cover

‘సప్త’స్వర వినోదం – అక్టోబర్ 2014

ఈ సంచికలో ప్రత్యేకించి దాదాపు అన్నీ పాటలూ 60దశకంలో విడుదలైన చిత్రాల్లోంచి ఎన్నుకున్నవే. పైగా ఆపాత మధురమైన ప్రేమగీతాలు కూడా. ఎప్పట్లానే ఆయా పాటల పల్లవులతో పాటు వీటన్నిటినీ కలిపి ఉన్న అంతఃసూత్రం కనిపెట్టి మీరు పంపే జవాబుల్లో రాయండి. అంతఃసూత్రం షరా మామూలే: సంగీతం, గాయకులు, గేయ రచయిత, చిత్ర దర్శకత్వం, నిర్మాణం, నటీనటులు, ఛాయాగ్రహణం, సంస్థ… ఇలా ఎవరైనా/ ఏదైనా ప్రత్యేక అంశం కలిగి ఉండొచ్చు. మీ జవాబులు ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. వాటిని ఫలితాలు వెలువడే వరకూ అప్రూవ్ చేయం. లేదా editor@kinige.com కు మెయిల్ చేయండి. సరైన జవాబులు చెప్పిన అందరి పేర్లూ కూడా ఫలితాల్లో ప్రస్తావిస్తాం.

1.

అలనాటి జనకుని కొలువులో

తొలి సిగ్గుల మేలి ముసుగులో

ఆ రాముని చూసిన జానకివై

అభిరాముని వలపుల కానుకవై

వాల్మీకి కావ్య వాకిట వెలసిన

వసంతమూర్తివి నీవే…

క్లూ: శోభన్ బాబు ‘కవి’ పాత్రను పోషించిన చిత్రం. దర్శకుడు కె. విశ్వనాథ్.

2.

చల్లనివేళా మల్లెల నీడా

చక్కనిదొంగా దాగెనట

దారులు కాచి సమయము చూచి

దాచిన ప్రేమా దోచెనట

మరలా వచ్చెను మనసే ఇచ్చెను

అతనే నీవైతే ఆమె నేనట

క్లూ: గాయకుడు ఎ.ఎం. రాజా సంగీత దర్శకత్వం వహించిన అతి కొద్ది చిత్రాల్లో ఇదొకటి.

3.

మెత్తగా సాగె మేని తీగ

మెలికలు తిరిగితె ఒక అందం

ఆ మేని తీగ వలపుల పందిట

అల్లుకుంటే ఒక అందం

మలయా నిలమున చెలిముంగురుల

మబ్బులూగితే ఒక అందం

ఆ ముంగురులే చెలికాని మోముపై

ముసురుకుంటే ఒక అందం

అదే ముద్దులొలుకే అనుబంధం

క్లూ: ‘పద్మశ్రీ’ని సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ సరసన నందమూరి అందగాడు కథానాయకుడుగా నటించారు. 60 దశకపు ఆఖర్లో వచ్చిన చిత్రం.

4.

అల్లరి ఏదో చేసితిని

చల్లగ మదినే దోచితివి

ఏమీ లేని పేదనని

నాపై మోపకు నేరాన్ని

లేదు ప్రేమకు పేదరికం

నే కోరను నిన్నూ ఇల్లరికం

నింగీ నేలకు కడుదూరం

మన ఇద్దరి కలయిక విడ్డూరం

క్లూ: భిన్నమైన కథాంశంతో ఆదుర్తి తీసిన సినిమా.

5.

నిన్ను నేను చూసే వేళ

నన్ను నీవు చూడ వేల

నేను పైకి చూడగానే

నీవు నన్ను చూతు వేల

తెలిసిపోయె నీలో ఏదో

వలపు తొంగి చూసెనూ…

క్లూ: దేవదాసీ కుటుంబంలోని అమ్మాయిని ఒక గొప్పింటి అబ్బాయి ప్రేమించే ఇతివృత్తంతో వచ్చిన ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించగా, విశ్వనాథన్, రామమూర్తిలు జమిలిగా మధురమైన సంగీతం అందించారు. కథానాయకుడు ఎన్.టి. రామారావు.

6.

ముఖముపైన ముసురుకున్న

ముంగురులే అందమూ

సిగ్గు చేత ఎర్రబడిన

బుగ్గలదే అందమూ

కోరిన చిన్నదాని

కోరచూపె అందమూ…

క్లూ: ‘సత్యభామ’ పాత్రకు ప్రాణం పోసిన అందాల తార నటించిన ఈ చిత్రానికి మాస్టర్ వేణు సంగీతం అందించారు.

7.

పల్లవించు మన కలలన్నీ

పరిమళించె విరజాజులుగా

ఆఁ… ఆఁ… ఆఁ…

వన్నె వన్నె కోరికలన్నీ

మిన్నుల కెగసెను గువ్వలుగా

క్లూ: చంద్రమోహన్ తొలిసారి వెండితెరపై కనిపించిన ఈ చిత్రంలో హిందీ నటి ‘రేఖ’ బాలనటిగా దర్శనమివ్వడం విశేషం.

నిర్వహణ: ఇశైతట్టు

Posted in 2014, అక్టోబర్, స్వరం and tagged , , , , .

One Comment

 1. 1
  కనుల ముందు నీవుంటే – కవిత పొంగి పారదా
  తొలి చిగురుల చూడగానే – కల కోకిల కూయదా
  (చెల్లెలి కాపురం)

  2
  కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు
  రెండు ఏకమై – ప్రేమే లోకమై – నా మది పాడే పరాధీనమై
  (పెళ్లికానుక)

  3
  కనులు మాటలాడుననీ – మనసు పాట పాడుననీ
  కవితలల్లితి ఇన్నాళ్ళూ – అది కనుగొన్నానూ ఈనాడూ
  (మాయని మమత)

  4
  కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే…!
  నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి? మరులే…!
  (సుమంగళి)

  5
  కనులు పలుకరించెను పెదవులు పులకించెను
  బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను
  (ఆడబ్రతుకు)

  6
  కనులు కనులు కలిసెను కన్నెవయసు పిలిచెను
  విసురులన్ని పైపైనే అసలు మనసు తెలిసెను
  (మురళీకృష్ణ)

  7
  కన్నుల దాగిన అనురాగం – పెదవులపై విరబూయాలీ
  పెదవులకందని అనురాగం – మదిలో గానం చేయాలీ
  (రంగులరాట్నం)

  అంతఃసూత్రం: ‘కనులు’! (సాహిత్యం)

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.