cover

కావిడి

Download PDF ePub MOBI

కావిడి పండగొచ్చేసింది. నాకూ కావిడెత్తే మొక్కుబడుండాదా. అందుకే మాయమ్మ నిలుకులేని పనుల్లో ఇల్లు బూసింది. మా పెదనాయన పెద్దమ్మోళ్లకు, మాయత్తమ్మోళ్లకు కావిడి పండక్కు రమ్మని సెప్పి పంపించింది. ఇంగ మా యవ్వోళ్లేమో మావూర్లోనే వుండారులే.

ఈసారి గిరింపేట సుబ్రమని సామి గుడికి గాకుండా అందుర్తో మనమూ తిర్తనికి బోదామని రొండు దినాలుగా శతపోరాతా వుండాను. గిరింపేట మావూరికి మూడు కిలోమీటర్ల దూరంలో వుండాది. తిర్తనికి బోవాలంటే బస్సెకాల. అరవై కిలోమీటర్ల దాకా బోవాల. అది తిరప్తి మాదిరి గదా! ఆడికి జనాలెక్కువొస్తారు. కొండమెట్లు కూడా గిరంపేట కొండ మెట్లకంటే జాస్తిగా వుండాయి. మొదటి సారిగా పోయిన సమ్మత్సరం కావిడెత్తినప్పుడు తిర్తనికే పిల్చుకోని బొయినాడు మమ్మల్ని మా నాయన.

ఊర్లో 20 – 25 దాకా కావిళ్లు ఎలబారతాయి. పెతి సమత్సరం తిర్తనికి బొయ్యి మొక్కు జెల్లించేవాళ్లే ఎక్కువ. మాలాంటోళ్లు గిరంపేటలో సరిపెట్టుకుంటాము. కొంతమంది ఊరుదాటేదాకా వూరేగింపులో వొచ్చి వేరే ఎవరినైనా పంపించి మొక్కు సెల్లిస్తారు.

తిర్తనికి బొయ్యే ఇసయాన్ని మాయమ్మ మా నాయన్ని గూడా అడిగినట్లుండాది. పిసినార్ది. బస్సు శార్జీలయిపోతాదని బాద పట్టుకోనుంటాది. అందుకే ఆమాట కూడా ఎత్తలేదు. అందుకే మాయమ్మను మళ్లీ అడిగినాను. ‘అమా నీలా, కాంతా వాళ్లు గూడా తిర్తనికి బోతావుండారు. వాళ్లు కావిడి గూడా ఎత్తరు గదా! నీలా వాళ్లన్నోళ్లెత్తతా వుంటే వాళ్లింట్లో అందురూ బోతా వుండారు మా కాంతగూడా వాళ్లమ్మ కావిడితో బోతావుంది. మనమూ బోదాంమా’ అంటే మాయమ్మకు సెడ్డకోపమొచ్చేసింది. ‘పెద్దోళ్లు సెప్పినట్లినాల పాపా! మూడేండ్లకొకసారి పిల్చబోతానని పొయినసారే సెప్పినాను గదా! నీది పెద్ద రావిడయిపోయిందే. మీ నాయినితో సెప్పినానంటే తోల్దీశేస్తాడు’ అనింది.

నేనేం తక్కవా? అందుర్తో గల్సి తిర్తనికి బోవాలని ఆశపడ్తావుంటే. అందుకే ‘అమా నాయిన్తో జెప్పినా, ఏంజేసినా తిర్తనికయితేనే నేను కావిడెత్తేది’ అనేసినాను కొంచిం గెట్టింగానే.

‘ఏం మాట పాపా. నువ్వు మాట్లేడేది. నీకేమన్నా బుద్దుండాదా. “ఏరుదాటేదాకా ఎంగన్నా – ఏరుదాటినాక పింగన్నా” అని నీకోసం మొక్కుంటే ఇప్పుడట్లా మాట్లాడొచ్చా.

‘నేనేమో కావిడి మోసుకోని వూరంతా దిరగాల. అన్ని కావిళ్లు తిర్తని తిర్నాలుకు బోతే నేను మాత్రం గిరంపేటకు బొయి బోడి గొట్టుకోని వొచ్చేయాల్నా బోడిగుండు మొదటిసారే ఎంటికిలిచ్చేసినాంగదా! ఇంగ కొట్టే పన్ల్యా. దేముని మొక్కిది. నోటికెంతొస్తే అంతా మాట్లాడొద్దు. హెద్దోళ్లం మేముండాము’ అని తిట్టింది.

కావిడెత్తాలంటే నాకెంత కుశాలో. వూరికే మాయమ్మతో అట్ల మాట్లాడ్తాను గాని సిన్నపాపనని అందురు నన్నే ముందు నిలబెడతారు. పైగా ముందు మాయింటి నుంచే గదా కావిళ్లు బయలుదేరేది. పెద్దోళ్లు అడ్డంగా పండుకొంటే వూర్లో పిలకాయిలు కావిడెత్తుకోని వాళ్లను దాటుకుంటా పోతావుంటే ఎంత గొప్పగా వుంటాది. మాయమ్మ ఈ మొక్కు మొక్కోని మంచిపనే సేసింది.

మాయమ్మ నాసేత కావిడెత్తిస్తానని మొక్కుకునింది ఎందుకో తెలుసా? అప్పుడూ అంతే మాయవ్వ ఏనుగుఞటపల్లి బారతానికి పోతావుంటే పులుసన్నం గట్టించి మాయక్కను మాయవ్వతో పంపించింది. నేనూ బోతానని యేడ్సినాను. మాయవ్వకూడా పిల్సుకోని బోతాననే సెప్పింది. మాయమ్మకు ఆయమ్మ రాకుండా మమ్మల్నేడికన్నా పంపించాలంటే వూపిరి బోతాది. ఊర్లో పిలకాయిలు బోతావుంటే వాళ్లతో నన్నసలు పంపించదు. నేను కచ్చిపోతునని కొట్లాట్లు ఇంటికి దెస్తానని బయం. తులవబిడ్డి అని తిడ్తాదెప్పుడూ నన్ను.

‘అక్క మాత్రం బోవచ్చా’ అంటే ‘అవ్వకు తోడుండాల’ అనింది. ‘నేను గూడా తోడుగా వుండాను’ అన్న్యాను. ‘నువ్వు తోడుంటావా? నీకు కాపలాగాసేవోళ్లను నేను యాన్నించి దెచ్చేది’ అని వాళ్లు బోతావుంటే వాళ్లెంట పడిన నన్ను గెట్టింగా పట్టుకోనొచ్చి ఇంట్లోయేసి తలుపు మూసి ఆపక్క సిలుకు బెట్టేసింది.

నేను తలుపు గొట్లా. గెట్టింగా మాయమ్మని పిలవలా. నాకు కడుపులో నుంచి దుక్కం తన్నుకోనొస్తావుండాది. మా యక్కను మాత్రం ఎప్పుడూ ఏ మనదు మాయమ్మ. ఏమీ అడక్కపోయినా నేనడిగింది మాయక్క క్కూడ ఇస్తాది. యాడికైనా పంపిస్తాది. అన్నిటికి నన్నే తిడ్తాది. కొడ్తాది కూడా. బసివి. దూపరదొండి. ఇర్లసెంగి అని అందురిముందు ఎగతాళి జేస్తాది. అనుకొనేకొద్దీ ఏడుపు ఎక్కువతా వుంది. ఎక్కెక్కి కడుపులోనే శబదం బైటికి రాకుండా ఏడ్సుకుంటా వుంటే తలుపు తెర్సుకొనింది. గెట్టిగా కండ్లు మూసుకున్నాను.

మాయమ్మొచ్చి నన్ను జవురుకోని వొళ్ళో కూసో బెట్టుకొనింది. ‘యాడవద్దు నాయనా బంగారు గదా! నిన్ను నేను బొయ్యేటప్పుడు పిల్సుకోని బోతాను గదా! అప్పుడక్కను పిల్సకపొయ్యేది ల్యా. అప్పుడు నీకు నేను కిచ్చిలి పెప్పరమెంట్లు, గాలిబుడ్డలు అన్నీ తీసిస్తానంట. అవి జూసి అక్క కుళ్లు కోవాల్ల. రా బాయికాడికి సంగటెత్తుకోని బోవాల గదా! నువ్‌గూడా ఆడేసేతిలో బెట్టుకోని తిందువు గాని. నీ కట్లా తినేది శానా ఇష్టం కదా!’ మాయమ్మ అడుక్కుంటా వుండే కొద్దీ నాకు రోసం పెరిగిపోతావుంది.

నేను రానని మోసేతుల్తో మాయమ్మను అడ్డుకుంటా వుండాను.

‘రా నాయనా లేటయితే కూలోళ్లు పన్జెయ్యకుండా ఇండ్లకు పూడస్తారు. మీ నాయన్తో నాకు దొబ్బు దేవులు’ అని సానా సేపే అడుక్కునింది. నేను అంత కంటే శానాగా మొండికేసుకొని వూఁ వూఁ అని రాగం దీస్తానే వుండాను.

వుండెట్టుండి మాయమ్మకు శానా కోపమొచ్చేసినట్లుండాది ‘ఇంత మొండితనం పనికిరాదు సినపాపా. అడుక్కుంటావుంటే ముడుక్కుంటా వుండావే. యాడన్నా సావు. నేను బాయికాడికి సంగటెత్తుకోని బోవాల’ అని లేసి గుడ్సింట్లోకి బోయింది.

మళ్లీ వొచ్చి పిలస్తాదని ఎదురు సూస్తావుండానా, వూహూఁ – రాలేదు. అలికిడిని పిస్తాదేమోనని ఏడుపాపేసి గమనిస్తావుంటి కొంచేపు. ఏమీ సెబద్దం రాలా. కొంచేపు బయంగా వునింది. లేసి గుడ్సింటిపక్క తొంగి సూసినాను. తలుపేసుంది. ఎవురూ లేరు. తలుపు దెర్సిసూస్తే సంగటిగంప గూడా లేదు. బొప్పగిన్నిలో సిన్న సంగటిముద్ద బెట్టి ముద్ద జేసే సంగటి పలక మూసిపెట్టుండాది. అంతే యాల్లేని వుక్రోసమొచ్చేసింది నాకు.

సంగటేసేసి మా నాయన గెనాల్లో కసువు గోసుకోని పొమ్మని జెప్పినా ఇనకుండా ‘ఇంటికాడ పసిబిడ్డొకితుంది. తిండిగూడా తినకుండా యాడస్తా వునింది. నేనూ బోతా. అంతగా అయితే మళ్లీ వొస్తాలే’ అని ఇంటికొచ్చిందంట మాయమ్మ. ఇంట్లో యాడుండాను నేను. పెద్దిల్లు, గుడ్సిల్లు రొండూ తలుపులు బార్లా తెర్సుకోనుండాయంట. సినపాపా సినపాపా అని పిలస్తా ఇంటి సుట్టుపక్కల తిరిగి సంగటి తిన్న్యానేమో అని పొయ్యిసూస్తే అది మూత దీసేసిన బొప్పగిన్నెలో ఎండతా వునిందంట. మాయవ్వోలింటికి పొయ్యుంటాననుకొనింది మాయమ్మ. ఎందుకంటే ఆకలికి కొంచెం సేపుకూడా తాళలేను గదా!.

శానా సేపు సూసినా రాకపోయేసరికి మాయమ్మే మా యవ్వోలింటికి బోయింది. ‘పాపొచ్చించామా?’ అంటా. ‘రాలేదే’ అనిందంట మాయవ్వ. అంతే గుండికాయిలి నీరైపోయినాయి మాయమ్మకు. మాయమ్మ నీల, కాంత, ఏమలతా వాళ్లిండ్లలో అడుక్కుంటా బాయికాడికే పరిగెత్తిందంట. ఏనుగుంటపల్లి దారి బట్న్యా నేమోనని ఆడికి మా జీతగాడు బాలన్ని తరిమినాడు మా నాయన. ఆడలేను. రెయ్యాట గూడా సూడాలని సద్దికూడా మూటగట్టుకోని పొయిన మాయవ్వ, మాయక్కతో పాటు మా పెద్దమ్మోళ్లు అందురూ ఇండ్లకొచ్చేసినారు. అయిపులేదు నేను.

కన్నీరు మున్నీరుగా యాడస్తా మాయమ్మ నడివాకిట్లో నిలబడి నలుగురూ ఇంటా వుండంగా ‘అయ్యా సుబ్రమన్ని సామీ, ఏలాయుద పాణీ, ఆరుముగమా నా బిడ్ని నా కండ్లముందు సేమంగా నిలబెట్టు సామీ! ఆ బిడ్డి తలనీలాలిచ్చి ఐదేండ్లు నీ కొండకు కావిడెత్తించి సెల్లిస్తాను’ అని మొక్కుకునిందంట. అప్పిటికే దీపాలు బెట్టేయాళయింది. వూరి జనమంతా ఇంటిముందే వుండారంట. అప్పుడు నడుపబ్బ పెదనాయిన నన్ను బిల్సుకోని ఇంటికొచ్చే పాటికి మాయమ్మను సూడాల. నా సామిరంగా. ఏడస్తానే నన్నెత్తుకోని, ముద్దులు బెట్టుకోని గిరంపేట కల్లాదిరిగి ‘సామీ, నువ్వుండావు దేవుడా. నీ కొండ సల్లంగ వుండాల ఐదేండ్లే గాదు వొడ్డికావిడితో సగా పదేండ్లు నీ కొండకొచ్చి మొక్కు దీర్సుకుంటా’ అని అంటానే వుందంట మాటిమాటికి.

‘యాడునింది. ఎట్ల దొరికింది’ అని నడపబ్బ పెదనాయన దుంపదెంచేసినారంతా. నిద్రమొగంతో వున్ని నాకు ఏం జరగతా వుందో అర్తంగాలా. నాకు కోపమెందుకొచ్చిందో మర్సిపొయినాను. మాయమ్మ కొంగు బట్టుకోనే నిల్సుకోనుండా.

పెదనాయన గొడ్లను బట్టుకోనొస్తావుంటే సెరుకుపైరు పక్క వొంగిందంట ఒక ఎద్దు. హెయ్ అని పెదనాయన పగ్గాన్ని ఈడ్సిపట్టంగానే కూడావున్ని కుక్క ఎద్దుమింద అరవడం మొదులు బెట్టింది. సెరుకు దోట్లో కాలవలో పండుకోని మంచినిద్రలో వున్ని నేను వుల్కిపడి లేసి సూస్తే సీకటి బడింది. యాడుండానో కూడా దిక్కు దెల్ల్యా. బయంతో అమా, అమా అని అర్సినానంట. మాయమ్మోల్లేడుండారు బాయికాడ. నడుపబ్బ బెదనాయిన అట్లే నిలబడి ఆలకించినాడంట. సెరుకు దోట్లో నుంచి గెనింమిందికి పరిగెత్తుకోనొచ్చి నన్ను ఆయన పిల్సుకోనొచ్చినాడు. ‘ఇంతసేపేం జేస్తావుంటివి బాయికాడ?’ అని అడిగినా నేను బదులు మాట్లాడలేదంట. ఇంటికొచ్చేదాకా ఆయనకీ ఇసయం తెలియనే తెలియదంట. ఆ మొక్కు దీర్సేడానికే ఇప్పుడు కావిడి.

ఇంటికొచ్చినాక ‘తిరత్తని కయితేనే కావిడెత్తదాదంట నీ ముద్దుల కూతురు’ అని మా నాయిన్తో జెప్పింది మాయమ్మ. ‘అట్లే గానీలే’ అన్న్యాడు మా నాయన.

‘గంగిరెద్దు మాదిరిగా అదడిగిందానికంతా తలూపతావుండు అది రేపు నీ నెత్తిక్కి కూసుంటాది’ అనింది కోపంతో మాయమ్మ.

‘ఇద్దో’ అని ఏందో సైగ జేసినాడు. నాయన. మళ్లి మాయమ్మకు ఏం మంత్రమేసినాడో మా నాయన. దండిగా పుల్సన్నం జెయడానికి ‘కిచ్చిలి సెంబావు బీము సెరిగిపెట్టుమా’ అని మాయవ్వకు జెప్పింది.

తిర్తని నుంచి సోలింగరం సిన్న కొండెక్కేదోవలో పులుసన్నం మూటలిప్పుకోని తింటా నేను తిర్తనికి రావాలని వుడకాడించిందంతా నీలా వాళ్లమ్మా వాళ్లతోసెప్తా ‘ఇప్పుడు తిర్తనికొద్దంటివనుకో మళ్లీ ముడుపుగట్టి మొక్కుబడి మొక్కోవాల్సొస్తాది’ అని మా నాయన సెప్పినాడని అంటా వుంటే అందురూ పడిపడీ నవ్వినారు. ఎందుకు నవ్వతావుండారో నాకైతే అర్తంగాలా. ‘నేను కోరిన కొండమింద వాన గుర్సింది. నవ్వుకుంటే నవ్వుకోనిలే’ అనుకుంట్ని.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, ఇర్లచెంగి కథలు, నవంబర్, సీరియల్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.