cover

అక్షరాలతో అనుబంధం

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన 8వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన ఇక్కడ.)

Download PDF ePub MOBI

అది 2050 వ సంవత్సరం, ప్రపంచం డిజిటల్ మయంగా మారిపోయి అప్పటికే చాలా ఏళ్లు గడిచిపోయాయి. మనుషులు ఎవరో మర మనుషులెవరో తెలుసుకోలేనంతగా ప్రపంచం మారిపోయింది. అటువంటి సమయంలో….

కార్లో ఇంటి నుండి ఆఫీస్ కి డైరెక్షన్స్ సెట్ చేసి సీట్ బెల్ట్ పెట్టుకొని ఆఫీస్ పనిలో మునిగిపోయాడు అన్వేష్. కార్లో ఆఫీస్ పనేమిటి అని ఆశ్చర్య పోవద్దు, అలా కాకపోతే ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లలేం అని అతని నమ్మకం. కారు ఎటువంటి మలుపులు తిరుగుతుందో గుర్తించే తీరిక లేదు అతనికి, కానీ ఆ తరువాత ఎదురైన మలుపు మాత్రం అతను ఊహించనిది. సాదారణంగా ఐదు నిమిషాలాకన్నా ఎక్కువ సేపు పడని రెడ్‌లైట్ ఆ రోజు పదిహేను నిమిషాలు అయినా మారక పొయేసరికి అతనికి చిరాకు అసహనం కలిగాయి. విషయం ఏమిటని అతను పక్క కార్లో వ్యక్తిని అడగలేదు, తన ఎదురుగా ఉన్న కంప్యూటర్ తెరని అడిగాడు. ఒక అర సెకను తర్వాత కంప్యూటర్ తెర పైన అర కిలోమీటర్ దూరంలో ఒక 60-70 ఏళ్ల వయసు గల కొందరు ఏదో ఆందోళన చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కనిపించింది.

సరే ఇక మరో దారి నుండి వెళ్దాం అని ఫిక్స్ అయిన అతనికి ఎపుడూ ఊహించని షాక్ తగిలింది. ఎప్పుడూ లేనిది తమ ఆఫీస్ ఆ రోజు సెలవు ప్రకటించింది. సునామీ వచ్చినా పని చేయాలనే తన ఆఫీస్ సెలవివ్వటం ఏమిటని అన్వేష్ ఆఫీస్ కి కాల్ చేశాడు. ఆ ఫోన్ కాల్ అతని ఇంకో నమ్మలేని వార్తని అందించింది. తను ఇందాక విన్న ఆందోళనలో పాలుపంచుకోవటానికి వాళ్ల బాస్ కూడా వెళ్లారని, అందువల్లే ఈ రోజు ఆఫీస్ లేదని.

ఆ ఆందోళన గురించి ఏమీ తెలియకున్నా, అక్కడకు వెళితే ఎంతో కష్టపడితే కానీ దొరకని బాస్ అపాయంట్‌మెంట్ ఈజీగా దొరుకుతుందనీ, అలాగే తన ప్రమోషన్ మ్యాటర్ కూడా కదపవచ్చని ఆందోళన జరిగే ప్రదేశానికి చేరుకున్నాడు.

అతను చేరే సరికి ఆ ప్రదేశమంతా ఒక గందరగోళ వాతావరణంతో నిండి పోయి ఉంది. వారంతా ఒక పురాతన భవనం చుట్టూ చేరి ఉన్నారు. మరో వైపు ఆ భవనాన్ని కూల్చేసేందుకు బుల్డోజర్లు సిద్దంగా ఉన్నాయి.

ఆ భవనం మీద వాళ్ళ చేతుల్లోనూ ఉన్న ప్లకార్డుల్లో అంతా తెలుగులో రాసి ఉండటం వలన ఆ ఆందోళన ఎందుకు చేస్తున్నారో అతని అర్థం కావడం లేదు. ఇంత పాత భవనం కోసం తన బాస్ ఎందుకు ఆందోళనలో పాలుపంచుకుంటున్నాడని అన్వేష్ కి కుతూహులం కలిగింది. ఇంతలో అన్వేష్ ని చూడనే చూశాడు అతని బాస్ విశ్వేశ్వరం. తనని చూడగానే బాస్ కళ్ళలో ఏదో ఆనందాన్ని గుర్తించాడు అన్వేష్. “నిన్ను ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నీ లాంటి వాళ్ళు ఈ ఆందోళనలో పాలు పంచుకుంటే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలం.” అన్వేష్ కి అతను దేని గురించి మాట్లాడుతున్నాదో అర్థం కావడం లేదు. కానీ విషయం చాలా పెద్దదని అర్థం అయ్యింది. ఇప్పుడు కానీ ఇంప్రెషన్ కొట్టెస్తే తన ప్రమోషన్ గ్యారెంటీ అనుకున్నాడు.

అన్వేష్ ఏది మనసులో దాచుకునే రకం కాదు దేనికైనా ఎదురుగా వెళ్లే తత్వం. “సర్ మీరేమిటి ఇక్కడ?” విషయం తెలుసుకుందామని మొదటి ప్రశ్న తనే వేశాడు.

“ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ని తీర్చడానికి చరిత్రను ఎవరైన కాలగర్భంలో కలుపుతారా?” అసలే గందరగోళంలో ఉన్న అన్వేష్‌ని ఆ ప్రశ్న మరి ఇరకాటంలో పడేసింది. ఆ కట్టడాన్ని చూస్తే మరీ అంత రాజుల కాలం నాటిదిలా కనిపించడం లేదు, ఇతనేమో చరిత్ర అంటున్నాడు ఏం చెప్పాలో తెలియకపోయినా “తప్పే సర్” అన్నాడు.

“మా పోరాటం కూడా దాని గురించే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని కాపాడాలనే మా యీ ప్రయత్నమంతా” ఆ మాటలు వినగానే అన్వేష్‌కి ఒక్క సారిగా తల తిరిగిపోయింది. ఈ పాడు బడిపోయిన గ్రంథాలయం కోసమా వీళ్ళు ఇంత గొడవ చేస్తున్నది. దీని కోసమా వీళ్ళ ఆందోళన. ఇందుకోసమా ఇంతమంది జనాలు ఇంత సేపటి నుండి ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్నారు అనుకున్నాడు.

“అయిన సర్ మీరు అనవసరంగా ఇంత గొడవ చేస్తున్నారు. ఇంకా గ్రంథాలయాలు ఎందుకు సర్, ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. పైగా అందులో అయితే పుస్తకం అంతా చదవకుండా కేవలం కావలిసిన విషయం మాత్రమే చూసుకోవచ్చు.”

ఆ మాటలు విన్నాక ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయారు ఇద్దరు. తప్పు చేసానా అనుకున్నాడు అన్వేష్. ఎంతైనా బాస్ కి నచ్చనట్లు మాట్లాడితే ఉద్యోగం కూడా పోవచ్చు.

ఒక్క నిమిషం తర్వాత మాట్లాడటం మొదలుపెట్టాడు విశ్వేశ్వరం, “కారులోనించి సూర్యాస్తమయాన్ని కూడా ఒక్క సెకను గమనించే తీరిక లేని ప్రపంచంలో, ఏ సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్ లో దొరకాలని కోరుకునే సమాజంలో గ్రంథాలయాలకు నిజంగానే చోటు ఉండదు.

“ప్రకృతికి పులకించిన మనస్సు చేసే శబ్దాలు కలం ద్వారా కాగితం మీదుగా అక్షరాలుగా మారే అద్భుతాన్ని తెలుసుకోవాలన్నా, చలం రచనల కోసం వచ్చిన నేను శ్రీశ్రీతో ప్రేమలో పడిపోయినా, విశ్వనాథ రామాయణ కల్పవృక్షం రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం ఒక చోటే కలిసి ఉండాలన్నా… అది గ్రంథాలయాల్లోనే సాధ్యం. ఎందరో మహానుభావులు. అందరి ఆలోచలన్ని పరిచయం చేసే అధ్భుత వేదిక గ్రంథాలయం. ఆ అక్షరాలతో అనుబంధాన్ని అనుభవించాల్సిందే కానీ చెప్పలేము”

ఆ తరువాత తాను చెప్పాల్సిన దేమీ లేనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వేశ్వరం. అక్కడ ఆందోళనలో ఒకతను అందరికి పెద్ద బాలశిక్ష పంచుతున్నాడు, అప్పుడే పుట్టిన పాపాయిని అందుకున్నత జాగ్రత్తగా అందుకొని ఆ ఆందోళన జరిగే వైపు నడిచాడు అన్వేష్.

*

రచయిత వివరాలు

 shailesh

ఎమ్. శైలేందర్

నెల్లూరు

Download PDF ePub MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2014, నవంబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , , , .

3 Comments

  1. అతి చక్కని వస్తువు. అధిక చక్కని శైలి. ఒక కొత్త కలాన్నుండి ఇంత మంచి భావుకతని ఆస్వాదించడం ఎంతో సంతృప్తినిచ్చింది. చాలా మంచి ప్రయత్నం. మానకండి. మీ ఆలోచనలు కొనసాగిస్తూనే ఉండండి. మరిన్ని మంచి కథలకు అవి విత్తులు చల్లి నీళ్ళు పోస్తాయి.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.