cover

పదనిష్పాదన కళ (23)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

పదమూడో అధ్యాయం

సృజనశీలం (Creativity) ద్వారా నూతనపదాల నిష్పాదన
(అలాక్షణిక పద్ధతి) 

ఈ పుస్తకంలో అన్ని అధ్యాయాల్లోనూ, వ్యాకరణ సహాయంతో, తదనుగుణంగా కొత్తపదాల్ని ఎలా నిష్పాదించవచ్చునో చర్చించడం జఱిగింది. కానీ మానవ నాగరికతలో పదాలనేవి ప్రాథమికంగా ఒక నియమానికి లొంగిపుట్టినవి కావు. రాన్రానూ, పోలికల (analogies) ద్వారా మఱికొన్ని కొత్త పదాల్ని కల్పించుకోవడాన్ని మనిషి అభ్యసించాక, వాటి మధ్య ఉమ్మడిగా ఉన్నలక్షణాల్ని గుర్తుపట్టి ఏర్పఱచుకున్నవి నియమాలు. వాటి సమాహారాన్నే తరువాతి కాలంలో వ్యాకరణమన్నారు. ఈ అధ్యాయంలో – సాంప్రదాయిక వ్యాకరణసూత్రాల్నీ, నియమాల్నీ పక్కన పెట్టి పదనిష్పాదన విహాయసంలో ఎలా ఱెక్కలు విప్పుకొని విహరించవచ్చో పరిశీలిస్తాం.

అయితే, ఈ సందర్భంగా ఒక మాట. దురదృష్టవశాత్తూ ఇలా ఊహల ప్రభంజనాన్ని ఉవ్వెత్తున ఉఱకలెత్తిస్తూ, స్వేచ్ఛగా, యథేచ్ఛగా ఆలోచించే మేధావారసత్వం మనకి లేదు. భారతీయులమైన మనం జ్ఞానంకంటే సమాజానికి ఎక్కువ బద్ధులం. ప్రతీ విషయాన్నీ సమాజదృష్టితో తప్ప మఱో రకంగా, ముఖ్యంగా జ్ఞానార్జనదృష్టితో ఆలోచించడం మనకు మొదట్నుంచీ అలవాటు లేదు. ఎంతమంది దేవతల్ని పూజించినా ఆచరణలో మాత్రం వాళ్ళందఱి కంటే గొప్పదేవత మనకు సమాజమే. దేవుడిక్కూడా అంత భయపడరు. మనవాళ్ళు ఏం చదివినా, ఏ వృత్తిలో ఉన్నా, సమాజవిలువలకే తప్ప దానికి అంకితం కారు. తద్ద్వారా ఇక్కడ సమాజప్రశంసలకి పాత్రమయ్యే బండలౌక్యానికీ, మోటుప్రవర్తనకీ తప్ప ఇహ దేనికీ విలువ లేదు. దానికి తోడు, దేనికైతే అలవాటుపడ్డామో అందుకు ఇసుమంత భిన్నంగా ఏం చేసినప్పటికీ కూడా, మఱుక్షణమే హోరాహోరీ ప్రపంచ యుద్ధాలైపోతాయి. దీని మూలాన మనలో ఏకకాలంలో రెండు పరస్పర విరుద్ధమైన ఆత్యంతిక మనస్తత్త్వాలు (extreme mentalites) సంప్రాప్తమయ్యాయి. అయితే మార్పునొల్లని ఛాందసం. లేకపోతే విదేశీ అయిన ప్రతీదాన్నీ ఆప్యాయంగా కౌగలించుకోవడం. సొంతబుఱ్ఱని స్వేచ్ఛగా ఉపయోగించడానికి అవకాశమివ్వని ఈ రెండూ తప్ప మూడోది ఎఱగరీ దేశస్థులు. అదొక వ్రాయబడని నేఱం కూడా! అందువల్ల ఈ వాతావరణంలో శాస్త్రాలూ, కళలూ, విజ్ఞానాలూ, కొత్త ఆలోచనలూ ఎదిగే అవకాశం లేక నశించిపోయాయి. కొన్ని మఱుగున పడిపోయాయి. లేదా, ఎదుగూ, బొదుగూ లేకుండా బోన్సాయి మొక్కల్లా మిగిలాయి. ఆఖరికి ప్రతీదీ విదేశాల నుంచి దిగుమతి చేసుకొని తెలుసుకోవాల్సిన దుఃస్థితి దాపరించింది.

ఈ నేపథ్యంలో వ్యాకరణ సూత్రాలకి దూరంగా, స్వేచ్ఛగా పదాల్ని నిష్పాదించే స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ సైతం ఇంగ్లీష్ లాంటి విదేశీ భాషల వాతావరణం నుంచే పొందాల్సి వస్తుంది. వాటిని నమూనా (model) గా తీసుకుంటే తప్ప నిజంగా ఒక్క అడుగైనా ముందుకు పడని పరిస్థితి. మన సంఘపు ఆమోదముద్ర కూడా వారి సంప్రదాయానికే పడింది. కనుక ఇంగ్లీషు వారు స్వేచ్ఛామార్గంలో పదాల్ని కల్పించినప్పుడు వారు ఆ పనిని ఎన్నిరకాలుగా చేశారో గమనించాలి. ఇంగ్లీషువారు ముఖ్యం గా 5 స్వేచ్ఛాపద్ధతుల్లో అలాక్షణిక నిష్పాదనలు చేస్తున్నారు. అవి – 1. శిరోవాలనం (Blending or Portmanteau) 2. కర్తనం (Clipping) 3. ప్రత్యాహరణ (Acronymization) 4. నవగుణితం (Creative New Spelling) 5. నవసృజన (Novel Creation).

1. శిరోవాలనం (Blending or Portmanteau) :-

ఒక పదపు తల (శిరస్సు) నీ, మఱో పదపు తోక (వాలం) నీ కలిపి ఒక కొత్త అర్థంలో మూడో పదాన్ని సిద్ధం చేయడమే శిరోవాలింపు. ఉదాహరణకి,

Glitter + Literati = Glitterati (A group of glittering celebrities just like a group of famous men of letters)

Mock + Documentary = Mockumentary (spoof documentary)

Gallop + Triumph = Galumph (walk in a stomping, ungainly way)

Electric + Execute = Electrocute (To kill by electrical current)

Smoke + Fog = Smog

Stagnation + Inflation = Stagflation

Car + Hijacking = Carjacking

Mock + Cocktail = Mocktail (Cocktail with no alcohal)

Lion + Tiger = Liger (Born to a male lion and and a female tiger)

Motor + Hotel = Motel (A hotel by the wayside to serve the halting travellers who arrive by  motor cars)

Web + log = Blog

ఇదే పద్ధతి ననుసరించి తెలుగులో నిష్పాదించదగ్గ పదాలు మచ్చుకు,

క్రీడ + మైదానం = క్రీదానం

వ్యాయామ + శాల = వ్యాశాల (లేక వట్టి ‘వ్యా’ )

పర్యావరణ + సఖం = పర్యాసఖం

వాహన + కాలుష్యం = వాలుష్యం

జల + కాలుష్యం = జలుష్యం ఇత్యాది.

2. కర్తనం (Clipping) :-

ఒక పదంలో గానీ, సమాసంలో గానీ ఒక అవయవాన్ని తొలగించి మిగిలిన భాగాన్ని పూర్తి అర్థంలో వాడడం. ఉదాహరణకి,

Rifle gun –> Rifle

Hamburger –> Burger

Rhinoceros –> Rhino

Crocodile –> Croco

United States of America –> America

Magazine –> Mag

Professor –> Prof

Information –> Info

Technology –> Tech

Mathematics –> Maths

Examination –> Exam

Picture –> Pic

Telephone –> Phone

Cellullar phone –> Cell

Mobile phone –> Mobile

Facsimile –> Fax

Photograph –> Photo

తెలుగులో ఇలాంటివాటికి బహుకొద్ది ఉదాహరణలు మాత్రమే లభ్యమవుతున్నాయి. పదాన్ని విఱిచి అందులో ఒక భాగాన్ని వాడే అలవాటైతే మనకసలు లేనేలేదు. అది నేను సూచించే పద్ధతి కాదు. సమాసాల క్లుప్తీకరణకి మాత్రం ఉదాహరణలు :

స్తనశల్య పరీక్ష –> శల్యపరీక్ష

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం –> ఆంధ్రప్రభుత్వం

కోడిపుంజు –> పుంజు  

డబ్బులెక్క –> లెక్క

గసగసాలు –> గసాలు  

3. ప్రత్యాహరణ (Acronymization/ Initialism) :-

ఒక సమాసంలో గానీ, పదబంధంలో గానీ, వాక్యభాగంలో గానీ ఉన్న అనేక పదాల మొదటి మఱియు రెండో అక్షరాల్ని కలిపి ఒకే పదంగా తయారుచేయడం. ఉదాహరణకి,

Special Investigation Team –> SIT

Self-Contained Underwater Breathing Apparatus  –> Scuba

RAdio Detection And Ranging –> Radar

Light Amplification by Stimulated Emission of Radiation –> Laser

Quasi-stellar radio source –> Quasar

North Atlantic Treaty Organization –> Nato

International Criminal Police Organization –> Interpol

Acquired Immune Deficiency Syndrome –> AIDS

Joint Photographic Experts Group –> JPEG

Massachussetts Institute of Technology and Science –> MITS

తెలుగువారు కూడా ఈ పద్ధతిని పుణికిపుచ్చుకున్నారు సంస్థల నామకరణం వఱకు! కానీ వస్తువులకీ, పరిభావనలకీ ఈ పద్ధతిలో నామకరణం చేయడం మనలో ఇంకా మొదలుకావాల్సి ఉంది.  

4. నవగుణితం (Creative New Spelling) :-

కొన్నిసార్లు పదాన్ని వ్రాసే విధానాన్ని, లేదా పలికే విధానాన్ని స్వల్పంగా మార్చడం ద్వారా కొత్తపదాల్ని కల్పిస్తున్నారు. ఇది ఎక్కువగా తయారీసంస్థల ముద్రాంక నామాల (brandnames) కోసం జఱుగుతోంది. ఉదాహరణకి : Mr.Kleen. వ్రాసినట్లే పలుకుతూ, పలికినట్లే వ్రాస్తూ ఉండే తెలుగులాంటి భాషల్లో పదం యొక్క గుణితాన్ని, లేదా ఉచ్చారణని మార్చి వ్రాయడం వీలుకాదు. అలా చేస్తే ఈ భాషలో అవబోధ్యత (under-standbility) కే ఎసఱొస్తుంది. కానీ గతంలో ఉన్నపదాల ఉచ్చారణని స్వల్పంగా మార్చి కొత్త అర్థాల్లో ప్రయోగించిన సందర్భాలు లేకపోలేదు. వాటి గుఱించి ఇదివఱకే 3 వ అధ్యాయంలో ప్రస్తావించడం జఱిగింది.

5. నవసృజన (Novel Creation) :-

కొన్నిసార్లు సంభాషకులూ, రచయితలూ అంతకుముందు భాషలో బొత్తిగా లేని పదాల్ని కొత్త అర్థంలో కల్పించి వాడతారు. ఆ పదాలు నిజంగా భాషలో ఉన్నాయో లేదో శ్రోతలకీ, పఠితలకీ తెలీదు గనుక బహుశా ఉండే ఉంటాయనే అభిప్రాయంలో వాటిని పుణికి పుచ్చుకొని వాడడం మొదలుపెడతారు. అలా అవి వ్యాప్తిలోకి వస్తాయి. ఇంగ్లీషులో ఈ తెఱగు పదాలు లెక్కకు మిక్కిలి. తెలుగులో కూడా కొన్ని లేకపోలేదు. కానీ అవి మాండలికాలుగా చెలామణి అవుతున్నాయి. సిగ్గుపఱిచే జీవన వాస్తవాల గుఱించిన పదాలు పాతబడి అభ్యంతరకరం కావడంతో వాటి స్థానంలో కొత్త తెలుగుపదాల్ని వాడుతున్నారు. ఐతే వీటి వాడుక వ్యక్తిగత సంభాషణలకీ, రహస్య సాహిత్యానికీ పరిమితమైంది. సర్వజాతులకీ సహజమైన ఈ మార్గం నాకు అన్ని పదనిష్పాదన పద్ధతుల కంటే కూడా అత్యంత ప్రీతికరమైనది. ఉదాహ రణకి,

నప్పడం (తగి ఉండడం)

మటాషు (నాశనం)

తిను (స్త్రీల మాండలికంలో ఇది లింగాతీత సర్వనామం)

పోపు (తిరగమోత)

నీచు (మాంసం)

నాగా (సెలవు)

కేతిగాడు (నీచ కాపట్యాన్ని అవలంబించి బ్రతికేవాడు)

తింగర (తింగరి)

ఇవి పూర్వసాహిత్యంలో దర్శనమిచ్చే పదాలు కావు.

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

 

Posted in 2014, అక్టోబర్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.