cover

పదనిష్పాదన కళ (24)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

పధ్నాలుగో అధ్యాయం

ఉపయుక్త సంస్కృత క్రియాధాతువులూ, వాటి పదకుటుంబాలూ

నిజానికి తెలుగుభాష క్రియాధాతువుల (verb-roots) విషయంలో సంస్కృతం కంటే సుసంపన్నమైనది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి సంపాదకత్వాన వెలువడ్డ ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక అనే ఉద్గ్రంథంలో వేలాది తెలుగు క్రియాధాతువుల్ని లిపిబద్ధం చేశారు. సంస్కృతంలో ఉండడానికి 1800 ధాతువులున్నాయే గానీ వాటిల్లో మనకు వాస్తవంగా ఉపయుక్తమైనవీ, స్పష్టంగా అర్థమయ్యేవీ 300–400 కంటే ఎక్కువ లేవు. ఎక్కువశాతం ధాతు వులు నిష్ప్రయోజనంగానే మిగిలిపోయాయి. కారణం- వాటి అసలు అర్థాలు ఏమిటై ఉంటాయి? అనేది కొమ్ములు తిరిగిన పండితులక్కూడా ఈరోజు అగమ్యగోచరమే. వాటన్నింటికీ “గతౌ, శబ్దే, వ్యక్తాయాం వాచి, హింసాయామ్” లాంటి అస్పష్టమైన నిర్వచనాలిచ్చారు పూర్వీకులు. తద్ద్వారా సంస్కృతభాషకూ, ఇతర భారతీయ భాషలకూ ఉపకారం చేకూడలేదు. గతౌ (వెళ్ళ డం) అంటే అది ఎలాంటి గతో తెలీదు. హింసాయామ్ అంటే అది ఎలాంటి హింస? నఱకడమా? గిచ్చడమా? చంపడమా? ఏమీ తెలీదు. నిఘంటునిర్మాణంలో మన ధోరణి ఇప్పటికీ ఇలాగే ఉంది. భవిష్యత్తులో నైనా భాషలోని ప్రతిపదాన్నీ విశదంగా, సమగ్రంగా, వర్ణనాత్మకంగా నిర్వచించడం అభిలషణీయం.

ఈ అధ్యాయపు ప్రయోజనం

అటువంటప్పుడు ఈ తెలుగుపుస్తకంలో సంస్కృత క్రియాధాతువుల కోసం ప్రత్యేకంగా ఓ అధ్యాయాన్నే కేటాయించడం ప్రయోజనకరమేనా? అని అడిగితే, ఈ అధ్యాయపు ప్రయోజనం – చదువరులకు సంస్కృతాన్ని బోధించడం గానీ, వారిని ఆ భాషలో పండితుల్ని చేయడం గానీ కాదని మనవి. ఇంకా, తెలుగుభాషని సంస్కృతపద బాహుళ్యంతో ముంచెత్తడమో, లేదా అందుకు ప్రోత్సహించడమో కూడా కాదు. తెలుగులో మర్యాదాకర పదజాలమూ, అమర్యాదాకర పదజాలమూ అని రెండు రకా లున్నాయి. తెలుగుపదాల్ని ఉపయోగించి మర్యాదాకరమైన, లేదా తటస్థమైన భావవ్యక్తీకరణ చేయడం సాధ్యం కాని సందర్భాల్లో సంస్కృతపదాల్ని సైతం ఉపయోగించుకోవచ్చు. మఱో పక్క- తెలుగులో సమాసకల్పన ద్వారా భావవ్యక్తీకరణ చేసే పద్ధతి ఒకటుంది. తెలుగుపదాల్నీ సంస్కృతపదాల్నీ మేళవించి వైరిసమాసాల్ని కల్పించడానికి మనం వ్యతిరేకం కాదు. కానీ ‘కొన్ని సందర్భాల్లో’ ఆ పద్ధతి పొసగదు. కర్ణకఠోరంగా భాసించవచ్చు. అటువంటప్పుడు సంస్కృతపదానికి సంస్కృత పదాన్నే జత చేయాలి. అలా చేయాలంటే, తెలుగుపదాలకు దీటైన సంస్కృతపదాలు కూడా తెలిసి ఉండాలి. కానీ మన విద్యావిధానంలో, మన వాతావరణంలో అది సాధ్యం కాదు. కనుక వాటిని పూర్వాయత్తం (ready-made) గా ఇక్కడ ఇవ్వడం జఱుగుతోంది. అంటే,“ఈ పదానికి సంస్కృతంలో ఏమంటారు?” అని సందేహం కలిగినప్పుడు ఈ పదజాలాన్ని శీఘ్ర ఆచూకీ (quick reference) నిమిత్తం వాడుకోవచ్చును. తెలుగులో ఉన్న క్రియాధాతువులకు పదకుటుంబాల్ని నిష్పాదించడం కష్టం. కొన్నిసార్లు అసాధ్యం కూడా! అందుకవసరమైన ప్రత్యయాలు తెలుగులో తగినన్ని లేకపోవడమే దీనిక్కారణం. ప్రత్యయాల లేమి మూలాన తెలుగు వీటి భావార్థాన్ని పొడవైన, విడివిడి పదబంధాలతో వ్యక్తీకరిస్తుంది. కనుక అత్యంత సరళమైన భావాల విషయంలో క్‌ఌప్తత కోసం సంస్కృత పదకుటుంబాల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

దీని పరిమితులు

ఇక్కడ ఇచ్చిన పదజాలానికి కొన్ని పరిమితులున్నాయని గమనించాలి. తెలుగుభాషకు సంస్కృత పదజాలంలో ఏ శబ్దనిర్మాణాలు ఏ అర్థంలో అవసరమవుతాయో ఊహించి అవి మాత్రమే ఇచ్చాను తప్ప అన్ని రకాల నిర్మాణాల్నీ ఇవ్వలేదు. అలాగే వాడుకలో ఉన్న తెలుగు క్రియాధాతువుల్లో సుమారు 60–70 శాతం దాకానే ఇక్కడ ఇవ్వడం సాధ్యమైంది. వీటిని వీటి యథార్థ సంస్కృతరూపాల్లో కాక తెలుగులోకి తేబడ్డ తత్సమాల రూపంలో ఇవ్వడమైనది. వీలైనంతవఱకూ సంస్కృత వ్యాకరణ సూత్రాలకు లోబడే ఈ రూపాల్ని నిష్పాదించడం జఱిగింది. కానీ క్రియారూపాలు సందిగ్ధంగా ఉన్నచోట్లా, అవి తెలుగువారి లాక్షణిక అవగాహనకూ, ఉచ్చారణసామర్థ్యానికీ మించిన చోట్లా కాస్త స్వతంత్రించి సరళీకరించడం జఱిగింది. సంస్కృతం కంటే తెలుగు సుసంపన్నమైన భాష కావడం వల్ల తెలుగులో ఉన్న ప్రతి క్రియాధాతువుకూ సంస్కృతంలో సాటిమాట దొఱకదు. కనుక ‘కొన్ని సార్లు’ వాటిని సరిక్రొత్తగా నిష్పాదించాల్సివచ్చింది, ఇప్పటికే ఉనికిలో ఉన్న ధాతువుల్నీ, ప్రత్యయాల్నీ, ఉపసర్గల్నీ విశేషణాల్నీ ఉపయోగించుకుంటూ !

వీటిని ఎలా, ఏ అర్థంలో బోధపఱచుకోవాలి ?

ఇక్కడ అందఱికీ తెలిసిన, ఆధునిక జనవ్యవహారంలో ఉన్న తెలుగు క్రియాధాతువుల్ని అకారాదిక్రమం (alphabetical order) లో ఇవ్వడం జఱిగింది. వాటికి ఎదురుగా వాటిని సంస్కృతంలో ఏమంటారో, ఎలా ప్రయోగిస్తారో చూపడం జఱిగింది. ఒక్కో ధాతువు యొక్క జన్యరూపాల ఆవళి (line of derivatives) ని దాని పదకుటుంబంగా భావించాలి. ఈ పద కుటుంబసభ్యుల్ని మనకు అవసరమైనంత మేరకు ఎనిమిది రకాల కింద, ఎనిమిది అర్థాల్లో ప్రదర్శించాను. ఒక్కో రకానికీ ఒక్కో స్థిరమైన, అర్థవంతమైన వరుససంఖ్యని కేటాయించాను. ప్రతి క్రియాధాతువు కిందా ఉన్న జన్యరూపాల్ని ఈ చెప్పిన అర్థాల్లోనే బోధపఱచుకొని వాడాలి. కొన్నిసార్లు ఒకే రకం కింద రెండు, మూడు లేదా నాలుగు పదాల్ని కూడా ఇవ్వడమైనది. వీటిల్లో-

1. మొదటి రకం – ఇది క్రియ (verb). సంస్కృతంలో ఆ ధాతువుని వర్తమానకాలం (లట్) లో ప్రథమపురుష ఏకవచనంలో ఎలా వాడతారో చూపుతుంది. దీని వల్ల ఆ క్రియాధాతువు సంస్కృత వ్యాకరణంలో ఏ ప్రకరణానికి చెందినదో తెలుస్తుంది. కనుక ఇది సామాన్య పాఠకులకూ, రచయితలకూ అవసరం లేదు. కానీ జన్యరూపాల్ని మౌలికంగా నిర్ణయించేది ఈ రూపమే కనుక సమాచారం నిమిత్తం ఇవ్వబడింది.

2. రెండో రకం (అనమంతాలు) – ఇది నామవాచకం (noun). ఆ క్రియాధాతువు యొక్క నామరూపం. ఇది తెలుగులో చేయు అనే ధాతువుని ఎలాగైతే చేయడం అని పిలుస్తామో అలాంటిది. దీన్ని ఆంగ్లంలో Gerund form అంటారు.

ఉదా :- రుహ్ –> రోహణం (అంకురించడం) ;

కృ –> కరణం (చేయడం)

భూ –> భవనం (ఉండడం)

నీ –> నయనం (నడిపించడం) మొ||

కొన్నిసార్లు ధాతువుకు ‘క’ ప్రత్యయం వచ్చి ‘అణమ్’ తో పనిలేకుండానే ధాతువుకు నామవాచకం ఏర్పడుతుంది. వీటిని ‘క-ప్రత్యయాంతాలు’ అంటారు.

ఉదా :- రుహ్ – రోహం

యుజ్ – యోగం

ముద్ – మోదం

వద్ – వాదం ఇత్యాది ||

3. మూడో రకం – నామవాచకం. ఆ క్రియ యొక్క కర్త (subject) ని తెలుపుతుంది. ఈ భావాన్ని తెలపడం కోసం ఆంగ్లంలో సాధారణంగా verb చివఱ –er లేదా –or అని చేఱుస్తారు.

ఉదా :- వ్రాయు –> వ్రాతరి = వ్రాసేవాడు.

ఈ రకం కింద ఒకే అర్థంలో మూడు రూపాలు ఇవ్వబడ్డాయి.

1. రుహ్ –> రోహకం (అంకురించేది) – దీన్ని ’అక’ ప్రత్యయాంతరూపం లేక అకాంతం అంటారు.

2. రోహి (న్) – దీన్ని ణిన్యంతం అంటారు.

3. రోహిత (తృ) – దీన్ని తృజంతం అంటారు. సమాస మధ్యంలో ఇలాంటివాటిని రోహితృ అని ప్రయోగించాలి.

4. నాలుగో రకం – క్రియాజన్య – భూత – కర్మార్థక – విశేషణం (adjective) . అంటే ఆ క్రియ యొక్క కర్మ (object) ను తెలుపుతుంది. దీన్ని ‘క్త’ ప్రత్యయరూపం లేక క్తాంతరూపం అంటారు. ఇది ఆంగ్లంలోని Past Participle రూపానికి సమానమైనది.

ఉదా :- చేయు –> చేయబడినది.

రుహ్ –> రోహితం (అంకురించినది)

5. అయిదో రకం – నామవాచకం. ఆ క్రియ చేయడానికి ఉపకరించే సాధనాన్ని లేదా పనిముట్టు (tool/ instrument)ని తెలుపుతుంది.

ఉదా – దువ్వు –> దువ్వెన.

రుహ్ –> రోహిత్రం (మొలకెత్తడానికి/ మొలకెత్తించడానికి సహాయపడే పనిముట్టు)

6. ఆఱో రకం – ఇది విశేషణం (adjective). ఆ క్రియ చేయదగిన (ఆ క్రియ యొక్క ప్రభావాన్ని/ ఫలితాన్ని అనుభవించ గల) వ్యక్తిని, వస్తువు (object) నీ తెలుపుతుంది. ఇవి ఆంగ్లంలో క్రియల చివఱ వచ్చే -able, -ible లాంటివి గల పదాల కోవకు చెందిన రూపాలు.

ఉదా – చేయు –> చేయదగిన.

ఈ రకం కింద ఒకే అర్థంలో మూడు రూపాలు ఇవ్వబడ్డాయి.

1. రుహ్ –> రుహ్యం (మొలకెత్తగలది, లేదా మొలకెత్తించదగినది) – దీన్ని యదంతం అంటారు.

2. రోహణీయం – దీన్ని అనీయాంతం అంటారు.

3. రోహితవ్యం/ రూఢవ్యం – దీన్ని తవ్యాంతం లేదా తవ్యదంతం అంటారు.

ఈ పై మూడూ కాక, కేలిమర్ అని ఇంకో ప్రత్యయం ఉంది. ఈ పుస్తకంలోని పదజాలంలో దాన్ని ఉపయోగించలేదు. కానీ దాన్ని కూడా ఇదే అర్థంలో వాడతారు. ఇది ‘+ఏలిమ’ అనే రూపంతో క్రియాధాతువుకు చేఱుతుంది.

ఉదా :- పచ్ + ఏలిమ = పచేలిమం = త్వరగా ముగ్గే/ మాగే స్వభావం గలిగిన.

గమనిక :- అకర్మక క్రియాధాతువులకు పై ప్రత్యయాలు చేఱినప్పుడు ‘కాగలిగినది’ (ఆ అవకాశం ఉన్నటువంటిది) అని అర్థం.

ఉదా – శోణనం = ఎఱ్ఱబడడం. దీనికి కర్మ ఉండదు. కాబట్టి ఇది అకర్మక క్రియ. దీనికి యత్ ప్రత్యయం చేఱితే-

శోణ్యం = ఎఱ్ఱబడడానికి అవకాశమున్న/ ఎఱ్ఱబడగలిగిన.

7. ఏడో రకం (Present participle)క్రియాజన్య – వర్తమాన – కర్త్రర్థక – విశేషణం . ఆ క్రియని ప్రస్తుతం చేస్తున్న వస్తువుని, వ్యక్తి (subject) ని సూచిస్తుంది.

ఉదా :- చేయు –> చేస్తున్నవాడు.

రుహ్ –> రోహంతం (మొలకెత్తుతూ ఉన్నది)

8. ఎనిమిదో రకం (Future participle)క్రియాజన్య – భవిష్య – కర్త్రర్థక – విశేషణం . ఆ క్రియని భవిష్యత్తులో ఎవఱు చేయబోతున్నారో ఆ వస్తువుని, వ్యక్తి (subject) ని సూచిస్తుంది.

ఉదా – చేయు –> చేయబోతున్నవాడు.

రుహ్ –> రోహిష్యం (మొలకెత్తబోతున్నది)

వీటిని ఎలా ఉపయోగించుకోవాలి ?

సూటిగా తేటతెలుగు మాటలతో రోజువారీ పని జఱుగుతుందనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిన పదజాలాన్ని ఉపయోగించడం మంచిపని కాదు. ఇవి కొన్ని ప్రత్యేక సందర్భాల కోసం ఉద్దేశించినవని మఱువరాదు. ముఖ్యంగా, శాస్త్ర, సాంకేతిక పదజాల నిష్పాదనకు ఇవి ఉపయోగపడతాయి. అదే విధంగా కవనాభిరుచీ, తద్ వ్యాసంగమూ గలవారికి సైతం పదవైవిధ్యమూ, శీర్షి కలూ, లేదా పదక్రీడల నిమిత్తం ఇవి ఉపయోగపడతాయి.

ఇక్కడ ఇచ్చినవన్నీ నపుంసకలింగంలో ఇవ్వబడ్డాయని గమనించాలి. వీటిని సందర్భానుగుణంగా లింగాన్ని మార్చి వాడుకో వచ్చు. అలాగే ‘శుద్ధ ధాతువులకు’ అర్థానుగుణంగా ఉపసర్గల్ని జతచేర్చి, అర్థాన్ని స్వల్పంగా మార్చి కూడా వాడుకోవచ్చు. అలాగే, అ- లేదా అన్- అనే ఉపసర్గల్ని వీటి ముందు చేర్చడం ద్వారా వ్యతిరేకార్థకాల్ని సైతం నిష్పాదించవచ్చు.

ఉదాహరణకు :- నచ్చు – 1. రోచతే 2. రోచనం 3. రోచకం, రోచి (న్), రోచిత (తృ) 4. రుచితం 5. రోచని 6. రుచ్యం, రోచనీయం, రోచితవ్యం 7. రోచమానం 8. రోచిష్యం

–> పై జాబితాలో మూడో తరహా పదాల్ని ‘రోచకుడు, రోచిక, రోచకి, రోచిని, రోచిత్రి’ అని మార్చవచ్చు.

–> అలాగే నాలుగో తరహా పదాన్ని ‘రోచితుడు, రోచితురాలు, రోచిత’ అని మార్చవచ్చు.

–> ఆఱో తరహా పదాల్ని ‘రోచనీయుడు, రోచనీయ, రోచనీయురాలు, రోచితవ్యుడు, రోచితవ్య, రోచితవ్యురాలు’ అని మార్చవచ్చు.

–> ఏడో తరహా పదాన్ని ‘రోచమానుడు, రోచమాన, రోచమానురాలు’ అని మార్చవచ్చు. రోహంతం లాంటి పదాలైతే, ‘రోహంతి, రోహంతుడు’ అని మార్చాలి.

–> ఎనిమిదో తరహా పదాన్ని ‘రోచిష్యుడు, రోచిష్య, రోచిష్యురాలు’ అని మార్చవచ్చు.

–> వీటికి వ్యతిరేకార్థకాలుగా ‘అరోచిష్య’ (నచ్చని స్త్రీ) మొదలైన రూపాల్ని నిష్పాదించవచ్చు.

–> వీటికి అతి మొదలైన ఉపసర్గల్ని చేర్చి అర్థాన్ని స్వల్పంగా మార్చవచ్చు.

ఉదా – అతిరోచిష్యుడు = విపరీతంగా నచ్చేవాడు.

ఇవి స్వయంగా జన్య (derivative) పదాలైనప్పటికీ మళ్లీ ఈ జన్యపదాల నుంచి సైతం మఱిన్ని జన్యపదాల్ని నిష్పాదించేం దుకు ఆస్కారం ఉంది.

ఉదాహరణకు :-

రోచనానికి సంబంధించినది = రౌచనికం

రోచకుడికి సంబంధించినది = రోచకీయం

రోచకుడి గుణం = రోచకత్వం

రోచిత్రానికి సంబంధించినది = రౌచిత్రికం

అవసరమనుకున్న చోట్ల ప్రేరణార్థక రూపాల్ని కూడా ఇచ్చాను. ఇవ్వనివాటికి అభిజ్ఞుల్ని సంప్రదించవలసినది.

సంస్కృత ధాతువుల పదకుటుంబాలు

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, అక్టోబర్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.