cover

సంగీతమయ్యోరు

Download PDF ePub MOBI

మా సావాసగత్తె పెరిందేవికి మేనత్త మొగుడు సంగీతమయ్యోరు. ఆయన పేరు మాకెవురికీ దెల్దు. అసలు దానిక్కూడా తెలుసో తెలియదో ఆ బగమంతునికె ఎరిక. మొదట్లో ఆయన్నందరూ గూడూరాయన అనే అనేటోళ్లు. ఆయన పిట్లు (ఫిడేలు) వాయించేది తెలిసినాక సంగీతమయ్యోరని పిలిసేటోళ్లు. మాట్లాడేటప్పుడు సా.. సా.. అంటా శానా మర్యాదిచ్చేవోళ్లు వూర్లోవాళ్లాయనకు.

ఇక్కడ పెరిందేవి వాళ్ల కుటుంబరం గురించి కొంచెమైనా సెప్పకుంటే ఇలావరిగా విూకెట్ల తెలస్తాది. పెరిందేవి వాళ్లది సెంద్రగిరి దెగ్గిర ఏదో వూరు. ఆ వూరి నుంచి ఈ వూరికి ఎందుకొచ్చినారో అర్తం కాదు. మావూరికొచ్చి సర్కారు సేందబాయికి ఈశాన్నంలో ఉండే రొండు కొట్టాల్లో వుండేవాళ్లు. వాళ్లను పులికింట్లోళ్లని పిలస్తారులే. పెరిందేవోళ్ల నాయనపేరు గోయిందు. ఈయనకు పెరిందేవి గాకుండా ఇంకో కొడుకు కూతురు వుండారు. సిన్నకూతురు వాళ్లమ్మకు పెద్దవొయిసయినాక మా వూర్లోనే పుట్టింది. ఆబిడ్డి పుత్తడి బొమ్మ మాదిరుందనే వోళ్లు. గోయిందన్నకు అనుంగు తమ్ముడొకాయనుండేవాడు. పేరు రామసెంద్రుడు. ఏనుగుంటపల్లికి దినాము మూడు మైళ్లు నడ్సిపొయ్యి టీచరుద్దోగం జేసేటోడు. పెళ్లీ పెటాకుల్లేకనే ముసలోడయిపోయినాడు. అంతేగాదు ఆయన కుటుంబమంతా మళ్లీ సెంద్రగిరికే పూడ్సినా కురప బోడక్క వొండిపెడితే తినుకుంటా ఈడేవుండాడు.

పెరిందేవికి ఇరవయ్యేండ్లు దాటినా పెద్దమనిషి కాలేదని ‘ఏమన్నా మందులుంటే సెప్పు కమలక్కా’ అని మాయమ్మను బంగపోయేది వాళ్లమ్మ.

ఇంక అసలు కతలో కొద్దాం. పెరిందేవికి ఒక మేనత్తుండేది. ఆయమ్మను నెల్లూరు దెగ్గిరుండే గూడూరుకు ఎందుకిచ్చినారో తెల్దు. కొంచెం ఎత్తుపండ్లతో తెల్లంగా వుండే మొగానికి పచ్చగా పసుబ్బూసుకోని నెత్తిన పెద్దకుంకం బొట్టు బెట్టుకోని ఎర్రంగా వక్కాకేసుకోని ఎప్పుడూ వూరంతా తిరగతా వుండేది. మొగుడూ పెండ్లాలిద్దురూ గూడూరొదిలిపెట్టి మా వూరికొచ్చేసినారు. వాళ్లు అందురూ ఒకే యింట్లో కలుసుకోనుండేవాళ్లు.

పెరిందేవోళ్ల మేనత్తపేరు గూడా మాకెవురికీ తెలిదు. ఇరుగ్గాళ్ల ఎంగయ్య పెండ్లామని ఎవురితోనన్నా సెప్పాల్సొస్తే సెప్పేటోళ్లు. మాట్లాడాల్సొస్తే అక్కా అనో, అవ్వా అనో అనేటోళ్లు. ఆయమ్మకు వొయసుకొచ్చిన కూతురొకతుండేదంట. సదువులో, సంగీతంలో, ఆటల్లో, పాటల్లో గబురు కన్నయ్య సిత్తూరి సిన్నయ్య మాదిరిగా గూడూరంతా పేరుబొయిందంట. ఆ బిడ్డి వున్నట్లుండి ఎందుకు సచ్చిపొయ్యిందో తెలీదు. ఏవిూ తెలీకుండా నేనీకతను ఎందుకు సెప్పాలనుకున్నానో కూడా నాకైతే తెలీదు.

కూతురు సచ్చిపోయి ఇద్దురి తమ్ముళ్లకు పెద్దదైన అక్క కంటికి కడెవెడుగా యాడస్తా వుండేది సూల్లేకనే తమ్ముళ్లాయమ్మను, ఆమె మొగున్ని ఈడికే వచ్చేయమనుంటారు. ఈడికొచ్చిన ఆయమ్మ మనోయేదన తగ్గేదా తప్పేదా! ఆమె యాదనను తగ్గించుకోడానికేమో ఎప్పుడూ గుళ్లూ గోపురాలూ తిరుక్కుంటా, సెట్టూ పుట్టకు నీళ్లు పోస్తా, రాయిరప్పకు పసుప్పూసి కుంకం బొట్టు పెట్టి మొక్కుంటా, బకితితో పెదచ్చినాలు సేసుకుంటా వుండేది.

దేవుళ్లకు పెట్దేదానికి పూలకోసమని ఆయమ్మ ఇల్లిల్లూ తిరిగేది. ఎవురిసెట్లో ఏ పువ్వు కన్పించినా లొటక్కని కోసి కొంగులో ఏసుకొనేది. సెట్లలో పూలు మాయమయ్యేసరికి ‘ఏ నా సవితి కొచ్చిందో రోగం’ అని సాపించే వాళ్లు. ఇరుగ్గాల్ల ఎంగయ్య పెండ్లామే ఈ పని చేస్తావుందని అందురికీ తెలుసు. కొందురు పోనీలే అనుకుంటే, కొందురు ‘మా పిలకాయిలు పెట్టుకోరా పూలు’ అని ఆమెతోనే అనేవాళ్లు. ఆ బాశాలి ఎట్లా పెట్టదులే అని కొందురు తెల్లారంగానే సెట్లలోని పూలుకోసి ఇంట్లో బద్రం సేసుకొనేటోళ్లు.

నాకు తెలియందింకోటుంది. ఇరికిరికి నడ్సేది పెరిందేవోల్లత్తమ్మే. కానీ దాన్ని ఆయమ్మ మొగునికి సేర్సి ఆమెనట్లా ఎందుకంటారో?

ఒకనాడాయమ్మ మా ఇంటికొచ్చింది. గూడూరులో మొగుడు సంగీతం క్లాసులు జెప్పి బాగా సంపాదించేవోడంట. ఇక్కడ పనీపాటా లేకుండా బిక్కాపక్కీరు మాదిరిగా దిగులు మొగాన్ని ఏలాడేసుకొని కూసోనుంటే పాపమనిపిస్తా వుందంట ‘ఆయన అక్కడే వుందామంటే సెతపోరి ఈడికి దీసుకొచ్చినాను. కమలమ్మా విూయింట్లో ఇద్దురాడ బిడ్లుండారు గదా! పెద్దోళ్లిద్దురికీ సంగీతం సెప్పించు. సరస్పతి వాళ్ల న్యాలికమింద నాట్యమాడతావుంటే రేపు సేసుకోబొయ్యేవోళ్లు కూడా వాళ్లను ఎగరేసుకోని బోతారు. నా మాటిను’ అని కాళ్లాయేళ్లా బడింది. మాయమ్మ వూఁ అనలా ఆఁ అనలా. ఇట్లే వూర్లో పిలకాయిలుండే ఇండ్లకంతా పొయ్యి అడిగిందంట.

సంగీతం ఇలువ దెల్సినోళ్లు మా వూర్లో ఎవురుండారు?

సాయింతరం సేనుకాన్నించి మా నాయిన రాంగానే ‘నాయినా, నాయినా పులికింటయ్యోరు సంగీతం సెప్పిస్తాడంటా. నేర్సుకుంటాం నాయినా’ అని మా నాయిన దెగ్గిర గోంజారినాను నేను.

మాయమ్మ కతా కమామీసంతా సెప్పి ‘కూతుర్లికి సంగీతం జెప్పించి కచేరీలు సేయించబోతావా. ఇంగేం పంగల్యా’ అని మా నాయనకి వొద్దని సెప్తానే ఇంగోపక్క నన్ను దిట్టింది.

పెద్దగా సదువుకోక పోయినా మా నాయిన గూడా కవే గదా! ఎంకటేస్పర సామ్మింద ఏలకొద్దీ పాటలు రాసినాడు. వాటిని రాత్రి పూట ఎన్నెల్లో పండుకున్న్యప్పుడు పాడేది మాయమ్మే.

‘నీకు వగా తరేగా ఏమన్నా వుందా! మొగిలి కిస్తే మడ్సి యాడబెట్టుకోవాలో తెలియకుండా అల్లాడే రకం నువ్వు. గాడ్దికేం దెలస్తాది గందంపొడి వాసన’ అని మాయమ్మమాటను పీతిరి గుంతలోకేసి తొక్కేసి మంచిదినం జూసి సంగీతమయ్యోర్ని రమ్మని సెప్పంపించినాడు మా నాయన.

అంతపనిలోల కూడా మా యమ్మ మా యిద్దురికీ ఇప్పపిండితో తలబులిమి తల్లకు గుడ్డలు సుట్టి ఎండలేకి బోయి ఇప్పుకోని ఆర్సుకోని రమ్మని పంపించింది.

తలగ్గట్టిన గుడ్డల్నిప్పుకోని సిక్కుతలనిండా వున్ని ఇప్పపిండిని ఇదుల్సుకుంటానే ‘సినపాపా… ఆడ జూడు’ అనింది మాయక్క.

సూత్తే ఏముంది. సంగీతమయ్యోరు సేతిలో పొడుగ్గా వుండే పెట్టినొకదాన్ని బట్టుకోని మెల్లింగా నడ్సుకుంటా వస్తావుండాడు.

అంతే జంగు పిల్లుల మాదిరిగా మెల్లింగా ఇంట్లోకి జారుకొని మాయమ్మయకు జెప్పినాము.

ఆ అయ్యోరు మా యింట్లో అడుగు పెట్టీపెట్టంగానే తళతళా సింతపొండేసి తోమిన కుమ్మకోలం సెంబులో నీళ్లుదెచ్చి ‘మంచి తీర్తం తీసుకోండి సావిూ’ అని సెంబు ఆయనకిచ్చి సాపదెచ్చి నడవలో పర్సింది మాయమ్మ.

నన్ను, మాయక్కను దేవునికి దండం బెట్టిచ్చి కుంకం బొట్లు పెట్టి సిక్కుతల్లను దువ్వకుండానే రిబ్బన్లుగట్టి అయివోరు ముందర కూసోబెట్టింది.

ఆయన పెట్టిదెర్సి దాన్లో నుంచి వాయిద్యాన్ని బైటికి దీసి దాన్ని కిర్రుబర్రుమని శుతిజేసినాక కండ్లు మూసుకొని మనసులోనే దండం బెట్టుకున్న్యాడేమో కండ్లు దెర్సి ‘మగా గణపతిం మనసా స్మరామి….’ అంటా ఒక నిమసం సేపు దాన్ని వాయిస్తా పాడినాడు. నేను, మాయక్క ఆయనకెదురుగ్గా సాపమింద సక్కాముక్కా లేసుకొని కూసున్నోళ్లం కూసున్నట్లే ఉండాము. మాయమ్మ వంటింటి దాలబంద్రాన్నానుకోని సూత్తా వుంది. తలమింద వుడుకుడుకు నీళ్లు బోసి దుబాన కూడా పెట్లేదా? పేన్లు వుడుకు నీళ్లు బడంగానే నిరామయం అయిపోయి ఇంతసేపటికి తేరుకున్న్యట్లుండాయి. అవి తలంతా సెక్కర్లుగొడ్తా ఇష్టమొచ్చినట్లు కరిసేస్తావుండాయి. తల్లో సెయిబెట్టి గీరుకుంటే ఇంగేమన్నా వుందా. అసింకింగా వుంటాది గదా! అయ్యోరు ఏమన్నా అనుకోవచ్చుగదా! అట్లే వోర్సుకోని కదలకుండా కూసోనుండా. మాయక్క పక్క జూస్తి. సెక్కిన శిల్పం మాదిరిగా వుంది. అయివోరు మళ్లీ దాన్ని కిర్రు బర్రు మనుకున్న్యాడు.

‘సూడండమ్మా, నేనెట్ల పాడితే విూరూ నాయనక అట్లే పాడల్ల. పాడతారుగదా’ అన్న్యాడు మాయక్కకంటే నేనే తలజోరుగా వూగించినాను సరేనని.

ఆయివోరు దాన్ని వాయిస్తా ‘సా……’, అని ఒకసారి ‘పా……’ అని ఒకసారి, ఈ రొండిట్నే ఒక పదిసార్లు మెడపైకెత్తి కిందికి దించి వొగలు వొగలుగా పలికించినాడు. మాయక్క సెప్పింది సెప్పినట్లే పలికిందని ‘నువ్వు కొంచం సేపు పలక్కుండా గొమ్ముని కూసోమ్మా’ అని నా మింద బన్న్యాడు. ‘సా……’ అన్న్యాడు. అన్న్యాను. ‘పా’ అన్న్యాడు. అన్న్యాను. ‘అట్లాగాదు కొంచం పైకి పాడాల’. ‘నీ బొంద..’ అని మనసులో తిట్టుకుంటా గొంతెత్తి ‘పా’ అని గెట్టిగా పాడినాను. ‘పైకి అంటే గెట్టిగా కాదు పై స్థాయిలో’ అన్న్యాడు. అర్థం కాలా. అయినా పాడినాను. అట్ల కాదమ్మా నువ్వు ఒకేసోట పలకతా వుండావు. ఒకటి కింద ఒకటి పైన పలకాల. కిందా పైనా అంటే నాకు కిసుక్కున నవొచ్చేసింది.

‘నవ్వొద్దు అయివోరు సెప్పినట్ల పాడు పాపా’ మాయమ్మ ఇసుక్కొనింది. నాతో నాలుగు సార్లు సా… పా…. అనిపించి ‘మళ్లీ రేపియ్యాలకే వొస్తాను. ఇద్దురూ బాగా ప్రాకిటీసు చేసుకోనుండండి’ అని ఆ పెట్టిని మా యింట్లోనే పెట్టి వాళ్లింటికి పూడ్సినాడు.

మర్సట్నాడు వొచ్చీరాంగానే ‘జోతమ్మా. పిట్లెత్తకరా’ అన్న్యాడు. ఓహో! దీని పేరు ‘పిట్లి’ బాగా గెవనం పెట్టుకోవాల అని పిట్లి, పిట్లి అని మనసులోనే శానా సార్లనుకున్న్యాను.

‘సుతి జేసుకున్న్యాక సా… పా… సెప్పించినాడు. నాతో ఇంగో రెండు సార్లెక్కువే సెప్పించినాడు. అదయిపోయినాక ఒక్కోకచ్చరానికి ఒక్కోయేల్లెక్కన నాలుగేళ్లు, మల్లి అరిసేతిని బోర్లించి తిప్పించి తొడమింద తాళమేసేది నేర్పించినాడు. తొడమింద తాళమేసుకుంటా ఆయనన్జెప్పినట్లే సెప్పమని స – రి – గ – మ, ప – ద – ని – స, స – ని – ద – ప, మ – రి – స’ సెప్పించినాడు. మాయక్కెట్ల జెప్పిందో గాని నేను అచ్చరం పలికినాక తాలమేస్తావుండానని శానాసేపు సెప్పించి, పాడించి వుడకాడించి పారేసినాడు.

‘ఇంటికి బోతా అక్కతో బాటుగా పాడి నేర్సుకో బాగా వస్తాది’ అనినాడు. ‘నీ బొందలే’ అని గొనుక్కున్న్యా.

మాయక్క సెప్పింది సెప్పినట్లే నేర్సుకుంటా వుందని మాయమ్మ దెగ్గిర మెచ్చుకుంటా వుంటే నాకు కంట్లో కారం జల్లినట్లనిపించింది.

అయివోరు బొయినంక ‘నేనింకా జంగమోళ్ల పాటలు, పొంబలోళ్ల పాటలు నేర్పిస్తాడేమో ఇస్కోల్లో గూడా పాడి పస్టొచ్చి ప్రయిజు దెచ్చుకుందామనుకోనుంటే “సా” అంట “పా” అంట “సరి” అంట “పద” అంట అదొక పాట, దానికొక తాలం, పిట్లొకటి (ఆ పేరు సమయానికి గుర్తొచ్చినందుకు శానా కుశాలైపోయిందనుకో) ఆ బోడి సంగీతం నేనేమీ నేర్చుకోను. కావాలంటే అవ్వా, నువ్వూ నేర్చుకోండి.’ అని పుల్లిరిసి పోయిలో బెట్నిట్ట సెప్పేసినాను మాయమ్మకు.

మాయమ్మ పెదేల మింద కొంచిం నవ్వు తారట్లాడినట్లనిపించింది. వాళ్లను నేర్చుకోమనినాననేమో.

‘వు గ్వూఁ’ మీ యవ్వ నేను నేర్సుకోవాల్సింది. ఎందుకంటే కచేరీలు చెయ్యాల గదా! సరే మారాజుగా నేర్సుకుంటాం. మేం జేసే పన్లన్ని నువ్వుజెయ్‌’ అని పరాసికాలాడిరది మాయమ్మ.

మర్సనాడు అయివోర్ని కండ్లజాడంగానే నేను పెద్దింట్లోకి బొయ్యి బొట్టెనక సందులో దాంకున్న్యాను. మాయమ్మ ‘సినపాపా, సినపాపా’ అని ఇల్లంతా ఎతకలాడతావుంది. వూహూఁ నేను మూసిడవలేదు.

అయ్యోరు అడుగుబెట్టకముందే మాయక్క నడవలో సాపేసి నంగనాచి మాదిరిగా నిల్సుకోనుంటాది. మాయమ్మ మల్లీ ఒకసారి పెద్దింట్లోకొచ్చి ‘సినపాపా, సినపాపా’ అని పిల్సి ‘వుంటే పలకదా’ అనుకునిందేమో అన్నించి పూడ్సింది.

బొట్టసందులో వుక్కకు సెమట్లు బడ్తావున్నా అన్నే కూలబన్న్యాను. కొంచేపైనాక బొట్లోనుంచి పిడికిడు సెనిక్కాయిలు తీసుకొని మెల్లింగా ఒగొటొకటే వొల్చుకోని సడీ సప్పుడు కాకుండా తింటావున్న్యాను. బొట్టకేసిన మెత్తును ముందే కొంచెం బొక్కబెట్టుండాంలే నేనూ మా పెత్తమ్ముడు గోపి.

ఏం సంగీతమో ‘సా’, ‘పా’ల సంగీతం జంగమోళ్లాటలో బోడోడు పాడే పాటలెంత బాగుంటాయి. బాలనాగమ్మ కథలో పొంబలాళ్ల గోయిందుడు పాడేపాటలు. బారతమయ్యోరు కతజెప్తా మద్ది మద్దిలో పాడేపాటలు. నాట్లప్పుడు కిలి, వాళ్లక్క వల్లి పాడేపాటలు, మాలోళ్లు గొబ్బితడ్తాపాడే గొబ్బిపాటలు ఓయమ్మో ఓయమ్మో ఎన్ని పాటలుండాయి. ఎన్ని సార్లిన్నా ఇంకా ఇందామా అన్పించే పాటలు. అమ్మ పాడేపాటలు ఎన్నని. ఇంకా అమ్మ నేర్పించాల అయ్యోరికి. నా సామిరంగా అమ్మ పాడే చల్‌మోహనరంగ పాటినాల సెవుల్లో తేని బోసుకున్నట్టే. ఇంకోపాట అది మాయమ్మ పాడాల ఇనాల. అదేందది

వూఁ……..

‘నా అబల గుబల తలుపు ఆరంకనాల ఇల్లు

నా ఇల్లు సుట్టి రారా రొడ్డోళ్ల సేద్దిగాడా

మేటైన మొనగాడా……

ఆ బాటపక్కబాయి బజారులోన ఇల్లు

నా ఇల్లు సుట్టి రారా ఒక్క ముద్దిచ్చి పోరా….’

మాయమ్మొచ్చి రెక్కబట్టుకోని ఒక యీడ్పు ఈడ్సింది ‘సంగీతం నేర్సుకోపాపా అంటే ఈడదూరుకోని సన్నాయి రాగాలు పాడతా వుండావా? రానీ విూ నాయిన్ని…. అయినా ఎన్ని సార్లొచ్చి పిల్చినాను. కుయ్‌ కయ్‌ అనకుండా ఎలక బొక్కలో దూరుకున్నట్టు….’, బియ్యం ఎత్తుకోను దెచ్చిన సేట నాడ బారేసి బరా బరా ఈడ్సింది.

‘అమా. నీ కాళ్లకు దండం బెడతా. ఆ అయివోరు సెప్పే సంగీతం నాకొద్దు. కావాలంటే నువ్వు నేర్పియ్‌ నేర్సుకోపోతే అప్పుడడుగు.’

పక్కున నవ్వొచ్చింది మాయమ్మకు. మళ్లీ మొగం ముటముట లాడిస్తా ‘నీ బొగిసారా యాడన్నా బో’ అని నన్నొదిలేసి సేట సేతిలోకి తీసుకొనింది.

ఆరాత్రి మళ్లీ మా నాయనొచ్చినాక ఈడెగిరి ఆడదూకింది. నేన్జేసిన నిర్వాకం సెప్పింది. ‘పోనీలే పెద్దపాపొకతే నేర్సుకుంటింది’ అన్న్యాడు మా నాయిన.

‘ఒక పనికిద్దురు పంచేటని ఆ సంబడం సంగీతానికి ఆయన దినాము ఒక దానికోసం తిరగాలా?’ అని నిష్టూరమాడిరది.

‘ఏవిూ, తిరగేదాయన. నీ కాల్లేమన్నా అరగిపోతాయా. లేకపోతే నీ బోషాణం కాలీ అయిపోతాదా!’ మా నాయన ఇంతెత్తెగిరినాడు.

‘ఆఁ దుడ్లయికుండానే వుత్త పున్న్యానికొచ్చి సెప్తాడు’.

‘నువ్వు ఎట్టేసి పెట్టిలో దాచుకున్ని సొమ్మొం ఇయనక్కరలేదులే. సేద్దెం గీద్దెం లేనోళ్లు. మనింట్లో ఎక్కాతుక్కా పడుండే సింతపండు, శెనిక్కాయలు, బెల్లం, మిరక్కాయిలు మనమెందురికీడం ల్యా. అట్లే ఈయినకీ అంత పంపిస్తాము. అయినా సంగీతమొచ్చినోళ్లు ఈ ఇలాకాలోనే ఎవురూ లేదు. నా కూతురే గొప్ప’ అని మాయక్క పక్కన సూసి మురిసిపోయినాడు.

నీకేం నీ కూతురు ఈ ఇలాకా మొత్తం తిరిగి కచేరీలు సేస్తాది. నువ్వు డాన్సులు సెయ్‌. అబ్బా కూతుర్లిద్దురూ ఒకరాడండి ఒకరు పాడండి. అందురూ మెచ్చుకుంటారు’ అనింది వ్యంగ్యంగా.

‘ఈ పొటుకు మాటలే వొద్దనేది. మమ్మల్ని సూస్తే ఎగతాళిగా వుందా నీకు. కొంచెం ఒళ్లు దెగ్గిరి బెట్టుకోని మాట్లాడ్తే మర్యాదగా వుంటాది’ కోపంగా అన్న్యాడు మా నాయిన.

అప్పిటికే మాయమ్మ కండ్లలో నీళ్లు బొటా బొటా కారిపోతా వుండాయి. దాన్ని జూసి మా నాయన సల్లబడినాడు.

‘నేనిప్పుడేమనేసి నానని?’ అడిగినాడు మెత్తంగా.

‘నువ్వేమంటావు. నా అగసాట్లు దేవునికే దెలియాల. మానవ మాత్రులెవురికీ అర్తం గాదులే’ అనింది కండ్లు దుడ్సుకుంటా.

‘అదేందో నువ్వే అర్తమయ్యేట్లు సెప్పగూడదా’.

‘ఈ పిలకాయిల్తో ఒకదినం ఏగితే తెలస్తాది. ఇస్కూలు నించి వొచ్చినాకైనా పెద్దపాప సిన్నోలిద్దుర్నీ ఈదిలోకి దీస్కపోయి ఆడించు కుంటావుంణ్ణ్యా. ఈ సంగీతం వల్ల ఆ బాగ్గెం కూడా లేకపోయా. అందుర్తో ఒక్క దాన్ని యాగలేక నానడుములిరిగి పోతా వుండాయి’ శానా యాష్ఠ పోయింది మాయమ్మ.

‘సినపాప నేర్సుకోనంటా వుంది గదా! దాన్నాడించుకోమను’

‘అయ్యోరామ. మా ఆయనే సరిగావుంటే మంగలోనితో ఏంపని అనిందంట ఎనకటికెవుతో. అదే తులగ. అది అంత సమర్తురాలైతే ఈ పంచాయితీ ఎందుకుంటాది. ఆ దూపరదొండిని అనవరించే దానికే ఇద్దురుండాల. దానికి మళ్లీ ఈ జంజాటమా. మొన్న కొంచేపు సూసుకోమని సిన్నబ్బోన్నిస్తే సేందబాయి కాడుండే బండమింద వాన్ని కూసోబెట్టి తొక్కుడు బిల్లాటాడతా వునిందంట. వాడు బండమిందనుంచి కొనాల కొచ్చి తొంగిసూస్తా వుండాడని ఎవురో సెప్తే వొచ్చి అదే వాన్ని కోపంతో కిందికి నెట్టేసిందంట. దేవుని దర్మాన ఆడ ఇసిక్కుప్పునింది కాబట్టి సరిపోయా. లేకపోతే వాడు మనకు దక్కేవాడే గాదు’ పెద్ద పురాణమిప్పింది మాయమ్మ నాగురించి.

మా నాయిన యాడ నన్ను సావగొడ్తాడోనని శానా బయమేసింది.

‘అవునా బంగారూ. అట్ల సెయ్యొచ్చునా. సిన్నోడు గదా. నువ్వెంత బాగా సూసుకోవాల’ అని ముదిగారంతో బుద్ది మద్ది సెప్పబట్న్యాడు మా నాయిన.

మర్సదినం సాకల ఎత్తిరాజులు కూతురు సరోజను పిల్సుకోనొచ్చి సంగీతమయివోరు ముందర కూసోబెట్న్యాడు. అది సత్తాసేరిలో వాళ్లవ్వోలింట్లో వుండి అయిస్కూల్లో సదవతావుంది. టవున్నో పెరిగింది గదా ప్యాసన్లెక్కువ. తెలుగు సరిగా రాదు.

తాళమేసేటప్పుడు తొడలమింద గొట్టుకొనేది సూస్తే రొండు దినాలకే తొడలు వాసిపోతాయేమో అన్పించేది.

ఎండకాలం సెలవులున్నన్ని దినాలు వొచ్చింది క్లాసుకు. నాకుమాదిరే పెతిదీ పదిసార్లన్నా సెప్పించుకొనేది. అందుర్లోకి మాయక్కే గబురు.

సంగీతం సారు నోటిలో సెప్పేవన్నీ నేర్పించేసినాక మాయక్కకు పిట్లువాయించేది నేర్పిస్తా వొచ్చినాడు.

లంబోదరలకు మికరా, వరవీణాముదు పాణీ, రార వేణూ గోపాబాలా…. ఈ పాటలన్నీ పిట్లు మింద మాయక్క వాయించి సూపెట్టేది. మాయమ్మే ఎవురొచ్చినా పాడమని మాయక్కను గోంజారేది.

మా యక్క పాడే పాటలన్నిట్లోకి ‘సీరామ జయరామా – జగదీశా పరందామా’ పాటంటే నాకు సెప్పలేనంత ఇష్టం.

మూడేండ్లు గడ్సిపోయింది. అన్నీ నేర్సుకున్న్యాక అయివోరు నడీదిలో కచేరి ఏర్పటు సేసినాడు. నేను మాలిని, కురపగోయిందప్ప కూతురు రాజి, రాగి రెడ్డోళ్ల కాదంబరి అయివోరు-

‘కుండాల పతిమోదు శయనా

అకండాల సితదివ్య శరణా బవ శరణా

…………………………………… అంటా (మాకర్తంగావులే) ఏమేమో పాటలు పాడ్తావుంటే డాన్సులు సేసినాము. చెంబు కాశికి నేను బోతానని ఏడ్సినాను. మాతాత సెప్పినాక సెంబు నా సేతికిచ్చినారు. శెంబు కాశిలో అయివోరికి శానా దుడ్లేవొచ్చినాయి.

మా నాయిన ఇంటిగ్గావాల్సిన సామగ్రి సెనిక్కాయిలు, మిరక్కాయిలు, సింతపండు, బీము, పచ్చిమిరక్కాయిలు, వంకాయిలు, ముల్లింగెడ్లు పండిందీ ఎండిందీ ఎప్పుడూ ఇంటికి పంపిస్తా వున్న్యా అయివోరికి, అయివోరి పెండ్లానికి గుడ్డలు దెచ్చి తాంబాలం తట్టలో బెట్టి నడీదిలో అందురిముందర మాయమ్మను గూడా పిల్చుకోని ఇచ్చినాడు. నన్ను మాయక్కను, మాయబ్బోళ్లను పిల్సి కాళ్లకు మొక్కించినాడు.

మాయక్క మూడేండ్లకంతా సంగీతం, పిటీలు బాగా నేర్సుకొనేసింది. ఒక సవరం బంగారంతో అయివోరికి ఉంగరం జేయించినాడు మా నాయన.

కొన్నాళ్లకు ఆలూ మొగుడూ పనీపాటా ల్యాకుండా వుద్దర తిండి దింటావుండారని గోయిందన్న పెండ్లాము ఆడా ఈడా అంటావుందని వాళ్ల గిన్నేసెంబూ దీస్కోని యాడికో ఎల్లిపోయినారు.

‘అయ్యో! పొయ్యేటప్పుడు నాకొక మాట సెప్పకూడదా. ఈడే ఎద్దుల కొట్టంలో వుండే యాతాము రూంలో వుండేమనే వాన్ని గాదా!’ అని మా నాయన అంగలార్సినాడు. మా యమ్మకు మాకు గూడా కండ్లలో నీళ్లు దిరిగినాయి. యాడుండాడో పున్యాత్ముడు.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, ఇర్లచెంగి కథలు, సీరియల్ and tagged , , , , , , .

One Comment

  1. బాగుంది. మాండలికంలో వ్రాయటం అన్నది అక్కడికేదో మనం పనిమీద పోతే, కొంచెం ఆత్మీయంగా ఆ పిల్ల మన యెదురుగా కూర్చుని ఈ‌ కథంతా చెబుతున్నట్లుగా వచ్చింది. బహుశః శిష్టవ్యావహారికంలో వ్రాసి ఉంటే ఈ‌ అందం వచ్చి ఉండేది కాదేమో. కథనశైలి, శిల్పం కూడా బాగున్నాయి. ఇతివృత్తాన్ని ఎక్కడ ఉంచాలో తుంచాలో తెలిసి వ్రాసినకథ. నాకు నచ్చిన మరొక అంశం అనవసరంగా పాత్రలకు పేర్లు పెట్టుకుంటూ పోకపోవటం. నిజానికి మరికొన్ని పాత్రలకూ పేర్లు పెట్టటం అవసరం కాకపోవచ్చును.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.