cover

ఒప్పుకోలు

Download PDF ePub MOBI

(గౌతమ్ పిడూరి ఆంగ్ల కథ “కన్ఫెషన్”కు రాధ మండువ తెలుగు అనువాదం)

మొగడీష్ వెళ్ళే విమానంలో కూర్చుని ఉన్నాము నేనూ, జేమీ. విమాన ప్రయాణం నాకు పడదు. పైగా పేపర్లో విమానాల ప్రమాదాల గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే భయం కూడా. కిటికీ, తెరలు మూసేసి ఒక కునుకు తీస్తే ఇవన్నీ మర్చిపోవచ్చు కాని మా వాడు నన్ను కిటికీ ముయ్యనివ్వకుండా దాన్లోంచి బయటకు చూస్తూ ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నాడు.

విసుగుని అణుచుకుంటూ హారర్ సినిమాలో రక్త రాక్షసిని చూస్తున్న పాత్రకి మల్లే భయాన్ని ఉగ్గపట్టుకుని కూర్చున్నాను. కాసేపయ్యాక మా వాడిని మరిపించానని అనుకుంటూ కిటికీ మూశాను.

“డాడీ! కిటికీ పైకెత్తు”

“జేమీ, కదలకుండా కూర్చోరా!”

“కిటికీ షట్టర్ పైకెత్తు డాడీ”

“అహ! కిటికీలు తెరవకూడదు”

“మరి అదిగో ఆ ముందు సీట్లో కూర్చున్నాయన తీశాడుగా?”

“అంటే ఆయన విమానంలో రూల్స్ పాటించడం లేదన్నమాట”

“సరే అయితే ఆ ఏర్ హోస్టెస్ కి కంప్లయింట్ చేస్తా ఉండు” అన్నాడు జేమీ గుసగుసగా నా మీదకి వంగి.

‘ఓరి భగవంతుడా! కిటికీ తెరవక తప్పేట్లు లేదే’ అనుకుంటుండగా తటాలున నాకు ఒక ఆలోచన వచ్చింది. ‘ఆఁ వీడిని మరిపించడానికి ఇదే మార్గం’ అనుకుంటూ “రేయ్! జేమీ! ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్రికాలో మనం చేయకూడని పని ఒకటుంది నీకు తెలుసా?” అన్నాను వాడి కళ్ళల్లోకి చూస్తూ.

“ఏమిటది?” అన్నాడు కుతూహలంగా.

“అది ఒక మంత్రం. దాన్ని ఆఫ్రికాలో ఎవ్వరూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు” అన్నాను.

“ఏం మంత్రం?”

“డబుల్ బబుల్ టాయిల్ అండ్ ట్రబుల్ ఫైర్ బర్న్ అండ్ కాల్ డ్రన్ బబుల్”

“దీన్ని ఆఫ్రికాలో అంటే ఏమవుతుంది?”

“దీన్ని గనక అక్కడ అన్నావంటే…” నేను వాడినే చూస్తూ గొంతు తగ్గించి కళ్ళు పెద్దవి చేసి చెప్పాను “ఎవరో ఒకరి ప్రాణం పోతుంది. అందుకని ఇక్కడే ఈ విమానంలో ఎన్ని సార్లైనా అనుకో… కాని ఒకసారి అక్కడ దిగాక ఇక అనకూడదు”

మంత్రం పారింది. హఠాత్తుగా జేమీ ముఖంలో మార్పు వచ్చింది. ఇక తర్వాత ప్రయాణంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. బహుశా తనకి మంత్రం వలన కొత్తగా ప్రాప్తించిన శక్తి గురించి ఆలోచిస్తున్నాడేమో!

షేక్సిపియర్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

 * * *

సిడ్నీలో ఉన్న మా సొంత ఇంటికన్నా కాంగోలో మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇల్లు బాగా పెద్దది. ఇంటి చుట్టూ రకరకాల వృక్షాలతో కూడిన విశాలమైన తోట కూడా ఉంది. వాడి జీవితంలో ఇన్ని చెట్లు ఎప్పుడూ చూడలేదు. జేమీ దాన్ని చూసి ఇష్టపడ్డాడు. అక్కడ ఓక్ చెట్టుకి కట్టి ఉన్న ట్రీ హౌస్ ని చూసి పొంగిపోయాడు.

“నీ బిజినెస్ ట్రిప్ హాలిడే కన్నా బాగుంది డాడీ” అని ఆనందంగా చెప్పాడు.

మా వంటవాడు ఓగేవా, అతని కుక్క మచ్చూ తో కలిసి ఊరంతా తిరిగాడు.

ఓగేవా పిల్లలకి కబుర్లు చెప్పడంలో, వాళ్ళని రంజింప చేయడంలో మహా ఘటికుడు. జేమీకి ఆఫ్రికా గురించి ఉన్న సందేహాలన్నింటినీ ఓగేవా తీర్చేశాడు. మచ్చూ కూడా చాలా మంచి కుక్క. మా వాడికి ఇట్టే మాలిమి అయిపోయింది. ముగ్గురూ హాయిగా కలిసిపోవడంతో జేమీని ఇంట్లో వదిలి ఆఫీసుకి వెళ్ళడంలో నాకు ఏ సమస్యా లేకుండా పోయింది.

tappuఆరోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చేప్పటికి ఓగేవా తోటలో ఓ మూల గుంట తీస్తున్నాడు. అతని ముఖం దిగులుగా, అలసటగా ఉంది. నేను జీపు నుంచి కిందకి దూకి “ఓగేవా! ఏం చేస్తున్నావు?” అన్నాను.

“యస్ సర్. మచ్చూ చనిపోయింది సార్” అన్నాడు దుఃఖం నిండిన గొంతుకతో.

నేను “జీసస్” అని ప్రార్థన చేస్తూ అతని దగ్గరకి నడిచాను. అతని పక్కనే పడుకుని ఉన్న మచ్చూని చూస్తూ “సారీ” అన్నాను బాధగా.

ఓగేవా చిన్నగా నవ్వి “చాలా ముసలిదైపోయింది. ఆయుష్షు తీరి ప్రశాంతంగా వెళ్ళిపోయింది లెండి” అన్నాడు.

జేమీ ఎక్కడున్నాడోనన్నట్లుగా ఇంటి వైపుకి నడిచాను.

“డాడీ!” నన్ను వాకిట్లో చూస్తూనే ఏడుస్తూ వచ్చి వాటేసుకున్నాడు. వాడి జుట్టంతా రేగిపోయి ఉంది. కళ్ళు లోతుకు పీక్కుపోయి ఉన్నాయి. బుగ్గల నిండా కన్నీటి చారికలు. డొక్కలు వెక్కెక్కి పడుతున్నాయి.

“ఊరుకో! ఊరుకో! ముసలిదైపోయి చనిపోయిందిలే” అన్నాను ప్రేమగా వాడి తల నిమురుతూ.

“కాదు డాడీ ముసలిదై చనిపోలేదు” వెక్కుతూ “నేను మంత్రం చెప్పడం వల్ల చనిపోయింది” అన్నాడు.

“మంత్రమా” అన్నాను ఆశ్చర్యంగా – అంటూండగానే విమానంలో నేను వాడికి చెప్పిన సంగతి గుర్తొచ్చింది. విస్మయంతో వాడి వంక చూశాను.

“కుక్కతో ఆడుకుంటూ తమాషాగా ఆ మంత్రం చెప్పాను డాడీ! కావాలని చెప్పలేదు” జేమీ హృదయ విదారకంగా ఏడుస్తూ “నేను తప్పు చేశాను డాడీ!” అన్నాడు.

విమానంలో కాసేపు కళ్ళు మూసుకొని ఉండో లేక మరోటో చెప్పి మరిపించకుండా మంత్రం తంత్రం అంటూ నేను కథలల్లడం వల్ల ఇప్పుడు వాడెంత వేదనకి గురయ్యాడో తల్చుకుంటే నా మీద నాకు అసహ్యం కలిగింది.

“నేనూ తప్పు చేశాను జేమీ!” అన్నాను నిట్టూరుస్తూ.

*

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 
Posted in 2014, అనువాదం, నవంబర్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.