cover

పద్మప్రాభృతకమ్ (3)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

[తతః ప్రవిశతి విటః]

సాధు భోః | రమణీయం ఖలు తావదిదం శిశిరజరాజర్జరస్య సంవత్సరవిటస్య హిమరసాయనోపయోగాత్ వసన్తకైశోరకముపోహ్యతే | సమ్ప్రతి హి -

ప్రచలకిసలయాగ్రప్రనృత్తద్రుమం యౌవనస్థాయతే ఫుల్లవల్లీపినద్ధం వనమ్

తిలకశిరసి కేశపాశాయతే కోకిలః కున్దపుష్పే స్థితః స్త్రీకటాక్షాయతే షట్పదః |

క్వచిదచిరవిరూఢవాలస్తనీ కన్యకేవోద్గతైః శ్యామలైః కుడ్మలైః పద్మినీ శోభతే

వరయువతిరతిశ్రమఖిన్నపీనస్తనస్పర్శధూర్తాయితా వాన్తి వాసన్తికా వాయవః ||

- (అంతట విటుని ప్రవేశము)

- భళీ! శిశిరమనే ముసలితనపు మిండెగానికి మంచు అను వాజీకరऽణోపయోగము వలన ఆమని యను సింహబలము చేకూరినయట్టు రమణీయముగ నున్నది. ఇప్పుడేను -

ప్రచలకిసలయాऽగ్రప్రనృత్తద్రుమం = మిక్కిలి చలించుచున్న చివురుటాకులతో నృత్యం చేస్తున్న వృక్షాలను, ఫుల్లవల్లీపినద్ధం = కుసుమించిన పూలను, (కలిగి) వనమ్ = ఉద్యానము, యౌవనాస్థాయతే = యౌవనము సంతరించుకొన్నది, తిలకశిరసి = తిలకపుష్పముపై, కోకిలః = కోకిల, కేశపాశాయతే = కేశపాశముగనున్నది. షట్పదః = తుమ్మెద, కుందపుష్పే స్థితః = కుందపుష్పముపై కూర్చున్నదై, స్త్రీకటాక్షాయతే = స్త్రీలా కటాక్షం చూపుతున్నది, క్వచిదచిర విరూఢవాలస్తనీ కన్యకేవ = అందమైన పయోధరం గల యువతి వలె, ఉద్గతైః శ్యామలైః కుడ్మలైః = అంకురించిన నల్లని మొగ్గగల, పద్మినీ = కలువ, శోభతే = శోభించుచున్నది. వాసన్తికా వాయవః = ఆమని గాలులు (లేదా మాధవీలతల పరిమళాలు), వరయువతి రతిశ్రమఖిన్నపీనస్తనధూర్తాయితా = రతిశ్రమ తో ఖిన్నయైన ఒక సుందరి పీనవక్షాలను స్పృశించాలన్న ధూర్తమైన ఆలోచనతో, వాన్తి = వీయుచున్నవి.

తాత్పర్యము: చలిస్తున్న చివురుటాకులతో నృత్యం చేస్తున్న వృక్షాలతోనూ, వికసించిన పూలతోనూ, వనం యౌవనం సంతరించుకున్నది. కోకిల తిలక వృక్షం పై కేశపాశంగా అమరినది. తుమ్మెద మల్లెపూవుపై వ్రాలి స్త్రీలా కటాక్షం చూపుతున్నది. తొడుగుతున్న నల్లతామర మొగ్గ – అందమైన యువతి పయోధరం లాగా శోభిస్తుంది. వాసన్తికా మందమారుతములు రతిశ్రమ తో ఖిన్నయైన ఒక సుందరి పీనవక్షాలను స్పృశించాలన్న ధూర్తమైన ఆలోచనతో వీస్తున్నాయి.

విశేషములు: వాసంతికా = వసంతసంబంధమైనవి అని ఒక అర్థం. వాసంతి అంటే మాధవీలత అని మరొక అర్థం. (అతిముక్తః పుణ్డ్రకస్యాత్ వాసన్తీ మాధవీలతా - అమరం)

ఇత్థం చ మదనశరసన్తాపకర్కశో బలవానయం ఋతుః యద్దేవదత్తాసురతసుప్రతివిహితయౌవనోత్సవస్య కర్ణీపుత్రస్యోన్ముచ్యమానబాలభావయౌవనావతారకోమలాం మదనమఙ్జరికాం దేవసేనాచూతయష్టిమతిలఞ్ఘ్యతే మదనభ్రమరః | అథవా కిమివ కర్ణీపుత్రస్యాऽతిక్రమిష్యతి | సమధుపిష్కం హి పరమన్నం సోపదంశమాస్వాద్యతరం భవతి, అతః శఞ్కే దేవదత్తాసురతమధుపానోపదంశభూతం చణ్డాలికాశ్రయం బాలభావనిరుపస్కృతోపచారహసితలలితరమణీయం దారికాసున్దరీరతి రసాన్తరమపి ప్రార్థయత ఇతి |

అహో ను ఖల్వయం లఘురూపోऽపి బలవాన్ మదనవ్యాధిః, యేనానేకశాఖాధిగతనిష్పన్దబుద్ధిః సర్వకాలజ్ఞానవిచక్షణో వ్యుత్పన్నయువతికామతంత్రసూత్రధారః కర్ణీపుత్రోऽపి నామైతామవస్థాముపనీతః | స హి -

తిలకశిరసి కేశపాశాయతే - అను వర్ణన అప్పటి స్త్రీల కేశపాశమును వివరించును. అశ్వఘోషుని సౌందరనందమున నీ కేశపాశ వర్ణన గలదు.

పుష్పావనద్ధే తిలకద్రుమస్య దృష్ట్వాన్యపుష్టాం శిఖరే నివిష్టామ్ |

సంకల్పయామాస శిఖాం ప్రియాయాః శుక్లాంశుకాట్టాలమపాశ్రితాయాః || (సౌందరనందము ౭-)

(తెల్లటి పూలతో విరగపూచిన తిలకపు చెట్టు కొమ్మ పైన కూర్చున్న కోకిల ను చూచి మేడపైన ప్రియురాలి సిగపైన తెల్లటి పట్టువస్త్రంతో చుట్టిన కేశపాశాన్ని నందుడు తలచెను).

- చెఱకువిలుకాని కరకు కోలలతో సంతాపము కలిగించు కర్కశమైనది ఈ వసంతఋతువు. దేవదత్త తో కూడి శృంగారక్రీడలంగూడి యౌవనోత్సవములను జరుపుకొనియూ కర్ణీపుత్రుడను ఈ మదనరూప భ్రమరము బాల్యావస్థ వీడి యౌవనము నొందిన దేవసేన యను లేత మామిడికై యెగురుచున్నది. అట్లు కాక, కర్ణీపుత్రుడునూ కామమున మగ్గుట యెట్లు? మధువు(తేనె)ను బాగుగా కలిపిన పరమాన్నము అధికముగనాస్వాద్యమగును. ఆలోచించిన – ఆ పదునారు వర్షములతరుణయవ్వని దేవసేనను (చండాలిక యని ప్రయోగము. ఇది నీచత్వసూచన కాదు. పదునారు వర్షముల యువతిని చండాలిక/మాతంగిని గా పూజించుట తంత్రశాస్త్ర సాంప్రదాయము) కూడుట దేవదత్తయను సురాపానముతో బాటు కలిగిన ఉపదంశము(చిఱుతిండి. సురాపానముతో బాటు అప్పడము, కారము గల ఏదైనా ఒక చిరుతిండి). దేవసేనయందు బాలభావము యొక్క హసిత లలితరమణీయత్వము నిండుటచే ఆమెనాశించుచున్నాడు కాబోలు.

అహో! చిన్నదియైననూ మదనవ్యాధి బలతరమైనదే సుమా! దీనివలన అనేకశాస్త్రాదులను యనుశీలనము జేసి సంపాదించిన బుద్ధి కలిగి, అన్ని కాలములలోనూ జ్ఞానమూ విచక్షణా గలిగి యువతుల కామతంత్రములకు సూత్రధారుడయిన కర్ణీపుత్రుడు నూ ఈ యవస్థను పొందినాడు. అందుకే -

ఉన్నిద్రాధికతాన్తతామ్రనయనః ప్రత్యూషచన్ద్రాననో

ధ్యానగ్లానతనూవిజృంభణపరః సన్తప్తసర్వేంద్రియః |

రమ్యైశ్చన్ద్రవసన్తమాల్యరచనాగాన్ధర్వగన్ధాదిభిః

యైరేవ ప్రముఖాగతైః స రమతే తైరేవ సన్తప్యతే ||

అథవా దేవసేనాముద్దిశ్య నైతదాశ్చర్యమ్ | కుతః | శ్లాఘ్యమన్మథమనోరథక్షేత్రం హి సా దారికా | అర్హత్యస్యా రూపయౌవనలావణ్యం కర్ణీపుత్రస్యోన్మాదం జనయితుమ్ | తస్యా హి -

విభ్రాన్తేక్షణమక్షతోష్టరుచకం ప్రాచీనగణ్డం ముఖం

ప్రత్యగ్రోత్పతితస్తనాంకురమురో బాహూలతా కోమలీ |

అవ్యక్తోత్థితరోమరేఖముదరం శ్రోణీ కుతోऽప్యాగతా

భావశ్చానిభృతస్వభావమధురః కం నామ నోన్మాదయేత్ ||

ఉన్నిద్రాధికతాన్త తామ్రనయనః = మిక్కిలియైన నిద్రాభావము చేత ఎఱుపెక్కిన కన్నులు కలిగినవాడు, ప్రత్యూషచంద్రాననః = ఉషఃకాల చంద్రుని వంటి మోము కలవాడు, ధ్యానగ్లానతనూవిజృంభణాపరః = చింతతో పెరిగిన శరీరము కలవాడు, సంతప్తసర్వేంద్రియః = తాపమునొందిన శరీరభాగములు గలవాడునై, చంద్ర వసంత మాల్య రచనా గాన్ధర్వ గంధాదిభిః = చంద్రుడు, వసంతుడు, పుష్పమాలలూ, గానములు, గంధాదుల చేత, రమ్యైః = వమ్యములైన, ప్రముఖాగతైః = ప్రముఖముగ వచ్చినవైన, యైః ఏవ = వేటి చేత, సః = అతడు, రమతే = రమించెనో, తైః ఏవ = వాటి చేతనే, సన్తప్యతే = బాధింపబడుచున్నాడు.

తాత్పర్యము: మిక్కిలి నిద్రలేమిచేత ఎఱుపెక్కిన కనులు గలవాడై, ఉషఃకాల చంద్రుని వంటి మోముకలవాడై, రమ్యములైన చంద్ర, వసంత, గీతగాన, పుష్పమాలాగంధాదులచేత రమించిన కర్ణీపుత్రుడు వాటి చేతనే బాధింపబడుచున్నాడు. శార్దూలవృత్తము.

- అట్లు కాక దేవసేన వలన ఈ తాపము కలిగెనా, అందునాశ్చర్యము లేదు. ఎందువలనన – ఆ సుదతి శ్లాఘ్యమైన మన్మథ మనోరథము కల శరీరము గలది. ఆమె రూపయౌవనలావణ్యములు కర్ణీపుత్రునకు ఉన్మాదము కలిగించుటకు అర్హములైనవి. ఆమె యొక్క – విభ్రాన్తేక్షణం = చంచలమైన కనులు, అక్షతోష్టరుచకం = ఇతరస్పర్శనెరుగక సువర్ణముద్ర నలంకరించున్న పెదవులు, ప్రాచీనగణ్డం ముఖం = చెక్కిలిని ఉద్యోతించు ముఖము, ప్రత్యగ్ర ఉత్పతిత స్తనాంకుర మురః = ఎత్తయిన స్తనములయందుకురించిన చూచుకములు, కోమలీ బాహూలతాః = కోమలమైన బాహులతలు, అవ్యక్త ఉత్థిత రోమరేఖం ఉదరం = ఉదరమున కనీకనిపించక ఏర్పడిన రోమరేఖ, కుతోప్యాగతా శ్రోణీ = ఎచటి (లేని చోటు – శూన్యము – నడుము) నుండియో వచ్చిన నితంబము, భావశ్చ అనిభృత స్వభావ మధురః = పక్వమైన భావములు లేని స్వభావసుందర, నామ = రూపము, కం = ఎవరిని, న ఉన్మాదయేత్ = ఉద్విగ్నము చేయదు?

తాత్పర్యము: చంచలేక్షణ, పరస్పర్శయెఱుగని సువర్ణముద్రాలంకృతాధరములు, చెక్కిలిని చూపించు ముఖము, పీనస్తనములయందంకురించిన చూచుకములు, కోమలమైన బాహులతాద్వయి, ఉదరమున నవ్యక్తముగ వెడలిన రోమరేఖ, విరిసీ విరియని మానసికావస్థయందుండిన ఆ సహజసుందరి, ఎవరిని ఉద్విగ్నముగావింపదు?

విశేషములు: (శార్దూల వృత్తము - మ స జ స త త గ - సూర్యాశ్వైర్మసజస్తతాస్సగురవః శార్దూల విక్రీడితమ్|| అని సూత్రము. సూర్య అంటే ద్వాదశాదిత్యులు, అశ్వ అంటే సప్తాశ్వాలు. అందువలన 12 అక్షరాలకు, 7 అక్షరాలకు యతి)

ఓష్టరుచకం: దీనినే అధరరుచకం అని కొందరు కవులు వర్ణించారు. రుచకం - అంటే నిష్కము. గుప్తులకాలం నాటి సువర్ణ నాణెములను నిష్కము/రుచకములంటారు. పెదవి క్రింది భాగాన, ఈ సువర్ణవర్ణపు ముద్ర రూపంలో అలంకరించుకొనుట నాటి స్త్రీల యలంకరణలో భాగము.

ప్రాచీనగణ్డం ముఖం = తరుణయువతి, తనముఖమును చూపక, విలాసముగ ప్రక్కకు తిరిగి మాటలాడుటవలన చెక్కిలి వివరముగ కన్పడును. ఈ విలాసమును చమత్కరించుచున్నాడు.

పై రెండు విషయములకై ఈ క్రింది అజంతా చిత్రసుందరిని చూడుడు.

devasena

(తరువాయి భాగం వచ్చేవారం)

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.