cover

నిద్ర సహాయం

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన 9వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన ఇక్కడ.)

Download PDF ePub MOBI

రాత్రి 9:30 అయింది. భోజనం పూర్తి చేసి బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టాను. కిటికీ లోంచి గాలి చల్లగా వీస్తుంది. రాత్రి పూట ప్రపంచాన్ని గెలిచే చీకటి, నా చిన్న టేబుల్ ల్యాంప్ దగ్గర ఓడిపోయి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. టేబుల్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాను. కుర్చీలో కూచొని డైరీ తీసి రాయడం మొదలుపెట్టాను, రోజూకంటే ఉత్సాహంగా. దానికి కారణం నా ఫ్రెండ్ రాజా.

రోజూలాగే తెల్లారింది. నిన్నరాత్రి రాజా ఫోన్ చేసి రమ్మన్నాడు. నిజానికి నాకు వేరేపని ఉంది కానీ ఫోన్లో వాడి స్వరం విన్నాక ఏదో జరుగుతుందనిపించింది. అందుకే వాడిదగ్గరకు వెళ్లటానికి నిశ్చయించుకున్నాను. వెళ్లాక తెలిసింది అక్కడ నిజంగా ఏదో జరిగిందని.

రాజావాళ్ల ఇల్లు మరీ పెద్దది కాకపోయినా, మధ్యతరగతి ఇంటికన్నా నయంగానే కనిపిస్తుంది. కారుదిగి గుమ్మం మెట్లు ఎక్కుతుంటే సంభాషణ వినిపించింది.

“ఇలాచూడు, తప్పు చేసినవాడిని కారణాలు అడిగితే ప్రపంచం మొత్తం వెతుకుతాడు తనని తప్ప. కాని నేను అలా చెప్పట్లేదు కదా! నావల్లే తప్పు జరిగింది” రాజా స్వరంలో విసుగు కన్పిస్తుంది.

“నీ వల్ల తప్పు జరిగిందని ఒప్పుకోవటం పెద్దగొప్ప కాదు రాజా.. దానివల్ల ఎదుటి వాళ్ల మనసులు ఎంత బాధ పడతాయో తెలుసుకో” ఆడ గొంతు సమాధానం ఇచ్చింది. అది రాజా భార్య ‘అను’ది. వాళ్లిద్దరికీ పెళ్లయి మూడు నెలలు దాటింది.

“మనసు, మమతలాంటి వాటి గురించి నాకు చెప్పొద్దు అనూ.. అయినా నా వైపునుంచి చూస్తే అది తప్పేకాదు. కూతుర్ని రిసీవ్ చేసుకోమని బాస్ రిక్వస్ట్ చేస్తే వెళ్లాను. అక్కడ లేటయింది. దానికే ఇంత హైరానా చేస్తే ఎలా? నా వైపు నుంచి కూడా ఆలోచించు”

“నీకు మనసు, మమత లాంటివి అవసరం లేదు రాజా. కానీ అవి చాలా విలువైనవి. వాటిని అర్ధం చేసుకోవటం చేతకాక వదిలేసి, ప్రాక్టికాలిటీ అని పేరు పెట్టుకు తిరుగుతున్నావు”. సంభాషణ పక్కదారి పట్టడం గమనించాను. అప్పుడు అర్థమయింది నాకు, సమస్య లేటుగా రావటం గురించి కాదు ఇంకేదో ఉంది అని.. ఆలస్యం చేయకుండా తలుపుతీసి లోపలికి వెళ్లాను.

ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి కొట్టుకునే పొజిషన్లో ఉంటారని ఊహించుకున్న నాకు వాళ్లని చూస్తే ఆశ్చర్యమేసింది. రాజా కుర్చీలో కూర్చొని టీ తాగుతున్నాడు. అను వాడిప్రక్కన కూచొని ఉంది. నేను చూసేసరికి కళ్లు తుడుచుకుంటుంది.

నన్ను చూసిన రాజా కూర్చొని అలాగే ఉంటే, అను మాత్రం సర్దుకుంది. కానీ తను నవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలమయింది. మనది కాని పరిస్థితుల్లో ప్రయత్నాలు విఫలమవ్వటం సహజమే కదా! తన మొహం పై కన్నీళ్ల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నన్ను పలకరించి, టీ తెస్తానని చెప్పి లోపలికి వెళిపోయింది. నేను వెళ్లి రాజా ప్రక్కన కూచున్నాను. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నిముషాలు నెమ్మదిగా నడుస్తున్నాయి.

 “ఫెడ్రిక్ నీషే మనగురించి ఏం రాశాడో తెలుసా? ఒంటె లాంటి వాడు మనిషి. తనకు తానే మోకరిల్లి తన భుజాలమీద అనవసరమైన బరువులు ఎక్కించుకొని ఆ తర్వాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు”. రాజా ముందుగా మాట్లాడాడు. “తనని చూడు ఎంత బాధ పడుతుందో. అది నేను లేటుగా వచ్చినందుకు కాదు, ఒక అమ్మాయిని రిసీవ్ చేసుకోవటానికి వెళ్లినందుకు. దానిని సూటిగా చెప్పలేక విలువలు, ఆచారాలు అని చెప్తుంది”.

నేను సమాధానం ఇవ్వలేదు. అయినా జవాబు ఇవ్వటానికి అది ప్రశ్న కాదు, జీవితమనే ప్రశ్నకు వాడి జవాబు.

ఇంతలో అను టీ తీసుకొనివచ్చింది. తనని చూసిన రాజా నాతో “నువ్వు టీ తాగుతూ ఉండు. స్నానం చేసి వస్తా. బయటకు వెళ్దాం” అని లోపలికి వెళిపోయాడు.

అను నాకు టీ ఇచ్చి ప్రక్కన కుర్చీలో కూచుంది.

కొంతసేపటి తర్వాత మాట్లాడటం మొదలెట్టింది. “మనిషి మొదటి లక్షణం జీవించడమే. అలాగని జంతువులా జీవించకూడదు కదా! మనం బ్రతికే సమాజంలో కొన్ని విలువలు, కట్టుబాట్లు ఉంటాయి. అవి పాటిస్తేనే మనం మనుషులం లేకపోతే జంతువులకి మనకి తేడా లేదు.” మాట్లాడుతున్నదల్లా రాజా బయటకు వచ్చేసరికి ఆపేసింది. రాజా నా దగ్గరకు వచ్చి “వెళ్దామా?” అడిగాడు. సరేనని తలవూపాను.

009“రాజా, డూ యు నో వెన్ ద ప్రాబ్లెమ్ విల్ స్టార్ట్ ఇన్ ఎ రిలేషన్?” వెళిపోతున్న మాకు వెనకనుంచి ప్రశ్న వచ్చింది. రాజా వైపు చూసాను. ఒక్కసెకను ఆగి, తిరిగినడవటం ప్రారంభించాడు. ఇంకో రెండు అడుగుల్లో వెళిపోతామనగా మళ్లీ వినిపించింది. “ఇట్స్ వెన్ యు ప్రిఫర్ యు దేన్ ద అదర్”. అది విన్న రాజా జీవం లేని నవ్వు ఒకటి నవ్వి కారు ఎక్కి కూచొన్నాడు. చేసేది ఏమీ లేక నేను కూడా వెళ్లి కూచొన్నాను. కారు ముందుకు సాగిపోతుంది. కొంతసేపటి తర్వాత రాజా వైపు చూశాను. నిశ్శబ్ధంగా డ్రైవ్ చేస్తున్నాడు.

నేను ఆలోచనల్లోకి వెళ్లాను. “వీడు ఎప్పుడూ ఇంతే. ఇలానే ఆలోచిస్తాడు. ‘నువ్వు ఫీలయ్యే ఎమోషన్స్ వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేనపుడు వాటిని ఫీలవడం మానేయ్’ అన్న సిద్ధాంతాన్ని నమ్మి జీవిస్తున్నాడు. కాని వాడి భార్య అలా కాదు. ప్రతీ దాన్ని తనలోనే బాధపడుతుంది. ఆనందంవచ్చినా అంతే. తనకు కొన్ని కట్టుబాట్లున్నాయి. సమాజంలో విలువలతో బ్రతకాలి అని అనుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాజు ‘మ్యాన్ ఆఫ్ ప్రాక్టికాలిటీ’ అయితే, వాడి భార్య ‘ఉమెన్ ఆఫ్ ఎమోషన్స్’. వీళ్లలాగే ఇంకా చాలా మంది ఉంటారు, మ్యాన్ ఆఫ్ డామినేషన్ అని, మ్యాన్ ఆఫ్ మనీ అని… వీళ్లందరికీ పెద్ద తేడా ఉండదు.

“రాజాకి ఒక పేదవాడు కనిపిస్తే, ‘వాడి దగ్గర డబ్బు లేదు కదా, కుదిరితే వాడికి సంపాదించుకోవటానికి అవకాశం ఇవ్వు, లేకపోతే లేదు అంతే కాని వాడి పై జాలి పడితే వచ్చే లాభం ఏం లేదు’ అంటాడు. అదే వాడి భార్యకి కన్పిస్తే ‘అయ్యో! పాపం’ అని జాలిపడి ఒక రూపాయి ఇస్తుంది. ‘నేను సంపాదించుకున్న డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నాకు ఏంటి అవసరం?’ ప్రశ్నిస్తాడు ఇంకొక మ్యాన్ ఆఫ్ మనీ. అయితే మ్యాన్ ఆఫ్ డామినేషన్ అన్నది చిత్రమైన కారక్టర్. వీడికి పేదవాడు కన్పిస్తే రూపాయి వేయడం వేయకపోవడం అటుంచి వాడి పై అధికారం చలాయిస్తాడు. వీళ్లందరి ప్రవర్తన ఒకరిది ఒకరికి నచ్చకపోవచ్చు. నవ్వు కూడా తెప్పించవచ్చు. కానీ వీళ్లలో ఒకడు నిజానికి కట్టుబడితే, ఇంకొకరు విలువలకు కట్టుబడ్డారు. అలాగే ఒకడు డబ్బుతో ఆగిపోతే, వేరేవాడు అధికారానికి అలవాటు పడతాడు. ఏది ఏమైనా వీళ్లందరూ జీవితాన్ని సంతోషంగా జీవిస్తారు. ఓ విధంగా ఆలోచిస్తే అలా కట్టుబడి ఉండటం వల్లే వీళ్లు సంతోషంగా ఉంటున్నారేమో అనిపిస్తుంది. నిర్బంధాలు లేని జీవితం నడిసముద్రంలా నిశ్చలంగా ఉంటుంది. అదే అవి ఉంటే…”. ఇంకు అయిపోయిందనుకుంటా. పెన్ రాయట్లేదు. గట్టిగా రెండు సార్లు దులిపి మళ్లీ రాయటానికి ప్రయత్నించాను. “అదే అవి ఉంటే…” లాభం లేదు. పెన్నులో ఇంకు అయిపోయింది. నాలో ఓపిక కూడా అయిపోయింది.

పెన్ను, డైరీ మధ్యలో పడేసి గడియారం వంక చూశాను. గెలుపు, ఓటములతో సంబంధంలేకుండా పరిగెట్టే రేసుగుర్రాల్లా గడియారం మూడుముళ్లు తిరుగుతూనే ఉన్నాయి. డైరీ మూసి గట్టిగా నిట్టూర్చాను. లేచి, నెమ్మదిగా వచ్చి బెడ్ పై పడుకున్నాను. రేపు అనేది నాకు, నాచావుకు మధ్య దూరాన్ని ఒక రోజు తగ్గిస్తుంది. అలాంటి ఒక రేపుని ఆహ్వానించడానికి నిద్రని సహాయమడిగాను.. నిద్ర సరేనంది.

*

రచయిత వివరాలు

 2061

ఎమ్. అమృత సాయి

బిటెక్ విద్యార్థి

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ,

నూజీవీడు, కృష్ణాజిల్లా -521202

Download PDF ePub MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2014, నవంబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.