cover

ఎడారి ఏకాంతం

Download PDF ePub MOBI

గై డి మొపాసా (Guy de Maupassant) “సొలిట్యూడ్” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. 

ఎడారి ఏకాంతం

గై డి మొపాసా

స్నేహితుడి ఇంట్లో విందు ఆ పూట మా అందరికి. వాతావరణం చాలా ఉల్లాసంగా ఉంది. విందు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. డిన్నర్ ముగుస్తున్నప్పడు ఓ పాత మిత్రుడే అడిగాడు నన్ను… “Champs-Elysees వరకూ అలా నాలుగడుగులు వేద్దాం రా….”.

ఇద్దరం బయటకు నడిచాం. ఆకుల ఆచ్ఛాదన పల్చగా ఉన్న చెట్లు ఆ పొడవాటి బాట చెరోప్రక్కన. వాటి మధ్య నుంచి మెల్లగా నడుస్తున్నాం. ప్యారిస్ మహానగరం నిరంతరాయం దిక్కుతోచక చేసే సణుగుడు మినహా ఆ రాత్రి దాదాపు నిశ్శబ్ధంగా ఉంది. స్వచ్ఛమైన పిల్లతెమ్మెర మా ముఖాలకు వీస్తుంది. వింజామర, చీకటాకాశంలో చెల్లాచెదురుగా ఉన్న నక్షత్రాలు, వెదజల్లిన పసిడి పుప్పొడిలా మెరుస్తున్నాయి.

నా సహగామి చెప్పకుపోతున్నాడు:

“ఎందుకో చెప్పలేను గానీ, మున్నెన్నడూ ఎక్కడా లేనంత హాయిగా ఉన్నానీ రాత్రి. బహుశా నా భావాలు విశాలమయ్యాయనుకుంటా. నా చుట్టూ మొహరించిన భౌతికాణువుల మాటున ఉన్న దివ్య రహస్యమేదో వీడిపోతుందన్న భావం లిప్తపాటున ఆత్మలో తళుకుమన్నట్టు తోస్తుంది. ఇంతలో మూసుకుపోతుంది కిటికీ, నా దృష్టికి రెప్పలతెర దించేసినట్టు…”

ఎత్తైన గుబురు పొదల చెంపన జారిపోతున్నట్టుగా కదులుతున్న రెండు నీడల్ని మేం చూస్తూనే ఉన్నాం. రోడ్డు పక్కన ఓ బెంచిని మేము దాటి వెళ్ళే సమయానికి ఇద్దరు వ్యక్తులు సన్నిహితంగా కూర్చున్నట్టు కనిపించింది. ఇద్దరూ ఉన్నప్పటికీ, ఆ మసక కాంతిలో ఆ రెండు ఆకారాలు దాదాపు ఒకటై అస్పష్ట ఆకృతిని తీసుకున్నాయి.

నా మిత్రుడు గొణుగుతున్నాడు:

“పాపం… వస్తువులు! చిరాకు వల్ల కాదుగానీ, వాటిపై ప్రగాఢమైన జాలి కారణంగా అవి నాలో ఏ ప్రేరణ కలిగించలేవు. మానవ జీవితానికి సంబంధించిన మార్మికతలన్నింటిలో నన్ను తీవ్రంగా కదిలించేది ఏది తెలుసా- మనమందరం ఎప్పటికీ ఒంటరివాళ్ళమన్న సత్యం. ఆ చేదు నిజంలోంచే పుడుతుంది మొత్తం పరివేదన. ఆ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలే మనం చేసే పనులు, పడే అవస్థలూనూ. మనమందరం ఆరాటపడినట్లే, ఆ బెంచి మీద కూర్చొన్న ప్రేమికుల జంట కూడా, ఏకాకితనాన్ని విదిల్చుకోవాలనే ప్రయత్నిస్తున్నారు. కానీ, మహా అయితే ఒక క్షణం, లేదా ఇంకా తక్కువ కాలమే. వాళ్ళు ఒంటరిగానే బ్రతుకుతున్నారు. ఎప్పటికీ అలానే బ్రతుకుతారు. మనం కూడా….

“కాస్త అటు ఇటుగా మనందరికీ ఇదే వర్తిస్తుంది. నేను బ్రతుకుతున్న భయానకమైన ఒంటరితనాన్ని గుర్తించిన, అర్థంచేసుకున్న ఫలితంగా తీవ్ర వేదనని నేననుభవించాను. నాకు తెలుసు… ఏదీ కూడా ఆ ఒంటరితనాన్ని మాపలేదు. ఏదైనా సరే. వింటున్నావా? మనం ఏం ప్రయత్నించినా, ఏం చేసినా, మన గుండెలో గుబులుకునే దిగుళ్లు ఏమైనా, మన పెదాల వేడికోళ్ళు, మన అరిచేతుల చప్పట్లు… ఎటువంటివైనా, మనం మాత్రం ఒంటరి వాళ్ళమే. ఈ రాత్రి నాతో కలిసి నడవమనని అడిగాను. కాబట్టి ఇంటి ముఖం చూడాల్సిన పన్లేదు. నా ఇంట్లో నన్ను కమ్మిన ఒంటరితనం వల్ల తల్లడిల్లిపోతున్నాను. కాబట్టి, ఈ పూటకైతే తప్పించుకున్నాను. అయితే, దీనివల్ల నాకు ఒరిగిందేమిటి? నేను నీతో మాటాడతాను. నువ్వు వింటావు. శబ్దానికి చెరో అంచున ఉన్న మనం ఒంటరి వాళ్ళమే. పక్కపక్కనే సన్నిహితంగా ఉన్నా, మనం ఏకాకులమే. నీకు అర్థమవుతోందా?

“సామాన్యులు, చైతన్యం రవ్వంత తక్కువ ఉన్న మామూలు వ్యక్తులే ధన్యులని శాస్త్రాలు ఘోషిస్తాయి. ఆనందానికి సంబంధించి వారికేదో భ్రాంతి ఉంటుంది. వారు ఈ ఒంటరితనపు యాతనని అనుభవించరు. దిశ, దశ లేకుండా బతుకు దారులంటూ తిరగరు నాలాగా! ఏ బంధమూ లేకుండా, ఏదో అర్థంచేసుకున్నానన్న అభిజాత్యపు తృప్తి మినహా ఏ సంతోషమూ లేకుండా, అంతుదరి లేని ఏకాకితనాన్ని చూసి, అర్థం చేసుకొని విషాదించిన జ్ఞానం కలిగించే తెంపులేని దు:ఖంలో… నాలాగా వారు బ్రతకరు.

“నాకు కాస్త మతి చెడినట్టు నీకు అనిపిస్తుందా? అనిపించడం లేదా? విను. నా అస్తిత్వంలో ఆవరించిన ఒంటరితనాన్ని నేను గుర్తించాను కనుక, నాకేమనిపిస్తుందంటే, ఆద్యంతాలు లేని, చుట్టుకొలతలు కూడా అర్థంగాని ఒక చీకటి మాళిగలో రోజురోజుకీ మరింత లోతుగా చిక్కుబడిపోతున్నానని. నాతో, నా చుట్టూ ఎవరూ లేకుండానే, ఏ ఒక్క ప్రాణి నాకు తోడు రాకుండానే ఆ రాకాసి బిలం లోలోపలికి జారిపోతున్నాను ఒక్కడినే. ఆ చీకటి గహ్వరమే జీవితం. కొన్నిసార్లు నాకు ఏవో శబ్దాలు, స్వరాలు, వెక్కిళ్లు వినిపిస్తుంటాయి. జంకుతూ వెళతాను ఆ అపశబ్ధాల వంక. అయితే, అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో బొత్తిగా అర్థం కాదు; ఎవరూ తారసపడరు; నా చుట్టూ పొంచిన చిక్కని చీకటిలో మరొకరి అలికిడే ఉండదు. నీకర్థమవుతోందా?

“ఈ భయానక వేదన కొందరికి అప్పడప్పడు అనుభవమవుతుంటుంది. కవి de Musset ఇలా అంటాడు.

‘ఎవరొస్తారు? ఎవరు పిలుస్తారు నన్ను? ఎవరూ ఉండరు.

నేనొంటరి. గడియారంలో ఒంటరి గంట… ఓ ఏకాకితనమా? ఓ దుర్భరత్వమా…’

అయితే, ఆయనలో ఉన్నది అలా అలా కదిలిపోయే సందేహమే గానీ నాలో తిష్టవేసుకొని కూర్చున్న ‘నిర్ధారణ’ లాంటిదైతే మాత్రం కాదు. ఆయన కవి. ఆయన కలలతోనూ, కల్పనలతోనూ జీవించాడు. ఆయన నిజంగా ఒంటరికాడు. నేను… నేను మాత్రం ఒంటరిని.

“Gustave Flaubert ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుల్లో ఒకడు. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత జ్ఞానుల్లో ఆయన ఒకడు గనుక. ఆయన తన మిత్రుడికి రాసిన ఒక లేఖలో అంటాడిలా నిరాశావహంగా_‘మనందరం ఒకానొక ఏకాకి ఎడారిలో ఉన్నాం. ఎవరూ ఎవర్నీ అర్థం చేసుకోరు’.

edaari ekaantham“ఊహూ! ఎవ్వరూ… ఎవ్వరినీ అర్థం చేసుకోరు. కల్పించే ఆలోచనలు, చెప్పే మాటలు, చేసే ప్రయత్నాలు… ఏవీకూడా అర్థం చేసుకోరు. ఆకాశపుదారుల్లో అంతర్దహనమై వెలుగుతున్న నక్షత్రాలో ఏం జరుగుతుందో భూమికి తెలుసా? కొందరిలో తళుకుమనే కాంతికణాన్ని మనం పరికించినట్లు, భూమి చూస్తుందా పాలపుంతని? దేహంలోని అణువుల్లా సారూప్యతలున్న లెక్కలేనంతమంది పరాయి యోధులెందరో అనంతంలో కలిసిపోవడాన్ని గురించి యోచించు.

“పక్క వ్యక్తి మనః ప్రపంచపుటావర్తాలేమిటో ఏ మనిషీ చెప్పలేడు. దూరంగా మెరిసే నక్షత్రాల కంటే మనకు, మన పక్క వారితో ఉన్న దూరమే ఎక్కువ. మనలో మనం ఒకరికొకరం ఒంటరి ద్వీపాలం. ఎందుకంటే ఆలోచన అంటే ఒక కొరకరాని కొయ్య. దానిని అర్థం చేసుకోవడం అసాధ్యం.

“ఎన్నటికీ చేరువకాలేని అస్తిత్వంతో నిరంతరం సంబంధం కలిగి ఉండటం కంటే భీతి కలిగించే విషయమేదైనా ఉందేమో నీకు తెలుసా? ఏనాటికీ చేరువకాలేకపోయినా, పరస్పరం ప్రేమపాశాలతో బంధింపబడి ఉన్నట్టుగా, చాలా సన్నిహితులమన్నట్టుగా, చాచిన బాహువులతో మనం ఒకరినొకరం ప్రేమించుకొంటుంటాం. విధిలేక ఏకం కావాల్సిన అవసరం ఏదో మనకు తరచూ అడ్డుపడుతూనే ఉంటుంది కానీ, అలా ఏకం కావడానికి చేసే అన్ని ప్రయత్నాలు నిష్ర్పయోజనమే అవుతాయి. మన పరిత్యాగం నిరర్ధకం, మన ఆత్మవిశ్వాసం నిష్ఫలం, మన కావలింతలు దుస్సహం, మన పెనవేతలు, ఆనక మన హఠాత్ ఉద్వేగాలు మనల్ని సంఘర్షణవైపు మాత్రమే నెట్టేస్తాయి.

“నా హృదయాన్ని ఎవరైనా స్నేహితుడి ముందు పరిచినప్పటి కంటే ఎక్కువ ఒంటరితనాన్ని ఎన్నడూ అనుభవించలేదు నేను. ఎందుకంటే, అటువంటి సందర్భాలలో, అధిగమించడం అసాధ్యమైన అడ్డంకిని ఆ స్నేహితుడి రూపంలో కనుగొంటాను. అతనక్కడే ఉంటాడు. నా మిత్రుడు… తేటైన అతని కళ్ళు నామీదే ఉంటాయి. కానీ, వాటి వెనక ఉన్న ఆత్మ మాత్రం నాకు కనిపించడు. నేను చెప్పేదే వింటుంటాడు…. అతనేం ఆలోచిస్తున్నాడు? అవును అతనేం ఆలోచిస్తున్నాడు? ఈ చిత్రహింసని నువ్వు అర్థం చేసుకోలేవు. అతను బహుశా నన్ను అసహ్యించుకుంటాడు. లేదా నిందిస్తాడు, లేదా వెక్కిరిస్తాడు. నేను చెప్పిన విషయాల మీద ప్రతిస్పందిస్తాడు. నన్ను అంచనా కడతాడు, నన్ను తూకం వేస్తాడు. ఖండిస్తాడు, చాలా నేలబారు వాడిగానో, మూర్ఖుడిగానో జమకడతాడు.

“అతనేం ఆలోచిస్తున్నాడో నాకెలా తెలుస్తుంది? నేనెంతగా అతన్ని ఇష్టపడుతున్నానో, అంతగా అతను నన్నిష్టపడుతున్నాడో లేడో నాకెలా అర్థమవుతుంది? ఆ చిన్న గుండ్రని తలకాయలో ఏముందో ఎలా గ్రహించాలి?

“ఓ వ్యక్తి నిగూఢమైన ఆలోచన కంటే మార్మికమైనది మరొకటి ఉందా? మనం గ్రహించలేని, నియంత్రించలేని, లేదా ఆజ్ఞాపించలేని, ఆజమాయిషీ చేయలేని ఆలోచన!

“ఇక నేను! నన్ను నేను ఒక తెరిచిన పుస్తకాన్ని చేయాలని వృథా ప్రయాసపడ్డాను. ఆత్మ గదికి ఉన్న అన్ని తలుపుల్ని బార్లా తీయాలనుకున్నాను. కానీ, నన్ను నేను తెరిచి ఉంచుకోవడంలో విఫలమయ్యాను. దుర్బేధ్యమైన, దుర్గమమైన రహస్య గుహాంతర్భాగంలో ఒక్కడినే సుక్కి ఉన్నాను. నా మార్మిక మందిరాన్ని ఎవరూ సమీపించలేరు. అంతెందుకు, అదెక్కడుందో కనిపెట్టలేరు. ఎందుకంటే, ఎవరూ నన్ను పోలి ఉండరు. ఎవరూ ఎవరినీ అర్థం చేసుకోరు కనక.

“నువ్వు కనీసం ఈ క్షణంలోనైనా నన్నర్థం చేసుకున్నావా? లేదు నువ్వు నన్నొక పిచ్చోడి కింద జమకడతావు. నన్ను పరీక్షిస్తావు. నా నుంచి తప్పించుకుంటావు. నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటావు ‘వీడికేమయింది ఈ రాత్రి?’ అని. కానీ, నా లోపల సుడులు తిరుగుతున్న వేదనని గ్రహించినప్పడు, నీకది అనుభవమై తారసపడినప్పడు, నా దగ్గరకు వచ్చి చెప్తావు. ‘నిన్నర్థం చేసుకున్నాను” అలా బహుశా ఓ క్షణమైనా నువ్వు నన్ను సంతోషపెడతావు.

“నా ఒంటరితనాన్ని నాకు ఎక్కువ గుర్తుచేసింది ఆడవాళ్ళే. దుర్భరం… దుర్భరం… స్త్రీల వల్లే నేను ఎక్కువ నలిగిపోయాను. నేను ఒంటరిని కాననే భ్రమలు మగవారికంటే నాలో ఎక్కువగా కల్పించిన వారు ఆడవారే.

“ప్రేమలో పడటాన్ని కాస్త నిశితంగా గమనిస్తే ఏదో అలౌకిక దివ్యత్వం ఆవహించిన భావన కలుగుతుంది. ఎందుకో తెలుసా? అవధులు దాటిన ఆనందవివశులయిన భావం ఒంటరిని కానన్న ఊహ చుట్టేస్తుంది కనుక. ఒంటరితనం, అస్తిత్వ వైముఖ్యం దూరమయ్యాయన్న భ్రాంతి. ఎంత పొరపాటు?

“మన ఏకాకి హృదయాలని తొలిచే ప్రేమ అనే అనంత ఆర్తి కల్పించి, మనల్ని మరింత వ్యాకులపరిచి వేధిస్తుంది స్త్రీ అనే అత్యద్భుతమైన భ్రాంతి.

“మృదువుగా చిక్కుబడి, గడుసుగా చిక్కుముళ్ళు వేసే పొడవాటి కేశాలు, మోహపాశాలేసే క్రీగంటి చూపులు, ఇంకా ఎన్నో వశీకరణ వన్నెలన్నీ మనల్ని మెడలోతు ప్రేమలోకి దించేస్తాయి. గంటలు సెకన్లై దొర్లిపోతున్న సమ్మోహన సాన్నిహిత్యం. ఆ మాయ కప్పేస్తుంది నీ మెదడు పొరల్ని. విస్మయానంద విభ్రమల భ్రమలో తప్పిపోతాం. ఆ ఉత్తర క్షణంలో రెండు ఆత్మలు ఏకమవుతున్న పులకింత. అయితే ఆ ‘ఉత్తరక్షణం’ అంటూ ఏదీ, ఎన్నటికీ రాదు. కాలాల మొగసాలలో నిరీక్షించి, రోజులు, వారాలు, యుగాలు గడిపేసినా ఆ ‘క్షణం’ రాదు. ఆరిపోని ఆశతో, మోహాస్పద మోసం వంటి ఆనందంతో కొంతకాలం దొర్లుతుంది. ఆ తర్వాత నిన్ను నువ్వు కనుక్కుంటావు. అంతకు ముందు కంటే ఇంకా చిక్కనైన గాఢమైన ఒంటరితనాన్ని గుర్తిస్తావు.

“ప్రతి ముద్దు తర్వాత, ప్రతి కావలింత తర్వాత ఎక్కువైన ఏకాకితనం గుర్తిస్తావు. ఇక ఎంత నరకయాతన అనుకున్నావ్…

కవి Sully Prudhomme రాయలేదా ఇలా.

“ఆలింగనాలంటే కేవలం అవిరామ ఆర్భాటాలు

దేహాలతో ఆత్మ సమాగమానికి

పిచ్చి ప్రేమ చేసే వెర్రి ప్రయత్నాలు…”

“ఆపై ఇక వీడ్కోలు. అంతా అయిపోతుంది. ఒకానొక జీవన సందర్భంలో అంతా తానే అయ్యే స్త్రీమూర్తి, మన:శరీరాల మహాద్వైత సమాగమంతో జన్మని పునీతం చేసే స్త్రీమూర్తి చేలాంచలాలు ఎన్నటికీ అందవనీ, అటువంటి మూర్తి ఎప్పటికీ అపరిచితేనని గ్రహిస్తాం.

“అలా గ్రహించిన మరుక్షణంలో, అస్తిత్వాల మార్మికత ఏదో బోధపడుతున్నప్పడు, ఆలోచనలు, ఆశయాలు ఒకదానినొకటి సంపూర్ణంగా పెనవేసుకుపోతున్నప్పడు, ఆమె ఆత్మ నిగూఢతని నువ్వు ప్రతిధ్వనిస్తున్నప్పడు, ఒక్క పదం, ఒకే ఒక్క పదం… నీ దోషాన్ని, నీ పొరపాటుని బట్టబయలు చేస్తుంది. నిశిరాత్రిలో మెరిసే మెరుపులా నిన్ను నీకు దర్శింప జేస్తుంది. నీలో ఉన్న నల్లని పాతాళ బిలాన్ని నీకు చూపిస్తుంది.

“అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం. నువ్వు ప్రేమించిన స్త్రీ సమక్షంలో కనీసం మాటల అంతరాయం కూడ కలగని నిశ్శబ్దంలో ఆమె సమక్షాన్ని ఆసాంతం ఆస్వాదిస్తున్న సంపూర్ణ ఆనందంలో ఓ రాత్రిని గడపటం సృష్టిలోనే అత్యద్భుతమైన అనుభవం. ఇంకేమి అడక్కు రెండు అస్తిత్వాలు ఏకం కావడం దుర్లభం, అసంభవం.

“ఇక నా విషయానికొస్తే, నా ఆత్మమందిరం తలుపుల్ని మూసేశాను. నేనేమి నమ్ముతానో, నేనేమి ఆలోచిస్తానో, వేటిని ప్రేమిస్తానో ఎవరికీ చెప్పనుగాక చెప్పను. భీతావహమైన ఒంటరితనానికి విసిరి వేయబడ్డానన్న ఎరుకతో, ఏ భావమూ వ్యక్తంకాని నిర్లిప్తాన్నై చూస్తున్నాను. ప్రపంచాన్ని అభిప్రాయాలు, తగువులు, ఆనందాలు, లేదా నమ్మకాలు… ఏవీ నాకు పట్టవు… వేటి గురించి నాకు పట్టదు. ఎవరితోనూ కలవలేని దుస్థితి వల్ల, అన్నింటి నుంచి నేను వైదొలిగాను. అగోచరమైన నా అస్తిత్వం అజ్ఞాతంగా మిగిలిపోయింది. మాట్లాడటానికి కూడా మనస్కరించని మన:స్ధితిలో, రోజువారీ ప్రశ్నలకు ముందస్తు సిద్ధం చేసుకున్న గుప్పెడు పడికట్టు సమాధానాలు, లేదా ఒక చిర్నవ్వుతో మిగిలాను. నీకు అర్థమవుతుందా?”

Arc of Triumph Star వరకూ సాగిన మా సుదీర్ఘ నడక, వెనక్కి తిరిగి Place de la Concorde వరకూ సాగింది. ఇంకా ఎన్నో ఇతర అంశాలు కలగలుపుతూ, నా మిత్రుడు ఎంతో చెప్పకొచ్చాడు గానీ, నాకు ఇప్పడదంతా గుర్తులేదు.

అతను ఆగాడు. ఆ రాత్రి మసక కాంతిలో ప్యారిస్ పేవ్‌మెంట్ మీద, తన ఈజిప్ట్ వారసత్వాల ఛాయలు కనుమరుగై, మరో పక్క ఆ దేశ చరిత్ర విచిత్ర సంకేతాలతో చెక్కి ఉన్న ఎత్తైన ఏకశిలా విగ్రహం వైపు చేయి చాస్తూ కటువుగా అన్నాడిలా, “చూడు, మనం ఆ విగ్రహం లాంటి వాళ్ళం”.

మరో మాట మాట్లాడకుండా అతను వెళ్ళిపోయాడు. తను తాగిన మత్తులో ఉన్నాడా? పిచ్చోడా? లేదా జ్ఞానా? ఇప్పటికి నాకు తెలియదు. కొన్నిసార్లు అన్పిస్తుంది అతను చెప్పింది నిజమని, మరి కొన్నిసార్లు అనిపిస్తుంది అతనికి మతిభ్రమించిందనీనూ.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, నవంబర్ and tagged , , , , , , , , , .

2 Comments

  1. నరేష్ గారి “ఎడారి ఏకాంతం” చదివే అవకాశం నాకు చాలా ముందుగానే కలిగింది. శబ్థానికి ఒక చివర చెప్పేవాడు ఇంకోచివర వినేవాడు వుంటారు అని నేరేటర్ చెప్పే నిస్ఫ్రుహాపూరిత ఊహాచిత్రం ఎప్పుడూ నన్ను వదిలిపొలేదు. అది ఒకంత నాలోని బాధని రోజువారి జీవితంలో తగ్గించినా చాలా సంధర్భాల్లో పెంచిందనే చెప్పాలి. ” ఆ చిన్న గుండ్రని తలకాయలో ఏముందో ఎలా గ్రహించాలి? ” అన్న ప్రశ్న మనల్ని వదిలిపోదు. మొపాసాని నరేష్ గారు అనువదిస్తే చదవటం ఒక గొప్పానుభూతి. తెలివైనవాళ్ళు ఎవరైనా ఈ ఒక్క కథ చదవకుండా వూరుకుంటే మంచిది :-).

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.