cover

ఎవరెవరు

ఎవరెవరు వెళ్లిపోదలచారో వెళ్లనివ్వు నీ జీవితంలోంచి

వెళ్ళిపోవటాలు చూడటానికే నువ్వొస్తావు

 

ఒకానొక కాలం నిన్నొక వాకిలి చేసి నిలబెడుతుంది

ఎవరెవరో పని ఉన్నట్టే నిన్ను దాటి

హృదయంలోకి వస్తారు, నీలో వెదుకుతారు

వాళ్ళు నీ వాళ్ళని అనుకొంటూ ఉండగానే

ఇక్కడేమీ లేదు, అంతా ఖాళీ అని

గొణుగుతూ వడివడిగా వెళ్ళిపోతారు

 

నిజమే, ఖాళీలలో ప్రవేశించే ఖాళీలు

ఖాళీలలోంచి బయటికి నడిచే ఖాళీలు

ఖాళీ అనుభవాలతో లోపలి ఖాళీ నింపుకోవాలనే వెర్రివ్యాపకమొకటి

వేసవికాలపు వేడిగాలిలా సుడితిరగటం మినహా, నిజానికి ఇక్కడేమీ లేదు

 

వెళ్ళనీ ఎవరు వెళతారో, త్వరగా, మరింత త్వరగా

ఎగరబోతున్న పక్షిరెక్కల్లోంచి జారిపోతున్న తూలికలా

అరచేతుల్లో వాలి మాయమైపోతున్న ఉదయకిరణంలా

మేలుకోగానే తెలియరాని మైదానంలోకి రాలిపోయిన కలలా

 

ఓ దీర్ఘశ్వాస తీసుకొని, హాయిగా విడిచేయి శ్వాసనీ, మనుషుల్నీ

స్వప్నసరోవరంలోకి హంసల్ని విడిచినట్లు సుతారంగా, తేలికగా..

 

బివివి ప్రసాద్
90320 75415

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, కవిత and tagged , , , , , , .

3 Comments

  1. “ఓ దీర్ఘశ్వాస తీసుకొని, హాయిగా విడిచేయి శ్వాసనీ, మనుషుల్నీ
    స్వప్నసరోవరంలోకి హంసల్ని విడిచినట్లు సుతారంగా, తేలికగా..”…అద్బుతం

  2. “వెళ్తారు వెళ్ళేటివాళ్ళు, చెప్పేసెయ్ తుది వీడుకోలు
    ఉంటారు ఋణమున్నవాళ్ళు, వింటారు నీ గుండె రొదలు“

    ‘ఇది కధ కాదు’ సినిమాలోని మనసు కవి ఆత్రేయ మాటలు గుర్తుకొచ్చాయి. ఎప్పటిలాగే ఓ మంచి కవిత నిచ్చిన (స్వప్నసరోవరంలోకి హంసల్ని విడిచినట్లు సుతారంగా). శ్రీ బివివి ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.