cover

ఆమెని చుట్టుకుని

.
ఆమె అణువణువు పైనా మెత్తగా పరుచుకున్న నా తనువు
నా రంగుల్లో కళ్ళని ముంచి
ఆమె వెలువరిచే ‘చిత్ర’మైన అహంకారాలు
తన ఒంపుల్లో చిక్కుకున్న నా ఊపిరి నిండా నిప్పుల సుగంధాలు
.
ఆ పాదాల పైనో, పట్టీల మువ్వలపైనో
ఉండుండీ నా చుంబనపు గరుకైన అలికిడి
నా వేళ్ళ కొసలు ఏ కొమ్మ చివర్నో పట్టుకున్నపుడు
ఆమెలో చురుక్కుమని రేగే చిగురంత చిరాకు
.
ఎంతకీ లొంగక అల్లరి చేసిన సమయాల్లో
ఆమె జడ విసుర్ల కోపానిది ఓ మెత్తని రుచి
కసితీరా గుచ్చిన పిన్నుల రంధ్రాలు
నాలోకి ఆమె పంపే గాయపు బహుమానాలు
.
ఆమె చేతి వేళ్ళు చెక్కిన నా రూప ప్రవాహం
చూసే ప్రతి కళ్ళ జతలోంచి ప్రశంసగా తిరిగి నాలోకే
నాతో ఉన్న తననో, తనని చుట్టుకున్న నన్నో చూసి
తన్మయత్వాన కొన్ని తమకంతో మరికొన్ని హృదయాల వింత కంపన
.
ఆమె నన్నుఎంచుకున్నరోజు రాజయోగాన రెప రెపలాడుతూ
చిరుగాలితో పరిహాసమాడుతూ
ఐదున్నర గజాల ఎగిరెగిరి పడుతూ,
లేదంటే ఏ బీరువా మూలనో మడతల్లో ఓ మడతనవుతూ!!

*

Download PDF ePub MOBI
రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 
Posted in 2014, కవిత, నవంబర్ and tagged , , , , , .

7 Comments

  1. ఈ కవిత చీరంత అందంగా, పైటంత చిలిపిగా, కుచ్చిళ్ళంత మెత్తగా, అంచంత అద్భుతంగా ఉంది!

    కవికి జోహార్లు!!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.