cover

అనుకోకుండా

Download PDF ePub MOBI

మీరడగొచ్చు- ఇదంతా ఎలా జరిగిందని?

పెద్ద విషయమేం కాదు; ఒక మూసిన తలుపు, ఒక తెరుచుకోని గోడ. కానీ ఇదంతా జరిగింది వాటికి బయట. గోడలకి, తలుపులకీ, ఇళ్లకీ, ఊరికి అవతల. అక్కడున్నది కాలవ కాదు కొలననీ, అందులో ఈదేవి కొంగలు కాదు హంసలనీ మేం బాగా వాదించుకున్న తర్వాతనుకుంటా. గడ్డివాముకీ, చింతచెట్టుకీ, బీరపూల పాదుకీ కాస్త దూరంగా వెళ్ళాక కావచ్చు.

*

రోజూలాగే ఊరిచివర నీరెండిన బావిదాకా నడుచుకుంటూ వెళ్ళాం. ఎప్పట్లానే గుప్పెళ్లతో కాస్త మట్టి అందులోకి విసురుతూ ఉన్నాం కాసేపు. ‘ఇంకెంత, మరో నాల్రోజుల్లో నిండిపోతుంది’ అనుకుని బావిగట్టుపై కూర్చున్నాం.

అప్పుడన్నావు చిన్నగా, దాదాపు గొణుగుతూ “మనం మనుషులం. ఇందాకే తెలిసింది. ఆ తలుపులు, గోడలు దాటి నడుస్తూ వస్తున్నామా? అప్పుడే – మనం కోతులం, కుక్కలం కాదు.”

ఒప్పుకోలేదు నేను. మోచేతులు, కాలిమడమలూ చూపించాను “ఐతే ఈ దెబ్బలేంటి? ఎందుకు కమిలిపోయాయి ఇలా? చాలాసార్లు మనం కుక్కలం కూడా కాదు, కేవలం వస్తువులం, కానీ కొన్ని సార్లు మాత్రం నువ్వన్నట్టు, ఆ వస్తువుల్ని వాడుకున్నందుకు మాత్రమే మనుషులం. అర్థం కానట్టు నటించకు” అని అరిచాను.

*

తలమీద తూనీగలు గిరికీలు కొడుతున్నాయి, ఐనా వాన కురవదని మనకి తెలియకపోతేగా? మేకలమంద ఆగనంతమాత్రాన గట్టు పక్కన గడ్డి పెరగడం మానదని అనిపించకపోతేగా? మర్రిఊడలు పట్టుకు ఉయ్యాలూగి పిల్లలెళ్ళిపోయారు. తామరతుళ్ళని గోళ్లతో గిల్లి దండలల్లి అక్కడే వదిలేసి వెళ్ళారు. ఇవిగో, వాళ్ళు మనకోసమే వదిలెళ్ళారు అంటే బాగా నవ్వావు. కాసేపలా నవ్వుతూనే ఉన్నాం. చెరువు పక్కన మైలురాయి మీద తొలిచిన గీతలకన్నా రాలిన రావి ఆకుల వయసు ఎక్కువనగానే నీక్కోపమొచ్చింది. ఆ తర్వాత మనం చాలాసేపు మాట్లాడుకోలేదు. కనీసం వాదించుకోలేదు. “ఏవుందక్కడ? ఒక పిచ్చి చెట్టూ రెండు బండరాళ్ళూ…” అని ఆ కళ్ళులేని తాత అరుస్తూ వెళ్ళిపోయాక కదూ మనం బెదిరిపోయి గట్టిగా చేతులు పట్టుకున్నాం?

అప్పుడు జరిగింది అసలదంతా.

*

ఇదంతా విని ఇక ఎప్పటికీ మీరడక్కపోవచ్చు – ఇంతకీ అసలక్కడ ఏం జరిగిందని?

*

Download PDF ePub MOBI

(Image Courtesy: https://www.flickr.com/photos/pevelpetros/8209448266)

 

Posted in 2014, అక్టోబర్, మ్యూజింగ్స్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.