Anandam720_380

పిల్లలకూ, పెద్దలకూ “ఆనందం” కలిగించే కథలు

Download PDF

సాహిత్యంలో బాలసాహిత్యానికి విశేషస్థానం ఉంది.  బాలసాహిత్యం సృజించటం తేలిక కాదు. తమ రచనా పటిమని నియంత్రించుకుంటూ, పిల్లల స్థాయికి తగ్గట్టుగా, సులభంగా అర్థమయ్యేలా, తేలికైన పదాలతో రచనలు చేయడం అంత సులువు కాదు.

మనోల్లాసం కలిగిస్తూనే, పిల్లలకి జీవితంలో ఉపకరించే ఏదో ఒక అంశాన్ని నేర్పుతూ, వాళ్ళ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసేలా పిల్లల రచనలు చేయడం కష్టం. తన కథల ద్వారా ఈ కష్టాన్ని ఇష్టం చేసుకున్నారు శ్రీ దాసరి వెంకట రమణ. “చందమామ” కథకుడిగా ప్రసిద్ధులైన దాసరి వెంకట రమణ గారి కథా సంపుటి “ఆనందం“లోని కథల గురించి తెలుసుకుందాం.

జీవితంలో నిజమైన ఆనందమంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదనీ, ఉన్నదానితో సంతృప్తిగా, పకృతి ఒడిలో, కుటుంబ సభ్యులతో గడపగలిగితేనే ఆనందమని సులక్షణుడు చెబుతాడు “ఆనందం” కథలో.

ఇరుగుపొరుగైన సోమసుందరం, శరభయ్య లలో ఎవరు తెలివైన వాడో చెప్పాల్సి వస్తుంది సారంగుడికి. మరి నిజంగా తెలివైన వాడెవరు? ఆ తెలివికి సార్థకత ఏమిటో “తెలివైన వాడు” కథ చెబుతుంది.

పాండిత్యం సంపాదించడం అహంభావానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. శాస్త్రాలనెన్నో జీర్ణించుకున్న ఓ మేధావి అహంకారం వల్ల పతనమైన తీరు “సుప్రతీకుడి ప్రశ్నలు” కథ తెలియజేస్తుంది. ఓ సామాన్యుడిలోని దేశభక్తి, ఇంగితజ్ఞానం ఆ రాజ్యపు పరుపు ప్రతిష్టలని ఏ విధంగా కాపాడాయో ఈ కథ చెబుతుంది.

తప్పు చేసినవాడిని దండించడం కన్నా, వాడిలో ప్రాయశ్చిత్తం కలిగేలా చేయడమే శ్రేయస్కరమని “మేలు కుట్టిన దొంగ” కథ చెబుతుంది. కాలానికి తగ్గట్టు ప్రవర్తించడం వలన లభించే బహుమతి ఏమిటో కూడా ఈ కథ చెబుతుంది.

జీవితంలో మొహమాటం కలిగించే ఇబ్బంది అందరికీ తెలుసు. అవసరమైన చోట, అడగాల్సిన ప్రశ్నలకు అడగక మొహమాటపడి, లోలోపల బాధపడడం కన్నా, మొహమాటాన్ని వదిలి సందేహాలను తొలగించుకుని నడుచుకోడమే ఉత్తమం అని “రూపాయి సమస్య” కథలో రచయిత సూచిస్తారు.

తమకన్నా మెరుగైన స్థితిలో ఉన్న తోటి విద్యార్థిని చూసి అసూయపడడం మేలు చేయదని, ఆ విద్యార్థితో పోటీపడి చదువుపై శ్రద్ధ వహించడం మంచిదని “అసూయ” కథలో గురువుగారు చెబుతారు.

తోటి వారికి వీలైనంత సాయం చేయడం, నమ్రతగా ఉండడం ఈ కాలంలో పనికిరావని చాలా మంది భావిస్తూంటారు. సొంతలాభం కొంత మానుకుని… అనే సూక్తికి వ్యతిరేకంగా, సొంతలాభమే ప్రధానమని భావించే వ్యక్తుల మధ్య సత్తెకాలపు మనిషిలా వ్యవహరిస్తే ఏమవుతుంది? అటువంటి వ్యక్తికి ఏం జరుగుతుందో “ఉత్తముడు” కథ తెలియజేస్తుంది.

పనిపాటా లేకుండా, సోమరిగా తిరిగే పోకిరి కుర్రాడిని గంగిరెద్దు, గానుగెద్దులతో కూడా పోల్చకోడదని, ఆ రెండూ తమకు చేతనైన పని చేసి తమ యజమానుల కడుపు నింపుతాయని చెబుతుంది “గానుగెద్దు – గంగిరెద్దు” కథ.

సాధారణంగా పిల్లలకి ఏం కావాలో ఎప్పటికప్పుడు గమనించి తల్లిదండ్రులే ఆ అవసరాలు తీరుస్తారు. అయితే పిల్లలు ఎదిగే కొద్దీ అవసరాలు మారుతాయి, కొన్ని అవసరాల గురించి తల్లిదండ్రులకు చెప్పలేరు. తల్లిదండ్రులే ఎదిగిన పిల్లల అవసరాలను గ్రహించాలని, అలా గ్రహించి మసలుకుంటే, పిల్లలు దారితప్పే అవకాశం ఉండదని చెబుతుంది “తండ్రి కానుక” కథ.

కోపం అనేది ఓ దుర్గుణం. ఒక వేళ కోపం వచ్చిన అది కర్పూరంలా ప్రజ్వరిల్లి, క్షణాల్లో చల్లారిపోవాలి. తన కోపం వల్ల అయినవాళ్ళని దూరం చేసుకున్న వ్యక్తిలో మార్పు రావడానికి అతని బావమరిది చేసిన ప్రయత్నాల గురించి చెబుతుంది “కూర్మావతారం” కథ.

క్రీడలు శారీరక మానసిక వికాసం కోసమని తెలుసు. ఆట ఆడడమే ప్రధానం కానీ, గెలుపు ఓటముల ప్రసక్తి ముఖ్యం కాదనుకున్న వ్యక్తి “ఆటలో ఆనందం” హాయిగా అనుభవించగలడు.

దేవుడు గొప్పా, మనిషి మంచితనం గొప్పా అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది “నమ్మకం” అని తేలుతుంది. ఎవరి నమ్మకాలకు అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటారనీ, జీవితానుభవాల ద్వారా ఏర్పడిన నమ్మకాలు సత్యమే అవుతాయని రచయిత చెబుతారు.

ఎందుకూ ఉపయోగపడని పాండితీ ప్రకర్ష కన్నా, వ్యవహార జ్ఞానమే మేలని “లోకనాధుడి పాండిత్యం” కథ చెబుతుంది. జ్ఞానాన్ని కలిగి ఉండడం గొప్ప కాదనీ, దాన్ని సద్వినియోగం చేసుకుని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ, పదిమందికీ ఉపయోగపడాలని ఈ కథ చెబుతుంది.

పాలకులు అతి వినయం చూపించే వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో “అతి వినయం” కథ చెబుతుంది. మోసగాళ్ళకూ, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళకు మధ్య తేడాని స్పష్టం చేస్తుంది కథ.

ప్రజల బుద్ధి వికసించి, భ్రాంతిని వదిలిపెట్టి నిజాన్ని నిజంగా తెలుసుకునే స్థాయికి వారు ఎదిగితే గాని వారి విశ్వాసాలు తప్పని తెలిసినా, పాలకులు నిజాలని బహిరంగం చేయకూడదని “భ్రాంతి” కథ చెబుతుంది.

నిజానిజాలు తెలుసుకోకుండా, తొందరపాటుతో ఇరుగుపొరుగులతో గొడవలకి దిగడం, బలప్రయోగం చేయడం తప్పని చెబుతుంది “త్రిధాముడి కల“. కలసి ఉంటే కలదు సుఖం అనే నానుడిని నిజం చేయాలంటే ప్రజలు ఏ విధంగా మసలుకోవాలో తెలిపేందుకు త్రిధాముడనే సాధువు తనకొచ్చిన కలలో ఏం జరిగిందో చెబుతాడు. ఆ కల నిజమవ్వాలనీ కోరుకుంటాడు.

జీవితంలో తిండి తప్ప మరేమీ ముఖ్యం కాదనుకుంటే బతుకు దుర్భరం అవుతుంది. జీవితంలో ఆనందం, ఆహ్లాదం, ఆలోచన, ఆవేశం ఉన్నప్పుడే మనిషిలో ఉత్సాహం ఉరకలు వేస్తుందని “సందేహ నివృత్తి” కథ తెలియజేస్తుంది.

నిరంజనవరం అనే ఊరిలో మాధవయ్య, భూషణం అనే తండ్రీకొడుకులిద్దరూ ఓ విషయంలో పంతం పడతారు. ఎలాగైనా ఇద్దరూ గెలిచి తీరాలనుకుంటారు. కొడుకే గెలిచాడని తండ్రి అంటాడు, కాదు తండ్రే విజయం సాధించాడని కొడుకంటాడు? ఇంతకీ ఎవరు గెలిచినట్లు? అది “నిజమైన గెలుపేనా?“. మంచి కథ.

మంచితనమే మంచి ధనమని చెప్పే కథ ఎంతో బాగుంటుంది. ఇంకా మరిన్ని చక్కని కథలున్న ఈ సంకలనం చిన్నారి పాఠకులను ఎంతో అలరిస్తుంది.

సరళమైన శైలిలో, కథలోని నీతిని పిల్లలు సులువుగా గ్రహించేలా రచించారు దాసరి వెంకట రమణ. 2014 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన ఈ పుస్తకం కినిగెలో లభ్యం.  120 పేజీలలో 22 కథలున్న ఈ పుస్తకం వెల రూ. 100/-.

- కొల్లూరి సోమ శంకర్

Posted in 2014, అక్టోబర్, పుస్తక సమీక్ష and tagged , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.