cover

ఓ చిన్న ప్రేమకథ

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 11వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన ఇక్కడ చూడండి.)

Download PDF ePub MOBI

ధనుర్మాసం కావడంతో చలి పులిలా పంజా విసురుతోంది. భూమికీ, ఆకాశానికి బంధం వేస్తున్నట్లు మంచు తెరలు. ప్రతి మేనుకూ గగుర్పాటు కలిగిస్తూ… జివ్వున వీస్తున్న చల్లగాలి. తలుపు తీసుకుని బయటకు వచ్చిన నన్ను ఒక్కసారిగా చలిగాలి చుట్టేయడంతో వణుకు ప్రారంభమైంది. ఎప్పుడూ ఎనిమిది గంటల వరకు ముసుగు తీయని నాకు ఇలా ఆరుగంటలకే నిద్ర లేవాల్సి రావడం వింత అనుభవం. ఏం చేస్తాం పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ అప్పటికే వచ్చింది. రెండు నెలల్లో పరీక్షలు. చదివినా చదవకపోయినా పొద్దెక్కే వరకూ పడుకోవడం క్షమించరాని నేరం. అలా తిరిగి వద్దామని వణుకుతూనే వీధిలోకి వెళ్లాను. అప్పటికే ఊరు ఊరంతా నిద్ర లేచింది. పండుగ నెల కావడంతో ప్రతి ఇంటి ముందూ తీర్చిదిద్దిన రంగవల్లులు, పక్కవీధిలో నుంచి వినిపిస్తున్న హరిదాసు కీర్తనలు, రామాలయం నుంచి మంద్రంగా వినిపిస్తున్న మంత్రాలతో ఊరు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

గుడి వద్ద ఎవరో చలిమంట వేస్తుంటే అక్కడికెళ్లి కూర్చున్నా. చెరువు నుంచి కావిళ్లతో నీరు తెచ్చుకుంటున్న వాళ్లు, గేదెల వెంట పరుగులు తీస్తున్న వాళ్లు, గుడికి వచ్చిపోయే వారితో వీధివీధంతా హడావిడిగా ఉంది. కబుర్లు చెప్పుకుంటూ, కిలకిలా నవ్వుకుంటూ అమ్మాయిలు గుడి ముందర ముగ్గులు పెడుతున్నారు. కొందరు ముగ్గులు పెడుతుంటే, మరి కొందరు రంగులు అద్దుతున్నారు, ఇంకొందరు గొబ్బెమ్మలపై పూలు అలంకరిస్తున్నారు. పువ్వుల వద్దకు తుమ్మెదలు చేరినట్లు.. ముగ్గులు చూడాలనే మిషతో.. కొందరు యువకులు వారి చుట్టూ చేరారు. నేనూ అటు వెళ్లాను. అందరూ తెలిసిన వాళ్లే, రోజూ చూసే వాళ్లే. కానీ ఏదో తెలియని ఉద్విగ్నత. మరేదో ప్రత్యేకత. చేయి తిరిగిన చిత్రకారుడి అందమైన చిత్తరువులా ఉన్న ఆ మనోహర దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. బహుశా ప్రకృతి మహిమేమో.

ముఖ్యంగా పద్మావతి. రోజూ నేను చూసే పద్మావతి, నాతో కలిసి మూడు మైళ్లు నడిచి హైస్కూల్‌కొచ్చే పద్మావతి, పక్క బెంచీలో కూర్చుని పాఠాలు కూడా వినకుండా పోసుకోలు కబుర్లు చెప్పే పద్మావతి. ఈ రోజు కొత్తగా ఉంది. మళ్లీమళ్లీ చూడాలనిపించేలా ఉంది. పెద్ద అందగత్తె కాకపోయినా లంగా ఓణీలో లక్షణంగా ఉంది. అప్పుడే తలస్నానం చేసిందేమో.. తుమ్మెద రెక్కల్లాంటి జత్తును అలా వదిలేయడంతో ముంగురులు ముఖం మీద పడుతున్నాయి. ఒక చేత్తో వాటిని సర్దుకుంటూ, మరొక చేత్తో ముగ్గుబుట్టతో మైమరపించేలా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే మన్మధబాణంలా ఉంది (అంటే ఏంటని అడక్కండి.. నాకూ తెలియదు. ఏదో సినిమా డైలాగ్). ఎప్పుడూ లేనిది నా శరీరంలో ఏవో ప్రకంపనలు.

011సమయం తొమ్మిది గంటలు కావడంతో రోజూ లాగానే పాఠశాలకు బయలుదేరాం. నేనూ, పద్మావతి మరో పది మంది. రోజూ తను మాట్లాడుతుంటే ఎప్పుడు నోరు మూస్తుందా అని ఎదురు చూసేవాడిని, ఇప్పుడు తను మాట్లాడుతుంటే గుళ్లో భగవద్గీత వింటున్నంత హాయిగా ఉంది. అంతలోనే పాఠశాల వచ్చింది. ప్రేయర్‌ చేస్తున్నా, మంచినీళ్లు తాగుతున్నా నా దృష్టంతా తనమీదే. క్లాసులు మొదలయ్యాయి. నా పక్క బెంచీలో తను. మొదటి పిరియడ్‌ తెలుగు మాస్టార్‌ వచ్చారు. ‘అటజనికాంచె భూమిసురుండు..’ అంటూ ఏదో చెప్పుకుపోతున్నాడు. నాకేమీ వినిపించడం లేదు. కనిపించడం లేదు. కన్ను మూస్తే పద్మావతి, కన్ను తెరిస్తే పద్మావతి.

తర్వాత లెక్కల మాస్టారు వచ్చాడు. ఎత్తులు, దూరాల గురించి చెబుతున్నాడు. మధ్యలో పిల్లల్ని లేపి ఫార్ములాలు అడుగుతున్నాడు. ఈసారి పద్మావతిని లేపాడు. సైన్‌ 30 ఎంత అని అడిగాడు. కాసేపు దిక్కులు చూసి ‘సార్‌ అదీ…’ అంటుండగానే చెయ్యి చాపమని నాలుగు దెబ్బలుకొట్టాడు. పాపం… పద్మావతి, ఏడుస్తూ కూర్చుంది. అది చూసి నాకు కోపం తన్నుకొచ్చింది. జీవితంలో తొలిసారి ఒకడ్ని మర్డర్‌ చేయాలనిపించింది. ఇంతలో లంచ్‌ బెల్లు కొట్టారు. పద్మావతి పక్కనే నేను కూర్చున్నా. కావాలని తను తెచ్చుకున్న కూర నేను తిని నాది తనకిచ్చా. పన్లోపనిగా లెక్కల మాస్టార్‌ను తిట్టుకుని ఒకర్ని ఒకరం ఓదార్చుకున్నాం. మళ్లీ క్లాసులు మొదలయ్యాయి. ఈ సారి సైన్స్ టీచర్‌. పిరియాడిక్‌ టేబుల్‌ గురించి చెబుతూ నన్నేదో కొశ్చన్‌ అడిగాడు. నేను చెప్పలేకపోతే నాలుగు దెబ్బలేశాడు. జాలి పడకపోగా కిసుక్కున నవ్వింది పద్మావతి. గుండెను కత్తితో రెండుగా కోసినట్లు బాధ. సార్ కొట్టినందుకు కాదు.. పద్మావతి నవ్వినందుకు.

లాస్ట్ పిరియడ్‌ అందరం గ్రౌండ్‌కెళ్లాం. ఎప్పటిలాగే ‘ఖోఖో’ ఆట ఆడుతున్నాం. ఆటలో పరిగెడుతూ పద్మావతి రాయి తగిలి కింద పడింది. తన వెంట పరిగెడుతున్న నేనూ అదే రాయి తగిలి తన మీద పడ్డాను. ఒక్కసారిగా నరాలు జివ్వుమన్నాయి. మైకం కమ్మేసి ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్న భావన. ఆట ఎలా ముగిసిందో, ఇంటికెళా వెళ్లానో కూడా గుర్తులేదు. మధుర స్వప్నాలతో ఆ రాత్రి గడిచింది. అది మొదలు మిగతా రెండు నెలలు కూడా దాదాపు ఇలానే గడిచాయి. రోజుకొక కొత్త అనుభవం. ఇంతలో పరీక్షలు దగ్గర పడ్డాయి. ఇష్టం లేకపోయినా చదవక తప్పలేదు. చదువులో నేను ఏవరేజైతే, పద్మావతి అట్టర్‌ఫ్లాప్‌. అప్పటికీ నేను నా చదువును కూడా పక్కనపెట్టి తన కోసం ఎంతో కష్టపడ్డాను. కానీ ఏం చేస్తాం.. బ్యాడ్‌లక్‌. తను ఫెయిలైంది. నేను మాత్రం సెకండ్‌ క్లాస్‌లో పాసయ్యాను.

మరుసటిరోజు నిద్రలేచిన నాకు.. ఒక దిగ్ర్బాంతికర వార్త చెవిన పడింది. ఆ రోజు పద్మావతి పెళ్లి చూపులు. కాళ్ల కింద భూమి పగిలి నేను అగాథంలోకి వెళ్లిపోయినట్లు అనిపించింది. నెమ్మదిగా వాళ్లింటికి వెళ్లాను. సిగ్గుల మొగ్గలా పద్మావతి. ఎంతో ఆనందంగా ఉంది. నన్ను విడిచి వెళ్తున్న బాధ తనలో ఏమాత్రం లేదు. తనను అలా చూసి నా హృదయం వేయి వక్కలైంది. నా ప్రేమ సంగతి వాళ్ల నాన్నకు చెబుదామని ఒక బలహీన క్షణంలో అనుకున్నా.. ఆయన చేతిలోని చర్నాకోల గుర్తొచ్చి చెప్పలేకపోయాను. ఆ చర్నాకోలంటే నాకు అమితమైన వినయం, భయం, గౌరవం. బట్టతల, పొట్టతో పెళ్లి కొడుకు కామెడీగా ఉన్నాడు. అయినా అందరికీ నచ్చాడు. పద్మావతీ సరేనంది. పెళ్లి కుదిరింది. మరుసటి నెలలో పెళ్లి జరిగింది.

పద్మావతి ఊరోదిలి వెళ్లిపోవడంతో నాది ఒంటరి బతుకైంది. అప్పటికి గడ్డం రాకపోవడంతో పెంచుకునే అవకాశం లేకుండాపోయింది. పదో తరగతి పాసైన ఆనందంలో ఫ్రెండ్సంతా పక్కనున్న టౌన్ లోని బార్ కి వెళ్లాం. అలవాటు లేకపోయినా బీరు తాగాను. అందరూ అద్భుతంగా ఉందంటూ లొట్టలేసుకుంటుంటే నాకు మాత్రం చేదుగా అనిపించింది. బహుశా పద్మావతి ఇక లేదన్న బాధ వల్ల కావచ్చు. సినిమాలో ఏ రొమాంటిక్‌ సీన్‌ చూసినా తన ఆలోచనలే. ఏ అమ్మాయిని చూసినా తన రూపురేఖలే. ‘యుగయుగాలుగా ఆడది చేసే దగా పేరు ప్రేమ…’ ఆహా ఎంత చక్కగా చెప్పారు అన్నగారు. ఆ రోజు నుంచి నేనూ ఆ పాటే పాడుకుంటూ.. ఆయనలాగే పొలాల వెంట, చెరువుల వెంట తిరుగుతూ ఉన్నా. ఇలా భారంగా రోజులు గడుస్తున్నాయి. ఇక ఈ జీవితాన్ని ఇలా దేవదాసులా ముగిద్దామని నిర్ణయించేసుకున్నాను. కానీ అమ్మానాన్నల బలవంత మీద ఇంటర్‌ కాలేజీలో చేరాను.

తొలి రోజు కాలేజీకి వెళ్లి చూద్దును కదా.. ఇక్కడ ఒక్క పద్మావతే, అక్కడ అలాంటి వాళ్లు వందల మంది. మరు నిమిషంలో నా హృదయంలో ప్రేమ చిగురించింది. మరో భగ్న ప్రేమకు రంగం సిద్ధమైంది.

*

రచయిత వివరాలు

 ashok

అశోక్ పొడపాటి,

స్వపరిచయం: జర్నలిస్ట్

ఇష్టమైన రచనలు: ముళ్ళపూడి వెంకట రమణ, పతంజలి, యండమూరి రచనలు, అమరావతి కధలు.

Download PDF ePub MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.
Posted in 2014, అక్టోబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , , .

One Comment

  1. మీ వచనం లో మంచి “ఈజ్” ఉంది. చమత్కారం ఉంది. సాంతం హాయిగా చదివించింది. 15 -16 ఏళ్ళ మధ్య పురుషుడి అంతరంగాన్ని ఒడిసిపట్టారు. మన్మధ బాణం అంటే ఇప్పుడు తెలిసే ఉంటాది. మన్మధుడు వేసే పూల బాణమని . ఆ బాణం తగలగానే జఢత్వం గల అమ్మాయి లో కూడా జల జల మని ప్రేమ పొంగుద్ది. “అప్పటికి గడ్డం రాకపోవటం తో పెంచుకునే అవకాశం లేకపోయింది ” అన్న మాట చాలు . మీలోని “సెన్సాఫ్ హ్యూమర్ని” పట్టివ్వడానికి – అభినందనలు .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.