cover

అమ్మాయి చదువు

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 10వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన ఇక్కడ చూడండి.)

Download PDF ePub MOBI

దోస్తులతో ఆడుతుంటే అయ్య వచ్చి ‘ఆడింది చాలుగానీ ఇంట్లోకి నడు’ అని గదమాయించిండు. నేను పరిగెత్తి అమ్మ కొంగు అందుకొని ఏడుస్తుంటే – ఇది ఇప్పుడే ఇట్లా ఉంటే పెద్దది అయినాక ఎలా ఉంటుంది అని మనసులో అనుకున్నాడేమో, కొద్దిగ ఆగి ‘ఏమో ఓ సుగుణ ఈ ఏడు దీని పెళ్ళి చేద్దాం’ అన్నాడు నాన్న. ‘వద్దే ఇది మనకు ఒకగానొక్క బిడ్డ దీన్ని చదివిపిద్దాం’ అంది అమ్మ. ‘మీ ఆడి ముండలు చదివి ఏం సాధిస్తరు, ఎంత చదివినగాని గీతలే ముంతలు తోముడే. రేపటి నుండి దీన్ని సాలోల్ల బస్తిల బట్టలు కుట్ట నేర్వ పంపుత. ఎంతనన్న నేర్వని, నేర్వకపోని.’

‘అమ్మ అయ్య తాగినట్లుండే నిజంగా నా సదువు మానిపిస్తడేమో’ అని అడగగానే నన్ను కొంగులోకి అదిమిపట్టి, ‘మీ నాయిన మొండి పట్టు మనిషమ్మా’ అంది. ‘నువ్వు మంచిగా చదువుతున్నావని ఎవరి కండ్లల్లో మన్ను పడ్డదో, ఎవరు నీ నోట్లో మట్టి కొట్టాలని నూరిపోశారో మీ అయ్యకు’ అని బాధతో, ఇద్దరి కళ్ళల్లో నిండిన నీళ్ళను కొంగుతో అద్దుతూ, అమ్మ ‘మన ఆడోల్లు ఎంత చదివిన మొగాడి మోకాలి కింద బతుకేనమ్మ ఎదిరిస్తే చెప్పరాని తిప్పలు పెడతరమ్మ’ అని అనుభవమంతా చెప్పింది.

నాయిన పోయి ఇంట్లనే కక్కిన తావులనే బొర్లి బొర్లి పడుకుండు. అసలు నాకు నిద్ర పట్టిందో లేదో తెలవదు కాని కప్పుకున్న అమ్మ చీరల బొంత తడిసి ముద్దయింది. అమ్మ పిలిస్తే వెళ్లి పొయ్యి అలికి రాత్రి తినకుండా ఉన్న అన్నంకు పక్కింటి పద్మవాళ్ళ దగ్గర కరివేపాకు తెచ్చి తాలింపు వేస్తే, అయ్య పోయ్యి కాడికి రాగానే గిన్నె నిండ బువ్వ పెట్టి రాత్రి అయ్య అన్న మాటలు గుర్తొచ్చి నేను ఏడుస్తుంటే, ‘పొయ్యి కింద మంట మండితే పొగరాదు కళ్ళు మండయి’ అన్నాడు అయ్య.

అమ్మనేమో బర్రె కాడ పెండ తీస్తే పాలుపోస్తారని ఆడికి పోయింది. ‘మీ అమ్మ అచ్చే కల్ల మిషన్ కాడికి తయారుండు’ అన్నాడు. ‘నాన్న నేను స్కూలుకు వెళతానే’ అనగానే అయ్య గుర్రు మని నన్ను ఉరిమి చూశాడు. అప్పుడే వస్తున్న అమ్మ కళ్ళలో నేను మిషన్ పనికి వెళ్ళక తప్పదు అనే భావం కనిపించింది. అమ్మ అంతో ఇంతో సంతోషంతో ఉండాలంటే నేను వెళ్ళాలని నిర్ణయానికొచ్చాను. నన్ను సాలోల్ల బస్తిల కుట్లు నేర్చుకునే పని కాడ వదిలి వెళ్ళాడు అయ్య. ఎండాకాలం వచ్చే సమయం వరకు మిషన్ పని మొత్తం నేర్చుకున్నాను.

ఇది ఇలా ఉండగా ఒకరోజు సూర్యుడు నడినెత్తిపైకి వచ్చే సమయంలో అయ్య ఒకాయనను వెంట పెట్టుకొచ్చాడు. ఆయనను నన్ను సూడమన్నాడు. అమ్మవద్ద కెలితే ‘ఇల్లరికం చేయాడానికి వచ్చాడు సూడడానికి బక్కపల్చగా బాగానే ఉన్నాడ’ని చెప్పింది. సొట్ట బుగ్గలతో బక్కగా ఉన్నా, అప్పుడే నేను ప్రాయంలో ఉండటం వల్లనేమో కాని అందంగానే కనిపించాడు. పేరు నారాయణ అన్నారు. ఎదిరింటి ఎంకన్న ఏదో ఏళ్ళమీద లెక్కగట్టి, నాకూ నారాయణకీ బలం ఉంది, తొందరగా పెళ్లి చేయాలని చెప్పాడు. ఈ విధంగా అనుకున్న మూడు రోజులలో పెళ్లి జరిగింది. పెళ్లికి సుట్టాలిచ్చిన సామాను మూడు నెలలకు సరిపోను మిగిలింది. సామాను అయిపోయేనాటికి నా కడుపున నలుసు పడింది. నారాయణ బుద్ది తెలిసింది. తంబాకు తింటాడు, సంసారం ఖర్చులు పట్టించుకోడు. తింటాడు ఊరికనే ఉంటాడు. ఇట్లయితే ఎట్లా అని రాతిరి గట్టిగ అడిగితే, తెల్లారి ముంతపట్టుకొని వెళ్ళాడు. మధ్యాహ్నం అయిన రాలేదు. ఎదురింటి సీనయ్యకు పోను చేసి డిల్లీ వెళ్లినట్టు చెప్పమన్నాడట. ఆ విషయం సల్లగ చెప్పాడు.

010అమ్మ, నేను, అయ్య తలోవైపు ఏడ్సినాం. ఇల్లరికం అల్లుడు కొడుకు లాగా ఉంటాడు అనుకుంటే కొండెక్కి కోతిలాగయిండు. పెళ్ళికి తెచ్చిన అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నయి. పని చేయక తప్పదని బట్టలు కుట్టడానికి బయలుదేరాను. షాపుకు వచ్చి పోయే తోవలో అందరు ఓ రకమైన చూపులతో పలకరిస్తుంటే విషయం అర్థమయ్యి అన్నయ్యలు అని పిలిచా. వరుసలు కలిపే సరికి వైకుంటపాళీ లో పాము మింగినట్లు చల్లబడ్డారు. ఎనిమిది నెలలు నిండి తొమ్మిదవ నెల దగ్గర పడే సమయంలో డాక్టరమ్మ దగ్గరకు వెళితే ఏవేవో పరిక్షలు చేసి నీవు విశ్రాంతి తీసుకునే సమయంలో శ్రమ పడ్డందు వల్ల నీకు సాధారణ ప్రసవం జరుగదని పెద్ద ఆపరేషన్ (సిజేరియన్) కావలసిందే అని చెప్పింది. లేని యెడల తల్లికి పిల్లకి బరోస ఇవ్వలేనని చెప్పింది. అయ్య చేసేది ఏమి లేక ముప్పై వేల రూపాయలు అప్పు చేసాడు. ఆపరేషన్ చేసి ఆడపిల్లను చేతికిచ్చారు. ఆడపిల్ల పుట్టిందని ఏడవాలో అచ్చం నాలాగే ఉందని సంతోషపడాలో అర్థంకాలే. కాని అమ్మతనం పొందాననే సంతోషంలో చూడడానికి బొద్దుగా ముద్దుగా ఉందని ప్రేమ వాత్సల్యంతో ‘డుమ్మి’ అని ముద్దుగా పిలుచుకున్నాను. అందరు అదే పేరుతో పిలవసాగారు.

డుమ్మికి ఆరు నెలలు గడిచినా నారాయణ రాకపాయె. ఇది కాదన్నట్టు అప్పులోల్ల ఒత్తిడి పెరగడంతో పనికి పోదామని డాక్టరమ్మను అడిగితే ఇంకో రెండు నెలలు విశ్రాంతి తీసుకోమన్నది. నారాయణ అప్పుడొస్త, ఇప్పుడొస్త అని ఫోన్ చేసుడే తప్ప ఎప్పుడొస్తాడో తెలవది. డుమ్మికి పదకొండు సంవత్సరాలు పడ్డంక వచ్చాడు. పైసలు తెచ్చాడనుకుంటే అదీ లేదు. తాగుడు నేర్చిండు, ఏనుగు తెచ్చుకొని ఏనుగే తిన్నట్టు చేసిన కష్టమంతా ఓడగోట్టుకొని ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చాడు.

ఇట్లా తినుకుంటూ ఉంటే అప్పులు తీరినట్టేనని అతనిని ఏదైనా పని చేయమని పోరు పెట్టి నేను పని చేస్తున్న షాపుకు దగ్గరలో ఉన్న కిరాణంలో పనికి కుదిర్చాను. అయితే చేరిన కొన్ని దినాలకే తాగడానికి అడ్వాన్స్ తీసుకున్నడు. నేను షాపు సావుకారితో మాట్లాడి జీతం మొత్తం నాకే ఇవ్వమన్నాను. ఇలా చేసినగాని వచ్చిన పైసలు అప్పుల మిత్తిలకే సాలడంలేదు. అయ్య తాగి తాగి సుస్తి చేసి మంచానికి పరిమితమయ్యిండు. అమ్మ కష్టం ఇంటి ఖర్చులకే సాల్తలేదు.

ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే కులానికి తక్కువైన సీనయ్య ఎదురు పడ్డాడు. తనతో నా బాధంత వెల్లబొసుకున్నాను. నా గోడు విన్న సీనయ్య కళ్ళలో జాలి స్థానంలో కామం కనిపించింది. నీకు నా సహాయం ఉంటుంది కాని నువ్వు నాకు అది ఇవ్వాలి అన్నాడు. నా సంసార పరిస్థితులు మదిలో మెదిలి ఒప్పుకున్నాను. ఇలా చేయడం ఇష్టం లేకున్నా తప్పుచేయాల్సి వచ్చింది. ఇంటాయన వల్లో ఎదిరింటి సీనయ్య వల్లో మళ్ళీ నా కడుపు పండింది. ఇంతలో సీనయ్యకు లగ్గమయింది. డుమ్మి పెద్దదైయింది. పండుగను ఏదో ఒక విధంగా అప్పులు చేసి జరిపించాము కాని, డుమ్మి అబ్బాయిల వైపు అదోలా చూస్తుంటే దానిని లోపలకు పిలిచి మీ తాత నా సదువు మధ్యలో ఆపించబట్టి నేను పడ్డ కష్టమంతా సిగ్గువిడిచి చెప్పాను. అప్పుడు డుమ్మి నాతో – తాత ఆడది ఎంత చదివిన మగాడి మోకాలి కింద బతకాలి అన్న మాట అబద్ధం అనేటట్టు చదివి మగాడికి తలవంచుకోని విధంగా ఎదుగుతాను అంది.

ఇలా ఉండగా ఒకరోజు నారాయణ డుమ్మి పెళ్లి మాట ఎత్తగానే నేను పడ్డ కష్టాలు గుర్తొచ్చి ఇలాంటి కష్టాలు నా కూతురు పడకూడదని నిర్ణయించుకొని నారాయణపై రోకలి పైకి ఎత్తి దాన్ని గొప్ప చదువులు చదివిస్తానని అనగానే ఎంతనన్న చదివించు అంటూ ఇల్లు వదిలిన నారాయణ ఎక్కడికెల్లాడో ఎప్పుడొస్తాడో…!

*

రచయిత వివరాలు

photo

ఎ. నరసింహ చారి,

అర్. ఇటిక్యాల, రేగొడు మండలం, మెదక్

ఇష్టమైన రచనలు: చలం, వేమన రచనలు

Download PDF ePub MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2014, అక్టోబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , .

4 Comments

  1. కథలో మాండలీకం, వ్యవహారికం కలిసిపోయింది. ఇప్పుడిప్పుడే రాస్తున్నారు కాబట్టి ప్రముఖ కథలను పరిశీలించండి. కథలో వాక్య నిర్మాణం , స్పష్టత అవసరం .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.