cover

కథలలో క్లుప్తత

Download PDF  ePub  MOBI

కథలకు సంబంధించిన క్లుప్తత విషయంలో చాలా ఏళ్ళనుండి వ్రాస్తున్న రచయితలకి కూడా చాలా అస్పష్టత వుందని కొన్ని చర్చలు చూసినపుడు అర్థమవుతుంది.

క్లుప్తత అంటే ఏమిటో, అది ఎందుకు అవసరమో, క్లుప్తత లోపించడం వల్ల కథకి జరిగే నష్టం ఏమిటో ఇంతకు మునుపే ‘కథాశిల్పం’ వంటి పుస్తకాలు వివరించాయి. క్లుప్తతని ఎలా సాధించాలో కూడా ఆ పుస్తకాలు కొంతవరకూ చర్చించాయి. అవన్నీ మళ్ళీ యదాతథంగా ఉదహరించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు.

క్లుప్తతని సాధించలేక పోతున్న కొందరు రచయితలు తరచూ వేసే కొన్ని ప్రశ్నలని, వారికి వున్న కొన్ని సందేహాలని చర్చించి వాటికి కొంత వివరణను ఇచ్చే ప్రయత్నం మాత్రమే ఈ వ్యాసంలో చేస్తున్నాను.

ఏదైనా ఒక కథలో క్లుప్తత తగ్గిందని, సూటిగా ఒక విషయం వైపు సాగకుండా అనవసరమైన విషయాలు చర్చించబడినాయని విమర్శ వచ్చినపుడల్లా రచయితలు ఈ క్రింది సందేహాలు వెలిబుచ్చడం కనిపిస్తుంది.

 1. కానీ చాలామంది పాఠకులు తమకు అదే (అనవసరమని చెప్పబడుతున్న వర్ణన లేదా విషయం) బాగా నచ్చిందని చెప్పారు. అది చదువుతుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించిందనీ, మనసు పులకించి పోయిందనీ అన్నారు.
 2. అది కథకి పూర్తిగా సంబంధం లేని విషయం కాదు కదా! దానితో అసలేమీ ఉపయోగం లేదంటారా? దానివలన ఆ సన్నివేశాన్ని, పాత్రలని పాఠకుడు ఇంకొంత బాగా అర్థం చేసుకోగలుగుతాడు కదా!
 3. దానివలన కథలో చదివించే గుణమేమీ తగ్గిపోలేదు కదా! చదివించేలా ఉన్నంతవరకు, పాఠకులకి విసుగు కలిగించనంతవరకు కొంత ప్రక్కకి వెళ్ళి వ్రాసినా పరవాలేదని అనుకుంటున్నాను. ఈ వర్ణన/విషయం చదవడం తమకి విసుగేమీ కలిగించలేదని చాలామంది నాకు చెప్పారు.

అవును. కొందరు పాఠకులు, అభిమానులు అలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. అది నిజమే. రచయితలు కథలు వ్రాసేది పాఠకుల కోసమే కాబట్టి ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగానే చర్చించాలి.

ఈ సందేహాలని పైపైన చుస్తే “అవును, నిజమే” అనిపిస్తాయి కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే, కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇవి పాఠకులు సర్దుకుపోయే మార్గాలే కానీ కోరి ఎంచుకునే విషయాలు కాదని సులభంగానే అర్ధమవుతుంది.

ఒక చిన్న కిటుకు ఉపయోగిస్తే చాలు. ఇలాంటి సందేహాలు వచ్చినపుడు వాటినే పదేపదే మననం చేసుకుంటూ కూర్చోకుండా వాటికి వ్యతిరేకదిశలో వుండే ప్రశ్నలు వేసుకోవాలి. సమాధానం మనకే తెలుస్తుంది.

ఉదాహరణకి వర్ణన వల్ల కొందరికి మనసు పులకించింది సరే, ఆ పులకింత కథకి ఉపయోగపడిందా! ఆ పులకింత లేకపోతే కథలో చెప్పిన విషయాన్ని, కథ అందించాలనుకున్న అసలు అనుభూతిని పూర్తిగా అందుకోలేమా!

అలాగే ఒక వర్ణన/సంభాషణ వుండడం వల్ల ఆ సన్నివేశాన్ని, పాత్రలని పాఠకుడు ఇంకొంచెం బాగా అర్థం చేసుకుంటాడు సరే. ఒకవేళ తీసేస్తే ఇంకొంచెం తక్కువ అర్థం చేసుకుంటాడా? ఇంతే అర్థం చేసుకుంటాడా? ఒకవేళ తక్కువ అర్థం చేసుకుంటే అది కథకి ఏమైనా నష్టం కలిగిస్తుందా? అంటే ఈ పాత్రని/సన్నివేశాన్ని కొంచెం తక్కువగా అర్థం చేసుకోవడం వలన మొత్తం కథని అర్థం చేసుకోవడంలో కలిగే ఇబ్బంది ఏమైనా ఉందా? -ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి.

సరదాగా ఒక విషయం చెప్పుకుందాం. పరాయి ఆడవాళ్ళని గురించి భర్తలు సానుభూతిగా మాట్లాడినపుడు “నన్ను తప్ప ప్రపంచంలో వున్న ఆడవాళ్ళందర్నీ బాగానే అర్థం చేసుకుంటారు మీరు!” అని భార్యలు ఉక్రోషపడటం చూస్తుంటాం. అప్పుడు భర్త “అబ్బే, వాళ్ళని అర్థం చేసుకోవడం నిన్ను ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడం కోసమే” అంటే ఎలా వుంటుంది? కాస్త అటూయిటుగా ఈ సమర్ధనా అలాంటిదే.

ఇక విసుగు కలిగించక పోతే ఏదైనా చదవచ్చు అన్న సమర్ధన. దీనికి ఎదురు ప్రశ్న కూడా వేయనక్కర్లేదు. కొంచెం స్పష్టతతో ఆలోచిస్తే సరిపోతుంది. ఇలా ఎవరైనా అన్నారంటే అర్థం ఏమిటి? వాళ్ళు ఈ కథని కాలక్షేపం కోసం చదువుతున్నారని. కనుక ఆ కాలక్షేపం స్థాయిని కథ మించాలి అన్న ఉద్దేశ్యం రచయితకి వుంటే ఆ అనవసర భాగాన్ని తీసివేయడమే మంచిదని.

అసలు సమయమే గడవని వాళ్ళు, సమయాన్ని గడిపేందుకు ఏ ఆసరా లేనివాళ్ళు తప్ప విసుగు కలిగించక పోతే చాలు ఏదైనా చదువుతాం అని అనరు. నిజానికి అటువంటివారు ప్రస్తుత సమాజంలో ఎవరూ లేరనే చెప్పాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. సాహిత్యం కోసం అంతో యింతో సమయం కేటాయించేవారు కూడా వారు చదవాలనుకుని ఇష్టంగా కొనిపెట్టుకున్న పుస్తకాలని సైతం ఏళ్ళ తరబడి చదవడం లేదు. చదవలేక పోతున్నారు. ఎందుకు? ప్రస్తుతం వారికి అంత సమయం లేదు. లేదా ఆ యిష్టమైన పుస్తకాలు చదవడం కన్నా ముఖ్యమైన పనులు వారి జీవితాన్ని ఆక్రమించి వున్నాయి. అటువంటి సందర్భంలో విసుగు కలిగించక పోతే చాలు కథకి సంబంధం లేని విషయమైనా సరే చదువుతాం అని ఎవరైనా చెప్తే అది మొహమాటంతో చెప్తున్న మాటా లేక వాస్తవంగా చెప్తున్న మాటా అని గమనించుకోవాల్సిన అవసరం వుంది.

లేదు, అది మొహమాటం కాదు వాస్తవమే అనుకుందాం. కొందరిచే అనవసరము, అవాంఛనీయము అని భావించబడుతున్న వర్ణనలని, సన్నివేశాలని మరి కొంతమంది పాఠకులు నిజాయితీగానే ప్రశంసిస్తున్నారనుకుందాం. అటువంటి సందర్భం గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం.

నిజమే. రచయిత అసలు విషయం నుండి కొంచెం ప్రక్కకి వెళ్ళి వ్రాస్తే, “ఆ విషయమూ బాగానే వుంది కదా!”, “అది కూడా ఆసక్తికరంగానే ఉంది కదా! మనకి మరొక క్రొత్త విషయం తెలిసింది కదా!” అని సంతృప్తి చెందే పాఠకులు కొందరు వుండవచ్చు. గమ్యం వైపు నేరుగా నడిచి తీరాలన్న నియమం లేని పాఠకులు, ఒక చోటికని బయల్దేరి నాలుగు దారులు తిరిగివచ్చే అలవాటు వున్న పాఠకులు దీనిని లోపంగా పరిగణించకపోవచ్చు. ఇది కూడా బాగానేవుంది అనవచ్చు. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే, అటువంటి పాఠకులు కూడా తమని రచయిత అలా అడ్డదిడ్డంగా తిరుగనివ్వకుండా ఒక లక్ష్యం వైపు సూటిగా చేయిపట్టుకు నడిపించుకు వెళ్ళినపుడు ఆనందిస్తారు.

నిజానికి అభిమానంతోనో, అమాయకతతోనో క్లుప్తత పాటించని రచయితని (కథలో వున్న మిగిలిన అందాలని దృష్టిలో పెట్టుకుని) కొందరు పాఠకులు సమర్ధించినా అదే కథని మరింత క్లుప్తంగా, సూటిగా తమకి చెప్పిన రచయితలని వారు గౌరవిస్తారు.

కనుక కొన్ని అనవసరమయిన విషయాలు వ్రాసినా పరవాలేదులే అనుకునే అవసరం పాఠకుడికి కలగించడం కంటే అంత ఏకాగ్రత లేకుండా మాటిమాటికీ ప్రక్కకి జారిపోయే పాఠకుడిని కూడా సూటిగా నడిపించే జాగ్రత్త రచయిత తీసుకోవడం బాగుంటుంది.

సరే, ఇంత చెప్పుకున్నాక, క్లుప్తత అనివార్యంగా పాటించవలసిన నియమం అని ఒప్పుకున్నాక అది లోపించడానికి కారణాలు కూడా క్లుప్తంగా చెప్పుకుందాం.

క్లుప్తత లోపించడానికి కథాశిల్పం పుస్తకంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు మూడు కారణాలు చెప్పారు. వర్ణనలు ఎక్కువ అవడం, పాఠకుల తెలివి మీద రచయితకి నమ్మకం లేకపోవడం, అనవసరమైన సంఘటనలు చొప్పించడం.

అయితే ఈ మూడింటిలో మొదటిదీ, చివరిదీ నిజానికి కారణాలు కావు. అవి క్లుప్తత లేకపోవడం అనే లక్షణానికి నిర్వచానాలే. రెండవదాన్ని మాత్రమే ‘కారణం’గా చెప్పగలం. పాఠకుల తెలివి మీద నమ్మకం లేనందువలన, వాళ్ళని తక్కువగా అంచనా వేయడం వలన రచయిత ప్రతి చిన్న విషయాన్నీ వివరించ పూనుకుంటాడనీ, దానివల్ల క్లుప్తత తగ్గుతుందనీ అంటారు ఆయన ఆ పుస్తకంలో.

అదలా ఉంచితే వర్ణనలు “ఎక్కువ” అవడం అనే లక్షణం – ఈ లక్షణాన్నే క్లుప్తత తగ్గటానికి ఒక కారణంగా ఆయన చెప్పారు కానీ అసలీ లక్షణానికి కారణాలేమిటో చెప్పలేదు.

వాటి గురించి మాట్లాడేముందు ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. వర్ణనల వలన అసలేమాత్రమూ ప్రయోజనం లేదని కానీ అవి పూర్తిగా అనవసరమని కానీ నా ఉద్దేశ్యం కాదు. వాటివలన చెప్తున్న విషయం మరింత గాఢంగా పాఠకుని మనసుపై ముద్రించబడే అవకాశం వుంటుందన్న మాట నిజమే. అయితే నిడివి ఎక్కువగా వుండే నవలల వంటి వాటిలో వర్ణనలు వుపయోగించడం వేరు. మూడు నాలుగు పేజీలు దాటని కథలలో ఉపయోగించడం వేరు. చిన్న కథలలో వర్ణనలు రసానికి కాక రసాభాసకి కారణమవుతున్నాయి. వాటి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను.

ప్రతిభావంతులయిన రచయితలు చిన్నకథలలో కూడా వర్ణనలని సమర్ధవంతంగా, కథ అందాన్ని పెంచే విధంగా వాడుకొనగలరేమో కానీ అది చాలా అరుదు. కనుక వీలయినంతవరకు కథలలో వర్ణనలు తగ్గించడమే మంచిది.

ఇపుడు అనవసర వర్ణనలు కథలలో ప్రవేశించడానికి కారణమయ్యే విషయాల గురించి చెప్పుకుందాం.

కొందరు రచయితలలో సాధారణంగా వుండే ఒక భావన.. తాము గొప్ప భావుకులమన్న, ఈ లోకం అందించే రుచులని ఆస్వాదించడంలో మిగిలినవారికంటే నేర్పరులమన్న ఒక విశ్వాసం – అది కొంతవరకు కథలలో అనవసర వర్ణనలు, వివరాలు పెరగడానికి కారణమవుతుంది. అలాగే, తమకు తెలిసినదంతా చెప్పాలన్న తపన, తమకి వున్న పుస్తక/ప్రపంచ పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలన్న ఒక ఆరాటం – అవి కూడా వర్ణనలు ఒకింత ఎక్కువయ్యేందుకు, తద్వారా క్లుప్తత తగ్గేందుకు కారణమవుతాయి. అయితే ఈ “ఆరాటం” క్లుప్తత కన్నా శైలిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పాలి. ఈ వ్యాసం పరిధి క్లుప్తత మాత్రమే కనుక ఆ విషయాన్ని ప్రస్తుతానికి ప్రక్కన పెడదాం.

ఇక కథాశిల్పం పుస్తకం చెప్పిన మరో లక్షణం “కథలో అనవసర సంభాషణలు/సన్నివేశాలు చొరబడడం” – దానికి కూడా ఆ పుస్తకం కారణాలు చెప్పలేదు. అనవసర సంభాషణలు/సన్నివేశాలు పెరగడానికి నేను గమనించిన రెండు కారణాల గురించి చెప్తాను.

ఒకటి అతిజాగ్రత్త. చాలా సందర్భాలలో ఎవరినీ నొప్పించకూడదు అన్న అతిజాగ్రత్త వలన క్లుప్తత తగ్గుతుంది. కథ అంటేనే సాధారణంగా అది ఏదో ఒక సంఘర్షణని ప్రతిబింబిస్తుంది. కనుక రెండు వర్గాలకి సంబంధించిన పాత్రలు కథలో కనిపించే అవకాశం వుంటుంది. ఈ రెండు వర్గాలలో ఏదో ఒక వర్గంలోనో లేదా ఇద్దరిలోనూనో వున్న లోపాలని, దోషాలని చూపించే ప్రయత్నం చేస్తున్న రచయిత ఆ లోపాలని నొప్పించకుండా చెప్పాలని భావించడం మంచిదే. కానీ అది అతి కాకూడదు. ఆ నొప్పించకుండా వుండడం అనే విషయాన్ని కేవలం వివరణలతో, బుజ్జగింపులతో సాధించేందుకు ప్రయత్నించకూడదు. పాత్రచిత్రణలో సహజత్వం, భాషలో శిల్పంలో చమత్కారం వంటివాటి సహాయంతో ఆ సవాలును ఎదుర్కోవాలి తప్ప నిన్ను నొప్పించే ఉద్దేశ్యం నాకు లేదని వివరించ పూనుకోకూడదు. అప్పుడు అనవసరమైన సంభాషణలు/సన్నివేశాలు చొరబడి క్లుప్తతని తగ్గిస్తాయి.

నిజానికి నొప్పించే విషయాన్ని ఎంత క్లుప్తంగా చెప్తే అంత మంచిది. వివరించే కొద్దీ దానిలోని గాంభీర్యత పలచబడి గౌరవం తగ్గే అవకాశం ఎక్కువవుతుంది.

రెండవది అస్పష్టత. మనం చెప్తున్న విషయం మీద మనకి పూర్తి అవగాహన, స్పష్టత, విశ్వాసం లేనపుడు కూడా క్లుప్తత తగ్గుతుంది. నిజానికి దీనిని పైన చెప్పుకున్న అతిజాగ్రత్త అనే కారణానికి మూలకారణంగా కూడా మనం భావించవచ్చు. మనం దేనిని సమర్దిస్తున్నామో ఆ అంశం పై మనకి పూర్తిగా గురి లేనపుడు గోడమీద పిల్లి వాటంగా మాట్లాడటం జరుగుతుంది. అది క్లుప్తతని దెబ్బతీస్తుంది. ఎందుకంటే అటువంటి సందర్భాలలో అవతలివారికి కొంత చెప్తూ మనకి కూడా మనం కొంత చెప్పుకుంటాం. దానిని తగ్గించుకోవాలంటే మరొకరికి చెప్పడానికి కూర్చునే ముందు మనకి మనం చెప్పుకోవడం పూర్తయిపోవాలి. మనకి స్పష్టంగా అర్థం అయాక, మనలోని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకున్నాక, మనకి ఆ విషయం మీద వంద శాతం నమ్మకం కలిగాక మాత్రమే మనం దానిని మరొకరికి చెప్పేందుకు పూనుకోవాలి.

కాబట్టి సారాంశం ఏమిటంటే, కథలో క్లుప్తత అవసరమా అన్న విషయం మీద సందేహాలు అనవసరం. ఎందుకంటే క్లుప్తత లోపించినపుడు సమర్ధించుకుని ఆనందించే పాఠకులు వుంటే ఉండవచ్చును కానీ క్లుప్తత వుంటే ఆనందించని పాఠకులు ఉండరు. చెప్తున్న విషయం పట్ల స్పష్టత, నిబద్ధత, ధైర్యం వంటివి అ క్లుప్తతని సాధించేందుకు దోహదపడే కొన్ని అంశాలు.

*

Download PDF  ePub  MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, వ్యాసం and tagged , , , , , .

9 Comments

 1. ‘మనకి స్పష్టంగా అర్థం అయాక, మనలోని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకున్నాక, మనకి ఆ విషయం మీద వంద శాతం నమ్మకం కలిగాక…’ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకోలేము’ అన్నది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. నిజానికి ఈ దొరకని సమాధానంతో పడే సంఘర్షణే ఉత్తమ సాహిత్యంగా నిలుస్తున్నది.

 2. మంచి వ్యాసం. చెబుతున్న విషయంపై, తన ఉద్దేశంపై స్పష్టత లేని రచయితలే ఎక్కువగా విస్తృతికి పూనుకుంటారని అంగీకరిస్తాను. కానీ దానితో పాటే తమకు తెలిసిందంతా చెప్పాలన్న తపన (దానికి కథతో సంబంధం ఉన్నా లేకున్నా), “భావుకత’ ఉందని నిరూపించుకోవాలన్న తహతహ క్లుప్తతను గౌరవించకుండా చేస్తాయి. అయితే క్లుప్తతను ఒక మంచి లక్షణంగా మహామహులే (ఉదా: విశ్వనాథ సత్యనారాయణ, రావిశాస్త్రి) గుర్తించని సాహిత్య చరిత్ర మనది. కనక, ఈ వ్యాసంలో చేసిన వాదన ఎంత సముచితంగా ఉన్నా, తెలుగు కథకులు దాన్ని ఆచరిస్తారన్న నమ్మకం లేదు.

 3. సామాన్యంగా పత్రికలవారు కథలకోసం పిలుపునిచ్చినప్పుడుగానీ కథల పోటీల ప్రకటనలని ఇచ్చేటప్పుడు గానీ పేజీల పరిమితిని విధిస్తూ ఉంటారు. దాన్ని చూసి కొందరు రచయితలు “ఈ పేజీల గోలేమిటండీ బాబూ కథ అన్నాక అది మొదలైన చొట మొదలై ముగియాల్సినచొట ముగుస్తుంది. దాన్ని ఇన్నే పేజీల్లో పట్టించమని నిర్బంధిస్తే ఎలా ?” అంటూ వాపోతూ ఉంటారు. ఈ రెండూ సమంజసమైనవే. ఆ పేజీల నిబంధన లేకపోతే తొలి వడపోతలో కథలని చదివే వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. ఆ నిబంధనవలన కొంతమేరకైనా కథల్లో క్లుప్తత తనంత తానుగానే పాటించబడుతుందనేది పత్రికల వారి అనుభవ సారం. అయితే మంచి కథలు కేవలం పేజీల నిబంధనల వల్లనే రావనేది ఆ పత్రికలవారికి బాగా తెలుసు. అందుకే పేజీల నిబంధన ఉన్నప్పటికీ కొన్ని కథలు నిర్దేశిత పేజీల సంఖ్యని మించి విస్తరించడం కనిపిస్తుంది. అలా కనిపించిన సందర్భాలలో కొందరు రచయితలు “అయినవాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనో పెట్టడం ఆ పత్రికకి అలవాటే” అంటూ పెదవి విరుస్తారు. అంతే తప్ప ఆ పేజీల నిబంధన ఎందుకు పెట్టి ఉంటారనేదాని గురించి అంతగా ఆలోచించరు.
  అంటే మూడు పేజీల్లో ముగిసిన కథకి క్లుప్తత ఉన్నట్లూ ఆరేడు పేజీలు విస్తరించిన కథకి క్లుప్తత లేనట్లూనా ?
  నిజానికి కథ ఎంత నిడివి ఉండాలనేది రచయిత నిర్దేశించుకునే అంశం కాదు. ఎంచుకున్న కథా వస్తువే దానిని నిర్దేశిస్తుంది. ఆ సమయంలో రచయిత కేవల కలం కాగితంలా ఆ కథ రాయడానికి ఒక ఉపకరణం మాత్రమే. రాయడం పూర్తయ్యాక దానిని మళ్ళీ చదువుకుంటున్నప్పుడు ఆ రచయిత దానిని ఏ దృష్టితో చదువుతున్నాడన్నదానిపైనే క్లుప్తత ఆధారపడి ఉంటుంది. దానిని రచయితగా చదువుకుంటే దానిపైన మమకారం ఎక్కువై ఒక్క అక్షరాన్ని కూడా మార్చలేడు. ఒక పాఠకుడిగా చదివితే కొంత మేరకు క్లుప్తత చేకూరుతుంది. ఒకవేళ ఆ కథని విమర్శకుడిగా చదువుకోగలిగితే ఖచ్చితంగా ఆ కథలో మిగిలిన శిల్పాంశాల్లాగే క్లుప్తత కూడా సమ పాళ్ళలోనే ఉంటుంది. అందువల్ల వారు రాసిన కథ ఎన్ని పేజీలు విస్తరించినప్పటికీ క్లుప్తంగానే ఉంటుంది. తొలి దశలోనే క్లుప్తత సాధించగలిగిన రచయితల సంఖ్య ఏ భాషలో అయినా పరిమితంగానే ఉంటుంది. ఎందుకంటే వివిధ శిల్పాంశాల్లో క్లుప్తత అనేది సాధనతో సంక్రమించే ఆస్తుల్లో ఒకటి. కాబట్టీ ఆయా రచయితలు రాస్తున్న కొద్దీ క్రమ క్రమంగా తమకు తెలియకుండానే క్లుప్తత ప్రాధాన్యతని గుర్తిస్తూ ముందుకు సాగుతూంటారు. అయితే కొంతమంది మాత్రం మీరన్నట్లు ఎదురు ప్రశ్నిస్తారు. అలా ఎదురు తిరిగే పరిస్థితిని చేరుకున్నారంటే వారు ఎదగడానికి అంగీకరించడం లేదు అని అర్థం.

 4. The calibre of a writer is normally assessed by his ability of narration of the ongoing events, proper depiction of the moods of the characters, observation of surroundings etc..without which the writing will become a mere documentary. In my opinion, the writer, with these abilities, shall take his reader with him to the scene of happenings and see that the reader feels the mood himself. In the process, we can over rule redundancy. Let the ‘BUSY PERSON’ not bother about the art of literature and confine himself to TVs, SMS etc.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.