cover

అయిస్కూల్లో సేరాలంటే…

Download PDF ePub MOBI

మావూర్లో ఐదో తరగతి దాకానే గదా ఇస్కూలుండేది. ఆపైన సదుంకోవాలంటే ముందూ ఎనక సూడకుండా సిత్తూరి స్కూలుకు బోవాల్సిందే. సిత్తూరులో వుండే ఇస్కూళ్లు ఒగోటి ఎంత పెద్దంగా వుంటాయో! మాయక్క సదివే కన్నని స్కూలయితే మా వూరికంటేపెద్దదే.

మాయక్కని ఐదో తరగతిలోనే సాలించేయమని మాయవ్వ ఎంత మొత్తుకున్న్యా మా నాయనిల్లేదు. ‘ఆడబిడ్డికి సదువెందుకురా కోదండా, వాళ్లేమన్నా సదుంకోని వుద్దోగాలెలకబెట్టాల్నా. అయినా జోతి ఐదొరకు సదిమింది గదా ఇంగ సాలించురా నామాటిని’ అని ఎంతో మంచితనంగా సెప్పిసూసింది. మా నాయిన్ది వుడుంపట్టు గదా! మాయక్కనెత్తుకోని బోయి సిత్తూరి స్కూల్లో సేర్పించేసొచ్చేసినాడు. ఆబిడ్ని సేర్పించినారని మా కుక్కలపల్లి పెదనాయిన కూతురు లలితను సేర్పించినాడు. ఆ బిడ్డి సేరిందని ఆ వూర్లోనే వారనా సోళ్ల రాజమ్మ వాళ్ల లచ్చింని సేర్పించింది. మా వూర్లో కర్నమోల్ల ఈరాసామి సెల్లిలు యామలతను సేర్సేసినాడు. గాండ్ల కొత్తూరు రామసెంద్రారెడ్డి కూతురు తుల్సి గూడా ఆ ఇస్కూల్లోనే సేరిపోయింది. లెక్కకు అయిదు మందాడపిలకాయిలయి పోయిరా. మొగపిలకాయిలు గూడా ముగ్గురు సేరినారు.

తెల్లార్తో లేసి టింగురంగాని రొండు జల్లేసుకొని టిపను క్యారేజీ తీసుకొని సిత్తూరి స్కూలుకు బొయ్యేస్తావున్ని మాయక్కని సూస్తే నాకు వొళ్లంతా కుళ్లుగా వుండాది. పైగా సిత్తూరికి నడ్సిపొయ్యోస్తాదని రాంగానే ఒక పనిజెప్పకుండా పైటేల సంకటి తినమనడం, వుడకుడుకు నీల్లు బోసుకోమనడం మా సేద్దిగాడైతే కలింపండ్లు, ఎలక్కాయిలు, సెరుకులు దాసిపెట్టి ఇస్తావుంటే నాకు వొల్లు మండదా? అందుకే గబగబా ఐదో తరగతి సదివేసి ఎప్పుడెప్పుడు సిత్తూరి స్కూల్లో సేరి పూడస్తామా అనుండాది నాకు. అట్లాంటప్పుడు ‘ఇంక సదిమింది సాలు అబ్బోడోళ్లను ఎత్తుకోను ఎవురూ లేరు నిల్సిపో’ అని మాయవ్వంటే నాకు కారంబెట్టినట్లుంటాదా? వుండదా?

మాయవ్వ మాయక్కను గూడా ఎప్పుడెప్పుడు నిలిపేస్తామా అని సూస్తా వుండాది. మా నాయన లేనప్పుడు మాయమ్మ దెగ్గిర యాకార్తానే వుండాది. ‘ఈ కోదండుడు సెప్తే ఇనడు గదా! మూడు మైళ్లు తార్రోడ్లో నడ్సిపొయ్యి ఇస్కూల్లో సదమకుంటే కొంపలేమైనా మునిగి పోతాయా? పొయ్యే బస్సులు, వొచ్చే కార్లు, నిలుకుల్యాకుండా తిరిగే లారీలు – వేటికిందన్నా పడిసస్తే అప్పుడు అంగలార్సేది మనమే గదా! నువ్వన్నా సెప్పు కమలా వాడికి. నా మాటిని దాన్ని ఇస్కూలుకు పంపించొద్దు. అదింట్లో వుంటే నీగ్గూడా శానా పని తప్పతాదే’ అని ఎప్పుడు బడితే అప్పుడు మా యమ్మ సెవులో ఇల్లు గట్టుకోని పోరతావుండాది. ఈ ముసిల్దేమి ఇట్లా సెప్తాదే అని మాయమ్మ గూడా ఉల్సర పోతానే వుంది. కాని మా నాయన ముందు మాయవ్వ ఎన్ని ఎత్తులేసినా, మాయమ్మ ఎంత శతపోరినా సెవుటోడి ముందు సెంకమూదినట్లే అయిపోతావుంది.

పరీచ్చలైపొయినాక మూడాటలు ఆరు సుట్టాలూర్లుతో లీవులైపొయినాయి. ‘కోదండా, ఇప్పుడో సెప్తావుండా. ఈ ఆడముండ్లకింక సదుములు సాలు. ఇద్దుర్నీ ఇంటికాడ బెట్టు. కమలా బాయికాడికి బొయినప్పుడు ఈ తులవ మొగ పిలకాయిల్ని సాకి సంతరించడం నాకు సేతగాదు’ అని మాయవ్వ మూతి మూరెడు బెట్టుకోని మా నాయినితో అనేసింది.

‘పెద్దబ్బోడు ఇస్కూలుకు బోతావుండాడు గదమా! ఈ సారి సిన్నోడు గూడా బోతాడు. ఇంటికాడేం రంపుండదులే’ అని మాయవ్వ మాటను బుట్టికిందేసి మూసిపెట్టేసి నాడు మా నాయిన.

ఇస్కూళ్లు తెర్సినారు. మాయక్క యదాపకారం సిత్తూరికి పోతావొస్తా వుండాది. మా నాయిన నన్ను ఆరోతరగతిలో సేర్సాలనే పెస్తావనే తేలేదు. ఎందుకా? అని మా నాయన్నే అడిగేసినాను. ‘అవ్వొద్దంటా వుండాది’ అన్న్యాడు. ‘అవ్వ అక్క నొద్దన్నా పంపించలేదా నువ్వు’, అంటే ‘అందుకే దినాము ఇంట్లో రగడ, ఎనిమిదైనాక అక్కను గూడా నిలిపేస్తా’ అనేసినాడు.

 ‘అట్లనా కోదండరెడ్డీ, క్యారేజెత్తుకోని కుశాలుగా సిత్తూరిస్కూలుకు బోదారని నేనెంతగానో మునాస పడ్తావుంటే నన్ను ఆరులో సేర్సవా. ఎట్ల సేర్సవో నేనూ జూస్తా. అందురి జుట్లుల్లో దూరి పొయ్యేదాన్ని నేను’ అని మనసులోనే మా నాయిన్ని ఎచ్చరించినాను.

మాయక్క నన్ను సిత్తూరి స్కూలుకు పిల్సకబోయి నాపైన పెత్తనం సెలాయించాలనే వుండాది గదా! ఆ బిడ్డి దెగ్గిర మాత్రం నేనూ సిత్తూరికి వొస్తాననే సెప్తావుండా.

మాయవ్వ నోరు మంచిదిగాదని మాయమ్మ మాత్రం వొద్దనే అంటావుంది.

ఆపొద్దు మాయక్క ఇస్కూలు నుంచి శనివారం మద్ద్యాన్నం ఇంటికొచ్చింది. శనివారం మద్దేనం దాకనే గదా! ఆదివారం ఎప్పుడూ లీవే. వొచ్చిరాంగానే ‘సినపాపా, ఆరోతరగతిలో సేరాలంటే సోమారం పరీచ్చ రాయాల’ అని నా సెవిలో ఏసింది.

మా నాయిన్నడిగినాను, మాయమ్మదెగ్గిర ఏడ్సినాను, గంపెడు గొంతు బెట్టుకోని మాయవ్వతో కొట్లాడినాను. ఎవురూ నామాటను పట్టించుకోలా.

‘అమా నిన్న సిన్న పెద్దమ్మొచ్చింది. నిన్ను సోమారం తెల్లారే సరికి కుక్కలపల్లికి రమ్మనింది’ అన్న్యాను.

మాయమ్మ నిజమనుకోని కోడిగుజ్జామునే లేసి గిన్న్యా సెంబులు గడిగి, సెత్తోసి, మాయక్కకు సద్దన్నంలో పెరుగుబోసి క్యారేజి గట్టి, సేద్దిగానికి గుండాయిలో సద్దిగలిపెట్టి మాయవ్వకు సెప్పి ఎలబారి కుక్కలపల్లికి పూడ్సింది.

నేను ఇంట్లో సెప్పకుండానే మాయక్కతో బొయ్యి పరీచ్చ రాసినాను. మాయక్క నన్ను పరీచ్చయి పొయినాక సిన్నెయ్య వొంటెద్దు బండ్లో కూసో బెట్టింది. మద్ద్యానానికంతా ఇల్లు సేరుకున్న్యాను. మా దొరసానవ్వ ‘పొద్దున్నుంచి కాకి మాదిరిగా వూరంతా దిరిగి ఇప్పుడొస్తావుండావా ఇర్లచెంగీ’ అని కోపంగానే అనింది.

నేను వూఁ అనలా ఆఁ అనలా. రొండు దినాలు గడ్సినాయి. నన్ను ఆరులో సేర్సుకుంటారని మాయక్క సెప్పింది. అంటే నేనా పరీచ్చ పాసైనట్లే. అప్పుడు సెప్పినానింట్లో ఆరులో సేరతానని. పరీచ్చరాయకుండానే ఎట్ల సేర్సుకుంటారులే అని మాయమ్మ నిమ్మలంగా వుండాది. పరీచ్చదొంగగాబొయి రాసొచ్చేసినానని సెప్పినాను. మా నాయినొచ్చేదాకా మాయవ్వ నన్ను పల్లెతు మాటనలేదు. వొచ్చినాక పెట్టుకునింది గదా! ఇంట్లో తిర్నాలైపొయ్యింది.

ఊరి బసివినని తిట్టింది. సెప్పిన మాటినేరకంగాదనింది. పెద్దాసిన్నాలేని పెవడ అనింది. ‘పెదిమిని మించిన పల్లిది. దీన్నిప్పుడే కట్టడి జెయ్యకపోతే ముందు ముందు నీకు తిప్పలు తప్పవురా కోదండా!’ అని మా నాయిన్ని వుద్దరించేదాని మాదిరిగా అంగలార్సింది.

ayiskoollOమా నాయినా నన్ను బుజ్జగించి ‘అయినా ఇంట్లోదిని ఈదిలో ఆట్లాడుకోక అగసాట్లెందుకురా’ అని గెడ్డం బట్టుకోని సెప్పి సూసినాడు.

‘నన్ను ఇస్కూలు నిలపాలంటే కొండమింద దేవుడు దిగి రావాల. అప్పుడు గూడా నేను ఇనేది లేదు. ఇస్కూల్లో సేరేదాకా అన్నం గూడా తినన’ని మొండికేసుకన్న్యాను.

ఒక పూటంతా కూడు దినలా. మాయమ్మ మా మూలింటవ్వను పిలిపించింది. నేనింటేనా. ఆకిరికి మా దొరసానవ్వే సేతులు బట్టుకునింది. పిలకాయిలు తినకపోతే వాళ్లగ్గూడా ముద్దదిగదు గదా!

‘నన్నిస్కూలుకు పంపిస్తే గాని నేను అన్నం దినను’ అన్న్యాను. ‘యాడన్నా సావు. నిన్ను సిత్తూరికి మాత్రం పంపించేదే లేదు’ అనింది ముసిల్ది.

మద్దిమద్దిలో అందురూ వొచ్చి అడుక్కుంటానే వుండారు. సాయింత్రం మా నాయినొచ్చినాడు. ‘దాన్ది నా మాదిరి వుడుంపట్టు. అదింటాదా?’ అన్న్యాడు మాయమ్మతో. ‘నువ్వూ మొండిదానివి మా. ఇస్కూల్లో సేరిస్తే ఏ బోతాది సెప్పు?’ అన్న్యాడు మాయవ్వతో. ఏం మాట్లాడలేదామి. ఇదే సందని మాయవ్వ గెడ్డం బట్టుకున్న్యాను. సక్కిలిగింతలు బెట్న్యాను. ‘అవ్వా అవ్వా నీకు పున్నిముంటాది వా’ అని దీనంగా మొగం బెట్న్యాను.

‘నేనెప్పుడు పెయిలైతే ఆ పొద్దు నిల్సిపోతా’ అన్న్యాక నా గిలిగింతలకు మాయవ్వ బోసి నోరు నవ్వింది.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, ఇర్లచెంగి కథలు, నవంబర్, సీరియల్ and tagged , , , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.