cover

ముత్తెమంత ముద్దు!

Download PDF ePUb MOBI

గై డి మొపాసా (Guy de Maupassant) “ద కిస్” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. 

ముత్తెమంత ముద్దు!

గై డి మొపాసా

నా ప్రియమైన చిన్నారి! పగలు, రాత్రి ఎడతెరపి లేకుండా కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే ఉన్నావన్నమాట. నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోయిన దిగులులో దిక్కుతోచక ఈ ముసలి ఆంటీని సలహా అడిగావు. ఆర్చేదానినో, తీర్చేదానినో గానీ, నీ దృష్టిలో మాత్రం నేనొక అనుభవశాలిని. నా గురించి నువ్వు అనుకునేంత నేర్పరితనం నాకుందని నేననుకోను. అయితే, ప్రేమించడమనే కళలో ఆరితేరక పోయినా, అది బొత్తిగా తెలియని దాన్నయితే కాదు. అంతేకాదు, తమ మీద ఎవరైనా మరులుగొనేలా చేసుకునే విషయంలో నువ్వు కాస్త వెనకబడ్డావు గానీ, నేను మాత్రం జాణనే.

నా వయసు సాక్షిగా అది నిజం.

నీ ఏకాగ్రత, ప్రేమ, నీ కావలింతలు, ముద్దులు మురిపాలు అన్నీ నీ భర్తకే అంకితం చేశానంటూ చెప్పకొచ్చావ్. బహుశా అసలు సమస్య అక్కడే ఉందనుకుంటా; నేననుకోవడం – నువ్వుతన్ని మరీఎక్కువగా ముద్దాడుతావు.

బంగారు! ప్రపంచంలోనే అత్యంత బలవత్తరమైన శక్తి మన చేతుల్లో ఉంది. అదే – “ప్రేమ”. శారీరక దారుఢ్యం మగవాడికి సహజంగా దక్కిన వరం. సాధారణంగా అతను బలాన్ని ప్రయోగించే తన పనులు చక్కబెట్టుకుంటాడు. అందం ఆడవాని సొత్తు. కౌగిలింతలతోనే ఆమె చలాయిస్తోంది. అదే మన అజేయమైన, అభేద్యమైన ఆయుధం. అయితే, కౌగిలి అనే ఆయుధాన్ని ఎంత నేర్పుగా వాడాలో మనకు తెలిసి తీరాలి.

బాగా గుర్తుంచుకో, మనం జగత్ర్పేయసులం. ప్రపంచం ప్రారంభమైన నాటి నుంచి ‘ప్రేమ’ చరిత్రని చెప్పకోవడమంటే మనిషి చరిత్రని మననం చేసుకోవడమే. సకల కళలు, మరపురాని మహత్తర సంఘటనలు, ఆచారాలు, సంప్రదాయాలు, యుద్ధాలు, మహా సామ్రాజ్యాలు, వాటి పతనాలు.. అన్నీ ఆ ‘ప్రేమ’ నుంచి పుట్టినవే. పురాణాల్లో, ఇతిహాసాల్లో, చారిత్రక ఘట్టాల్లో అందుకు కనబడే ఉదాహరణలు కోకొల్లలు. బైబిల్‌లో డెలిల, జుడిత్, పురాగాథల్లో – ఓంఫలె, హెలెన్, చరిత్రలో సెబిన్స్, క్లియోపాత్ర… ఇంకా ఈ జాబితా అనంతం! కాబట్టి అత్యంత శక్తివంతమైన దాన్ని మనం వశం చేసుకున్నాం. అయితే మహారాజుల మాదిరిగా మనం కూడా దౌత్య చాణక్యాన్ని ప్రదర్శించాలి.

చిట్టి తల్లీ! ప్రేమన్నది అగోచరమైన అనుభూతులమయం. అది మరణంలా మహా ధృడమైనదే కాదు, గాజులా అతి సుకురామరమైనదని కూడా మనకు తెలుసు. చిన్నపాటి కుదుపు దాన్ని ముక్కలు చేస్తుంది. దాంతో మన శక్తి యావత్తూ నేలమట్టమయిపోతుంది. దాన్ని మళ్ళీ నిలబెట్టడం మన వల్లకాదు. మనల్ని ఆరాధించేలా చేసుకునే శక్తి మనకుంది, అయితే మనలో ఒక చిన్న లోపముంది. అదేమంటే, రకరకాల ఆలింగనాల పట్ల అవగాహన లేకపోవడం.

చవక కావలింతల్లో మన జాణతనం పట్టుజారి పోతుంది. మనం ఎవరినైతే కొంగుకట్టుకొని ఆడించాలో, ఆ మగాడు పెత్తనం చలాయిస్తున్నాడు. కొన్ని రొడ్డకొట్టుడు పదాలలోని వెటకారాన్ని, అల్పత్వాన్ని అంచనా వేసే శక్తి కూడా మనం బోలు కౌగిళ్లలో కోల్పోతున్నాం. ‘జాగ్రత్త సుమా’, ‘నా ప్రియతమా’… వంటి అరిగిపోయిన మాటలవి. మన వజ్రకవచం పెళుసయిపోతుందప్పుడే. మనం లోబడిపోతున్నది కూడా ఆ లోపం వల్లే. మన నిజమైన శక్తి ఎలా బైటపడుతుందో తెలుసా నీకు? ముద్దు ద్వారా, అవును! ముద్దు ద్వారా మాత్రమే. ఎప్పడు మూతి బిగబట్టాలో, ఎప్పడు అధరాస్త్రం ప్రయోగించాలో తెలిస్తే మాత్రం మనమే రారాణులం. నిజానికి ముద్దంటే ఒక ప్రవేశిక మాత్రమే. అయితే, అదొక అందమైన ఆముఖం, అసలు కన్నా దాని భావనలోనే ఉంది ఆకర్షణ అంతా. ముందుమాటని మళ్ళీ మళ్ళీ చదవొచ్చేమో గానీ, ఆ పుస్తకాన్ని అలా పదే పదే చదవడం కుదరదు.

అవును! పెదాల సయ్యాట అనేది మానవ జాతికి లభించిన దివ్యానుభూతి. ఆనంద ఆర్ణవపు ఆఖరి అంచు. మనం తపించే హృదయాల సంయోగం తర్వాత కలిగే ఆత్మల సమాగమానికి చుంబనమొకటే ఏకైక మార్గమని ఒక్కోసారి అన్పిస్తుంది. కవి Sully-Prudhomme పద్యం గుర్తుందా నీకు-

పరిష్వంగమంటే

విస్మయానందోద్వేగం మినహా మరొకటి కాదు

చుంబన మాధ్యమంతో ఆత్మల ఐక్యానికి ప్రేమ నిష్పల యత్నాలు!

రెండు శరీరాలు ఏకతాళంలో సంలీనమయ్యే గాఢమైన అనుభూతిని ఇవ్వగలిగింది ముద్దు మాత్రమే. తొలిగా, తెలి తేమగా, తాజాగా జతపడి, సుదీర్ఘమై, నిశ్చలమై, తిరిగి తిరిగి తారాడే ఆ అనుభవం, అదిరే ఈ అధరాధర ఆగడాన్ని మించి పరిపూర్ణంగా సొంతమనిపించే చిక్కనైన మైకం మరొకటి లేదు. కాబట్టి, నా వరాల కొండ, ముద్దు మన అత్యంత బలమైన ఆయుధం. కానీ అది నిర్వీర్యం కాకుండా మనం జాగ్రత్తపడాలి. దాని విలువ కేవలం సాపేక్షమని, పూర్తిగా అనుభవైకవేద్యమని మాత్రం మర్చిపోకు. పరిసరాలను బట్టి, హృదయోల్లాసానికి అనుగుణంగా, ఊహల స్థాయీభేదాల ప్రకారమే దాని విలువ ఉంటుంది. నీకో ఉదాహరణ చెప్తాను.

మరో కవి Francois Coppee రాశాడొక వాక్యం, విస్మరణీయం కానిది, హృదయాల్ని స్పందింప చేసే మహత్తర వాక్య విన్యాసం…

ఓ చలి సాయంత్రం గదిలో ఆమె కోసం నిరీక్షిస్తున్న ప్రియుడిలో జ్వలిస్తున్న ఆకాంక్ష, పెరిగే ఆందోళన, నరాల్ని మెలిపెట్టే అసహనం, వియోగం రాజేస్తున్న భీతి… ఇంకా భిన్న రాగ, భావోద్వేగాల్ని వర్ణించిన తర్వాత, కవి ఎట్టకేలకు ఆమె ఆగమనాన్ని కూడా అభివర్ణిస్తాడు. తన వంతుగా చలి తెమ్మెరని ఎగిసిపడే ఉచ్ఛాస నిశ్వాసాలతో పాటు మోసుకొని హడావిడిగా వస్తుంది అతని నెచ్చెలి. కవి ఇలా అంటాడు: “ఆహా! ముద్దుల మాధుర్యం మొదట మేలి ముసుగుల మాటునే కొసరింది”.

అత్యద్భుతమైన భావన, సొగసైన, సున్నితమైన పరిశీలన, ఒక నిఖార్సయిన నిజం కాదా ఆ వాక్యం? చాటుమాటు కలయికలకి ఆత్రపడిపోయి, మగాళ్ల ముందు అలుసైపోయిన ఆడవాళ్ళకి మేలిముసుగులోంచి మురిపెంగా జారే తొలి చుంబనాల మాధుర్యం తెలుస్తుందా? కనీసం జ్ఞాపకాల్లో కూడా అవి వారికి మిగలవు. ఆ ముద్దుల రుచి కచ్చితంగా సందర్భానుసారమైనదే. కలయికలో ఆలస్యం, ఉద్వేగభరితమైన ఎదుర్చూపులు… వంటి సందర్భాలలోనే ఆ ముద్దులకి అంత మధురిమ. కానీ, ఆ కలయికలో ఒట్టి ఇంద్రియలోలత్వమే ఉంటే మాత్రం అవి వెగటైనవే. ఒకసారి ఆలోచించు. చలిని ఎగదోస్తున్న సాయంసంధ్య, వడి వడిగా వస్తుందామె. చల్లని ఆమె శ్వాసలతో మేలిముసుగుకు చెమ్మ. జలతారు ముసుగు అంచుల్లో మెరిసే భాష్ప బిందుసందోహం. వేచి ఉండి వెచ్చనైపోయిన ఆ ప్రియుడు ఆమెను తమకంతో పెనవేసి, మండే తన పెదాలను ఆమె తడిపొడి శ్వాసలకు అభిముఖంగా అదుముతాడు. తడి వల్ల వివర్ణమైన మేలిముసుగు మీద అద్దకపు రసాయనాల చేదు రుచి మొదట ఆ ప్రియుడి పెదాల మీదకి పాకుతుంది. అతని మీసాలకు కూడా అంటుతుంది తేమ. అతను తన ప్రేయసి అధరాల రుచి చూడలేదు. చలి శ్వాసల వల్ల నానిన ముసుగు మీద ముద్రల రుచి చూశాడు. అయినా, కవిలానే, మనం కూడా అంటాం: “ఆహా! ముద్దుల మాధుర్యం మొదట మేలిముసుగుల మాటునే కొసరింది”.

muttemanthamudduఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే కౌగిలింత విలువ పూర్తిగా అనుభూతికి సంబంధించిన విషయం, కాబట్టి అది దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి మనం, జాగ్రత్తగా. ఇకపోతే, నేను చాలాసార్లు గమనించిందేమంటే ఇటువంటిత శృంగార సంబంధిత విషయాలలో నువ్వు చాలా అస్తవ్యస్తమైన దానివి. నువ్వొక్కదానివే అనడం లేదు. ఎక్కువ మంది ఆడవాళ్లు చాలా అసందర్భమైన ముద్దులతో వాటిని అడ్డదిడ్డంగా వాడి, చేజేతులా తమ పెత్తనాన్ని కోల్పోతున్నారు. తమ భర్తో, ప్రియుడో అలసిపోయి ఉన్నారని అన్పించినప్పడు, ఎప్పడైతే వాళ్ల మనఃశరీరాలు విశ్రాంతిని కోరుకుంటుంటాయో, అటువంటి సమయాల్లో అతని లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం మాని, అనవసరమైన ఆలింగనాలతో చికాకు పుట్టిస్తారు. అదోరకమైన మోటు మొండితనంతో పెదాలను మోరజాస్తారు. ఎటువంటి శ్రుతి, లయలేని చొప్పదంటు ఆలింగనాలు అందించబోతారు. అనుభవంమీద చెబుతున్న నా సలహా విను. గుర్తుపెట్టుకో, నీ భర్తని ఎప్పడూ పదిమంది ముందు రైలులోనో, రెస్టారెంట్‌లోనో బాహాటంగా ముద్దుపెట్టుకోకు. దాని వల్ల అతను నీకు దాసోహమవడు, సరికదా, ఆ చర్య చాలా వెటకారంగా అన్పించి, అతను నిన్నసలు క్షమించడు. దగ్గరతనంలో ప్రగల్భించే అనవసర చుంబనాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను కచ్చితంగా చెప్పగలను – నువ్వు వాటిని అడ్డగోలుగా వాడావు. సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను – ఓరోజు మతిమాలిన పని నువ్వొకటి చేయడం చూసి నేను దిమ్మెరపోయాను. బహుశా నీకది గుర్తుండకపోవచ్చు.

మనం ముగ్గురం డ్రాయింగ్ రూమ్‌లో ఉన్నాం. దర్పం, ఒద్దిక మచ్చుకైనా కనబరచకుండా అతి మామూలుగా ఉన్నావు నువ్వు. నీ భర్త నిన్ను బాగా హత్తుకొని నీ మెడ, కంఠం, పెదాల మీద ఎడతెరపిలేని ముద్దులు కురిపిస్తున్నాడు. ఉన్నట్టుండి నువ్వు ‘అయ్యో! నిప్పుల కుంపటి’ అని అరిచావు. గదిని వెచ్చబరుస్తున్న ఆ కుంపటిని పట్టించుకోకపోవడం వల్ల అది దాదాపు ఆరిపోబోతుంది. కొడిగట్టినట్టు మిణుకు మిణుకు మంటుంది అందులో నిప్పు. అప్పుడతను లేచి కలప దుంగల దగ్గరకి పరిగెత్తాడు. చాలా కష్టంమీద రెండు బరువైన దుంగల్ని లాగాడు. నువ్వప్పుడు ఆబగా పెదాలు చాపుతూ సరసంగా గుసగుసలు పోయావ్ ‘ముద్దు పెట్టు నాకు’ అంటూ. ఆయాసపడుతూ, అతి కష్టంమీద తల తిప్పి ఆ దుంగల్ని నిలబెట్టబోతున్నాడు అప్పుడే. మెడనరంపట్టి, ఒళ్ళు పులిసిపోయి, చేతులు జావగారిపోయి, అలసటతో కంపిస్తూ, శ్రమతో కుదేలైన ఆ అర్భకుడికి సుతారంగా నాజూకుగా పెదాలు తాటిస్తూ ‘ముద్దిమ్మ’ని యాగీ చేశావు. కొంచెమైన సరస సందర్భశుద్ధి లేకుండా, అర్థం చేసుకోకుండా హింసాత్మకమైన ముద్దు లాక్కున్నావు. అప్పడు అతన్ని వదిలి – ‘అబ్బా! ఎంత చెత్తగా ముద్దు పెట్టుకుంటావ్ నువ్వు!’ అన్నావు. అందులో ఆశ్చర్యమేముంది?

కాబట్టి! కొంచెం జాగ్రత్తపడు. అసౌకర్యంగా ఉన్న క్షణాల్లో తెలివిలేకుండా అలా ప్రవర్తించడం మన అందరిలో ఉన్నా అవలక్షణం. అతను నీళ్ళ గ్లాసు తెస్తున్నప్పుడో, బూట్లు వేసుకుంటునప్పుడో, మెడకి రుమాలు కట్టుకుంటున్నప్పుడో – ఒక్క మాటలో చెప్పాలంటే అసౌకర్యమైన భంగిమలో అసలే తాను ఇబ్బంది పడుతున్నప్పుడు, మూర్ఖంగా మనం వాటేసుకోవడానికి ఎగబడిపోతాం. దాంతో అతను తాను చేస్తున్న పనిని ఆపేస్తాడు. ఎందుకో తెలుసా – మన బెడద నుంచి బయటపడే ఒకే ఒక లక్ష్యంతో. నా యీ విమర్శ అంతా విలువలేనిదని అనుకోకు.

నా ప్రియమైన బంగారూ! ప్రేమ చాలా సున్నితమైన విషయం. చాలా అల్పమైన అంశం కూడా దానిని భంగపరుస్తుంది. ఎటువంటి విషయాలైనా మన కౌగిలింతల నేర్పరితనం మీదే ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకో. మరోసారి చెబుతున్నా – ఒక అసందర్భమైన ముద్దు ఎంతటి హానినైనా చేయగలదు.

నా సలహా పాటించడానికి ప్రయత్నించు.

– నీ ఆంటీ

కొలెట్

*

Download PDF ePUb MOBI

Posted in 2014, అక్టోబర్, అనువాదం and tagged , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.