irlachengi kathalu

కిలి – నేను – మాయక్క

Download PDF ePub MOBI

‘కోదండరెడ్డి సేద్దేనికి అంత ఎత్తినోడు గాడబ్బా’ అని మా సిన్నపెదనాయిన సింతోపులో అందురిముందర అనిన మాటను దల్చుకోని శానా మదనపడేటోడు మా నాయిన.

‘వాళ్ల మాదిరిగా సెరువుకింద నేలలో సేద్దిమయితే నేను గూడా గబురు కన్నయ్య – సిత్తూరు సిన్నయ్యే. ఈ సవిటి నేలలో వొచ్చి సెయిమను ఆయన్ను. అప్పుడు తెలస్తాది ఎవురు సేద్దేనికి ఎత్తినోడో’ అని మా నాయిన నిష్ఠూరపొయినాడు మాయమ్మ దెగ్గిర.

మా బాయి నానుకోను పది గుంట్ల కయ్యొకటుండేది. అది వుత్త సవుడునేల. ఆ గుడ్డంలో ఎప్పుడూ సెరుకుదోటే నాటేటోడు మా నాయన. సవిటి నేల వల్లనేమో సెరుకు పిచ్చి బలంగా పట్టేదికాదు. పల్సగా గోంకట్లి మాదిరుండేది. ఇంకా లోపల అక్కడక్కడ సెరుకుతోట గానిక్కి కొట్టేటప్పిటికి కూడా బారెడు పొడుగ్గూడా పెరగలేక పెరిగిన తోటను జూసిన మా పెదనాయిన ఆ మాటనకుండా ఎట్లా వుంటాడు. మా బాగుగోరే వోడే గదా! బాదతోనే అనుంటాడు.

రోసానికి బొయిన మా నాయిన ఎంత అల్లాడి ఆకులు మేసినా అదట్లే ఏడ్సేది. ‘థూఁ’ నీయమ్మా సెరుకుదోటా. ఇట్ల గాదుండు అని మర్దా మొదలకుండా మా యమ్మ వొద్దని ఎంత మొత్తుకున్న్యా ఇనకుండా దున్ని పారేసినాడు.

అదనూ పదునూ జూసి వొడ్లు నారు బోసినాడు. సెరువుమన్ను దోలించినాడు. ఆ పదిగుంట్లనూ కాపీ పొడిమాదిరిగా దుక్కిదున్ని నీళ్లు బెట్టి అడుసులో మడగ్గట్టిదున్ని, అండజెక్కి నీళ్లు బెట్టినాడు. ఒక ఆరేడుబండ్ల ఆగ్గొట్టి పోసి తొక్కినాడు. కొనేరు మాదిరిగా వున్ని ఆకయ్యల్ను జూసి మా యమ్మ లోపల్లోపలే ఎంతో మురిసిపొయ్యింది. దిబ్బలో వుండే పేడెరువంతా దాని యదాన్నే గొట్టి మడినాటి మొగలాయనిపించుకున్న్యాడు మా నాయిన. అప్పుడు పిల్సుకోనొచ్చినాడు వాళ్ల సిన్నసెల్లి కిలిని మా సేద్దిగాడు బాలడు.

లేత పసుపురంగులో స్యామంచి తోటకు సెల్లిలనేట్టుగావుంది మా వొరిమడి. మెడనిండా నగలేసుకోని సిగ్గుతో తలొంచుకున్ని కొత్త పెండ్లికూతురు మాదిరిగా వొడ్ల సరాలతో తలదించుకోనుంది వొరిపైరు. గుంపులు గుంపులుగా వొచ్చిన గువ్వలు ఎన్నుల మింద వాలి తొక్కి కుళ్లాగించి పొట్టనిండా తినడమే గాకుండా వొడ్లగింజల్ని ఇదిలించి పారేస్తా వుండాయి. రొండుపూటలా గువ్వల్దోలే పనిని కిలికప్పగించినాడు మా నాయిన.

తెల్లారీతెల్లారంగానే గిలకల మాదిరిగా సిన్నరెక్కల్ని గిలగిలలాడించుకుంటా తూరుపు దిగ్గునుంచి గువ్వలు గుంపులు గుంపులుగా వొచ్చి మడిమింద వాలతా వుండాయి.

మా యమ్మ తెల్లార్తో ఇంట్లో పనంతా సేసుకోని మాకు ఉప్పిండో, ఉడుకన్నమో, సద్దన్నమో క్యారీరుగట్టించి ఇస్కూలుకంపించినాక రాత్రి గెంజి నీళ్లలో ఏసి పెట్టిన సంగటి ముద్దల్ని ఉప్పేసి కలుపుకోని బాయికాడికి సద్దిబోసిరాను పొయ్యేది.

ఆ పొద్దు ఆదివారం. మా యమ్మ బాయికాడికి ఎలబారతా వుంది. ‘అమా నేనూ వొస్తానుండు మా’ అని పొండ్లు గూడా తోముకోకుండా మాయమ్మెనక బణ్ణ్యాను.

‘నీ కింకేం పంగల్యా. నువ్వొచ్చాడ సేద్దాన్ని పింగటించ బోదువుగాని. ఆర్నెల్ల పరీచ్చలు దెగ్గిర బడతా వుండాయి. కుదురుగా ఇంటికాన్నే వుండి సదుముకో’ అని సద్ది గుండాయిల్ని నెత్తిమింది కెత్తుకునింది. మాయమ్మొక పది బారలు బొయినాక మాయమ్మకు దెలీకుండా పిల్లి నడక నడ్సుకుంటా మాయమ్మెంట బణ్ణ్యాను నేను.

కొండని పెండ్లాం సచ్చినప్పుడు గెరిగెత్తి నోళ్ళు బెట్టుకున్న్యాట్లుగా మాయమ్మ రొండు సద్ది గుండాయిల్ని ఒకదాని మిందొకటి బెట్టుకొని బోతావుంటే సెరువుకట్ట మలుపు దిరిగే దాకా మాయమ్మ కండ్ల బళ్లేదు నేను. మాయమ్మ మలుపు దిరిగి కనిపించకుండా పొయ్యిందో లేదో వొళ్లు అదురు బట్టుకునింది నాకు. ఆడుండే మర్రిమానుకే మా వూరి గోయింద పిల్ల వురిబోసుకోని సచ్చిపోయింది. గోయింద పిల్ల ఎనకనే వొచ్చి నన్ను పట్టుకుంటాడేమో అని బయపడి మాయమ్మ దెగ్గిరికి పరిగెత్తి నాను. అప్పుడు తిరిగి సూసింది మాయమ్మ.

‘సదువుకో పాపా అంటే ఇర్లసెంగి మాదిరిగా సెట్లెంట పుట్లెంట తిరగడానికి తయారయినావా? నిన్నెవురూ కారూంచేవాళ్లు లేరనా’ అని అర్సింది. మళ్లీ నన్నేమనలేదు మాయమ్మ. నేను సెర్లో కయ్యిలో వుండే సెరుకుదోటలో సెరికించుకోని తినుకుంటా మాయమ్మోళ్లుండే సోటికి బొయినాను.

అప్పిటికే మా నాయిన గలాసులోకి సిన్న గుండాయిలో వుండే మజ్దిగి సద్ది బోసుకొని మాడికాయి వూరగాయి నంచుకుంటా తాగతా వుండాడు. నన్ను సూసి మాయమ్మ మాదిరిగా ‘ఎందుకొచ్చినావ’ని తిడ్తాడనుకుంటారేమో! మా నాయినెప్పుడూ తిట్టడు. ఇస్కూలికి బోకున్నా గెయ్యాల్ది మాయమ్మే కొట్టేది, తిట్టేది. మానాయినేమీ అనడు.

తాగతా తాగతా ‘పాప సద్దాగిందా’ అని అడిగినాడు మా నాయిన ‘నీ కూతురు అణకవైన తునక గదా! పండ్లు గూడా తీటకుండా సెరుగ్గానిగాడతా వుండేది సూడు’ అనింది.

బాలడు కపిల దోల్తా వుండాడు. కపిలి బానలో నీళ్లు కాల్వలో బడ్తావుండాయి. నేను కుశాలుగా సెరుకుదినుకుంటా కాళ్లను నీళ్లలో తపతపా గొట్టి ఆట్లాడు కుండా వుండా.

మా నాయిన గెనిమిలో వుండే పండ్లుదోమే ఆకు పెరుక్కోనొచ్చి నలిపి నా పండ్లకేసి తీటినాడు. నోట్లో నీల్లు బోసి పుక్కిలించమన్న్యాడు.

మాయమ్మ లోలోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ‘ఇబ్బుడే బిడ్డి తప్పటడుగులేస్తా వుండాది. పాపం పసిబిడ్డి కదా! పండ్లు దోమకుంటే ఎట్లా? అబ్బా కూతురి సంబడాలు సూడ్డానికి రొండు కండ్లేడ సరిపోతాయి’ అని ఆయమ్మ కులుకు యాడమాకు దెలిసి పోతాదోనని ‘ఇంగ కడిగింది సాలుగాని రా’ అని కసిరింది.

నేను సద్దాగను కూసున్నానో లేదో అప్పుడొచ్చింది కిలి. ఎండ పొద్దెక్కతా వుంటే గువ్వలు రాలే దంట. ‘రెడ్డి గెనిమిలో కసువు గోయమన్న్యాడు’ అని సెప్పింది.

గెనిమికుండే బుర్దమన్ను గిల్లుకోని లొటా బుటా పండ్లు దోముకోని నీళ్లు పుక్కిలించి దొరువులో కూంచింది. మా నాయిన కపిల దోల్ను బోయి బాలన్నంపించినాడు. బాలడు కూడా వాళ్ల సెల్లిమాదిరిగానే పొండ్లు దోముకున్న్యాడు. నల్లంగా వుండే కిలి నోట్లో పండ్లు తెల్లంగా తళతళా మెరస్తావుండాయి.

బాలడు మిరపతోటలోకి బోయి నాలుగు పచ్చిమిరకాయిల్ని తెంచుకోనొచ్చి కిలికి రొండిచ్చినాడు.

ఇద్దురూ పక్కపక్కన కూసుంటే ఒకేసారి సద్దిబోసింది మాయమ్మ. ఇద్దురూ ఒకేసారి దోసిండ్లు బుట్న్యారు. ఇద్దురు సేతుల్లోనూ సూపుడేలు బొట్నేలు మద్దిలో మిరక్కాయలుండాయి. దోసిండ్లలో సద్ది బీరాకు మాదిరిగా పర్సుకోని వాల్లు నోటిదెగ్గిర బెట్టుకొని తాగే కొందీ వంకాయాకంతయి నడీ మిద్దిలో కొచ్చి కాలీ అయిపోతావుండాది. అంతే నేను తాగతావున్ని మజ్జిగి సద్గి గలాసును గెనింమింద బెట్టి మిరపతోట్లోకి పరిగెత్తి రొండు పచ్చిమిరపకాయల్ను దెచ్చుకోని వాళ్ల మాదిరే గొంతుక్కూసిన్నాను. దోసిట్లో వాళ్లకు దెచ్చిన సద్దే బొయమని వుడికాడిరచేసినాను.

‘నీకు బోస్తే వాళ్లగ్గావద్దా?’

‘పొయ్‌మా అంతుండాదే సద్గింకా’ అన్న్యాడు బాలడు.

దోసిలి కారకుండా బట్టుకోను రాలా. సగం కిందా సగం పావడమిందా కారిపోతావుంది సద్ది. ‘ఈ ఎత్తు బారం దాంతో పెద్ద తలనొప్పయి పొయ్యింది. నాకు’ మాయమ్మ ఇసుక్కునింది.

‘సినపాపా, ఇట్ల సూడమ్మా, ఇట్టబట్టుకో, యాళ్ల మద్దిలో సందులిడొద్దు’ అని కిలి, బాలడు ఇద్దురూ నాకు సద్గాగేది నేర్పించినారు.

మజ్జిగ సద్దెంతా మిగిలిపొయ్యింది. బాలన్ని తాగమంటే వాడు వాంతి జేసుకునేంత పన్జేసినాడు. కిలిని తాగమంటే ఆమిదం మొగం బెట్టి ఆమడదూరం పరిగెత్తింది. పాలు, మజ్జిగి పేర్లింటేనే వాళ్లకు కడుపులో తిప్పతాదంటా.

మాయమ్మ బుట్టిచ్చి కిలిని అత్తికాయలు కోసకరమ్మంటే దానెంట నేనూ మామిడితోపులోకి పరిగెత్తినాను.

‘పాపా బద్రం కిలీ’ అని ఎనకనించి మాయమ్మ జాగర్తలు సెప్పింది.

అది జరిగి కొన్నెల్లయ్యుంటాది.

మాయిడితోపు కానుకోనుండే పన్నెండు గుంట్ల గుడ్డంలో మా నాయన జొన్నలు, నూగులు కలిపి సల్లినాడంట. పచ్చంగా కన్ని పిల్ల మాదిరిగా నమనమలాడతా నరగావడగతావుంది జొన్న పైరని మాయమ్మ మాయవ్వతో సెప్పి మురిసి పోయింది.

ఎంటనే మా యవ్వ ‘కమలా, నీ దిష్టే తగిలేట్టుంది, సున్నం దుత్తకు నల్లబొట్లు బెట్టి కట్టిగ్గట్టి ముందు తగిలించి రాబో’ అని దిష్టి కుండ బెట్టొచ్చే దాకా వొదిలిపెట్లా.

మాయమ్మెంట బొయిన నేను ‘అమా, జొన్నలు గూడా గువ్వలిద్దంటాయా?’ అని అడిగినాను.

‘ఎదుకు దినవూ, వాటికేమన్నా అజీర్తా’

‘మరట్లయితే. ఈ సారి గూడా గువ్వల్దోలను కిలి వొస్తాదా?’

‘కిలి గాక బోతే వాళ్కక్క వొల్లి వొస్తాది’

‘ఒద్దుమా. కిలినే రమ్మనుమా. గువ్వల్దోలేపాట కిలి ఎంత బాగా పాడతాదనుకున్న్యావు’.

‘దానెబ్బట్లా పాటలు పాడతాది వొల్లి’

‘ఎమో! నాకు దెల్దుమా. నేనిప్పుడే జెప్తావుండా. నాకు కిలే గావాల’ బుంగమూతి బెట్టి మాయమ్మ దెగ్గిర ముదిగారాలు బొయినాను.

జొన్నకంకిలు సెట్ల మింద పావురాలు వాలినట్లుగా బలంగా ఉండాయి. కంకిల్నిండా జొన్నగింజలు మూత్యాలు పేర్సినట్లుండాయి. వాటిని సూడ్ను రొండు కండ్లు సాలట్లా. మా నాయన్ని సేద్ద్యానికెత్తి నోడుగాదని ఎగతాలి సేసిన మా పెదనాయిన్ని పిల్సుకోనొచ్చి సూపించాలనిపించింది.

మా నాయన, బాలడు కలిసి జొన్నసేను మద్దిలో పందిలేసినారు. నల్ల బొట్లు పెట్టిన సున్నం సట్టిని దెచ్చి మా యమ్మ ఆడే ఒక కూసానికి తగిలించుండాది.

గువ్వల్దోలను కిలే వొస్తాదని బాలడు సెప్పినప్పుట్నుంచి నాకు తిర్నాలుకు బొయినంత సంతోసంగా వుండాది.

‘కిలి గువ్వలు దోలేటప్పుడు నువ్వుగూడా రావాలకా’ అని మాయక్కను ముందే ఎచ్చరించినాను. ‘కిలికి పాటలు శానా వొస్తాయి. అరవపాటలు గూడా’ అని సెప్పినాక మా యక్కకు గూడా ఎప్పుడెప్పుడా అని వుండాది.

ఆదివారం ఎప్పుడొస్తాదా అని కాసుకోనుండా. రాంగానే బాయికాడికి బోతామని మాయమ్మను సతాయించినాము.

మమ్మల్నేడికి పంపించాలన్నా మాయమ్మ శానా బయపడతాది. ‘తులవ పిలకాయిలు. బాయిల్లోకి కుంటల్లోకి తొంగి సూస్తారు. వాళ్లపైన ఒక కన్నేసుండు’ అని మా నాయన్ను ఎచ్చరిక జేసింది.

మళ్లో మాదరిగా జొన్నసేన్లో బురదలేదు. గెనింకీపక్క ఆపక్క కాలవలు గూడా ఎడల్పుగా వుండాయి. పరిగెత్తి ఆడుకోను ఎంతో వాటంగా వుందాడ.

కానీ ఆ శనిబట్ని గువ్వలు మమ్మల్నేడ ఆడుకోనిస్తాయి. తూరుపు నించి గుంపులు గుంపులుగా వొచ్చి ఎన్నులమింద వొయనంగా వాలతా వుండాయవి. సిన్నరెక్కల్ని సివసివలాడిస్తా ఈ ఎన్నుమింది నుంచి ఆ ఎన్నుమిందికి దానిమింది నుంచి ఇంగో దాని మిందికి వాలి మెడొంచి ముక్కుల్తో గింజల్ని పొడ్సితింటావుంటే ఇంగా సూద్దామానుంది. వాట్ని తరిమికొట్ను మనుసురాలా నాకు.

కిలి ఆపక్కకు ఈ పక్కకు పరిగెత్తి హాదే… హాదే అని గువ్వల్ని అదిలించింది. పందిలిమిందికెక్కి డబ్బాను కట్టితో డమ డమా వాయించి గువ్వల్ని బెదిరించింది. అవి గుంపుగా లేసి దూరంగా బోయి ఆడుండే కంకిలిమింద వాలతావుండాయి.

పెదపాపా నువ్వాపక్కబో, సినపాపా నువ్వీపక్కరా అని కిలి హేయ్ హేయ్‌ అని మంటిపెల్లల్ని వాటిమిందికిసరతా ఆడావుడి పడతా అంగామా జేత్తావుంది.

నాకు శానా సంబరంగా వుండాది. పెద్దకాలవెంబడి పరిగెత్తతా మాయక్కినేటట్లు –

‘హేయ్‌ వాలా కురివి వాలాదే

సోలా కదురు తున్నాదే… హాదే’ అని పాడతా గువ్వల్ని అదరగొట్టినాను.

కిలి డబ్బా వాంచతా, వొంగి మంటి పెల్లల్ని దీసుకోని ఇసరతా ఒకపక్క, ‘హేయ్‌ – ఇస్‌ – చోఁ’ అని మాయక్కొక పక్క, పాటపాడతా నేనొక పక్క నిలుకూ నిబందం లేకుండా గువ్వల్ని అల్లాడిరచి ముప్పుతిప్పలు బెట్టేసి మూడు సెరువుల నీళ్లు దాగించినాము.

వాటి రావిడి తగ్గినాక ‘ఆట్లాడుకుందాంరా కిలీ’ అని పిల్సినాను.

‘అమ్మ ఇప్పకాయిలు దా యారక రమ్మనుండాది సినపాపా అప్పరం ఆడుకుందాం’ అనింది.

నేనొప్పుకుంటానా. ‘కడుపునొప్పాటొకటి ఆడదాం కిలీ అక్క సూస్తాదంట’ అని కిలిని దూరానికి తోసి నేను ఈపక్కకు పరిగెత్తి దూరం నుంచి ఒక కాలును ఈడ్సి ఈడ్సి పరిగెత్తతా కిలిదెగ్గిరికొచ్చి

‘అమా నేను ఆటలాడి అలిసివొచ్చినానే

ఆ గూటిలోని బెల్లమైనా కొంచిమియ్యమ్మా

ఆ సేటలోని కొబ్బిరైనా కొంచి మియ్యమ్మా’ అని పాడతా అడిగినాను. ఇక్కడ కిలి అమ్మైతే, నేను కూతురు. కిలి అవి కొంచెం కొంచెం ఇచ్చినట్లుగా యాక్టింగ్‌ సేస్తావుంటే నేను మొత్తం పెరుక్కోని అబుకు అబుకుమని తినేసినట్లు యాక్టింగ్‌ సేసినాను.

కిలి గిన్నీసెంబులు తోమి, బాయిలో నీళ్లు సేందిపోసి వంటసేసి, అందురికీ పెట్టి పండుకునింది. నేను కూడా గెనింపైన ఒక సోట పండుకొనినాను. కొంచేపిటికి నేను లేసి కూసోని ‘అమా, కడుపునొప్పే అమా కడుపునొప్పే’అని యాడ్వబట్టినాను. అంతా యాక్సనే.

‘అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే

కడుపు నొప్పులే నాకు శానా నొప్పులే

కడుపంతా నొప్పమ్మా నే తాళలేనమ్మా’ అని పాడతా నేను కడుపునొప్పి యాక్సన్‌ సేస్తావుంటే మా యక్కుంది గదా దూపరదొండి కాల్నా, నంగనాసి టంగుబుర్ర జోతమ్మ పడీపడీ నవ్వతా వుంది. అయినా నేను నవ్వలేదు. వూపిరి బిగబట్టుకోని నొప్పి యాక్సన్‌ సేస్తానే వుండా. కిలి కాలవగెట్నుండే ఆమిదం సెట్లో నుంచి ఆమిదాకును కోసుకోని దాన్ని పాలాడ మాదిరిగా ముడ్సకోని

‘తల్లీ యాడ్వకే – ఈ మొందూ తాగవే

కొంచిం తాగులే – ఈ నృప్పీ పోవులే’ అని పాడింది.

మా యక్క ‘మీ యిద్దురూ ఈది నాటకాలు కూడా ఆడొచ్చింక. అంత బాగా యాక్సను సేసినారు. శానా బాగుందీ ఆట’ అని పొగడ్తా వుంటే మాకు ఎంతకుశాలయిందంటే యాందమూరి తిర్నాల్లో రంకుల రాట్నమెక్కినంత సంతోసమైంది.

కిలి గువ్వల్దోలేపని అయిపోయినాక కూడా సిన్నపనికీ పెద్దపనికీ మా ఇంటికి రాబట్టింది. సిన్నప్పుడది వాళ్లవ్వోలూర్లో పెరిగిందిలే. సంకురాత్రికి సున్నం బూస్తారు కదా! సున్నం బూసే ముందు ఇంట్లో గోడలకుండే బొక్కలకు మాయమ్మే మన్ను మెత్తించి పేడామన్ను బూసుకునింది. ఎద్దుల కొట్టంలో మాత్తరం కిలిని ఎయ్యమనింది. కిలితోపాటు నేనూ, మాయమ్మ కూడా పావళ్లెగజెక్కోని ఆ పనిలో బడినాము. సున్నం గూడా మేం ముగ్గురిమే బూసినాము. అప్పుడు మాయమ్మింట్లో లేదులే. సున్నం తేపలు తేపలుగా గొట్టిందని యాకారి యాకారి మల్లీ మాయమ్మే జూసుకొనింది. అదేరే ఇసయం.

దినాము మా ఇంట్లో గొడ్లకాడ పేడా సెత్త దోసే పనికి కిలి కుదురుకునింది. సమత్సరానికొక రిబ్బనంచు నూలుకోక కొనిచ్చేట్లు వొడంబడిక.

సింతకాయిలు, ఇప్పకాయిలు, కానక్కాయిలు, శెనిక్కాయిలు సమత్సరం పొడుగునా ఏదో ఒక పనుండేది. మాయమ్మకు వక్కగొరికేంత తీరిగ్గూడా వుండదు. కిలి వొచ్చినాక మాయమ్మకు కొంచం వూపిరి బీల్చుకోను టైం దొరికింది. అందుకని కిలి మా ఇంట్లోనే సంగటి దినుకుంటా ఆ పనీ ఈ పనీ సేసుకుంటా మాయమ్మిచ్చిన పాత పేలికలతో త్రుత్తిపడతా మాయింట్లోనే పెరిగి పెద్దమనిసి కూడా అయింది. సమత్సరం గాకముందే దానికి పెండ్లిజేసి మొగునింటికి పంపించేసినారు. వాళ్లమ్మొచ్చి పన్లుజేసినా ‘కిలి బొయిందే నాకు కుడిరెక్కిరిగి పోయింద’ని మాయమ్మ బాదపడేది.

గొబ్బియాల పండక్కు అమ్మగారింటికొచ్చిన కిలి అందుర్తో పాటు మాయింటికి గొబ్బిదట్నొచ్చింది. గొబ్బి దట్టేవాళ్లంతా మా ఇంట్లో తట్టేసి పొన్నెక్కోలింటికి పోయినా కిలి ఈడే వుండింది మాతో మాట్లాడాలని.

కిలి నాదెగ్గిర సిలక నవ్వునవ్వతా ‘సినపాపా, పనంతా అమ్మ దెగ్గిరే నేర్సుకుంట్న్యా. అందుకే ఈ పొద్దు మొగలాయి బతుకు బతకతావుండా. అందురిపనికీ నేనే గావాల మాయత్తోలూర్లో’ అని నవ్వతా నవ్వతా సెప్తావున్ని కిలి మాయమ్మను దల్చుకోని యాడ్వబట్టింది. దాంతో గూడా నేనూ మాయక్కగూడా కన్నీరుమున్నీరయినాము. మాయమ్మ సచ్చిపోయి రొండేండ్లవతా వుందప్పిటికి.

‘అమ్మ ఏ పనైనా ఎంత నాన్నింగా సేసేది. ఆ యమ్మకింద నలిగినాను గదా! పన్లో నన్ను మించింది లేదనుకో! అనింది మళ్లీ.

ఇసయం కిలి పాడే పాటలమింద కొచ్చింది. కిలికి అరవ పాటలే ఎక్కువొచ్చేవి. సిన్నప్పుడు ఆ పాటలే మాకూ నేర్పించింది. వొచ్చీరాని అరవంతో ఇప్పుడు గూడా ఆ పాటల్ని మా పిలకాయిల దెగ్గిరపాడి నాకు అరవంకూడా వొచ్చనిపించుకుంటా వుండాను. వాటిలో ఒక పాట మాత్రం సెప్పి నిలిపేస్తాను.

‘ఒరికుదరియా ఒరి సరటు వండీయా

యంగప్పానె మరందెంగమ్మాలె మరందు

దరమన్‌ గయ్యినేల

అంద కాసిరత్తికి కడపాడతన్నికి

ఏలూరు విూనుకు ఎంగలం జెంబుకు

మక్కలె తన్మరందు…….’

అవునూ, ఇంతకు ముందు గువ్వల్దోలే అరవపాటొకటి సెప్పినాను గదా! నాకు అరవందెల్సనే దానికి దాన్ని తెలుగులో జెప్పేదా.

‘హేయ్ వాలే గువ్వా వాలొద్దే

జొన్నా కంకీ తినొద్దే….. హాదే

హేయ్ వాలే గువ్వా వాలొద్దే

వొడ్ల ఎన్ను తినొద్దే…….హాదే’

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, ఇర్లచెంగి కథలు, నవంబర్, సీరియల్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.