cover

ఇల్లు దీర్తం

Download PDF EPUB MOBI

‘ఉప్పోడు పులిశా పప్పోడు పులిశా తమలపాకులోడు తనకు తానే పులిశా అని ఆ ఎగవింటి కమలక్క మాట్లడే మాటలకు ఏమన్నా అర్తం పర్తం వుందా అంట. సేతినించి ఆణాదుడ్లు ఎగస్ట్రాగా కర్సయి పోయిందని అంత వొగిసే ఆడది తగుదునమ్మా అని ఇరుగింటి పొరుగింట్లోళ్లను అంత బలమంతంగా ఎందుకు బయల్దేరదియ్యల్ల’ అని మా యమ్మ వాళ్లతో వీళ్లతో అని గాకుండా ఇంట్లో అందురి సెవుల్లో బడేటట్లుగా గెట్టింగా మాట్లాడ్తా ఇంట్లో కొచ్చింది.

మా నాయనుండాడే ఊరికే ఉండే పాపానికి ఉపద్రబెట్టుకొనేటోడు. ‘ఇంగా తెల్లాంగా తెల్లారనే లేదు. ఏందో యవ్వారమెత్తుకోనొచ్చినావే పనీపాటా లేదా నీకు’ అని గెద్దించినాడు.

‘అవును నన్ను సిమ్మాసనం మింద కూసోబెట్టి గదా నువ్వు సాకతా వుండావు. పనీ పాట ఏముంటాది? అందుకే యవ్వారాల్లో మునిగి తేలతా వుండా’ అని సేతిలోవున్ని పొరకాడ ఇసిరి కొట్టి నడుంమింద సెయ్యేసుకోని నిలబడిరది.

‘సరే! ఆ కడుపులో వుండేదేదో కక్కేయ్‌. సాటుపోటు పొటుకు మాటలేల’ అన్న్యాడు కొంచిం శాంతంగానే మానాయిన.

‘ఏం లేదు. దిగవ తిరప్తిలో అన్నం వుడికించి అందురి ఎదాన గొట్టడానికి ఆంజి బొయ్యి దుడ్లిచ్చి కట్టిలు తీసుకోనొచ్చినాడంట. అది ఆయమ్మేడుపు. అదే యేడిస్తే బంగారాన్నే బోగొట్టు కున్న్యోళ్లం మనమెట్లా యాడవాలా’ అని వొగిసింది మాయమ్మ.

‘మనం బిల్చుకోని పొమ్మన్న్యామా’ అని ఒక మాటిసిరేసి కాడిమాను బుజానబెట్టుకొని బాయికాడికి పూడ్సినాడు మా నాయన.

* * *

మాది కొంచిం సేద్దెం పెద్దదే. అందుకని మా యమ్మకు తెల్లార్తో నిలుకూ నిబందం ల్యాకుండా వుంటాది పని. దానికి తోడు మేము పిలకాయిలు ఐదుమందిమీ ఇస్కూలుకు బోతామా? మాయక్కకూ, నాకూ క్యారీర్లు గట్టాల్నా. మాసిన్న తమ్ముడికి సెల్లికీ మూతీ ముడ్డీ కడగాల్నా. కళ్లాపి సల్లుకోని, ముక్కర్రేసుకోని, సట్టీకుండా కడుక్కోని, పేండా సెత్తాతోసి పోసుకోని, గొడ్డూ గోదకూ, మనసులకీ ఇరవై ముప్పై కడవల దాకా నీళ్లు సేంది పోసుకోని – ఇంత పనీ వొంటిసేతిమింద సేసుకోని బాయికాడికి సెద్దెత్తుకోని పోవాల. మాయమ్మ నీల్లు సేందిపోస్తే అప్పుడప్పుడూ మా యక్కా నేనూ పెళ్లోకి దెచ్చిపోస్తాములే. మాయవ్వుందిగాని సెనిక్కాయిలొల్చేది, అనపకాయిలొల్చేది ఇట్టాంటి పనులు కూసోని సేసేవేమన్నా వుంటే సేస్తాది. ‘కొబ్బిరన్నము, పొంగిలన్నమూ నువ్వు అమ్మకంటే బాగా జేస్తావవ్వా’ అంటే క్యారేజీకి అవి సేసిస్తాది ఎప్పుడైనా.

మా యవ్వకు బిడ్లులేరు. అందుకే వాళ్లన్న కొడుకైన మా నాయన్ని దెచ్చుకోని సాకి సంతరించి పెండ్లి జేసి ఇంత కుటుంబరాన్ని జేసింది. పనెక్కువగా వున్న్యప్పుడు మాయమ్మ మా తల్లకు సమురు బూసి సెక్కదూబాని సేతికిచ్చి జల్లేసుకోని రమ్మని పొన్నెక్కింటికి పంపిస్తాంది.

ఒక దినం రొండుజల్లేస్తానని ఎనక పాపిట తీసిన పొన్నెక్క ‘ఏంది పాపా నీకు పేను గొరిగేసిందే. అదీ పాపిట్లో’ అని వులిక్కిపడే మాటనేసింది. ‘అంటే ఏందని’ అడిగితే నా ఏలుబుట్టుకోని తడిమించి సూపించింది. పైసలు లేనప్పుడు కొల్నా, అర్థణా, అణాలే సెలామనిలో వుండేవి. దొండికాల్నా అంత ఎడల్పుగా ఎంటికనేది ల్యాకుండా నున్నంగా తగలతావుంది సేతికి. అట్లే జల్లేసి పంపించేసింది పొన్నెక్క. పిలకాయిలంతా ఒకటే ఏడిపించడం. మానం బొయినట్లయి పోయింది నాకు. మా యవ్వకు జెప్తే ‘అదేం జెస్తాదిలే! ఆమిదం పూస్తావుంటే మళ్లీ మొలస్తాయి ఎంటికిలు’ అని పెద్దగా పట్టించుకోలా.

గుర్రం కల్నా మాదిరున్ని అది సూస్తా వుండంగానే నాలుగు దినాలకంతా రూపాయి బిళ్లంతయిపోయింది. దినాము మాయమ్మ దెగ్గిర యాడస్తావుండాను. ఇదేం బొగిసాట్ల సేటని మాయమ్మ తిరప్తి కొండ మింద గుండు గొట్టిస్తానని మొక్కుకొనింది. మాయవ్వ ఎవురో సెప్పినారని యాప సమురు పూస్తా వొచ్చింది. ఇప్పుడక్కడ ఎంటికిలు వొత్తుగా మొల్సిందిలే.

ఒక దినం ఎగవింటోళ్ల కమలమ్మ వొచ్చిందా మాయింటికి. మా యమ్మ పేరు గూడా కమలే గదా! ‘పాపా, కమలా వొచ్చే శనివారం మేము ఇల్లు దీర్తం బోతావుండాము. మా యిండ్లకాడ అందుర్దీ కలిపి దుడ్డు శానానే వుండాది. అందుకే వొచ్చేవోళ్లెవరన్నా వుంటే కొండకు పిల్సుకోని పోదామనుండాము. రండి పాపా, పొయ్యొద్దాం’ అనింది.

‘పన్లకాలం యాడవతాదిమా. మడి సేడబెడ్తా వుండారు. ఆగ్గొట్టే పనుండాది. గుళ్లు గోపురాలు దిరిగి పుణ్యస్తానాలు సేసే అదురుష్టమా నాది’ అని వాపోయింది.

ఆ రాత్రి అన్నాలు దినేటప్పుడు కమలక్క పిలుపుల్ని గురించి మా నాయిన సెవుల్లో ఏసింది. ‘మన పాపకు మొక్కు బడుండాది గదా! వోళ్లతో పంపిస్తే సరి. మొక్కు దీరిపోతాది. దేవుని దెగ్గిర అప్పు పెట్టుకోకూడదు. అప్పుండే కొద్దీ దేముడు పరీచ్చలు బెడ్తానే వుంటాడు’ అన్న్యాడు మానాయిన.

వోళ్లతో నేను పోనే పోనని యేడ్సినాను. ‘సిట్టి, ఇశాలాచ్చి, మాలిని, బూశమ్మ అందురూ వుంటారు గదా! నీకేం బయం’ అని మాయమ్మ నన్నెంతగానో వొప్పించాలని సూసింది.

‘ఆట్లాడు కొనేటప్పుడే వాళ్లు. ఇప్పుడు వాళ్లమ్మోళ్లు, నాయినోళ్లు వుంటారు. నేను బోనేబోన’ని యేడ్సినాను. అందుకని మా నాయిన మాయవ్వను యెలబార దీసినాడు.

కమలమ్మవ్వోళ్లు, పొన్నెక్కోళ్లు, సిలగుంటపల్లి లచ్చుమక్కోళ్లు, కుంటాదమ్మోళ్లు, శీను రెడ్డోళ్లు, నర్సింగాడోళ్లు ఇన్ని కుటుంబరాలు వాళ్లవి. అన్నిటికీ మొదులొకటే. అందుకే అందురూ కల్సి తీర్సాల్సిన మొక్కు. ఎన్నాల్లనుంచో వుండీలో దుడ్లేస్తా వొచ్చినారు. వొడ్డికాసులు శానానే జమసేరినాయి. ఆ దుడ్లను మామూలుగా అయితే పోవడానికయ్యే కర్సు పెట్టుకోని మిగిలింది వుండీలో ఎయ్యాల. అందుకే ఆ దుడ్లతో శార్జీలు బెట్టుకోని ఎవుర్నన్నా కొండకు బిల్సుకోని పోతే పున్నెమే గాని పాపం రాదు. వొచ్చేటప్పుడు మాత్రం ఆ దుడ్లు వాడుకోకూడదు.

శుక్రారమే నలుగురితో నారాయణా అని మాయమ్మ గుడా ఇల్లలికి పిండిముగ్గులు బోసి ఎరమన్ను గూడా పూసేసింది. మా నాయిన సిత్తూరికి బోయి మంచి పూలమాలొకటి కట్టుకోనొచ్చినాడు. శనివారం నేను, మాయవ్వ ఒక్కపొద్దుండినాము. బయలు దేరేముందు నట్టింట్లో పోలు బోసి నామాలు పెట్టి తలిగిలేసి గోయిందాలు బెట్టినాక మా యవ్వ నేను ఆ తలిగిల్ని దీసుకోని ఒక్క పొద్దిడిసినాము.

మా యమ్మ పులసన్నం, పెరుగన్నం రొండు దినాలకు సరిపడా మూటలు గట్టించింది. పొయ్యేటప్పుడు నట్టింట్లో మళ్లీ గోయిందాలు బెట్టినాక పూలమాల నామెళ్లో ఏసినారు. రచ్చదెగ్గిర పూజజేసి టెంకాయిలు గొట్టినాక తిరప్తికి బయలుదేరినాము. మాయమ్మ నాయన మాయక్క అందురూ రోడ్డుదంకా వొచ్చినారు. ఆణ్ణించి మూడు ఎద్దల బండ్లలో సిత్తూరికి బయలుదేరినాము. ఆన్నించి తిరప్తికి బస్సులో బోతాము. కన్పించేంత దూరం మాయమ్మ ‘బద్రం నాయనా!’ అని కళ్ల నీళ్లు బెట్టుకుంటా జాగ్రత్తలు సెప్తానే వుంది. బిడ్ని దెగ్గిరుండి తీసుకోనిపోక వూరోళ్లతో పంపిస్తావుండామే అనే బాదమాయమ్మకు. ఎరగెడ్లపూల పావడ గట్టుకోని మాయక్కవి పులిగోరు కమ్మలు బెట్టుకోని అందురి పిలకాయిల్తో కలిసి తిరప్తి బస్సెక్కతా వుంటే నాకు మాత్రం శానా కుశాలగా వుంది.

పామ్మెలికిలు మాదిరిగా వుండే రోడ్లో కొండమిందికి బస్సుబోతావుంటే కడుపుల్లో తిప్పినట్లయ్యి శానామంది వాంతులు సేసుకున్న్యాము.

irlachengiకొండమిందికి పోంగానే బోడిగుండ్లు గొట్టించుకోని కోనేట్లో మునిగి ఎంకటేస్వర స్వామిని దర్శించుకొన్న్యాము. ఆరాత్రి ఆన్నే సద్దిగూడు మూటలిప్పుకోని తిని గుడిముందర్నే పండుకొన్న్యాము. కొండమింద కోతుల్ని సూస్తావుంటే ఎంతసేపైనా అట్లే సూద్దామా అన్పించింది. తెల్లార్తానే సామాన్లు మోసుకోని పాపనాశనానికి నడ్సిపోతావుంటే ‘ఈడే దేవుడు కన్పిస్తా వుండాడ’నింది మాయవ్వ. ఎంతెదికినా నాకు మాత్రం కన్పించలేదని యాడస్తా వుంటే అందురూ పడి పడీ నవ్వినారు.

పాపనాశినిం నుంచొచ్చి దిగవ తిరప్తి సత్రంలో దిగినాము. దర్మసత్రమది. దుడ్లు గట్టే పన్లేదు. సామాన్లాడే పెట్టేసి దేవుని దర్శనానికి బయలు దేరినాము. గోయిందరాజుల గుళ్లో సామి బల్ల తలకింద బెట్టుకోని పడుకోనుండాడు. ‘దేవుడే లెక్కాచారం జేసి అప్పుదీరస్తా వుండాడు. ఆ దేమునికి మనం అప్పు బడితే మర్యాదగా వుంటాడా’ అనింది మాయవ్వ.

గుడిముందర అంగిళ్లలో యాడజూసినా బొరుగులు, శనిగిలు, మిఠాయిలు, బొమ్మలు సూస్తావుంటే కండ్లు తిప్పుకోను గాలా తాటాకు బుట్టిల్లో పెట్టి అమ్మతా వుండిన సెక్కతో జేసిన వంట సామాన్లు తీసుకుందామని మాయవ్వ నడిగినాను. ‘వాటికిచ్చే దుడ్లు బెట్టుకొని కడుపుకు తినేమే’ అని మాయవ్వ ఎంతో సెప్పిసూసింది. అందురూ ముందుకు బోతావుంటే ఆ బుట్టి కొనిస్తేనే వొస్తానని మొరాయించినాను. మాయవ్వ నా ఈప్మింద ఒక యేటేసి ఈడ్సుకోని వాళ్లెనక పరిగెత్తింది. నేను మూతి సొట్ట జేసుకోని రాగం దీస్తానే వుండాను.

‘ఎందుకమా పాపట్లా యాడస్తావుంది’ అడిగింది సంపూర్ణక్క. ఆ యమ్మ కమలమ్మవ్వ కోడలు.

‘తాటాకు బుట్టిల్లో బెట్టి అమ్మతావుండే బొమ్మలు గావాలంట’.

‘ఎంతంటా’.

‘నాలుగణాలు సెప్తా వుండాడు. మూడు కిస్తాడంట’

‘మరి తీసియ గూడదా’

‘నువ్వు సెప్పేది బాగుండాదమ్మా

అదేమి ఉప్పుకు పనికొస్తాదా. పప్పుకు పనికొస్తాదా సంపూర్ణా. ఒక టీలు గలాసు కొనుక్కున్న్యా నాలుగు కాలాల పాటుంటాది’.

అదినేసి సిట్టెక్క, బూశమ్మా, మాలిని అందురూ ఆ బుట్టి కావాలని వాళ్లమ్మోళ్లను సతాయించ బట్నారు.

‘పెద్ద రావిడయిపోయిందే ఈ పిలకాయిల్తో’ అని కోపం బడిరది లచ్చుమక్క.

‘ఒరే అంజిలూ దీని కొకటి దీసియిరబ్బా’ అని దుడ్లిచ్చింది పొన్నెక్క కూతురికి తీసియమని.

‘దీని లంపటాన గూడా ఒకటి గొట్టు’ అనింది మాయవ్వ.

ఒకేసారి అయిదు బుట్లు తీసుకున్న్యందుకు రెండణాల లెక్కన ఇచ్చినాడు అంగిడోడు. ఈ రామాయణ మంతా అయ్యేసరికి సిత్తానూరికి బస్సు ఎలాబారతా వుందని బిరీగ్గా రండని వొచ్చినాడు లచ్చుమక్క మూడో కొడుకు సుబ్బారెడ్డి. లుచ్చమక్కంటే కమలమ్మవ్వకు తోడికోడల్లే. శానా పెద్దామే.

పొలోమని బొయ్యి అందురం బస్సెక్కినాము. సిత్తానూరులో గూడా కోనేరుండాది. దాంట్లో కూడా మునిగి ఒంటిమిందే గుడ్లార బెట్టుకున్న్యాము. పొద్దువాలింది. సల్లంగా గాలి దోల్తావుంది. సలికి వొణుకు బుట్టుకోనొచ్చింది. ఎందుకో సీకటి బడ్తావుంటే మాయిల్లు గుర్తొచ్చి ఏడుపొచ్చింది. క్యూలో బొయి నిలబడినామా. అంతే నా ఏడుపు, సలీ రొండూ సిత్తానూరు కోనేట్లో బొయి దాంకున్నట్లయింది.

మళ్లీ ఆడ గాజులు, పసుపు కుంకాలు, నల్లగాజు సెవ్వాకులు, సెక్క దుబాన్లు, ఈరుబాన్లు ఎవురిగ్గావాల్సినవి వాళ్లు తీసుకున్న్యారు.

తిరప్తికొచ్చినందుకు గుర్తుండాలని మా యవ్వ రాగి సెంబొకటి తీసుకునింది. ఆ రాత్రి కొంచిం లేటుగానే దిగవ తిరప్తి సత్రం జేరుకున్న్యాము. మిగిలిన సద్దన్నాలు దిని ఆడే నిద్ర జేసినాము.

లెక్కకు మూడోదినం. కపిల తీర్తం బొయ్యొచ్చి బస్సెక్కాల. ఆలోపల తిండి దినాల. తెచ్చిన సద్దన్నాలు కాలీ. సత్రంమద్దిలో వర్సగా పొయిలుండాయి. సంపూర్ణక్కోళ్లు వంట మొదులు బెట్న్యారు. జానెడంత కట్టిలు నాలుగేసి కట్టినివి ఎన్ని కట్టలు దెచ్చినా అంతమందికి అన్నం వుడకడమే గగనమైపోయింది. పప్పు పచ్చిమిరక్కాయిలు, మాయిడి కాయిలు ఏసి పులగూర కోసమని పొయిమింద బెట్న్యారు. కొంచిం వుడికిందో లేదో! కట్టిలైపొయినాయి. మొగోళ్లంతా యాడ బొయినారో. అంజన్నొక్కడుండాడు. మళ్లీ నాలుగ్గట్టలు కట్టిలు కొనుక్కోనొచ్చినాడు. అయినా పప్పుడకల్యా. నానుళ్ల పప్పు పడిపోయిందని ఒకరన్న్యారు. పప్పుడక్కనే పులుపు మాడికాయ లేసినందుకు వుడకలేదని కొందరన్న్యారు. ఎనపను పప్పుగుత్తిలేదు. సత్రంలోనే ఒక మూలుండే రోట్లో ఏసి రుబ్బుకోనొచ్చినారు. అన్నం తిన్నట్లే వుందిగానీ ఎవురికీ కడుపునిండల్యా.

కపిల తీర్తం సూసుకోని బస్సెక్కి పాకాల టేసన్లో దిగినాము. రైలెక్కబోతున్నందుకు సెప్పలేనంత కుశాలుగా వుంది మాకు. అసలింతొరకు రైలే సూల్లేదు గదా! నాలుగైదు గంటలు కాసుకుంటేగాని సిత్తూరుకు బొయ్యే రైలు రాలేదు.

పాకాల టేసన్లో మేమెన్నో ఆటలాడుకున్న్యాము. యానాదోళ్లు వంటలు సేసుకుంటావుంటే సూసినాము. వంకాయంత తలకాయున్నోడొకడు ఎవురోతిని వొదిలి పెట్టిన మునక్కాయతొక్కుల్ని నమిలిందే నమలతా వుండాడు. అది సూసి మేము నవ్వుకుంటావుంటే అప్పుడు కొట్టినారు బెల్లు.

యాడాడో తిరగతా వున్ని అందురూ పరిగెత్తుకోనొచ్చేసినారు. రైలొచ్చి నిలబడింది. ఎంత పెద్దరైలో సూసేంతదూరం. ఎవురి సామాన్లు వాల్లు మోసుకోని ఎక్కండి, పట్టండి. అనుకుంటా రైల్లో బాణ్ణ్యాము. కొందురికి సీట్లు దొరికినాయి. కొందురు కిందనే కూలబణ్ణ్యారు.

‘జగ్గు బుగ్గు కూఁ…’ అనుకుంటా రైలు పోతావుంది. అందురూ తిమితంగా కూసోని ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటావుండారా? అప్పుడర్సింది మాయవ్వ ‘అయ్యో! నాసేతిలో కాపేమైంది?’ అని.

ఎడమ సేతిలో వుండాల్సిన కాపులేదు. పడికట్ల కాపులవి. ఇగ్గి ఏసుకొనేవి. యాడన్నా జారిపోయిందనుకొనే దానికి లేదు. శానా గుత్తంగా వుండాయవి. నేను దిగులుగా కూసోనుండాను.

మాతాత సచ్చిపొయినప్పుడు మాయవ్వోలమ్మోళ్లు ఎండికాపులు దెచ్చినారంట. మాయవ్వ కండ్లనీళ్లు బెట్టుకుంటా యాడస్తా సెప్తావుంది. ‘మా కోదండానికి (మానాయిన) కోపమొచ్చింది. గెతిలే నోళ్లని తిట్టుకోని నాతాళిబొట్టు, మారెడ్డి వుంగరం మా పెద్ద పాపది అటుకుల సైను సెడగొట్టి ఇంగా సాలన్దానికి దుడ్లెగేసి పడికట్టు కాపులే బాగుంటాయని దెచ్చినాడు. బాయికాడికి బోతా తీసిపెట్టబోతే సచ్చేదాకా వాటిని తియ్యొద్దన్న్యాడు. ఇప్పుడు వాడికి నేనేమి సమాదానం జెప్పేది’.

ఇంట్లో కొచ్చినాక తిరప్తికి బొయ్యి మొక్కుబడి తీర్సుకోనొచ్చినామనే సంతోసం ఒకరిగ్గూడా లేదు. మా తమ్ముల్లు, సెల్లి మాత్రం అప్పుడప్పుడూ నా తలతడిమి సూసి సంతోసపడ్తావుండారు.

రాను రాను మాయవ్వ సేతిలో కాపు బోడ్రెడ్డి కొడుకు తాగబోతు ఎంకటేసే వాడెదాన ఏసుకున్న్యాడనినారు.

పాకాలలో నువ్‌ముందా నేనుముందా అని ఒకొర్నొకరు తోసుకొని రైలెక్కేటప్పుడు ఎంకటేసు మాయవ్వ సెయ్యిబట్టుకోని రైలెక్కించింది నిజమే అనింది మాయవ్వ.

అట్లాంటిది అంత నష్టం జేసుకున్ని మేమేడిస్తే అర్తముండాది. దిగవతిరప్తి సత్రంలో పప్పుడకలేదని రొండణాల కట్టిలు దెచ్చినాడు కొడుకని తెలిసి దాన్ని ఎవురూ వసూలు జేసియ్య లేదని మానం దీసి మాకులకు కట్టేస్తావుంటే ఏమనాల? అందుకే మాయమ్మకంత కోపం.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, ఇర్లచెంగి కథలు, నవంబర్, సీరియల్ and tagged , , , , , , .

4 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.