cover

ఉబ్బదేవర

Download PDF ePub MOBI

గాచ్చారం గాబోతే ఆపొద్దే ఇస్కూలు ల్యాకుండా పోవాల్నా. సద్దాగి నీరెండలో కూసోని వుడకబెట్టిన అనపకాయల్ని మాయమ్మతో గూడా తింటావున్ని నన్ను ఏమలత వొచ్చి ఎందుకు పిలవాల? మా మూలింటవ్వున్న్యా నాకీ తిట్లు తప్పేవి. దేవుడా అని మాయవ్వోలింట్లో పడుండేదాన్ని. మాయవ్వ ఆదినమనంగానే మా పెద్దమ్మోళ్లూరికి పూడ్సుండాది.

మాయమ్మతో నీరెండ్లో కూసోనుండానా. కర్నమోళ్ల యామలతొచ్చింది. ఆమాటా ఈమాటా మాట్లాడ్తా మాయమ్మ వుడకేసిన అనపకాయల్ని తినేసినాక పొట్టున్న సిబ్బితట్టెతుకొని ఆవుకు బెట్నుపొయ్యింది. అదే సందనుకోని ‘మేయ్‌ వామన గుంతలాటాడుకుందామా?’ అని అడిగిందది.

అంతే ‘అమా నేనాట్లాడుకోను బోతావుండా’ అని అర్సి మాయమ్మ ఏం జెప్తాదని కూడా సూడకుండా యామలత ఎనకాల పరిగత్తినాను. ఆ బిడ్డి వాళ్లింటికి బోయి మిద్ది మెట్లకింద బెట్టిన వామన గుంతల పీటను, బాన్లోవున్ని సింతపిచ్చిల్ని దీసుకోనొచ్చింది. మణే రొడ్డోలింటి దిన్నిమింద కూసోని ఆట్లాడుకుంటావుండాము. కాంత, పుల్లోరోళ్ల నీల ఆటసూస్తా వుండారు. ఇంతలో ఆ సివరి ఈదిలో మా సాకలమంగోళ్లింటికాడ డుబుకు డబుకుమని పొంబల వాయించతా వుండడం ఇనిపించింది.

నీల, కాంత ఆపక్కకు పరుగుబెట్న్యారు. ‘నేనాడను పోమే’ అని నేనూ వాళ్లెంట పరుగుదీసినాను. పీట ఇంట్లో బెట్టేసి యామలత కూడా ఆడికి వొచ్చేసింది.

మా మంగవాళ్ల కోడండ్లు, వాళ్ళ మర్ది పెండ్లాము, బావకూతురు, ఇద్దురు కోడండ్లు అలికిన గంపలకు పసుపుకుంకాలు బెట్టి పూజ సామాన్లను గంపల్లో బెట్టుకోని గంపలపైన తెల్ల సలవ గుడ్లను, కొందరు లేసుతో అల్లిన గుడ్లను కప్పుకోని ఆ గంపల్ని నెత్తిమింద బెట్టుకున్న్యారు. పొంబలోడు పొంబలగొడతా వుంటే సాకలోళ్లు పిల్లాజెల్లా, ముసిలీ ముతకా అంతా కూడా వొస్తావుండారు. ఊరికి ఈ సివర కొచ్చేపాటికి మాయింటికి, రచ్చబండకు ఎగుదాల్న ఒక సాకలోళ్ల సందుంది. మునసామి, సుబ్రమణ్యం, అబ్బాయిగాడు, ఎత్తిరాజులుగాడు, కిష్నుడు కుటుంబరాల్లోని ఆడోల్లు గంపల్నెతుకోని వీళ్లతో కలుసుకున్న్యారు. ముందుగా రచ్చబండ దెగ్గిర వినాయక సామికి కాయిగొట్టి కర్పూరమెలిగించి ఉబ్బదేవరకాడికి పయనమయినారు.

‘మేయ్‌, మనమూ పోదారా?’ అడిగింది కాంత. ‘పోదారిమే’ అనింది యామలత. ‘మాయమ్మ తిడ్తాది’ అంటి నేను. ‘మీయవ్వోలింటికాడ వుంటినని సెప్పు’ అనింది నీల. ‘మాయవ్వ ల్యాకుంటేనే గదా! మాయమ్మ దెగ్గిరికొచ్చింది’ అంట్ని.

వాళ్లు సాకలోళ్ల ఎనకే బయల్దేరినారు. నాకూ మెరమెరానుంది. సరే ఏమైతే అయిందని నేనూ వాళ్లెంటే నడ్సినాను.

దారిపొడుగునా పల్లేరు గాయిలు. సెప్పుల్లేని కాళ్ళు. ఎంత సూసుకోని నడ్సినా అందురూ వొంగొంగి ముండ్లు తీసుకుంటానే పొయినాము.

కట్టే గాలవ పక్కన సీకిసెట్లకు పెద్ద గూడులాగా అల్లుకోనుండాయి గురిగింజ తీగిలు. ఎవురో అదే పనిగా ఆమాదిరి అల్లించినారు. దానికింద సెక్కిన రాల్లు నిలిపినారు. దానికే పసుపూకుంకాలు బెట్టి వుండారు. ముందే నీళ్లు జల్లి ముక్కర్ర ఏసి సుబ్బరంగా పెట్టినారక్కడ.

ఆడబొయినాక పొంగిలి బెట్టి దేముడికి ఎవురికి వాళ్లు ఇడి ఇడిగా తలిగిలేసి మొక్కినారు. పొట్టేల్ని గొట్టి దేవరసుట్టూ పొలి జల్లినారు. అందురూ కలిసి సెందాలేసుకోని పట్టుకోనొచ్చిన పొట్టేలది. దాన్నాడే కోసి కుప్పలేసినారు. ఎవురి కుప్పల్ని వాళ్లు గిన్నిల్లో ఏసుకోని గంపలెత్తుకోని ఇండ్లకు బయలుదేరినారు. వాళ్లేనకే మేమూ.

ఊరిదెగ్గిరికొచ్చినాము. ఎవురిండ్లకు వాళ్లు బోవాల్నా. మా గుడ్లుతికే మంగ నా సెయ్యిబట్టుకోని ‘నాయినా, సినపాపా. ఇట్లే మాయింటికి బోదారిరా. నంజరకూర దినేసొస్తువు’ అని గెడ్డం గూడా పట్టుకోని అడుక్కునింది. నీలా వాళ్లక్కూడా మంగోళ్లే గుడ్లుతికేది. దెగ్గిరదెగ్గిర మాయవ్వ వయసుండాది మంగకు. అంత పెద్దామి పిలిస్తే పోకుంటే బాగుండదని ‘నీలాను గూడా పిల్సకొస్తా’ అన్న్యా. ‘రండి నాయినా ఇద్దురు రండి’ అని వాళ్లింటికి పిల్సక పొయ్యింది.

వాళ్లింట్లో సుట్టాలు శానా మందే వుండారు. మమ్మల్ని ఇంట్లోకి పిల్సకపోయి సాపేసి కూసోబెట్టింది. ఆ ఇంట్లో ఒక్క పక్క దొంతికుండల కాడ ఎండుకసువు పర్సి దానిమింద తెల్ల పంచేసి అన్నం వొండకొచ్చి పోసుండారు. నట్టింట్లో రోట్లో మసాలా నూరి ముద్ద గిన్నిలోకి దీసి రోలు గడికి నీళ్లను గిన్నిలోకి తోడతా వుందొకామి.

అరగంటకుపైనే అయింది. బంతి సాపలు పర్సి మమ్మల్ని సోలుపుగా కూసోబెట్టి ఇస్తరాకు లేసినారు. ఎప్పుడెప్పుడా అని వుండాది. ఆకలెక్కువగా వుండాది. ఉడుకుడుకన్నం వొడ్డించినారు. బొక్కిన్లో యాటకూర దెచ్చి ఒకామి పోసిపొయ్యింది. మా మంగ అందుర్నీ సూసుకుంటా మాదెగ్గిరి కొచ్చింది. ‘నాయినా, నిదానంగా కూసోని తినాల’ అనింది నాతో. ఉడుకుడుకన్నం. కూర గూడా శానా కారంగా వుండాది. లోటాలు లోటాలు నీళ్లు పోయించుకోని తాగతా వుండాను.

బొక్కిన్లో కూర వొడ్డిస్తా వున్ని ఎంకటేసును ‘రేయ్ ఎంగటేసా, ఆ బొక్కిన్నిట్ల ద్యారాబ్బా’ అని పిలిసింది మంగ. ఇద్దురు ముగ్గురికి కూర బోసేసి బొక్కినితో పరిగెత్తుకోనొచ్చినాడు ఎంగటేసు. మంగ బొక్కిన్ని సేతిలోకి దీస్కోని కిందబెట్టింది. గెంటితో కూర ముంచి దీసుకోని సేత్తో కెలికి కెలికి మెత్తని తునకల్నేరి నా ఆకులో వొద్దు వొద్దన్నా యెయ్యబట్టింది. వొద్దు మంగమ్మవ్వా అంటా వున్న్యా ఇనలా. ‘అన్నం దినకపోతే పొయినావు. నంజిరి దినునాయినా. కొండమింది దేవుడొచ్చినట్లు వొచ్చినావు పిలవంగానే’ అంటా తునకల్ని ఏరేరియేస్తా వుండాది. అందురూ మాపక్కే సూస్తావుండారు.

నా ఆకులోని కూర తునకల్ని ఏరి నేను నీలవేణి ఆకులో యాస్తావుండానా? ఆ బిడ్డి ఏసింది ఏసినట్లే నోట్లో బెట్టుకుంటావుండాది. నాకు మాత్రం ఎప్పుడెప్పుడు రసమన్నం దిందామా అని వుండాది. ఎంగటేసు ఎప్పుడో కూర బొక్కిని దీస్కోని బొయినాడు.

రొండోసారి అన్నం వొడ్డిస్తా వొచ్చినారు. నాయాకులో అన్నం, కూర అట్లే వుండాదా? రసం గావాలని అడిగినాను. ఎవురో రసం బొక్కినితో వొచ్చినారు. మిరియాల రసం కమ్మంగా అన్పించింది. రసమన్నం దిని తునకల్ని వొదిలిపెట్టి మజ్జిగ్గావాలని అడిగినాను. తాగాలని. నోరంతా కారంగా మండతా వుండాది. లేదన్న్యారు. అప్పిటికే అందురూ లేసేసినారు.

వర్సగా ఆకులెత్తుకోని వొచ్చినామి ‘అయ్యో రొడ్డోళ్ల బిడ్డి తునకల్నంతా వొదిలిపెట్టేసిందే’ అనింది. ఈ లోపల మంగమ్మ ఒక ఇస్తరాకు దెచ్చుకొని నాయాకులోవున్ని తునకల్ని, ఎమికిల్ని ఏరి ఆకులో ఏసుకొని ఆన్నే అన్నానికి కూసొనింది.

‘రాజా ఒగైదు నిమసాలు నిమ్మళంగా కూసో నాయినా. వొస్తానిప్పుడే’ అని ‘సుందరం లోపలికి పిల్సుకోని బో. సాపేసి కూకోబెట్టు. ఇప్పుడే వొస్తా’ అనింది.

అన్నం దినొచ్చినాక బొరుగులు ఒగంటిపండు, రొండొక్కలు ఆకులు కాయితంలో సుట్టి నాకూ, నీలాకు ఇచ్చింది. అవెత్తుకోని మాయబ్బోడోళ్లకిస్తే మాయమ్మోళ్లు గూడా శానా సంతోసపడతారని ఎగురుకుంటా ఇంటికి బొయినానా? ఏముండాది. ఆడ మా మూలింటవ్వుండాది.

తెల్లార్తో ఆట్లాడుకోవాలని బొయిన దాన్ని మద్దేన్నం మూడైనా రాకపొయ్యేసరికి వూరనాడంతా ఎతికేసినారంట. యామలత కాంతాని అడగాలని బోతే వాళ్లు సంగట్దిని యాడికిబొయినారో తెలీదన్న్యారంట. ఒకవేళ వాళ్లతో వుంటే వాళ్లు సంగటి దిన్న్యప్పుడు నేనూ మాయింటికొచ్చుండాల గదా!

‘పాపను నువ్వేమన్నా అన్న్యావా?’ అని మాయవ్వ మా యమ్మనడిగిందంట. ‘నీ మనుమరాల్ని నేనేమన్లేదుమా’ అనిందంట మా యమ్మ. మా సేద్దిగాన్ని పిల్సిసెరుకు దోటంతా ఎతికించినారంట. యాడా లేకపోయేసరికి మా మూలింటవ్వ కోసం మా పెద్దమ్మోళ్ళూరు కుక్కల పల్లికి పూడ్సినానేమో అని ఆడికీ మనిసిని పంపించినారు. దెబ్బతో మాయవ్వ గూడా ఆన్నించి ఎతకను వొచ్చేసింది.

నన్ను సూడంగానే అందురికీ వూపిరి లేసొచ్చినట్లుండాది. ‘ఇంతసేపు బసవి మాదిరిగా యాడతిరగేసేసొస్తావుండావు కసమాలమా’ అని మాయమ్మ తిట్టబట్టింది.

మా దొరసానవ్వ సెప్పు అన్న్యట్లుగా సూసింది.

‘సాకల మంగోళ్లు వుబ్బదేవరకు పొంగిలి బెట్న్యారు కదా! ఆడికి బొయినాను. అన్నం దినిపో అనింది. యాటకూరన్నం తినేసొస్తి. ఇవి గూడా ఇచ్చింది’ అని మాయమ్మ సేతిలో బెడ్తావున్న్యానా? మాయవొచ్చినా సెంప పగలగొట్టింది.

‘పో. ఆసాకలోలింటికే పొయ్యి ఆడే వుండు. మా యింట్లో అడుగు బెట్టొద్దు. రెడ్డి పుటక బుట్టి సాకలోలింట్లో కూడుదినొస్తావా. సేన్నోళ్ల మానాన్ని మాకులకు గట్టేసొస్తివా. యాటకూరకు మొగం వాసి పొయినావా? విూ మూలింటవ్వోలింట్లో వారంవారం సించతానే వుండావు గదా అది సాల్లేదని యారక తిన్ను బోతివా. ఆ మంగకన్నా బుద్దీ మద్దీ వుండక్కర్లా. ఇది ఎగజూసుకోని పోవడమూ సరి – అది దీన్ని కూసోబెట్టి తినిపించడమూ సరే. మిడిమేలం బిడ్డి పుట్టిందీ యింట్లో’ అని తిడ్తావుంది.

ఎక్కిళ్లు బెట్టి యాడస్తా వుండిపోయినాను నేను. మా యమ్మ నారెక్కబట్టుకోని పెళ్లోకి ఈడ్సకపోయింది. ఆ గుడ్డలు పెరికి పారేసి నీల్లుబోసి ఇంట్లోకి పిల్సుకోనొచ్చింది.

మాయవ్వకు నన్ను జూడంగానే మళ్లీ కోపం జాస్తయింది. ‘ఇంట్లో ఏం తక్కవయ్యుండాది. తలకు మించినంతుండాదే. అవి తింటే ఆ బేతమంగలం సెరువుకు సాల్దా. ఊరోలిండ్లకాడ బొయి పాడూ పర్దేశం తినేసి రాకపోతే…’

‘పోనీ కా పసిబిడ్డి. తెలీక సేసింది. ఇడ్సిపెట్టు. దానికి నేనన్నీ సెప్తాగదా!’ అనింది మా మూలింటవ్వ.

‘మీరంతా సెల్లం జెయబట్టే అదట్లా బరి తెగించి తిరగతావుండాది. పెద్దబిడ్డుంది. ఎంత వొద్గిగ్గా వుంటాదది. దాన్ని జూసైనా ఇది బుద్ది దెచ్చుకోకుంటే ఎట్లా?’ ఇంకా యాకారతానే వుంది మాయవ్వ.

మా మూలింటవ్వ నన్ను బిల్చుకోని వాళ్లింటి కొచ్చేసింది. సాపేసి పక్కన పొనుకో బెట్టుకునింది. ‘కాదు పాపా, సాకలోలింటికాడబొయి ఎవురన్నా అన్నం తింటారా?

‘శానా మంది తింటా వుండారే’

‘వాళ్లంతా వాళ్ల సుట్టాలు. నువు రెడ్ల బిడ్డి గదా! అట్లా బొయి తినొచ్చా’.

‘తింటే ఏమవుతాది? ఇప్పుడు నాకేమన్నా అయిందా. మనింట్లో తినుంటేనే నిన్న నాకు కడుపునొప్పొచ్చింది’.

‘పచ్చిమాడి కాయలు అంతూపొంతూ ల్యాకుండా తింటే వొచ్చిందిలే నీకు కడుపునొప్పి’.

‘వాళ్లు మనింట్లో దినాముసంగటేసుకోని బొయి తింటా వుండ్లా’

‘వాళ్లు మన గుడ్లుతకను వంకకు బోతారుగదా! వాళ్లకు సంగటి జేసుకోను టైమేడ్ది అందుకని తింటారు. అయినా పసిబిడ్డివి. తెలీక తింటివి. ఇంగ మీదటట్లా తినొద్దు. సరేనా!’

‘తింటే ఏమవుతాదివా సెప్పు?’ మాయవ్వమిందికి బడి నేను ముదిగారం బొయినాను.

‘ఏమీగాదు. పెద్దోళ్లట్లా తినగూడదని బెట్టినారు. మనమట్లే నడ్సుకోవల్ల. ఈ ఇసయంలో మీ యవ్వకు పట్టింపు జాస్తి. సూస్తివిగదా! సేందబాయిలో మీరు నీళ్లు సేందుకొనేటప్పుడు ఏరే వాళ్లు సేందుకోకూడదని కట్టడి బెట్టింది కదా విూ యవ్వ. ఎందుకో తెలుసా? నీళ్లు సేందేటప్పుడు వాళ్ల దుత్తలో నీళ్లు మీ దుత్తలో పడతాదని. అది విూ బాయి కాబట్టి అందురూ ఇంటారు. సర్కారు బాయిలో కుదుర్దుగదా! అందుకే మనం ఆపద్ధతిని వొదిలేసినాము. విూ యవ్వ మా యింట్లో యానాడన్నా ఆకేసుకోని పిడ్సకూడు తినింది సూసినావా? అందుకే ఆయమ్మ బతికుండేదాక మీరందరూ కూడా ఆ పెకారమే నడ్సుకోవల్ల. సరేనా?’

‘మా దొరసానవ్వ సచ్చిపొయినాక నేను మాలోలింట్లో కూడా పొయ్యి తినేసొస్తా నవ్వా’ అని మూలింటవ్వను గెట్టింగా వాటేసుకున్న్యాను.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అక్టోబర్, ఇర్లచెంగి కథలు, సీరియల్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.