cover

ఆమె రాక

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 12వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన ఇక్కడ చూడండి.)

Download PDF ePub MOBI

తలుపు తెరిచానో, లేదో! ఎన్నో ఏళ్ల క్రితం ఖండాంతరాలు దాటి పోయి, ఇప్పుడు ముందుగా వస్తున్నట్టు చెప్పకుండా హఠాత్తుగా ఎదురుగా ప్రత్యక్షమయి, కనుచూపులో ఆశ్చర్యం కనపడకముందే కౌగిలించుకున్నట్టు నా శ్వాసను ఓ క్షణం బంధిస్తూ నన్ను సున్నితంగా తాకుతూ లోపలకి వెళ్ళిపోయింది.

అకారణంగా ఎక్కడికి వెళుతుందో చెప్పకుండా వెళ్ళిపోయిన తనని ఇప్పుడు హఠాత్తుగా చూడగానే ఏదో తెలియని ప్రశాంతత తాలూకు ఆనందం కలిగినా, ఎప్పుడో తను వదిలి వెళ్లిపోయినపుడు నాలో కలిగిన బాధతో ఆమెను ఎన్నో ప్రశ్నలతో వేధించాలని స్ఫురణకు రాకముందే నన్ను దాటుకుంటూ లోపలి వెళ్ళిపోయింది.

నన్ను గతంలో అంతగా బాధించిన తనకి అసలు లోపలికొచ్చే అర్హత లేదని బయటకు గెంటేయచ్చు కదా? కాని ఎందుకో అలా చేయలేకపోయాను. ఎందుకు? ఏమో, బహుశా ఏం జరిగినా, అందులో కేవలం తన ప్రమేయం మాత్రమే లేదని నాకు తెలుసు కాబట్టి కావచ్చు, లేక ఆమె మీద ఇంకా ప్రేమ వుండబట్టా!?

నో, ఆమెను నేను ప్రేమించట్లేదు. నిజానికి, నేను తనని ఇంకా ప్రేమిస్తున్నానని ఆమె అనుకోవటం కూడా నాకిష్టం లేదు. అలాగని ఆమె మీద ప్రేమ లేకపోవటానికి కారణం- బాధో, కోపమో, మరేదో కాదు. అంతకు మించిన ప్రేమ, అనుబంధం నాలో ప్రవేశించటం వల్ల.

దీనికి ఈ ప్రపంచం ఏ పేరైనా పెట్టుకోనీయ్. బహుశా నేను మగవాణ్ణి కాబట్టి శూన్యం నిండిపోయిన సమయంలో ఓ సంతోషాన్ని కనుక్కోవటం తప్పు కావచ్చు! బహుశా ఆమె వెళ్ళిపోయిన చోట సంతోషంగా వుంటే, ఆమె స్త్రీ కాబట్టి గొప్పతనం కావచ్చు. కాని నా విషయంలో ఈ ప్రపంచం అలా భావించకపోవచ్చు! ఏమో నా వరకైతే, ఏ మనిషైనా ఓడిపోయిన చోటే వుండిపోకూడదు. నిజమయిన బంధం, ఆనందం దొరికినపుడు బాధను ఓ జ్ఞాపకంగానే మిగిల్చి స్వీకరించాలంటాను.

అసలు నేనయితే ఇలాంటివి పట్టించుకోను. నా తప్పేమీ లేదని నా మనస్సాక్షికి తెలిసినపుడు ఎవ్వరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం మంచి, నిజాల వైపు పయనిస్తున్నామా, లేదా? అని నిర్ణయించేది మన మనస్సాక్షికి మించింది మరొకటి లేదని నా అభిప్రాయం.

* * *

ఆమె వెళ్ళిపోయిన —

ఆ రోజు ఉదయం కళ్ళు తెరిచేసరికి నా శరీరమంతా తడిగా వుంది. ఆ తడి, ఆమె ఆ రోజు రాత్రి నాకు చెప్పకుండా వెళ్ళిపోయినా, నాకు తెలీకుండా నాలో వచ్చిన దు:ఖం వల్ల వచ్చింది.

ఒళ్ళంతా వెచ్చగా వుంది. ఆమె వెళ్తున్నట్టు నాకు చెప్పకపోయినా, నాకు తెలీకుండానే నా శరీరం తన భాదని వ్యక్తం చేస్తుందంటే నేనెంతగా ఆమె వశమయ్యానో ఆ రోజు గానీ నాకర్ధం కాలేదు. కాని తను మాత్రం ఆ రోజు ఉదయపు కిరణం నా మొహంపై పడగానే కనిపించకుండా పోయింది.

012ఇంటిని దాటి కనుచూపుమేర కనిపించిన ప్రతి దారిలోనూ వెదికాను. కనిపించిన ప్రతి మనిషినీ అడిగాను- ఆమె ఆచూకి తెలుసేమోనని. వాళ్ళు మాత్రం ఈ యాంత్రిక, ఉరుకుల పరుకుల జీవితంలో ఆమె గురించి గానీ, మరొకరి గురించి గానీ పట్టించుకునే తీరిక లేదని ఓ క్షణం నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయారు.

ఎవరో పర్వతాల వైపు వెళ్తూ కనిపించిందని చెప్పటంతో, ఊరి చివర కొండల మీద వరకు వెళ్లి ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమోనని వెదికాను. కాని ఆమె జాడ తెలీక పోవటంతో నిరాశగా వెనక్కి తిరిగి వస్తూ ఎక్కడో కుప్పకూలిపోయాను.

అప్పుడే నాలో కొత్త వెలుగుని తీసుకొచ్చిన ఆమె తారసపడింది.

హఠాత్తుగా ఏర్పడిన వేసవి తాపానికి దారి మధ్యలో నీరసపడి పడిపోయినపుడు నా మొహం కడిగి తేరుకునేలా చేసింది.

“నా పేరు ఆశ” అని పరిచయం చేసుకుంది. ఆ రోజు నుండి మేము కలవని రోజు లేదు. నా ఆరోగ్యం కోసం, నా కోసం శ్రద్ద తీసుకునేది. మేము ఎన్నో కబుర్లు చెప్పుకునే వాళ్ళం. మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. మేమిద్దరం పుట్టింది కూడా ఒకే రోజని, ఒకే సంవత్సరం అని తెలిసింది. ఒకరి కోసం, ఒకరం పుట్టామనిపించింది. మా ఇద్దరికీ ఎవ్వరూ లేరు. మేమిద్దరం ఎందుకు ఒక్కటి కాకూడదు అనిపించింది. తన అభిప్రాయం కూడా అదే అని తెలియటం తో సంతోషంగా ఒక ఇంటి వారమయ్యాం.

మా జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగిపోతుందిప్పుడు.

* * *

ఇలాంటి సమయంలో ఆమె వచ్చింది. అసలు తనెందుకు వచ్చినట్టు?

ఇంటి నిండా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆమె ఇల్లంతా కలియతిరుగుతుందే గాని ఎలాంటి ప్రశ్నలు అడగట్లేదు. ఎందుకు? ఏమో! బహుశా ఎక్కడా ఆమె జ్ఞాపకాలు కనిపించట్లేదేమో? అలాగని ఆమె నా మనసులో ఉందనుకుంటే అంతకన్నా ఘోరం లేదు.

కాని ఎలా చెప్పాలి? ఆమెను మించిన ప్రేమ, అనుబంధం నాలో ప్రవేశించాయని! తను మాత్రమే నా మనసులో వుందని!

ఒకవేళ, నేను సంతోషంగా వున్నానా లేదా అని తెలుసుకోటానికి మాత్రమే వచ్చిందా? తనను మర్చిపోయి నేను సంతోషంగా వుండాలని ఆమె కూడా ఆశిస్తోందా? కాని ఆమె ఎలా అలా ఆలోచించగలదు?

ఆమె ఇల్లంతా కలియతిరిగి నా ముందుకొచ్చి నిలబడింది. కాని ఆమె నుండి ఎలాంటి మాటలు బయటకు రావట్లేదు.

“అవును. నువ్వు వెళ్ళిపోయాక ఏంతో కుమిలిపోయాను. కాని ఇదిగో నువ్వు చూసే వుంటావ్. నా జీవితంలో ఆమే పోయిన సంతోషాన్ని, ప్రశాంతతని తీసుకొచ్చింది. ఇప్పుడు నా జీవితం ఆనందంగా సాగిపోతుంది.” అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాను. మరి నువ్వెలా వున్నావని అడగాలనుకున్నాను కాని తనే చెప్పింది. ఆ రోజు తనకి నచ్చిన వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళానని. ఇంకా ఆమె నుండి సమాధానాలు వస్తాయని ఆశించాను.

కాని నా వైపు చూస్తూ నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది. వెళ్తూ, వెళ్తూ నా జీవితంలో సంతోషాన్ని, ప్రశాంతతని తీసుకొచ్చిన ఆమె పేరేంటని అడిగింది. “ఆమె పేరు ఆశ. తనే నా ఊపిరి” అని చెప్పాను. మరో సారి చల్లగా నవ్వుతూ వెళ్ళిపోయింది.

ఆ నవ్వుతో, నేను సంతోషంగా వుండటం తనకు కూడా సంతోషంగా వుందని అనిపించింది. అంతే కాదు, ఆ నవ్వులో ఇంకా ఎన్నో సమాధానాలు వెతుక్కోవచ్చు.

*

రచయిత వివరాలు

Ravi_Kiran_Muvvala

రవి కిరణ్ మువ్వల,

స్వపరిచయం: ఎం.బి.ఎ చేసాను. సాహిత్యం అన్నా, రాయడమన్నా చిన్నప్పటినుండి ఇష్టం. రచయిత కావాలనేది, కథలు రాయాలన్నది నాకు చిన్ననాటి నుండి  అప్రయత్నంగా నాలో వున్న ఇష్టం.”

ఇష్టమైన రచనలు: చాలానే వున్నాయ్. ఇంగ్లీష్-ట్రాన్స్లేషన్ ‘చివరకు మిగిలింది?’, చలం-జీవిత ఆదర్శం, కల్యాణి, యద్దనపూడి- ‘ఐ లవ్ యు’, గిరిజా కల్యాణం, అమర హృదయం, యండమూరి- వెన్నెల్లో ఆడపిల్ల, అంతర్ముఖం, భమిడిపాటి వెన్నెల నీడ, జగన్నాధ శర్మ-పేగు కాలిన వాసన… ఇంకా నేను చాలా చదవాలి కాబట్టి కేవలం ఇవి మాత్రమే నా కిష్టం అని అనుకోకూడదు.

Download PDF ePub MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2014, అక్టోబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , .

4 Comments

 1. హాస్యబ్రహ్మగా లబ్దప్రతిష్టులైన పూజ్యులు శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారు, నాటక రచయిత, సినీ కధా రచయిత గా మంచిపేరు తెచ్చుకున్న వారబ్బాయి శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారు, వెన్నెలనీడ కధల, తెలుగు కధల ఆరామగోపురం అనిపించుకున్న శ్రీ భరాగో గారు (భమిడిపాటి రామగోపాలం గారు, విశాఖలో త్రిపుర గారికి క్లోజ్ ఫ్రెండ్), జాజిపూల పరిమళం లాంటి కధలు రాసిన మొదటి తరం ఫెమినిస్ట్ రచయిత, తెలుగు కధకు సన్నిహితుడు పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారు (త్రిపుర గారి మొదటి ఫాన్, ఆప్తమిత్రుడు) లను స్మరణకు వచ్చేలా చేసిన మువ్వల రవి కిరణ్ గారికి, తహిరో గారికి ధన్యవాదాలు.

  “బహుశా నేను మగవాణ్ణి కాబట్టి శూన్యం నిండిపోయిన సమయంలో ఓ సంతోషాన్ని కనుక్కోవటం తప్పు కావచ్చు! ఆమె వెళ్ళిపోయిన చోట సంతోషంగా వుంటే, ఆమె స్త్రీ కాబట్టి అది ఆమె గొప్పతనం కావచ్చు. ఏ మనిషైనా ఓడిపోయిన చోటే వుండిపోకూడదు. నిజమయిన బంధం, ఆనందం దొరికినపుడు బాధను ఓ జ్ఞాపకంగానే మిగిల్చి స్వీకరించాలంటాను. మనం మంచి, నిజాల వైపు పయనిస్తున్నామా, లేదా? అని నిర్ణయించేది మన మనస్సాక్షికి మించింది మరొకటి లేదని నా అభిప్రాయం“ తన రాకతో జీవితంలో సంతోషాన్ని, ప్రశాంతతని తీసుకొచ్చిన ఆమె పేరు ఆశ.

  ఎందుకో తెలియదు, యీ కధ మనసు నిండా (దేవరకొండ బాలగంగాధర) తిలక్ గారి కధాపరిమళాలని వెదజల్లింది.

  వాక్య విన్యాసం, కధనం, భావ సాంద్రత, భావ పరిపక్వత, కధ ఎత్తుగడ నుండి ముగింపు వరకు మంచి పరిణితి, ప్రతిభను కనబరిచిన మువ్వల రవి కిరణ్ గారి నుండి మరిన్ని మంచి కధలను ఆశించవచ్చనిపిస్తున్నది, ఓ సగటు పాఠకుడిగా.

 2. పర్లేదు … బానే ఉంది.
  బుచ్చిబాబు నవల “చివరకు మిగిలేది”, “గాన్ విత్ ద విండ్” కు అనువాదం “చివరకు మిగిలింది”. రెండూ ఒకటే అని ఎందుకు అనుకుంటాం?.
  ఉత్తినే భమిడిపాటి అంటే కుదరదు. రామగోపాలం అని రాయాలి. ఎందుకంటే ఆ ఇంటి పేరు తో మరో నలుగురు రచయితలు ఉన్నారు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.