cover

వెన్నెల

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 13వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన ఇక్కడ చూడండి.)

Download PDF ePub MOBI

హాలో! నా పేరు లలితా శర్మ. నేను ఒక రిటైర్డ్ జిల్లాధికారి. కాని ఈ సమాజానికి నేనొక సంఘసేవకురాలిగానే ఎక్కువగా తెలుసు. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. నా జీవితం అనే రైలు చివరి స్టేషనుకు వచ్చేసింది. ఒక్కో భోగీలో ఒక్కో రకం అనుభవం నాకు ఎదురైంది. ఈ అనుభవాన్ని ఎవరితోనో పంచుకోవాలని నా మనసుకు అనిపిస్తోంది. కానీ పక్కన ఎవరూ లేరు. వెన్నెల కాంతి మాత్రమే నన్ను ఆవరించింది. ఏదో మాట్లాడాలని వుంది, కానీ నేను ఏకాంతంగా వున్నాను. ఎవరైనా వస్తే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు నా మనసు ఎటువంటి ప్రశాంతతను కోరుకుంటుందో అదే వాతావారణాన్ని భగవంతుడు నాకు అనుగ్రహించాడు. చందమామ చుట్టూ నక్షత్రాలు ఉన్నట్టుగా నా కనుచూపుమేరలో పాపికొండలు, ఎక్కడో దూరంగా ప్రకాశిస్తున్న దీపం నా కనులకు పండుగగా అనిపించింది. కాసేపట్లో వర్షం పడేటటువంటి వాతావరణం నా మనసుకు రెక్కలు తొడిగింది. నా జీవితానుభవాలు ఈ వాన చినుకులతోనైనా చెప్పాలని అనిపించింది. ఈలోపు ఆ మబ్బుల్లోంచి వచ్చిన చందమామ దూరంగా నిలిచింది. నేనూ వినొచ్చా అన్నట్లు! దానితో నా కథను చెప్పాలని అనుకున్నాను. ఎప్పుడూ ఎందుకు నీ చుట్టూ ఇన్ని నక్షత్రాలు ప్రకాశిస్తాయి. నా జీవితంలో మాత్రం నాలుగే నాలుగు నక్షత్రాలు ప్రకాశించాయి. అవే నా –

* బాల్యం

* చదువు                * యవ్వనం

* జీవితం

ఓయ్! అప్పుడే ఆవులింతలా? ఇంకా వివరించందే?

బాల్యం:-

ఇప్పటికీ, బాల్యానికి చాలా తేడా ఉందని అనిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని మొత్తం చదివినా ఏమీ అర్థం కాలేదు, కానీ బాల్యంలో ఏమి తెలియని ఈ ప్రపంచం గురించి నాకు అన్నీ తెలుసు అనిపించింది. “కష్టం, బాధ, కన్నీరు, అలోచన అనే రాగాలు ఏమీ లేని సంగీతం బాల్యం. ఈ వినసొంపైన సంగీతంతోనే నా 12 సంవత్సరాల బాల్యం (7 వ తరగతి) గడిచిపోయింది. ఆకాంక్షలు లేని, నిస్వార్ధ దశ బాల్యం.

యవ్వనం:-

నా సంగీత జీవితంలో “ఏదో సాధించాలి” అనే రాగం మొదలైన అద్వితీయ క్షణం, అదే నా యవ్వనానికి నాంది. చదువు విలువ తెలిసింది. ఎందరో మహానుభావుల గురించి తెలుసుకుంటుంటే నాకూ అలా అవ్వాలనిపించింది. పది మందికి స్ఫూర్తిగా నిలవాలనిపించింది. ఆ క్షణం మా ఊరిలో నా కటౌట్ పెట్టడానికి ఏ ప్రదేశం బాగుంటుందా అనే చిలిపి ఆలోచన కూడా వచ్చింది. అన్ని పనుల్లో చురుకుదనం పెరిగింది. ఇక్కడి నుండి నా సంగీత జీవితంలో “కలలు” అనే శ్రుతిని పలికించడం మొదలుపెట్టాను. రోజూ నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా, కోరుకున్నవన్నీ జరిగినట్లుగా, అనుకున్నదంతా సాధించినట్లుగా కలలు కనేదాన్ని. ఆ కలలు నాకిచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ కలల్లో నుండి మేల్కొనే సరికే నా కలలను నిజం చేసుకునే అవకాశం వచ్చింది. అదే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు! అవాక్కయ్యారా? అవునండి! నేను మూడు సంవత్సరాలు కలలు కంటూనే ఉన్నాను, ఏమో అలా గడచిపోయింది అంతే. ఏదో సాధించాలనే పట్టుదలతో చదివాను. పబ్లిక్ పరీక్షలు ముగిసాయి. ఒక్కక్షణం కాలేజీకి వెళ్తాననే ఆనందం నా కళ్ళల్లో మెరుపులాగా మెరిసింది, మరుక్షణమే రిజల్ట్ ఎలా వస్తుందోననే బాధ ఉరుములా ఉరిమింది. రిజల్ట్ సమయం దగ్గరకొచ్చింది. మండల ప్రధమస్ధానం నాకే దక్కింది. మొదటి కల నిజమైంది. ఇక జీవితంలో అన్ని కలలు నిజం చేసుకోవచ్చు అనే ఒక ధీమాతో వున్న నాకు జీవితం ఒక మలుపుగా తోచింది. జీవితం ఓ ప్రశ్న లాగా తయారయింది. “ఇల్లు కట్టాలో – సున్నం వేయాలో, ఫొటోలు తీయాలో – ఫోజులివ్వాలో, వైద్యం చేయాలో – రోగిగా మారాలో తెలియని పరిస్ధితి”. చివరకు , ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయానికి వచ్చాను. ఇంకేముంది కాలేజీ అనే రంగుల కల నా కళ్ళ ముందుకు వచ్చింది. ఆ క్షణం నక్షత్రంలా చిన్నదే అయినా, అది నాకు ఇచ్చిన ఆనందం ఆకాశంలా చాలా పెద్దది.

చదువు:-

హోస్టల్ జీవితం నాకు కలిగించిన భయం నా జీవితంలో నుండి “ఏదో సాధించాలి” అనే సంగీత స్వరాన్ని శాశ్వతంగా దూరం చేసింది. నా సమయం అంతా నా జీవిత గమ్యాన్ని సాధించడానికి కాకుండా , ఈ వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికే సరిపోయింది. ఆ క్షణం నా జీవిత వర్షంలో కొన్ని దుర్భర చినుకులు కురిశాయి. అవి ఏంటి అంటారా?

(1) అందరికంటే నేనే తక్కువ (2) నేను తప్ప అందరూ తెలివైన వారే (3) నేను బాగా చదవలేను (4) నా లక్ష్యాన్ని చేరుకోలేను.

ఇలా మొదలైన ఈ చినుకులు నాలోని ఆత్మస్ధైర్యం అనే మంటను ఆర్పేసాయి. ఏదో ఉండాలి కాబట్టి ఉంటున్నాను అనేంత యాంత్రికంగా తయారయ్యాను. ఇక్కడే నా జీవితం ఇంకో మలుపు తిరిగింది. “నీ పున్నమి వెన్నెల పడి పుష్పాలు రోజూ కంటే అందంగా కనిపించినట్లు, నా జీవితం నాకు ఒక్కసారిగా అందంగా కనిపించింది”. నా హృదయం

కోల్పోయిన ఆత్మస్ధైర్యం సముద్ర కెరటాలవలె ఉరకలు వేసింది. ఒక్క క్షణం నా జీవితం నాకు నీకన్నా కాంతివంతంగా కనిపించింది. ఇలా నా జీవితం నాకు నేర్పిన పాఠాలు, నా అనుభవాలను నా దినచర్యలో జోడిస్తూ వచ్చాను.ఈ అనుభవాలే నా దినచర్య నాలుగవ పేజీ. నా డైరీని తీసిన ప్రతిసారీ ఈ ఙ్ఞాపకాలు నాకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడుతున్నాయి.

జీవితం:- 

అన్ని మెట్లు విజయవంతంగా ఎక్కాను అనిపించింది. కానీ, నా నిజమైన కల సంఘసేవ. ఈ సమాజానికి నా వంతు సేవ చెయ్యాలనుకున్నాను. దానికి నేను కొంత స్థిరపడాలి. దానికోసం “ఐ.ఎ.ఎస్.” మార్గాన్ని ఎంచుకున్నాను, ఉద్యోగాన్ని సాధించాను. ఇదే నా డైరీలోని అతి ముఖ్యమైన పేజీ. సమాజసేవ వ్యసనంగా మారేంతలా చేసాను. నా చేతిలో తీపి ఙ్ఞాపకాలు, అనుభవాలతో నిండిన నా ఏడు పేజీల డైరీ తప్ప ఏమీ మిగల్లేదు. కానీ అన్నీ సాధించినంత ఆనందాన్ని ఈ వెన్నెల రాత్రి నాకు మిగిల్చింది. జీవితంలో అన్ని సాధించాను, ఈ లోకంలో ప్రకాశించాను. ఇక ఒకే ఒక్క కోరిక! నీ లాగా ఆకాశంలో మెరవాలని, ఇప్పటి నాలాగా చాలా మంది వారి అనుభవాలను నీలాంటి నాతో పంచుకోవాలని, ఇలాంటి వెన్నెల రాత్రులను నీ స్ధానంలో ఉండి చూడాలని ఉంది.

13ఇక వెళ్ళిరానా? నా సమయం అయింది!

తెల్లవారింది…

ఆకాశంలో చందమామ లేదు. కానీ, ఆమె ప్రాణం ఆకాశంలో విహరిస్తుంది. ఆ అందమైన ఏడు పేజీల డైరీ మాత్రం టెర్రస్ మీదే ఉంది. ఆ మరుసటి రోజు అదే చంద్రుని స్థానంలో ఉన్న ఆమె, ఆమె స్థానంలోని డైరీని చూస్తూ ఉండిపోయింది…

మబ్బుల నుండి కురిసిన చినుకులనే అక్షింతలతో ఆనందం, ఆశ్చర్యం, బాధ, పట్టుదల, ఆత్మస్ధైర్యం, మానవత్వం, స్ఫూర్తి అనే ఏడు రంగుల డైరీ తడిచి ఆకాశంలో ఇంద్రధనస్సు గా మెరిసింది…

కాలం ఆగిపోయింది…

ఙ్ఞాపకాలు మాత్రం మిగిలిపోయాయి…

ఎందుకంటే అవి మాత్రమే శాశ్వతం…!

*

రచయిత వివరాలు

నడకుదటి లోకేశ్వరి,

ఇంజనీరింగ్ విద్యార్థిని,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,

నూజివీడు, కృష్ణాజిల్లా – 521202

Download PDF ePub MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2014, అక్టోబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.