cover

పదనిష్పాదన కళ (25)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

పదిహేనో అధ్యాయం

పునరుద్ధరణీయ పదజాలం

వాస్తవానికి ఈ ప్రస్తావన నూతన పదనిష్పాదన విభాగం క్రిందికి రాదు. కానీ ఉన్నది నశించిపోకుండా కాపాడుకోవడం కూడా లేనిదాన్ని గడించడంతో సమానం కనుకా, మనకి తెలీని ప్రతీదీ ఓ క్రొత్త కనుగోలే కనుకా, ఇక్కడ దీన్ని ఇలా ప్రత్యేకంగా అధ్యాయీకరించడం జఱిగింది.

తెలుగుభాషకి స్వతహాగా ఉన్న భావవ్యంజనాశక్తి అపారం. అయినప్పటికీ ఇది సూత్రప్రాయంగానే తప్ప ఆచరణలో అధికార భాషగా అమలుకావడం లేదు. పాఠశాలల దగ్గఱినుంచీ ఆంగ్లమే రాజ్యమేలుతోంది. మఱో పక్క మనలో లోతుగా పాతుకుపోయిన స్వభాషాద్వేషం, పరభాషావ్యామోహం. ఇలా ఛప్పన్న కారణాల్ని పురస్కరించుకొని తెలుగు పదసంపదా, వైశిష్ట్యమూ వెలుగులోకి రాకుండా నానాటికీ మఱుగున పడుతున్నాయి. మనం పాత తెలుగుగ్రంథాల్ని తిరగేసినప్పుడు నేటి జీవనావసరాలకి ఉపయుక్తమైన పదజాలం వాటిల్లో లెక్కకు మిక్కిలిగా కనిపిస్తుంది. దాన్నంతటినీ ఈనాటి వాడుకలోకి తీసుకొచ్చి పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి బ్రిటీషువారి కాలంలో కూడా తెలుగు అధికారభాషగా గానీ, బోధనాబాషగా గానీ లేదు. ఆ వాతావరణంలోనే చదువుకున్నప్పటికీ, మన తాతముత్తాతల తరంవారు తమకి తెలిసిన ఆంగ్లపదాలకి దీటుగా అనేక పాత తెలుగుపదాల్ని పునరుద్ధరించి ప్రయోగించారు. అదే ఈనాటి తెలుగుపత్రికాభాష అయింది. ఇజ్రాయిల్ దేశస్థులైతే ఏకంగా ఒక మృతభాష (హెబ్రూ) నే పునరుద్దరించి దాన్ని తమ దేశానికి అధికారభాషగా కూడా చేసుకున్నారు. (శుభ్రంగా బ్రతికున్న భాషనే తెగటార్చ సమకట్టినవాళ్ళతో పోలిస్తే వారి భాషా-సంస్కృతుల అభి మానం ఎంత మహోన్నతమో కదా) అటువంటప్పుడు మనం మన యొక్క జీవంత మాతృభాషకి చెందిన కొన్ని విలువైన పాతపదాల్ని పునరుద్ధరిస్తే తప్పేముంది? కొన్ని పదాలకి గ్రాంథికం అని ముందే పేరు పెట్టేసి, వాటిని ప్రజాసామాన్యానికి కృత్రిమంగా దూరం చేసి భాషని బీదరించడం తగదు. ఏదైనా వాడుక మీదే ఆధారపడి ఉంటుంది. వాడకపోతే అంతా గ్రాంథికమే. వాడుతూ పోతే అంతా వ్యావహారికమే. వాడుతున్నకొద్దీ ఆ పదాలు మనకి ఇంతకుముందుకన్నా ఎక్కువ సుప రిచితమూ, సద్యఃస్ఫోరకమూ అవుతాయి.

ఈ సందర్భంగా నా దృష్టికొచ్చిన కొన్ని పాత తెలుగుపదాల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాను. ఇవి ఎక్కువభాగం పాత పుస్తకాల నుంచీ, నిఘంటువుల నుంచీ సేకరించినవి. అంతర్జాలం నుంచీ, మాండలిక వాడుకల నుంచీ సేకరించినవి కూడా కొద్ది ఉన్నాయి.

అంకణం – రెండు దూలాల మధ్యస్థలం

అంకనం – గుర్తువేయడం Branding.

అంచలం – కొంగు, చివఱ

అంతర్ముఖుడు – Introvert

అంతర్లాప – తనలోనే సమాధానం కూడా కలిగిన ప్రశ్న.

అందిక/ అందుబడి – అందుబాటు

అంధాహి – విషం లేని పాము.

అంపఱ – బాణసమూహం

అంబారు పిడుజు – పశువుల రక్తం పీల్చే ఒక పురుగు

అకృష్టపచ్యం – దున్నకపోయినా పండే భూమి

అక్కళించు – పొట్ట వెన్నుకు అంటుకునేలా ఊపిరి బిగబట్టు

అగరి – విషానికి విఱుగుడు

అచ్చుకూటం – ముద్రణాలయం

అచ్ఛిద్రం – సందులేనిది, రంధ్రాలు లేనిది impervious, waterproof, airtight.

అట్టకం – మేడమీది గది

అట్టడి – కోట బురుజుమీది ఇల్లు

అట్టనం – పాటించకపోవడం, ఉల్లంఘన non-compliance

అడియాలం – ఆనవాలు, రుజువు. ఒక విషయాన్ని లేదా వ్యక్తిని గుర్తుపట్టడానికి ఉపకరించే identity card లాంటిది.

అడ్డకొడమ – చేపలు పట్టే ఒక సాధనం

అతిసౌహిత్యం – రుచిగా ఉందని చెప్పి ఎక్కువగా భోజనం చేయడం

అత్తెం – హస్తకవచం Gloves

అధివిన్న – మొదటి భార్య

అధివేత్త – ఒక భార్య ఉండగా మళ్ళీ పెళ్ళి చేసుకున్నవాడు

అధివేదనం – ఒక భార్య ఉండగా మళ్ళీ పెళ్ళి చేసుకోవడం

అధీతి – అధ్యయనం

అనుయోజనం – విచారణలో ప్రశ్నలు అడగడం Interrogation

అనుశ్రవం – తరతరాలుగా వినవస్తూన్న వృత్తాంతం Hearsay

అపటీక – ఆలోచనల్నిమఱుగుపఱచడం Reserved-ness

అపస్కరం – బండి యొక్క విడిభాగం Accessory

అవ్యళీకం – నిర్మలమైన మనస్సుతో కూడినది candid

అశిష్యం – నేర్పడానికి వీలుపడనిది

అనాహం – మలమూత్రబంధనం

ఇల్లడం – జాగ్రత్తగా భద్రపఱచమని ఇతరుల వద్ద ఉంచిన సొమ్ము, వస్తువులు మొ||వి. (deposit)

ఉగ్రాణం – సామానులుంచే గది. Store room

ఉచ్చావచం – నానావిధాలైనది

ఉత్తానం – లోతులేనిది Shallow.

ఉత్తేజనం (ఉత్తేజించుట) – పదునుపెట్టడం

ఉత్థం – లేచినది, తొలగినది.

ఉద్దరి – ఏటవాలుగట్టు

ఉపరథ్య – చిన్నమార్గం Arterial road.

ఉరువిడి – వస్తుసమూహం

ఋక్థం – పిత్రార్జితం

ఎండువులు – ఎండలో ఆరబోసిన ధాన్యం

ఎక్కలి – ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఇసుక

ఎగుబోద – ఱెక్కలొచ్చిన పక్షిపిల్ల

ఎడకారు – మాఘమాసం నుంచి జ్యేష్ఠమాసం లోపల పండే పంట

ఎలగోలు – ముందునడవడం

ఎలగోలు – వాన కుఱుస్తున్న చప్పుడు

ఎల్లాపి – దారిదొంగ

ఏలుకోటి – పాలితులు Subjects.

ఒగ్గం – ఏనుగుల్ని పట్టుకోవడం కోసం పెద్దగొయ్యి త్రవ్వి దాన్ని ఆకులూ మొదలైనవాటితో కప్పడం

ఓహటించు – వెనుదీయు

కంటలం (కవాడం) – ఎద్దుల మీద వేసే బరువైన సంచుల జత cargo.

కండ్రిక – భూఖండము A tract of land.

కందాయం – నాలుగుమాసాల కాలం

కందెన – చక్రాల బిగి సడలించడానికి వేసే నూనె. Lubricant

కక్కువాయి – దగ్గువ్యాధి

కట్టుక – గర్భస్రావం

కనుప్రొద్దులు – బిడ్డను కనాల్సిన నెల

కన్నెం – కోడి గుండెకాయ

కబ్బలి – కల్లమ్మేవాడు

కయాహం – బఱ్ఱెదూడ

కరోటం – బట్టలు పెట్టుకునే పెట్టె

కఱవాడి – ఎండుచేప

కఱి – పశుయోని

కలపకట్టె – కొయ్యకలం (wooden pen)

కలమరి – ఓడ ఎక్కి వెళ్ళే ప్రయాణికుడు Sailor.

కల్యవర్తం – ఉదయకాల ఉపాహారం Breakfast

కవిరి దినుసు – తాంబూలంతో పాటు వేసుకునే సువాసనపదార్థం

కసుబ – అధికారులుండే ప్రాంతం

కాకిసోమాల – Hysteria

కాపంతం – కుక్కని కట్టివేసే కొయ్య

కామ – గొడుగుపైన అమర్చే చిన్న ఇనపశలాక. చదివేటప్పుడు నిలిపివేసిన భాగం దగ్గఱ నిలువుగా వేసే గుర్తు.

కాయమానం – ఆకుటిల్లు, పూరిగుడిసె, పందిరి.

కారణికుడు – పరీక్ష చేసేవాడు

కిట్టించు – మోసం చేసే ఉద్దేశంతో, సరిపోలని లెక్కల్ని కృత్రిమంగా సరిపెట్టి చూపడం

కీతు – కొబ్బరాకుల చాప

కుటిలిక – తంటసం (వెంట్రుకల్ని పెరికే సాధనం)

కురువ – కొండ మీద పారే కాలువ (‘కొండమీది దారి’ అని కొన్నిచోట్ల)

కులుకం – నాలుకమీది పాచి

కువిందం – లోహాలకు మెఱుగుపెట్టే చూర్ణం

కూటస్థం – రూపాన్ని మార్చుకోకుండా స్థిరంగా ఉండేది Constant, as opposed to a variable.

కూటిముత్యం – కృత్రిమ ముత్యం, Cultured pearl

కొందుట – నజ్జునజ్జుగా నఱకడం

కొదుపుట – నమలకుండా మ్రింగడం

కొనటి – కురూపి, అంగవిహీనుడు

కొఱడు – ఇంద్రధనుస్సు

కొఱను – పక్షులు ఎర ఏఱుకొని తినే చోటు

కోటికాడు – గూఢచారి

కోరడి – కరగోడ, ఆవరణగా కట్టిన మట్టిగోడ

కోఱం – కొబ్బరి కోరే సాధనం

కోల్తల – యుద్ధసన్నాహం

కోలెమ్ము – వెన్నెముక

కోల్పులి – పెద్దపులి

కౌచు – చేపమీది పొట్టు

కౌటతక్షుడు – ఒకఱి క్రింద కాక స్వతంత్రంగా పనిచేసే వడ్రంగి Freelance carpenter

(వివరణ :- కుటీ-తక్షుడు = కుటి అంటే ఇల్లు. తన ఇంట్లోనే ఉండి చెక్కేవాడని శబ్దార్థం)

కౌద్రవీణం – ఆళ్ళు పండే పొలం

కౌసు – మాంసం

క్రంచఱగా – ఎడతెగకుండా, continuous గా

క్రాయు – ఉమ్మివేయు

క్రిక్క – వందిమాగధుడు, భట్రాజు

క్రీనీడ – అస్పష్టమైన నీడ

క్రీతం – కొనబడిన వస్తువు

క్రుంకుడు – సూర్యాస్తమయం

క్రేగంటి చూపు – కనుకొలకుల్లోంచి చూడ్డం

క్రేటుకొను – గొంతు సవరించుకొను

క్రేత – కొనేవాడు

క్రేపు – దూడ, పర్వతశిఖరం

క్రేవ – దిక్కు, ప్రక్కవైపు, పార్శ్వం

క్రైలు – ధాన్యాన్ని నూర్చి కొలవడం

క్రైలుదారు – ధాన్యాన్ని నూర్పించి కొలిచే అధికారి

క్రోవ (కోవ) – హారం, దండ

క్రోవి – గొట్టం

క్లీవం – ఆడా, మగా కానిది

క్లేదకం – తడిపేది

క్వాచిత్కం – అరుదుగా జఱిగేది, అఱుదుగా కనబడేది

గండమాల – థైరాయిడ్ సమస్య

గండూషించు – పుక్కిలించు

గిరక (గిలక) – నూతిరాట్నం

గిజరు – వంగ, మామిడి మొదలైన ఫలశాకాదుల్లో ఉండే పీచుతో కూడిన మెత్తని పదార్థం, కోడిగ్రుడ్డులోని పచ్చసొన

గీట్లబద్ద – రూళ్ళు కొట్టే స్కేలు

గుంటక – విత్తనాలు చల్లిన తరువాత పొలాన్ని చదునుచేసే సాధనం

గుండిగ – వెడల్పుమూతి గల లోహపాత్ర (డేగిసాలాంటిది)

గుండుగుత్త – సర్వహక్కులతోనూ ఇచ్చే గుత్తాధికారం

గుండ్ర – గ్రుడ్లగూబల అఱుపు

గుమి/ గమి – గుంపు

గురుజు – తిరగటి కొయ్య

గులిమికదురు – చెవిలో గులిమి తీసుకునే పుల్ల

గూడుబండి – పైన కప్పువేసిన బండి

గృష్టి – ఒకే ఒక బిడ్డను కన్న స్త్రీ

గెలువం – విజయం

గ్రెమ్ముట – సాగగొట్టడం

గ్లాస్నువు – రోగి

చిమ్మనగ్రోవి – ద్రవాల్ని పిచికారీ చేసేందుకు ఉపయోగించే గొట్టం గల సాధనం

చిరంతనం/ చిరత్నం – చాలాకాలం నుంచి ఉన్నటువంటిది

చీవరం – బిచ్చగాడి వస్త్రం, rags

చెక్కెం – మజ్జ, marrow

చన్మఱ – స్తనాగ్రం చుట్టూ గుండ్రంగా ఆవరించి ఉండే దళసరి చర్మం areola

జామి – (ఇది సంస్కృత పదం) భార్య, చెల్లెలు, కూతురు, కోడలు ఇత్యాది కౌటుంబిక స్త్రీ

తఱిమెన – కొయ్యను యంత్రంతో నునుపు చేయడం Finishing

తెఱువాటు – దారిదోపిడి

తెఱకువ – వివేకం, జ్ఞానం

తొరపుట – వేణ్ణీళ్లని చల్లార్చడం

త్రిధాకరణం – మూడుముక్కలు చేయడం (అలాగే ద్విధాకరణం, చతుర్ధాకరణం మొ||)

దలపం – ముఖానికి అడ్డుగా (రక్షణగా) ధరించే త్రాణం

దళవాయి – సేనానాయకుడు

దుంబాలా – ఇనాం భూమి

దెంచనం – పెద్దఫిరంగి

దోర్బలం – కండబలం Muscle power

ద్వారి/ ద్వారదర్శి – వాకిటి కావలివాడు Gate-keeper

ద్వైవార్షికం – రెండు సంవత్సరాలకొకసారి జఱిగేది/ జఱిపేది biennial

ధూమిక – దట్టమైన మంచు Fog

నవగోజ – పెద్దగుడారము

నితాంతం – ఎడతెగనిది, నిరంతరం continuous

నియాతనం – క్రిందికి త్రోయడం

నిరుపహతం – ఏకాగ్రతాభంగం లేనిది undisturbed

నిరూహం – నిశ్చయించలేనిది Clueless

నిర్దేష్ట – నిర్దేశించేవాడు Director

నిర్యాతనం – అప్పును తిరిగి తీర్చడం

నిర్యాపణం – వెళ్ళగొట్టడం

నిస్తంద్రం – అలసట లేనిది, చుఱుకైనది, చొఱవగలది

నిహ్నుతం – మఱుగుపుచ్చబడినది Concealed

పంగటించు – కాళ్ళను పెడగా చాచి నడచు to stagger

పడిగ – ఉమ్మివేసే పాత్ర spittoon

పడిగల్లు – తుపాకిగుండు bullet

పలుగఱ – పండ్లపొడి

పల్లటింపు – అటూ ఇటూ ఎగుడుదిగుడుగా కదలడం Fluctuation

పస్సెవన్నె – పాటలవర్ణం Rose color

పాయకట్టు – ఒక నగరముతో చేఱిన గ్రామముల సమూహం, శివారు ప్రాంతం Suburban, metropolitan area

పిల్లం – తడిసిన కన్ను

పురోణి – చిన్న ఉత్తరం (జాబు) missive

పూటకాపు – ఇంత డబ్బిస్తే ఈ పని చేస్తానని ఒడంబడేవాడు Contract worker

పెడచెవి – చెవి వెనకభాగం

పెడనెల – తీర్పరి

పేరెం – గుఱ్ఱప్పరుగు race

పొక్కలి – మూడుఱాళ్లతో ఏర్పఱచిన పొయ్యి

పొరకటి – వాకిటి దగ్గఱి గోడ

ప్రండి – శుల్కం tariff

ప్రఘాణం/ ప్రఘణం – వాకిటి పక్క గది

ప్రభాసిని – చర్మం యొక్క పైపొఱ epidermis

ప్రమ – యథార్థమైన జ్ఞానం, కొలత

ప్రమాత – యథార్థమైన జ్ఞానం గలవాడు

ప్రాతిభావ్యం – ఇంత డబ్బిస్తే ఈ పని చేస్తానని ఒప్పుకోవడం contract (ప్రాతిభావి = Contractor)

ఫక్కిక – అధ్యాయవిభాగం లేని ఏకాండీ గ్రంథం

బరాతం – ఆజ్ఞాపత్రం Ordinance

బిడాయించు – ఒకదానిలో మఱొకదానిని బిగించి మూయు

బిడారు – వర్తకసమూహం

బుసం – మీగడ తీసిన పెఱుగు

బూర్నీసు – మెత్తని కంబళి

బూల – తాటిమానులోని మెత్తటి భాగం

బొండెం – ముళ్ళతడిక

బొది – ఓడలు తయారుచేసే చోటు Shipyard

బోడపత్రం – పూచీలేని దస్తావేజు

బ్రహ్మస్థలి – ఊరిమధ్యలో ఉన్న ప్రదేశం

బ్రిందు – ఇఱుకుచోటు

భారంగి – ఇతరుల్ని పోషించే స్త్రీ

భిస్సట – మాడిన అన్నం

భూకలం – స్వాధీనం కాని పెంకెగుఱ్ఱం

భ్రక్షం – తన తప్పును మఱుగుపఱచడం

మండకంచం – గోడలు గల కంచం (భోంచేసే పళ్లెం)

మండిగం – గడపకొయ్య (ద్వారబంధం)

మంథరువు – విసనకఱ్ఱ వీవడం వల్ల కలిగే గాలి

మందుపట్టడ – బాణసంచా (టపాసులు) తయారుచేసే శాల

మందవిసర్పం – మెల్లమెల్లగా ప్రాకేది

మటపల్లి – దేవాలయంలోని వంటిల్లు (ప్రస్తుతం దీనికి తమిళ శైలిలో ‘పోటు’ అని వాడుతున్నారు. కానీ తెలుగులో పోటు అనే మాటకు అర్థం వేఱు)

మడ – (నది లేదా సముద్రం యొక్క) ప్రవాహమార్గ పరిసరం

మణేదారు – అధికారి

మన్య – మెడ ఎముక

మఱిగ – ఱాచ్చిప్ప

మలప – దూడ చనిపోయాక కూడా పాలిచ్చే పశువు

మలారం – మట్టిగాజుల గుది

మలికారు – శీతాకాలం, రెండో పంట

మాడెం (మాండ్యం) – మండలాధిపతుల భూమి

మిడుచు – బొట్టుబొట్టుగా ద్రవాన్ని వదలు

మిళ్ళి/మిల్లి – చిన్ని చెంచా

మిళుసు – ఊరగాయని పెరుగులో కలిపి మళ్ళీ పోపువేసి చేసిన పచ్చడి. (దీన్ని ఇడ్లీలాంటి ఉపాహారాలకు ఆధరువుగా కలుపుకొని తింటారు)

ముక్కద్దం – కంటిఅద్దం, సులోచనం

ముచ్చిలిక – ఒడంబడిక పత్రం

మేడికోరు – కౌలురైతుకు వచ్చే ధాన్యభాగం

యుగపత్ – ఒకేసారి సంభవించే, ఏకకాలీనం Simultaneous

ఱవాయి – కృత్రిమరత్నం

రుక్క – చిన్నచీటీ slip

రెంటెం – రెండునేతలు నేసిన దళసరి వస్త్రం

రొండి – నడుం పక్కభాగం

రోజడం – రొప్పడం (వేగంగా ఎగశ్వాస, దిగశ్వాస తీసుకోవడం, కొన్నిసార్లు నోరు కూడా తెఱిచి) panting

ఱంపె – తోలు కోసే సాధనం, తాటాకులు కోసే సాధనం

లాపఱా – నీటితూముకు అడ్డంగా పెట్టే గండఱాయి

లాదడం – కట్టడంలో ఎడం ఏర్పడ్డచోట్ల ఇటుకలు అతికించడం

లావణం – కొత్త ఉద్యోగిపేరు పట్టికలో వ్రాసుకోవడం

లిక్కి – చిన్నకొడవలి

లుడుగు – ఎద్దుమెడలో కట్టే చిన్నగంట

లొడితిలి – చూపుడువేలికీ, బొటనవేలికీ మధ్య గల ప్రదేశం (దీనికే ‘జుత్తిలి’ అని నామాంతరం. ‘జిట్టెడు’ అని తెలంగాణ వాడుక)

లోప్త్రం – దొంగిలించిన సొత్తు spoils or booty

లోవరి – కక్ష్య

లోవి – కుండ

లోవైనం – లోగడ జఱిగిపోయినటువంటిది. చరిత్ర

లోహాభిసారం – చనిపోయిన వీరులకు జోహారులర్పించడం

వక్కాణం – సమాచారం

వడుసుడి – బలాత్కారంగా ఇచ్చుకోవాల్సివచ్చే ధనం

వది – అడవిజంతువుల్ని పట్టుకోవడం కోసం త్రవ్విన గొయ్యి boobytrap

వరకం – కఠినంగా పనిచేయించే శిక్ష Penal servitude

వర్ణాటుడు – భార్యాధనంతో జీవించేవాడు

వల్లం/ వల్లువం – డబ్బుసంచి Purse

వల్లూరం – పందిమాంసం, ఎండుచేప

వాగ్మి (న్) – పదిమందిలో బాగా ఉపన్యసించగలవాడు Orator

వాగర్త – సముద్రతీరం beach (దీనికే మఱో తెలుగుపదం ఏనాదం/యానాదం)

విద్రవం – యుద్ధంలోంచి సైనికుడు పారిపోవడం desertion

విధుర – పంచదార కలిసిన పెరుగు

విధురుడు – భార్య పోయినవాడు a widower

వివిక్త – భర్తకి ఇష్టంలేని స్త్రీ

వివీతం – పశువులు మేసే ప్రదేశానికి వేసిన కంచె

విషూచి – కలరా

విసంవాదం – ముందు ఒప్పుకుని తరువాత లేదని వాదించడం

విస్తు – శరీరవాసన

విస్రం – పచ్చివాసన గలది

వృషస్యంతి – కాముకురాలు

వెద – విత్తనం, జంతుకామం

వెదావు – ఎద్దుతో కలవడానికి సిద్ధంగా ఉన్న ఆవు

వెలిదుక్కి – వానతడితో దున్నడం

వేగరి – సమాచారాన్ని తెలిపేవాడు, వార్తాహరుడు, హర్కారా

వేవిలి – దున్నని పొలం virgin land

వేశవారం – వంటకు కావాల్సిన వస్తువులు

వైకక్షకం – జందెంలా వేసుకునే దండ

వ్యాఘాతం – విఘ్నం, సంఘర్షణ contradiction

వ్యాపృతం – పనిలో ఉన్న busy

వ్యావర్తనం – వెనక్కి మఱలడం, మఱలిక relapse

వ్రైహేయం – వఱిపంటకు తగినది (భూమి)

శరవ్యం – గుఱిపెట్టదగిన లక్ష్యం

శిరాలుడు – ఉబ్బిన నరాలు గలవాడు

శీలనం – పరీక్షించడం

శుక్రలుడు – వీర్యవృద్ధి గలవాడు virile

శైక్షుడు – కొత్తగా చదవసాగిన శిష్యుడు beginner

శ్యావం – brown color

షాడబం – wine

సంగడం – వ్యాయామసాధనకై ఉపయోగించే గుండు, punch bag లాంటిది

సంగమడుగు – ఊరి దగ్గఱి సరస్సు

సంచకరం – క్రయవిక్రయాల్ని ఖాయం చేసుకోవడం కోసం ముందుగా చెల్లించే మొత్తం Advance

సన్ని – తుపాకీ చివఱ ఉండే కత్తి

సమాంసమీన – ప్రతిసంవత్సరమూ ఈనే ఆవు, ప్రతిసంవత్సరమూ వచ్చేది/జఱిగేది.

సరంగు – నావికుడు

సరీసృపం – ప్రాకే జాతికి చెందిన జంతువు Reptile

సర్వదుంబాలా – శిస్తు లేని భూమి

సవయస్కుడు – సమానవయస్సు గలవాడు

సాంద్రత – చిక్కదనం, దట్టం viscosity

సుంకరి – పన్నులు వసూలుచేసేవాడు

సున్తీ – Circumcision

సెర – కంటిలోని రేఖ

సొబను – ఆడగుఱ్ఱపు గర్భం

సౌప్తికం – నిద్రపోయినప్పుడు చంపడం

స్నానీయం – స్నానానికి ఉపయోగపడే వస్తువు/ పదార్థం/ సామగ్రి

ఇవి కేవలం మచ్చుతునకలు మాత్రమే. ఇలాంటివి ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి. అయితే నాగరికతాపరంగానూ, దేశకాల పరిస్థితుల చేతనూ నిరుపయోగంగా మారిన పదాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి – అంపఱ, క్రైలుదారు, దెంచనం, లాదడం, శరవ్యం, సర్వదుంబాలా ఇత్యాది. ఇలాంటివి సమకాలీన పరిస్థితుల్లో వేటికి సరిపోతాయో పరిశీలించి వాటి పరంగా (కాస్త అర్థభేదంతో) ప్రయోగించడం అలవాటు చేసుకోవాలి. భౌతికార్థాలిచ్చే పదాల్ని ఆలంకారికంగా ప్రయోగించడానికి అవకాశముందేమో పరిశీలించాలి. ఉదాహరణకి, పై జాబితాలో ‘నియాతనం’ (క్రిందికి త్రోయడం) అనే పదాన్ని demotion అనే అర్థంలో వాడడం లాంటివి. సమకాలీనంగా ప్రస్తుతం అందఱికీ తెలిసిన అర్థాల్లో స్థిరపడి వాడబడుతున్న జీవంత పదజాలాన్ని వేఱే అర్థాల్లో ప్రయోగించడం సాధ్యం కాదు. అలా చేయాలంటే, అర్థవంతమైన ప్రత్యయాలూ, ఉప సర్గలూ, సమాసఘటనా ప్రభృతిమార్పులతో వాటి శబ్దస్వరూపాన్ని ఎంతోకొంత రూపాంతరించాల్సి (modify చేయాల్సి) ఉంటుంది.

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, నవంబర్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.