cover

ఛలోక్తులు… చమత్కారాలు… సుతిమెత్తని హితోక్తులు…

Download PDF ePub MOBI

తెలుగువారికి భోజనంలో అత్యంత ప్రీతిపాత్రమైన వ్యంజనం గుత్తొంకాయ కూర అంటే అతిశయోక్తి కాదు. అలాగే తెలుగువారి సాహిత్య విందులో అమితంగా చెల్లయ్యేది హాస్య వ్యంగ్యాలన్నా అనుమానం అక్కర్లేదు. ఇక అకడమిక్‌ రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ ‘హ్యుమన్ రిలేషన్స్’దే అగ్రస్థానం. మానవ సంబంధాలని నేపథ్యంగా తీసుకుని తెలుగులో ఎన్నో రచనలు వెలువడ్డాయి. మానవ సంబంధాలు వస్తువుగా వ్యాసాలు వెలువడడం మాత్రం అరుదే.

సాధారణంగా వ్యాసాలంటే గంభీరమైన అంశాలపైన సుదీర్ఘ వివరణలతో, వాద వివాదాలతో అలరాలుతుంటాయి. కానీ ఇవేవీ లేకుండా హాస్యం, వ్యంగ్యమూ రంగరించి మానవ సంబంధాలని ప్రభావితం చేసే వివిధ అంశాలపై 40 వ్యాసాలు వెలువరించారు ప్రముఖ రచయిత శ్రీరమణ. చాలా వ్యాసాల్లో హాస్యంగానే చెప్పినా, మనలోని లోటుపాట్లపై సున్నితమైన విసుర్లుంటాయి. సుగర్ కోటెడ్ పిల్స్‌లా హితోక్తులుంటాయి. ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాల గురించి చెప్పుకుందాం.

గుత్తొంకాయ్ కూర - మానవ సంబంధాలూ” అనే వ్యాసంలో – వ్యాపార సంబంధాలు, ఆథ్యాత్మిక, సాంఘిక, రాజకీయ, మత, వృత్తి, ఉద్యోగ సంబంధాలు, అక్రమ సంబంధాలు ఇలా ఎన్నో సంబంధాలున్నా వాటన్నింటికీ మూల ధాతువు మానవ సంబంధాలేనని అంటారు రచయిత. మానవ సంబంధాలను ప్రభావితం చేసే ఒక ప్రత్యేకమైన దినుసు గుత్తివంకాయ కూరలో వున్నమాట నిజమని అంటూ ఈ వ్యాసంలో గుత్తివంకాయ కూర మానవ సంబంధాలతో ఎలా ముడి పడిందో స్థాళీపులాక న్యాయంగా చర్చించారు. మానవ సంబంధాలపై గుత్తివంకాయ ప్రభావం అపారమైందని చెబుతూ స్ర్టెయిన్డ్ రిలేషన్స్‌ని టంకం వేసి కలుపుతుంది గుత్తివంకాయ అని చెబుతారు.

పుస్తకాలూ - మానవ సంబంధాలూ” అనే వ్యాసంలో పుస్తకాల గురించి చెబుతారు. చేజారిన పుస్తకాన్ని తిరిగి సంపాదించలేమని అంటారు. భార్యాభర్తల మధ్య మానవ సంబంధాలు క్షణక్షణం మారుతూ, నిత్య నూతనంగా, సెలయేటి నడకలా గలగలలాడుతూ వుంటాయని అనుభవజ్ఞులు చెబుతూ వుంటారని చెబుతారు రచయిత.

రైలుమానవ సంబంధాలూ” అనే వ్యాసంలో, మానవ జీవితంలోకి రైలు దూసుకు వచ్చినంతగా మరే ప్రయాణ సాధనమూ రాలేదని అంటారు. రైల్లో కిటికీ పక్క సీట్లో కూచుని, హాయిగా చెట్ల వంకా చేమల వంకా చూస్తూ, చందమామ చదువుతూ ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభవమని. కుటుంబంతో ప్రయాణం చేసే వేళ రైలు పెట్టే మన యిల్లే చక్రాలు తగిలించుకుని వెళ్తున్నట్లు అనిపిస్తుందని అంటారు. ఈ వ్యాసం చదువుతూంటే, మనకి కూడా అర్జెంటుగా రైలు ప్రయాణం చేసేయాలనిపిస్తుంది. రైలు పట్టాలు దూరంగా కలిసినట్టు వుంటాయి కాని కలవవు. కలుస్తాయనుకోవడం వుత్త భ్రమ అని; ఈ అంతరార్థాన్ని కథా వస్తువుగా ఎందరో వందల సంఖ్యలో కథలు అల్లారని గుర్తు చేస్తారు రచయిత. కొసమెరుపుగా ఈ కథల వల్ల మానవ సంబంధాలు మెరుగు పడ్డాయో లేదో తనకు తెలియదని అంటారు.

పుష్కరాలూ - మానవ సంబంధాలూ” ఓ చక్కని వ్యాసం. మానవ సంబంధాలలో మునకలు వేసే ముందు – అసలు పుష్కరం గురించి మరీ వీడియో కాన్ఫరెన్సు అంత పొడుగ్గా కాకపోయినా కాస్తయినా తెలుసుకోవడం అవసరమని చెప్పి, పుష్కరాల వివరాలు చెబుతారు. రచయిత తాతగారు పుష్కర స్నానానికి వెళ్లి గోదావరి కోటి లింగాల రేవు దగ్గర్లో వొక యింట్లో దిగడం, వాళ్లింట్లో గోంగూర పచ్చడి అద్భుతంగా వుందని, ఆ యింటి పిల్లని కోడలుగా చేసుకున్నారని చెబుతారు. తద్వారా వొక మహాద్భుతమైన ఆ గోంగూర ఫార్ములాని గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం దాకా గుబాళింప చేశారని, పుష్కరమే లేకపోతే ఈ గోంగూర ఫార్ములా తమకు దక్కేది కాదని భావిస్తారు. ఇక్కడే మానవ సంబంధాలను మనం పట్టుకోవాలని అంటారు.

వినాయకుడూ - మానవ సంబంధాలూ” వ్యాసంలో – మనం ఏ పని తలపెట్టినా అవాంతరాలు కాపాడేది విఘ్నరాజేనని, అందుకని మనుషులతో ఆయనకు వున్నంత అనుబంధం మరే దేవుడికీ ఉండదని అంటారు రచయిత. మనం వినాయకుణ్ణి దగ్గరకు తీసుకున్నంత ఆత్మీయంగా మరే దేవుణ్ణీ తీసుకోమని గుర్తు చేస్తారు. మన పిల్లల్లో పిల్లాడిలా వినాయకుడిని భావిస్తా్మని. వినాయక చవితి వస్తే క్రికెట్ ఆడుతున్నట్లు, వినాయకుడు కంప్యూటర్‌తో ఆడుకుంటున్నట్లు, కారు నడుపుతున్నట్లు రకరకాల బొమ్మలు చేసి పూజిస్తా్మని అంటారు. మధుర భక్తిలాగే యిదో రకం సరస భక్తి అని వ్యాఖ్యానిస్తారు. ఆర్ధిక సంబంధాలతో ముడిపడి వుండడం వల్ల వినాయకుడికి మానవ సంబంధాల గాఢత ఎక్కువని రచయిత చెప్పిన ఉదాహరణకు నవ్వకుండా ఉండలేం, ఆలోచించక మానలేం.

నవరసాలూ - మానవ సంబంధాలూ” అనే వ్యాసంలో – మానవ సంబంధాలతో నవరసాలు ఎట్లా ముడిపడి వున్నాయో విశ్లేషించించారు. ఓ ఉదాహరణ చెప్తారు. అప్పారావు అప్పులు చేస్తాడు. నిజానికి అందరం చేస్తామని అంటారు. కాని అతనికి ఆ బ్రాండ్ పడింది. అదీగాక అతనికి అప్పులు చేయడం అనేది అవసరం కంటే సహజ లక్షణం. అప్పు చేయడం కొందరికి బాధ. కొందరికి హాబీ. ఇప్పుడు స్టేటస్ సింబల్. మనందరం ఎంతో కొంత అప్పారావు అంశ కలిగిన వాళ్లమేనని అంటారు. అప్పారావు అప్పు లాగడంలో నవరసాలు ఎలా పలికిస్తాడో, విజయవంతంగా పండిస్తాడో గమనిస్తే – మానవ సంబంధాలలో నవరసాలు ఎలా ప్రతిఫలిస్తాయో అర్థం అవుతుంది. చూడ్డానికి హాస్యంగా వుంటాడు. మనిషి శాంత స్వభావుడు. అప్పు అడగడంలో అప్పారావు ఎదురవడమే వొక గొప్ప రొమాన్సు. సందర్భాన్ని బట్టి రౌద్ర రసాన్ని “అర్జన్సీ” లోకి తర్జుమా చేసి ఆఖరికి అప్పు పుట్టిస్తాడు. అది అద్భుతం! అందుకని అప్పారావు నవరస పోషకుడై మానవ సంబంధాలను అప్పులతో ముడివేసి కాపాడుతున్నాడు. పెదాలపై చిరునవ్వుని పూయిస్తుందీ ఉదాహరణ.

 “వన భోజనాలూ - మానవ సంబంధాలూ” అనే వ్యాసంలో – దీపావళి వెళితే కార్తీక మాసం వస్తుందని, అంటే శరదృతువు ద్వితీయార్థంలో వుంటామని గుర్తు చేస్తారు. కార్తీకంలో వెన్నెల బావుంటుందని చెబుతూ, వెన్నెల మానవ సంబంధాలను మెరుగుపరుస్తుందని రచయిత అంటారు. కార్తీకం రాగానే వన భోజనాలు చేయాలని అందరం రెపరెపలాడతాం. ఎవరికైనా కార్తీక భోజనాలు వొక కల. అందరూ కుటుంబాలతో వెళ్లడం, వంటలూ పిండి వంటలూ చెట్ల కింద వండుకుని తినడం వొక అనుభవం. వన భోజనాలూ మానవ సంబంధాలూ అనే అంశంలో పుపాఖ్యానాలు అనేకం ఉన్నాయని చెబుతారు. అందులో చందా వసూళ్ళు ఒకటని రచయిత అంటారు. ఎన్నో రకాల చదువులు వస్తున్నాయి గాని చందా వసూళ్ల మీద నాలుగేళ్ల కోర్సు పెట్టచ్చని, అదేమీ చిన్న విద్య కాదని అంటారు. చందాలు వసూలు చేయాలంటే బోలెడు చొరవ, వొడపు కావాలని, పబ్లిక్ రిలేషన్స్ అనగా మానవ సంబంధాలు బాగా నిర్వహించుకోవాలని సూచిస్తారు.

రాళ్లూ - మానవ సంబంధాలూ” అనే వ్యాసంలో – కొన్ని యుగాలు వెనక్కు వెళితే గాని రాళ్లతో మానవ సంబంధాలు వొక కొలిక్కిరావని అంటారు శ్రీరమణ. పాతి రాతియుగం, కొత్త రాతి యుగం అనేవి మానవ నాగరికతకు సంబంధించిన మైలురాళ్లని చెబుతారు. మనం రాళ్లని డబ్బుతో సమానంగా చూస్తామని చెబుతూ,” ఏదో నాలుగు రాళ్లు సంపాయించాడు” అని అంటారని చెబుతారు. అంటే రాళ్లతో మానవ సంబంధాలు ఎంత విలువైనవో ఆలోచించమంటారు.

లిఫ్టూ - మానవ సంబంధాలూ” అనే వ్యాసం చాలా బావుంటుంది. దీనిని ఎవరికి వారు చదువుకోవల్సిందే. లిఫ్ట్ లోపల, నిరీక్షిస్తూ లిఫ్ట్ బయట ఉన్నప్పుడు మానవ సంబంధాలు మెరుగుపడతాయని చెబుతారు రచయిత. పదహారు చదరపు అడుగులలో పది మంది నిలబడతారు. దీనివల్ల మనుషులు దగ్గర అవుతారని, రాజుకి బంటుకి తేడా ఉండదని అంటారు. లిఫ్ట్ మనిషి అంతస్తుని క్షణంలో మారుస్తుందని హాస్యంగా అంటారు.

ఓట్లూ - మానవ సంబంధాలూ” వ్యాసంలో దేశంలోని రాజకీయ పరిస్థితులపై వ్యంగ్య భాణాలు సంధిస్తారు రచయిత. మన దేశంలో ఓటుకి అట్టే వయస్సు లేదు కాని పుట్టీ పుట్టగానే, కమండలంలో చేపపిల్లలా సముద్రం స్థాయికి విస్తరించి పవర్‌ఫుల్‌గా తయారైందని అంటారు. మన ఎన్నికలలో ఒక చిన్న సూక్ష్మం వుందని అంటారు. ప్రజలంతా ఓటర్లు కారు. అలాగే ఓటర్లంతా ప్రజలు కారు. నూటికి యాభై అయిదు మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు. అందులో ఇరవై ఎనిమిది శాతం ఓట్లు వచ్చిన వాళ్లు గద్దె ఎక్కుతారు. అంటే యీ ఇరవై ఎనిమిది శాతం మంది ఎన్నుకున్నవారు. నూరు మందినీ శాసిస్తూ వుంటారు. దీనిని మనం డెమోక్రసీ అంటున్నాం. మానవ సంబంధాల నిష్పత్తి యిలా వుందని వాపోతారు.

వాన - మానవ సంబంధాలూ” – అనే వ్యాసంలో ప్రాణాధారమైన నీళ్లు ఆకాశంలోంచి బిందువులుగా రాలిపడడం ఎంత చిత్రమో అని అంటూ, నిలువుగా, వాలుగా ఎడాపెడా కురిసే వానని ఎంతసేపు చూసినా తనివి తీరదని అంటారు. వర్షం కురుస్తున్న ఓ దృశ్యాన్ని వర్ణిస్తారు.”వాడ జడిగా పడుతూ వుంటుంది. రోడ్డు మీద రంగు రంగుల గొడుగులు కదులుతూ వుంటాయి. వాటి మీద చినుకులు పడే శబ్దాలు లయాత్మకంగా. ఒక్కొక్క గొడుగులో జంటలు వెళ్తుంటాయి. ముఖాలు కనిపించవు గాని పాదాలు కనిపిస్తాయి. బురద చుక్కలతో డిజైను మార్చుకున్న చీరకుచ్చెళ్లు, తడిసిన ప్యాంటు సహజీవనం చేస్తూ సాగిపోతుంటాయి. ఈమధ్య నాలుగు కాళ్లూ జీన్సే ధరించి వెళ్లడం కనిపిస్తోంది. ఇది మరీ ముచ్చట. చిటపట చినుకులలో, జంటగా, జనం మధ్యలో గొడుగు చాటున వెళ్లడం ఒక గొప్ప అనుభవం. ఎవరి సందట్లో వాళ్లుంటారు. మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటారు గాని, దాని వాళ్లు దానికి వుంటూనే వుంటారు. ఏ చెట్టు కిందో తాపీగా నిలబడి కాస్తంత ఈర్ష్యగా చూసే కళ్లూ వుండనే వుంటాయి. గొడుగులో మానవ సంబంధాలు గొడుగులోవైతే, చూసే వారి వుత్కంఠ చూసే వారిది. అందమైన ఆడపిల్ల కుచ్చెళ్లు కొద్దిగా పైకి పట్టుకుని అలా అలా మునివేళ్ల మీద వాన నీళ్లతో, చినుకుల మధ్య నుదురు అదోలా పెట్టి నడిచి వెళ్లడం చాలా గొప్పగా వుంటుందంటాడు రసికత లెరిగిన వాడు.” – ఈ వర్ణనకైనా వానలో తడవాలని అనిపిస్తుంది పాఠకులకి.

దసరా - మానవ సంబంధాలూ” అనే వ్యాసంలో – పండగలు దేవుళ్ల కథలతో ముడిపడి వుంటాయి గాని నిజానికి వాటితో మానవ సంబంధాలే ఎక్కువని అంటారు. పాతకాలంలో – అంటే బతకలేక బడిపంతులని అరుగుల మీద వీధీ బడులు నడుపుకునే రోజులు – అయ్యవారిని అందరూ “ఏమండీ” అని గౌరవంగా పిలిచే రోజులని గుర్తు చేస్తారు. మానవ సంబంధాలు గట్టిగా ముడిపడి, అయ్యవారంటే పిలకాయలకే కాదు ఊరంతటికీ అయ్యవారే అనుకొనే కాలం అది. క్రమేపీ ఆ సంబంధాలు సడలిపోయాయి. ఇప్పుడు పిల్లలు కస్టమర్స్ లాగా కనిపిస్తున్నారు. అయ్యవారు సరుకు సరఫరా చేసే అమ్మకం దారుడైతే, స్కూలు యాజమాన్యాలు దళారీలుగా కనిపిస్తున్నారని వాపోతారు. ఇక్కడ కూడా మానవ సంబంధాలు వున్నాయి కాని పూర్తి రూపాయల భాషలో అని హృదయాన్ని బరువెక్కిస్తారు.

చలికాలం - మానవ సంబంధాలు” అనే వ్యాసంలో – వేసవి కాలం మనుషుల్ని దూరం చేస్తుందని, వానాకాలం నీరుకారుస్తుందని, కాని చలికాలం మనుషుల్ని దగ్గర చేస్తుందని అంటారు. సిక్కిం నుంచి నేపాల్ నుంచి ఉన్ని దుస్తులు తెచ్చి రోడ్డువార పందిళ్లు వేసి అమ్ముతూ వుండేవారి ఉదాహరణ చెబుతారు. “వాళ్లు స్వెట్టర్ వంద రూపాయలు చెబితే మన వాళ్లు ముప్ఫైకి బేరమాడతారు. అసలు యీ బేరాలు ఆడడం చిత్రంగా వుంటుంది. దేనిని కొలబద్దగా తీసుకుంటారో తెలియదు. అమ్మేవాళ్లు వంద అంటే కొనేవాళ్లు యాభై అంటారు. ఎటూ బేరం చేస్తారని రెట్టింపు రేటు చెబుతారో, ఎటూ ఎక్కువ చెబుతారని వీళ్లు సగానికి అడుగుతారో అర్ధం కాదు. సరే, బేరాల మాట ఎట్లా వున్నా దూరప్రాంతాల వారితో యీ సీజన్‌లో మానవ సంబంధాలు ఏర్పడతాయి. వాళ్లు హిందీ మాట్లాడతారు. మనం తెలుగు మాట్లాడతాం. మనం వూరికే తెలుగు మాటల చివర హై చేరిస్తే హిందీ అవుతుందనే భ్రమలో వుంటాం. చివర దీర్ఘాలు తీస్తే తెలుగు అవుతుందని వాళ్లు భావిస్తారు. డబ్బుకి భాషా భేదం లేదు కాబట్టి యీజీగా మన మాట వాళ్లకి, వాళ్లన్నది మనకి అరటి పండు వొలిచినట్టు అర్ధమైపోతుంది.” అని అంటారు.

ఫిబ్రవరి - మానవ సంబంధాలు” అనే వ్యాసంలో – అతి తక్కువ రోజులున్న నెల ఫిబ్రవరి అని, కేవలం 28 రోజులే వుండడం వల్ల దీని ప్రభావం మానవ సంబంధాలపై ఎలా పడుతుందో అధ్యయనం చేయతగ్గ అంశమని అంటారు. తెలుగు నెలల ప్రకారం మాఘ – ఫాల్గుణ మాసాల మధ్య వంతెన లాగా వుంటుంది ఫిబ్రవరి నెల. అంటే ఇంగ్లీషు కొత్త సంవత్సరానికి, తెలుగు నూతన సంవత్సరానికి మధ్య కొత్త పాతల మధ్య వుంటుంది. చలికాలపు గిలిగింతలు తగ్గుతూ, వేసవి చిరు చెమటలను గుర్తు చేస్తూ నడిచే నెల. అందుకని యీ నెలలో మానవ సంబంధాలు కూడా అంటీ ముట్టనట్టు, పట్టీ పట్టనట్టు వుంటాయని చెబుతారు. సర్దుకుపోయే విషయంలో మనంతటి వాళ్ళు ఎవ్వరూ వుండరని, అందుకని భారతదేశంలో మానవ సంబంధాలు పటిష్టంగా వుంటాయని అంటారు. ఫిబ్రవరి పొట్టి నెలే గాని చాలా గట్టి నెల అని ముక్తాయిస్తారు.

ఎంట్రెన్సులు - మానవ సంబంధాలు” అనే వ్యాసంలో ఎంట్రెన్స్ చదువులు మానవ సంబంధాలను ఎలా నిర్ధారిస్తున్నాయో చెబుతారు. “ఏ పార్టీలోనో పెళ్లిలోనో కలిస్తే ఐఐటి ఎంట్రెన్స్ పిల్లలు తల్లిదండ్రులంతా ఒకచోట చేరతారు. చుక్కారామయ్య, కృష్ణమూర్తి, నారాయణ, కోట లాంటి పెద్ద విషయాలపై చర్చ నడుస్తుంది. ఏ ఆథర్ పుస్తకాలు మంచివో, ఏ బిట్ బ్యాంక్ మీద ఆధారపడాలో బిట్స్ పేరెంట్స్ మాట్లాడుకుంటారు. ఎంసెట్ వాళ్లు కొంచెం దూరంగా కూచుంటారు. ఇక సాదాసీదా గ్రాడ్యుయేట్ బాపతు వాళ్లయితే చెట్ల కింద నిలబడి మాట్లాడుకోవలసిందే!” అని అంటారు. ఇదే వ్యాసంలో మానవ సంబంధాలను తలుచుకుని విస్తుపోయిన ఘటనని వివరిస్తారు.

కవిత్వం - మానవ సంబంధాలు” అనే వ్యాసం – తాము ఏది రాస్తే అది కవిత్వం అని భావించి అడ్డమైన రాతలను జనాల మీదకు వదిలే కవులను అధిక్షేపిస్తుంది. మనిషి మేథస్సు చేసుకునే వాంతిలా వుండకూడదు కవిత్వం అని అంటారు శ్రీరమణ. “అందం, ఆనందం దాని పరమావధి కావాలని పొయిట్రీ బాధితులు అంటుంటారు. కవిత్వపు దెబ్బలు కూడా పోలీసు దెబ్బల్లా, లోలోపల కుళ్లపొడుస్తాయని పడనివాళ్లు అంటుంటారు.. కవిత్వంతో మానవ సంబంధాలు విపరీతంగా దెబ్బతింటాయి. ఒక్కోసారి మనుషుల్ని కవిత్వం దగ్గర చేస్తూంది.” అని అంటారు. “సైన్సు సిద్ధాంతాలకు శాస్త్రీయ పరిజ్ఞానం కావాలి. సంగీతానికి సాధన కావాలి. సైకిలు తొక్కడానికి ప్రాక్టీసు ముఖ్యం. కుమ్మరం, కమ్మరం, వడ్రంగం, చేనేత లాంటి వృత్తి విద్యలకు నైపుణ్యం కావాలి. కాని, కవిత్వానికి ఏమీ అవసరం లేదు. ఆశు కవితకైతే కాగితం కలంతో కూడా పనిలేదు. శ్రోత దొరికితే వ్రతానికి ఫలం దక్కుతుంది. కష్టాల్, నష్టాల్ శ్రోతలకే గాని కవి ఎప్పుడూ సురక్షితం. పోతే మానవ సంబంధాలు పోతాయి. బతికి వుంటే మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు.” అని చెబుతారు.

చదువు - మానవ సంబంధాలూ” అనే వ్యాసంలో ఆధునిక చదువుల్లోని లొసుగులని ప్రస్తావిస్తారు. చదువు వ్యాపారం అయిపోయిన తీరు వివరిస్తారు. ఓ ఉదాహరణ చెప్పి, దాని ద్వారా చేప పిల్లలు ఏమి నేర్చి యీదుతున్నాయో తనకు అర్థమైందని చెబుతారు.

మామిడి పళ్లూ - మానవ సంబంధాలూ” వ్యాసంలో మామిడి పళ్లతో మనిషికి వున్న సంబంధం మరో పండుతో వుండదు గాక వుండదని అంటారు రచయిత. మానవ సంబంధాల విషయంలో మామిడిపళ్ల పాత్రని తను జన్మలో మర్చిపోలేనని, దానికి కారమైన సంఘటనని వివరిస్తారు. జయప్రకాష్ నారాయణ్ పేరు చెబితే ఉత్తమ జాతి మామిడిపళ్ల పరిమళం తనకి ఎందుకు స్ఫురిస్తుందో చెబుతారు.

సెలవలోచ్….! సెలవలు!” అనే వ్యాసం కూడా ఎవరికి వారు చదువుకుని ఆనందించాల్సిందే.

కలయో…..? వెష్ణవ మాయమో……?” ఓ ఊహాభరితమైన వ్యాసం. మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో చెబుతూ, ఎలా ఉంటే బావుంటుందో చెబుతారు. “నిజంగా మనిషి మనిషిలా ప్రవర్తించడం మొదలు పెడితే ఇకాలజీ సర్వనాశనం అయి పోదూ?’ అనిపించినా, మనిషి మనిషిలానే ప్రవర్తించాలని కోరుకుంటారు.

ఇంకా ఎన్నో చక్కని హాస్య వ్యంగ్య వ్యాసాలున్న “గుత్తొంకాయ కూర – మానవ సంబంధాలూ” అనే ఈ పుస్తకాన్ని మోనికా బుక్స్, హైదరాబాదు వారు ప్రచురించారు. వెల రూ. 75/-. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

- కొల్లూరి సోమ శంకర్

Download PDF ePub MOBI

Posted in 2014, నవంబర్, పుస్తక సమీక్ష and tagged , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.