coverfinal

వింటాను… చెప్పు

Download PDF ePub MOBI

చిన్న మబ్బు సూర్యుడ్ని కప్పేసరికి కొంత ప్రాణం వచ్చింది కాబోలు, హమ్మయ్య అన్నట్లుగా గాలి వదిలి చిన్ని చెట్టు కొమ్మ నీడలో కూర్చున్నాడు ఆ యువకుడు. వంద మెట్లు ఎక్కగానే అలసట వచ్చే వయసు కాదు, ముప్పైకి కొంచెం తక్కువే ఉంటుంది. కాని మొహం లోని నీరసం, పీక్కొని పోయి గుంటలు పడిన కళ్ళు, నిన్నటి నుండి తాను ఏమి తినలేదని విషయాన్ని చెపుతున్నాయి. వంటి మీది చొక్కాకి అంటిన చెమటను భయపెట్టి తరిమేస్తూ మెల్లిగా నిమరసాగింది గాలి. దూరంగా పచ్చటి పంట పొలాలు, దానిపై ఎగిరే తెల్లటి కొంగలు, కొండ దగ్గర నీలి ఆకాశాన్ని పైటగా చుట్టుకొని మెలికలు తిరుగుతూన్న చిన్ని కాలువ, పక్కనే ఎప్పుడో రిక్షామువ్వలకో ఆటోహారన్‌లకో ఉలిక్కిపడుతూ మళ్లీ జోగుతూ మట్టి రోడ్డు… దూరాన ఊరు ఆర్థిక అసమానతలను ఇళ్ళ చిత్రాలుగా తన మీద గ్రాఫ్‌లో భూమాత చూపుతున్నట్లు… ఎంత అలసట అయినా నిముషంలో మాయం అయి ఉల్లాసాన్ని నింపేటట్లు ఉంది ఆ స్థలం.

కాని దాని మీద ఆసక్తి లేనట్లు మోకాళ్ళలో తల ఉంచుకొని ఉన్నాడు ఆ యువకుడు. బహుశా తనలోని దైన్యంతో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు. కొన్ని నిముషాలు అలాగే ఉండిపోయాడు. మళ్ళీ ఏదో లోకంలోంచి ఒక నిర్ణయానికి వచ్చినట్లు విసురుగా లేచి పైకి మెట్లు ఎక్కసాగాడు. ఎప్పుడో తిరనాళ్లకు తప్ప పెద్దగా జనసంచారం ఉండని చిన్న కొండ. అతడ్ని ఆపేందుకు ఎవరూ లేరు.

“లేదు లేదు ఇక జీవించే పని లేదు. ఎలాగైనా చనిపోవాలి” దృఢంగా అనుకొని పాదాల్లో వేగం పెంచాడు. కొండ మీదకెళ్ళి కిందికి దూకేయ్యాలి అంతే… కొన్ని నిముషాలే ఈ కష్టాలు… తరువాత ఏముంది? అవును ఏముంది? వదిలించుకోవాలి అనుకున్నా ఆలోచన వదలడం లేదు. కొండ మీద నుండి పడితే బతుకుతానా? పిచ్చిప్రశ్న, బ్రతికే సమస్యే లేదు. అవును తన తలి పగిలి పోతుందా? లేక శరీరం నుజ్జు నుజ్జు అయిపోతుందా? ఎంతైనా రోజు అద్దం హీరోలాగా ఉన్నావు అని మెచ్చుకొనే అందం కొంచెం సేపట్లో ముక్కలు ముక్కలుగా తెగిపోయి చెట్లకు వేలాడుతూ… ఒక్క క్షణం చావు భయం… అంతలోనే చుట్టుకున్న ఆలోచనలు.. నాన్న, అమ్మ, మరదలు, మామ, కవిత, వెంకట్‌గాడు, పక్కింటి ముసిలోడు, ఆరా తీసే కోటమ్మత్త… ఒక్కసారి ముసురుకొని, అందరిది ఒకే మాట “నీ అంత వెధవ లేడు”… తల గిర్రున తిరిగింది. చచ్చిపోవాలి అంతే. ఏముంది ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? చివరికి అమ్మ కూడా…. ‘వెధవ చవట’ అంది. ఏడవనీ అందరిని, అవును అదే తను కసితీరా అందరికీ వేసే శిక్ష.

పాదాల్లో వేగం పెంచి కొండ పైన ఉన్న చిన్న గుడి దగ్గరకు చేరాడు. ఎందుకో దేవునికి దణ్ణం పెట్టాలి అనిపించలేదు. తన లాంటి అసమర్థుని పుట్టించడంలోనే ఆయన అసమర్థత తెలుస్తోంది. ఇక ఆయనకు దణ్ణం పెట్టడం ఎందుకు… విసుగ్గా అనుకుంటూ గుడి వెనుక వైపుకు వెళ్ళాడు.

కొండ రాయి చివర నిలబడి పక్కనే నిట్టనిలువుగా దిగిన లోయలోకి తొంగి చూసాడు. మరీ ఎత్తు లేదు కాని దూకితే బ్రతికే సమస్యే లేదు. అదే కావాల్సింది. మెల్లిగా కళ్ళు మూసుకొని ఒక కాలు ఎత్తాడు. ఇక రెండోది ఎత్తుతోంటే వినిపించింది. “టింగ్ టింగ్” అంటూ బైరాగి తుంబుర… దానితోనే గాలిలో తేలుతూ చిన్న ప్రశ్న, “చద్దామనుకుంటున్నావా బాబు?”

వెనక్కి తిరిగే చూసేసరికి ఎవరో బైరాగి చిన్నగా నవ్వుతూ.. కాని ఆ కళ్ళలో ఏదో మహత్తు.. వెలుగుతూ ఉన్నాయి.

అతని నవ్వులో ఎగతాళి కనిపించింది కాబోలు విసుగ్గా జవాబిచ్చాడు “కనిపించడం లేదా? నన్నాపొద్దు. ఎలాగైనా చస్తాను” కసిగా అన్నాడు.

“అలాగేలే నాయన. చిన్న మాట”

“చెప్పు”

“చచ్చేవాడికి డబ్బులు ఎందుకు? ఆ జేబులో ఎంతుంటే అంత ఇవ్వరాదా”అన్నాడు.

ఏమున్నాయి అందులో… అంతా కలిపితే ఒక పది రూపాయల చిల్లర. సంపాదించే రాతే ఉంటే ఎందుకు చనిపోవాలి అనుకున్నాడు. జేబు దులిపి బైరాగి చేతిలో పడేసాడు.

“ఆ చొక్కా ఇచ్చెయ్యి నాయనా, పాపం ఆ గుడ్డి ముసిలోడు ఈడనే రాత్రిళ్ళు పడుకొని చలికి వణుకుతూ ఉంటాడు,” ఎందుకో జాలి వేసింది తీసి ఇచ్చేసాడు.

“నా కళ్ళు అయినా తీసుకోమను తాతా” అన్నాడు గొంతులో ఏదో బాధ తన చావును తలుచుకొని.

“ఇక్కడ నుండి దూకినాక ఏ భాగాలు అయినా పనికి వస్తాయి అనుకుంటున్నావా?” నవ్వుతూనే అన్నాడు ముసిలోడు.

“పోనీ.. పోనీ.. ఎవరికీ పనికి రాని బ్రతుకు ఉంటేనేమి? పోతే ఏమి?”

“ఏమైంది నాయనా?” గొంతులో కష్టాన్ని సేద తీర్చే ప్రేమ.

“నువ్వేమి చేస్తావు తాతా చెప్తే?” అన్నాడు. చావాలి అనే తొందర కొంచెం నెమ్మదించింది కాని నిర్ణయం మారలేదు.

“ఏముంది వింటాను.”

“ఏమిటి?”

“అవును వింటాను.”

“సరే విను…” ఒక్కొక్క వత్తిడి నెత్తి మీద నుండి దింపుతూ ఆలోచనలు పరిచాడు. తనతో పాటే చదివి ఫెయిల్ అయి కిరాణ షాప్ లో బాగా సంపాదిస్తూ తననే గుమస్తాగా చేరమని ఎగతాళిగా నవ్విన వెంకటంగాడు. ఎగతాళి నవ్వు విసురుగా మదిలో నుండి బయటకు వెళ్లిపోయింది. ఏదో ఆలోచన మెల్లగా లోనికి వస్తూ… అవును బట్టలు షాప్ అతను తనను లెక్కలు వ్రాసిపెట్టమని, వాటిని చూసి మెచ్చుకొని డబ్బులు ఇచ్చిన సంగతి. అయినా ఎక్కడ ఉన్నాయి అవి? పోటీ పరీక్ష ఫీజుగా కట్టేశాడు.

వంద రూపాయలు కావాలి అంటే “ఏళ్ళకు ఏళ్ళు మేపడానికి ఇక్కడేమి డబ్బు చెట్లకు కాయడం లేదు” అన్న నాన్న మాట గాయం చేస్తూ లోపలి వెళ్ళింది. ఇప్పుడు మెల్లిగా బయటకు వచ్చేసింది. చివురు తొడుగుతూ చిన్న ఆలోచన. అవును తన నమ్మకమే తన పెట్టుబడి. దానితో వ్యాపారులకు లెక్కలు వ్రాసి కొంత ఆదాయం తెస్తే….. తన ఫస్ట్ క్లాస్ చూసి తండ్రి కళ్ళలో మెదిలిన ఆనందం గుర్తుకు వచ్చింది. “వీడెవరో తెలుసా! నా కొడుకు” తండ్రి ప్రేమ గుర్తుకు వచ్చి మనసు బాధగా మూలిగింది.

imageఇంకా చెప్పమన్నట్లు చూస్తూ ఉన్నాడు బైరాగి తాత.

సంపాదన లేనోడు తనను ఏమి సుఖపెడుతాడు అని చీదరించుకున్న మరదలు, తన ముందే వేరే సంబంధం చూసి పెళ్లి చేసిన మామ. చెట్టు కింద ఏకాంతంలో పక్కనే కూర్చొని తన ప్రేమను చేతిని నిమురుతూ చెప్పిన కవిత, కాని తన కళ్ళలో ఆమె నాన్న పైన భయాన్ని చూసి విదిలించుకొని పోయిన సంగతి…

ఒక్కో కష్టానికి రెక్కలు వచ్చి ఎగరేసిన పావురాల్లా బయటకు ఎగిరిపోతున్నాయి. గుండెల్లో బోలెడు ప్రశాంతత. ఎందుకో లోకం అంటే బోలెడు ప్రేమ వచ్చేస్తుంది. ఎప్పటికైనా పైసా సంపాదిస్తావురా? తిని కూర్చోవడమే కాని, అని ఆరాలు తీసి నస పెట్టె పక్కింటి ముసిలోడి మీద… ఈ సారి ఉద్యోగం రాలేదంట అంటూ అడిగినా అడక్కపోయినా ఊరంతా తిరిగి చెప్పే కోటమ్మత్త మీద… ఒకరని కాదు చిత్రం ఇప్పుడు తన చావుకు కారణం అయిన అందరి మీద… ముఖ్యంగా తన బ్రతుకు మీద బోలెడు ప్రేమ వస్తూ ఉంది. అవును తానిక చావలేడు. ఏమి చిన్న పనులు మంచివి కావా? తనకు తగ్గ వారితో తాను బ్రతకలేడా?

ఇంకా చెప్పు అన్నట్లు చూస్తున్నాడు బైరాగి తాత నవ్వుతూ. లేచి వెనక్కి తిరిగాడు క్రిందకు వెళ్ళడానికి… అర్థం అయింది తాతకి. నవ్వుతూ చొక్కా ఇచ్చేసాడు.

కృతజ్ఞతగా వంగి తాత కాళ్ళకి నమస్కరించాడు. ఈ తాతే తనను బ్రతికించింది. కాదు కాదు ఈయన చెవులే. అవును ఈయన చెవులే తన కష్టాలని తమలోకి ఒంపుకొని తనను రక్షించాయి. తాను కనపడక వెతుకులాడుతూ విల విలలాడే తల్లి గుర్తుకు వచ్చింది. ఒక్క క్షణం ఆగకుండా కొండ క్రిందకి పరుగులు మొదలెట్టాడు, తల్లి పొదుగు దగ్గరకి చేరే లేగదూడలాగా.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, కథ and tagged , , , , .

4 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.