బుచ్చిబాబు

బుచ్చిబాబు రచనల్లో కనిపించే ‘జీవనకళ ‘

Download PDF    ePub   MOBI

“సంతోషం సంచలనాత్మకమైనది. సంచలనాత్మకమైనదానికెప్పుడూ అవతలి పక్షం వుంటుంది. సంతోషం జారిపోతే దుఃఖం కలుగుతుంది, కాని హృదయపు లోతుల్లోంచి జన్మించే సంతృప్తికి దీటైనది ఏదీ లేదు” — అంటూ జీవిత పారమార్థిక లక్ష్యం సంతృప్తి సాధనే అని సూత్రీకరించిన బుచ్చిబాబు అసలు పేరు, శివరాజు వెంకట సుబ్బారావు. 1916 జూన్ 14వ తేదీన ఏలూరులో జన్మించిన బుచ్చిబాబు, ఆంగ్ల సాహిత్యంలో ఎమ్.ఏ చేసి, అనంతపురంలో, విశాఖపట్నంలో కొన్నాళ్ళు ఆంగ్లభాష అధ్యాపకులుగా ఉద్యోగం చేసి. 1948 నుండి 1967 దాకా ఆలిండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.

తండ్రి ఉద్యోగ్యరీత్యా పెక్కు ప్రాంతాలాలో విద్యాబ్యాసం చేసినందువల్ల, చిన్న నాటినుండి అలవాటైన లోకాన్ని పరిశీలించే తత్వం వీరిచేత కలం పట్టించింది. తమలోని సందేహాలకు జవాబులను పుస్తకాల్లో వెదుక్కునే అలవాటున్న వీరు, రచనావ్యాసంగం ప్రారంభించిన నాటినుండి, పుస్తక రచన పుస్తక పఠనాల ఆధారగా జీవితాన్ని శోధించిన నిరతర సాధకుడు. అందుకనే తనదంటూ ప్రత్యేక ముద్రతో తెలుగు సాహిత్య క్షేత్రాన్ని కథలతో, సాహితీ వ్యాసాలతో, నాటకాలతో పండించడమే గాక, తనలోని సర్వ శక్తులను మేళవించి, ‘చివరకు మిగిలేది ‘ అన్న ఒకే ఒక్క నవలను రచించి, సాహిత్య లోకంలో అగ్రశ్రేణిలో నిలవగలిగారు. బుద్ధి జీవి అయిన మానవుడు నిర్దేశిత నియమ బంధాలున్న సమాజంలో ఎదుర్కొంటున్న మానసిక స్థితిగతులను ప్రతిఫలింపజేసే ప్రయత్నం యీ నవలకు ప్రాణనాడి. ఇదే వీరి యితర రచనలన్నిటిలోను సాగిన అంతస్సూత్రం కూడా!

వ్యక్తిని కేంద్రంగా తీసుకుని కనిపించే సమాజం, ఆ వ్యక్తిని శాసించి, తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ సమాజం లో జీవిస్త్తూనే, మానసికంగా సమాజాన్ని దూరంగా ఉంచుతూ వ్యక్తి ఎదగడమే జీవితానికి అర్థం. “వ్యక్తి సంఘాన్ని మార్చలేడు. మనుష్యుల్నీ మార్చలేడు. మారిస్తే బాధ, పగ, యుద్ధం! తనలో తాను సమాధాన పడాలి. మంటను చల్లార్చే మంచుకాలప్రవాహాన్ని హృదయంలో నిలుపుకున్నపుడే ప్రశాంతతను పొందగలడు. పిచ్చి ప్రపంచాన్ని దయతో దూరంగా వుంచే ఔదార్యం అన్నిటికీ అతీతంగా పొందగలిగే సంతృప్తి మనిషికి అవసరమంటారు వీరు!

“మనిషికీ మనిషికీ మధ్య లోనే కాదు గోడలుండటం. ప్రతి మనిషి లోనూ ఒక పల్చటి పొర వుంటుంది.ఆ తెర ఊడిపోకుండా సంఘం కాపలా కాస్తుంటుంది.” అంటూ నిర్హేతుకమైన దయను చూపే సమాజంలో ఉంటూనే సౌందర్యమంతంగా జీవితాన్ని మలుచుకోగలిగిన జీవన కళను వీరు అన్వేషించారు. “ఆర్థిక సాంఘిక చారిత్రిక వ్యత్యాసాలకు అతీతమై, మనిషినీ మనిషినీ స్నేహపాశంతో బంధించివేసే మానవత్వంయొక్క శక్తుల్ని అనుభూతమొనర్చుకోగలమేగాని, మాటల్లో వివరించలేము” అంటూ మనుష్యులమధ్య స్నేహం అవసరం అంటారు.

“జీవితం అంటే ఏమిటి?” — అని ప్రశ్నించుకొని, అదొక నిరంతరమైన అన్వేషణ అంటారు. ఎందుకంటే జీవన రహస్యాలను తెలుసుకున్న వ్యక్తి అన్వేషణ మానలేడు. అలా మానితే జీవితాన్ని అర్థం చేసుకున్న వాడు కాడు, అందుకే జీవితం అంటే ఆలోచనల మయం కాదనీ, అది నిరంతర అనుభూతికీ సంబంధించిందనీ, అనుభూతిని వ్యక్తం చేయలేము కాబట్టి, అన్వేషణ నిరంతరంగా సాగవలసిందే నని అంటారు బుచ్చిబాబు.

బుచ్చిబాబు జీవిత విశేషాలను సమగ్రంగా తెలిపే గ్రనంథమేదీ లేదు. ‘ నా అంతరంగ కథనం ‘ అన్న పేర పదిహేనేండ్ల క్రితం బాల్య స్మృతులకు సంబంధించి ఆయన వ్రాసుకున్న జ్ఞాపకాలు మాత్రమే మనకు మిగిలాయి. ఆయన వ్యక్తిత్వం ఆదినుంచీ పుస్తకాల వల్ల ప్రభావితమైనవే ! ఠాగూర్ ‘రెక్’ నవల, చలం కథలు, కృష్ణశాస్త్రి గేయాలు, ఎంకి పాటలతో బాటు థామస్ హార్డీ, షెల్లీ, కీట్స్, వర్డ్స్ వర్త్. టెన్నిసన్, టాల్ స్టాయ్, మున్నగు వారి రచనలు జీవితాన్ని పరిశీలించడాన్ని నేర్పితే, రస్సెల్, షా, మార్క్స్, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తి రచనలతోబాటు భగవద్గీత — వీరిలో తాత్విక దృక్పథానికి నారు పోసింది. షేక్స్పియర్ నాటకం హామ్లెట్, సాహిత్యం విలాసం కోసం కాదనీ జీవిత విధానాన్ని నిర్ణయించడంలో సాహిత్యానికి ప్రధానస్థానం వుందనీ వీరికి నేర్పింది. తీవ్రమైన ఆలోచనలను రేకెత్తింపచేయగల ఏ మేధావి భావాలైనా వీరిని ఆలోచింపచేశాయి. మనిషికీ, సమాజానికీ వున్న సంబంధాన్నిగూర్చి అన్వేషింపచేశాయి.

“తనకేం కావాలో తెలీనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు. ఏం కావాలో తెలిస్తే, ఆ వొస్తువును ప్రేమించి, దాన్ని పొందడం కోసం యత్నిస్తాడు. తెలీనప్పుడు హృదయంలో మిగిలేది ద్వేషం. అక్కర్లేదని తెలుసుకుంటే మానవులకు ద్వేషం ఉండదు.” అంటూ గుర్తించారు, బుచ్చిబాబు. మానవుణ్ణి జీవితానికి కట్టి పడేసేది కన్నీరు ఆద్యంతాలున్నది కన్నీరొకటే, దానికి అతీతమైన నాడు వ్యక్తి వర్తమానం లో జీవించడం నేర్చుకుంటాడు, అంటారు వీరు. సత్యాన్వేషణలో క్రమపరిణామం అంటే ఆలోచనల స్థాయి నుండి అనుభూతి స్థాయికి రావడమే అని గుర్తించిన వీరు, గతాన్ని తెంపుకున్న వ్యక్తి మత్రమే వర్తమానంలో జీవించగలడు అని గుర్తించారు.

Posted in 2013, డిసెంబరు, వ్యాసం and tagged , , , , .

3 Comments

  1. బుచ్చిబాబు గారి మీద ఓ మంచి వ్యాసం ఇచ్చిన డా. ాయదుర్గం విజయలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు.

    బుచ్చిబాబు గారు విశాఖ Mrs. AVN కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసిన 1942 రోజుల్లో వారి అభిమానం పొందిన ప్రతిభావంతమైన విధ్యార్ధి త్రిపుర గారు. వాళ్లిద్దరికీ షేక్ స్ఫియర్ అభిమాన రచయత. అత్యంత ప్రతిభావంతులైన యీ మేధావులిద్దరూ Stream of Consciousness ‘చైతన్య స్రవంతి‘ పద్దతిని తమ రచనల్లో వాడారు. B.N. రెడ్డి, కృష్ణశాస్త్రి గార్ల కళాఖండం “మల్లీశ్వరి” సినిమాకు బుచ్చిబాబు గారు కధను సమకూర్చినా సినిమా టైటిల్స్ లో గాని ఇతరత్రా గాని వారికా క్రెడిట్ దక్కలేదనేది విచారించ వలసిన విషయం. బాపూ గారికి చిన్నాన్న వరసైన బుచ్చిబాబు గారికి చిత్రకళలో ఉన్న ప్రతిభకు ( in oil paintings, water colors etc in Oldmasters’ style ) తగిన గుర్తింపు రాలేదనిది మరో విచారం. బుచ్చిబాబు గారి Paintings అన్నీ ఓ పుస్తకం రూపంలో తీసుకు రావటానికి వారి శ్రీమతి, శివరాజు సుబ్బలక్ష్మి అమ్మగారు వ్యయ ప్రయాసల కోర్చి కృషి చేస్తున్నారు.

  2. మేడం, బుచ్చిబాబు గురించి ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది . పయిగా మీరు బుద్ధిజం కోణం తో చుస్తారు కాబట్టి తాత్వికత తలుపులు తీసుకుంటుంది. మరోసారి బుచ్చిబాబు నన్ను ఆవహించేలా చేసారు. ధన్యవాదాలు.
    – తహిరో

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.