coverfinal

థర్డ్ డిగ్రీ

Download PDF ePub MOBI

బస్సు దిగి ఇంటివైపుగా నడుస్తుంటే ఎవరో పిల్చినట్టు అనిపించి వెనుదిరిగి చూస్తే మనిషి రూపం సరిగా కనిపించలేదు. లేదా నాకు తెల్సిన మనిషిలా అనిపించలేదు. ఒక్కోసారి పొరపాటున, ఒకరనుకుని మరొకర్ని పిల్చే అవకాశం కూడా ఉంది కదాని ముందుకు కదలబోయాను.

ఈసారి కాస్త గట్టిగానే వినిపించింది, పిలుపు.

తీక్షణంగా రోడ్డు అవతలివైపు ఉన్న మనిషిని చూస్తే, కాస్త తెలిసిన మనిషిలాగే అనిపించాడు. దగ్గరికి వెళ్తే నిరంజన్.

“గుర్తు పట్టలేదా?” అంటూ నవ్వాడు.

నేను నిజంగానే ఇబ్బందిగా నవ్వాను. పిలిస్తే దగ్గరికి వెళ్ళి చూసాను కాబట్టి గుర్తుపట్టడమే. ఎవరి పని మీద వాళ్ళు వెళ్తూ, ఎక్కడో రోడ్డు మీద ఎదురుపడ్డా గుర్తుపట్టడం కష్టమే.

మొహం మోతాదుకు మించి పీక్కుపోయి వుంది. భుజాలు వొంగిపోయినట్లుగా వున్నాయి. నవ్వు తెచ్చుకుంటున్నాడు కానీ అది రావడం కష్టమని తెల్సిపోతోంది. మొత్తంగా, జీవితం బాగా ఆడుకోగా పాతబడిపోయి, సగం గాలి తీసేసిన ఫుట్ బాల్ లా కనబడ్తున్నాడు.

“ఫ్రెండ్, సందీప్…” అంటూ పక్కన తనతో పాటు టీ తాగుతున్న వ్యక్తిని పరిచయం చేసాడు.

“నేను చెప్పాను కదా, మా అన్నయ్య ఫ్రెండ్…” అంటూ అతనితో కనుబొమలు ఎగరేస్తూ సైగ చేసాడు.

అతన్ని చూస్తున్నానన్నమాటే కానీ, ఏవో ఫార్మాలిటీ ప్రశ్నలు వేస్తున్నానన్నమాటే కానీ, నిజానికి నేను గతంలోని అతన్ని గుర్తుచేసుకోవడంలో మునిగిపోయాను.

* * *

నిరంజన్ మావూరివాడే. మా ఇంటి దగ్గర్లోనే వుండేది వాళ్ళ ఫ్యామిలీ. అతని అన్న నా క్లాస్మేట్. మా ఇద్దరి మధ్యా మహా అయితే అయిదేళ్ళ తేడా. చిన్నప్పుడు అందరం కల్సి రబ్బర్ బంతుల్తో గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళం. బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతిని గిరగిరా తిప్పేవాడు. నిరంజన్ హిర్వానీ అని పిలిచేవాళ్ళం. ఎట్నుంచి వచ్చి ఎటు వెళ్తుందో అర్థం కానంతగా బంతిని స్పిన్ చేసేవాడు. ఇంటి దగ్గర్లో వుండడం వల్ల ఆటకోసం కలవడమే, అంతకు మించిన స్నేహం ఉండేది కాదు, అప్పట్లో.

ఇంటర్, డిగ్రీ, పీజీలు… వరసగా ఒకటి తర్వాత ఒకటి. అనుకోకుండా ఒకసారి యూనివర్సిటీ క్యాంపస్లో ఎదురుపడ్డాడు.

చురుగ్గా ఉన్నాడు. డైనమిగ్గా కనిపించాడు. చుట్టూ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్. హుషారుగా జోక్స్ కట్ చేస్తున్నాడు. క్యాంపస్లో ఎం.ఎస్సీ.(మ్యాథ్స్) చేస్తున్నా అన్నాడు. ఆశ్చర్యం అనిపించలేదు. చిన్నప్పట్నుంచీ లెక్కల్లో జెమ్. ఏది మాట్లాడబోయినా, అన్నింటిపైనా అధికారంగా మాట్లాడ్తున్నాడు. కరెంట్ ఎఫైర్స్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు.

ఆ సమయంలో సిటీలో ఉండడానికి నాకు షెల్టర్ కావాలనిపించి అడిగితే, అతని రూంలో నాన్ బోర్డర్ గా ఉండడానికి వెంటనే వొప్పుకున్నాడు.

“మనం మనం ఒక్కవూరోళ్ళం. ఆమాత్రం చేసుకోకపోతే ఎట్లా?” అన్నాడు.

అతనితో పాటు రూంలో ఉన్న కొన్నాళ్ళు, కొంత దగ్గరగా చూసే అవకాశం దొరికింది. ఒకవైపు పీజీ చేస్తూనే, ఇంకోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేరయ్యేవాడు, ఫ్రెండ్స్ తో కల్సి. వాళ్ళతో సినిమాలూ, షికార్లూ మామూలే. అప్పుడప్పుడు నాకు కెరీర్ కౌన్సిలింగ్ కూడా చేసేవాడు. నా బుర్రకెక్కని లెక్చరర్ పోస్టుల గురించీ, నోటిఫికేషన్ల గురించీ చెప్పేవాడు.

* * *

“ఇక్కడే సిటీల జాబ్. మీర్ పేటలో ఇల్లు కట్టుకున్నా” అంటూ ఒక చేతిలోని బ్యాగుని ఇంకోచేతిలోకి మార్చుకున్నాడు.

“పిల్లలు బాగున్నారా? ఒకరా, ఇద్దరా?” అన్నాను.

“పిల్లలు లేరుగా, నాకు?” అన్నాడు.

లోపల మనకేమనిపించినా, బైటకి మాట్లాడలేని విషయం కదా. కొద్దిగా ఆశ్చర్యాన్ని పులుముకుని టాపిక్ ఢైవర్ట్ చేసా. కానీ ఆవరించుకుంటున్న గతాన్ని టర్న్ ఆఫ్ చెయ్యలేకపొయ్యాను.

* * *

కొన్నేళ్ళ తర్వాత సిటీలోనే బస్సులో ఎడురుపడ్డాడు నిరంజన్. పీజీ, బీఈడీ అయిపొయ్యాయట. గవర్నమెంట్ టీచర్ అయ్యాడట, మూన్నెళ్ళ కింద. నేనేం చేస్తున్నానో ఆరా తీసాడు. ఈసారి మరికాస్త ఉత్సాహంగా కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చాడు.

అతను దూసుకుపోతున్న మనిషి. నేనేమో సినిమాల్లో రైటర్ అవకాశాల కోసం తిరుగుతూ, రోజుకింత మూసుకుపోతున్న మనిషిని.

అతను అన్న చివరి మాట ఒకటి బాగా గుర్తుండిపోయింది.

“తొందరగా లైఫులో సెటిలైపోవాలి. మనకు చేతకాకపోయేటప్పటికి, చేతికి అందివచ్చే కొడుకులు ఉండాలి”

* * *

illustration“అన్నయ్య చనిపోయిన తర్వాత, ఇదేకదా మనం కలవడం?” అన్నాడు. అప్పుడు గుర్తొచ్చాడు నిరంజన్ వాళ్ళ అన్నయ్య. పద్దతిగా చదువుకుని, పద్దతిగానే గవర్నమెంట్ జాబ్ సంపాదించి, మరింత పద్దతిగా పెళ్ళి చేసుకుని కూడా, అకస్మాత్తుగా ఒకరోజున ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి మరీ అంత క్లోజ్ కాని నాకే కాదు, ఇంట్లోవాళ్ళకి కూడా, అతని సూసైడ్ కారణాలు తెలీదు.

మరో నిముషం మౌనం.

ఫోన్లు చేసుకున్నా, చేసుకోకపోయినా నెంబర్లు మార్చుకోవడం రివాజు. పూర్తయిన తర్వాత మెల్లగా అన్నాను.

“చూస్తుండగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి…”

నవ్వాడు. నవ్వడం వల్ల వొంగిపోయిన తనను తాను నిలబెట్టుకుంటూ అన్నాడు. “అవును. ఇంకేముందీ? ఇప్పుడు నాకు ముప్ఫై ఎనిమిది. అంటే నలభై. నలభై అంటే ముసలోళ్ళం అయిపోయినట్టే…”

ఒక్కసారిగా వొళ్ళు జలదరించింది. తల తిప్పుకోవడానికి జేబులోని మొబైల్ చేతిలోకి తీసుకుని, వూరికే ఆపరేట్ చెయ్యబోతే, ఏ బటన్ ప్రెస్ చేసినా ఫోన్ పని చేయడం లేదు. స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేసినా లాభం లేదు. బ్యాటరీ బయటకు తీసి క్లీన్ చేసి, సెట్ చేసాక మొబైల్ ఆన్ అయ్యింది.

ఇంటివైపు ఒక్కడినీ నడుస్తుంటే నిరంజన్ బంతిని తిప్పే స్టైలూ, కెరీర్ డైనమిజమూ, లైఫులో సెటిల్ అవ్వడం గురించి చెప్పిన మాటలూ ఒకటి తర్వాత ఒకటి గుర్తొస్తున్నాయి. ఒక విషాదపు జీర నన్ను వెంటాడుతూ వొస్తున్నట్టుగా వుంది.

నలభైకి జీవితం ముగిసినట్టేనా?! ఏమి మాయకాలం ఇది? ఏ వుత్సాహంతో పరవళ్ళు తొక్కిన ఏ జీవితం, ఏ నిర్లిప్తత నీడల్లో నీరు కారిపోతుంది? అతని జీవితానికి సంబంధించి ట్రాజెడీ అనేది, నాకు అనిపించినంతవరకూ, పిల్లల్లేకపోవడం కాదు. అతనూ అలా వొంగిపోవడానికి కారణం అదే అన్నట్లుగా కనిపించలేదు. ఏదో మిస్సింగ్. లైఫ్ ఎక్కడో స్ట్రక్ అయ్యింది.

బ్యాటరీ మార్చాలి. మార్చాలంటే, ముందు ఆ వీలుందని తెలియాలి.

– మోహన్ రుషి

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, కథ and tagged , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.