cover

పద్మప్రాభృతకమ్ (1)

Download PDF ePub MOBI

శూద్రకమహాకవి విరచిత

పద్మప్రాభృతకమ్

(భాణము)

తెలుగు వ్యాఖ్యానం

రవి

manavalli

.

భారతభారతికి రత్నాలరాశులిచ్చి
తనకంటూ ఏమీ మిగుల్చుకోని
కీ. శే. మానవల్లి రామకృష్ణకవి గారు
(1866 – 1957)

 .

ఎవని వాణి సేవ నెన్నతరము గాదు
అరిది కైత కెవడు బిరుదుజెట్టి
పాదములకు చిన్ని పద్మోऽపహారము
మానవల్లి కవికి మనసు మీర

.

మున్నుడి

పద్మప్రాభృతకం అనే ఈ భాణాన్ని రచించినది మృచ్ఛకటికం అన్న ప్రఖ్యాత నాటకాన్ని రచించిన శూద్రకుడనే మహాకవి. ఈ భాణం – చతుర్భాణి అన్న నాలుగు భాణాలలో ఒకటి. భాణం అంటే ఏకాంకిక. చతుర్భాణిలో భాణాలు, ఆ రచయితల వరుస ఇది. పద్మప్రాభృతకం – శూద్రకుడు, ఉభయాభిసారిక – వరరుచి, పాదతాడితకం – శ్యామిలకుడు, ధూర్తవిటసంవాదం – ఈశ్వరదత్తుడు. ఈ చతుర్భాణిని 1922 లో మానవల్లి రామకృష్ణకవి, S.K. రామనాథశాస్త్రి గారలు చేరి పరిష్కరించి ప్రకటించారు. పద్మప్రాభృతకం – అంటే “పద్మం అనే బహుమానం” అని అర్థం. ఇంత అందమైన పేరు గల ఈ భాణం లోని కథావస్తువు కాస్త ఎబ్బెట్టుగా, వేశ్యల రంధితో, ధూర్తుల ప్రస్తావనలతో, ఎకసెక్కపు మాటలతో, పొద్దస్తమానం శృంగారక్రీడల తాలూకు విషయాలతో నిండి ఉంటుంది. కొండొకచో, ద్వంద్వార్థాలు కూడా కద్దు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సంస్కృతభాణం – తెలుగు ప్రబంధకావ్యం వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం పోలికలతో ఉంటుంది.

క్రీడాభిరామంలో గోవిందమంచన శర్మ, టిట్టిభశెట్టి అనే ఇద్దరు మిత్రులు ఏకశిలా నగరంలో తిరుగుతూ చూస్తున్న దృశ్యాలను వర్ణిస్తూ కామమంజరి అన్న వేశ్యను చేరుకోవడం కథాంశమయితే, ఈ పద్మప్రాభృతకంలో శశుడనే విటుడు తన మిత్రుడు మూలదేవుడనే అతనికి దేవసేన అనే వేశ్యను కట్టబెట్టడం పనిగా ఉజ్జయిని నగర వీధుల్లో తిరుగుతూ, కనబడిన మనుషులను మాట్లాడిస్తూ, వారి స్వభావాన్ని బయటపెడుతూ, చివరికి దేవసేనను ఒప్పించి పని జరిపించడం కథ. ఒక విధంగా గిరీశాన్ని క్రీడాభిరామంలో నాయకుడుగా పెట్టి వ్రాసిన ఏకాంకికలా ఉంటుంది. క్రీడాభిరామం “వీథి” అనే నాటకప్రక్రియను పోలి ఉంటే, పద్మప్రాభృతకం భాణం అనే ఏకాంకిక. ఈ నాటకపు ప్రధాన ప్రయోజనం – సరిగ్గా క్రీడాభిరామానికి ఉన్న ప్రయోజనమే. క్రీడాభిరామంలో మైలసంత, ఏకవీర గుడి, మైలారభైరవుని భటవిన్యాసాలు, ముద్దరాలు ముసానమ్మవసతి, తురకమసీదు, అపైన కప్పురభోగి వంటకాలు, వీథుల్లో వేశ్యమాతల మోసాలు, మాచల్దేవి వృత్తాంతం ఇత్యాదులు, నాటి నగరజీవితాన్ని ఎలా ఉన్నదున్నట్టుగా ప్రతిబింబిస్తాయో, అలాగే ఈ పద్మప్రాభృతకం లోనూ, ఒకప్పటి ఉజ్జయిని నగరం, నాటి స్త్రీలు, వేశ్యల అలంకారాలు, రకరకాల పురుషులు, వారి ప్రవర్తనా, నాటి క్రీడలూ, వినోదాలు, పూలవీథి, వేశ్యావాటిక, నగరకూడలి, కూడలి మధ్యన శివుని పీఠం, వీటి గురించిన ఒక ఆసక్తికరమైన సమాచారం లభిస్తుంది. వాటినలా ఉంచితే కొన్ని ఝల్లుమనే వర్ణనలు ఈ దృశ్యకావ్యంలో కనిపిస్తాయి.

ఈ భాణకర్త గురించిన ఒక అభాణకం ఈ విధంగా ప్రచారంలో ఉంది.

వరరుచిరీశ్వరదత్తః శ్యామిలకః శూద్రకశ్చ చత్వారః |

ఏతే భాణాన్ వభణుః కా శక్తిః కాళిదాసస్య ||

భాణం వ్రాయటానికి వరరుచి, ఈశ్వరదత్తుడు, శ్యామిల కశూద్రకులే సాటి. వారు వ్రాసినట్టి భాణాలను కాళిదాసు కూడా వ్రాయలేడని ఆ శ్లోకార్థం.

సంస్కృత సాహిత్యంలో శూద్రకకవికి విశిష్టమైన స్థానం ఉంది. ఈ మహాకవి తన రచన మృచ్ఛకటికంలో పారంపర్యంగా వచ్చిన దివ్యప్రకృతులను, దివ్యాదివ్యులను పాత్రధారులుగా స్వీకరించక, సాధారణ మానవులను, అతి సాధారణంగా సమాజంలో జరిగే సంఘటనలను రచనలో భాగంగా చేసుకుని అపూర్వమైన నాటకీయత సృష్టించాడు. నాయకుడు దరిద్రుడు – అయినా కించిత్తు కూడా ఇతరుల వస్తువులనాశించడు, నాయిక వేశ్య – అయినా సౌశీల్యవతి. ఒక దొంగ – కేవలం తన చెలి కోసం దొంగతనం చేస్తాడు. జూదమాడిన వ్యక్తి బౌద్ధభిక్షువై నాయిక ప్రాణాలను కాపాడతాడు. ఇలా మృచ్ఛకటికంలో ప్రతి పాత్ర పైకి సాధారణంగా కనిపించినా అసాధారణమైన ఉదాత్తత కలిగి ఉంటుంది. పద్మప్రాభృతకంలోనూ ఉజ్జయినీ నగరసమాజం, పైకి ఉదాత్తంగా కనిపించే ధూర్తులు, మనుష్యులలో కృతకత్వం, నాటి కాలపు వేశ్యావృత్తి, వేశ్యల అలంకరణలు ఇటువంటి అతి సహజమైన సమాజప్రవృత్తిని చిత్రించాడు శూద్రక మహాకవి.

ఈ భాణంలో పాణినిదత్తకలశుడనే కృతక వ్యాకరణపండితుడు, పవిత్రకుడనే భ్రష్ట బ్రాహ్మణుడు, సంఘిలకుడనే దుష్టబౌద్ధభిక్షువు, ఇరిముడు (Herms) అనే యవనుడు, దూతిగా తన ఇంటికి వచ్చిన బౌద్ధ సన్యాసినిని చెరబట్టిన శైషిలకుడు, బంతాట ఆడే ఒక తరుణ యువతి, ఇంకా విటులు, కవులు, కులవధువు … వీరి స్వభావాలను అతి సహజంగా వర్ణించాడు శూద్రకమహాకవి. నాటికీ నేటికీ తరచి చూస్తే వేషభాషల్లోనే మార్పు. మనుషుల స్వభావాలలో మార్పు లేదు. శూద్రకకవి చూపించిన పాత్రలు నేడూ మనకు సజీవంగా కనిపిస్తాయి. ఆ విధంగా ఈ భాణం, విలక్షణమైనదైనా, విశిష్టమైనది.

భాణమనే ఏకాంకిక కాస్త ఒకే మూసలో ఉన్నప్పటికీ కాస్త అలవాటు పడితే ఆసక్తికరంగా చదివిస్తుంది.

భాణం

సంస్కృతనాటకాలు పదిరకాలు. ఈ భేదాలు నాయకుడు, ఇతివృత్తం, రసం అన్న అంశాలను బట్టి విభజింపబడినాయి.అవి

నాటకం ప్రకరణం భాణః ప్రహసనం డిమః |

వ్యాయోగసమవకారౌ వీథ్యఙ్కేహామృత ఇతి ||

నాటకం, ప్రకరణం. భాణం, ప్రహసనం, డిమము, వ్యాయోగము, సమవకారము, వీథి, అంకము, మరియు ఈహామృగము. ఈ పదింటిని కలిపి దశరూపకాలు అంటారు. ఇందులో భాణం లక్షణాలు ఇవి.

>> ధూర్తచరితం కావాలి.

>> స్వచరితం కానీ, ఇతరుల చరితం కానీ కావచ్చు.

>> చతురుడు, బుద్ధిమంతుడైన విటుడు నాయకుడు కావాలి.

>> ఉక్తి, ప్రత్యుక్తి ఆకాశభాషణం అనే ప్రక్రియ ద్వారా జరగాలి.

>> వీరము లేదా శృంగారము ప్రధానమై ఉండాలి.

>> ఇతివృత్తం కల్పితమై ఉండాలి.

>> ఏకాంకిక, భారతీవృత్తి సహితమై ఉండాలి.

>> ముఖ, నిర్వహణ సంధులు ఉండాలి.

>> లాస్యాంగముల నిర్వహణ ఉండాలి.

విటుడు అంటే – గీతాది విద్యలలో నిష్ణాతుడై, నాయకుని సహాయపడే పాత్రధారి.

ఆకాశభాషణం – అంటే యవనికపై ఎదుట వ్యక్తి లేకయే, ఆ వ్యక్తిని ఉన్నట్టు సూచించి, అతడు చెప్పే మాటలను కూడా “ఏమంటున్నావూ?” అని తనే చెబుతూ ఆకాశంతో మాట్లాడినట్టుగా ప్రవర్తించుట.

భారతీవృత్తి అంటే యవనికపై దృశ్యముకన్నా వాక్కునకు ప్రాధాన్యత గల సంవిధానము. (ఒక రకంగా భాణము శ్రవ్యకావ్యమని చెప్పుకోవచ్చును)

దాదాపుగా పై లక్షణాలన్నిటినీ పద్మప్రాభృతకం కలిగి ఉందనే చెప్పవచ్చు.

కవికాలాదులు

సంస్కృతభాషలోని ఇతరకవుల కాలనిర్ణయం లాగానే శూద్రకమహాకవి కాలం విషయం కూడా గందరగోళంగా ఉంది. ఈ మహాకవి రచనలలోని నాటకీయతలాగానే ఈయన కాలాన్ని గుర్తించడం ఒక అపూర్వమైన విషయంగా మారింది. మృచ్ఛకటికంలో శకారుడు అనే పాత్ర చాణక్యుని ప్రస్తావిస్తాడు.

అంధ ఆలే పలా అంతీ మల్లగంధేణ శూ ఇదా |

కేశవిందే పలామిట్టా చాణక్కేనేవ్వ దోఅదీ ||

(మృచ్ఛకటికం ౧-౩౯)

కాబట్టి తప్పకుండా శూద్రకమహాకవి చాణక్యుని తర్వాతి కాలపు కవి అని చెప్పవచ్చు. భాస మహాకవి ప్రతిమానాటకంలో అర్థశాస్త్రానికి చాణక్యుని పేరు చెప్పక, మేథాతిథి పేరును ఉటంకించాడు కాబట్టి, భాసునికి చాణక్యుడు తెలిసి ఉండడని ప్రాజ్ఞులు అంటున్నారు. అంటే భాసుడు చాణక్యునికి పూర్వుడు. శూద్రకుడు చాణక్యుని ప్రస్తావించాడు కనుక భాసుని తర్వాతి కవి.

మృచ్ఛకటికంలోనూ, పద్మప్రాభృతకంలోనూ బౌద్ధభిక్షువు పాత్రలున్నాయి. మృచ్ఛకటికంలోని బౌద్ధకాలమూ, నాటకంలో కనిపించే ప్రాచీనమైన ప్రాకృతభేదాలను చూచి, ఆ కాలం శాతవాహన వంశమూల పురుషుడైన శ్రీముఖ శాతవాహనుని కాలమని కొందరు ఊహించారు. సిముకుడు – అనే శ్రీముఖుడే శూద్రకుడని మరి కొందరు. కాదు కాదు ఆంధ్రులకు మూలపురుషుడైన శివదత్తుడే శూద్రకుడని మరికొందరు.

ఆ కాలగణన అటుంచితే శూద్రకుడు అన్న మహారాజు పాత్ర సంస్కృతసాహిత్యంలో అనేక కావ్యాలలో చోటుచేసుకుంది. ఆ ప్రస్తావనలన్నీ వివరిస్తే అదొక కావ్యమవుతుంది.

ఏదేమైనా, శూద్రకమహాకవి భారతీయ సాహిత్యంలో, ఆ మాటకొస్తే ప్రపంచ సాహిత్యంలో విలువకట్టలేని వజ్రం. మృచ్ఛకటికం భాసనాటకమైన చారుదత్తానికి విస్తృతి అని అనేకులు నిర్ధారించారు. అలా అన్నా, శూద్రకమహాకవి స్వతంత్రతకూ, స్వోऽపజ్ఞతకూ వచ్చిన నష్టమేదీ లేదు.

ఈయనను ప్రాచీనభారతదేశకవి అనుకుంటే సరిపోతుంది. లేదూ కాలం ఖచ్చితంగా తెలియాలంటే – క్రీ.పూ. రెండవ శతాబ్దం నుండి క్రీ.శ. రెండవశతాబ్దం మధ్యన అని అనుకోవచ్చు.

మూలదేవుడు

కర్ణీసుతుడు, మూలదేవుడు, మూలభద్రుడు లేదా కలాఙ్కురుడు అన్న పేరు సంస్కృతసాహిత్యంలో పలుచోట్ల వినిపిస్తుంది. ఈ పాత్ర బహువిస్తృతమైన సంస్కృతసాహిత్యవినీలాకాశంలో ఒకానొక విశిష్టమైన తార. క్రీ.పూర్వం రెండవశతాబ్దం మొదలుకుని పదకొండవ శతాబ్దంలో క్షేమేంద్రుని కళావిలాసం వరకూ, బహుశా ఆపైన కూడా, సాహిత్యంలో చెదురుమదురుగా ఈ మూలదేవుని ప్రస్తావనలు వినిపిస్తాయి. ఆధునిక కాలంలో మూలదేవుని గురించి Maurice Bloomfield అనే పాశ్చాత్య ప్రముఖుడు ప్రముఖంగా పరిశోధించాడు. Bloomfiled గారి పరిశోధనాకాలానికి (క్రీ.శ. 1913) చతుర్భాణి వెలువడలేదు. అందుకని ఆయన వ్యాసంలో మూలదేవుడు ఒక పౌరాణిక పాత్రగా అనిపిస్తాడు. అయితే పద్మప్రాభృతకంలోని మూలదేవుడు మానవాతీత లక్షణాలు కలవాడు కాదు. అందుచేత మూలదేవుడు ఒక చారిత్రక వ్యక్తిగా ఊహించవచ్చు.

పద్మప్రాభృతకం కర్ణీపుత్రునికై శశుడు చేసిన యాత్ర కాబట్టి స్థూలంగా ఈ మూలదేవుని ప్రస్తావనలను, ఆ పాత్ర తీరుతెన్నులను గురించి తెలుసుకుందాం.

- “…కర్ణీసుత కథేవ సన్నిహిత విపులాచలా శశోపగతా చ…” బాణభట్టు కాదంబరిలో వింధ్యాటవీ వర్ణనలోని ఒక వాక్యం ఇది. వింధ్య – కర్ణీసుతుని కథలాగా దగ్గరగా ఉన్న విపులమైన శిఖరాలతోనూ, శశ అనబడే లోధ్రవృక్షాలతో కూడినది గాను ఉన్నదని ఒక అర్థం. మరొక అర్థం – కర్ణీసుతుని కథలాగా విపుల, అచల, ఇంకా శశులతో కూడినదిగా ఉన్నదని మరొక అర్థం. బాణభట్టు ఉటంకించిన విపుల ఉదంతం మన పద్మప్రాభృతకంలో వస్తుంది. అచల – అన్న పేరు వెనుక ఏముందో తెలియదు. మానవల్లి రామకృష్ణకవి గారు ఒకచోట కర్ణీసుతుని జన్మస్థానం వింధ్యపర్వత ప్రాంతాలనున్న అచల అన్న జనపదమని పేర్కొన్నారు. కవి అలా చెప్పడానికి కారణం తెలియదు. అయితే పద్మప్రాభృతకం ప్రకారం కర్ణీసుతుడు పాటలీపుత్రానికి చెందినవాడు. అతని కార్యక్షేత్రం ఉజ్జయిని.

- “…కర్ణీసుత ప్రహితే పథి మతిమకరవమ్” – దండి దశకుమారచరితమ్ లో అపహారవర్మ కథలో అపహారవర్మ చెప్పిన మాట ఇది. కర్ణీసుతుడు చూపిన మార్గంలో బుద్ధిని నిలుపుదాం అని అర్థం. ఈ కథను అపహారవర్మ చెప్పగానే రాజహంసుడు – “ఆహా, నీ తెలివి కర్ణీసుతుని మించిపోయింది కదా” అంటాడు.

కథాసరిత్సాగరంలో భేతాళపంచవింశతి కథలలో పదిహేనవ కథలో మూలదేవుడు ప్రధానపాత్రధారి. ఆ కథ స్థూలంగా ఇది. మనః స్వామి అనే ఒక బ్రాహ్మణకుమారుడు ఒక మత్తగజం నుండి శశిప్రభ అనే యువరాణిని రక్షించి ఆపై ప్రేమలో పడతాడు. తన ప్రేమ సఫలం కావాలని ఉపాయం చెప్పమని ధూర్తసిద్ధుడు మూలదేవుని దగ్గరకు వెళతాడు. మూలదేవుడు ఒక గుళిక సాయంతో మనఃస్వామిని స్త్రీగా మార్చి, రాజుతో చెప్పి యువరాణికి చెలికత్తెగా అమరుస్తాడు. యువరాణికి చెలికత్తెగా స్త్రీవేషంలో ఉన్న మనఃస్వామి అదను చూచి ఏకాంతంలో యువరాణికి తన గురించి చెప్పి నోటనున్న గుళికను తీసివేసి పురుషుడిగా మారి ఆమెతో సుఖిస్తాడు. ఇలా ఈ కథ ప్రకారం మూలదేవుడు మాయమంత్రాలు నేర్చి, మానవాతీతమైన చర్యలు చేయగల ఒక ధూర్తసిద్ధుడు. ఈ భేతాళకథలలో మరొక కథలోనూ మూలదేవుడు కనిపిస్తాడు. శుకసప్తతి కథల్లోనూ ఒక కథ ఇలాంటిది ఉంది. సుబంధుని వాసవదత్త కథాకావ్యంలో స్వయంవర వృత్తాంతంలో ఈ కర్ణీసుతుడు కలాఙ్కురుడుగా కనిపిస్తాడు.

ఎవరైనా మహాసత్వుడైన మనిషిని జీవించిన కాలంలో సాధారణంగానే చూచినా, మరణించిన తర్వాత, అతని చుట్టూ అభూతకల్పనలను ఏర్పరుచుకుని మానవాతీత శక్తులను అలాంటి వ్యక్తికి ఆపాదించటం మానవులసహజప్రవృత్తి. కథాసరిత్సాగరానికి బృహత్కథ మూలం. బృహత్కథ నాటికి మూలదేవుడు మహిమలు చూపెట్టే, మానవాతీతశక్తులు గల మాయగాడు. అంటే బృహత్కథ కంటే కనీసం నూటయేభై, ఇన్నూరు యేండ్లకు పూర్వమే మూలదేవుడు మరణించి ఉండాలి. పద్మప్రాభృతకంలో మూలదేవుడు సహజమైన మనిషే కాబట్టి, బహుశా ఈ భాణం కర్ణీసుతుని కాలానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. అంటే శూద్రకమహాకవి బృహత్కథకంటే చాలా ముందుకాలం నాటి వ్యక్తే కావాలి.

జైనసాహిత్యంలోనూ మూలదేవుని ప్రస్తావనలు కనిపిస్తాయి. ధూర్థాఖ్యానం అన్న ఒక కథామాలికలో మూలదేవుడు ఒక ధూర్తుడు. ధూర్తాఖ్యానానికి కర్త హరిభద్రసూరి.

ఇలా రకరకాల ఉదంతాలలో వచ్చే ఈ కర్ణీసుతుడు – అరవై నాలుగు కళలలో ఒకటైన చోరకళకు సంబంధించిన స్తేయశాస్త్రకర్త అని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. (ఈ స్తేయశాస్త్రం కాలగర్భంలో కలిసిపోయింది) Bloomfield గారు గోణికీపుత్ర అన్న పేరు కూడా మూలదేవునిదేనని సూచించారు. ఈ గొణికీపుత్రుడు ఒకానొక కామశాస్త్రప్రవర్తకుడు. క్షేమేంద్రుని కళావిలాసంలో మూలదేవుడు రకరకాల ధూర్తులను, ధూర్తపద్ధతులను వివరిస్తాడు. కళావిలాసంలో మొదటి సర్గలో దాంభికులకు ఇచ్చిన ఉదాహరణ పద్మప్రాభృతకంలోని పవిత్రకుని పాత్రను పోలి ఉంటుంది.

ఈ కర్ణీసుతుని వర్ణన పద్మప్రాభృతకం లో ఇది.

కులే ప్రసూతః శ్రుతవానవిస్మితః

స్మితాభిభాషీ చతురో విమత్సరః |

ప్రియంవదో రూపవయోగుణాన్వితః

శరీరవాన్ కామ ఇవ ధనుర్ధరః ||

కర్ణీపుత్రుడు కులీనుడు, పండితుడు, గంభీరుడు, స్మితభాషి, చతురుడు, మాత్సర్యము లేనివాడు, మృదుభాషణుడు, రూపయౌవనగుణసంపన్నుడు, శరీరమున్ననూ, ధనుస్సు లేని మన్మథుడు.

మనవి

శూద్రక మహాకవి కృతి, మానవల్లి వారు వెలికితీసిన వజ్రం అయిన ఈ పద్మప్రాభృతకాన్ని తెనుగు చేయడం శక్తికి మించిన సాహసం. అయితే తెలుగులో ఎవ్వరూ పూనుకోని కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఇందులో వెతికితే దోషాలు కనబడవచ్చు. అయితే ప్రయత్నంలో లోపం లేదని, తప్పులు దిద్దుకోవడంలో వెనుకంజ లేదని వినయపూర్వకమైన మనవి.

ఈ చతుర్భాణికి మూలం 1949 లో మోతిచంద్ర శ్రీ గారి సంస్కృతపాఠం. హిందీ అనువాదం.

చతుర్భాణిని రేడియో మామయ్య – బాలాంత్రపు రజనీకాంతరావు గారు అనువాదం చేశారని నాకు ఈ టీక, వ్యాఖ్యానం పూర్తి చేసిన తర్వాత శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారి ద్వారా తెలిసింది. శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.

(తరువాయి భాగం వచ్చేవారం)

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.