cover

సిన్నబ్బోడి ఇస్కూలు సదువు

Download PDF ePub MOBI

మా వూర్లో ఐదోతరగతి దాకా ఇస్కూలుండాదా. అందుకే అయిదొరకన్నా సదుంకోని నాలుగచ్చరాలు నేర్చుకుంటే నస్టమేముండాదిలే అని పిలకాయిల్ని ఇస్కూల్లో జేర్పిస్తారు.

మొగపిలకాయిల్ని ఏ తగాదా ల్యాకుండా పలకాబలపం సేతికిచ్చి ఇస్కూల్లో నాలుగు బొరుగ్గింజలు పంచి కూసోబెట్టొచ్చే అమ్మానాయిన్లు ఆండపిలకాయిల ఇసయమొచ్చేసరికి మల్లగుల్లాలు పడతా వుంటారు.

మా ఇంట్లో మాయక్కను ఇస్కూలుకు పంపించాలని మా నాయన అన్న్యప్పుడు గూడా మా యవ్వకు, మా నాయనకు మద్దిన పెద్దతగాదానే జరిగిందిలే.

‘ఆడబిడ్లుకు సదువెందుక’ని మాయవ్వ, ‘సదువుకోను ఆండపిలకాయిలు, మొగపిలకాయిలు అని తేడా వుండగూడద’ని మా నాయిన. మా యవ్వ ఎంత పోరకలాడినా మా యక్కను ఇస్కోలుకు పంపించి వూర్లో వాళ్లకొక దోవ సూపెట్నాడు మా నాయన.

ముందు ఆడబిడ్లిని ఇస్కూలుకు పంపించినా ఆ బిడ్డికి సెల్లో, తమ్ముడో పుట్టినప్పుడు వాళ్ల సదువు సంకనాకి పొయ్యేది. కానీ మొగ పిలకాయిలికి మాత్రం అట్టాంటి ఇబ్బందులేవిూ వుండవు గదా!

ఆండముండ్లే సదువుకుంటా వుంటే మొగ పిలకాయిలుగా వుండుకోని ఇస్కూలుకు పంపించకుంటే ఏం బాగుంటాదని పెతి ఒక్కరూ మొగపిలకాయిల్ని ఇస్కూల్లో ఎయ్యడం మొదలు బెట్న్యారు వూర్లోవాళ్లు.

అనుకోకుండా ఒక దినం త్యానబండలో వుండే మా నంగంగవ్వ (రంగమ్మవ్వ) వాళ్ల సిన్నబ్బోన్ని మా వూరిస్కూల్లో సేర్సి సదిమించుకోవాలని తీర్మానం జేసుకోని వాని గుడ్డాగుసురు తీసుకోని ఎంట బెట్టుకోనొచ్చింది. మా నంగంగవ్వ పుట్నిల్లు మా యిల్లే. ఆ యమ్మ మా నాయనోళ్లమ్మకు సొయానా సెల్లెలు. మా నాయినోళ్లమ్మోళ్లుండేది మా సంద్రం. పుట్నిల్లు మేముండే వొరిగి బల్లి (వొరిగ పల్లె) ఎట్లంటారా? మా నాయినమ్మోళ్లు వొరిగిబల్లెలో వుండే వాళ్లన్న రంగారెడ్డికి ఇచ్చిసేసినారు. ఆయమ్మే మా దొరసానవ్వ. ఆయమ్మకు పిలకాయిలు లేకపోతే వాళ్ల పెద్దన్న కొడుకు కోదండరెడ్డిని అంటే మా నాయిన్ని వాళ్ల సిన్నన్న కొడుకు నారాన్సామి రెడ్డిని అంటే మా సిన్నాయిన్ని తెచ్చుకోని సాక్కునింది. మా సిన్నాయన బాగా సదుముకోని అమెరికా దాకా పొయ్యొచ్చినాడారోజుల్లోనే. ఇంగ మా నాయన్ని దత్తత దీసుకోని వున్ని నేలా నెట్రా ఇల్లూ వాకిలి మా నాయిన పేరు మింద రాసేసింది.

మా నాయనోళ్ల పిన్నమ్మే గదా! నంగంగవ్వ. ఆయమ్మకు పిల్లాపీచు పుట్టకుండానే మొగుడు సచ్చిపోయినాడు. అప్పట్నుంచి మాయింట్లోనే ఎక్కువగా వుండేది. అడపాదడపా వాళ్లత్తోలూరు త్యానబండకు బోతే పదిరవైదినాల్దాకా వుండొస్తాది. ఆన్నించొచ్చినా, ఈన్నించి బొయినా పిలకాయిల్నెవుర్నో ఒకర్ని ఎంటబెట్టుకోని తిరగందే మా యవ్వకు నిద్రబట్టదు. దానివల్ల రొండిండ్లలోని పిలకాయిలం వొగింటోళ్లే అన్న్యట్లుగా పెరగతా వుండాము. సిన్నబ్బోడు మా నంగంగవ్వకు మర్ది మనుమడు. వాడికిస్కూలు గిస్కూలు లేకపోవడం వల్ల మాయవ్వతోనే వుండేవోడు. అందుకే వానికి అయిదో ఏడు రాంగానే మా వొరిగి పల్లి ఇస్కూల్లోనే సేర్పించాలని తీర్మానం సేసుకునింది మా నంగంగవ్వ.

సిన్నబ్బోడు శానా తులవ. వాడితో యాడ యేంగేదబ్బా అని మాయమ్మ మనసులో దిగులు పడినా పైకి మింగలేక కక్కలేక యమ యాతన పడతావుంది. మా నాయినికి సెప్పుకున్నా సెవుల్లో ఏసుకోడని తెలుసు మాయమ్మకు.

మా నాయన సిన్నబ్బోన్ని ఇస్కూల్లో సేర్పించేందుకు కరణం కిష్ణపిల్లకు సెప్పి బలకా బలపం తెమ్మన్న్యాడు. పాతవి మా యింట్లో లేకగాదు. కొత్తవైతే వాడు కుశాలగా ఇస్కూలుకు బోతాడని. మాయమ్మతో ‘సిన్నబ్బోన్ని ఈ పొద్దు ఇస్కూలుకు పంపించాల. నువ్విప్పుడే బాయికాడికి బోకుండా వాని మంచీసెడ్డా సూసి దెగ్గిరుండి పంపించు’ అని ఆగ్నేసి బాయికాడికి పూడ్సినాడు మా నాయన.

మాయమ్మ నీళ్లు మంటేసి ‘పోసుకుందువురారా’ అని పిలిస్తే ‘నేను నిన్నే బోసుకున్న్యాను, ఈ పొద్దు పోసుకోను పెద్దమ్మా’ అని గెంటగొట్టినట్లు సెప్పేసినాడు. మా నంగంగవ్వ ఎంతగానో సెప్పి సూసినా వాడంత పొద్దున్నే దిన్నిమింద కూసోని సెరుకు నములుకుంటా ఆన్నించి కదల్లేదు. వాడివి వుతికిన గుడ్డలు లేవని మా పెద్దబ్బోడు గోపివి సెడ్డీ సెక్కాయి దెచ్చి ‘ఏసుకోరా నాయినా’ అని మా యమ్మ గెడ్డం బట్టుకుంటే ‘సాకల మంగ రాకుండానే ఈ గుడ్లెందుకిప్పాల’ని మొండికేసినాడు.

మాయమ్మ ఇదయ్యేదిగాదని వాన్నీడ్సుకోని పెళ్లోకి బోయి పిడకబూడిదితో కీక్కీక్‌ అనేదాకా వాడేడస్తా వుండంగానే పండ్లుదోమి బలమంతంగా వుడుకు నీల్లతో మూతీ ముక్కూ గడిగి వానికంటే నాలుగేండ్లు పెద్దోడైన మా పెద్దబ్బోడి సెడ్డీ సొక్కాయ్యేసింది. ఆ గుడ్డలు లొడంగు బుడంగనుండాయని వాళ్లవ్వను బట్టుకోని వాడు యాడస్తావుంటే రొండు ముద్దలు సద్దెన్నం వాన్నోట్లో కుక్కింది మాయమ్మ. నట్టింట్లో దీపం బెట్టి దేవుని దెగ్గిర దండం బెట్టించింది. వాడి పలకా బలపాన్ని హారిస్‌ సిల్కు అవుస్‌ వాళ్లిచ్చిన పసువు సంచిలో ఏసి మాతో మాయవ్వను గూడా తోడిచ్చి వాన్ని పంపించింది. వాడా సావిూ, అసాద్దుడు. మాయవ్వను, మమ్మల్ని మూడు సెరువుల నీల్లు దాపించి తప్పించుకోని బాయి మొగం బట్న్యాడు.

మర్సనాడు మా నాయినే దెగ్గిరుండి అన్ని పనులు సేయించినాడు. మా నాయినంటే కొంచిం బయముండాది వాడికి. వాని జోబీనిండా పప్పులు బోసి, బొంగరమంత కలకండ వాని సేతికిచ్చి సేద్దిగాని బుజానెక్కించి ఇస్కూల్లో వొదిలిపెట్టి రమ్మన్న్యాడు మా నాయన.

అవి బొక్కతా వాడికి ఇస్కూలుకు పోతావుండామనే ద్యాస ల్యాకుండా వాని బుజానెక్కి నడీది మొగదల కొచ్చినాడు. అప్పుడు మన తెలివిలో కొచ్చి ఇస్కూలుకు పిల్సక పోతావుండారని గెవన మొచ్చి సేతిలో మిగిలిన కలకండను కరకరా నమిలేసి సేతుల్ని సేద్దిగాని సొక్కాయికి తుడ్సేసి సేద్దిగాని బుజాన్ని కండవూడోచ్చేట్ల కొరికేసి తప్పించుకోని ఎవురికీ అందకుండా యాడబొయినాడో ఆదినమంతా ఎవురికంటా బళ్లేదు వాడు.

వాడేమైనాడో యాడబొయినాడోనని ఎతికించి ఏసారిన మా నాయిన త్యాన బండోళ్లకు ఏం సమాదానం సెప్పాల్రా దేవుడా అని తలబట్టుకున్న్యాడు. ఆకిరికి సాయంత్రం పెద్దబ్బోడొచ్చి సెరుకు దోట్లో పండుకొని నిద్రబొయినాడని సెప్పంగానే వూపిరి పీల్చుకున్న్యారంతా.

వాడు ఆకిలికి వోర్సుకోలేక అస్సుబుస్సని తిని కుప్పబోసిన సెరుకుపిప్పిని సూసి మా నంగంగవ్వ తల్లడిల్లి పోయింది. కన్పించని మనవడు కండ్ల బడంగానే ‘ఇస్కూలూ వొద్దు, గిస్కూలూ వొద్దు బువ్వదిందువుగాని రానాయినా’ అని వాన్ని సంకలో ఏసుకొని ముద్దులతో ముంచెత్తి మురిసిపోయింది.

మా నాయన మాత్రం వాళ్లు మనల్ని నమ్మి ఈడికి బంపించినప్పుడు కనీసం బారతరామాయణాలు సదుంకొనే జ్ఞానమన్నా వాడికొస్తే బాగుంటాదని ఆశపడినాడు.

‘ఎందుకొచ్చిన సదువురా కోదండా. బిడ్డి బిత్తరపొయినాడు. వాడేదైనా ఒగ్గెతయ్యుంటే ఏంజేసేది? మన పిలకాయిలు సదుంకోని వుద్దోగాలు సెయ్యాల్నా వూర్లేలాల్నా. నీ తమ్ముడు సదుంకున్న్యందుకే గదా అమెరికాకు బొయ్యి అమ్మానాయినని గూడా ల్యాకుండా ఆ ఇంగిలి పీసోళ్ల మోసేతికింద నీళ్లు దాగతా వుండేది. నువ్వు సదుంకోక బొయినందుకే గదా దొరమాదిరిగా బతకతా వుండేది. అందురికీ నాలుగు ముద్దలు నోట్లోకి బోతావుందంటే అది నీ పున్నిమే గదా! వొంటిసేతిమింద అంత సేద్ద్యాన్ని అనవరిస్తా వుండావంటే నీ రగతంలో పారాడతా వుండేది అచ్చరాలు గావు. కయ్యా కాలవలే’ అని మా నాయన బాదను సల్లార్సే పెయత్నం సేసింది. అయినా మా నాయినికి ఏదోమూల బాద మిగిలిపోయ్యుండాది.

‘అమా సేద్దిం జేసే ఇంట్లో బుట్నోడేగదా నారాన్సామి. అమెరికాకు పొయ్యి సల్లంగా ప్యానుగాలి దీస్కుంటా నెల బుడ్తానే దుడ్లు బాంకిలో ఏసుకుంటావుండాడు. నాలాంటోడు ఎండనక గాలనక పీతి కష్టం బడతావుంటే ఏం మిగలతా వుండాది సెప్పు’ అని యాస్టపొయినాడు. ‘ఇప్పుడు మన గోపిగాన్నే సూడు. ఇంగా మూడో తరగతే వాడు. అయినా పెద్ద బాలసిచ్చను ఈ కొన నుండి ఆ కొనదాకా అప్పజెప్పేస్తాడు. గెడారం సూసి టైం కూడా సెప్తాడు. క్యాలెండరు సూసి ఏం వారమో, ఎన్నో తేదో సెప్పడం గూడా వొచ్చు వాడికి’ అని వాదించబొయినాడు.

‘నీ కొడుకు సదుంకుంటా వుండాడు గదా! ఆ సంబడం సాల్లే. ఎద్దులు గొట్టి ముద్దలు తినే నోటికి అచ్చరాలంటక పోతే వొచ్చే నట్టమేవిూ లేదుగాని’ అని మా నాయిన నోటికి తాళమేసి మనవడి బయానికి కళ్లెమేసేసింది మా నంగంగవ్వ. మా దొరసానవ్వ కూడా ఆయమ్మ మాటలకు వంత పాడింది. దాంతో మా యమ్మగూడా వూపిరి పీల్సుకొనింది.

మా నంగంగవ్వతో త్యాన బండకు బొయిన సిన్నబ్బోడు ఎప్పుడూ వాల్లవ్వ తోక బట్టుకోని తిరిగే సిన్నబ్బోడు మా యవ్వ మావూరి కొచ్చినా ఎండాకాలం లీవులదాకా ఈ పక్క అయిపులేదు.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, ఇర్లచెంగి కథలు, సీరియల్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.