cover

పొద్దుటి ఆకాశం

Download PDF  ePub  MOBI

గోడ గడియారం చప్పుడుతో ఇంకోసారి స్నేహం

కిటికీ పరదాల మీద సూర్యుడుకి అడ్డొచ్చిన ఆకుల నీడల్లో కదులుతున్న కధలు

గాజుతలుపెనకున్న నన్నే చూస్తూ, వరండాలోని కుదురు లేని ఉడుత

కొన్ని పయనాల కొలమానంగా పైన పోతున్న విమానమొకటి

అప్పుడప్పుడూనే కాదు, కాస్త తరచుగానే ఆ ఆకాశానికీ, ఈ భూమికీ చెప్పాలనిపిస్తుంది

నేను నాలా ఉండాలంటే, నీలో నేను కొంతైనా ఉండాలని!

***

పగలేమో ఇన్ని కాంతిరేఖల్ని వేళ్ళకి చుట్టుకుని వేకువపై హుషారు పాటను కట్టడం

మిట్టమధ్యాహ్నమెప్పుడైనా మబ్బు పట్టిందా, రాలే గతాలను పలకరించడం

రాతిరవుతుంటే దోసిలిలో కొన్ని నక్షత్రాలను నింపుకుని ఇంటిదారి పట్టడం.

వెన్నెలసంతకం వేళల్లో ప్రపంచంలోని ప్రేమపాటలన్నీ గాలిలోకి విసిరివేయబడతాయో ఏమో

అవన్నీ తలదిండుకిందేసుకుని తెల్లకాగితమవ్వడం

ఎవరన్నారు, ఒంటరితనం వైనం అద్భుతం కాదని!

***

ఒద్దికగా ఇసుక రేణువుల్ని సర్దుతున్న ఆ అలలనే చూస్తున్నా

పల్చగా పేరుకుంటున్న ఆ పొడినూకలో ఏదో ప్రాణం కదలాడుతున్నట్టుంటే

తడి అంచులతో రహస్య సంభాషణ చేస్తూ వేలికొసలు

ఇసుక యాస నేర్చుకుని నా పేరే రాసుకుంటున్నా

ఆ నింగీ నీటి వాదులాట శంఖం హోరులో వినపడుతూనేవుంది

అయినా కాళ్ళకు తగిలే గవ్వల్ని ఏరుకుంటూ

కొన్ని పాదముద్రల్ని తనకు తిరుగు బహుమతినివ్వడం ఎంత ఆహ్లాదమని!

***

చేసేదేమిలేదనే ఖాళీతనంలోకి వెళ్ళడం ఒక విరామంphoto_sunrise

అప్పుడు తోచే ఆలోచనలన్నీ సగ సగాలే

నువ్విప్పుడే మాట్లాడెళ్ళిపోయాకా మళ్ళీ పిలవాలనిపించే పిలుపులా

ఏదో తోటలోని పాట వింటుంటే హఠాత్తుగా నిలబెట్టేసే జ్ఞాపకంలా

చల్లగాలి చేతుల్లోంచి చెవి చాటు దాక్కునే ముంగురుల్లా

కాసేపు పక్షి రెక్కల్లా, కాసేపు నీటి అంచుల్లా

కాసేపు పూలతావిలా, కాసేపు పిల్లనగ్రోవిపై తారాడే వేళ్ళల్లా,

కాసేపు ఒక మహారధ ఉత్సవ ఊరేగింపులా

అన్నన్నీ తిరిగి, చివరికీ నాలో నేను చేరి

చివరి వెలుగు రేఖ మీద మునగదీసుకుని పడుకుని

పొద్దుటికి ఒక ఉదయాకాశమవ్వడం ఎంత బాగుంటుందని!

*

Download PDF  ePub  MOBI

Posted in 2014, అక్టోబర్, కవిత and tagged , , , , , , .

5 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.