cover

కొన్ని కొత్త పుస్తకాలు – అక్టోబర్ 2014

త్రిపుర ఓ జ్ఞాపకం

రచయిత త్రిపుర నివాళి పుస్తకం

TripuraOGnaapakam600

 

త్రిపుర గురించి ప్రముఖుల నివాళి రచనలతో పాటు, త్రిపుర ఇంటర్వ్యూలు, ఇప్పటిదాకా పుస్తకంలో కలెక్ట్ చేయబడని అనువాదాలు, కవితలు, ఒక కథ, కొన్ని వ్యాసాలు, ఉత్తరాలూ, ముందుమాటలూ ఇవన్నీ కలిపి పుస్తకంగా తీసుకువచ్చారు. నివాళి రచనలు చేసినవారిలో భగవంతం, కనకప్రసాద్, సిద్ధార్థ, నరేష్ నున్నా, ఎం.ఎస్. నాయుడు, అఫ్సర్, వాడ్రేవు చినవీరభద్రుడు, డా. వి. చంద్రశేఖరరావు… మొదలైనవారున్నారు. పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, రమణజీవి, నామాడి శ్రీధర్, గొరుసు జగదీశ్వరరెడ్డి, కోడూరి విజయకుమార్ ఇత్యాదులు త్రిపురతో చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. త్రిపుర అభిమానులు దాచుకోవాల్సిన పుస్తకం.

ప్రస్తుతానికి ఈబుక్ లభ్యం

*

కొల్లబోయిన పల్లె

రచన: సడ్లపల్లె చిదంబర రెడ్డి

KollaboyinaPalle600

 

“రాయలసీమ గ్రామీణ జీవితంలోని కఠోర వాస్తవికతను ప్రతిఫలిస్తూ సడ్లపల్లె చిదంబరరెడ్డి రాసిన కథలివి.

తెలుగు పాఠకలోకానికి తనదయిన పద్ధతిలో సీమ మాండలికంలోని సొగసుల్ని పరిచయం చేస్తున్నారు. అ ప్రాంతంలోని పలుకుబడినీ, నుడికారాన్నీ జవజీవాలతో కథల్లోకి తీసుకురావడంలో రచయిత సఫలమయ్యారు. సీమలో బతుకు ఎంత కనాకష్టమో ఈ కథల్లో దృశ్యమానం చేసారు. చదివిన పాఠకుల హృదయాలు ఆర్ద్రమవుతాయి. సహానుభూతితో స్పందిస్తారు. నగరాలకీ, పట్టణాలకీ, పల్లెలకీ మధ్య పెరుగుతున్న అంతరాల్ని చర్చకు పెడతాయి ఈ కథలు.

నేలను నమ్ముకున్న రైతులు, కూలీలు దినదిన గండంగా బతకాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందో ఆలోచించాలన్న భావాన్ని వ్యక్తం చేస్తాయి. భూమిని నమ్ముకోడమే తప్పయిపోయిందనే దుస్థితిలోకి వ్యవసాయదారుల్ని నెట్టేసిన గ్లోబలైజేషన్ పర్యవసానాల దుర్మార్గాన్ని చెప్పకనే చెప్పడం ఈ కథల ప్రత్యేకత. కథాకథనంలో, వ్యక్తీకరణంలో, శైలీ శిల్పాల్లో చిదంబరరెడ్డిది విలక్షణ స్వరం. ఆ స్వరం నుంచి వచ్చిన ఈ కథలు చదవడం ఉద్వేగపూరిత అనుభవం.”  – గుడిపాటి

~ ప్రింటు పుస్తకం లభ్యం

*

చిత్తూరు కథ

సంపాదకత్వం: పేరూరు బాలసుబ్రమణ్యం

ChittooruKatha600

 

సాకం నాగరాజ రాసిన ముందు మాటలోనించి:-  “సంగటి ముద్ద, ఘుమ ఘుమలాడే వూరుబిండి, మునగాకు పొరుటు అచ్చంగా చిత్తూరు జిల్లా తిండి యిది. ఈ తిండి మీకు పెడతామని చెప్పి, పాలిష్ బియ్యంతో ఫ్రైడ్ రైస్ వొండి, నాన్ – పన్నీర్ బట్టర్, కాలీఫ్లవర్ ఆయిల్ రోస్ట్‌తో విందు పెడితే యీ ఆహారం కూడా భలేగా వుండొచ్చు గానీ అదయితే ఈ జిల్లా వంటకం గాదు. ఈ కథలు కూర్చడంలో యీ సమస్యే తలెత్తింది. కేవలం చిత్తూరు జిల్లా జనజీవనాన్ని ప్రతిఫలించే కథలే వేయాలా, చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగి రచయితలైన వారి కథలు వేయాలా అని తర్జన భర్జన పడి, చివరికి కొంచెం ‘విశాల దృక్పథం’తో కథల్ని స్వీకరించాము. ఈ పరిస్థితి పరిగణనలోకి తీసుకునే యీ పుస్తకాన్ని స్వాగతించండి. మా చిత్తూరు జిల్లా రచయితలు, రచయిత్రులు పలురకాలుగా చిత్రిక పట్టిన పలు కోణాలను ఈ కథలలో చూడవచ్చు అని సవినయంగా యీ సంకలనాన్ని సమర్పిస్తున్నాము. కథారచయితలకూ, సంపాదకత్వ బాధ్యత స్వీకరించిన మా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ పేరూరు బాలసుబ్రహ్మణ్యానికీ కృతజ్ఞతలు.”

~ ఈబుక్ గా లభ్యం

*

మేడ్ ఇన్ అమెరికా (కథలు), అమెరికా బేతాళుడి కథలు, చీకటిలో చందమామ (నవల)

రచన: సత్యం మందపాటి

MadeinAmerica600  AmericaBetaludiKathalu600   ChikatiloChandamama600

అమెరికా బేతాళుడి కథల గురించి శాయి:- “అమెరికాలోని ఆంధ్రుల జీవితం గురించి ఇదివరలో కొందరు రాయకపోలేదు. అయితే సత్యం మందపాటి ఆ జీవితాన్ని, అందులోని కష్ట నిష్టూరాలను, సుఖ సౌఖ్యాలనూ, రాగద్వేషాలనూ తెలియజెప్పడానికి ఎన్నుకున్న తరహా విభిన్నమైనది. అందుకు సూత్రధారిగా బేతాళుడ్ని నిద్రలేపడంలోనే గతని గడుసుదనం ప్రస్ఫుటమౌతోంది.

అమెరికా బేతాళుడి కథలు చెప్పడానికి హాస్యాన్ని, వ్యంగ్యాన్నీ ఆశ్రయించిన వైనం అబ్బురపాటుని కలిగించింది. సీరియస్ విషయాల్ని ఇలా చెప్పి ఒప్పించడం కత్తిమీది సాము లాంటిదన్నది కథకులందరికీ తెలిసిన విషయమే.

ఈ కథలన్నీ చదివితే అమెరికా ఆంధ్రుల జీవితం పారదర్శకమౌతుంది. అమెరికా వెళ్ళాలనుకునేవాళ్ళకు కలిగే కొన్ని వందల సందేహాలకు సమాధానాలు లభిస్తాయి – అనుమానాలు నివృత్తి అవుతాయి – మార్గదర్శక సూత్రాలు లభిస్తాయి.

ముళ్ళపూడి వెంకట రమణ గారి ‘రాజకీయ బేతాళ పంచవింశతి’ లోని ముఖ్యపాత్రలా ఈ ‘అమెరికా బేతాళుడు’ కూడా తెలుగు కథా సాహిత్యంలో చిరంజీవిగా నిలిచిపోగలడని నా నమ్మకం.”

~ ప్రింటు పుస్తకాలు లభ్యం

*

మధుపం (కథా సంపుటి)

రచన: డి. కామేశ్వరి

MadhupamKathasamputi600

 

కథల గురించి శ్రీరమణ:- “ఆరోజుల్లో రచయిత్రులు కథలు తక్కువగానూ, నవలలు ఎక్కువగానూ రాసేవారు. శ్రీమతి డి. కామేశ్వరి కథలే ఎక్కువ రాసారు. కామేశ్వరి కథకి షష్ట్యబ్ది పూర్తి అయిపోయింది. మూడుతరాల పాఠకులను తమ కథాకళితో అలంకరించారు. ఇంకా అలరిస్తునే ఉన్నారు.

ఇప్పటికే యీమె పేరు మీద పది కథాసంపుటాలు వెలువడ్డాయి. ఇది పదకొండో కథా సంపుటం.

శ్రీమతి కామేశ్వరి నిత్యోత్సాహి. కలం పట్టినవారికి వుండాల్సిన మొట్టమొదటి లక్షణం యిదే. తాము జీవిస్తున్న పరిసరాలను, తమ చుట్టూ వున్న సమాజాన్ని నిశితంగా చూడగలగాలి. ఫోటో తీసినపుడు మొదట నెగటివ్ వస్తుంది. తర్వాత దానిని పెద్దదిగా కావల్సిన ప్రింట్లు తీసి, ఫోటోని సమగ్రంగా అర్థం చేసుకుని ఆస్వాదించి ఆనందిస్తాం. డి. కామేశ్వరి లాంటి రచయిత్రులు పరిసరాలను నెగటివ్‍లో బంధించుకుని, వాటికి రంగులద్ది పాఠకులకు ప్రదర్శిస్తారు.

కొన్నింటికి విరమణలు వుండవు. జిగిలి వున్నన్నాళ్లు సాగించడమే. అందుకు కథారచనలాంటి సృజనాత్మకత వ్యాపకాలు అందరికీ అబ్బవు. ఇప్పటికే యీ రంగంలో లబ్దప్రతిష్టులైన శ్రీమతి డి. కామేశ్వరి మరో తరానికి కావల్సిన మరిన్ని కొత్త కథలు రాయాలని వారిని మనసా కోరుతున్నాను.”

~ ఈబుక్ ‍& ప్రింటు పుస్తకాలు లభ్యం

for regular updates, like Kinige Patrika facebook page.

Posted in 2014, అక్టోబర్, కొత్త పుస్తకాలు and tagged , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.