cover

పదనిష్పాదన కళ (26)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

పదహాఱో అధ్యాయం

ప్రాథమిక సంస్కృత పదజాలం

తెలుగులై పుట్టిపెఱిగిన ప్రతివారికీ ఎంతోకొంత సంస్కృతం వచ్చిఉంటుంది. వచ్చి ఉండాలి కూడా! మన జాతికి సంబంధించినంతవఱకూ తెలుక్కీ, సంస్కృతానికీ పెద్దగా తేడా పాటించరు. సంస్కృతంలో ఉన్న ప్రతిపదమూ కించిత్ స్వరభేదంతో తెలుగులో కూడా వాడుకోవడానికి అర్హమైనదే. ఆ రకంగా నాలుగింట ఓ వంతు సంస్కృత పదజాలం తెలుగులోకి వచ్చిచేఱిపోయింది. మన ఆధునిక తెలుగు భాషాసారస్వతాల నేపథ్యం గ్రాంథిక భాషా సారస్వతాలు. అవి హెచ్చుపాలు సంస్కృత శబ్దసమాసభూయిష్ఠాలు. కనుక మన గుఱించి మనం తెలుసుకోవాలన్నా కాస్తో కూస్తో సంస్కృతపరిచయం తప్పనిసరి. ఒక దేశపు భాషే ఆ జాతి యొక్క ఆయువుపట్టు. ఆ భాష ఉన్నంతకాలమే ఆ జాతీ, దాని దేశమూ జీవించి ఉన్నట్లు లెక్క. అది నశిస్తే, ఆ జాతీ, దేశమూ రెండూ చరిత్రపుటల్లోంచి అదృశ్యమైనట్లే. ఆ భాష తెలీకపోతే ఆ జాతిని మనం సరిగా అర్థం చేసుకోలేం. ఇంగ్లీషు రాకుండా అమెరికాని, రష్యన్ తెలీకుండా రష్యాని, అరబ్బీ నేర్చుకోకుండా అరేబియానీ అర్థం చేసుకోవడమంటే అది అఱకొఱగా అర్థం చేసుకోవడమే అవుతుంది. అది ఆయా జాతులకి అన్యాయం చేయడమే అవుతుంది. అలాగే సంస్కృతమయమైన ప్రాచీనాంధ్రగ్రాంథికశైలి తెలీకపోతే తెలుగుజాతిని సైతం సమగ్రంగా అధ్యయనం చేయలేం.

పదనిష్పాదన ప్రస్తావనకు సంబంధించినంతవఱకూ – సంస్కృతం అనివార్యం. దీనికి 3 కారణాలున్నాయి.

౧. సంస్కృతం తెలుక్కి దాదాపుగా సజాతీయభాష. వాక్యనిర్మాణం, సమాసఘటన, సంధికల్పన ఇత్యాదులలో రెంటికీ పోలికలున్నాయి. పదజాలం పరిచితపూర్వమే. ముఖ్యంగా ఉచ్చారణపద్ధతి.

౨. తెలుగులో కంటే సంస్కృతంలో పదనిష్పాదన సౌకర్యాలు మెండు. నిజానికి ఏ ఇతర భాషలో కన్నా (ఇంగ్లీషు కంటే కూడా) సంస్కృతంలోనే అవి ఎక్కువ. సంస్కృతానికి చాలా ఎక్కువ ప్రత్యయాలూ, ఉపసర్గలూ ఉన్నాయి. వివక్షిత అర్థాన్ని బట్టి పదస్వరూపాన్ని రకరకాలుగా మార్చుకోవడానికి ఆ వ్యాకరణం అనుమతిస్తోంది.

౩. దేశకాలాదుల దృష్ట్యా వైరి/ మిశ్రసమాసాల్ని ఎంత ఉదారంగా అనుమతించి ఆమోదముద్ర వేసినప్పటికీ కొన్ని కొన్ని సంస్కృత ప్రత్యయాల్నీ, సమాసావయవాల్నీ తెలుగుపదాలకి చేర్చలేం. అలా చేఱిస్తే ఆ పదనిర్మాణాల్లో శ్రావ్యత లోపించవచ్చు. సంధుల పరంగా సమస్యలు ఎదురుకావచ్చు. కనుక కొన్ని సర్వసాధారణ తెలుగుమాటలకు దీటైన సంస్కృతపదా లేంటో తెలిసి ఉండడం అవసరం.

౪. ఇక్కడ ఇస్తున్న సంస్కృత పదజాలం యథాతథంగా అభ్యసించడానికి కాదు. పాత అర్థాల్లో ఉన్న పాతపదాల్ని ఏ కొత్త పరిభావనల్ని వ్యక్తీకరించడానికి పనికొస్తాయో అంచనా వేసేందుకు సహాయం చేయడానికి మాత్రమే. ఆధునిక అవసరా లకు అనుగుణంగా వాడుకలో లేని పాతపదాల అర్థాల్ని కాస్త పరివర్తించి వాడుకోవడంలో తప్పులేదు. కాలక్రమంలో పదాల అర్థాలు ఎలా మారిపోతాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు అరబిక్ అని వ్యవహరిస్తున్న భాషకు మొదట్లో పేరు లేదు. ‘అరబ్’ అనే ఎడారితెగప్రజల పేరు మీదుగా అ భాషకు ‘అరబిక్’ అని పేరొచ్చింది. నిజానికి ఆ తెగకు సైతం మొదట్లో పేరు ఉండేది కాదు. ఆ దేశం మేలుజాతిగుఱ్ఱాలకు ప్రసిద్ధి. అక్కణ్ణుంచే భారతదేశానికి గుఱ్ఱాలు దిగుమతి అవుతూ ఉండేవి. గుఱ్ఱాన్ని సంస్కృతంలో ‘అర్వ’ అంటారు. అదే ‘అర్బ -> అరబ -> అరబ్’ అయిందని కొందఱి ఊహ.

ఈ అధ్యాయంలో కొంత ప్రాథమిక సంస్కృత పదజాలం (తత్సమరూపంలో) ఇవ్వబడుతోంది. ప్రతి తెలుగుపద నిష్పాదకుడూ దీన్ని ఎంతోకొంత అభ్యసించాలి. ఇంతకుముందటి అధ్యాయాల్లో వివరించబడిన వ్యాకరణ ప్రక్రియల సహాయంతో వీటిని మన ఊహలకి అనుగుణంగా మార్చుకుని కొత్తపదాల్ని సృష్టించేందుకు అవకాశాలు లెక్కకు మిక్కిలి.

I. ప్రకృతిసంబంధి పదాలు

౧. భూమి

భూమి – ధర, ధరిత్రి, ధరణి, క్షితి, సర్వంసహ, వసుమతి, వసుధ, వసుంధర, ఉర్వి, పృథివి, పృథ్వి, అవని, మేదిని, మహి

(భూమికి ఏకాక్షర పదాలు – భూ, జ్యా, కు, క్ష్మా)

మట్టి – మృత్, మృత్తిక, మృత్స్న, లోష్టం

మట్టిగడ్డ – లేష్టువు

దుమ్ము – ధూళి, పాంసువు, రజం (స్)

పొడి – చూర్ణం, క్షోదం

అన్ని పంటలూ బాగా పండే నేల – ఉర్వర

చవిటినేల – ఊషం, ఊషవంతం, ఊషరం

ఇంతవఱకూ ఎవఱూ దున్నని నేల – అప్రహతం Virgin land

బుఱదనేల – శాద్వలం, కచ్ఛం

నీళ్ళమయంగా ఉండే తడి ప్రాంతం – అనూపం

గడ్డిభూములతో నిండిన ప్రాంతం – నడ్వలం Steppe

మొఱం (గులకఱాళ్ళ) తో నిండిన నేల – శర్కరిలం

ఇసుకనేల – సైకతభూమి, సైకతిలం, సికతావంతం

౨. కొండలు

కొండ – అహార్యం, అద్రి, గిరి, గోత్రం, గ్రావం, అచలం, శైలం, పర్వతం

ఱాయి – పాషాణం, ప్రస్తరం, ఉపలం, అశ్మం, శిల, దృషత్

శిఖరం – కూటం, శృంగం

కొండచఱియ – ప్రపాతం, తటం, భృగువు

కొండ మీది సమతలభూమి (నెత్తం) – స్ను, ప్రస్థం, సానువు

కొండ కిందిభాగం – ఉపత్యక

జలపాతం – ప్రస్రవణం, ఝరం, నిర్ఝరం

కృత్రిమగుహ – దరి, కందరం

సహజగుహ – గహ్వరం

కొండమీదినుంచి జాఱిపడ్డ బండఱాయి – గండశిల

పూలతీగల పొదఱిల్లు – నికుంజం, కుంజం

౩. చెట్లు

అడవి – అటవి, అరణ్యం, విపినం, గహనం, కాననం, వనం

గొప్ప అడవి – అరణ్యాని

తోట – ఆరామం, నిష్కుటం, ఉపవనం, ఉద్యానం, ఆక్రీడం

వన్య – అనేకవనాల సమూహం

చెట్టు – వృక్షం, తరువు, అనోకహం, కుటం, సాలం, ద్రు, ద్రుమం

క్రమం తప్పకుండా పూచి, కాచే చెట్టు – అవంధ్యం, ఫలేగ్రహి

పూచి కాచే చెట్టు – వానస్పత్యం

పూయకుండానే కాచే చెట్టు – వనస్పతి

కాపూ, పూతా లేని చెట్టు – వంధ్యం, అఫలం, అవకేశి

ఎండి మోడైన చెట్టు – స్థాణువు, ధ్రువం, శంకువు

ఆకు – పత్త్రం, పలాశం, ఛదనం, ఛదం, దళం, పర్ణం

చిగురు – పల్లవం, కిసలయం

పువ్వు – సుమనం, పుష్పం, సూనం, ప్రసూనం, ప్రసవం, లతాంతం, కుసుమం, సుమం

పూవురేక – సుమదళం

మొగ్గ – కోరకం, కలిక, కుట్మలం, ముకుళం

తొడిమ – వృంతం

పూలగుత్తి – వల్లరి, మంజరి, గుచ్ఛం, స్తబకం, కుట్మలం

పూలతేనె – మకరందం

పుప్పొడి – పరాగం

అకరువు – కింజల్కం, కేసరం

వికసించిన పూవు/ పూచిన చెట్టు – ఫుల్లం, ప్రఫుల్లం, ఉత్ఫుల్లం, సంఫుల్లం, వ్యాకోచం, వికచం, స్ఫుటం, వికసితం

పచ్చికాయ – శలాటువు

పండు – ఫలం

ఎండుకాయ – వానం

పిందె – క్షారకం, జాలకం

తొక్క – త్వక్కు, త్వచం

గింజ – బీజం

కొమ్మ – విటపం, శాఖ

రెమ్మ – శిఫం, క్షుపం

తీగ – వల్లి, వ్రతతి. లత

దట్టమైన గుబురు గల మొక్క – వీరుధం, గుల్మిని, ఉలపం

చెట్టుబోదె – ప్రకాండం, స్కంధం

ఊడ – శిఫ, జట

చెట్టుమొదలు – బుధ్నం, మూలం

చెట్టు చిటారుభాగం – శిరోఽగ్రం

చెట్టులోని చేవ (సేగి) – సారం, మజ్జ

చెట్టునార – వల్కం, వల్కలం

కొయ్య (కఱ్ఱ/ చెక్క) – కాష్ఠం, దారువు

చెట్టుజిగురు – నిర్యాసం

చెట్టుతొఱ్ఱ – నిష్కుహం, కోటరం

కట్టె (లు) – ఇంధనం, ఇధ్మం, ఏధం, సమిధ

౪. రకరకాల చెట్ల పేర్లు

మొగలి – కేతకి

కుంకుడు – అరిష్టం, ఫేనిలం

మారేడు – బిల్వం, మాలూరం, శాండిల్యం, శైలూషం, శ్రీఫలం

జువ్వి – ప్లక్షం, జటి, పర్కటి

మఱ్ఱి – వటం, న్యగ్రోధం, బహుపాది (బహుపాదం)

టేకు – శ్రీపర్ణిక, కుముదిక, కుంభి, కైడర్యం, కట్ఫలం

గంగరావి – తూదం, తూలం, యూపం, బ్రహ్మణ్యం, బ్రహ్మదారువు

కడిమి – నీపం, ప్రియకం, కదంబం, హలిప్రియం

మద్ది – సాలం, సర్జం

గారచెట్టు – ఇంగుది, తాపసతరువు

బూరుగు – శాల్మలి, పిచ్ఛిల, పూరణి, మోచ,

కానుగు – కరజం, కరంజం, చిరిబిల్వం, నక్తమాలం

ఆముదపు – ఏరండం, వ్యడంబకం, ఉరుబూకం, రుచకం, చిత్రకం, పంచాంగుళం, మండం, వర్ధమానం

జమ్మి – శమి, సక్తుఫల, శివ

చిన్నజమ్మి – శమీరం

దేవదారువు – దారువు, భద్రదారువు, ద్రుకిలిమం, పీతదారువు, పూతికాష్ఠం, శక్రపాదపం, పారిభద్రకం

కరక – కాయస్థ, పూతన, హరీతకి, హైమవతి, రేచకి, శ్రేయసి

వేప –నింబం, సర్వతోభద్రం, పిచుమందం, మాలకం

అశోకం – వంజుళం

జిల్లేడు – అర్కం, వసుకం, గణరూపం, వికీరణం

ఉత్తరేణి – అపామార్గం. శైఖరికం, మయూరకం, ప్రత్యక్‌పర్ణి, కీశవల్లి, కిణిహి, కరమంజరి

గురువింద – కాకచించి, గుంజ, కృష్ణల

పల్లేరు – పలంకష, ఇక్షుగంధ, శ్వదంష్ట్ర, స్వాదుకంటకం, గోకంటకం, గోక్షురకం, వనశృంగాటం

జెముడు (Cactus) – సింహుండం, వజ్రద్రుమం, స్నుహి, సమంతదుగ్ధ, గుడ

వాము – అజామోద, ఉగ్రగంధ, బ్రహ్మదర్భ, యవానిక

ప్రత్తి – తుండికేరి, సముద్రాంత, కార్పాసి, బదర

గఱిక – దూర్వ, శతపర్విక

వెదురు – వంశం, త్వక్సారం, త్వచిసారం, కర్మారం, తృణధ్వజం, శతపర్వం (శతపర్వన్), యవఫలం, వేణువు, మస్కరం, తేజనం

ఱెల్లుకసవు – కాశం, ఇక్షుగంధం, పోటగళం

దర్భ – కుశం, కుథం, పవిత్రం

దూలగొండి/ తీటకసింద – యాసం, యవాసం, దుఃస్పర్శం, ధన్వయాసం, కునాశకం, రోదని, కచ్ఛుర

౪. నీళ్ళు

నీరు – ఆపస్ (ఆపో), వార్, వారి, ఉదం, ఉదకం, కీలాలం, అంభస్ (అంభో), అర్ణస్ (అర్ణో), పాథస్ (పాథో)

తడి – తేమం, స్తేమం,

తడిసినది – స్తిమితం, క్లిన్నం, స్విన్నం

అల (కెఱటం) – తరంగం, ఊర్మి, వీచి

నీటిచుక్కలు – పృషత్ లు, బిందువులు,

తుంపరలు – విప్రుషాలు

చెఱువు – తటాకం, పద్మాకరం

ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డ పెద్ద మడుగు – జలాశయం, పుష్కరిణి, హ్రదం, సరస్, (సరో), కాసారం, సరసి

నుయ్యి – కూపం, ఉదపానం, అంధువు, ప్రహి

నడబావి (దిగుడుబావి) – వాపి

గుంట – గర్తం, అవటం

రంధ్రం – కుహరం, వివరం, బిలం, ఛిద్రం, నిర్వ్యథనం, రోకం, శ్వభ్రం, సుషి, సుషిర

నది – సింధువు, సరిత్, సరిత, తరంగిణి, వాహిని, శైవలిని, తటిని, హ్రాదిని, ధుని, స్రోతస్విని, స్రవంతి, నిమ్నగ, ఆపగ, కూలంకష, నిర్ఝరిణి, సరస్వతి

కాలువ – కుల్య

తూము (తూపరాణ) – జలనిర్గమం

నీటిని తోడే యంత్రం – నేమి, త్రిక

సముద్రం – అబ్ధి. అంభోనిధి, అకూపారం, పారావారం, ఉదన్వంతం, ఉదధి, జలధి, సింధువు, సరస్వంతం, అపాంపతి, కంధి, నదనదీపతి, రత్నాకరం

సుడిగుండం – ఆవర్తం

పెనుకెఱటాలు – ఉల్లోలాలు, కల్లోలాలు

దీవి (నెడిమ) – ద్వీపం, అంతరీపం

నదులూ, సముద్రాలూ ప్రవహించే దారి – పరీవాహం, పరీవాహకం

పులినం – ఇసుకదిబ్బ

బుఱద – నిషద్వరం, జంబాలం, పంకం, శాదం, కర్దమం

ఒడ్డు – తీరం, ప్రతీరం, కూలం, రోధస్ (రోధో), తటం

ఇసుక – సికత, వాలుక

ప్రవాహం – స్రోతస్ (స్రోతో)

వఱద – జలపూరం

నుఱుగు – ఫేనం, డిండీరం

పడవ – ఉడుపం, ప్లవం, కోలం

ఓడ – నౌ (నావ), తరణి, తరి, యానపాత్రం, పోతం

దోనె (పుట్టి) – ద్రోణి

౫. అగ్నీ, వాయువూ, ఆకాశమూ, మబ్బులూ, దిక్కులూ, గ్రహాలూ

ఆకాశం – ద్యావ (ద్యో), దివి, అభ్రం, వ్యోమం, అంబరం, నభస్ (నభో), అంతరిక్షం, గగనం, ఖం, వియత్, విహాయస్ (విహాయో), తారాపథం

దిక్కు – దిక్ (దిశ), కకుప్ (కకుభం), ఆశ, కాష్ఠ, హరిత్

తూర్పు – ప్రాచి (ప్రాక్) [తూర్పున పుట్టినది – ప్రాచీనం, లేదా ప్రాచ్యం]

పడమర – ప్రతీచి (ప్రత్యక్) [పడమట పుట్టినది – ప్రతీచీనం, లేదా ప్రతీచ్యం]

దక్షిణం – అవాచి (అవాక్), యామ్య [దక్షిణాన పుట్టినది అవాచీనం, లేదా అవాచ్యం]

ఉత్తరం – ఉదీచి (ఉదక్), [ఉత్తరాన పుట్టినది ఉదీచీనం, లేదా ఉదీచ్యం]

మూలదిక్కు – అపదిశం, విదిక్కు

పైన – ఉపరి

కింద – అధో

పక్కన – పార్శ్వం

అడ్డం – తిరశ్చీనం

నిలువు – ఊర్ధ్వం

సూర్యుడు – సూరుడు, అర్యముడు, ఆదిత్యుడు, దివాకరుడు, భాస్కరుడు, అహస్కరుడు, బ్రధ్నుడు, భానువు, విభావసువు.

చంద్రుడు – చంద్రమస్ (చంద్రమా), ఇందువు, విధువు, జైవాతృకుడు, సోముడు, గ్లావ, కళానిధి, రాజు.

బృహస్పతి – గురుడు, ధిషణుడు, వాచస్పతి

శుక్రుడు – కవి, కావ్యుడు, ఉశనసుడు (ఉశనస్), భార్గవుడు

అంగారకుడు – కుజుడు, భౌముడు, లోహితాంగుడు

బుధుడు – సౌమ్యుడు. రౌహిణేయుడు

శని – సౌరి, మందుడు, శనైశ్చరుడు

రాహువు – తముడు (తమస్), స్వర్భానువు, సైంహికేయుడు, విధుంతుదుడు

కేతువు – ధ్వజుడు, శిఖి

అగ్ని – వైశ్వానరుడు, వహ్ని, వీతిహోత్రుడు, ధనంజయుడు, జ్వలనుడు, కృశానువు, పావకుడు, అనలుడు, హవ్యవాహనుడు, దమునసుడు (దమునస్), శిఖి, బర్హి (బర్హిష్)

సముద్రంలో ఉండే బడబానలం – ఔర్వం

అగ్నిజ్వాల (మంట) – కీల, అర్చి (అర్చిస్), హేతి, శిఖ

అగ్నికణం – స్ఫులింగం

బూడిద – భస్మం, భూతి, భసితం

అడవులలో చెలరేగే దావాగ్ని – దవం, దవాగ్ని

వాయువు (గాలి) – శ్వసనం, స్పర్శనం, మాతరిశ్వం (మాతరిశ్వన్), పృషదశ్వం, సమీరం, సమీరణం, మారుతం, మరుత్, వాతం, పవనం, పవమానం, ప్రభంజనం

. కాలవాచకాలూ, ఋతువులూ

కాలం – సమయం, దిష్టం, అనేహం (అనేహస్/ అనేహో)

నెలలో ౩౦ వ భాగం – తిథి

పగలూ, రాత్రీ కలిసిన 24 గంటల మొత్తం సేపు – అహోరాత్రం

పగలు – దినం, దివసం, అహం (అహన్), ఘస్రం, వాసరం

ప్రొద్దు – ప్రభాతం, ప్రత్యూషం, ప్రత్యుషం (ప్రత్యుషస్ – ప్రత్యుషో), అహర్ముఖం, కల్యం, ఉషస్సు (ఉషస్ –ఉషో)

సాయంకాలం – దినాంతం, సంధ్య, పితృప్రసువు (-ప్రసూ)

మధ్యాహ్నం – ప్రాహ్ణం, అపరాహ్ణం

ఉదయ, మధ్యాహ్న, సాయంకాలాలూ కలిపి – త్రిసంధ్యం

రాత్రి – శర్వరి, నిశ, నిశీథిని, నిట్టు (నిట్/నిశ్), త్రియామ, క్షణద, క్షప, విభావరి, తమస్విని, రజని, యామిని, తమి

కటికచీకటి గల రాత్రి – తమిస్ర

వెన్నెలరాత్రి – జ్యౌత్స్ని

వెన్నెల – జ్యోత్స్న, కౌముది, చంద్రిక

చీకటి – అంధకారం, ధ్వాంతం, తిమిరం, తమం (తమస్/ తమో)

కటికచీకటి – అంధతమసం, సంతమసం

కాస్త తక్కువ చీకటి – అవతమసం

రాత్రి మొదలయ్యే వేళ – ప్రదోషం, రజనీముఖం twilight

అర్ధరాత్రి (నడిరేయి) – నిశీథం

పూర్ణిమ – పౌర్ణమాసి, రాక

అమావాస్య – దర్శం, కుహువ (కుహూ)

గ్రహణం – ఉపరాగం

ఏడాది – వత్సరం, సంవత్సరం, శరత్తు (శరత్), సమా, హాయనం, అబ్దం, వర్షం

వేసవికాలం – గ్రీష్మం, ఊష్మకం, ఊష్మాగమం, నిదాఘం, ఉష్ణోపగమం, తపం (తపస్/ తపో)

వసంతఋతువు – సురభి

ఎండ – ఆతపం, ద్యోతం

ఎండమావి – మృగతృష్ణ, మరీచిక

వేడి – ఉష్ణం, ఊష్మం

వెలుగు – ప్రభ, రుచి, త్విషం, భాసం, ఛవి, ద్యుతి, దీప్తి, రోచి (రోచిష్), శోచి (శోచిష్)

కిరణం – ఉస్రం, మయూఖం, అంశువు, గభస్తి, ఘృణి, ఘృష్టి, భానువు, కరం, మరీచి, దీధితి, అర్చి (అర్చిష్), తేజం (తేజస్), ధామ (ధామన్), మహం (మహస్), విభ

వాన – వర్షం

వానకారు – ప్రావృట్టు (ప్రావృట్/ప్రావృష్), ప్రావృషం

వానకాలానికి సంబంధించినది – ప్రావృషేణ్యం

మబ్బు – అభ్రం, మేఘం, వారివాహం, స్తనయిత్నువు, వలాహకం, ధారాధరం, జలధరం, తటిత్వంతం, వారిదం, జలదం, ఘనం, జీమూతం, ముదిరం, జలముచం

మబ్బుల పుంజం – కాదంబిని, మేఘమాల

ఉఱుము – స్తనితం, గర్జితం

మెఱుపు – శంప, శతహ్రద, హ్రాదిని, ఐరావతి, క్షణప్రభ, తటిత్, సౌదామిని, విద్యుత్, చంచల, చపల

పిడుగు – స్ఫూర్జథువు, వజ్రనిర్ఘోషం

మబ్బుల్లోని వెలుగు – మేఘజ్యోతి, ఇరమ్మదం

అనావృష్టి – అవగ్రహం

అతివృష్టి – ధారాసంపాతం, ఆసారం

వానచినుకు – శీకరం

వడగల్లు – వర్షోపలం, కరకం

చలికాలం – శీతకాలం, హేమంతం

మంచు – అవశ్యాయం, నీహారం, తుషారం, తుహినం, హిమం, ప్రాలేయం, మిహిక

మంచుతునకల ప్రవాహం – హిమాని Glacier

చల్లనిది – శీతం, శీతలం

౭. రంగులు

తెలుపు – ధవళం, శుక్లం, శ్వేతం, పాండురం, పాండువు, అవదాతం, సితం, వళక్షం, అర్జునం

నలుపు – కృష్ణం, అసితం, కాళం, శ్యామలం, మేచకం

పసుప్పచ్చ – పీతం, హారిద్రం, హరిద్రాభం

ఆకుపచ్చ – పాలాశం, హరితం, హరిత్

దట్టమైన ఎఱుపు – లోహితం, రోహితం, రక్తం

ఎఱ్ఱకలువవంటి ఎఱుపు – శోణం

గులాబీవర్ణం – పాటలం

మొక్కజొన్నపీచువంటి రంగు – కడారం, కపిల, పింగం, పిశంగం, కద్రువు, పింగళం

బ్రౌన్ కలరు – శ్యావం, కపిశం

బూడిదరంగు – ధూమవర్ణం

౮. జంతువులూ, పక్షులూ, క్రిమికీటకాలూ

జీవి – ప్రాణి, శరీరి, సత్త్వం, చేతనం, జన్మి, జంతువు, జన్యువు,

అడవిజంతువు – శ్వాపదం, వన్యసత్త్వం

జంతువు పిల్ల – శాబకం

తోక – పుచ్ఛం, వాలం, వాలధి, లాంగూలం, లూమం (లూమన్)

కొమ్ము – శృంగం

గిట్ట – శఫం, ఖురం, రింఖ

పొదుగు – ఊధం (ఊధస్), ఆపీనం

కోర – దంష్ట్ర

ఏనుగు – గజం, దంతి, దంతావళం, హస్తి, ద్విరదం, అనేకపం, ద్విపం, సింధురం, సామజం, కుంభి, మాతంగం, మదావళం, నాగం, కుంజరం, వారణం, కరి (కరిన్), ఇభం, స్తంబేరమం, పద్మి

ఆడ ఏనుగు – కరిణి, ధేనుక, వశ

ఏనుగుల మంద – యూథం

ఏనుగుపిల్ల – కలభం

సింహం – పంచాస్యం, హర్యక్షం, కేసరి, హరి, కణ్ఠీరవం

పులి – శార్దూలం, ద్వీపి, వ్యాఘ్రం

సివంగి – తరక్షువు, మృగాదనం

అడవిపంది – ఘృష్టి, కోలం, పోత్రి, కిరి, కిటి, ఘోణి, భూదారం

కోతి – కపి, ప్లవంగం, ప్లవగం, శాఖామృగం, వలీముఖం, మర్కటం, వానరం, కీశం, వనౌకం (వనౌకస్)

ఎలుగుబంటి – ఋక్షం, అచ్ఛం, భల్లం, భల్లూకం, భాలుకం

ఖడ్గమృగం – గండకం, ఖడ్గం

నక్క – భూరిమాయువు, గోమాయువు, సృగాలం, క్రోష్టువు, ఫేరువు, ఫేరవం, జంబుకం

ఆడనక్క – శివ

ఏదుపంది – శ్వావిధం (శ్వావిత్), శల్యం

తోడేలు – వృకం, వాతప్రమి, కోకం, ఈహామృగం

లేడి (జింక) – మృగం, కురంగం, వాతాయువు, హరిణం, ఏణం

కుందేలు (చెవులపిల్లి) – శశం, శశకం

జలజంతువులు – యాదస్సు (యాదస్/యాదో)

చేప – పృథురోమం (పృథురోమన్), మత్స్యం, ఝషం, మీనం, వైసారిణం, విసారం, శకులి

చేపపిల్ల – గడకం,

Shark – పాఠీనం

Whale – తిమింగలం

మొసలి – మకరం, శింశుమారం, గ్రాహం, నక్రం, కుంభీరం

ఎండ్రకాయ – కుళీరం, కర్కటకం (కర్కాటకం)

తాబేలు – కూర్మం, కమఠం, కచ్ఛపం

ఆడతాబేలు – ఢులి

ఏనుగుజలగ – దుర్నామ, దీర్ఘకోశిక

జలగ – జలౌకం (జలౌకస్/ జలౌకో)

నీటి ఉడుము – నిహాక, గోధిక

ఎఱ్ఱ (వానపాము) – మహీలత, గండూపదం, కించులకం

కప్ప – మండూకం, భేకం, వర్షాభువు, శాలూరం, ప్లవం, దర్దురం

ముత్యపు చిప్ప – ముక్తాస్ఫోటం, శుక్తి

శంఖం – కంబువు,

పెంపుడుజంతువు/ పక్షి – ఛేకం, గృహ్యకం

కుక్క – శునకం, శ్వానం (శ్వా/శ్వన్) , సారమేయం, కుర్కురం, జాగిలం,

ఊరకుక్క – గ్రామసింహం

పిచ్చికుక్క – అలర్కం

వేటకుక్క – విశ్వకద్రువు

పిల్లి – బిడాలం, ఓతువు, మార్జాలం, పృషదంశకం

ఎలుక – మూషకం (మూషికం), ఆఖువు, ఉందురువు

చిట్టెలుక – గిరిక

చుంచెలుక – చుచుందరి, గంధమూషి

ఆవు – ధేనువు, గోవు (గో), సౌరభేయి, మాహ, మాహేయి, ఉస్ర, శృంగిణి, అర్జుని, అఘ్న, రోహిణి

దూడ – వత్సం

ఎద్దు – ఉక్షం (ఉక్షన్), భద్రం, బలీవర్దం, ఋషభం, వృషభం, వృషం, అనడుహం (అనడ్వాన్), సౌరభేయం, గవం (గౌ)

ఆలమంద – గవ్యం

ఎద్దుల మంద – రౌక్షకం

అప్పుడే పుట్టిన దూడ – తర్ణకం

ఊళ్ళో యథేచ్ఛగా తిరిగే ఆబోతు – షండం, ఇట్చరం

గంగడోలు – సాస్న

మూపురం – కకుత్

పేడ – గోమయం, గోవిట్టు

కరీషం – పిడక

బండి/ నాగలి మొ||వాటిని మోసే ఎద్దు – ధూర్వహం, ధుర్యం, ధౌరేయం, ధురీణం, ధురంధరం

గేదె (బఱ్ఱె/ ఎనుము) – మహిషం, లులాయం, వాహద్విషంతం, కాసరం, సైరిభం

గుఱ్ఱం – అశ్వం, ఘోటకం, వీతి, తురగం, తురంగం, తురంగమం, వాజి (వాజిన్), వాహం, అర్వం (అర్వన్), గంధర్వం, హయం, సైంధవం, సప్తి

ఆడగుఱ్ఱం (గోడిగ) – వామి, అశ్వ, బడబ

ఆడమేక – అజ, ఛాగి

మేకపోతు – మేషం, తుభం, ఛాగం, బస్తం, ఛగలకం, అజం

గొఱ్ఱె – మేండం, ఉరభ్రం, ఉరణం, ఊర్ణాయువు, వృష్ణి, ఏడకం

గాడిద – చక్రీవంతం, బాలేయం, రాసభం, గర్దభం, ఖరం

ఒంటె (లొట్టిపిట్ట) – ఉష్ట్రం, క్రమేళకం, మయం, మహాంగం

ఒంటెపిల్ల – కరభం

తొండ – సరటం, కృకలాసం

బల్లి – ముసలి, గృహగోధిక

పక్షి – ఖగం, విహంగం, విహంగమం, విహాయసం, శకుంతి, శకుంతం, శకుని, శకునం, ద్విజం, పతత్రి (పతత్రిన్), పత్రి (పత్రిన్), పతగం, పతంగం, పత్రరథం, అండజం, నగౌకం (నగౌకస్), వాజి (వాజిన్), వికిరం, వి, విష్కిరం, నీడోద్భవం, పిత్సంతం, నభసంగమం

ఱెక్క – పక్షం, వాజం, గరుత్తు (గరుత్), ఛదం, పత్రం, పతత్రం, తనూరుహం

ఱెక్క మొదలు – పక్షతి

పక్షిముక్కు – చంచువు, త్రోటి

గ్రుడ్డు – పేశీ, కోశం, అండం

పక్షిపిల్ల – పోతం, పాకం, అర్భకం, డింభం, పృథుకం

పక్షిగూడు – నీడం, కులాయం

డేగ – శశాదనం, పత్రి (పత్రిన్), శ్యేనం

గుడ్లగూబ – ఉలూకం, కాకారి, పేచకం, దివాంధం, కౌశికం, ఘూకం, దివాభీతం, నిశాటనం

పిచ్చుక – చటకం, కలవింకం

కొక్కెర – కృకణం, క్రకరం

తెల్లకొక్కెర – బలాక, బిసకంఠిక

కోయిల – కోకిల, వనప్రియం, పరభృతం, పికం

వానకోయిల – చాతకం, స్తోకకం, సారంగమ్

బెగ్గురు పులుగు – దార్వాఘాటం, శతపత్రకం

కాకి – కాకం, కరటం, అరిష్టం, బలిపుష్టం, ధ్వాంక్షం, వాయసం, మౌకళి

మాలకాకి – ద్రోణకాకం, కాకోలం

గ్రద్ద – దాక్షాయ్యం, గృధ్రం

చిలుక – కీరం, శుకం

పాలపిట్ట – చాషం, కికీదివి

కొంగ – క్రుంచం (క్రుఙ్), క్రౌంచం

చక్రవాకం – కోకం

హంస – కలహంస, కలహంసం, కాదంబం, మరాళం, శ్వేతగరుత్తు (త్), మానసౌకం (స్)

గబ్బిలం – జతుక, అజినపత్ర, పరోష్ణి

నెమలి – మయూరం, బర్హిణం, నీలకంఠం, శిఖి, శిఖావళం, కేకి

నెమలిపురి – శిఖండం

నెమలి ఈక – పింఛం, బర్హం

కోడి – కుక్కుటం, కృకవాకువు, తామ్రచూడం, చరణాయుధం

పావురం – పారావతం

కృమి – చాలా చిన్నదైన పురుగు

కీటకం – కొంచెం పెద్దదైన పురుగు

ఈగ – మక్షిక

దోమ – మశకం

తేనెటీగ – సరఘ

అడవి ఈగ – దంశం

కందిరీగ – గండోలి, వరట

చిమట – భృంగారి, చీరి, చీరుక, ఝిల్లిక

మిడత – శలభం

తుమ్మెద – మధువ్రతం, మధుకరం, మధులిహం, పుష్పలిహం, మధుపాళి, ద్విరేఫం, భృంగం, షట్పదం, భ్రమరం, అళి, ఇందిందిరం, చంచరీకం, రోలంబం, బంభరం

మిణుగురుపురుగు – ఖద్యోతం, జ్యోతిరింగణం

పాము – సర్పం, ఫణి (ఫణిన్), పృదాకువు, భుజగం, భుజంగం, భుజంగమం, అహి, అశీవిషం, విషధరం, వ్యాళం, కాకోదరం, ఫణి, దర్వీకరం, దందశూకం, బిలేశయం, ఉరగం, పన్నగం, భోగి, జిహ్మగం, పవనాశనం, పవనాశి, లేలిహానం, ద్విరసనం, కుంభీనసం

కొండచిలువ – అజగరం, తిలిప్సం, గోనసం

పాముపడగ – ఫణ, స్ఫట

పాము కుబుసం – కంచుకం, నిర్మోకం

పామువిషం – క్ష్వేళం, గరళం

పుట్ట – వల్మీకం, వామలూరువు, నాకువు

చీమ – పిపీలికం, హీర

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, నవంబర్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , , , , .

One Comment

  1. సర్, కొత్తగా చిన్న చిన్న కవితలు రాయాలని తపించే మాలాంటి ప్రారంభకులకు రాయడానికి సరైన పదాల కోసం ఒకొక్కప్పుడు సంస్కృత పదాలు వెతుక్కోవ్వాల్సి వస్తున్న శ్రమను ఎంతగానో తగ్గించిన మీకృషి శ్లాఘనీయం.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.