cover

పదనిష్పాదన కళ (22)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

న్నెండో అధ్యాయం

సమాస ఘటన ద్వారా నూతనపదాల నిష్పాదన

సమాసం అంటే ఏంటి ?

కొన్ని ప్రభేదాలున్నప్పటికీ, ప్రాథమికంగా సమాసమంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్న నామవాచక, విశేషణ శబ్దాల సమ్మేళనం. ఏ భాషలోనైనా పదం పక్కన పదాన్ని చేర్చి మాట్లాడడం వక్తృసౌలభ్యం. మన కాలపు భాషారంగంలో అన్ని ఇతర గ్రాంథిక మూలకాల మాదిరే సమాసాల పట్ల సైతం కృత్రిమంగా నిరసన వ్యాపింపజేయబడింది. ఇది మొదట సుదీర్ఘమైన, జటిల సంస్కృత సమాసఘటనని నిరసించడంతో ఆరంభమై ఆ తరువాత అన్నిరకాల సమాస నిర్మాణాల్నీ వ్యతిరేకించే స్థాయికి ముదిరింది. సమాసాలు గ్రాంథికశైలి అనీ – అంటే అర్థం కాని శైలి అనీ, అవన్నీ సంస్కృతమేననీ, అవి లేకపోవమే అచ్చమైన తెలుగు వ్యావహారికమనీ విస్తృతంగా ప్రచారమైంది. మాతృభాష యొక్క సహజలక్షణాల్లో ఒకటైన దాని పట్ల ఆ రకంగా జనంలో కృత్రిమంగా విరోధభావన ఉత్పాదించబడింది. అలా ఈ భావన కూడా వ్యావహారిక వాదం వేసిన అనేక మైన వెఱ్ఱితలల్లో ఒకటిగా పరిణమించింది. కానీ ఈ అభిప్రాయం నిజం కాదని గమనించాలి. వీర వ్యావహారికవాదులు కూడా సమాసాల్ని సంపూర్తిగా పరిహరించి కలాన్ని కదపలేరు. సమాసపద్ధతిని విడనాడడం అంటే పదనిష్పాదన దుకాణాన్ని దాదాపుగా మూసుకున్నట్లే. ప్రపంచంలో సమాసాల్లేని భాషలు అరుదు.

ఇంగ్లీషులో సమాసాలు లేవా?

ఈ ప్రస్తావన మీద ఇదివఱకే 2వ అధ్యాయంలో కొంత చెప్పడం జఱిగింది. ఈనాడు వేలాదిగా అచ్చ ఇంగ్లీషు సమాసాలు వాడుకలో ఉన్నాయి. వ్యవహారసిద్ధమైన ఆంగ్ల సమాసరూపాల్ని గట్టిగా గుర్తుపెట్టుకుని వాడలేనివారికి భాష సరిగా రానట్లే విద్యావంత లోకంలో పరిగణన. ఉదాహరణకి,

Workload, mindset, area-specific, take-home salary, tax deductions, catchment area, man –

animal encounters, win-win situation, one-to-one equation, cloudburst, sky-scraper, information technology-enabled services, high-priority area, minimum balance rule ఇత్యాది.

జర్మన్ లో సమాసాలు లేవా ?

జర్మన్ భాష పూర్తిగా సమాసాల మయం. సమాసాలు నేర్చుకోకుండా ఆ భాష మాట్లాడ్డమే అసాధ్యం. Wortbuch (నిఘంటువు), sprachweisenschaft (భాషాశాస్త్రం), dageszeitung (దినపత్రిక) మొదలైన రెండవయవాల సమాసాలే కాక సంస్కృతంలో మాదిరి పూర్తిపంక్తీ, అర్ధపంక్తీ ఆక్రమించుకునే సుదీర్ఘ సమాసాలకి సైతం ఆ భాషలో కొదవ లేదు. ఉదా హరణకి-

Betäubungsmittelverschreibungsverordnung = Regulation requiring a prescription for an anesthetic. (ఆపరేషన్ మత్తుమందు కొనుగోలుకు ప్రిస్క్రిప్షన్ ఉండాలనే చట్టం)

Donaudampfschifffahrtsgesellschaftskapitän = Danube steamship company captain (డాన్యూబ్ ఆవిరినౌకా కంపెనీ తండేలు)

Rechtsschutzversicherungsgesellschaften = Legal protection insurance companies (శాసనిక రక్షణ బీమా కంపెనీలు)

Rindfleischetikettierungsüberwachungsaufgabenübertragungsgesetz = Beef labeling regulation & delegation of supervision law (గోమాంస ముద్రాంకన, నియంత్రణ మఱియు పర్యవేక్షణా అధికారదాన చట్టం)

చైనీస్ లో సమాసాలు లేవా ?

చైనాభాషలో కూడా సమాసాలు నేర్చుకోలేకపోతే నోటికి తాళం వేసుక్కూర్చోవాల్సిందే. ఎందుకంటే ఆ భాషలో నూటికి 99 పదాలు సమాసాలే. రెండుపదాల్ని సమాసించి వాటి అర్థంతో స్వల్పసంబంధం మాత్రమే కలిగిన మూడో పదాన్ని నిష్పాదిం చడం ఈ భాష ప్రత్యేకత. మచ్చుకు ఈ క్రింది పదాలు చూడండి :

Zhong = మధ్య ; guo = రాజ్యం ; Zhongguo = చైనా

Mei = అందమైన ; guo = రాజ్యం ; Meiguo = అమెరికా

Hua = పువ్వు ; sheng = పుట్టినది ; huasheng = (పువ్వు నుండి పుట్టినది) వేరుసెనగ

Fei = కొవ్వు ; zao = నలుపు ; Feizao = సబ్బు

Xin = ఇంధనం ; shui = నీళ్ళు ; Xinshui = జీతం

Xiao = చిన్న ; shuo = మాటలు ; xiaoshuo = నవల

Di ping zian = Ground flat line (Horizon) = క్షితిజం

Fengyun = వాతావరణం ; renwu = మూర్తి ; Fengyun-renwu = Celebrity (జీవంత ప్రముఖుడు)

మన వ్యావహారికంలో సమాసాలు లేవా ?

తెలుగు కూడా పైభాషల్లాంటిదే. దీన్ని కూడా సమాసాలు లేకుండా మాట్లాడ్డమూ, వ్రాయడమూ కష్టమే. మన నిత్య వాడుకలో వందలాది సమాసాలున్నాయి. ఉదాహరణకి:

తల్లిదండ్రులు, పిల్లచేష్టలు, ముచ్చెమటలు, అచ్చుతప్పులు, పంటసాగు, పనిరోజులు, పనివొత్తిడి, పనివేళలు, చవితి పండగ, చావుమేళం, పెళ్ళి ఏర్పాట్లు, పెండ్లి పిలుపు, మతిమఱుపు, వెలివేత, మేనకోడలు, తెలివితేటలు, పెంకుటిల్లు, పూరిపాక, వేగు చుక్క, సాగునీరు, పందిరిమంచం, కందిచేను, మామిడిపండు, జీడిమామిడి, ఆటవిడుపు, బాటసారి, ముందడుగు, ముం దంజ, వెనుకంజ, దూదిపింజ, బడిపంతులు, గుడిమాన్యం, చదువుసంధ్యలు, అదుపాజ్ఞలు ఇత్యాది.

ఇవి కాక, వందలాది సంస్కృత సమాసాలు సైతం జనసామాన్యపు వాడుకలో స్థిరపడిపోయాయి. మచ్చుకు:

ప్రేమకథ, ఏకధాటి, దేవాలయం, ఆవేశ కావేశాలు, కష్టసుఖాలు, ఇష్టాయిష్టాలు, ఉత్తరదిక్కు, సంతానభాగ్యం, రాజయోగం, మీనమేషాలు, మహాపండితుడు, మానవప్రయత్నం, ధర్మదాత, గత సంవత్సరం, నష్టజాతకం, గర్వకారణం ఇత్యాది.

సమాసాలు చేసే మేలు

కనుక సమకాలీన పాత్రికేయులూ, ఇతర రచయితలూ సమాసాల్ని విడగొట్టి, ఆ విధంగా వాటి యొక్క అందమైన సంయుక్త స్వరూపాన్నీ, శ్రావ్యతనీ చెడగొట్టి తిరగవ్రాయను ఉద్యుక్తులు కావడం హర్షణీయం కాదు. సమాసాల్ని విడగొట్టి వ్రాస్తే, ఆ విడగొట్టిన పదస్వరూపాలు సమాసాలిచ్చే అర్థాన్నీ, అందాన్నీ, ఊపునీ, గౌరవనీయతనీ ఇవ్వవు. ఆ విధమైన నీరస, నిస్సాకార శైలికి ‘వాడుకభాష’ అని సునామకరణం (euphemism) చేయడం, అవి మాత్రమే అర్థమౌతాయంటూ బండవాదనకి దిగడం ఇంకా శోచనీయం. అది భాష గుఱించిన యథార్థాన్ని తిరగదిప్పడమే అవుతుంది. మాటలు నేర్చిన మనుషులు మాతృభాషని పదం పదంగా మాట్లాడరు. పదబంధాలుగా, వాక్యభాగాలుగా, వాక్యాలుగా మాట్లాడతారు. అలాగే గుర్తుపెట్టు కుంటారు కూడా. కనుక సమాసాలు భాషాస్వభావానికి అనుగుణంగా వాడుకలోకి వచ్చినవీ, అలాగే కొనసాగ గలిగినవే తప్ప అవి ఎవఱూ ఎవఱి మీదా రుద్దినవి కావు. ఇప్పుడు మనం వాడడం మానేసినంత మాత్రాన భవిష్యత్తులో సరికొత్తగా పుట్టకుండా పోయేవీ కావు.

ఒకప్పుడు – అంటే 18 వ శతాబ్దం వఱకూ ఇంగ్లీషులో కూడా సమాసాలు చేయకుండా పదాల మధ్య విభక్తిప్రత్యయాలూ, క్రియాపదాలూ చొప్పించి వ్రాసేవారు. ఆ పద్ధతిలో బారుబారు వాక్యభాగాలు తయారై, విసుగొచ్చి, సమాసాలుగా కలిపి వ్రాయడం మొదలుపెట్టారు. ఉదాహరణకి ఆ రోజుల్లో ప్రచురించిన ఒక పుస్తకం పేరు ఇలా ఉంది:

A Treatise on

Military Discipline

in which is laid down and explained

the Duty of the Officer and Soldier

thro’ Several Branches of the Service.

ఇలాంటి పేర్లని పంక్తులు పంక్తులుగా పేర్చి టైటిల్ పుట మొత్తం నిండిపోయేలా పెద్దపెద్ద అక్షరాలతో ముద్రించేవారు. కానీ ఈ రోజుల్లో ఇంగ్లీషువాళ్ళెవఱూ ఇంత పెద్ద పేర్లు పెట్టరు. పాతపద్ధతిలో పెట్టిన పేర్లు ఇంకా కొన్ని మిగిలిపోయినప్పటికీ టూకీగా పదం పక్కన పదాన్ని చేర్చి సమాసాలుగా వ్రాయడమే తాజా విలసనం. ఉదాహరణకి సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వ సంస్థల పేర్లు కొన్ని చూడండి :

Natural Resources Conservation Service (NRCS)

Food Safety and Inspection Service (FSIS)

Cooperative State Research, Education and Extension Service (CSREES)

National Agricultural Statistics Service (NASS)

Grain Inspection, Packers and Stockyard Administration (GIPSA)

National Telecommunications and Information Administration (NTIA)

ప్రతికొత్త పరిభావనకీ విలక్షణమైన (unique) పేర్ల కోసం తడుముకో నవసరం లేకుండా సమాసాలు సౌలభ్యాన్ని అందిస్తాయి. అవి పాత పదాల మిశ్రమాలతోనే సరికొత్తదనాన్ని స్ఫురింపజేస్తాయి. పోలిక (Analogy) ని ఆధారంగా చేసుకొని, అంతకు ముందు భాషలో లేని పరిభావనల్ని సైతం అవి ప్రవేశపెడతాయి. అవి ప్రామాణికమై వ్యాపిస్తే, మాట్లాడేటప్పుడూ, వ్రాసేటప్పుడూ అభివ్యక్తి (expression) కోసం తడుముకునే పని లేకుండా, అవి సద్యఃస్ఫురణ కొచ్చి ధారాళత (fluency) ని పెంపొందిస్తాయి. కొన్ని సమాసాలు జనంలో ప్రామాణికమూ, ప్రచురమూ అయినప్పుడు, అవయవాలు వ్యవహారభ్రష్టమైనా సమాసాల రూపంలో అవి జీవించే ఉంటాయి. ఉదాహరణకి – కైవశం. ఇందులో ‘వశం’ ఒక్కటే ఇప్పుడు వాడుకలో ఉంది. ‘కై’ (చేయి) మాత్రం వ్యవహారభ్రష్టమైంది. కానీ ‘వశం’ అనే విడిపదంతో పాటు ఈ మొత్తం సమాసాన్నీ కూడా అదే అర్థంలో వాడుతున్నారు. కనుక సమాసరూపంలో ‘కై’ ఇప్పటికీ జీవించే ఉంది. అందుచేత సమాసాల్ని అనావశ్యకమని గానీ, పాతశైలి అని గానీ, పాండిత్యప్రకర్ష అని గానీ భావిస్తే అది అవివేచన, సమీపదృష్టీ అవుతుంది. తెలుగుభాష తనకి స్వాభావికంగా ఎప్పట్నుంచో ఉన్న సమాసశక్తిని ఇప్పటి అవసరాల కనుగుణంగా పూర్తిస్థాయిలో వినియోగించుకొని పరిపుష్టం కావాలి.

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.