినట్లుండాది. ఒసే కిలీ, ఇదెంతపని జేసిందో సూడు’ అని అర్సింది.

గానిక్కి సెరుకులు బెట్టేది నిలపేసి కిలి పరిగెత్తు కోనొచ్చింది. సెరుకులు బెట్టకపోయినా ఎద్దులు వాటి పాటికవి తిరగతా వుండాయి. వుత్తగానిగి కిర్రుమని శబ్దమొస్తావుండాది.

‘మనిసి కాటుకి మందులేదంటారు. ఎంతపని సేస్తివె యాబ్రాసీదానా. ఆడాడా నెత్తురు కూడా కమ్ముకోనొస్తా వుండాది. ఏం జేసేది రా దేముడా’ అంటా మాయమ్మ అల్లాడతా వుంది.

ఎప్పుడు పరిగెత్తిందో కిలి. ఏందో మందాకు దెచ్చి ఎడమసేతిలో బెట్టుకొని కుడి సేత్తో నలిపి ఆ రసాన్ని గాయం మింద పిండిరది. ‘ఏం గాదుమా రొండు దినాలు సెల్ది వొస్తువులు పెట్టొద్దు. ఎండిపోతాదిలే’ అని ‘నొప్పిగా వుందామ్మా’ అని మాయక్కనడిగింది.

‘నువ్వు మందాకు పిండినాక సల్లంగానే వుండాది’ అనింది మాయక్క.

‘అదారిపొయినాక కొంచిం సురసురా అంటాది. అప్పుడు దీన్ని దానిమింద బెట్టుకో’ అని పసరుపిండిన పిప్పిని మాయక్క సేతిలో బెట్టి సెరుకులు బెట్న బొయ్యింది.

మాయక్క ఎద్దులు దోలను పోబోతే మాయమ్మ ‘వొద్దు, నువు బొయి ఆ ఈత సాప్మింద కొంచేపు పండుకోపో నాయినా. నేను దోల్తాపో’ అని మాయక్క మింద యాడలేని ప్రేమ కురిపిస్తా వుంది మాయమ్మ.

నాకు కోపం, ఏడుపు కమ్ముకోనొస్తా వుండాది. నన్నెవురూ పలకరించిన పాపాన బోలా. నాకాడ వుండాలంటే తలకాయ తీసేసినట్లుండాది. మెల్లింగా కండ్లెత్తి మాయక్క పక్కన సూసినాను. మోకాళ్లు మడ్సుకోని వూపుకుంటా నోట్లోనే లల్లాయి పాటలేవో పాడుకుంటా వుండాది.

గానిక్కి పాలు బట్టేది అయిపోయినాక మా నాయనొచ్చి ఎద్దుల్నిడిసి పెట్న్యాడు. పక్కనే తలకాయొంచుకొని మూతి ముడ్సుకోని గోర్లు గిల్లి కుంటా నిల్సుకోనుండిన నన్ను జూసి ‘ఏ మయిందిరా నీకు’ అని అడిగినాడు. మా నాయిన అన్నం దిన్న్యాక మాయిడికాయి లెవురన్నా కోసేస్తారని తోపులోకి బొయినాడు గదా! జరిగింది తెల్సినట్లు లేదు.

మాయమ్మెత్తుకొనింది. ‘నీ ముద్దుల కూతురు కొరకరాని కొయ్యిగా తయారయ్యుండాది. నిన్నగాక నిన్న ఆ సిలగుండ్లపల్లి లచ్చుమక్క సాపించిన తిట్లకు ఇంగెవురన్నా అయితే తోలుదీసేసుంటారు. పోనీలే పిలకాయిలు లీవుల్లో ఆడుకుంటా తప్పుజేసినారు, అనగూడని మాటలు బడినారు, ఇంగా నేనూ తిట్టేదెందుకులే అని కోపాన్ని నాకు నేనే అనవరించుకున్న్యా. గానిక్కాడికొస్తేనన్నా బుద్దిగా వుంటాదనుకుంటే అదేడుంటాది. పెద్దదాన్ని బట్టుకోని కొరికొదిలి పెట్టింది’ అని నాపక్కన దిరిగి ‘పో. మారాజుగా పొయ్యి వూరంతా బసివి మాదిరి కాకి తిరుగుళ్లు తిరిగుపో. అందురితో మాటలన్పించుకో పో, నీ బతుక్కి సిగ్గా సెరమా? పోఁ యాళకి మియవ్వ గిన్నికేసి పెడ్తాది. తిని తిరుగుపో’ అని తిట్టింది. మాయక్క పక్క జూస్తి. ఈ లోకంలో లేదది. నిద్రబోతా వుండాది. ఇదే సందని ఒకే పరుగుతో మాయవ్వోలింటికి దారి బట్న్యాను.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, ఇర్లచెంగి కథలు, సీరియల్, సెప్టెంబర్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.