irlachengi kathalu

పురుక్కాటుకు వైద్దిగ్గం

Download PDF ePub MOBI

‘మంత్రాలకు సింతకాయిలు రాలవు’ అనే మాటను శానామంది అంటా వుంటారు గానీ కొంచిం తెలివిగా ఆలోచించి సింతకాయిలు రాల్సి సూపెట్టి నోళ్లు కూడా దేశంలో తక్కువేం లేరు.

‘మంతరమనేది గుడ్డి నమ్మకమే గావచ్చు. అయితే అది గూడా శాత్రంతో ముడిబడి వుండేదే’ అని మా నాయిన మాకు ఇలావరిగా సెప్పుండాడు.

ఆదివారమొచ్చిందంటే సాలు. ఇంగా మసక మసగ్గా వుండంగానే మాయింట్లో గిజగిజాని జనాలు మాకు వూపిరాడకుండా సేస్తారు. ముందే మాయమ్మ మాతో యాంగలేక సచ్చిసున్నమవతా వుంటాదా? ఆ పొద్దింకా నిలుకుండదు మాయమ్మకు వచ్చేపోయే జనాలతో. రొండుగాళ్లు ఒక సోట బెట్టుకోని నిల్సుకొనేదానికి లేదని మాయమ్మ ఒగోనాడు యాష్టపోతావుంటాది గూడా.

అంతమంది జనాలు ఆదివారమొచ్చిందంటే మాయింటికి ఎందుకొస్తారో తెలుసా? ఒకవూరా నాడా. యడాడి నుంచో సీమల పుట్టలో నుంచి సీమలొచ్చినట్ల మా వూరి సుట్టు పట్టోళ్లు, తెలుగోళ్లే కాకుండా గుడియాత్తం, సేలం, మద్రాసు, రాణీపేట, వాలాజా, ఏలూరు, కాట్పాడి, ఆర్కాడు, తిర్తని, సోలింగరం, ఎన్ని పేర్లని సెప్పేది అన్నూర్ల నుంచీ వస్తానే వుంటారు. మా నాయన ఆదివారం లేకపోయినాడా అంతమందీ వుసూరుమని మొగాలేలాడేసుకొని ఎంతో దిగులుగా ఎనక్కిబోవాల్సిందే.

ఆదివారమొచ్చిందంటే మా నాయిన పురుక్కాటుకు వైద్దిగం సేస్తాడు. ఈ బూమండలం మింద పురుగూ పుట్ర కోటానుకోట్లుండాయి. గదా! వాటిలో మనిసికి మేలు జేసేవే గాకుండా చెడుపు చేసేవి కూడా వుండాయి. అవి ఒక్కోసారి మనకు దెలీకుండానే మనల్ని కర్సో, నాకో ఇబ్బందుల పాలు జేస్తా వుంటాయి. పురుక్కాటనే సెర్మరోగం అట్లా వచ్చేదే.

మా యింటికొచ్చేవాళ్ల ఒళ్లు సూడాల సావిూ, ఏనుగు సెర్మం మాదిరిగా కొందురికి, సిడాలు సిడాలుగా, పుండ్లు పుండ్లుగా, సెమట కాయిలు మాదిరిగా, దద్దుర్లు మాదిరిగా, రసిగారే పుండ్లతో నవ్వలతో గీరుకోలేక అల్లాడిపోతా వుంటారు. కొంతమంది వొళ్ళంతా అల్లుకుంటా వుందని యాడస్తావుంటారు. అట్లాంటోళ్లకు వైద్దిగం సెయ్యడంలో మా నాయిన ఎత్తినోడు. అందుకే ఆదివారం అంతమందొస్తారు మాయింటికి.

ఆపొద్దు మా నాయనకు మాయమ్మకే గాదు. మా కందరికీ నిలుకులేనంత పని. మా నాయన నీళ్లు మంత్రించి పెట్టేసి బాయికాడికి పూడస్తాడా! వొచ్చే జనాల్ని పలకరించి, వాళ్లు సెప్పేసోదంతా ఇని వాళ్ల సెర్మంపై నుండే యాది గమనించి, బాగయిపోతాదని వాళ్లకు దైర్నం సెప్పి మంత్రించిన నీళ్లనిచ్చి తాగమని, పుయ్యమని, పత్యం పలానా అని సెప్పి – తక్కవ పననుకుంటా వుండారా? మా నాయన ఇంటి దెగ్గిర ల్యాకుంటే ఇదంతా మాయమ్మ నెత్తినే పడేది.

పోనీ దీనివల్ల ఏమన్నా ఆదీకముండాదా అంటే దమ్మిడీ ఆదీకం లేదు. అంతంత దూరం నుంచి వాల్ల గాచ్చారం బాగా జేసుకోను వొచ్చేవాళ్లు దుడ్లింతియండంటే ఇయకుండా పోరు. కానీ అది గిట్టని పని మా నాయినికి. మా యమ్మయితే ఇంకా మించిందనుకో. ఎవురైనా ఆకువక్క, పండ్లు పూలు, టెంకాయ దెచ్చి సేతిలో పెడ్తారా. దాన్నాడే వాకిట్లో వుండే తులిసెమ్మ కోటదెగ్గిర బెట్టి మొక్కి టెంకాయ గొట్టి ఒక చిప్పన్నా దీసుకోమని వాళ్లెంత బంగపోయినా ఇనకుండా మంత్రం పెన్జెయదని సాకు జెప్పి వోళ్లకే ఇచ్చేస్తాది. రొండంటి పండ్లన్నా దీసుకోని మాకిస్తే తినమా?

మా నాయినేసే మంత్రం తీరూ తెరువూ సెప్పకుండానే ఏందేందో సెప్తా వుండానా.

ఆదివారం రాంగానే మాయింట్లో వుండే ఇత్తడి గుండు జెంబును సింతపండేసి తళతళా మెర్సేట్టు తోమాల. నేనో, మాయక్కో ఆపని జేస్తాము. సరిగా తోమలేదనుకో మాయమ్మకు యాల్లేని కోపమొచ్చేస్తాది. అదేగాదు యా పని జేసినా సుద్దంగా జెయ్యాల. లేదా ‘పొయినసోట ఇట్లే జేసి నామానం మంటగలప్తారా’ అని తిట్తాది. అట్లా తోమిన సెంబును సేందబాయి దెగ్గిరికి దీసుకోని బోయి సెంబు కింద బెట్టకుండా నీల్లు సేంది సెంబులో బోసుకోని మా నాయినికి దెచ్చియ్యాల. ఎవురో ఒకరు ఒక యాప్మండ దెచ్చిస్తే దాన్లో నుంచి లెక్కబెట్టి ఐదు ఈనిలు దీస్కోని ముందు తూరప్పక్క దిరిగి మంత్రం జెప్తా సెంబులో యాప్మండల్ని గుండ్రంగా తిప్పతాడు కొంచేపు. ఆడికి మంత్రం ముగిసినట్ల.

వొచ్చిన జనాలు పొలోమని నువ్వు ముందా నేను ముందా అని గలాసులు బట్టుకోని మంత్రించిన తీర్తం కోసం ఎగబడతారు. గలాసులో పోసిన తీర్తాన్ని వాళ్లు కొంచిం తాగి కొంచిం పురుక్కాటు మింద పూసుకోవాల. ఇంకొంచం ఎగస్ట్రాగా పోసుకోని ఇండ్లకు బోయి కింద బెట్టకుండా పైన్యాడన్నా బెట్టుకోని అప్పుడప్పుడు దానిమింద పుయ్యాల. అందుకే సెంబులో నీళ్లు కొంచేపిటికే అయిపోతాది. మళ్లీ కింద బెట్టకుండా కొత్త నీల్లు దెచ్చి దాంట్లో కలపాల. రాత్రిదాకా అట్లా జనాలొచ్చేకొద్దీ నీళ్లు కలపతా వుంటాము. సెంబులో నీళ్లు మంత్రించకముందుగాని మంత్రించినాగ్గాని కింద బెట్టగూడదు. అందుకని దొంతికుండల మింద బెడ్తాము.

యాదిని బట్టి కొంతమందికి మూడు వారాలకే బాగయిపోతాది. కొందురికి అయిదువారాలు పడ్తాది. నీళ్లు దాగినన్ని వారాలు ఆపైన ఒక వారం దాకా కౌసు (మాంసం, స్యాపలు, గుడ్లు లాంటివి) అవిసాకు, ఉలవలు, గుమ్మిడికాయ ముట్టుకోరాదు. పత్తిం సక్కరమంగా వుంటే తప్పకుండా బాగయిపోతాది. మా నాయిన దెగ్గిరికొచ్చి పెయిలయిన కేసు ఒగటి గూడా లేదులే! ఎన్ని రకాల పురుకాట్లయినా మా నాయిన మంత్రించిచ్చిన యపాకు నీళ్లతో సుద్దంగా అయిపోయేది.

‘ఏం మంత్రం నాయనా నువ్వేసేది మాకూ జెప్పకూడదా’ అని అడిగితే నవ్వేసి వూరుకొనేవాడు మా నాయన. ఒగదినం మాకు నేర్పించి తీరాల్సిందేనని మాయక్కా నేనూ వుడకాడిరచి సగమూపిరి దిసేసినాము. సివరికి నవ్వతా ‘మంత్రమా గింత్రమా’ అని తీసిపారేసినాడు.

‘మరి మంత్రం ల్యాకుండా ఎట్లా బాగవతా వుండాది అంత మందికి’ అని అడిగితే మా నాయన ఏం జెప్పినాడో తెల్సా. జాగర్తగా ఇనండి విూకూ పనికొస్తాది.

‘మంత్రమూ లేదు తంత్రమూ లేదు. మంత్రాలకు సింతకాయిల్రాలతాయా అంటారే అది నిజమైన మాట. అన్నింటికీ మనసే కారణమమ్మా. ఏదో బాగయ్యేదానికి మంత్రమేస్తా వుండాడు బాగయిపోతాది అని నమ్మతారే ఆ నమ్మకమే ఆడ పన్జేసేది. దాన్నే ఇంగిలీసులో ఇల్లుపవర్‌ (విల్‌ పవర్‌) అంటారంట. ఇంగ సెర్మవ్యాదులంటారా? అవి ఏదైనా పురుగు కుట్టినా, నాకినా, వొంటిమింద పారాడినా వస్తావుంటాయి. ఒగోసారి ఒంట్లోనించే పుడ్తాయి. మనం తినే తిండిని బట్టికూడా సెమటకాయిలు, గుల్లలు, పుండ్లు, దుద్దుర్లు వస్తావుంటాయి. ఈటి కన్నిటికీ యాపాకు నీల్లు ఎత్తింది. యాపాకు మంచిది గదా అని అన్నిటికీ దాన్ని నూరి పూస్తే ఒగోసారి ఎండిన పుండుగూడా పచ్చిగా మారి రసిగారినా గారచ్చు. నీల్లలో దాన్ని తిప్పి పూస్తే అది ఇకటించకుండా కరెట్టుగా పన్జేస్తాది. దీన్నే వైద్దశాత్రంలో పొటెన్సీనో గిటెన్సీనో అంటారులే. దాని కోసమే ఆయుర్వేదంలో మందు దినుసుల్ని కల్వంలో నూరతారు. ఓమియోపతిలో తగిన మోతాదులో మందును కలపతారు. ఇంగ నాటు వైద్దిగమంటారా! దీనికి మించిన రాజులేడు. దమ్మిడీ కర్సులేకుండా రాచపుండులాంటి బయంకరమైన వ్యాదుల్ని గూడా బాగా జేస్తాదిది. సెర్మ వ్యాదులకు గుమ్మిడికాయ, వంకాయ ల్లాంటి సెల్దివొస్తువులు పనికిరావు. వాటికెప్పుడు దూరంగా వుంటారో అప్పుడు సగం రోగం బాగయిపోయినట్లే. పేదోళ్ల పాలిట పెద్దవరమమ్మా నాటు వైద్దిగం, అని పెద్ద రామాయణ మెత్తుకున్న్యాడు. ‘మన్నూ, పసుపూ, యాపాకు యాంటీ సెపిటిక్కమ్మా. ఈ మూడు వస్తువులతో ఎన్నో రోగాలు బాగయిపోతాయి’ అన్న్యాడు.

‘ఇన్ని తెలివితేటలతో పాటు ఇంగిలీపీసు కూడా వొచ్చిందే మా నాయినికి’ అని మురిసిపోయినాము మేము.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, ఇర్లచెంగి కథలు, సీరియల్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.