cover

ఆలోచిస్తావా?

Download PDF  ePub  MOBI

ఒకరి ఇబ్బందిని గ్రహించే అలవాటు నీకు ఎప్పుడూ లేదు. కనీసం నీకు యిబ్బంది కలిగినపుడన్నా మూస లో నుంచి బయటకి వచ్చి కొంచెం విభిన్నంగా ఆలోచిస్తావా?

చిన్ననాటినుంచీ చాలా తెలివైనదానివని పేరు తెచ్చుకున్నావుట నువ్వు. కానీ నిజానికి నువ్వు నీ తెలివిని ఉపయోగించుకోవలసిన విధంగా ఉపయోగించుకోలేదు.

నీ తెలివితేటలన్నిటినీ ‘నేను నా తెలివిని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాను’ అని నిరూపించుకునేందుకు ఉపయోగించుకున్నావు. అన్ని సందర్భాలలోనూ నిన్ను నీవు సమర్ధించుకునేందుకు ఉపయోగించుకున్నావు. ఆ సమర్ధనలకి అనుగుణంగా, నీకు అనుకూలంగా కొత్త సిద్ధాంతాలని, నిర్వచనాలని కనిపెట్టేందుకు ఉపయోగించుకున్నావు.

తెలివి వుంది కాబట్టి అవతలివారిని క్షుణ్ణంగా చదివేయగల నేర్పూ వుందనుకున్నావు. కాదు కాదు అసలు వాళ్ళ గురించి వాళ్ళ కన్నా బాగా నీకే తెలుసుననుకున్నావు. అవతలివారి యిష్టాయిష్టాలు, అవసరాలు, ఆవేదనలు వారికన్నా బాగా నీకే అర్థమవుతాయని అనుకున్నావు.

ఇష్టమైన ప్రతి విషయాన్ని నిరభ్యంతరంగా స్వీకరించడమూ, ఇష్టం లేనివాటిని నిర్భయంగా నిరాకరించడమే విజయానికి నిర్వచనం అని భావించావు. అలా.. ఆ నిర్వచనానికి తగినట్లుగా జీవించగలుగుతున్నందుకు గర్వించావు.

నీకు గుర్తుందా! పెళ్ళైన కొత్తల్లో నేను నీచేత శ్రావణ మంగళవారం నోము చేయిద్దామనుకుంటే మొహం చిట్లించి “నాకిలాంటివన్నీ యిష్టం వుండవు” అని కచ్చితంగా చెప్పేశావు. అత్తగారితో అలా చెప్పగలగడాన్ని నీకు నువ్వే ఒక ఘనకార్యంగా అభివర్ణించావు. “పెద్దది కదా అమ్మ మాటకి ఎదురు చెప్పకుండా వుండలేవా?” అని రాజేష్ అనునయంగా అడిగితే కస్సుమన్నావు. “పెద్దేమిటి? చిన్నేమిటి? గౌరవం ఇవ్వవలసినది వయసుకి కాదు, జ్ఞానానికి. మంచితనం, జ్ఞానం చిన్నవాళ్ళలో వున్నా గౌరవించాలి. అవి లేనప్పుడు పెద్దవాళ్ళయినా గౌరవించనక్కరలేదు.” అని వాడికి హితబోధ చేశావు.

అదీ నీ తెలివి! ఎంత బాగా చెప్పావు నిజంగా! మంచితనం, జ్ఞానం అనేవి వయసు లాగా మార్పుకు లొంగని విషయాలు కాదు కాబట్టి వాటిని నీకిష్టమైనట్లుగా నిర్వచించుకోవచ్చు. అవి నీ చేతుల్లో వున్నాయి కదా! అవతలివారిలో నీకనుకూలమైన లక్షణాలు వుంటే అది మంచితనం, అనుకూలం కానివి వుంటే చెడ్డతనం. అవతలివారిలో నీ మార్గాన్ని సమర్ధించే ఆలోచనలు వుంటే అది జ్ఞానం. అందుకు విరుద్ధమైన ఆలోచనలుంటే అది వారి మూర్ఖత్వం.

ఇలా మంచితనం, జ్ఞానం అనే రెండు లక్షణాలనీ నీ యిష్టమొచ్చినట్లు నిర్ణయించగల అవకాశం వుంది. వయసు విషయంలో ఆ వెసులుబాటు లేదు కదా! ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు అన్న విషయం నువ్వు నిర్ణయించగలిగేది కాదు. అందుకే “పెద్దవాళ్ళని గౌరవించనక్కరలేదు. మంచివాళ్ళని గౌరవించాలి” అని ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసుకుంటే అది చాలా సుఖం.

ఇలాంటి నీ తెలివితేటలు గమనించే ఇచ్చారో, గమనించకనే ఇచ్చారో… ఈ లక్షణాలు తమకి పనికొస్తాయనుకునే ఇచ్చారో, వాటితో తమకి పనిలేదనుకునే ఇచ్చారో తెలియదు కానీ ఆ సాఫ్టువేరు కంపెనీ వాళ్ళు నీకు బోలెడు జీతంతో ఉద్యోగం ఇచ్చారు. ఇంకేముంది! నీ తెలివితేటల మీద నీకున్న నమ్మకం ఇంకా పెరిగిపోయింది.

ప్రతి విషయం మీదా తెయ్ మంటూ ఒక అభిప్రాయం చెప్పడానికి తయారవడం. పెద్దవాళ్ళు చేసిన పనుల మీద కూడా నీ విశ్లేషణలు ఏకరువు పెట్టడం.. వాళ్ళు నీ అర్ధం లేని వాగుడుకి సమాధానం చెప్పడం కూడా అనవసరం అని ఊరుకుంటే వాళ్ళ మౌనాన్ని అజ్ఞానంగా భావించి నువ్వు హాస్యాలు, ఉపన్యాసాలు చేయడం.. ఇవన్నీ సాగించావు.

నీ దృష్టిలో నీ ముందు తరం ఆడవాళ్ళందరూ తమ విలువ తమకే తెలియని అర్భకులు. తమ కోసం తమ జీవితం కోసం ఏమీ చేసుకోలేని, ఏ ఆనందాన్నీ అనుభవించలేని అమాయకులు. మొగుడి చేతి క్రింది బానిసలు. భర్త నిర్లక్ష్యాన్ని, అవమానాలనీ సహిస్తూ బ్రతికిన నిర్భాగ్యులు. అత్తగారు, అమ్మ – అందరూ అంతే.

ఒకసారెప్పుడో నువ్వు కాలేజ్ లో చేరిన కొత్తల్లో కాబోలు మీ నాన్న ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి మీ అమ్మ పుట్టిన రోజు నాడు ఆవిడ కోసం ఒక శాలువా కొన్నావుట. ఇంక అప్పటి నుంచీ ఆవిడ మనసుని నువ్వొక్క దానివే అర్ధం చేసుకున్నావనీ, ఆవిడనేదో ఉద్ధరించేశావనీ నీ ఫీలింగు. ఆవిడకి అంతకు ముందు నలభై పుట్టినరోజులు జరిగాయనీ ఆ తర్వాత కూడా మరో పది పుట్టినరోజులు జరిగాయనీ.. అయితే ఆ ఒక్క పుట్టినరోజు నాడు మాత్రమే నువ్వు ఆ ఆర్భాటం చేశావనీ ఇన్ని తెలివితేటలు ఉన్న నీ బుర్రకి తోచదు.

అసలు ఆవిడకి పుట్టినరోజులు చేసుకోవడం మీద ఆసక్తి లేదనీ, ఆ శాలువా మీద అసలే ఆసక్తి లేదనీ నీకు అర్థం కాదు. పొద్దున్నే ఆ శాలువా కప్పుకుని పని చేసుకోవడానికి కుదరదనీ, అందుకు ఆవిడ చిరాకు పడేదనీ నీకు తెలీదు. ఏడింటికి నిద్ర లేచి ఆవిడ ఇచ్చిన కాఫీ త్రాగుతూ “ఏంటమ్మా నీకు శాలువా కొనిచ్చింది ఎందుకు? అది కప్పుకోకుండా ఇలా చలిలో తిరగడానికా!” అని ఆవిడని విసుక్కోవడం నీ దృష్టిలో నువ్వు ఆవిడ మీద చూపించే “ప్రేమ”.

అయితే ఆ ప్రేమని నువ్వు అడపా దడపా మాత్రమే చూపించేదానివట. నీకు వీలయినప్పుడు మాత్రం! ఒకటి రెండు సార్లు చీరలు కొనిపెట్టావుట. ఇంకోసారెపుడో ఏదో టూర్ కి వెళ్ళినపుడు ఆవిడ కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చావుట. అంతే. మూడో నాలుగో సంఘటనలు.

నీకు మోజు పుట్టినపుడు, అవకాశం దొరికినపుడు ఆవిడకో కానుక కొంటావు. ఆ విషయాన్ని మనసులో ఎన్ని లక్షల సార్లు తల్చుకుంటావో తెలీదు కానీ పైకి మాత్రం కొన్ని వందల సార్లు చెప్తావు అందరితోనూ. నీ ఈ ప్రేమకి నువ్వే మురిసిపోతావు. ఆవిడా మురిసిపోవాలని అనుకుంటావు.

మీ నాన్న ఆవిడని గౌరవించలేదనీ, అసలు ఆవిడే తనని తాను గౌరవించుకోలేదనీ.. ఆ గౌరవమూ, ప్రేమా ఇన్నాళ్ళకి నువ్వు ప్రయోజకురాలవై ఆవిడకి అందిస్తున్నావనీ నీ భావన. అదిగో అక్కడే వచ్చింది చిక్కు. కాసేపు గౌరవమనీ, కాసేపు విలువ అనీ కాసేపు ప్రేమ అనీ రకరకాలుగా మాట్లాడి పాపం మీ అమ్మని చాలా తికమక పెట్టావు నువ్వు.

ఒక మూడు సార్లో, అయిదు సార్లో పోనీ పది సార్లో ఆవిడకి ఏవో బహుమతులు ఇచ్చావు. దానికి ఆవిడ ఇష్టాన్ని గౌరవించడం, ఆవిడకి విలువ యివ్వడం అని పేరుపెట్టావు. మరొక ప్రక్కన ఆవిడ చేసిన ప్రతి పనినీ విమర్శించావు. ఆవిడ భావాలనీ అభిప్రాయాలనీ ఎద్దేవా చేశావు. దాన్నేమనుకోవాలో ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక ఆవిడ నివ్వెరపోతే అప్పుడు మళ్ళీ “పెద్దవాళ్ళని గౌరవించడం కాదు. ప్రేమించడం ముఖ్యం.” అని మరొక కొత్త సిద్దాంతం చేశావు.

“దీని దుంప తెగా! ఇది చూడండి, ఇలా ఎప్పుడన్నా ఏ మదర్స్ డే నాడో ఒక బహుమతి కొనిపెట్టి దాన్ని ప్రేమ అనుకోమంటుంది. మిగతా సమయమంతా విసుక్కున్నంత మాత్రాన తనకు ప్రేమ లేదని అనుకోవద్దంటుంది. మరి వాళ్ళ నాన్న నాకు ఎన్ని అవసరాలు తీర్చారు! ఆయన విసుక్కోవడం మాత్రం ప్రేమ లేకపోవడం ఎలాగయిందీ! అయినా ఇది విసుక్కున్నంతగా వాళ్ళ నాన్న నన్ను ఏనాడూ విసుక్కోలేదు సుమా! ఆయనకన్నా దీనికే ఎక్కువ చులకన నేనంటే!” అని మీ అమ్మ వాపోయేదని నీకు తెలీదు.

మొదట్లో కొంచెం కంగారుపడినా తికమకలో వున్నది తను కాదనీ నువ్వేననీ మీ అమ్మ అర్థం చేసుకుంది. నీకు గుర్తుందో లేదో కానీ ఒకసారి నిన్ను కూర్చోపెట్టి ఆవిడ ఇదంతా చెప్పబోయింది.

“అసలు ప్రేమ అంటే ఏమిటో, దానిని ఎలా చూపించాలో తెలుసుకోవాలి నువ్వు. మనలో వున్న ప్రేమ అనే భావాన్ని ఒక్కొక్కరిపై ఒక్కొక్క రకంగా చూపిస్తాం. పెద్దవాళ్ళని గౌరవించడం ద్వారా, వాళ్ళ మాటకి ఎదురు చెప్పకపోవడం ద్వారా చూపిస్తాం. చిన్నవాళ్ళని ఆశీర్వదించడం ద్వారా, వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవడం ద్వారా చూపిస్తాం. కానుకలు, బహుమతులు అంటావా డబ్బులుంటే, అవకాశం వుంటే అవీ యిస్తాం. కానీ అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అవతలి వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎలా ఉన్నదన్నది, దానిని మనం ఎలా మలుచుకున్నామన్నది ముఖ్యం. అవతలి వారి కోసం కొంచెం కూడా సర్దుకోలేకపోతే, మన అహాన్ని అణచుకోలేక పోతే ఇక అది ప్రేమ ఎలా అవుతుంది?” అని మీ అమ్మ నిన్ను అడిగింది.

ఆరోజు నువ్వు ఆవిడని ఛడామడా వాయించేశావు. ఇలాంటి ఆలోచనలతో బతికేవాళ్ళని ఎవరూ బాగుచేయలేరన్నావు. ఆవిడ ఆలోచనల కన్నా నీ ఆలోచనలు ఎంత ముందున్నాయో, ఆవిడ పద్ధతులకన్నా నీ పద్ధతులు ఎంత మేలైనవో ఆవిడ అర్థం చేసుకోలేక పోతోందని జాలిపడ్డావు.

సరే, అమ్మ సంగతి అలా అయిందా! అత్తగారినీ తక్కువగా ప్రేమించ లేదు నువ్వు. నువ్వు కోడలిగా అడుగు పెట్టినప్పటినుంచీ నాకూ పట్టింది ఆ వైభోగం! మీ అమ్మకన్నా ఎక్కువగా నన్నూ అర్థం చేసుకోవడం మొదలు పెట్టావు! చెడిపోయిన అత్తాకోడళ్ళ సంబంధాలని తిరగ రాస్తానన్నావు. అత్తాకోడళ్ళు అంటే ఎలా ఉండాలో ఒక కొత్త నమూనా సృష్టిస్తానన్నావు.

అత్తగారి మీద నీకున్న ప్రేమని వైనవైనాలుగా ప్రకటించావు. మామగారు పోయినపుడు నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. అత్తగారికి బొట్టూ, పూలూ తీయడానికి వీలు లేదనీ, తీస్తే సహించబోననీ ప్రకటించావు. అత్తగారితో సహా ఎవరి అభిప్రాయంతోనూ నీకు పనిలేదు. “చిన్నపిల్లవి నీకు తెలీదు ఊరుకోమ్మా” అని ఎంతటి వాళ్ళయినా నీ ముందు నిలబడి అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీ దగ్గర వున్న బ్రహ్మాస్త్రం గురించి అందరికీ తెలుసు. “చిన్నా పెద్దా జాన్తా నై, తెలివైన నా మాటలే అందరూ వినాలోయ్” అనే నీ సిద్ధాంతం బంధువులందరిలోనూ పాపులర్ కదా!

“మనకెందుకొచ్చింది? నోటికెంత మాట వస్తే అంత మాట అంటుంది. ఆ పిల్లతో పెట్టుకోకండి” అని అందరూ ఒకరినొకరు హెచ్చరించుకున్నారు.

వెనుకటి కాలంలో ఆడవాళ్ళందరూ పెత్తనాల క్రింద నలిగిపోయారని బాధపడతావు కదా నువ్వు! ఒకటి గమనించావా! ఇదివరకు పెత్తనాలు చేసినవారికి ఒక ప్రమాణం వుంది. వాళ్లకి ఏది ఇష్టమయితే అది అందరినీ చేయమని సతాయించలేదు వాళ్ళు. ఒక శాస్త్ర ప్రమాణం పెట్టుకుని దానిలో చెప్పబడిన విధినిషేధాలని వాళ్ళు పాటిస్తూ తమకన్నా చిన్నవాళ్ళని కూడా అలా పాటించమని ఉద్బోధించారు.

బాధేమిటంటే నీకు అలాంటి ప్రమాణాలు ఏమీ లేవు. నీ పుర్రెలో ఎప్పుడు ఏ బుద్ధి పుడుతుందో పుట్టేవరకు నీకు కూడా తెలీదు! అది పుట్టాక ఇక నీతో సహా ఎవరూ దానిని ఆపలేరు!!

మామగారు పోయి సంవత్సరం గడిచింది. అరవై ఏళ్ళు నిండుతున్న ఈ అత్తగారికి షష్టిపూర్తి చేయాలని మనసు పుట్టింది నీకు. “మగవాళ్ళకేనా షష్టి పూర్తి? ఆడవాళ్ళు ఎందుకు చేసుకోరాదు?” అని బహుతెలివిగా ప్రశ్నించావు. “మగవాళ్ళు కూడా భార్య పోతే చేసుకోరమ్మా.” అని ఎవరో పెద్ద ముత్తైదువ చెప్పబోతే “ఎందుకు చేసుకోరు! పెళ్ళాం పోయిన నెల రోజులకే మరో పెళ్ళి చేసుకుని మరీ తమకి జరగాల్సిన వేడుకలన్నీ జరిపించుకుంటారు.” అని ప్రపంచాన్ని క్షుణ్ణంగా చదివేసిన పరిజ్ఞానం ప్రకటించావు.

ఇంకోమాట మాట్లాడితే మా అత్తగారికి మళ్ళీ పెళ్ళి కూడా చేస్తానంటావేమోనని భయపడి ఆవిడ నీకో నమస్కారం పెట్టి పక్కకి తప్పుకుంది.

ఇలాంటి వేడుకలు జరిపించుకోవడం మీ అత్తగారికే కాదు మరే స్త్రీకయినా సరే ఒకవేళ యిష్టం లేకపోతే, అది కచ్చితంగా మూర్ఖత్వమూ, తరతరాల బానిస మనస్తత్వమూ, కాలంతో పాటు మారలేని జడత్వమూ, నీలాంటి కోడలి సహకారం వున్నా ఎదగలేని చేతకానితనమే తప్ప మరింకేమీ కారణాలు కాదనీ, అయ్యే అవకాశమే లేదనీ తీర్మానించావు నువ్వు. ఆరు నూరైనా అలాంటి మూర్ఖత్వంలో నుంచి ఆడవాళ్ళని బయట పదేస్తాననీ, అందుకోసం అత్తగారి షష్టిపూర్తి ఘనంగా జరిపించి తీరతాననీ ప్రతిజ్ఞ చేశావు.

ఇక నువ్వు అలా నిర్ణయించాక నీకు ఎదురు చెప్పే అవకాశం మీ అమ్మకీ, నాన్నకీ, అత్తగారికీ, భర్తకీ ఎవరికీ లేదు. వాళ్ళందరికన్నా నువ్వే తెలివైనదానివి మరి!

నీ మూర్ఖత్వంతో వాళ్ళు నిరంతరం సర్దుకుపోతున్నారని నీకు తోచదు. ఆ మాట వాళ్ళు నీతో చెప్పలేరు. ఎందుకంటే సర్దుకుపోవడం అన్న మాట వింటేనే నువ్వు నవ్వుతావు కదా! వాళ్ళని వెక్కిరిస్తావు కదా! అందుకని అందరూ నోరుమూసుకున్నారు!

శాస్త్రాన్ని నమ్మని నీకు శాస్త్రంలో చెప్పిన ఈ షష్టిపూర్తి గోల ఎందుకు? ఈ ప్రశ్న అడిగితే నువ్వు ఏ కొత్త తర్కం వినిపిస్తావో తెలీదు కానీ నాకు మాత్రం విషయం చాలా స్పష్టంగా అర్ధమయింది. అహంకారమే అన్నిటికీ మూలం. దానిని తృప్తి పరచేందుకే జరుగుతుంది కొత్త సిద్ధాంతాల జననం.

సరే ఇంతకీ ఇప్పుడు నీకు ఒక చిన్న కొసమెరుపు చెప్పాలి. చెప్పడం అంటే నేరుగా చెప్పడం లేదనుకో, ఉత్తరమూ పత్తరమూ కూడా వ్రాయడం లేదు! మనసులో అనుకోవడమే. ఇలా నీ చుట్టూ వున్నవాళ్ళందరూ మనసులో అనుకునే మాటలు, భావాలు నీకు చేరతాయా! అలాంటి అదృశ్య వ్యవస్థ ఏమైనా వుందా సృష్టిలో! ఏమో!

alochistavaసంగతేమిటంటే మీ అమ్మ నీతో పాతికేళ్ళు సర్దుకు పోయింది కానీ, మీ అత్తగారు అలా సర్డుకుపోదల్చుకోలేదు. నీ సిద్ధాంతాన్ని మరో పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో నీపిల్లలు వచ్చి నీ మీద ప్రయోగించడం… అప్పుడు నీకు విషయం అర్ధం కావడం ఎందుకు? ఇప్పుడే ఒక ప్రయత్నం చేసి చూద్దామని అనుకుని ఆవిడ కూడా ఒక నిర్ణయం తీసుకుంది.

రేపు షష్టిపూర్తి ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకుని నువ్వు ఎదురు చూస్తావు. బంధువులందరూ వస్తారు. వేడుక జరిపించుకోవలసిన మీ అత్తగారు మాత్రం నీకు కనబడదు. ఆవిడ ఆ సమయానికి కాశీ వెళ్ళే రైలులో వుంటుంది.

బహుశా ఆ ఓటమిని నువ్వు ఒప్పుకోవు. మీ అత్తగారి మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని, శాస్త్రం పట్ల ఆవిడకున్న భయాన్ని, మీ మామగారి పట్ల ఆమె చూపిస్తున్న బానిస భావాన్ని నువ్వు వచ్చిన వాళ్ళందరికీ వివరిస్తావు. తరతరాల కుట్రని అర్థం చేసుకున్న తెలివైన కోడలికి అనుగుణంగా మారలేకపోయిన ఈ మూర్ఖపు అత్తగారి గురించి జాలిపడతావు.

లేదంటే “ఏమైతేనేం చివరికి నా సిద్ధాంతాన్నే ఆవిడా అనుసరించింది కదా!” అనుకుని గర్వంగా నవ్వుకుంటావు. “చూశారా నా శిక్షణలో మా అత్తగారు ఎంతగా మారిపోయారో!” అని నలుగురికీ చెప్పుకుంటావు.

 కానీ ఆ మాటలన్నీ ఆపి ఒక్క క్షణం మౌనంగా నిలబడతావా? నేను మాట్లాడని ఈ మాటలన్నీ వినే ప్రయత్నం చేస్తావా? నీ సిద్ధాంతాలలో మాత్రమే నువ్వు కొట్టుకు పోకుండా అవతలి పక్షం వారి అభిప్రాయాల వైపు కూడా ఒకసారి చూపు సారిస్తావా? వారి జీవితంలోని సొగసుని గమనిస్తావా? వారు తమ కళ్ళకి గంతలు కట్టుకున్నారన్న నీ నమ్మకాన్ని కాసేపు పక్కన పెట్టి… వాళ్ళు చీకట్లో కూడా సాఫీగా నడచి పోయారనీ, నువ్వు వెలుగులోనూ కుంటుతున్నావనీ గుర్తిస్తావా?

ఒకరి ఇబ్బందిని గ్రహించే అలవాటు నీకు ఎప్పుడూ లేదు. కనీసం నీకు యిబ్బంది కలిగినపుడన్నా మూస లో నుంచి బయటకి వచ్చి కొంచెం విభిన్నంగా ఆలోచిస్తావా?

*

Download PDF  ePub  MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, కథ and tagged , , , , .

7 Comments

 1. మీ శైలి, కథ రాసే తీరూ చాలా చక్కగా ఉంటాయి.

  మీ కథల్లో ఇలాంటి పాత్రచిత్రణలు చదివినప్పుడు ఇలాంటి వ్యక్తులు ఎక్కడో తారసపడినట్టు అనిపిస్తుంది. ఇలా ఒక మనిషి మారటానికి కారణం ఏమిటి? ఆ కారణానికి ఏదో జస్టిఫికేషన్ లాంటిదేదో ఉంటుంది కదా, దానిని గురించి తెలుసుకోవాలని ఉంది.

 2. “ మనలో వున్న ప్రేమ అనే భావాన్ని ఒక్కొక్కరిపై ఒక్కొక్క రకంగా చూపిస్తాం. పెద్దవాళ్ళని గౌరవించడం ద్వారా, వాళ్ళ మాటకి ఎదురు చెప్పకపోవడం ద్వారా చూపిస్తాం. చిన్నవాళ్ళని ఆశీర్వదించడం ద్వారా, వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవడం ద్వారా చూపిస్తాం. కానుకలు, బహుమతులు అంటావా డబ్బులుంటే, అవకాశం వుంటే అవీ యిస్తాం. కానీ అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అవతలి వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎలా ఉన్నదన్నది, దానిని మనం ఎలా మలుచుకున్నామన్నది ముఖ్యం. అవతలి వారి కోసం కొంచెం కూడా సర్దుకోలేకపోతే, మన అహాన్ని అణచుకోలేక పోతే ఇక అది ప్రేమ ఎలా అవుతుంది? ” వాళ్ళు చీకట్లో కూడా సాఫీగా నడచి పోయారనీ, నువ్వు వెలుగులోనూ కుంటుతున్నావనీ గుర్తిస్తావా?

  అత్తమ్మ వాదనలో కారం పాలు కొంచెం తగ్గించి మమకారపు స్వరంతో నచ్చచెప్పే ధోరణిలో చెప్పుంటే, అనుభవరాహిత్య నవనాగరీక మిడిమేలపు కోడలమ్మికి తన లోటుపాట్లు తెలియవచ్చేలా చెయ్యగలిగుంటే? పెద్దల వాత్సల్యం ముందు పిల్లల అహంకారం ఓడిపోయినట్లు చూపగలిగుంటే?!

  ‘ఇంగ్లీష్‌ -వింగ్లీష్‌’ హిందీ చిత్రం క్లైమాక్స్ సీన్లో శ్రీదేవి (శశి ) స్పీచ్ సీను గుర్తుకువచ్చింది ( “మనమందరమూ జడ్జిమెంటల్ ప్రవర్తనకి దాసులమై ఒక మనిషి వచ్చిన ప్రాంతాన్నిబట్టి, విద్యార్హతలను బట్టి, వేషధారణను బట్టి, ఆర్ధిక పరిస్థితిని బట్టి ఇలా ఎదో ఒక సందర్భాన ముందే ఆ వ్యక్తి పై అబిప్రాయం ఏర్పరుచుకుని జడ్జిమెంటల్ గా వ్యవహరించి ఉండొచ్చు. మన అభిప్ర్రాయం తప్పైన సమయాన ఆ తప్పును ఒప్పుకోగలిగే humility ఉండక పోయి ఉండవచ్చు” )

  అద్భుతమైన కథనం. శ్రీవల్లీ రాధిక గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు.

 3. కొంతమంది వినిపించే వీర స్త్రీవాదాన్ని, మంచి తర్కం తో ప్రశ్నించడం పటిష్టంగానే ఉంది.అయితే, కథ చెప్పేవారు ఏకబిగిన ఉపన్యాసం లేదా హితబోధ చేసినట్లుగా ఉంది. దీన్ని కథ అనలేమేమో!