cover

అనుకోకుండా

Download PDF ePub MOBI

ఎప్పుడొచ్చావని అడిగిన ప్రతిసారీ, ఇంకా చేరుకోలేదనే చెప్తాను. నవ్వితే కళ్ళు విచ్చుకునే రోజుల్లో ఎప్పుడో నిద్రపోయి, దారుల మధ్య చూపు చీలిపోయిన చోట ఎక్కడో తప్పిపోయి, తగరపు కాగితాల పుస్తకం ఒకటి తెరిచి పెట్టుకుని, ఎవరికీ పంపని ఉత్తరాలు రాస్తూ ఇన్నాళ్ళూ ఆగిపోయానని, ఆపైన అలసిపోయాననీ అంటాను.

ఎలా నమ్మించాలో, ఏం చెప్పి ఒప్పించాలో ఎప్పుడూ కొత్తే. గడియారంలో ఇసుక జారిపోతుంది. ఇక త్వరపడాలి. వద్దనడం ఎలానో తెలుసుకోకముందే వదులుకోవడం నేర్చుకోవాలి.

తీరిక లేదు కాబట్టి దిగులూ లేదనే అనుకుంటాను. ఏ కష్టమూ లేకపోవడం తప్ప పెద్ద కష్టమేం లేదని కూడా ఒప్పుకుంటాను. వీల్లేదు కాబట్టి అవసరం లేదంటే సరేనంటాను.

అన్నీ అబద్ధాలే- అబద్ధాలతో సహా.

*

కోరుకోవడం ఒక్కటే నిజం. కలుసుకున్నదంతా కవిత్వమే. మునిగిపోయిన గులకరాయొకటి ఈదుకుంటూ ఒడ్డు చేరినప్పుడు ఉలికిపడకుండా, ఎవరూ చూడకుండా దాన్ని నీ చేతిలో పెట్టి దోసిలి మూసిన గుర్తు. ఇది తీసుకు వెళ్ళిపొమ్మని చెయ్యి వదిలినప్పుడు, పదే పదే అదేపనిగా వేళ్ళని ముద్దాడాలని గుర్తుకు రాకపోవడమూ గుర్తే.

అన్నీ గుర్తుంటాయి. ఒక్కసారైనా జరగని సంగతులే ఇంకా బాగా గుర్తొస్తాయి. ఎగిరిపోయిన పిట్టలు దూరం నుంచి మళ్ళీ మళ్ళీ అరుస్తాయి. బహుశా అక్కడికి రావద్దని చెప్పడానికే పిలుస్తాయి. అది వినపడకూడదనేగా మనం ఏవో మాట్లాడుకుంటాం.

మాటలన్నీ ఐపోయాక, కలిసి నిద్రలేవడం గురించే చివరగా ఇంకోసారి చెప్పుకుంటాం. మన దేహాల్ని మనమే దూరంగా చూస్తూ మేల్కొనే కల వచ్చిన విషయం మాత్రం దాచేస్తాం. అదే కలలో ఒక ఆకుపచ్చ దుప్పటి మట్టి వేర్లతో మనమీద పరచుకోవడం చూసి ఇష్టంగా నవ్వుకుంటాం. పచ్చికపై రాలే పూలశబ్దాల కింద ఆదమరచి నిద్రపోతాం.

ఇక అప్పుడు మనం కలిసే ఉంటాం.

*

(Image Courtesy: https://www.flickr.com/photos/swimparallel/3391592144/)

Download PDF ePub MOBI

 

Posted in 2014, నవంబర్, మ్యూజింగ్స్ and tagged , , , , .

7 Comments

 1. ” ఒక ఆకుపచ్చ దుప్పటి మట్టి వేర్లతో మనమీద పరచుకోవడం చూసి ఇష్టంగా నవ్వుకుంటాం. పచ్చికపై రాలే పూలశబ్ధాల కింద ఆదమరచి నిద్రపోతాం. ఇక అప్పుడు మనం కలిసే ఉంటాం. “ Wonderful.

  యీ వాక్యాలను రచయిత్రి స్వాతి కుమారి గారికి కూడా అత్యంత ఇష్టుడైన త్రిపుర గారికి వినిపించవొచ్చా! (ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో అచట మనముందామా)
  నమ్మకం కలిగేలా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలిసొచ్చాక, ఎలా నమ్మించాలో తెలిసొచ్చాక రచయిత్రికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటాను.

 2. ఒక ఆకుపచ్చ దుప్పటి మట్టి వేర్లతో మనమీద పరచుకోవడం చూసి ఇష్టంగా నవ్వుకుంటాం. పచ్చికపై రాలే పూలశబ్ధాల కింద ఆదమరచి నిద్రపోతాం.
  ఇక అప్పుడు మనం కలిసే ఉంటాం.
  Splendid.

 3. So good. అన్నీ గుర్తుంటాయి. ఒక్కసారైనా జరగని సంగతులే ఇంకా బాగా గుర్తొస్తాయి. ఎగిరిపోయిన పిట్టలు దూరం నుంచి మళ్ళీ మళ్ళీ అరుస్తాయి. బాహుశా అక్కడికి రావద్దని చెప్పడానికే పిలుస్తాయి. అది వినపడకూడదనేగా మనం ఏవో మాట్లాడుకుంటాం.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.