cover

పద్మప్రాభృతకమ్ (7)

Download PDF EPUB MOBI

దీని ముందుభాగం

భోః సర్వథా నానాకుసుమసమవాయగంధహృతహృదయోऽయం దుష్కరం ఖలు కరోమి ఏనామతిక్రామన్ | (పరిక్రమ్య) ఇదమపరం పరిహాసపత్తనముపస్థితమ్ | ఏష హి మృదంగవాసులకో నామ పురాణనాటకవిటః “భావజరద్గవః” ఇతి గణికాజనోపపాదితద్వితీయనామధేయః సుకుమారగాయకస్య ఆర్యనాగదత్తస్యోదవసితాన్నిర్గచ్ఛతి | సుష్ఠు తావదనేన నీలీకర్మస్నానానులేపనపరిస్పందేన జరాకౌపీనప్రచ్ఛాదనమనుష్ఠితమ్ | సర్వసఖశ్చైష ధాన్త్రః | న శక్యమిమం అనభిభాష్యాతిక్రమితుమ్ | పరిహాసిష్యామ్యేనమ్ (నిర్దిశ్య)

భావజరద్గవ, అపి సుభిక్షమనయా జరసా | కిమాహ భవాన్ – “ఏషా భవతో నిర్వేదాత్ జరద్భుజంగ ఇవ జరత్వచముత్సృజామి” ఇతి | ప్రాణైః స పశ్యామః | పునర్యువేవ భావః | సిద్ధం హి తే మాయయా యౌవనకర్మ | తవ హి –

అంతటా వివిధములైన కుసుమాలసుగంధాలతో ఆవరింపబడిన హృదయుడనై ఇక్కడ నుండి కదులలేకున్నాను. (ముందుకు నడచి) మరొక పరిహాసాస్పదమైన పరిస్థితి ఎదురైనది.

ఈతడు మృదంగవాసులకుడు. అది వరకు నాటకాలలో విటుడు. వేశ్యల ద్వారా ‘భావజరద్గవము’ అనిపించుకున్నవాడు. ఆర్యనాగదత్తుడనే గాయకుని ఇంటి నుంచి బయలుదేరినాడు.ఈయన లేపనస్నానములు చేసి, చందనాలేపనాదులు చేసికొని, తన కౌపీనంతో ముసలితనాన్ని గోప్యము చేసి ఉన్నాడు. ఈతడు ఈతనికి చాలామంది స్నేహితులు. ఈతనిని పలుకరించకుండా వెళ్ళటం కుదరదు. ఈతడిని కాస్త వేళాకోళం చేస్తాను.

(పురాణనాటకవిటుడు - సాభిప్రాయంగా చెప్పుట ఎందుకంటే, అదివరకు నాటకాల్లో విటుడు, ఇప్పుడు వృద్ధుడై కేవలం విటుడుగా మిగిలాడని ధ్వని. జరద్గవమంటే ముసలి ఎద్దు. భావజరద్గవము గొప్పభావములచేత పరిపుష్టమైన వాడని అర్థము. గౌరవార్థకమా, వ్యంగ్యమా అని తెలియదు.ధాన్త్రః’ అనే శబ్దం ప్రాచీనమైనదిగా కనబడుతున్నది. అమరంలో ఈ శబ్దం కనబడటం లేదు. బహుశా వ్యంగ్యమైన పిలుపు అయి ఉంటుంది. లేదా ‘Dude’ అన్న అర్థంలోని మాట అయి ఉండవచ్చు.)

(సైగ చేసి)

భావజరద్గవా, మీ ముసలితనము కుశలమా? ఏమంటిరి – “మీ నిర్దేశము వలన ముసలిపాము (కుబుసము విడుచుట) వలె ముసలితనమనే చర్మాన్ని విడచుచున్నాను” అనియా.

(భుజంగమంటే పాము అని ఒక అర్థం, విటుడని మరొక అర్థం. అందుచేత ఇక్కడ అర్థ శ్లేష).

మీ ప్రాణాలను పణంగాపెట్టి యౌవనాన్ని సాధిస్తున్నారన్నమాట. యువకులయిపోయినట్టే. మీకే –

రాగోత్పాదితయౌవనప్రతినిధిచ్ఛన్నవ్యలీకం శిరః

సందంశాపచితోత్తరోష్ఠపలితం నిర్ముండగండం ముఖమ్ |

యత్నేనారచితామృజగుణబలేఆనేన చాంగస్య తే

లేపేనేవ పురాణజర్జరగృహస్యాయోజితం యౌవనమ్ |

కిం బ్రవీషి – “మదనీయం ఖలు పురాణమధు” ఇతి | మనోరథ ఏష భావస్య | సర్వథా త్రిఫలగోక్షురలోహచూర్ణసమృద్ధిరస్తు భవతః | సాధయామ్యహమ్ | (పరిక్రమ్య)

రాగోత్పాదితయౌవనప్రతినిధిః = రంగు పులుముట వలన కలిగిన యౌవనమునకు ప్రతినిధి వలె,ఛన్నవ్యలీకం శిరః = జుట్టు (ఆచ్ఛాదితమైన) కప్పబడిన తల,సందంశాపచిత = పట్టకారుచేత పట్టుకొన్నది వలె,ఉత్తరోష్టపలితం = పైపెదవి పైని నెరసిన,నిర్ముండగండం = మొక్కుకై యున్నట్టి రోమములను కలిగిన,ముఖం = వదనము,

యత్నేన ఆరచిత = ప్రయత్నము చేత చేయబడిన,అంగస్య లేపేన = మైపూతలతో, ఆమృజాగుణ బలేన = మరమ్మత్తు శక్తిచేత, ఇవ తే = వలే నీ యొక్క, నీ,పురాణజర్జర గృహస్య = పాతబడిన ఇంటికి,ఆయోజితం = కొని తేబడిన,యౌవనమ్ = యౌవనము (ఉన్నది)

తాత్పర్యము: ఓయీ, నీ శిరమున రంగు పూయుటవలన నకిలీ యౌవనమునకు ప్రతినిధి వలె నున్నది. మీసములు గడ్దములు, నెరసి, మ్రొక్కుబడికై యున్నట్టున్నవి. మైపూతలచేత మరమ్మత్తు చేసిన శిథిలమైన పాత ఇంటికి కొనితెచ్చిన నూతనత్వము వలె నీ యవ్వనమున్నది.

విశేషములు: శార్దూలవృత్తము (మ స జ స త త గ). ఆమృజా - నూనె పూత వలన. ఆమృజా గుణ బలము - ఖండస్ఫుటితసంస్కారమని మరొక పేరు.

ఏమంటున్నారు – “పాతబడిన మధువుకు కైపెక్కువ” అనియా. పండితుల (మీ యొక్క) మనోరథమిది కాబోలు. ఎల్లప్పుడూ మీకు త్రిఫల గోక్షుర లోహచూర్ణ సమృద్ధి కలుగుగాక. నేనిక అతిక్రమింతును.

(ముందుకు నడచి)

(త్రిఫలగోక్షురలోహచూర్ణము = వాజీకరణము. కామసంధాయకౌషధము)

అయే, అయమిదానీం సహసోపస్థితే మయి ద్యూతసభాలిందతః శిలాస్థంభేనమాత్మానమావృత్య స్థితః | (విలోక్య) భవతు | విజ్ఞాతమ్ | శైషిలకోऽయమ్ | కిం ను ఖల్వస్యాస్మాద్దర్శనపరిహారేణ ప్రయోజనమ్ | కిం మాలతికాదూతిస్వయంగ్రహావినయ ఆత్మశంకాముత్పాదయతి | భవతు | పరిహాసప్లవనైనమవగాహిష్యే |

భో ద్విజకుమారక కిమిదమాత్మప్రచ్ఛాదనేన సుహృత్సమాగమః ఛత్రేణ చంద్రాతప ఇవ ప్రతిషిధ్యతే | ఏష నిఃసృత్య ప్రహసితః | కిం బ్రవీషి – “స్వాగతం సుహృత్కర్ణధారాయ” ఇతి | భద్ర కుతో మే సుహృత్కర్ణధారతా యోऽహం తస్మాద్ ద్వంద్వరతిప్రణయసాహసాత్ బహిష్కృతః | కిం బ్రవీషి – “నైతదస్తి” ఇతి | అపి సురతోంఛవృత్తే, మా మైవమ్ | ప్రకాశం ఖల్వేతత్ యథా శైషిలకస్య గృహే శాక్యభిక్షుకీ ప్రతివసతీతి | సా కిల త్వయి ఉత్పన్న కామయా మాలాకారదారికయా మాలతికయా త్వత్సకాశం దౌత్యేనానుప్రేషితా | తస్యాశ్చ త్వయా నిరుపస్కృతభద్రకం రూపయౌవనలావణ్యమామిషభూతముద్దిశ్య తదాత్వమేవావక్షితమ్, నాయాతికమ్ |

అరే, అతడిక్కడ నన్ను చూడగానే జూదగృహావరణలో శిలస్థంభం వెనక దాక్కున ఉన్నాడు. (చూచి) కానిమ్ము. తెలిసినది. ఇతడు శైషిలకుడు. నన్ను చూచి దాక్కునే అవసరం ఏమిటి? మాలతికా అనే దూతిని బలవంతంగా చేపట్టుట అనే విషయంపై శంకను కలిగిస్తున్నాడు. కానిమ్ము. పరిహాసగీతముతో అతనిని పలుకరిస్తాను.

(స్వయంగ్రహము - భాగస్వామిని అంగీకారం లేకుండా పట్టుకొనుట.

సముత్క్షిపన్ యః పృథివీభృతాం వరం వరప్రదానస్య చకార శూలినః |

త్రసత్తుషారాద్రి సుతాససంభ్రమ స్వయంగ్రహాసుఖేన నిష్క్రయమ్ || (శిశుపాలవధమ్ - - ౫౦)

- రావణుడు కైలాసపర్వతమునకు పోయి దానిని పెళ్ళగించి ఈశ్వరుడిచ్చిన వరదానమునకు ప్రతిగా ఆయనకు పార్వతీకంఠగ్రహణము’ కలిగించెను. పార్వతి భయంతో శివుని అనుమతి లేకయే శివుని మెడ కౌగిలించుకుంది అని అర్థం. స్వయంగ్రహము - ప్రియప్రార్థనాం వినా కంఠగ్రహణం అని మల్లినాథసూరి వ్యాఖ్య.)

ఓ ద్విజకుమార, ఏల నీ మిత్రుని చూడగానే గొడుగుతో చంద్రుని నీడనడ్డుకున్నట్టు పనికిరాని పని చేస్తున్నావు? ఇప్పుడు బయటపడి నవ్వుతున్నావు? ఏమంటావు – “మిత్రుల చెవికింపైన వానికి స్వాగత”మనియా.

(సుహృత్కర్ణధారుడు = మిత్రుల చెవికింపైన వాడు. మిత్రుల పనులను చేసిపెట్టి సంతోషపర్చేవాడు)

భద్రుడా, నీ ఇద్దరు పడతుల ప్రణయసాహసాలను దాచిపెట్టిన తర్వాత నాకు ఇంకెక్కడి చెవికింపు? “అదేమీ లేదు” అంటావా? కామాన్ని అడుక్కునే వాడా, నాకు అలా చెప్పకు. శైషిలకుని ఇంట బౌద్ధభిక్షుకి ఉంటోందని అందరికీ తెలుసు. కామభావంతో మాలిని, మాలతికను దూతగా నీ వద్దకు పంపించింది. ఆ దూత సాధారణరూపాన్ని (అలంకారాదులు లేని సహజరూపం) యౌవనాన్ని, లావణ్యమయమైన శరీరాన్ని చూచి లలూచీపడి ఆమెపై కన్ను వేశావు. భవిష్యత్తులో దొరకగలదానికోసం ఆగలేకపోయావు.

కిం బ్రవీషి – ’సఖే యత్సత్యమనాగతసుఖాశయా ప్రత్యుపస్థితసుఖత్యాగో న పురుషార్థః | న దీపేనాగ్నిమార్గణం క్రియతే” ఇతి | భోః సుష్ఠు కృతమ్ | వంచితం ఖలు రహస్యం యదీదం న విస్తరతో బ్రూయాః| విస్తరత ఇదానీం శ్రోతవ్యమ్ | కిమాహ భవాన్ -”క ఇదానీమవినయప్రపంచమాత్మనః ప్రకాశయతి | కిన్తు సమాసతః శ్రూయతామ్ | తయా హి ప్రసభమాక్రాన్తయాऽభిహితోऽహమ్ -

సంపాతేనాతిభూమిం ప్రతరసి శఠ హే మాన్యాః ఖలు వయం

దౌత్యేనాభ్యాగతాయాః చపల న సదృశం యత్తే వ్యవసితమ్ |

కృచ్ఛాద్ రుద్ధాऽస్మి జాతా పరగృహవసతిం సంప్రాప్య విజనే

మా మైవం హా ప్రసీద ప్రియ విసృజ పురా కశ్చిత్ ప్రవిశతి ||

(సురతోంఛవృత్తే - అంటే కామాన్ని అడుక్కునే వాడు. ఉంఛవృత్తి అంటే భిక్షుకవృత్తి. కేవలం రాలిపడిన ధాన్యాలను, చెట్టు విదల్చిన పళ్ళను ఏరుకుని తినేవాడని గౌరవార్థం)

ఏమంటున్నావు – “మిత్రమా, భవిష్యత్తు లో దొరికే సుఖం కోసం, ఎదురుగనున్న సుఖాన్ని త్యాగం చేయటం పురుషార్థం కాదు. దీపంతో అగ్నిని వెతకరు” అనియా? ఓ, బాగా చేశావు. నువ్విలా వివరాలు చెప్పకపోయి ఉంటే రహస్యం తెలిసేది కాదు. ఈ కథ విశదంగా తెలుసుకోదగింది. ఏమంటావు – “ఎవ్వడూ తన ప్రలోభాలకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడు. కానీ నీకై కాస్త చెబుతాను. తనతో ధాటిగా మాట్లాడ్డం విని ఆమె నాతో ఇలా సమాధానం చెప్పింది.

(రేపటికోసం నేటిని త్యాగం చేయడం వ్యర్థం అన్న విషయానికి సంస్కృతంలో రెండు పాత సూత్రాలున్నాయి.

వరం సాంశయికాత్ నిష్కాత్ అసాంశయికః కార్షాపణః - సందేహంతో వచ్చే నిష్కం కన్నా నిస్సందేహంగా దొరికే కార్షాపణం మేలు. నిష్కం - బంగారు నాణెం. కార్షాపణం - వెండి నాణెం.,వరమద్య కపోతః శ్వో మయూరాత్ - రేపటి నెమలికన్న నేటి పావురం మేలు)

హే శఠ = ఓ ధూర్తుడా, సంపాతేన అతిభూమిం = విశ్వాసము చూరగొని, ప్రతరసి = మోసగిస్తున్నావు. వయం = మేము,మాన్యాః ఖలు = గౌరవింపదగినవారము కదా! చపల = చపలుడా, దౌత్యేన = దూతకారణమున, అభ్యాగతాయాః = వచ్చినదానిపై, సదృశం యత్ తే = ఇయ్యది, న వ్యవసితం = చేయరానిది, పరగృహ వసతిం = అన్యుల గృహమును, విజనే = ఒంటరితనమున, సంప్రాప్య = చేరి, కృచ్ఛాత్ = బాధ చేత, రుద్ధా జాతా అస్మి = ఆపబడిన దానను అయితిని, మామైవం = నన్నిలా చేయకుము హా, ప్రసీద = కరుణచూపుము, ప్రియ = ప్రియుడా, పురా = ముందు, విసృజ = వదలుము, కశ్చిత్ = ఎవరో, ప్రవిశతి = ప్రవేశించుచున్నారు.

తాత్పర్యము: నాపై విశ్వాసము జూపించి ఇప్పుడు మోసగించుచున్నావు. నేను గౌరవనీయురాలను కదా. దూతికగా వచ్చినదానిపై ఇయ్యది తగదు. అన్యగృహమునేకాంతమున జొచ్చిన దాన. నాపై కరుణజూపుము. వదలు..ఎవరో వచ్చుచున్నారు.

ఇతి | సాధు భో అమృదంగో నాటకాంకః సంవృత్తః | అనేన సురతసంధిచ్ఛేదేన స్థిరీకృతో వాసిస్ఠీపుత్రేన విటశబ్దః | వయస్య సుభగో భవ | సాధయామ్యహమ్ | (పరిక్రమ్య) హన్త భోః సురతసర్వాతిథిసన్నివేశం వేశమనుప్రాప్తాః | యోऽయమ్ -

కామావేశః కైతవస్యోపదేశో

మాయాకోశో వంచనాసన్నివేశః |

నిర్ద్రవ్యాణామప్రసిద్ధప్రవేశో

రమ్యక్లేశః సుప్రవేశోऽస్తు వేశః ||

(పరిక్రమ్య) క ఏష మలినప్రావారావగుణ్ఠితశరీరః సంకుచితసర్వాంగో వేశ్యాంగణాత్ ద్రుతతరమభినిష్కామతి | అయే సంభ్రమాద్ భ్రష్టం కాషాయాన్తముపలక్ష్యే |

విశేషములు: సంపాతేన అతిభూమిం - విశ్వాసమను భూమిపై దూరమునకు వచ్చి - ఇది నాటి కాలపు సామెతలా కనబడుతుంది.

- అనియా? బాగు, మృదంగం లేకనే నాటకాంకము ముగిసింది.

సురతసంధి జరగడాన్ని ఆపి వాశిష్టీపుత్రుని విటశబ్దానికి సరైన అర్థం కల్పించావు. సరే భాగ్యవంతువు కమ్ము మిత్రమా. నేనిక ఏగుచున్నాను. (ముందుకు నడిచి) హా, శృంగారాభిలాషుల నగరవేషము (నగర వేశ్యావాటిక) వచ్చింది. ఈ వేషము -

కామావేశః = మదనునికి ఆటపట్టు, కైతవస్య ఉపదేశః = జూదములకు నెలవుపట్టు, మాయాకోశః = మాయల భండారము, వంచనసన్నివేశః = మోసాలదృశ్యము. నిర్ద్రవ్యాణాం = దరిద్రులకు, అప్రసిద్ధవేశీ = నెలవు కానిది, రమ్యక్లేశః = అందమైన వేదన గలది, వేశః = ఈ వాటిక, సుప్రవేశః = మంచి ప్రవేశము గలది, అస్తు = అగుగాక!

తాత్పర్యము: మదనినికాటపట్టు, తగవుల నెలవుపట్టు, మాయల పెట్టె, వంచనలకు దృశ్యభూతము, ధనహీనులకు చొరరానిది, అందమైన వేదన కలది అగిన ఈ వాటికలో మంచి ప్రవేశము జరుగుగాక.

విశేషము: శాలినీవృత్తము. శాలిన్యుక్తా మ్తౌ త గౌ గోభ్దిలోకైః అని శాలినీ వృత్తసూత్రము. అందమైన శకారాంత్యానుప్రాస. ఎనిమిది శకారాలు ఉపయోగించాడు. మృచ్ఛకటికంలో ఏషా, నాణకమోషికామకశికా, మచ్ఛాశికా, లాశికా..” అన్న ప్రాకృతపద్యంలో ఇలాంటి శకారావృత్తిని రచించాడు శూద్రకమహాకవి.

(ముందుకు నడచి) ముదురు ఎరుపు రంగు చీవరముతో శరీరాన్ని కప్పుకుని, శరీరభాగాలను ముడుచుకుని, తత్తరతో వేశ్యాంగన ఇంటినుంచి వస్తున్నదెవరు?

(తరువాయిభాగం వచ్చేవారం)

Download PDF EPUB MOBI

 

Posted in 2014, నవంబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.