cover

పద్మప్రాభృతకమ్ (2)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

పద్మప్రాభృతకమ్

[నాంద్యన్తే ప్రవిశతి సూత్రధారః]

సూత్రధార -

జయతి భగవాన్ స రుద్రః

కోపాదథవాऽప్యనుగ్రహాత్ యేన |

స్త్రీణాం విలాసమూర్తిః

కాన్తతరవపుః కృతః కామః ||

అపి చ -

[నాంది అంతమందు సూత్రధారుడు ప్రవేశించుచున్నాడు]

సూత్రధారుడు -

యేన = ఎవని, కోపాత్ అథవాऽపి అనుగ్రహాత్ = కోపము వలన లేదా అనుగ్రహము వలన, స్త్రీణాం = స్త్రీలయెడ, విలాసమూర్తిః = విలాసమూర్తియు, కాన్తతరవపుః = శోభించు శరీరము కలవాడునుగా, కృతః = చేయబడినవాడైన, కామః = మన్మథుడు (కలడో), సః భగవాన్ రుద్రః = అట్టి భగవంతుడైన ఈశ్వరుడు, జయతి = ఉత్కృష్టముగనున్నాడు.

తాత్పర్యము: ఎవని కోపము మరియు అనుగ్రహము వలన స్త్రీల యెడ విలాసమూర్తి, కాన్తివంతమైన శరీరము కలవాడుగా చేయబడిన మదనుడు కలడో, అట్టి రుద్రునికి జయము.

విశేషములు: కాన్తతరవపుః = అగ్నిచేత కాల్చబడిన పుత్తడి ఎలా మిక్కుటముగా శోభించునో, అలా ఈశ్వరకోపాగ్ని చేత కాల్చబడిన మన్మథుడు మెరుగుపెట్టబడిన కాంతి కలవాడాయెననుట. ఆర్యా వృత్తము

ఇంకనూ -

పుష్పసముజ్జ్వలాః కురవకా నదతి పరభృతః

కాన్తమశోకపుష్పసహితం చలతి కిసలయమ్ |

చూతసుగన్ధయశ్చ పవనా భ్రమరరుతవహాః

సమ్ప్రతి కాననేషు సధనువిచరతి మదనః ||

కిఞ్చాన్యత్ -

పుష్పసముజ్జ్వలాః = మిక్కుటముగా పూచిన పూలుకలవైన, కురవకా = కురవకమను వృక్షము తో, పరభృతః = కోకిల, నదతి = మోదమందుచున్నది. కిసలయం = చివురుటాకు, కాన్తం = సుందరమైన, అశోకపుష్పసహితం = అశోకకుసుమసహితముగ, చలతి = కదలుచున్నది. పవనాః = గాలులు, భ్రమరరుతవహాః = తుమ్మెదలగానములను మ్రోయుచూ, చూతసుగన్ధయః చ = లేత మామిడి పిందెల సువాసనలను కలిగినవి. సంప్రతి = ఇప్పుడు, కాననేషు = ఉద్యానములలో, మదనః = మదనుడు, సధను = ధనువుతో కూడి, విచరతి = విహారము చేయుచున్నాడు.

తాత్పర్యము: కురవక కుసుమశోభచేత కోకిల ఆనందించుచున్నది. అశోకపుష్పమును కూడి చివురుటాకు కదలుచున్నది. మందమారుతములు తుమ్మెదగానములను, మావి సుగంధములను వీయుచున్నవి. ఇప్పుడు మదనుడు ధనువిహారము చేయుకాలము.

విశేషములు: నాంది తర్వాత ప్రస్తావనలో ఋతువర్ణన చేయడం ఐచ్ఛికమైన ఒక అంశం. ఇక్కడ వసంతకాలవర్ణన. స్వభావోక్తి అలంకారం.

ఇంకేమిటి -

ఆతోద్యం పక్షిసంఘాస్తరురసముదితాః కోకిలా గాన్తి గీతం

వాతాచార్యోऽపదేశాదభినయతి లతా కాననాన్తః పురస్త్రీ |

తాం వృక్షాః సాధయన్తి స్వకుసుమహృషితాః పల్లవాగ్రాంగుళీభిః

శ్రీమాన్ ప్రాప్తో వసన్తస్త్వరితమపగతో హారగౌరస్తుషారః ||

పక్షిసంఘాః = పక్షిసమూహములు, ఆతోద్యం = నేపథ్యవాద్యమున, తరురసముదితాః = చెట్లస్రావములను త్రావినవి (అయి), కోకిలాః = కోకిలలు, గీతం = గానములను, గాన్తి = గానము చేయుచున్నవి. కాననాన్తఃపురస్త్రీ = ఉద్యానవనమనెడు అంతఃపురమందు నివసించు యువతి, లతా = తీవె, వాతాచార్యోపదేశాత్ = గాలి అనెడు ఆచార్యుని ఉపదేశము వలన, అభినయతి = అభినయించుచున్నది. తాం = ఆ తీవెను, స్వకుసుమహృషితాః = తన యందు కుసుమించిన పూలచేత సంతుష్టినందినదానిని, వృక్షాః = వృక్షములు, పల్లవాగ్రాంగుళీభిః = చివురుటాకుల చేతి వ్రేళ్ళతో, సాధయన్తి = పరామర్శించుచున్నవి. హారగౌరః తుషారః = గౌరవర్ణహారమయమైన మంచు, త్వరితం = త్వరగా, అపగతః = వెడలినది. శ్రీమాన్ వసన్తః = శ్రీమంతుడైన వసంతుడు ప్రాప్తః = దయచేసెను.

తాత్పర్యము: పక్షుల నేపథ్యవాయిద్యమున రసపానమత్తములైన కోయిలలు గానమొనర్చుచున్నవి. ఉద్యానవనాంతఃపురస్త్రీ యనెడు తీవె అనిలాచార్యోऽపదేశమును అభినయించుచున్నది. తనయందు కుసుమించిన పూలతో కూడిన యా లతలను వృక్షములు తమ చేతి వ్రేళ్ళతో సాధించుచున్నవి. హారములను వలె తెల్లటి మంచు త్వరితముగా వెడలిపోయినది. శ్రీమంతుడు వసంతుడేతెంచెను.

విశేషములు: సమాసోక్తి. నాట్యశాస్త్ర పరామర్శ నెపమున ప్రకృతార్థమైన వసంతము వర్ణింపబడినది. ఈ పద్యములో ఇతివృత్తము సూచితము. పక్షుల దరువులు, ఈ భాణమున కాన్పట్టు పాత్రలు చెప్పెడు మాటలు. వాటిని నేపథ్యీకరించి చేయు గానము శశు డను విటుని మాట. హారగౌరమైన తుషారము వెడలుట ప్రథమ నాయిక అవగమనమును, వసంతప్రాప్తి నూత్ననాయిక సంప్రాప్తిని సూచించుచున్నది. (స్రగ్ధరా - మ ర భ న య య య)

ఆతోద్యము: భరతుని నాట్యశాస్త్రమున నాట్యమునకేకాదశాంగములు సూచింపబడినవి. అందుననాతోద్యము ఒకటి. ఈ ఏకాదశాంగముల స్వరూపమే నాట్యశాస్త్రసంగ్రహము.

రసభావాహ్యభినయాః ధర్మీవృత్తిప్రవృత్తయః |

సిద్ధిః స్వరాః తథాతోద్యం గానం రంగశ్చ సంగ్రహః ||

ఆతోద్యములు నాలుగు తెఱగులు. తతము (తంత్రీగతము. ఉదా:వీణ), అవనద్ధము (చర్మముచే మూయబడినది. మద్దెల), ఘనము (కంచుతాళములు), సుషిరము(వేణువు).

మూలదపి మధ్యాదపి విటపాదప్యఙ్కురాదశోకస్య |

పిశునస్థమివ రహస్యం సమన్తతో నిష్కసతి పుష్పమ్ ||

అహో అయమ్ -

ససంభ్రమపరభృతరుతః ససింధువారః సకున్దసహకారః |

సమదమదనః సపవనః సయౌవనజనప్రియః కాలః ||

(నిష్క్రాన్తాః)

(స్థాపనా)

మూలాదపి = మూలమునందు, మధ్యాదపి = మధ్యయందు, విటపాదపి = కొమ్మలపై, అశోకస్య = అశోకకుసుమంపు, అంకురాత్ = మొగ్గలలో, పిశునస్థం = ఖలునియందు ఉంచిన, రహస్యమివ = రహస్యము వలె, సమన్తతః = బాగుగా విచ్చికొని, పుష్పమ్ = కుసుమము, నిష్కసతి = బయల్వెడలుచున్నది.

తాత్పర్యము: మూలలో, మధ్యలోనూ, కొమ్మలపైననూ, అశోకపుష్ప మొగ్గలలోనూ, ఖలుని యందు దాచిన రహస్యము వలె కుసుమము విచ్చి బయల్వెడలుచున్నది.

విశేషములు: ఆర్యా. పిశునస్థ రహస్యమివ సమన్తతో నిష్కసతి పుష్పమ్ - ఉపమాలంకారము.

అహో, ఇది -

కాలః = కాలము, ససంభ్రమపరభృతరుతః = కోకిలగానము సంభ్రమముతో కూడియున్నది, ససింధువారః స కుందసహకారః = సింధువార, కుంద, లే మామిడి వృక్షములతో శోభించుచున్నది, సమదమదనః = మదించిన మదనుని కలిగినది, సపవనః = చక్కని గాలులతో కూడినది, సయౌవనజనప్రియః = యౌవనజనులతో ప్రియమైనది.

తాత్పర్యము: కాలము కోకిలగానములచేత సంభ్రమము. సింధువార, కుందములచేత, లేమావిళ్ళచేత, మదనునిచేత, గాలులచేతనూ కూడినది. నవయువకులకు ప్రియభాజనమైనది. ఆర్యావృత్తము.

- (నిష్క్రమింతురు).

- (స్థాపనా).

(ఈ స్థాపనా అన్న శబ్దము కేవలం భాసనాటకములందే గానవచ్చును. ఇతర సంస్కృతనాటకాలలో ప్రవేశకము అని దీని పేరు. ఈ శబ్దప్రయోగం ఈ భాణక ప్రాచీనతను సూచించుచున్నది.)

(తరువాయి భాగం వచ్చేవారం)

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.