cover

మెమెంటో మొరి

cinema venuka kathaluమన ‘గజని’ సినిమాకు మూలం హాలివుడ్ సినిమా ‘మెమెంటో’ అని చాలామందికి తెలుసు. ఆ హాలీవుడ్ సినిమాకు మూలం ఒక కథ అని తక్కువమందికి తెలుసు. ఆ కథ పేరు ‘మెమెంటో మొరి’. ఈ కథ రాసింది ‘మెమెంటో’ దర్శకుడు క్రిస్టొఫర్ నోలన్ కు తమ్ముడైన జొనాథన్ నోలన్. కథకి ఐడియా తట్టగానే ఇతను అన్నయ్యతో పంచుకున్నాడు. తర్వాత ఇద్దరూ ఎవరి తోవలో వాళ్లు ఆ ఐడియాని డెవలప్ చేసుకున్నారు. క్రిస్టొఫర్ నోలాన్ దాన్ని సినిమా స్క్రిప్టుగా డెవలప్ చేసుకుంటే, జొనాథన్ ఒక కథగా డెవలప్ చేశాడు. ‘మెమెంటో మొరి’ అనే ఈ లాటిన్ పదబంధానికి అర్థం ‘చావుందని గుర్తుంచుకో’ అని. ఈ కథలో హీరో చంపానని కూడా గుర్తుంచుకోలేడు. కథకీ సినిమాకీ కొన్ని తేడాలున్నాయి.  ఈ నెల ‘సినిమా వెనుక కథ’గా ఈ ‘మెమెంటో మొరి’ కథకు అనువాదాన్ని ఇస్తున్నాం. సినిమా లాగే కథ శిల్పం కూడా వినూత్నంగా ఉంటుంది. ఒక నేరేటివ్ ఫస్ట్ పెర్సన్ లో ఉత్తరం శైలిలో నడుస్తుంది. ఒక నేరేటివ్ థర్డ్ పెర్సన్ లో నడుస్తుంది.

Download PDF ePub MOBI

మెమెంటో మొరి

జొనాథన్ నోలన్
భ్రమలు తొలిగించుటలో తూటాని మించింది లేదు” -హెర్మన్ మెల్విల్

నీ అంత్యక్రియలక్కూడా నువ్వు లేట్ గా వస్తావని ఎప్పుడూ జోక్ చేస్తుండేది మీ భార్య. గుర్తుందా? ఎందుకంటే ఆ సంఘటన జరగకముందు కూడా నువ్వింతే – ఎప్పుడూ లేట్ గా రావడం, అన్నీ మర్చిపోతుండడం.

తన అంత్యక్రియలకు కూడా లేట్ గా వెళ్లానా అని బహుశా ఈ క్షణంలో నువ్వాలోచిస్తుండొచ్చు. 

అనుమానం అవసరం లేదు, నువ్వు ఆ రోజు అక్కడే ఉన్నావు. తలుపు దగ్గర గోడ మీద అంటించి ఉన్న ఫోటోనే అందుకు సాక్ష్యం. సాధారణంగా అంత్యక్రియలప్పుడు ఎవరూ ఫోటోలు తియ్యరు. కానీ నీకీ విషయం గుర్తుండదని తెలిసే, బహుశా మీ డాక్టర్స్ అయ్యుండొచ్చు, ఈ ఫోటో తీసుంటారు. తనేమైందనే అనుమానంతో నువ్వామెను వెతకాలనుకున్నప్పుడల్లా నీకు కనిపించేలా ఆ ఫోటోని, పెద్ద సైజ్ లో చక్కగా బ్లో-అప్ చేసి సరిగ్గా తలుపు పక్కనే అంటించారు.

ఆ ఫోటోలో పువ్వులు పట్టుకుని ఉన్నాడే – అతనే నువ్వు. అక్కడ నువ్వేం చేస్తున్నావ్? ఇప్పుడు నువ్వీ ఫోటో చూస్తూ ఇది నీ తలుపు దగ్గర ఎవరంటించారని ఆలోచిస్తున్నావో, సరిగ్గా అలాగే, సమాధి మీద ఫలకం పై రాసిన పేరు చదువుతూ, నువ్వెవరి అంత్యక్రియలకు వచ్చావా అని ఆలోచిస్తున్నావు. అయినా కాసేపట్లో నీకు గుర్తుండని విషయాన్ని చదివి తెలుసుకోవడం ఏం లాభం?

తను లేదు, ఇక ఎప్పటికీ తిరిగి రాదు. ఈ విషయం తెలిసి నువ్విప్పుడు చాలా బాధపడుతూ ఉండుంటావు. నీ గుండె బద్దలయ్యుంటుంది. నీ బాధను నేనర్థం చేసుకోగలను. ఒక ఐదు నిమిషాలాగు. మహా అంటే పది నిమిషాలు. ఆ తర్వాత అంతా మామూలే.

నన్ను నమ్ముకాసేపట్లో అంతా మర్చిపోతావు. మరో కొద్ది నిమిషాల్లో తన కోసం మరో సారి వెతుక్కుంటూ తలుపు దగ్గరకి ; పరిగెత్తుతావు; ఫోటో చూస్తావు; నిజం తెలుసుకుంటావు; ఏడుస్తావు. ఇదంతా నీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే ఇలా ఎన్ని సార్లు జరగాలో? ఈ లోపల నీలోని అణువణువుకీ ఈ విషయం గుర్తుండిపోతుంది – ఒక నీ పిచ్చి బుర్రకి తప్ప!

నిరంతరం సతమతమవుతూ, గమ్యంలేని జీవితం నీది. అసలేం జరిగిందో బహుశా నీకర్థం కాకపోవచ్చు. అంటే నాకూ పూర్తిగా అర్థమైందని కాదు. బ్యాక్‍వర్డ్స్ అమ్నీషియా. విచిత్రమైన మరిమరుపు రోగం. ఇంకా చెప్పాలంటే నీ పరిస్థితిని CRS డిసీజ్ అంటారు. అంటే ఏంటని అడగొద్దు. నీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు.

నీకేం జరిగిందో నీకర్థం కాకపోవచ్చు. కానీ ఆమె కి ఏం జరిగిందో నీకు గుర్తు లేదా? డాక్టర్లు మాత్రం ఆ విషయాన్ని దాటవేస్తున్నారు. నా ప్రశ్నలకూ సమాధానం చెప్పరు. నువ్వున్న పరిస్థితిలో ఇవన్నీ మాట్లాడడం సరైనది కాదని వారి అభిప్రాయం. కానీ నీకు అసలేమీ గుర్తులేదంటే నమ్మను. నీకు వాడి మొహం గుర్తు లేదూ?

అందుకే ఇదంతా నీకు రాస్తున్నాను. వృధాప్రయాసే అయ్యుండొచ్చు; ఇదంతా ఎన్ని సార్లు చదివితే నా మాట మీద నీకు నమ్మకం కుదుర్తుందో కూడా తెలియదు. అసలు నువ్వీ రూం లో బందీగా ఎన్ని రోజుల్నుంచి ఉన్నావో కూడా నాకు తెలియదు. నాకే కాదు, నీకూ తెలియదు. కానీ నువ్విలా అన్నీ మర్చిపోతుండడంలో ఒక ప్రయోజనం ఉంది- నువ్వో చేతకాని వాడివని కూడా నువ్వు ఎప్పటికప్పుడు మర్చిపోతుంటావు.

ఇప్పుడు కాకపోయినా ఎప్పుడోకపుడు నువ్వీ పరిస్థితి నుంచి బయటకొచ్చి ఏదో ఒకటి చేయాలనుకుంటావు. అప్పుడైనా నువ్వు నన్ను నమ్మాలి. ఎందుకంటే నేను తప్ప నీకు సహాయం చేయగలగే వారెవరూ లేరు.

* * *

ఎర్ల్ ఒక దాని తర్వాత ఒకటిగా కళ్లు తెరిచాడు. గది పై కప్పు మొత్తం తెల్లటి టైల్స్ తో కప్పబడి ఉంది. అతని తల భాగానికి ఎదురుగా పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడిన ఒక ఛార్ట్ పేపర్ అంటించి ఉంది. అతను పడుకున్న దగ్గర్నుంచే ఆ అక్షరాలు బాగా కనబడుతున్నాయి. ఛార్ట్ పేపర్ మీద రాసి ఉన్న అక్షరాలను మరో సారి చదివాడతను. ఎక్కడ్నుంచో అలారం మోత వినిపిస్తోంది. గదంతా ఒక సారి చూశాడతను.

గదంతా తెలుపు రంగుతో నిండిపోయుంది. గోడలు, కిటికీలు, కిటికీలకున్న పరదాలు, గదిలో ఉన్న కుర్చీలు – అన్నీ తెలుపే! గది లో కిటికీ కి దగ్గరగా ఉన్న తెల్లటి డెస్క్ మీద నుంచి అలారం మోత వినిపిస్తోంది. బహుశా ఈ సమయంలోనే తనొక తెల్లటి బెడ్ మీద హాస్పిటల్ లో రోగులు వేసుకునే దుస్తులు ధరించి, కాళ్ళకి చెప్పులు తొడుక్కుని పడుకుని ఉన్నానని ఎర్ల్ కి అర్థమై ఉండాలి.

మరో సారి అతను గది పైకప్పు వైపు చూసి చార్ట్ పేపర్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్నది చదివాడు. ఇది నీ రూం. ఇది ఒక హాస్పిటల్ లో ఉంది. ప్రస్తుతానికి నువ్వు ఉండేది ఇక్కడే..

ఎర్ల్ తన బెడ్ మీద నుంచి లేచి గదంతా పరిశీలించాడు. మామూలు హస్పిటల్ గది కంటే చాలా పెద్దగా ఉందది – బెడ్ కి మూడు వైపు లా తెల్లటి టైల్స్ పరచబడి ఉన్నాయి. రెండు తలుపులు, ఒక కిటికీ. గది బయటకు చూశాడు. ఎదురుగా కొన్ని చెట్లు. అందంగా మలచిన పచ్చిక మైదానం. దూరంగా కనిపిస్తున్న ఒక నల్లటి తారు రోడ్. ఏవో కొన్ని సతతహరిత వృక్షాలు తప్పితే మిగిలిన చెట్లన్నీ ఆకులు రాలి మొండిగా నిలబడి ఉన్నాయి – బహుశా శీతాకాలం ముగుస్తుందేమో. లేదా ఎండాకాలం మొదలవ్వబోతుండొచ్చు.

గది లో ఉన్న డెస్క్ మొత్తం పోస్ట్-ఇట్ నోట్స్, నోట్ ప్యాడ్స్, నీట్ గా టైప్ చేయబడిన కొన్ని కాగితాలు, ఆ కాగితాల నిండుగా ఏవో జాబితాలు, సైకాలజీ కి సంబంధించిన పుస్తకాలు, ఫ్రేం చేయబడిన కొన్ని ఫోటోల తో నిండిపోయుంది. వీటన్నిటి పై భాగంలో ఉన్న సగం పూర్తి చేయబడిన క్రాస్ వర్డ్ పజిల్. ఆ పక్కనే ఎత్తుగా పేర్చబడిన న్యూస్ పేపర్ల గుట్ట మీద ఉంది అలారం క్లాక్. మోగుతున్న అలారం ని ఆపి తన భుజం వైపు అంటించిన సిగెరెట్ ప్యాకెట్ నుంచి ఒక సిగెరెట్ తీసుకున్నాడు. అగ్గిపెట్టె కోసం తన పైజామా పాకెట్స్ లో వెతికాడు. డెస్క్ మీద ఉన్న పేపర్స్ అన్నింటి కిందా గాలించాడు. డెస్క్ కి ఉన్న సొరుగులు లాగి చూశాడు. చివరికి కిటికీ పక్కన ఒక గోడకి అంటించి ఉన్న అగ్గిపెట్టె ని కనుక్కున్నాడు. అగ్గిపెట్టె పైనే రాసి ఉన్న మరొక నోట్. పెద్ద పెద్ద అక్షరాలతో, వెధవా, సిగెరెట్టా ? ముందు సగం వెలిగించి ఉన్న సిగెరెట్ చేతిలో ఉందేమో చూసుకో ! అని రాసుంది.

అది చదివి తనలో తానే నవ్వుకుంటూ, సిగెరెట్ వెలిగించి గట్టిగా ఒక దమ్ము లాగాడు ఎర్ల్. కిటికీ పక్కనే నీ దిన చర్య అని రాసి ఉన్న మరొక నోట్ అంటించబడి ఉంది.

రోజులో ప్రతి గంటకీ ఏమేం చెయ్యాలో అందులో నీట్ గా టైప్ చెయ్యబడి ఉంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ – నిద్రపోవడం . అలారం క్లాక్ వైపు చూశాడు. సమయం ఎనిమిది పదిహేను అయింది. కిటికీ లోనుంచి మరో సారి బయటకు చూశాడు. బయట వాతావరణం బట్టి ఉదయం అయ్యుంటుందని అనుకున్నాడు. తన చేతికున్న వాచీ చూసుకున్నాడు. టైం పదిన్నర అని చూపించింది. ఒక సారి గడియారాన్ని చెవి దగ్గర పెట్టుకుని విన్నాడు. తన వాచీలో ఎనిమిది పదిహేను కి టైం సెట్ చేసుకున్నాడు. తన దిన చర్య ప్రకారం ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకూ పళ్ళు తోమడం అని రాసి ఉంది. మరో సారి నవ్వుతూ బాత్ రూం వైపు వెళ్ళాడు ఎర్ల్.

బాత్ రూం లో కిటికీ తెరిచే ఉండడంతో కాస్తా చలిగా ఉంది. కిటికీ మూద్దామనుకుంటే కిటికీ పక్కనే పెట్టి ఉన్న యాష్ ట్రే, అందులో అప్పటికే సగం కాలి వెలుగుతున్న మరొక సిగెరెట్ కనిపించింది. చిరాగ్గా చూసి, దాన్ని ఆపేసి తన చేతిలో ఉన్న సిగెరెట్ ని యాష్ ట్రే లో ఉంచాడు.

టూత్ బ్రెష్ వైపు చూశాడు. అప్పటికే దాని మీద పళ్లు తోమగ వచ్చిన నురగ ఉంది. బాత్ రూం లో పుష్ బటన్ మోడల్ ట్యాప్ ఉంది. ఒక సారి వత్తితే కాసేపు నీళ్లు వచ్చాక దానికదే ఆగిపోతుంది. టూత్ బ్రష్ తీసుకుని నోట్లో పెట్టుకుని మందులు ఉంచే అల్మరా తెరిచి చూశాడు. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మాత్ర. మౌత్ వాష్ లిక్విడ్ కూడా ఒక సారికి సరిపోయేలా చిన్న ప్లాస్టిక్ సీసాలో ఉంది. కేవలం టూత్ పేస్ట్ మాత్రమే మామూలు సైజులో ఉంది. పళ్లు తోమడం అయ్యాక బ్రష్ ని టూత్ పేస్ట్ పక్కనే పెట్టబోతుంటే చూశాడు ఎర్ల్ – అల్మరా లో టూత్ పేస్ట్ పెట్టే చోట ఉన్న ఒక చిన్న పాటి కన్నంలో జాగ్రత్తగా మడిచి పెట్టి ఉన్న ఒక చిన్న కాగితం అది. మౌత్ వాష్ లిక్విడ్ ని పుక్కిళించి వాష్ బేసిన్ లోకి ఊశాడు. అల్మరా తలుపు మూసి అద్దంలో తనని తాను చూసుకుంటూ నవ్వుతూ అనుకున్నాడు – “పళ్లు తోమడానికి అరగంట అవసరమా?”

చేతిలో ఉన్న కాగితం జాగ్రత్తగా మడత పెట్టి ఉంది – టీనేజ్ యువకుడు రాసిన మొదటి ప్రేమ లేఖలా. ఎర్ల్ ఆ కాగితాన్ని జాగ్రత్తగా మడతలు విప్పి, అద్దం మీద పెట్టి నునుపుగా చేసి అందులో రాసి ఉన్నది చదివాడు.

ఇది నువ్వింకా చదువుతున్నావంటే నీ అంత పిరికి దద్దమ్మ ఎవడూ ఉండడు..

కాసేపు ఆ పేపర్ వైపే చూస్తూ, మరో సారి అందులో రాసి ఉన్నది చదివాడు ఎర్ల్. పేపర్ ని తిప్పి చూశాడు. అటు వైపు కూడా ఏదో రాసి ఉంది.

గమనిక : ఇది చదివాక తిరిగి అక్కడే దాచిపెట్టు .

మరోసారి రెండు వైపులా ఉన్నది చదివి, దాన్ని జాగ్రత్త మడిచి తీసిన చోటే మళ్లీ దాచిపెట్టాడు.

బహుశా ఇప్పుడే తన మొహం మీద ఉన్న గాయాన్ని చూసుకుంటాడు అతను. చెవి కింద భాగంలో మొదలైన ఆ గాయం తాలూకు మచ్చ అలా కొంచెం కిందకి పాకి తల భాగం లోకి మాయమయింది. తల కొంచెం తిప్పి గాయాన్ని అద్దంలో తీక్షణంగా పరిశీలించాడు. చూపుడు వేలితో గాయాన్ని మెల్లగా తాకుతూ, యాష్ ట్రేలో కాలుతున్న సిగెరెట్ వైపు చూశాడు. ఇంతలో అతని మదిలో హాఠాత్తుగా ఒక ఆలోచన మెదిలింది; హడావుడిగా బాత్రూం నుంచి బయటకి పరిగెట్టాడు.

తన రూంలోనుంచి బయటకు వెళ్లే ప్రయత్నంలో తలుపు తీస్తుండగా అతను ఆగిపోయాడు. తలుపు పక్కనే అంటించి ఉన్న రెండు ఫోటోలు అతన్ని ఆపాయి. MRI స్కానింగ్ ద్వారా తీయబడ్డ మొదటి ఫోటో అతన్ని ఆకర్షించింది. నాలుగు భాగాలుగా విభజించబడి ఉన్న ఆ ఫోటోలో ఎవరిదో పుర్రె భాగం కనిపిస్తోంది. పక్కనే స్కెచ్ పెన్ తో “నీ మెదడు “ అని రాసుంది. దాని వైపే తీక్షణంగా చూశాడు ఎర్ల్. ఏకకేంద్రక వృత్తాలతో కూడిన రంగు రంగుల బొమ్మలు. అన్నిటికంటే ముందుగా గోళాల్లా కనిపిస్తున్నవి తన కళ్లని గ్రహించాడు. వాటి వెనుక ఉన్నవి తన మెదడులోని రెండు లంబికలు. కొన్ని వృత్తాకారంలో, కొన్ని అర్థవర్తులాకారంలోనూ తిరిగిన మెలికలు. కానీ వీటన్నిటి మధ్యలో నల్లగా ఒక మరక- రేగిపండులోపల దూరిన పురుగులా, తన చెవి భాగం నుంచి పైకి పాకి చివరికి మెదడు మధ్య భాగంలో వికృతంగా, చూడ్డానికి ఎండిపోయిన పువ్వులా ఉంది.

కాసేపటికి పక్కనే ఉన్న మరో ఫోటో వైపు చూశాడు. ఒక సమాధి వద్ద చేతిలో పువ్వులు పట్టుకుని నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఫోటో అది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కాస్తా వంగి సమాధి మీద ఫలకం పై రాసి ఉన్న పేరు చదువుతున్నాడు. ఇదంతా అద్దాల హాలులో ఉన్నట్టో లేదా అనంతాన్ని చిత్రీకరించే మొదటి దశగానో ఉంది : ఒక వ్యక్తి ఒంగి ఫోటోలో ఉన్న వ్యక్తిని పరిశీలిస్తున్నాడు. ఫోటోలో ఇదే వ్యక్తి ఒంగి ఒక ఫలకాన్ని పరిశీలిస్తున్నాడు. ఎర్ల్ చాలా సేపు అదే ఫోటో వైపు చూస్తుండిపోయాడు. బహుశా ఇప్పుడు అతను ఏడవొచ్చు. లేదా చాలా సేపు ఆ ఫోటోనే చూస్తుండిపోవచ్చు. కానీ చివరికి తన బెడ్ దగ్గరకు వచ్చి పడుకుంటాడు. బలవంతంగా కళ్లు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు.

బాత్ రూంలో యాష్ ట్రేలో ఉన్న సిగెరెట్ క్రమంగా వెలుగుతోంది. అలారం క్లాక్ లోని లోహపు వలయం విచ్చుకుని మరోసారి మోగుతోంది.

ఎర్ల్ ఒక దాని తర్వాత ఒకటిగా కళ్లు తెరిచాడు. గది పై కప్పు మొత్తం తెల్లటి టైల్స్ తో కప్పబడి ఉంది. అతని తల భాగానికి ఎదురుగా పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడిన ఒక ఛార్ట్ పేపర్ అంటించి ఉంది.

* * *

ఇకపై సాధారణంగా జీవించడం నీకు అసాధ్యం. అది నువ్వు తెలుసుకోవాలి. నీకు పెళ్లి కాదు. పెళ్లాం పేరు గుర్తుండని వాడిని ఎవరు చేసుకుంటారు? ఒక వేళ చేసుకున్నా పిల్లల్ని మాత్రం కనొద్దు. తన పిల్లలెవరో గుర్తులేని వాడూ ఒక తండ్రేనా? చచ్చినా నీకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. వృత్తిరీత్యా మతిమరుపు రోగం ఉండడం ఒక సౌకర్యంగా భావించేది ఒక్క వ్యభిచారంలో మాత్రమే. ఇంకాస్తా ఆలోచిస్తే బహుశా నీకు రాజకీయాలు సరిపోవచ్చు.

నీ జీవితం ఇంకింతే. అంతా అయిపోయింది. ఎట్టి పరిస్థుతుల్లోనూ నిన్నీ హాస్పిటల్ నుంచి బయటకు పంపిండమంటూ జరగదు. మహా అంటే నీ పరిస్థితిని నీకు తెలియచేసి, నీకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి తమ బాధ్యతలను కాస్తా తగ్గించుకుందామనే ఇక్కడి డాక్టర్ల ప్రయత్నం.

ఇప్పుడు సమస్యల్లా “ఉండడమా, ఊడ్డమా” అని కాదు. ఎందుకంటే నువ్వున్నా లేనట్టే. అసలీ పరిస్థితినుంచి బయటకు రావాలనుకుంటున్నావా లేదా అనేది ఇంకా మిగిలున్న ఒకే ప్రశ్న. ఎందుకంటే అసలు నీకు పగ, ప్రతీకారమనే పట్టింపులేమైనా ఉన్నాయా అసలు?

ఎందుకంటే ఆ పట్టింపు చాలా మందిలో ఉంటుంది. కొన్ని రోజులు, వారాలు, నెలల పాటు ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ పథకాలు పన్నుతారు; పగ తీర్చుకునే అవకాశాల కోసం ఎదురుచూస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ, ఆ జ్వాల చల్లారిపోతుంది. పగ కరిగిపోతుంది. మొదట్లో ఉన్న ప్రేరణ చచ్చిపోతుంది. కాలం అన్నింటినీ దొంగలిస్తుంది. చివరికి మనుషుల్లో క్షమాగుణాన్ని నింపుతుంది. చూడ్డానికి పిరికితనం, క్షమాగుణం ఒకే పోలికతో ఉంటాయి. కాలమొక గజదొంగ.

ప్రతీకార జ్వాలలపై కాలం కొంచెం నీళ్లు పోస్తే, భయం మరిన్ని నీళ్లు పోస్తుంది. ఆ జ్వాల ఇంకా ఆగకపోతే చట్టం, న్యాయం ఎలాగూ ఉన్నాయి. మెల్లిగా తలూపుతూ, నీ బాధ అర్థం చేసుకోగలం; కానీ క్షమించడం గొప్ప లక్షణమని నీతులు వల్లిస్తాయి. నీకు అన్యాయం తలపెట్టిన వాళ్ళలాగే దిగజారక మనసున్న మనిషిలా ఎదగమని చెప్తాయి. అప్పటికీ వినకపోతే తీసుకెళ్లి జైల్లో పెడతామని బెదిరిస్తాయి.

కానీ నువ్విప్పుడుంటున్నది జైల్ కాదా? బహుశా నీ గదికి పెద్ద తాళం వేసుండకపోవచ్చు; నిన్నెవరూ కాపలా కాస్తుండకపోవచ్చు. ఎందుకంటే వాళ్లకి తెలుసు – నువ్వో బతికున్న శవానివి. ఎవరో ఒకరు గుర్తు చేస్తే తప్ప తినడమూ, వెళ్లడమూ తెలియని వెర్రిమాలోకానివి.

సరే! అన్ని ప్రశ్నలకూ కాలమే సమాధానం చెప్తుందని సర్దుకుందామంటే, ఈ పరిస్థితిలో అది నీకు వర్తించదు. కాదా? నీది పది నిమిషాల జీవితం. మళ్లీ మళ్లీ అదే! మర్చిపోయి మన్నించేద్దాం అనుకుంటే నీకసలు మర్చిపోవాలనే విషయమే గుర్తుండదే!

ఇంతకుముందైతే నువ్వూ చాలా మందిలా మన్నించి మర్చిపోదామనుకునే వాడివే! అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుటి నువ్వు వేరే. అప్పటి జీవితంలో కనీసం సగమైనా కాదు; ఒక చిన్న భాగానివి. అంతే! పదినిమిషాల్లో – పుట్టి, పెరిగి, మరణించి – మళ్లీ పుట్టే రకానివి.

ఇది నీ బలహీనత. కానీ బలహీనతే ఒక్కొక్కసారి బలమవుతుంది. ఎందుకంటే అదే మొదటి ప్రేరణ. బహుశా నువ్వీ గదిలో బోరున ఏడుస్తూ కూర్చుంటే చాలనుకుంటుండొచ్చు. గోడ మీద అంటించిన ఫోటోలు చూసుకుంటూ, పోస్ట్ ఇట్ నోట్స్ లో రాసుకున్న జాబితాలను చదువుకుంటూ, నీ పరిమిత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ జూలో బధ్రపరిచిన ఎక్సాటిక్ పక్షిలా బతికెయ్యాలనుంది కదూ?

కానీ నాకు తెలుసు. అలా ఉండడం నీకు సాధ్యం కావటం లేదు. ఎందుకంటే నీ జ్ఞాపకాల సమాహారంలో చేరిన ఒక కొత్త జ్ఞాపకం. నీ చిట్టచివరి జ్ఞాపకం. వాడి మొహం. వాడి నుంచి కాపాడమని కోరుతూ చూసిన నీ భార్య మొహం.

అంతా అయిపోయాక నువ్వు మళ్లీ నీ చిన్న లోకానికి తిరిగి వచ్చెయ్యొచ్చు. నువ్వు, నీ జ్ఞాపకాల సమాహారం. బహుశా అప్పుడు నీ గది ఇంత సౌకర్యంగా ఉండకపోవచ్చు. కానీ నీ చిన్న లోకంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు వాడు నీకు దొరకాలి. చెయ్యాల్సింది చెయ్యాలి.

నేను చెప్తున్నదే కరెక్ట్ అని నీకు తెలుసు. ఇదంతా జరగాలంటే నువ్వు చాలా కష్టపడాలనీ నీకు తెలుసు. ఇదంతా నీకు అసాధ్యమనిపించవచ్చు. కానీ మన ప్రయత్నంలో బలముంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. కానీ నీకు ఎక్కువ సమయం లేదు. నీ దగ్గర ఉన్నది సరిగ్గా పదే పది నిమిషాలు. తర్వాత మళ్లీ అంతా కొత్తగా మొదలవుతుంది. అందుకే నీకున్న టైంలోనే ఏదో ఒకటి చెయ్యాలి.

* * *

ఎర్ల్ కళ్లు తెరిచాడు. చుట్టూ చీకటి, ఏమీ కనిపించటం లేదు. అలారం క్లాక్ మోగుతోంది. సమయం మూడు గంటల ఇరవై నిమిషాలు. కిటికీలోనుంచి ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. ఎర్ల్ లేచి లైట్ వేసే ప్రయత్నంలో టేబుల్ మీదున్న వస్తువులను కింద పడేశాడు. పచ్చని వెలుతురుతో రూం వెలిగిపోయింది. గదిలోని ఫర్నిచర్, గోడలు, బెడ్ మీద దుప్పటి అన్నీ బంగారు రంగులో మెరుస్తున్నాయి. వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. గది పై కప్పు మొత్తం పచ్చటి టైల్స్ తో కప్పబడి ఉంది. అతని తల భాగానికి ఎదురుగా పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడిన ఒక ఛార్ట్ పేపర్ అంటించి ఉంది. అతను పడుకున్న దగ్గర్నుంచే ఆ అక్షరాలు బాగా కనబడుతున్నాయి. ఛార్ట్ పేపర్ మీద రాసి ఉన్న అక్షరాలను మరో సారి చదివాడు. కాసేపటికి గది నాలుగు వైపులా చూశాడు.

గది మొత్తం ఖాళీగా ఉంది. కిటికీ దగ్గర మాత్రం ఒక డెస్క్ ఉంది. డెస్క్ మీద ఒక్క అలారం క్లాక్ తప్పితే ఏమీ లేవు. బహుశా ఇప్పుడే ఎర్ల్ తన వైపో సారి చూసుకుంటాడు. తను మంచి బట్టలు ధరించి, కాళ్లకు బూట్లు కూడా వేసుకుని ఉన్నాడని గమనించాడు. బెడ్ మీద నుంచి లేచి డెస్క్ దగ్గరకు నడిచాడు. గది మొత్తం ఖాళీగా ఉంది. ఆ గదిలో అంతకుముందు ఎవరైనా నివసించే వారంటే ఎవరూ నమ్మరు. అక్కడక్కడా గోడలమీద అంటుకుని ఉన్న సెలోపేన్ టేప్ మరకలు తప్పితే గోడలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. పుస్తకాలు, ఫోటోలు, ఏమీ లేవు. కిటికీలోనుంచి ఆకాశంలోని చంద్రుడు వైపు చూశాడు. బయట గార్డెన్ లో గడ్డి చంద్రుని వెలుగులో మెరిసిపోతోంది.

మోగుతున్న అలారం క్లాక్ ని ఆపాడతను. తన ముంజేతికి అంటిచి ఉన్న తాళం చెవుల వైపో సారి చూశాడు. దేనికోసమో వెతుకుతూ డెస్క్ లోని డ్రాయర్స్ అన్నీ తెరిచి చూశాడు. తన ప్యాంట్ జేబులో అతనికి వంద డాలర్ల్ నోట్ల కట్ట ఒకటి దొరికింది; దాంతోపాటే ఒక సీల్ చేయబడిన ఎన్వలప్ కవర్ దొరికింది. గది మొత్తం తిరిగి చూశాడు. కాసేపటికి బాత్ రూం లోకి వెళ్లాడు. అక్కడక్కడా పడిఉన్న కొన్ని సిగెరెట్ పీకలు మరియు సెలోఫేన్ టేప్ ముక్కలు తప్పితే ఇంకేమీ లేవు.

ఎర్ల్ పరాకుగా తన మెడ మీద ఉన్న గాయపు గాటుని తడుముకుంటూ వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. పైన సీలింగ్ కి అంటించి ఉన్న చార్ట్ పేపర్ లో రాసి ఉన్నది చదివాడు. లే. బయటకు వెళ్లు. ఇప్పుడే.! వీళ్లు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. .

ఎర్ల్ కళ్లు మూసుకున్నాడు.

* * *

నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు చెయ్యాల్సిన పనులన్నీ ఒక లిస్ట్ గా రాయడం నేర్పించారు గుర్తుందా? ఆ రోజుల్లో స్కూల్ హోమ్ వర్క్ లిస్ట్ నీ చేతి వెనుక రాసుకునేవాడివి. ఒక వేళ నువ్వారోజు మర్చిపోయి ముందే స్నానం చేసేస్తే ఆ రాతలు చెరిగిపోయేవి; ఇచ్చిన హోమ్ వర్క్ చెయ్యకుండా స్కూల్ కి వెళ్లేవాడివి. క్రమశిక్షణ లేదని నిన్ను తిట్టేవాళ్ళు. అందుకే నువ్వు ఏదీ మర్చిపోకుండా శాశ్వతంగా ఉండేలా ఎక్కడైనా రాయాలని వాళ్లు ఆలోచించేవాళ్లు.

ఒకవేళ, మీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు ఇప్పుడు నిన్ను చూస్తే నవ్వి నవ్వి చచ్చిపోతారు. నువ్వెలా ఉండాలని వాళ్లు కోరుకున్నారో సరిగ్గా అలాగే తయారయ్యావు. కనీసం ఒకటికి పోవాలన్నా నువ్వు నీ లిస్ట్ తిరగేసి చూడాల్సిందే.

వాళ్లు ఆ రోజుల్లో సరిగ్గానే ఆలోచించారు. నిన్నీ గందరగోళంనుంచి బయటపడెయ్యాలంటే ఈ జాబితా లే కరెక్ట్.

ఒక నిజం చెప్తాను. మనిషి-అంటే మామూలు సాదా సీదా సగటు మనిషి సైతం, ఒకే రకమైన లక్షణాలు కలిగిఉన్న ఒకే వ్యక్తి కాదు. మనిషి ఒకడే. కానీ తనలో అనేక మంది ఉంటారు. తన మెదడు నుంచి నిరంతరం తరలివెళ్లే ఎలిక్ట్రిక్ సిగ్నల్స్ కి బానిస మనిషి. అతన్ని 24 తో భాగాహారం చేసి, ఆ వచ్చిన భిన్నాల్ని 60 తో భాగాహారం చేసి…అలా నిరంతరం మనిషి ముక్కలవుతూనే ఉంటాడు. అతను ఒక అర్థం పర్థం లేని ప్రదర్శనలో పాత్రధారి. కార్యక్రమంలో ఈ భాగం ఒక పాత్రధారికి అంకితం. ఆ పాత్ర టైం అయిపోగానే తెర వెనుక ఎదురుచూస్తున్న ఎంతో మంది తమ ఛాన్స్ కోసం పోరాడుతూ చేసే తీవ్రమైన గందరగోళం. ప్రతి వారం, ప్రతి రోజు – నిరంతరంగా సాగే ఒక నిరర్థక నాటకం మనిషి జీవితం. ఒక కోపిష్టి తన ప్రదర్శన అవగానే తన టోకెన్ ని ఒక నిరాశావాదికి అప్పగిస్తాడు, అతను ఒక కామాంధుడికి కి ఛాన్స్ ఇస్తాడు. అతని తర్వాత ఒక పిరికివాడు, ఆ పై ఒక మాటకారి. ప్రతి మనిషీ ఒక సమూహం – మూర్ఖుల కూటమి.

మన జీవితాల్లో అతి పెద్ద విషాదమేంటో తెలుసా?

ప్రతి రోజూ, కొన్ని నిమిషాల పాటు ప్రతి మనిషీ ఒక మేధావిగా మారుతాడు. ఆ సమయంలో అతనికి గొప్ప మేధో సామర్థ్యం అలవడుతుంది. జీవితాన్ని కమ్ముకున్న కారు మబ్బులు తొలిగిపోతాయి. గ్రహాలన్నీ ఒకే సరళ రేఖ పైకి వస్తాయి. ఆ సమయంలో అతనికి స్పష్టతతో కూడిన అంతర్దృష్టి తో జీవితపు రహస్యాలు అవగతమవుతాయి. ఇప్పట్నుంచి నేను సిగెరెట్ తాగడం మానెయ్యాలనుకుంటాడు. లేదా కోటి రూపాయలు సంపాదించే మార్గం తెలుసుకుంటాడు; ఇంతలోనే శాశ్వతమైన ఆనందానికి మార్గాన్నీ తెలుసుకుంటాడు. ఇదే మన విషాద జీవితం. ఆ కొద్ది నిమిషాలపాటు విశ్వం యొక్క రహస్యాలు మనకి తెలిసిపోతాయి. జీవితం వీధి గారడీ వాడు చూపే ఒక గమ్మత్తు.

మేధావి ప్రదర్శన అయిపోతుంది. ఆ తర్వాత జీవితపు పగ్గాలు తర్వాత పాత్రధారికి అందించాల్సిందే. బహుశా ఆ తర్వాత వచ్చే వాడికి ఇవన్నీ పట్టకపోవచ్చు. హాయిగా వెళ్ళి ఏసి హోటల్ లో బిర్యానీ తినడమే అతని లక్ష్యమై ఉండుండొచ్చు. అప్పటివరకూ మేధావికి అవగతమైన అంతర్ధృష్టి, ప్రకాశమైన తెలివితేటలు, కలిగిన మోక్షము ఏ మూర్ఖుడికో, స్వార్థపరుడికో, నిద్రావస్థకలవాడికో అప్పగించాల్సి వస్తుంది.

ఈ గజిబిజి నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. ఈ మూర్ఖుల కూటమిని నువ్వు నియంత్రించాలి. ఈ మందనంతా ఒక వరుసలో నిలబెట్టి నువ్వు ముందుండి నడిపించాలి. ఇదంతా చెయ్యాలంటే నువ్వొక లిస్ట్ తయారు చెయ్యాలి.

ఈ లిస్ట్ నీకు నువ్వు రాసుకునే ఉత్తరం లాంటిది. మిగిలిన వెధవలందరికీ అర్థమయ్యేలా సులభంగా రాయబడిన ఒక నియమావళి. ఇదే నీ జీవితానికి మాస్టర్ ప్లాన్. లిస్ట్ లో సూచించినట్టుగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవడం; అవసరమైతే తిరిగి ఆ సూచనలనే మరోసారి అవలంబించడం.

నీ సమస్య కూడా దాదాపుగా ఇదే. కాకపోతే ఇంకొంచెం క్లిష్టమైనది.

నీకు చైనీస్ రూం ఆట గుర్తుందా? ఒకడు ఒక గదిలో కూర్చుని ఉంటాడు. అతని ముందు చైనీస్ భాషలో రాసి ఉన్న కొన్ని కార్డులు పేర్చబడి ఉంటాయి. అతనికి చైనీస్ భాష రాదు. కానీ కార్డులని ఎలా గుర్తుపట్టాలో అని అతనికర్థమయ్యే భాషలో ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో రాసినట్టుగా ఒక్కొక్క చైనీస్ కార్డ్ ని గుర్తుపట్టి ఒక క్రమంలో పేర్చుకుంటే పోతే ఒక చైనీస్ జోక్ తయారవుతుంది. అతనికి చైనీస్ భాష రాదు కాబట్టి అతనికా జోక్ అర్థం కాకపోవచ్చు. కానీ ఆ పుస్తకంలో రాసింది రాసినట్టుగా అనుసరిస్తే జరగాల్సిన పని జరిగిపోతుంది.

అయితే నీ పరిస్థితి కొంచెం వేరు. కూర్చుని పని చెయ్యడానికి నీకొక గది లేదు. ఉన్న గది నుంచి నువ్వు పారిపోయావు. కాబట్టి నీ నియమావళి కి సంబంధించిన జాబితా ఎప్పుడూ నీతో పాటే ఉండాలి. ఇంకొక తేడా కూడా ఉంది. సూచనల ప్రకారం నడుచుకోవాల్సింది నువ్వే; నీకా సూచనలు అందించాల్సిందీ నువ్వే. గతకాలపు నువ్వు వర్తమానంలోని నీకు సూచనలు అందచేస్తావు.

ఒక్కొక్కటిగా నిచ్చెన మెట్లు ఎక్కడం, మెల్లిగా ఒక్కొక్క మెట్టూ దిగడం. అంతే. సింపుల్. నీ లిస్ట్ లోని ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్లడం.

కాకపోతే ఒక విషయం. నువ్వు అనుసరించాల్సిన నియామాలన్నీ ఎప్పుడూ నీకు కనిపించే చోట రాసుకోవాలి.

* * *

బజ్ జ్ జ్ జ్ జ్ మని మోత వినిపిస్తోంది అతనికి. అలారం క్లాక్ ఆపడానికి చెయ్యిచాచబోయాడు. చెయ్యి కదల్లేదు.

ఎర్ల్ కళ్లు తెరిచాడు. ఎదురుగా పొడవాటి వ్యక్తి నిలబడి తన వైపే కోపంగా చూస్తున్నాడు. ఏంటన్నట్టు చూసి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఎర్ల్ గది చుట్టూ చూశాడు. అంతా చీకటిగా ఉంది కాబట్టి డాక్టర్ రూం అయితే కాదని అనుకున్నాడు.

ఇంకా ఏదో ఆలోచించేలోపలే తీవ్రమైన నొప్పి తన మెదడులోకి పాకింది. కుర్చీలో పెనుగులాడాడు. మంట పెడుతోన్న చేతిని వదిలించుకోవాలనుకున్నాడు. చెయ్యి కదల్లేదు. ఆ పొడవాటి వ్యక్తి మరో సారి కోపంగా చూశాడు. కుర్చీలో కొంచెం సర్దుకుని కూర్చుని ఆ వ్యక్తి చేతులవైపు చూశాడు.

బజ్ మన్న శబ్దం, శరీరాన్ని మండిస్తోన్న బాధ – ఈ రెండింటికీ కారణం ఆ వ్యక్తి చేతిలో ఉన్న తుపాకీ లాంటి పరికరం. దానికి బ్యారెల్ లేదు. దాని స్థానంలో గిర్రున తిరుగుతోన్న ఇనుప సూది ఉంది. ఆ సూది ని గిర్రున తిప్పుతూ ఆ వ్యక్తి ముందుకు జరుగుతుండగా ఎర్ల్ ముంజేతిమీద కొన్ని అక్షరాలు ప్రత్యక్షమవుతున్నాయి. తల కొంచెం ముందుకు వంచి ఆ అక్షరాలను చదువుదామని ప్రయత్నించాడు ఎర్ల్. కానీ కుదర్లేదు. తల వెనక్కి వాల్చి సీలింగ్ వైపు చూస్తుండిపోయాడు.

చివరికి పచ్చబొట్టు వేయడం అయిపోవడంతో అతని చేతిలో ఉన్న మెషీన్ ని ఆపాడు ఆ వ్యక్తి. ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి కావాల్సిన మందు తేవడానికి పక్క రూం లోకి వెళ్లాడు. బహుశా ఆ పచ్చబొట్టు వేసినతను సాయంత్రం ఇంటికెళ్లాక ఎర్ల్ గురించి, అతను తీసుకొచ్చిన నోట్ గురించి, తను వేసిన పచ్చబొట్టు గురించి తన భార్యకు చెప్తుండొచ్చు. అంతా విన్న అతని భార్య పోలీసులకు చెప్పడం మంచిదని అతనితో చెప్పవచ్చు.

ఎర్ల్ తన ముంజేతిని పై ఉన్న అక్షరాలను చూసుకున్నాడు. చర్మం నుంచి ఉబికి వచ్చాయా అక్షరాలు. అరచేతి దగ్గర మొదలయ్యి మోచేతి వరకూ పెద్ద పెద్ద అక్షరాలతో నేను నీ భార్యను మానభంగం చేసి చంపేశాను అని రాసి ఉంది.

* * *

ఈ రోజు నీ పుట్టిన రోజు. అందుకే నీకొక బహుమతి తెచ్చాను. అసలైతే నీకో బీర్ తెద్దామనుకున్నాను, కానీ నువ్వు బీర్ తాగాక దాని పరిణామాలెలా ఉంటాయో అని అనుమానం వచ్చింది.

అందుకే నీ కోసం ఈ చిన్ని గంట తెచ్చాను. డబ్బులెక్కడివని ఆలోచించొద్దు. నీ వాచీ తాకట్టు పెట్టాను. అయినా నీకు వాచీతో పనేముంది?

ఈ గంట తో నీకేం పని అని నీకు అనుమానం రావొచ్చు. బహుశా నీ జేబులో ఉన్న ఈ గంటను చూసిన ప్రతి సారీ దీంతో నాకేం పని అని నీకు అనుమానం వస్తుంది. కానీ నీకు ప్రతి అనుమానానికి, ప్రతి ప్రశ్నకు సమాధానం రాసేంత చోటు లేదు ఇప్పుడు.

నిజానికి ఇదొక జోక్. ఒక ప్రాక్టికల్ జోక్. కాకపోతే నిన్ను చూసి నేను నవ్వటంలేదు. నీతో పాటే నవ్వుతున్నానంతే.

నీ జేబులోనుంచి ఈ గంట తీసుకుని చూసి, ఇది నీ జేబులో ఎందుకుందని నీకు అనుమానమొచ్చినప్పుడల్లా, చితికిపోయిన నీ చిన్నమెదడులోని ఒక చిన్న భాగానికి ఈ జోక్ గుర్తొచ్చి, ఇప్పుడు నేను నవ్వుతున్నానే, అలా నవ్వు తెప్పిస్తుంది.

నిజానికి ఆ గంటతో నీకు పనుంది. అదేంటో నీకిది వరకే తెలుసు. ఆలోచిస్తే నీకే తెలుస్తుంది.

పాతరోజుల్లో జనాలకి ఒక పిచ్చి భయం ఉండేది. తాము బతికేఉన్నామని తెలియక తమని సజీవంగా సమాధి చేస్తారని వాళ్ల భయం. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడంటే వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది కానీ, ఆ రోజుల్లో శవపేటికలో ఉన్న శవం సడన్ గా మేలుకోవడం లాంటివి జరుగుతూ ఉండేవట. అందుకే బాగా డబ్బున్న వాళ్ల శవ పేటికలకు కొన్ని రంధ్రాలు చేసి, అందులో ఏర్పాటు చేసిన పైపుల ద్వారా ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేసేవారట. ఒక వేళ లోపల ఉన్నవాడు అనుకోకుండా బతికి బయటపడితే గాలాడక నిజంగానే మరోసారి చచ్చే ప్రమాదముందని ఇలాంటి ఏర్పాటు చేసేవారు. కానీ అలా బతికినవాళ్లు కూడా వాళ్లని రక్షించేవాళ్లు లేక మరోసారి చనిపోయేవాళ్లంట. అందుకే అలాంటి ప్రమాదాలనుంచి జనాల్ని రక్షించడాని కోసమే, ఈ రంధ్రాల నుంచి ఏర్పరిచిన ఒక తాడు ద్వారా సమాధి మీద ఉన్న గంట కొట్టగలిగే ఏర్పాటు చేసేవారు.

ఇదంతా చెప్తుంటే నాకు నవ్వొస్తోంది. ఏ బస్ లోనో, హోటల్ లోనో నువ్వు అనుకోకుండా నీ జేబులో ఉన్న ఈ గంట చూసుకుని, అది నీ దగ్గర ఎందుకుందని ఆశ్చర్యపోతావు. ఏమో ఆ గంటని ఏం చేయాలో తెలియక మోగించినా మోగిస్తావు. తలుచుకుంటేనే నవ్వొస్తోంది.

హ్యాపీ బర్త్ డే, రా!

కానీ మనిద్దరి ఈ ఉమ్మడి సమస్యకు పరిష్కారం కనుక్కొన్నది నువ్వా? లేదా నేనా? అందుకే ఎవరికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలో తెలియడం లేదు. జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటేనేం, మొత్తానికి మన సమస్యకు ఇది అద్భుతమైన పరిష్కారం.

ప్రశ్నలు నీలోనే; సమాధానాలు నీలోనే!

గ్రీటింగ్ కార్డ్ ల మీద రాసే కొటేషన్ లా అనిపించినా ఇది నిజం. మనిద్దరిలో ఈ ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు కానీ, హ్యాట్సాఫ్. నేను మాట్లేడేది నీకర్థం కావటం లేదు కదా! అయినా ఫర్వాలేదు. మన మేథోమథనం ఫలించింది. అయినా అప్పుడప్పుడు అసలు తామెవరో గుర్తుచేసుకోవడానికి అందరికీ అద్దాల అవసరం ఉంటుంది. నీకూ అంతే!

* * *

“ఇప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు. ఈ విషయం మీకు గుర్తు చెయ్యడం మా బాధ్యత”, ఫోన్ లోని మెకానికల్ వాయిస్ లో ఈ సందేశం వినడం ఇది రెండో సారి. ఎర్ల్ కళ్లు తెరిచి, ఫోన్ రిసీవర్ ని పక్కన పెట్టాడు. బెడ్ వెనక ఉన్న నాసిరకం చెక్క బోర్డ్ పై పెట్టబడి ఉందా ఫోన్. టివి ఆన్ చేసే ఉంది. ఏవో రంగు రంగు ఆకారాలు టివి స్క్రీన్ పై కదులుతున్నాయి. ఎర్ల్ బెడ్ మీద పడుకున్నాడు. సీలింగ్ మీద ఒక పెద్ద సైజు అద్దం అంటించి ఉంది. అక్కడక్కడా పగుళ్లతో, వెలిసిపోయిన ఆ అద్దంలో తనని తాను చూసుకుని ఆశ్చర్యపోయాడు ఎర్ల్. వయసు పైబడిపోయి, వెంట్రుకలు నెరిసిపోయి, నిటారుగా నిలుచుని విచిత్రంగా ఉన్నాడు. బట్టలైతే పూర్తిగా ధరించి ఉన్నాడు కానీ చాలా చోట్ల చిరుగులు బాగా కనిపిస్తున్నాయి.

తన ఎడమ చేతి మణికట్టు భాగాన్ని తడిమాడు. అక్కడ ఉండాల్సిన వాచీ లేదు. అసలు అంతకుముందు వాచీ పెట్టుకునే అలవాటే లేనట్టుగా అక్కడ చర్మం రంగు కూడా మిగతా చర్మం రంగుతో కలిసిపోయింది. కానీ అక్కడే బాగా కనిపించేలా ఒక నల్లటి బాణం గుర్తు పైకి పాకుతూ చొక్కా లోపలకి మాయమయింది. ఆ బాణం వైపే కాసేపు తీక్షణంగా చూశాడు ఎర్ల్. బహుశా ఇప్పుడు దాన్ని తుడిచేసే ప్రయత్నం అతను చెయ్యకపోవచ్చు. చొక్కా ని భుజాల మీదకి మడిచాడు.

ఆ బాణం గుర్తు అతని ముంజేతిమీద రాసిన అక్షరాలను సూచిస్తోంది. అక్కడ రాసిన వాక్యాన్ని ఒకటికి రెండు సార్లు చదివాడు ఎర్ల్. ఆ వాక్యం చివరలో మరో బాణం గుర్తు భుజం వైపు సూచిస్తోంది. ఎర్ల్ తన చొక్కా విప్పాడు.

తన ఛాతీ మీద ఉన్న వివిధ రకాలైన రాతలను తలవంచి చూసుకున్నాడతను. కానీ ఏమీ అర్థం కాక పైన ఉన్న అద్దం వైపు చూశాడు.

భుజం మీద నుంచి పాకిన బాణం గుర్తు, నడుము పై భాగం వైపు సూచిస్తోంది. ఆ బాణం గుర్తు సూచించిన చోటు వైపు చూశాడు ఎర్ల్. అక్కడ ఒక వ్యక్తి మొహం చిత్రించబడి ఉంది. బట్టతల, పిల్లి గడ్డం తో -పోలీసులచే గీయించబడిన నేరస్థుల చిత్రంలా, ప్రత్యేకమైన లక్షణాలతో ఉందతని మొహం.

పొట్ట మరియు ఛాతీ భాగంలో మిగిలిన చోటల్లో కొన్ని వాక్యాలు, కొన్ని నియమాలు, ఉపయోగపడే కొంత సమాచారం రాసి ఉంది. తన శరీరం మీద రాసున్న అక్షరాలన్నీ తిరగేసి రాసి ఉన్నాయి. అద్దంలో చూసుకుంటే అన్నీ సరిగ్గా కనిపించాయి.

చివరికి ఎర్ల్ లేచి కూర్చుని, చొక్కా గుండీలు పెట్టుకుని పక్కనే ఉన్న డెస్క్ దగ్గరకు చేరుకున్నాడు, డెస్క్ మీద ఉన్న నోట్ ప్యాడ్ నుంచి ఒక కాగితం తీసి రాయడం మొదలు పెట్టాడు.

* * *

ఇది చదివే సమయానికి నువ్వెక్కడుంటావో కూడా నాకు తెలియదు. అసలు నువ్విదంతా చదువుతావని కూడా నేననుకోవటం లేదు. అసలు ఇది చదవాల్సిన అవసరం కూడా నీకు లేదు.

అసలు మనిద్దరం మళ్లీ ఎప్పటికీ కలుసుకోమనే ఆలోచనే బాధ కలిగిస్తోంది. అదేదో ఒక ఇంగ్లీష్ పాటొకటుంది - “By the time you read this note, I’ll be gone.”

ఇక మన పని పూర్తి అయ్యే సమయం దగ్గరపడింది. మనం మన గమ్యానికి చాలా దగ్గర్లో ఉన్నామనిపిస్తోంది. ముక్కలన్నీ ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ ఇంత దాకా వచ్చాం. వాడు దాదాపుగా దొరికిపోయినట్టేమహా అంటే ఈ రోజో రేపో. అంతే!

అసలు మనమింతవరకూ ఎలా వచ్చామని ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. చెప్పుకుంటే అదంతా ఓ పెద్ద కథ అవుతుంది. కానీ చెప్పుకోవడానికి నీకా కథంతా గుర్తుండాలి కదా? ఒక విధంగా నీకిదింతా గుర్తుండకపోవడమే మంచిది.

ఇప్పుడే నాకొక ఆలోచన వచ్చింది. బహుశా నీకు ఉపయోగపడవచ్చు.

నీకో విషయం తెలుసా? ఈ భూమ్మీద అందరూ కలియుగాంతం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అసలా అంతిమ ఘడియలు గడిచిపోలేదని మనకెలా తెలుసు? దేవుడు నిర్ణయించిన ఆ జడ్జ్‌మెంట్ డే వచ్చి వెళ్ళిపోయిందేమో! ఎవరికి తెలుసు? ఇవన్నీ మనకు తెలిసి జరుగుతాయా ఏంటి? యుగాంతం జరిగిపోయిందేమో! స్వర్గానికి తరలించాల్సిన వారి ఎంపిక జరిగిపోయి, వారినక్కడికి తరలించడం కూడా జరిగిపోయుండొచ్చు. దేవుడు పెట్టిన పరీక్షలో ఫెయిలయిపోయి ఈ లోకంలో పట్టించుకోకుండా మిగిలిపోయిన అవశేషాలు మాత్రమే మనం. బతికున్న శవాలమని మర్చిపోయి, ఏదో ఒక రోజు మనల్ని కూడా దేవుడు స్వర్గానికి తరలించకపోతాడా అనే ఆశగా మనం ఎదురుచూస్తున్నాం.

ఒక వేళ ఇదే నిజమైతే మనం ఏం చేసినా ఫర్వాలేదు. ఆశలు లేవు. అంచనాలు లేవు. ఒక వేళ నువ్వతన్ని కనుక్కోలేకపోయావనుకో - ఏం ఫర్వాలేదు. ఎందుకంటే ఇక ఇక్కడ ఎటువంటి పట్టింపులూ లేవు. ఒక వేళ నువ్వతన్ని కనుక్కున్నావనుకో, అప్పుడు కూడా అంతే! జరగబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అతన్ని చంపెయ్. ఎందుకంటే లోకంలో ఇక పరిణామాలు గురించి పట్టించుకునే నాథుడే లేడు.

ఈ ఇరుకు గదిలో కూర్చుని దీని గురించే నేనాలోచిస్తున్నాను. గోడల మీద ఓడల బొమ్మలు. బహుశా మనమే సముద్ర తీరపు పట్టణంలోనే ఉండిఉంటాం. ఇప్పుడు నువ్వు నీ కుడి చేతిని చూసుకుంటూ, అది నీ ఎడమ చేతికంటే ఎందుకు నల్లగా ఉందని ఆలోచిస్తుంటే, నీకేం చెప్పాలో నాకూ తెలియదు. బహుశా మనం చాలా రోజులుగా కార్లో ప్రయాణం చేస్తు ఉన్నామేమో! ఇంకో సంగతి. నీ చేతికున్న వాచీ ఏమైందో నాకూ తెలియదు.

మరి ఈ తాళం చెవులన్నీ ఏంటి? ఏమో నాకు తెలియదు. అందులో కొన్ని ఇళ్ల తాళం చెవులు, కారు తాళం చెవులు, ఇంకా కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. అసలు మనమింతకుముందు ఏం చేస్తుండే వాళ్లం?బహుశా వాడిని నువ్వు వెతికి పట్టుకున్నాక వాడేమనుకుంటాడో? ఇంతబతుకూ బతికి దినిమిషాల్లో అంతా మర్చిపోయే ఒక వెర్రిమాలోకానికి దొరికిపోయిందకు తనంత వెధవ లేడని తిట్టుకుంటాడేమో!

ఇంకాసేపట్లో నేను వెళ్లిపోతాను. ఈ పెన్ కింద పెట్టి కళ్లు మూసుకుంటాను. కావాలంటే నువ్వప్పుడు ఇదంతా చదువుకోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నువ్వు తెలుసుకోవాలి. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ విషయం నేనే నీకు చెప్పాలి. ఎందుకంటే ఈ విషయం చెప్పే వాళ్లెవరూ నీకు మిగల్లేదు. మిగిలిన వాళ్లెవ్వరూ నీకీ విషయం చెప్పరు.

* * *

ఎర్ల్ కళ్లు పెద్దవి చేసుకుని కారు కిటికీ లోనుంచి చూస్తున్నాడు. అతని కళ్లల్లో ఆనందం తెలిసిపోతోంది. వీధిలో పోగవుతున్న జనాల్ని చూస్తుంటే అతని మొహం మీద ఒక చిరునవ్వు ప్రత్యక్షమయింది. ఆ వీధిలో ఉన్న ఒక ఇంటి తలుపు దగ్గర ఉన్న శవం చుట్టూ జనాలు గుమిగూడుతున్నారు.

ఆ చనిపోయినవాడు చూడ్డానికి లావుగా ఉన్నాడు. చచ్చాక కూడా వాడి కళ్లు తెరుచుకునే ఉన్నాయి. బట్టతల, పిల్లి గడ్డం. చూడ్డానికి పోలీసులచే గీయించబడిన నేరస్థుడి ఫోటోలా ఉంది వాడి మొహం. బాగా ప్రత్యేకంగా తెలిసినవాడిలా ఉన్నా, వాడూ మనలాంటి ఒకడు.

వాడి శవాన్ని చూస్తూ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు ఎర్ల్. కారు ఆ వీధిలోంచి కదిలింది. కారా? కారని ఎవరు చెప్పారు? అది పోలీస్ వ్యాన్ అయివుండొచ్చు. లేదా ట్యాక్సీ కూడా అయ్యుండొచ్చు.

కారు ముందుకు కదిలి ట్రాఫిక్ లో కలిసిపోయింది. కనిపించినంత దూరం వరకూ ఆ శవం ఉన్నవైపే, మెరుస్తున్న కళ్లతో చూస్తుండిపోయాడు ఎర్ల్. శవం చుట్టూ గుమిగూడుతున్న జనాలను దాటుకుని కారు దూరంగా వెళ్లిపోతుండగా తనలో తానే నవ్వుకున్నాడు.

కాసేపటికి అతని మొహంపై ఉన్న చిరునవ్వు మెల్లగా అదృశ్యమైంది. అతనికేదో గుర్తొచ్చింది. తాళం చెవులు వెతుక్కునే విధంగా మెల్లిగా జేబులు తడుముకున్నాడు. అతనికి కావాల్సిందేదో దొరకక హడావుడిగా జేబులంతా వెతికాడు. కానీ చేతికి వేసున్న బేడీల కారణంగా అతనికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. జేబులో ఉన్న ఒక్కొక వస్తువునే బయటకు తీసి సీట్ మీద పెట్టాడు. కొంత డబ్బు. కొన్ని తాళం చెవులు. కొన్ని కాగితాలు.

చివరిగా అతని జేబులోనుంచి బయటపడిందొక గుండ్రటి లోహపు వస్తువు. ఎర్ల్ కి కంగారెక్కువైంది. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ని పెన్ కావాలని అడిగాడు. వాళ్లిద్దరి మధ్య ఏర్పరచిబడి ఉన్న ప్లాస్టిక్ డివైడెర్ కారణంగా ఎర్ల్ మాటలు డ్రైవర్ కి వినిపించలేదనుకున్నాడు. ఇంతలోనే, బహుశా అతనికి తన భాష అర్థం కాలేదేమో అనుకున్నాడు. లేదంటే ఈ పోలీసాయనకు నేరస్థులతో మాట్లాడే అలవాటు లేదేమో! ఏమైతేనేం అవతలి వ్యక్తి నుంచి ఉలుకూ పలుకూ లేదు. ఎట్టి పరిస్థుతుల్లో ఎర్ల్ కి పెన్ దొరికే అదృష్టం లేనట్టుంది.

కారు ఒక స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వేగంగా వెళ్లింది. ఎర్ల్ తన ప్రతిబింబాన్ని రేర్ వ్యూ మిర్రర్ లో చూసుకున్నాడు. ఇప్పుడతను ప్రశాంతంగానే ఉన్నాడు. కారు మరొక సందులోకి మలుపు తిరిగింది. సీట్ మీద ఉన్న లోహపు వస్తువు “చింగ్” మని మోగుతూ కిందపడింది. అదొక లోహపు గంట. దాని మీద అతని పేరుతో బాటు కొన్ని తేదీలు కూడా చెక్కబడి ఉన్నాయి. వాటిలో మొదటి తేదీని ఎర్ల్ గుర్తు పట్టాడు : అది అతను పుట్టిన సంవత్సరం. ఆ రెండో తేదీ ఏంటో అస్సలు గుర్తుకురాలేదు అతనికి.

ఆ గంటను చేతికి తీసుకుని అటూ ఇటూ తిప్పుతుండగా, ఎర్ల్ దృష్టి తన మణికట్టు వైపు మళ్లింది. వాచీ ఉండాల్సిన చోటు వైపు చూశాడు. అక్కడొక బాణం గుర్తు పైకి సూచిస్తోంది. ఎర్ల్ ఆ బాణం గుర్తునే అనుసరిస్తూ తన చొక్కాని పైకి మడిచాడు.

* * *

నీ అంత్యక్రియలక్కూడా నువ్వు లేట్ గా వస్తావు,” అని అంటుండేదామె. గుర్తుందా? దీని గురించి ఆలోచించే కొద్దీ అదేమంత ప్రత్యేకమైన విషయం కాదనిపించింది. తన కథని తనే త్వరగా ముగించాలని తొందరపడే వెధవ ఎవడైనా ఉంటాడా?

అయినా నేనసలు లేట్ గా వచ్చానన్న విషయం నాకెలా తెలుస్తుంది? నా వద్ద అసలు వాచీనే లేదు. అసలు దాన్నేం చేశానో కూడా నాకు తెలియదు.

అయినా నీకు వాచీతో పనేంటి? అదొక పురాతన వస్తువు. నీ చేతికి వేలాడుతోన్న అనవసరమైన బరువు. కాలాన్ని నమ్మే నీ గతకాలపు రోజులొకక చిహ్నం.

ఆగు. అది కొట్టేసెయ్. కాలాన్ని నువ్వు నమ్మకపోవడం కాదు; కాలమే నిన్ను నమ్మటం లేదు. అయినా ఈ కాలంతో మనకు పనేంటి? వర్తమానంలో జీవితం ఎంత చెత్తగా ఉన్నా భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉండబోతుందని ఆశపడే వెధవాయివి కాదు నువ్వు. ఈ క్షణంలో అంతా శూన్యం. మరు క్షణం ఏదో జరగబోతుందనే ఎదురుచూడ్డం. ఒక శూన్యం నుంచి మరో శూన్యం లోకి తోయబడడం. కాలపు రెక్కలు పట్టుకుని, తమకు జరిగిన అన్యాయాలను, వాటిని తలపెట్టిన వారికి దూరంగా తరలిపోతూ - కాలమే అన్నింటికీ పరిష్కారం చూపెడుతుందనే అబద్ధాన్ని గట్టిగా నమ్ముతూ బతికెయ్యడం.

నువ్వు వాళ్లలా కాదు. నీలో ఏ లోపమూ లేదు. అందరికీ కాలం మూడు రకాలుగా అవగతమవుతుంది. కానీ మనకి కాలమంటే ఒకటే. ఏకత్వం. ఒక క్షణ కాలం. గడియారపు అక్షం నువ్వు, గడియారపు ముళ్లు నీ చుట్టూ తిరుగుతాయి. నీ చుట్టూ కాలం కదలాల్సిందే తప్ప కాలం నిన్ను కదిలించలేదు. నిన్ను ప్రభావితం చేసే సామర్థ్యం అది కోల్పోయింది. అదేంటో అంటారు కదా? కాలమొక గజదొంగనా? కానీ కాలం నీ దగ్గర్నుంచి ఏం దొంగలించలేదు. ఒక్కసారి మనం కళ్లు మూసుకుని తెరిస్తే చాలు మళ్లీ అన్నీ కొత్తగా మొదలవుతాయి. తాజా గా విరిసిన గులాబీల వలే జీవితం మళ్లీ కొత్తగా అమలవుతుంది.

కాలం ఒక హాస్యాస్పదమైనది. ఒక ఊహోభరితమైన ఆలోచన. మనం పట్టించుకోవాల్సిందల్లా ఈ ఒక్క క్షణమే. ఇదే క్షణం మళ్లీ మళ్లీ – కొన్ని లక్షల సార్లు. నన్ను నమ్ము. ఇదే క్షణాన్ని మళ్లీ మళ్లీ పునరావృత్తం చేసుకునే ప్రయత్నం చేస్తూ – ప్రయత్నం మాత్రం తప్పదు – పోతే చివరికి నీ జాబితాలోని తర్వాత అంశానికి తప్పక చేరుకుంటావు.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అనువాదం, నవంబర్, సినిమా వెనుక కథలు and tagged , , , , , , , .

4 Comments

  1. వెంకట్ సిద్ధారెడ్డి గారు, మెమెంటో కథను తెలుగులోకి అనువదించి పిడిఎఫ్ రూపంలో దిగుమతి చేసుకునే సౌలభ్యం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ సినిమాను నేను మొదటి సారి చూసినప్పుడు సరిగా అర్థం చేసుకోలేకపోయాను. రెండవసారి, మూడవసారి చూస్తూ వుండగా కొద్దిగా అర్థమైంది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.